ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 13 లక్షల ఎకరాల్లో మామిడి తోటలను రైతులు పెంచుతున్నారు. సాలీనా 25-30 లక్షల టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తిచేస్తున్నారు. అయితే మంచి సాగుపద్ధతులు పాటించి మరింత దిగుబడితోపాటు నాణ్యమైన పండ్ల ఉత్పత్తులను పొందవచ్చు. మన మామిడి పండ్లకు అనేక దేశాల్లో మంచి గిరాకీ ఉన్నప్పటికీ ఆయా దేశాలు నిర్దేశించిన గరిష్ఠ పరిమితులను మించి వీటి అవశేషాలు ఉండటం వల్ల ఆశించిన రీతిలో మామిడి ఎగుమతులను పెంచలేక పోతున్నాం. గత ఒకటిన్నర థాబ్దాల నుండి అభివృద్ధి చెందిన దేశాలన్నీ విషరహితమైన సేంద్రియ ఆహారాన్ని కోరుకుంటున్నారు. ఈ ఉత్పత్తులకు దేశవిదేశాల్లో గిరాకీ పెరుగుతోంది. దీనివల్ల ఔత్సాహిక వ్యవసాయదారులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అధిక ధరలను పొందుతున్నారు. మామిడిలో కూడా సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లకు దేశవిదేశాల్లో డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. మామిడి రైతులకు నూతన మంత్రం సేంద్రియ సాగు
రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో మామిడితోలను సాగు చేయడంవల్ల చెట్లకు పురుగులు, తెగుళ్ళను తట్టుకునే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. యునైటెడ్ కింగ్డమ్ భారతదేశం నుండి ఎగుమతి అయ్యే మామిడి పండ్లపై నిషేధం విధించిన్నప్పటికీ సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడి పండ్లకు కొత్త మార్కెట్లలో డిమాండ్ వుందని రైతులు నమ్ముతున్నారు. సేంద్రియ వ్యవసాయంవల్ల రైతులకు సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు, ఆదాయం లభిస్తుంది. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక డిమాండ్ వుంది. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్లను వెతుక్కోనవసరం లేదు. కస్టమర్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని నేరుగా రైతుల నుండి సరుకును కొంటారు. సూరత్, నవసారి, వేల్సాడ్‌లో మామిడి సాగులో వున్న 57,000 హెక్టార్లలో సుమారు 28,000 హెక్టార్లు సేంద్రియ సాగులో వున్నాయని వ్యవసాయ నిపుణుల అభిప్రాయం.
మామిడిలో హార్మోన్ల పిచికారి హానికరం
మామిడిలో పూత అధికంగా రావడానికి, దిగుబడులు పెరగడానికి రైతులు పాక్లోబ్యూట్రజోల్ వంటి హార్మోన్లను పిచికారి చేస్తారు. ఈ హార్మోన్లు దీర్ఘకాలంలో మామిడి చెట్లకు హాని కల్గిస్తాయి. దీనివలన చెట్లలో వంధ్యత్యమేర్పడి వాటి జీవితకాలం 10 సంవత్సరాలు తగ్గుతుంది. ఒకసారి ఈ హార్మోన్లను పిచికారి చేస్తే భవిష్యత్తులో అవి సహజంగా పూత పూయలేవు. ప్రతి సంవత్సరం దిగుబడి రావడానికి హార్మోన్లను తప్పనిసరిగా పిచికారి చేయాలి. మామిడి తోటల్లో హార్మోన్లను పిచికారి చేయడంవలన ఆ ప్రాంతంలోని ఇతర మొక్కలలో పూత చక్రాలు దెబ్బతింటాయి. పశ్చిమ బెంగాల్‌లో మామిడి పట్టణంగా పేరుగాంచిన మాల్డాలోని మామిడి తోటల్లో కూడా అధికంగా హార్మోన్లను పిచికారి చేయడంవలన ఇదే సమస్యతలెత్తింది. హార్మోన్ల పిచికారిపై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన 5-10% ధనిక రైతులు మాత్రమే నికర ఉత్పత్తిని పొందగలిగారు. ఎకరన్నర తోటలో మంచి దిగుబడులు పొందడానికి రూ. 2 లక్షలు పైగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ తీవ్ర సమస్యకు సేంద్రియ సాగు మాత్రమే పరిష్కారం.
