ఈ సంవత్సరం భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవ్వచ్చని శాస్త్రవేత్తల అంచనా. మన పొలంలో ఎప్పుడు ఎంత పడింది అనేది ఎక్కడికక్కడ గమనించాల్సిందే. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను జూన్‌4న, తెలంగాణాను జూన్‌ 7న మూడు నాలుగు రోజుల తేడాతో తాకవచ్చు. ఈ నేపథ్యంలో జూన్‌ నెల (రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు)లో చేయవలసిన వ్యవసాయ కార్యక్రమాలను గురించి తెలుసుకుందాం. 

పంటచేతికొచ్చే సమయానికి పండిన సరుకు, లాభానికి అమ్ముడు పోతుందనే నమ్మకమున్న పంటలను, రకాలను ఎంపిక చేసుకుని సాగు చేద్దాం.

టమాట: ఇప్పుడు టమాట చిల్లరగా వంద రూపాయల దాకా అమ్ముతున్నారు. నీళ్లున్న ఎక్కువ మంది రైతులు, టమాట సాగు వైపు మొగ్గు చూపే అకాశముంది. విస్తీర్ణం బాగా పెరిగితే పంట చేతికొచ్చేటయానికి (విత్తిన 90 రోజులకు లేక నాటిన 60 రోజులకు పంటచేతికి రావడం మొదలవుతుంది) ధరలు తగ్గే అవకాశముంది. వర్షానికి కూడా టమాట సాగు చేయడం పలు ప్రాంతాలలో అలవాటుంది. వర్షాధార పంట చేతికొచ్చే టయానికి టమాట ధర బాగా తగ్గే అవకాశముంది. విపరీత వర్షాలు, ముసురు, మేఘావృత వాతావరణం వలన ఏ ప్రాంతంలోనైనా పంట దెబ్బతింటే అప్పుడు టమాట రేట్లు పెరుగుతాయి. టమాట ధర జూన్‌ నెలలో కూడా ఎక్కువగానే ఉండే పరిస్థితి కనబడుతున్నది. జూలై 3వ వారం, ఆ తర్వాత వర్షాధార ఆకుకూరలు, కూరగాయలు మార్కెట్‌కు వచ్చినపుడు ఈ పంట ధర తగ్గే అవకాశముంది.

కొత్తిమీర: జూన్‌ మొదట్లో రుతుపవనాలు మొదలయ్యే వరకు వేడి వాతావరణమే ఉంటున్నందున, ధనియాలు మొలకెత్తి, పెరగడానికి పాక్షికంగా నీడ/ఎండ ఉండి, నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు కొత్తిమీర సాగుకు అనుకూలం. మొక్కజొన్నలో అంతర పంటగా పందిరి కూరగాయల పొలాల్లో, మామిడి, మునగ, కొబ్బరి మొదలగు తోట పంటల్లోని ఖాళీ జాగాల్లో, పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లు, షేడ్‌నెట్ల క్రింద, చెట్ల కొమ్మలతో ఏర్పాటు చేసిన పందిర్ల క్రింద, కొత్తిమీర సాగు చేసి జూన్‌లో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. జూన్‌లో కూడా చల్లగా ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో, తక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో (అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో) కొత్తిమీరను అనుకూలంగా పండించి, ఇతర ప్రాంతాలకు పంపవచ్చు. ఈ నెలలో అత్యధిక వర్షపాతమున్న ప్రాంతాల్లో జూన్‌లో విత్తినపుడు కొత్తిమీర దెబ్బతినే అవకాశముంది.

ఫ్రెంచిచిక్కుడు: ఈ పంటకూడా కొత్తిమీర లాగానే, అధిక ఎండను, వేడిని తట్టుకోలేదు. కనుక పాక్షిక ఎండ/నీడ ఉన్న ప్రదేశాలలో ఈ పంటను పండించి, అధిక ధరను పొందే వీలుంది.

