పుట్టగొడుగుల పెంపకం అనేది మీరు తక్కువ పెట్టుబడి మరియు తక్కువ స్థలంతో ప్రారంభించగల అత్యంత లాభదాయక వ్యవసాయ వ్యాపారాలలో ఒకటి. భారతదేశంలో పుట్టగొడుగుల పెంపకం చాలా మందికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా క్రమంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా, చైనా, యుఎస్‌, ఇటలీ మరియు నెదర్లాండ్స్‌ పుట్టగొడుగుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. భారతదేశంలో, పుట్టగొడుగుల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. తరువాత త్రిపుర, కేరళ ఉన్నాయి. పుట్టగొడుగులు అందరికి అత్యంత ఇష్టమైన ఆహారాలలో ఒకటి ఎందుకు అనగా వాటి రుచి వలన మాత్రమే కాకుండా అవి కలిగి ఉన్న ప్రయోజనాల కోసం కూడా. దీనిని ఫ్రెష్‌గా, ఊరగాయ, ఎండబెట్టిన లేదా పొడి చేసిన మొదలైన వివిధ రూపాల్లో తినవచ్చు.

పుట్టగొడుగులలో నీరు 90% కంటే ఎక్కువ ఉంటుంది మరియు 1% కంటే తక్కువ కొవ్వు అలానే విటమిన్‌ బి, రాగి మరియు సెలీనియంను కలిగి ఉంటాయి. సాధారణంగా కూరగాయలు, పాలు మరియు ఇతర ఆహార ఉత్పత్తులు రేడియేషన్‌ లేదా ప్రత్యక్ష చేరిక ద్వారా విటమిన్‌-డి ను కలిగి ఉంటాయి. కానీ, పుట్టగొడుగులు అత్యంత ప్రత్యేకమైనవి ఎందుకనగా అవి సహజంగానే విటమిన్‌-డిను కలిగి ఉంటాయి.

పుట్టగొడుగులలో రకాలు

పుట్టగొడుగులు కొండ ప్రాంతాలలో సులభంగా పండుతాయి. ఎందుకనగా తేమ సమృద్ధిగా ఉంటుంది, అలానే మనం పుట్టగొడుగులను కృత్రిమంగా కూడా పెంచవచ్చు. అలా చేయడానికి సరైన ఉష్ణోగ్రత మరియు తేమతో కూడిన వాతావరణాలు అవసరం. వెరైటీలను కక్షుణ్ణంగా గుర్తించాలి. ఎందుకంటే వాటిలో కొన్ని ఫుడ్‌ పాయిజనింగ్‌ లేదా అలెర్జీకి కారణం అయ్యే రకాలు కూడా ఉంటాయి.

భారత్‌లో వినియోగించే కొన్ని ప్రధాన రకాలు:

బటన్‌ పుట్ట గొడుగు: దీని శాస్త్రీయ నామం అగారికస్‌ బిస్పోరస్‌. ఇది అగరికేసి కుటుంబానికి చెందినది. ఐరోపా మరియు ఉత్తర అమెరికాలో ఎక్కువగా సాగు చేస్తారు. ఇది రెండు రకాలు. తెలుపు మరియు గోధుమ, వీటిలో తెలుపు బటన్‌ పుట్టగొడుగు సాధారణంగా భారతదేశంలో పండిస్తారు. ఐసీఆర్‌-డైరెక్టరేట్‌ ఆఫ్‌ మష్రూమ్‌ రీసెర్చ్‌ ప్రకారం మొత్తం పుట్టగొడుగుల సాగులో ఈ రకాన్నే 85% వరకు ఉపయోగిస్తున్నారు. ఇది తినుబండారాలలో మరియు కూరలలో ఉపయోగించే అత్యంత రుచికరమైన రకం.