భూమి తయారి : భూమిని దున్ని చదును చేయాలి. సరైన నీటి పారుదల, మురుగునీరు పారుదల సౌకర్యాలు కలిగించడానికి కొద్దిపాటి కాలువనేర్పాటు చేయాలి. మొక్కలు నాటడానికి గుర్తులు పెట్టిన తర్వాత వేసవి నెలలో 90þ90þ90 సెం.మీ. గుంతలు త్రవ్వాలి. గుంతలు తీసేటపుడు పై పొరల్లోని మట్టిని, క్రింద పొరల్లోని మట్టిని ప్రతి గుంతకు దగ్గరగా 2-4 వారాలు విడివిడిగా కుప్పలుగా పోసి వుంచాలి. దీని వలన హానికర శిలీంద్రాలు సూర్యరశ్మి సోకి నశిస్తాయి. వేర్లకు బాగా గాలి సోకుతుంది. ప్రతి గుంతను 20 కి. పశువుల ఎరువు, 5 కి. వర్మింకపోస్టు, జీవన ఎరువులు (అజోస్పైరిల్లం, ఫాస్ఫో బాక్టీరియా)తో నింపాలి. వర్షాలు ప్రారంభమవగానే జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచాలి. లెగ్యూమ్ జాతికి చెందిన పచ్చి రొట్ట పైర్లను పెంచడంవల్ల నత్రజని స్థిరీకరించబడి, మొత్తం క్షేత్రాన్ని అద్భుత పచ్చదనం కప్పివుంచడం వలన తేమ నష్టాన్ని నివారిస్తుంది.
మొక్కలను నాటే దూరం : వరుసల మధ్య, మొక్కకు, మొక్కకు మధ్య దూరం 7 నుండి 10 మీ.
మొక్క అంట్లు : నాటు మొక్కల అంట్లను సేంద్రియ నర్సరీ నుండి సమకూర్చుకోవడం శ్రేయస్కరం.
రకాలు : నీలం, బెంగలోర, ఆల్ఫాన్సో, రుమాని, బంగినపల్లి, జహింగీర్, మల్గోవా, మల్లిక, అమ్రపాలి, అర్క అన్‌మోల్, అర్క అరుణ, అర్కపునీత్, అర్క నీల్‌కిరణ్.
మొక్కలు నాటడం : వర్షాలు, నీటిపారుదల సౌకర్యాల లభ్యతను బట్టి జులై – డిశంబర్ నెలల మధ్య కాలంలో నాటవచ్చు.
నీటి యాజమాన్యం : మొక్కల 2 సంవత్సరాల వయసు వరకు క్రమం తప్పకుండా నీరందించాలి. కొత్తగా నాటిన అంట్లకు ప్రతిరోజు 25-30 లీ. నీరివ్వాలి. పెరిగి చెట్లలో కాయలేర్పడిన తర్వాత 10 రోజులకొకసారి నీరిస్తే దిగుబడులు పెరుగుతాయి. డ్రిప్ పద్ధతిలో నీరందించడం మంచిది.
కలుపు యాజమాన్యం : మొదటి కొద్ది సంవత్సరాలు మొక్కల పొదులో వరిగడ్డితో ఆచ్భాదన చేయడం వల్ల కలుపు నివారణ జరుగుతుంది. పెరిగిన మామిడి తోటల్లో నీడ, రాలిన ఆకులవల్ల కలుపు సమస్య తక్కువగా వుంటుంది.