ఆకుకూరలు: వర్షాధారంగా వచ్చే ఆకుకూరలు జూలై 3వ వారం నుండి ఎక్కువగా ఉంటాయి. ఆలోపు చేతికొచ్చే ఆకుకూరలకు ఎక్కువ ధర పొందవచ్చు. వీటిని ఎండలకు కూడా పండించవచ్చు. తక్కువ పొలంలో, తక్కువ నీటితో మంచి లాభాలు పొందవచ్చు. పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, పొన్నగంటి కూర, కొయ్యగూర, సోయకూర, గంగవాయిలాకు మొదలైనవి.

సిరిధాన్యాలతో పాలకూర, తోటకూర, పొన్నగంటికూర, కొయ్యగూర, గంగవాయిలాకు మొదలగు ఆకుకూరలను కలిపి వండుకోవచ్చు. తక్కువ క్యాలరీలు కలిగి, ఎక్కువ బల్క్‌ ఉన్న ఆహారం తయారవుతుంది. దీనిని తినే దాని వలన మధుమేహాన్ని సులభంగా కంట్రోల్‌లో ఉంచవచ్చు. ఆచరించిన అనుభవంతో తెలుపుతున్నాను. మధుమేహగ్రస్తులు అలవాటుపడితే ఆకుకూరలకు విపరీతమైన గిరాకీ ఏర్పడవచ్చు. ఖచ్చితంగా సుగర్‌ వ్యాధి అదుపులోకొస్తుంది. రైతులు పండించిన ఆకుకూరలకు మంచిధర రావడం జరుగుతుంది. అన్నికాలాల్లో దొరికే ఆకుకూరలు (ముఖ్యంగా చప్పగా ఉన్న ఆకుకూరలు) సిరిధాన్యాల బియ్యంతో కలిపి వండుకోవడం కూడా చాలా సులభం. మధుమేహాన్ని చాలావరకు ప్రపంచం నుండి తరిమికొట్టవచ్చు. మధుమేహపు మందులను మానేయవచ్చు. ఆచరించి చూడండి. వివరాలకు 94944 08619 కు ఫోన్‌ చేయవచ్చు.

సిరిధాన్యాలు: కొర్రలు, ఆరికలు, సామలు, ఊదలు, అండుకొర్రలు విత్తడానికి జూన్‌ నెల కూడా అనుకూలమే. వర్షాధారంగా, రసాయనిక ఎరువులు వాడకుండా పండించిన ఈ పంటలకు అత్యధిక ధర ఇచ్చి రైతుల వద్దకే వచ్చి కొనుక్కెళ్లే వాళ్లున్నారు. ఈ విధంగా పండిస్తున్నామని సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసుకునే అవకాశం బాగుంది. వాట్సాప్‌ ఖర్చు లేకుండా అందుబాటులో ఉంది.

కూరగాయలు: పలు కూరగాయ పంటలను జూన్‌ మొదటి నుండి విత్తుకోవచ్చు. భూమిలో తడిలేకపోతే నీరు పెట్టాల్సుంటుంది. వర్షం పుష్కలంగా పడితే, తేమ అనుకూలంగా ఉన్నపుడు విత్తుకోవచ్చు. కూరగాయల ఎగుమతులను విపరీతంగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బెండ: జూన్‌లో విత్తవచ్చు. విత్తిన 45 రోజుల్లో తొలి కోత మొదలుపెట్టవచ్చు. సులభంగా పంట తీసుకోవచ్చు. సొంత విత్తులను నాటితే ఖర్చు తక్కువ. అత్యధిక దిగుబడులనిచ్చే రకాలు, హైబ్రిడ్‌లు మార్కెట్లో దండిగా దొరుకుతున్నాయి. ఎక్స్పోర్ట్‌కు అనుకూలాలు మెండు. ఎగుమతికనువైన రకాలు: వర్ష, విశాల్‌, నాథ్‌శోభ, పంజాబ్‌ పద్మిని.

