రాష్ట్రంలో ప్రతి రైతు తొలకరి వర్షాలు పండటంతోటే వ్యవసాయం సాగు పనులు ప్రారంభిస్తారు. ఇలా ఖరీఫ్‌, రబీ (యాసంగి) మరియు నీటి వసతి కల్గిన చోట వేసవి పంటలను కూడా వేస్తారు. ఇలా పండించినటువంటి పంటల కోతల అనంతరం మళ్ళీ ఖరీఫ్‌ పంటలు వేసుకోవడం ప్రారంభమై వర్షాలు మొదలయ్యే నాటికి భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. దీని ద్వారా కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు భూమిలో పెరిగి పురుగు మందుల అవశేషాలు కూడా భూమి లోపల ఉండిపోతాయి. ఈ కారణాల ద్వారా మనం (రైతన్న) వేసుకొనే వివిధ పంటలకు కావల్సిన లోతైన బీజపీఠం ఏర్పడదు, తద్వారా దిగుబడి తగ్గుతుంది.

వేసవి దుక్కుల ప్రాముఖ్యత: 

యాసంగి, వేసవి పంటలకు చేసేటటువంటి లోతు దుక్కులను వేసవి దుక్కులు అంటారు. ఎంత లోతుగా దుక్కి దున్నుకోవాలనేది మనం వేయబోయే పంటనుబట్టి కూడా ఉంటుంది. లోతు వేర్లు పంటలకైతే (కంది, ఆముదం, పత్తి మొ||) లోతుగా దున్నుకోవాలి. మొక్కజొన్న, జొన్న, వేరుశనగ మొదలగు పంటల వేర్లు మధ్యరకంగా లోతు ఉంటే 15-20 సెం.మీ. లోతు సరిపోతుంది. ముఖ్యంగా దున్నే విధానాన్ని, నేల స్వభావాన్ని బట్టి ఎంచుకోవాలి. లోతుగా నేలను తిరగబడేటట్టుగా దున్నాలనుకుంటే మోల్డుబోర్డు నాగలితో దున్నుకోవాలి. దుక్కిలో పశువుల ఎరువును భూమిలో కలిసేటట్లుగా మోల్డ్‌బోర్డ్‌ నాగలి ద్వారా చేసుకోవచ్చు. అలాగే డిస్క్‌లను వాడి కూడా గడ్డి, గరికను భూమిలో కలియదున్నవచ్చును. నేల లోపలి పొరలు గట్టిపడి మురుగు నీటి సౌకర్యం లేనపుడు, గాలి, నీటి శాతం తగ్గుతుంది. దీని ద్వారా మొక్కల వేర్లు పెరుగుదల పోషకాల లభ్యత, శ్వాసక్రియ (మొక్కలకు) లాంటి చర్యలు తగ్గి మొక్క చనిపోతుంది. లోతుగా దున్నినప్పుడు గట్టిపొర విచ్ఛిన్నమై నేల గుల్లగా తయారవడమే కాకుండా నేలలో గాలి శాతం మరియు నీటిని పీల్చుకునే లక్షణాలు పెరుగుతాయి. తద్వారా సూక్ష్మజీవుల సంతతి, చర్యలు పెరుగుతాయి. దీని వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు త్వరగా విచ్ఛిన్నమై పోషకాలుగా విడుదల అవుతాయి. మరియు కలుపు మొక్కల వేర్లు, పురుగు మందుల అవశేషాలు నేలలో ఉంటాయి. వీటిని లోతు దుక్కుల ద్వారా విష పదార్థాలు విచ్ఛిన్నమై పంటల దిగుబడి పెరుగుతుంది. మరియు వర్షపు నీరు లోపలి పొరలలోకి ఇంకి భూమి సారాన్ని పెంచుతుంది. వేసవి దుక్కి దున్నటం ద్వారా కలుపు మొక్కలన్నీ వేర్లతో పెకిలించి నేల లోపలి పొరల్లోకి చేరతాయి. దీని వలన సూర్యరశ్మి సోకి కలుపు మొక్కల విత్తనములు నిర్వీర్యం అవుతాయి. వేసవి దుక్కి దున్ని నేలను తిరగవేయడం వలన నేలలోని చీడపురుగు థలన్ని నేలపైకి రావడం వలన పకక్షులు వాటిని తిని చంపి వేస్తాయి. మరియు వేసవిలోని అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక చనిపోతాయి.