ప్రూనింగ్ : మొక్క పరిమాణం నియంత్రణకు, పండు రంగు మెరుగు పరచడానికి మామిడి చెట్లలో కత్తిరింపులు ముఖ్యం. చెట్లలో బాగా గాలి, వెలుతురు ప్రసరించడానికి ఫ్రూనింగ్ చేస్తారు. దీనివలన పురుగులు, తెగుళ్ళ సమస్య తగ్గుతుంది. కాయలు మంచి రంగుతో ఏర్పడతాయి. కొమ్మ చివర కుళ్ళు నివారణకు చెట్టులో చనిపోయిన కొమ్మలను కత్తిరించాలి. నీటి కొమ్మలను, చెట్టులో క్రింది కొమ్మలను కత్తిరించాలి. చెట్టులో బాగా సూర్యకాంతి, గాలి ప్రసరణకు ఎగుడు దిగుడుగా, అడ్డదిడ్డంగా, తెగులు సోకిన, ఎండు కొమ్మలను, బలహీనంగా వున్న కొమ్మలను కత్తిరించాలి. మూడు సంవత్సరాలకొకసారి ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఫ్రూనింగ్ చేయాలి. సంవత్సరానికొకసారి ఆగస్టు-సెప్టెంబర్ నెలలో చివరి కొమ్మలను, బలహీనమైన కొమ్మలను కత్తిరించి ఆరోగ్యవంతమైన కొమ్మలనుంచాలి.

అవసరమైన పోషకాలు : మామిడి నాటిన థ నుండి పూర్తిగా పెరిగిన చెట్లు థ వరకు పంచగవ్య, వర్మికంపోస్టు ఎరువులను వేసి చెట్లకు అవసరమైన పోషకాలను సరఫరా చేసి, పురుగులు, తెగుళ్ళను నివారించవచ్చు. వానపాములను ఉపయోగించి వర్మికంపోస్టు తయారు చేస్తారు. చురుకుదనం పెంచిన వానపాములున్న వర్మింకపోస్టు బెడ్ ద్వారా నీరుపారించి వర్మి వాష్ సేకరిస్తారు. ఇది అన్ని పంటలకు సేంద్రియ పిచికారిగా ఉపయోగిస్తుంది.
జీవసంబంధమైన పద్ధతులు : ఆచ్ఛాదన, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, కంపోస్టు వాడటం. ప్రధాన పోషకాలు వాడదగిన సేంద్రియ పదార్థాలు నత్రజని లెగ్యూమ్ జాతి మొక్కలు, ఆచ్ఛాదన, కోళ్ళ ఎరువు, బ్లడ్ మీల్, రక్తం, ఎముకలు, చేపల ఎమల్షన్, కంపోస్టుభాస్వరం రాక్‌ఫాస్ఫేట్, గుయాన, కంపోస్టు, రక్తం, ఎముకలుపొటాషియం కంపోస్టు, సీవీడ్, పొటాషియం సల్ఫేట్‌కాల్షియం సున్నపు రాళ్ళు, డోలమైట్, లైమ్‌శాండ్, మైక్రోనైజ్డ్ లైమ్‌మెగ్నీషియం డోలమైట్ లేదా మెగ్నసైట్, మెగ్నీషియం సల్ఫేట్‌గంధకం జిప్సం, పొటాషియం సల్ఫేట్‌సూక్ష్మపోషకాలు కంపోస్టు, సీవీడ్, ఫిష్ ఎమల్షన్, నాచురల్ కీలేట్స్, ఐరన్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, బోరిక్ యాసిడ్ మామిడి తోటలో నాణ్యమైన పండ్ల ఉత్పత్తి సాధించిన రైతుల అనుభవం ద్వారా కోడిగుడ్లు, నిమ్మరసం ద్రావణం నాణ్యమైన పండ్ల ఉత్పత్తికి దోహదపడుతుందని రుజువయింది.