వంగ: వర్షాకాలంలో నారు పోయడానికి జూన్‌-జూలై నెలలు అనుకూలం. 30-35 రోజుల నారు నాటవచ్చు. ఏ ప్రాంతానికి అనువైన రకాలను ఆ ప్రాంతంలో సాగు చేసి, మంచి ధర పొందవచ్చు. దేశవాళీ రకాలను, సొంత విత్తనాలను, ఆర్గానిక్‌ పద్ధతి ద్వారా పెంచి, సోషల్‌ మాధ్యమం ద్వారా ప్రచారం చేసుకుంటే ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చు. ఖర్చు తక్కువ. తప్పుడు ప్రచారం చేసుకుంటే అది బెడిసికొట్టి ఆ మనిషికి విలువ లేకుండా చేస్తుంది.అనుకూలమైన రకాలు: కోస్తాఆంధ్ర: పూసాపర్పుల్‌ క్లస్టర్‌, పూసాక్రాంతి, గులాబి; రాయలసీమ: రాయదుర్గం, పోలూరు వంగ, అర్కకుసుమాకర్‌; తెలంగాణ: శ్యామల, దేశవాళీ పచ్చ వంగ రకాలు, పూసా పర్పుల్‌ క్లస్టర్‌, పూసాక్రాంతి.

గోరుచిక్కుడు: వర్షాధారంగా పండించే మొండిజాతి పంట. నీటిఎద్దడిని, చీడపీడలను చాలావరకు తట్టుకుంటుంది. నీటి ఆధారంగా కూడా పండించి అధిక దిగుబడులు పొందవచ్చు. జూన్‌-జూలై నెలల్లో విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. పశువుల దాణాగా, పచ్చిమేతగా, పచ్చిరొట్ట ఎరువుగా, దీని గింజలు గమ్‌ తయారీకి పనికొస్తాయి. లేత కాయలు, కూరగాయగా వాడుతారు. జూన్‌-జూలైలో విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: పూసామౌసమి, పూసాసదాబహార్‌, పూసానవబహార్‌, గౌరి.

పందిరి కూరగాయలు: జూన్‌-జూలై నెలల్లో విత్తుకోదగినవి.

ఆనప/సొర: రకాలు: పూసానవీన్‌, అర్కబహార్‌, పి.ఎస్‌.పి.ఎల్‌. హైబ్రిడ్లు: వరద్‌, విక్రాంత్‌, అమిత్‌

దోస: కూరదోస: ఆర్‌.ఎన్‌.ఎస్‌.ఎమ్‌-1, ఆర్‌.ఎన్‌.ఎస్‌.ఎమ్‌-3, వీటిని లేతగా ఉన్నపుడు పచ్చిదోసగా కూడా వాడవచ్చు. 

పచ్చిదోస రకాలు: పూస ఖీర, కొ-1, హైబ్రిడ్లు: మాలిని, జిప్సి.

కాకర: రకాలు: డి.కె.-1, ప్రియ, హైబ్రిడ్లు: శ్వేత, పూనం

గుమ్మడి: రకాలు: పూసా అలంకార్‌, అర్కచందన, హైబ్రిడ్‌: పూసా హైబ్రిడ్‌-1

బూడిద గుమ్మడి: రకాలు: శక్తి, కో-2, ‘పేట’ స్వీటు తయారీకి:బి.హెచ్‌-24, బి.హెచ్‌-25

పొట్ల: పందిరిపై పెంచడానికి రకాలు: శ్వేత, కో-1, కో-2, పి.కె.ఎం.-1; నేలపై పెంచడానికి రకం: కో-2; హైబ్రిడ్‌: పందిరిపై పెంచడానికి: ఎం.డి.యు-1

బీర: రకాలు: జగిత్యాల లాంగ్‌, అర్క సుజాత; హైబ్రిడ్లు: ఎస్‌.ఎస్‌-403, సంజీవని

దొండ: రకాలు చిన్నదొండ, పెద్దదొండ, నేతి దొండ

కీరదోస: అలామిర్‌, కియోన్‌, సటిన్‌.