షిటేక్‌ పుట్టగొడుగు: షిటేక్‌ పుట్టగొడుగులు తూర్పు ఆసియాకు చెందినవి మరియు ఆసియా దేశాలలో అధికంగా వినియోగించ బడుతున్నాయి. ఇవి ఆకురాల్చే మరియు కఠినమైన చెక్క చెట్ల కలపపై అనగా ఓక్‌, చెస్ట్‌ నట్‌ మరియు మాపుల్‌ మొదలైన వంటి వాటిపై సులభంగా పెరుగుతాయి. వీటికి తేమ మరియు వెచ్చని వాతావరణం అవసరం. కొన్ని సందర్భాల్లో ఇవి అలెర్జీకి అంటే దురదలాంటి వాటికి కారణం కావచ్చు. కానీ వేడి చేయడం ద్వారా అలెర్జీ వంటి వాటిని పూర్తిగా తొలగించవచ్చు. వీటిని ఆసియా వంటకాల్లో మరియు సాంప్రదాయ మందులలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఆయిస్టెర్‌ పుట్టగొడుగు: ఆయిస్టెర్‌ పుట్టగొడుగులు ప్లూరోటస్‌ జాతికి చెందినవి. దీనిని భారతదేశంలో ”థింగ్రి” అని పిలుస్తారు. ఫ్యాన్‌ ఆకారంలో ఉండే టోపీని కలిగి ఉంటుంది. కుళ్లిపోయిన కలప లేదా గడ్డి మీద సులభంగా పెరుగుతాయి. 

వరిగడ్డి మీద పెరిగే పుట్టగొడుగు: పేరులో ఉన్నట్టుగానే ఇవి వరిగడ్డిపైన పెరుగుతాయి. వీటిని కూరలలో ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇవి పండించడం కూడా చాలా సులువు.

సాగు విధానం: 

పుట్టగొడుగుల పెంపకానికి ప్రాథమిక అవసరాలు ఎరువు/కంపోస్టు, స్పాన్లు, సరైన ఉష్ణోగ్రత మరియు చెమ్మ. వీటి పెరుగుదలకు అనుకూల పరిస్థితులు అనగా 80%-90% సాపేక్ష తేమ, తగినంత వెంటిలేషన్‌, ఉష్ణోగ్రత పరిధి 20-28 డిగ్రీల సెంటీగ్రేడ్‌ స్పాన్‌ రన్‌ సమయంలో అలానే 12-18 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పునరుత్పత్తి సమయంలో ఉండాలి. తొలుత వారం రోజుల పాటు ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉండేటట్లు మరియు తరువాత వారాలకు 16 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించుకోవాలి. కార్బన్‌డైయాక్సైడ్‌ గాఢత 0.08-0.15% ఉండేలా చూసుకోవాలి. అయితే పైన పేర్కొన్న సూచనలు పాటించడం ద్వారా పిన్‌హెడ్‌లు కొద్ది రోజుల్లోనే కనిపించడం ప్రారంభిస్తాయి. క్రమంగా అవి బటన్‌ థకు పరిణతి చెందుతాయి. పుట్టగొడుగుల పెంపకం కోసం ఈ క్రింద పేర్కొన్న థలను అనుసరించాలి.

కంపోస్టు తయారీ విధానం:

సాధారణంగా గోధుమ గడ్డి, గుర్రపు ఎరువు, కోళ్ల ఎరువు, రైస్‌ బ్రాన్‌ (వరి పొట్టు), జిప్సం మొదలైనవి పుట్టగొడుగుల పెరుగుదల కోసం కంపోస్టుగా ఉపయోగిస్తారు. పచ్చి కంపోస్టుకు వర్షం లేదా బాహ్య తేమ దరిచేరకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనగా అవి అవాంఛనీయ సూక్ష్మజీవులను పరిచయం చేస్తాయి. తరిగిన గోధుమ గడ్డి లేదా రైస్‌ బ్రాన్‌ను గుర్రపు పేడతో కలిపి, కొంచెం నీటిని చల్లి ఒక కుప్పలా చేసి కిణ్వప్రక్రియకు అనుమతించాలి. వేడితో పాటు కిణ్వ ప్రక్రియ రసాయన సమ్మేళనాలను చిన్న చిన్న భాగాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. అప్పుడప్పుడు తిరగ వేయడం మరియు నీరు పోయడం వంటివి చేయడం వలన కంపోస్టు ఎండిపోకుండా చూసుకోవచ్చు. జిప్సం వేయడం ద్వారా జిడ్డును తొలగించవచ్చు మరియు ఇది ఎక్కువ గాలిని అనుమతిస్తుంది. 15 నుండి 20 రోజుల్లో కంపోస్టు మొత్తం సిద్ధం అవుతుంది. తరువాత దీనిని బెడ్‌లా ఉపయోగించుకోవచ్చు. తరువాత దీనిని చెక్క ట్రేలపై పరచి స్పాన్‌ను విత్తుకోవాలి.