ద్రావణం తయారు చేసే పద్ధతి : ఈ ద్రావణం తయారు చేయడానికి 10 కోడిగుడ్లను వెడల్పాటి మూతిగలగాజు సీసాలో జాగ్రత్తగా పగలకుండా అమర్చిగుడ్లు మునిగేంతవరకు సుమారు అర లీటరు నిమ్మరసం పోయాలి. గుడ్ల పైన నిమ్మరసం కనీసం ఒక అంగుళం ఉండాలి. మూత పెట్టగానే గ్రుడ్లలో నుంచి గాలి బయటకు రావడం, బుడగల ద్వారా గమనించవచ్చు. ప్రతి రోజు మూత తీసిగ్రుడ్ల పైన రసం ఉన్నదీ, లేనిదీ చూసి, లేని యెడల మరల కొంచెం నిమ్మరసం పోయాలి. ఈ విధంగా 10 రోజుల వరకు చేసి 11వ రోజున ప్లాస్టిక్ గిన్నెలో గుడ్ల ద్రావణాన్ని పోసి చేతితో బాగా పిసకాలి. ఈ విధంగా బాగా పిసికిన తర్వాత పలుచటి గుడ్డులో ద్రావణాన్ని వడపోసి దానికి 250 గ్రా|| నల్ల బెల్లం కలపాలి. ఈ ద్రావణాన్ని శుభ్రపరచిన సీసాలో పోసి మూత క్రింద ప్లాస్టిక్ పేపర్ పెట్టి గాలి చొరబడకుండా మూత బిగించాలి. * ఈ ద్రావణం సుమారు 2 నెలల వరకు నిల్వవుంటుంది.* 200 మి.లీ. ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి ఎకరంలోని పంటపై సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.* కోడిగుడ్లు-నిమ్మరసం ద్రావణం ”అమినో యాసిడ్’గా పనిచేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి కావలసిన ప్రోటీన్లను అందిస్తుంది.* ఈ ద్రావణాన్ని పంటలలో పిచికారి చేయడం వలన పండ్ల నాణ్యత పెరుగుతుంది.మామిడి, కొబ్బరి చెట్లకు కునపజలం : మాంసం – 1 కి., మినుములు – 250 గ్రా., నువ్వులు – 250 గ్రా., ఆవుపాలు-1 లీ., నీరు-5 లీ. తయారు చేసే విధానం : మేక పోతు మాంసాన్ని చిన్న ముక్కలుగా కోసి శుభ్రంగా కడిగిన తర్వాత మట్టికుండతో పోసిన 5 లీ. నీటిలో కలిపి నీరు ఆవిరయ్యే వరకు ఉడకబెట్టాలి.* ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడకట్టి అందులో మెత్తగా నూరిన మినుములు, నువ్వుల పొడి వేసి బాగా కలియబెట్టాలి.* కుండపై మూతపెట్టి, గుడ్డతో వాసినకట్టి భూమిలోకాని, మట్టి దిబ్బలోకానీ, పెంటకుప్పలోగానీ 10 రోజులుంచాలి.* 10 రోజుల తర్వాత ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి.* ఈ విధంగా తయారైన 5 లీ. ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి ఒక ఎకరా పంటపై సాయంత్రం వేళ పిచికారి చేయాలి.* ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోను 1-2 సార్లు పిచికారి చేయవచ్చు. దీనివలన పంటలు ఆరోగ్యవంతంగా పెరిగి, పంటల నాణ్యత పెరగుతుంది.