పూలు: బంతి: ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. జూన్‌ రెండవ వారంలో నారు పోసుకుని, జూలై రెండవ వారంలో నాటడం అనుకూలం. మార్కెట్‌కు అక్టోబరులో తయారవుతుంది. పండుగకు అందివ్వాలంటే సుమారు 60 రోజులు ముందుగా నాటుకోవాలి.

గులాబి: జూన్‌ నుండి జనవరి వరకు నాటుకోవచ్చు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నాటడం అత్యంత అనుకూలం. హైబ్రిడ్‌ టీస్‌: పింక్‌ పాంథర్‌, ఆదిత్య, రక్తిమ; ఫ్లోరిబండాస్‌: ఆకాష్‌దీప్‌, రెడ్‌ ట్రెంప్‌, ల్యూటిన్‌; మినియేచర్‌: బేబి చాక్లెట్‌, ప్రీతి.

మల్లె: వర్షాకాలం ప్రారంభంలో జూన్‌-జూలైలో  వేర్లు వచ్చిన పిలక మొక్కలు నాటాలి. గుండుమల్లెను 5þ5, జాజిమల్లెను 7þ7, కాగడమల్లెను 6þ5 అడుగుల ఎడంలో నాటాలి.

కనకాంబరం: మే-జూన్‌ నెలల్లో నారుపెంచి, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ప్రధాన పొలంలో 60þ30 సెం.మీ. దూరంలో నాటాలి. సంవత్సరమంతా పూస్తుంది. చలికాలం, వేసవిలలో పూలదిగుబడి ఎక్కువ. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది.

వరి: భారతావనిలో వరి పంట దిగుబడి అవసరాల కంటే ఎక్కువైనందున ఈ పంటకు ప్రభుత్వాల ప్రోత్సాహం తగ్గుతున్నది. వరి తప్ప ఇతర పంటలు వేయలేని ఊటభూములు, కాలువల క్రింద, లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే పండించడం మంచిది. ఇంటి వాడకానికి, ఆర్గానిక్‌ పద్ధతిలో పంట పెట్టుకోవచ్చు. అధిక దిగుబడులకు జూన్‌లో ఎంత ముందుగా వీలయితే అంతముందుగా విత్తడం పూర్తి చేయండి. నాటు పెట్టడం కూడా నీటి లభ్యత ఉంటే, ఎంత లేత నారు నాటితే అంత దిగుబడులు పెరుగుతాయి. నీటి లభ్యత సరిగా లేనిచోట, నీటి లబ్యత మెరుగైన తర్వాతనే నారు పోయుట, నాటుట చేపట్టాల్సుంటుంది. ప్రభుత్వ ప్రొక్యూర్మెంటుపై ఆధారపడకుండా, స్వంతంగా మార్కెట్‌ చేసుకున్నా, గిరాకీ ఉన్న రకాలనే ఎంపిక చేసుకొని సాగు చేయడం బాధలను తగ్గిస్తుంది.

ప్రత్తి: చైనా నుండి దిగుమతులను కట్టడి చేయడం వలన, గులాబి రంగు పురుగు ఉధృతి ఎక్కువైనందున, దిగుబడి తగ్గినందున మార్కెట్‌లో ప్రత్తికి మంచి డిమాండ్‌ ఉంది. క్వింటాలు ప్రత్తి రూ. 10-12 వేలు పలుకుతున్నది. మంచి ప్రోత్సాహమున్నందున ఈ పంటను రైతులు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. పూర్తిగా నమ్మకమైన డీలర్ల దగ్గర నమ్మకంగా క్రితం సంవత్సరంలో బాగా పండిన, గిరాకీ ఉన్న రకాలనే పండించండి. కొత్త రకాలు వేయాలనుకునేవాళ్లు, కొద్ది విస్తీర్ణంలో పరీక్షించి బాగా పండితే తదుపరి సంవత్సరం, అదే రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టవచ్చు. అధిక సాంద్రత విధానంలో ప్రత్తిని పండించి, అధిక దిగుబడి పొందవచ్చు. ఈ విధానంలో ప్రత్తి పంట త్వరగా పూర్తవుతుంది. ప్రత్తి తర్వాత శనగ, పెసర, మినుము, నువ్వులు, వేరుశనగ పంటలను పెట్టుకోవచ్చు. అధిక సాంద్రత విధానాన్ని వర్షాధారంగాను, నీటితడులిచ్చి కూడా చేపట్టవచ్చు.