స్పానింగ్‌:

స్పాన్‌ అనగా అగర్‌ లేదా గింజలపై పెరిగే మైసీలియం. స్పానింగ్‌ అనేది విత్తే ప్రక్రియ లేదా కంపోస్టులో మొక్కలను కలపడం. పుట్టగొడుగు తదుపరి విత్తనంగా పనిచేసే బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది కానీ మొలకెత్తడం మరియు పెరుగుదల అనిశ్చితి కారణంగా సాధారణంగా ఉపయోగించబడవు. స్పాన్లు కంపోస్టుతో పూర్తిగా కలిపి, వార్తాపత్రికతో కప్పాలి మరియు చెమ్మ మెయింటైన్‌ చేయడం కొరకు తగినంత నీరు కలపాలి. సాగు కాలం అంతటా తేమ ఉండేలా చూసుకోవాలి. క్రమంగా తెల్లని మైసీలియం పెరుగుదలను మనం గమనించవచ్చు.

కేసింగ్‌:

కేసింగ్‌ అనేది ఒక రకమైన క్రిమిరహిత మట్టి లేదా డ్రెస్సింగ్‌ ఆవు ఎరువును కలిగి ఉంటుంది. ఇది స్పాన్‌ కలిపిన కంపోస్టు మీద వేయాలి. కంపోస్టు ఉపరితలంపై మైసీలియం పెరుగుదలను మనం గమనించినపుడు దీనిని అందించాలి. ఇది అందించిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఉపరితలంపై కనిపించేలా పుట్టగొడుగు తలలు లేదా పిన్నులు ప్రారంభమవుతాయి. ఇవి నిర్దిష్ట సమయంలో పక్వం చెందుతాయి. క్యాప్‌ తెరుచుకోకముందే వీటిని కోసివేయాలి. క్యాప్‌ తెరిచిన పుట్టగొడుగులు (క్యాప్‌ తెరిచిన తర్వాత గొడుగులా కనిపిస్తాయి) అవాంఛనీయమైనవి మరియు తక్కువ నాణ్యతగా పరిగణించబడతాయి.

కోత మరియు కోత అనంతర యాజమాన్యం

చేతులతో మట్టి నుండి తీస్తారు లేదా తలలను చిన్న కత్తితో కట్‌ చేస్తారు. ప్రాథమిక ప్రాసెసింగ్‌లో పుట్టగొడుగులను అంటుకున్న మట్టి లేదా కంపోస్టును తొలగించడం కొరకు కడగడం జరుగుతుంది మరియు వాటిని కొన్ని నిమిషాలు బ్లాంచింగ్‌ చేయడం వలన చెడు ఎంజైమ్‌లను క్రియారహితం చేయవచ్చు. రంగు పాలిపోవడాన్ని నివారించడానికి ఉప్పు నీరు లేదా సిట్రిక్‌ ఆమ్లంను క్యానింగ్‌ లేదా ప్యాకేజింగ్‌ ముందు ఉపయోగిస్తారు.              

వై. రామ్‌మోహన్‌, కొట్టం సుష్మ, ఆర్‌. సుభాష్‌, డి. దివ్య భారతి, నవీన్‌ యాదవ్‌, పిహెచ్‌.డి విద్యార్థులు, ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట, డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం. ఫోన్‌: 9160477365