మోతాదు : అర లీటరు కునపజలాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. 5 లీ. కునపజలాన్ని 100 లీ. నీటిలో కలిపి ఎకరం విస్తీర్ణంలోని పంటపై పిచికారి చేయాలి.ఆచ్ఛాదనకు ఉపయోగించే పదార్థాలు : చెట్టు బెరడు, వేరుశనగ పొట్టు, కలుపుమొక్కలు, గడ్డి మొక్కలు, ఉడ్‌చిప్స్, సైలేజి, వరి, గోధుమ గడ్డి, చెట్ల నుండి రాలిన ఆకులు, వరి ఊక, కొబ్బరి పీచు, అరటి, చెరకు చెత్త మొదలైనవి. ఆచ్ఛాదన భూమిలో తేమ ఆవిరైపోకుండా కాపాడుతుంది. కలుపు పెరుగదు. ఉష్ణోగ్రతలో మార్పులు తగ్గుతాయి. నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
పచ్చిరొట్ట ఎరువులు : లెగ్యూమ్ జాతి పంటలను పెంచి భూమిలోకి కలియ దున్నాలి. దీనివలన భూమి భౌతిక నిర్మాణం, భూసారం పెరుగుతాయి. పంటకు పోషకాల లభ్యత పెరిగి దిగుబడి పెరుగుతుంది. భూమిలోని సూక్ష్మజీవులకు ఆహారంగా పనిచేసి అభివృద్ధి చెందేలా చేస్తాయి. జనుము, జీలుగ, విశిష్టమైన పచ్చిరొట్ట పంటలు. పచ్చిరొట్ట ఎరువులు వేసిన తర్వాత వేరుశనగను అంతరపంటగా వేస్తే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. గ్లైరిసిడియా, సుబాబుల్, కానుగ మొక్కలను కూడా పచ్చిరొట్ట ఎరువుగా వాడతారు.
జీవన ఎరువులు : జీవన ఎరువులను సేంద్రియ వ్యవసాయంలో విస్తారంగా వాడతారు. రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్, ఫాస్ఫోబాక్టీరియా, బ్లూగ్రీన్ ఆల్గే వాటిలో ముఖ్యమైనవి. మామిడిలో అజోస్పైరిల్లం, ఫాస్ఫో బాక్టీరియా రైతులు ఎక్కువగా ఉపయోగించే జీవన ఎరువులు. ఎకరానికి 2 కి. ఫాస్ఫో బాక్టీరియా పశువుల ఎరువుతోగాని, ఇసుకతోగాని కలిపి చల్లాలి. 2-3కి. అజోస్పైరిల్లంను 10-15కి. పశువుల ఎరువుతో కలిపి చల్లాలి.
కంపోస్ట్ ఎరువులు : కంపోస్టింగ్ సన్న, చిన్న కారు రైతుల క్షేత్రాల్లో భూసారాన్ని పెంచి ఉత్పాదకతను పెంచే అద్భుత పద్ధతి. రైతుల క్షేత్రాల్లోని పంట అవశేషాలను, విసర్జితాలను ఉపయోగించి తామే కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా భూసారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. జీవన ఎరువులు, కంపోస్టు, వర్మికంపోస్టు వాణిజ్యపరంగా మార్కెట్లో లభిస్తున్నాయి.
అంతరసేద్యం : తోటలో మధ్య ఖాళీ స్థలాన్ని దున్నడం ద్వారా నేలగుల్లబారి గాలి బాగా ప్రసరించి వేర్లు బాగా పెరుగుతాయి. కలుపు మొక్కలు రావు. అలాగే నేలలో వుండే పురుగులు నిద్రావస్థలో చనిపోతాయి. లేత తోటల్లో ఖాళీ స్థలాన్ని దున్ని అంతర పంటలు, పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకుంటే మొక్కలు ఏపుగా పెరిగి త్వరగా కాపుకొస్తాయి. కాపుకు వచ్చిన తోటల్లో తొలకరి వర్షాలకు ఒకసారి దున్నడం వలన వర్షపు నీరు బాగా నేలలోకి ఇంకి నేలకోత నాపుతుంది. ఆగస్టులో రెండవసారి దున్నితే కలుపురాదు. అలాగే నేలలో వుండే పిండి పురుగులు, పండు ఈగ నిద్రావస్థ థలోనే నశిస్తాయి. వాలుకి అడ్డంగా దుక్కి చేసి, కాంటూరు గట్లు వేసుకుంటే వర్షపునీరు, నేల సారం కొట్టుకుపోకుండా వుంటుంది. వేసవిలో చెట్లు ఎండిపోవు. ఎండుపుల్ల పడదు. వేరు కుళ్ళు ఆశించదు. పూత, కోత బాగా వస్తుంది.