వేరుశనగ: జూన్‌ రెండవ పక్షం నుండి జూలై మొదటి వారంలోపు విత్తి అత్యధిక దిగుబడులు పొందవచ్చు. వేరుశనగ గింజలు పెద్దగా ఉండడం వలన, మొలకెత్తడానికి భూమిలో తగినంత తేమ అవసరం. జూలై మొదటి వారం తర్వాత ఎంత నిదానించి విత్తితే అంత దిగుబడి తగ్గుతుంది. కదిరి లేపాక్షి (కె-1812) బాగా దిగుబడినిస్తున్నప్పటికి కన్ఫెక్షనరీ (గింజలతో తయారైన పదార్థాలు) తయారీదారులు, దీని వాడకానికి ఇష్టపడుట లేదు. ఇందులో వగరు ఉండుట కారణమంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వారు రూపొందించిన టి.సి.జి.ఎస్‌-1694 గట్టి, కమ్మటి, లావుగింజలు, సమానమైన సైజుగల గింజలు కలిగి, అత్యధిక దిగుబడులను సైతం ఇస్తున్నది. దీనిని ప్రాచుర్యంలోకి తేవ డానికి, విరివిగా విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. 

ప్రతి పల్లె / జనావాసంలో రైతు ప్రజాసంఘాలు-రైతుల సత్వర ప్రగతికి సోపానాలు. పల్లెలోని ప్రజలంతా పెట్టుబడి పెడితే, ఆ పెట్టుబడి ముఖ్యంగా డబ్బులతో ఎక్కువ ఇబ్బందిపడే రైతులకు తక్కువ వడ్డీకే అప్పుగా దొరికితే, రైతుల అభివృద్ధి త్వరగా జరుగుతుంది. అందుకే ప్రతి పల్లె / జనావాసంలో రైతు ప్రజా సంఘాలు ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వానికి ప్రపోజల్‌ పంపండం జరిగింది. వీటి వలన రైతులు, ప్రజలు అందరు అన్ని విధాలా అభివృద్ధి (ఆల్‌ రౌండ్‌ డెవలప్‌మెంట్‌) సాధించడానికి వీలవుతుంది. ఏం చేస్తే పల్లె ప్రజలు బాగా అభివృద్ధి సాధిస్తారో ఈ సంఘాల నాయకులు తీర్మానాల రూపంలో తెలుపుతారు. వారికి నచ్చిన విధంగా, వారి అభివృద్ధి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి, ప్రభుత్వం నుండి, వివిధ పార్టీల నుండి ప్రోత్సాహం లభిస్తే ప్రజలందరి సమగ్ర అభివృద్ధి సత్వరంగా జరగడానికి వీలవుతుంది. ఎఫ్‌.పి.ఓ.ల ఫెయిల్యూర్‌లను నివారించడానికి కూడా ఈ సంఘాలు బాగా పని చేస్తున్నాయి.

పలు పంటలపైన, ప్రజలందరి సత్వర, సమగ్ర అభివృద్ధిపైన వివరంగా తెలుసుకోగోరువారు 9494408619 కు ఫోను చేయవచ్చు. ఫేస్‌బుక్‌లో SALLA NARAYANASWAMY/Profsnswamy   అకౌంట్లలో ఫొటోలతో కూడిన వివరణలను చూడవచ్చు. రైతులకు సలహాలు, సూచనలు ఉచితం.