వేసవి దుక్కుల ద్వారా లాభాలు:

 నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. తద్వారా వివిధ పంటలకు కావలసిన లోతైన బీజ పీఠం ఏర్పడుతుంది. వేసవిలో దున్నే ముందు నేలలో పశువుల ఎరువుగాని, కంపోస్టుగాని మరియు చెరువులోని నల్లమట్టిని గాని వెదజల్లడం వలన నేల సారవంతమౌతుంది. దుక్కి (ఒండ్రుమట్టి) చేయడం కంటే ముందు పశువుల మందను గాని, గొఱ్ఱెలు లేదా మేకల మందను గాని ఉంచడం వల్ల వాటి ఎరువు నేలకు చేరి సేంద్రియ పదార్థం పెరిగి భూసారం పెరుగుతుంది. చెరువు మట్టిలో మనకు నత్రజని-0.3 శాతం, భాస్వరం – 0.2 శాతం మరియు పొటాష్‌-0.4 శాతం లభిస్తాయి. ఈ సారవంతమైన చెరువులోని ఒండ్రుమట్టిని పొలంలో వేసుకొని భూసారం పెంచుకోవచ్చు. వేసవిలో లోతు దుక్కులు చేయడం ద్వారా కలుపు మొక్కలు వాటి విత్తనాలు నశింపబడతాయి. మొండి జాతికి చెందిన తుంగ వంటి కలుపు మొక్కలు అన్ని రకాల నేలల్లో సమస్యాత్మకంగా మారుతున్నవి. ఇలాంటి కలుపు మొక్కల దుంపలు లోతు దుక్కులు చేయడం వలన సూర్యరశ్మికి బహిర్గతమై చనిపోతాయి.  మంచి నేలల్లో మట్టి రేణువులు 50 శాతం, నీరు 25 శాతం, గాలి 25 శాతం ఉంటుంది. ఇవి ఏ కారణం చేతనైనా నేల లోపలి పొరలు గట్టిపడి, మురుగునీరు పోవు మార్గం లేనపుడు గాలి మరియు నీటి శాతం మొక్కకు తగు మోతాదులో తగ్గుతుంది. దీని ద్వారా పంటల మొక్కల వేర్లు పెరుగుదల, పోషకాల లభ్యత తగ్గి, శ్వాసక్రియ లాంటి చర్యలు తగ్గుతాయి. వీటి ద్వారా పంట మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి వేసవి దుక్కులు చేయడం ద్వారా భూమిలోని గట్టి పొరలు విచ్ఛిన్నమై నేల గుల్లబారుతుంది. మరియు నేలలో గాలి శాతం, నీటిని పీల్చుకొనే లక్షణాలు పెరుగుతాయి. వీటి ద్వారా సూక్ష్మజీవుల సంతతి చర్యలు పెరుగుతాయి. కావున వేసవి దుక్కులు దున్నుకొని, నేల సారవంతత కాపాడుతూ అధిక దిగుబడులు పొందవచ్చు.        

ఎల్‌. శకుంతల, అగ్రానమి, ఎం.ఎస్సీ., 

ఈ. అజయ్‌ కుమార్‌, పి.హెచ్‌డి. స్కాలర్‌ (సాయిల్‌ సైన్స్‌), 

జె. కరుణాకర్‌ (ఎం.ఎస్సీ.) వెజిటబుల్‌ సైన్స్‌, 

కె. నవ్య, ఎం.ఎస్సీ (సాయిల్‌ సైన్స్‌), 

జె. కమలాకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (సాయిల్‌ సైన్స్‌),

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఫోన్‌: 9490998056