పూత పెరగడానికి చర్యలు : తోటల్లో తేనెటీగ పట్టులను ఏర్పాటు చేసుకుంటే తేనెటీగల సంచారం వలన పరపరాగ సంపర్కం ఎక్కువగా జరిగి పూత అధికంగా ఏర్పడుతుంది. దీనివలన పంట దిగుబడి, 20 నుండి 30 శాతం పెరుగుతుంది. పొలం నాలుగు మూలలా మార్కెట్లో లభించే తేనెపట్టుగదులను తెచ్చి తేనె పట్టుల నేర్పాటు చేసుకోవచ్చు. కొన్నిసార్లు తేనె పట్టులు సహజంగా చెట్లకు పడతాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మామిడి తోటల్లో సస్యరక్షణ : తోటని పరిశుభ్రంగా వుంచాలి. పురుగులు, తెగుళ్ళు ఆశించిన కొమ్మలు, కాయలు, ఇతర మొక్క భాగాలను కత్తిరించి నాశనం చేయాలి. తోటల చుట్టూ గాలులను తట్టుకునే ఎత్తైన చెట్లను నాటాలి. కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. జీవవైవిధ్యం పెంచాలి. బదనికలను ప్రోత్సహించాలి. పూతకు ఒక నెల ముందు 20 లీ. జీవామృతాన్ని 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15 రోజుల తర్వాత నీమాస్త్రం తయారు చేసి పిచికారి చేయాలి. పిందెలు ఏర్పడిన తర్వాత ఒకసారి జీవామృతం, 15 రోజుల తర్వాత నీమాస్త్రం, 30 రోజుల తర్వాత 6 లీ. పుల్ల మజ్జిగను 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పురుగు వికర్షిణి : పంచగవ్య మొక్కల పెరుగుదలను పెంచే సేంద్రియ పదార్థం. దీనిని ఆవు పేడ, ఆవు మాత్రం, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి సరైన పాళ్ళలో కలిపి తయారు చేస్తారు. దీనిని మొక్కలపై పిచికారి చేస్తారు. దీనిలో అనేక ప్రధాన సూక్ష్మపోషకాలు, ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు. ఉంటాయి. ఇది మొక్కల పెరుగుదలకు, సమర్థవంతమైన పురుగు వికర్షిణిగా పని చేస్తుంది. ఒక ప్లాస్టిక్ లేదా సిమెంటు ట్యాంకు లేదా మట్టికుండలో 5 కి. తాజా ఆవుపేడ, ఒక లీటరు ఆవు నెయ్యి బాగా కలిపి దీనిని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు బాగా కలపాలి. ఇలా 3-4 రోజులు కలపాలి. సుమారు 3 లీ. ఆవు పాలు, 2 లీ. ఆవు పెరుగు, 3 లీ. చెరకు రసం, 3 లీ. లేత కొబ్బరి నీరు, 10-12 బాగా మగ్గిన అరటి పండ్లను బాగా కలిపి ఈ మిశ్రామనికి కలపాలి. మొత్తం ద్రావణాన్ని 15 రోజులు పులియ నివ్వాలి. ఈ పాత్రను నెట్‌తో లేదా నూలుగుడ్డలో కప్పి వుంచి గాలి అడేలా చూడాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి రెండు, మూడు సార్లు కలుపుతూ 15 రోజుల అలా చేసిన తర్వాత ఉపయోగించవచ్చు. 6-7 సంవత్సరాల వయసున్న మామిడి చెట్లకు, ప్రతి చెట్టుకి 10 కి. వర్మికంపోస్టు, 30 లీటర్ల నీటిలో 1 లీ. పంచగవ్య మిశ్రమం కలిపిన ద్రావణం ఆకులపై, చెట్టు మొదలులో పిచికారి చేయాలి. పంచగవ్యను ఆకులపై పిచికారి చేయడం, చెట్టు మొదలులో పిచికారి చేయడాన్ని 4-5 సార్లు చేయాలి. పూత థ ముందు (జనవరి-మార్చి) మొదటి పిచికారి చేస్తే పూత ఎక్కువగా ఏర్పడుతుంది. 15-20 రోజుల తర్వాత రెండవ పిచికారి చేయాలి. ఈ ప్రక్రియను పూత చిన్న పిందెలుగా మారే థ వరకు కొనసాగించాలి. ఒకసారి చిన్న పిందెలు ఏర్పడటం ప్రారంభమవగానే నెలకొకసారి పిచికారి చేయాలి. పంచగవ్య, వర్మికంపోస్టు ఉపయోగించడం వల్ల కాయల పరిమాణం, సంఖ్య, రంగు పెరుగుతుందని గమనించారు.
సిఫారసు చేసిన పద్దతి: ఒక హెక్టారు క్షేత్రంలోని మామిడి చెట్లపై 25 లీటర్ల పంచగవ్యను 750 – 800 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. 4-5 టన్నుల వర్మింకపోస్టు వేయాలి. పంచగవ్య పిచికారి అన్ని కాయలు కొసే చెట్లలో సాధారణంగా ఆశించే పండు ఈగను సమర్థవంతంగా నివారిస్తుంది. సేంద్రియ ఎరువులు వాడిన చెట్లలో ఆకులు పెద్ద పరిమాణంలో వుండి, చెట్లు గుబురుగా పెరిగి, బలమైన వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. పండ్ల రుచి, నిల్వగుణం కూడా అతి సంతృప్తికరంగా వుంటాయి.
సేంద్రియ సాగుకి అనుకూలమైన మామిడి రకం ‘ఆల్ఫాన్సో’తమిళనాడులో కాంచీపురం, తిరునవ్వేలి జిల్లాలలో మామిడి రకాలలో రాజుగా పేరుగాంచిన అల్ఫాన్సో సేంద్రియ సాగు పద్ధతులలో అధిక దిగబడులనిస్తుంది. ఈ జిల్లాలలోని సన్న, చిన్న కారు రైతులు దీని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు, ఆదాయం పొందారని చెన్నైలోని ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్‌మెంట్ లి. వైస్ ప్రెసిడెంట్ యస్.యస్. నాగరాజన్ చెబుతున్నారు.
ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతకర్త సుభాష్ పాలేకర్ సిఫారసులు సేంద్రియ మామిడి రైతులు ఈ క్రింది పెట్టుబడిలేని వ్యవసాయ పద్ధతులనాచరించి మంచి ఫలితాలు పొందవచ్చు.* తోటవాలుకు అడ్డంగా రెండు మామిడి వరుసల మధ్య ‘ఙ’ ఆకారంలో (3 అ. వెడల్పు, 1.5 అ. లోతు)గాడిని త్రవ్వి గాడిలో కాష్టపదార్థాలు (పంట అవశేషాలు) పరచాలి.* వర్షాకాలం మొదలైన తర్వాత గాడిలోని కాష్ట పదార్థాల మీద జీవామృతాన్ని (200-400 లీ. ఎకరానికి) పోయాలి. జీవామృతం వర్షం నీటితోపాటు అడుగున వున్న భూమి పొరల్లోకి చేరినపుడు భూమిలో సమాధి స్థితిలో వున్న సహజ దేశీయ వానపాములు ఉత్తేజితం చెంది భూమిపైకి మరియు లోపలికి కదులుతూ భూమిలో వుండే పోషకాలను మట్టితోపాటు తింటూ రంధ్రాలు చేస్తూ వాటి విసర్జితాలను భూమి మీద విసర్జిస్తుంటాయి. ఈ విసర్జితాలు అన్ని పోషకాలు కలిగి ఉంటాయి. క్రమంగా గాడిలోని కాష్టపదార్థాలు కూడా కుళ్ళిపోయి పోషకాలతో నిండిన జీవ సేంద్రియ పదార్థం ఏర్పడి మొక్కలకు అన్ని విధాల ఉపయోగపడుతుంది. ఈ విధంగా గుల్లబారిన నేల వర్షపు నీటిని బాగా పీల్చుకుని వర్షాభావ పరిస్థితులలో కూడా మొక్కలకు నీటి కొరత లేకుండా చేస్తుంది. ఇలా ఏర్పడిన సేంద్రియ పదార్థం వాతావరణంలోని తేమను గ్రహించి మొక్కలకు నీటికొరత లేకుండా చేస్తుంది. త్రవ్విన గాడికి రెండు వైపులా ఏకదళ, ద్విదళ బీజ పంటలను పెంచడం ద్వారా, నాలుగు మామిడి చెట్లు మధ్య మునగ చెట్ల వంటి వాటిని పెంచడం వలన వాతావరణంలో అధికంగా వున్న నత్రజని మొక్కలకందుబాటులోకి వస్తుంది.
మామిడి పంటకాలంలో సస్యరక్షణతేనె మంచు పురుగు : * జనవరిలో పూత మొగ్గ బయటపడటానికి ముందు తేనె మంచు పురుగుల నివారణ కొరకు 100 లీ. నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా 300 మి.లీ. 1500 పిపియం అజాడి రిక్టిన్‌తోపాటు 300 గ్రా. నీటిలో కరిగే గంధకం పిచికారి చేయాలి.* ప్రత్యామ్నాయంగా లీటరు నీటికి 3-5 మి.లీ. పంచగవ్య లేదా 50 మి.లీ. జీవామృతం, 3-5 గ్రా. ట్రైకోడెర్మావిరిడి, 2 గ్రా. బివేరియా బాసియానా, లేదా 3 గ్రా. వర్టిసిల్లియం లెకాని కలిపి పిచికారి చేయాలి.* పూత కాడలు లేదా పుగుత్తులు బయటకు వచ్చి, పూలు వికసించడానికి ముందు లీటరు నీటికి 3-5 మి.లీ. పంచగవ్య లేదా 50 మి.లీ. జీవామృతం, 3 గ్రా. వర్చిసిల్లియం, 3-5 గ్రా. బివేరియా బాసియానా, 5 గ్రా. ట్రెకోడెర్మా విరిడి కలిపి పిచికారి చేయాలి.
తామర పురుగులు * ఫిబ్రవరిలో పిందె థలో తేనె మంచు పురుగు, తామర పురుగుల నివారణకు 1500 పిపియం అజాడిరిక్టిన్ లీటరు నీటికి 3 మి.లీ., 5 గ్రా. ట్రెకోడెర్మావిరిడి, 3-5 గ్రా. బివేరియా బాసియానా, 3-5 గ్రా. వర్టిసిల్లియం లెకాని, 50 మి.లీ. జీవామృతం లేదా 3 మి.లీ. పంచగవ్య కలిపి పిచికారి చేయాలి. * 15-20 సంవత్సరాల వయస్సున్న చెట్టుకి 15-20 కి. వర్మికంపోస్టు, 5 లీ. జీవామృతం పాదులో పోసి నీరు పెట్టాలి. వీటితోపాటు చెట్టుకి 100 గ్రా. అజోస్పైరిల్లం, 100 గ్రా. ఫాస్పోబాక్టీరియా వాడితే మరింత ప్రయోజనకరం.* మార్చి-ఏప్రిల్‌లో పిందెలు పెరగటం జరుగుతుంది. ఈ థలో పాదులో 15-20 రోజులకొకసారి నీరు పెట్టాలి.* ఎండలో పెరిగే సమయంలో లీటరు నీటికి 15-20 గ్రా. నీటిలో కరిగే సున్నం కలిపిన ద్రావణాన్ని కాయలపై పిచికారి చేయాలి.* పిందెలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నపుడు వీటిపై టెంక పురుగు గుడ్లను పెడుతుంది. వీటి నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ. వేపగింజల కషాయం పిచికారి చేయాలి.
పండుఈగ : మే-జూన్ నెలలో పండు ఈగ తాకిడికి పండ్లు చెడిపోకుండా కాపాడటానికి కోతకు నెలరోజుల ముందు ఎకరానికి 5-6 మిథైల్ యూజినాల్ పండు ఈగ ఎరలను ఏర్పాటు చేయాలి.
