ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు

సాధారణంగా ఒక మామిడి చెట్టుకు ఒకటి లేదా రెండు రకాల పండ్లే కాస్తుంటాయి. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా దిట్ల గ్రామంలో ఓ చెట్టుకు 12 రకాల పండ్లు కాస్తున్నాయి. రంగు, రుచి, సువాసన, పరిమాణం, బరువుల్లో అవన్నీ వేర్వేరు. 50 గ్రాముల నుంచి 2 కేజీల దాకా బరువున్న మామిడి పండ్లు ఆ చెట్టుకు కాస్తున్నాయి. ఉకాభాయ్‌ అనే రైతుకు చెందిన మామిడితోటలో ఈ చెట్టు ఉంది. అన్ని సీజన్లలోనూ డజను రకాల మామిడి పండ్లు కాస్తుండటం ఈ మామిడి చెట్టు ప్రత్యేకత. మొదటి నుంచీ ఉకాభాయ్‌ మామిడి సాగులోనే ఉన్నారు. అంటుకట్టే పద్ధతి ద్వారా మేలురకం మామిడి వంగడాల తయారీకి ఆయన నిత్యం ప్రయోగాలు చేస్తుంటారు. వీటి ఫలితంగానే 12 రకాల పండ్లను అందించే మామిడిచెట్టు ఏర్పడింది.

ఎలా అంటుకట్టారంటే..
మేలు రకం మామిడి వంగడాల తయారీకి ఉత్తమ లక్షణాలు కలిగిన ఒక మామిడి మొక్కను సేకరించాలి. దాని వేర్ల భాగాన్ని తొలగించాలి. మరో మేలు రకం మామిడి మొక్కను సేకరించాలి. దాని కాండం ఎగువ భాగాన్ని సగానికి పైగా కత్తిరించి తొలగించాలి. ఈ మామిడి మొక్కకు వేర్లు ఉంటాయి. అందువల్ల దీన్నే నేలలో నాటాలి. అనంతరం దీనిలోని సగం కాండంపై, అంతకుముందు మనం సిద్ధం చేసుకున్న మొక్క కాండాన్ని అతికించి కట్టు కట్టాలి. ఇలా ఒకేచెట్టుకు తీరొక్క పండ్లను చూసి ఉకాభాయ్‌ ఉప్పొంగిపోతున్నారు. మామిడి వంగడాల తయారీకి ఇకపైనా తన ప్రయోగాలను కొనసాగిస్తానని ఆయన ‘ఈటీవీ భారత్‌’కు చెప్పారు. ఇలాంటి మామిడి చెట్లు పెద్దసంఖ్యలో అందుబాటులోకి వస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు.

Read More

మామిడి తోటలలో కోత అనంతర యాజమాన్యం

మామిడిని సాగు చేసే రైతులు పూత ప్రారంభమైనప్పటినుండి పురుగులు తెగుళ్ల యాజమాన్యం మరియు పోషకాల యాజమాన్యంను  సరైన సమయంలో చేస్తూ  అధిక దిగుబడి  మరియు నాణ్యమైన దిగుబడిని  పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాని కోత అనంతరం తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వలన తర్వాత సంవత్సరం దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మామిడి కోత తర్వాత  నిర్లక్ష్యం చేయకుండా రైతులందరూ సరైన యాజమాన్యం చేపట్టాలి.

మామిడి తోటల్లో కోత అనతరం తీసుకోవలసిన చర్యలు

1. కొమ్మ కత్తిరింపులు

మామిడిలో పూత రావటం అనేది వాతావరణంతో పాటు కొమ్మల వయస్సుపై కూడా ఆధారపడి ఉంటుంది. పూత వచ్చే సమయానికి కొమ్మలవయస్సు దాదాపు 4-5 నెలలు ఉండాలి. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న కొమ్మలపై పూత రాదు. కాబట్టి కాయ కోత వెంటనే  కత్తిరింపులు చేస్తే కొత్త చిగుర్లు పెరిగి పూత వచ్చేటప్పటికి కొమ్మల వయస్సు పూత రావటానికి అనువుగా ఉంటుంది. 

కొమ్మ కత్తిరింపులను కాయ కోత చేపట్టిన నెల రోజుల తర్వాత మొదలు పెట్టాలి. కాయలు పెరిగిన పూత  కాడలను తొలగించి అక్కడనుండి కొమ్మలను కనీసం 10-15 సెం. మీ. వెనక్కి కత్తిరించాలి. అలాగే బాగా కిందకు వేలాడిన కొమ్మలను తీసేయాలి. చెట్టు లోపలి భాగంలో అడ్డదిడ్డంగా ఒకదానిపై ఒకటిగా పెరిగిన కొమ్మలను తీసివేస్తే చెట్టు లోపల భాగాలలో గాలి, వెలుతురు ప్రసరణకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా చెట్టు లోపల భాగంలో నిటారుగా పెరిగే 2-3 కొమ్మలను (గొడుగు కొమ్మలు) కత్తిరించాలి. కత్తిరింపులు చేసినపుడు కొమ్మలు చీలిపోకుండా జాగ్రత్తగా కత్తిరించాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లలో 25% కన్నా ఎక్కువ కొమ్మలు కత్తిరిస్తే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తెగులు సోకిన కొమ్మలు, ఎండిన కొమ్మలు ఉంటే తీసివేయాలి. కత్తిరించిన కొమ్మలకు శిలీంద్రాలు, బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు సోకకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి.

కత్తిరింపుల వలన లాభాలు

  •   చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకి దిగుబడి పెరుగుతుంది.
  •   తోటలో అంతర కృషి పనులు చేయటానికి అనువుగా వుంటుంది
  •   నాణ్యమైన పండ్ల ఉత్పాదకత పెరుగుతుంది
  •   చెట్టు ఎత్తును అదుపులో ఉంచుకోవచ్చు
  •   ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది.
  •   చీడ పీడల బెడద తగ్గుతుంది.

2. ఎరువుల యాజమాన్యం

కోత తర్వాత చెట్టు తన ఆహార నిల్వలను కోల్పోతుంది కాబట్టి కోత అనతరం తప్పనిసరిగా చెట్టుకు పోషకాలు అందించాలి. కొమ్మ కత్తిరింపులు చేపట్టిన వెంటనే ప్రతి చెట్టుకు వయస్సును బట్టి సిఫార్సు చేసిన ఎరువులను వేసుకోవాలి. కాపుకు వచ్చిన తోటల్లో కత్తిరింపులు తర్వాత తొలకరి వర్షాల సమయంలో ఎరువులు వేసుకొంటే మొక్కకి పోషకాలు అందుతాయి ఒక వేళ వర్షాలు లేనట్లయితే నీటి తడులు ఇచ్చుకోవాలి. ఎరువులను తొలకరిలో అంటే జులై – ఆగష్టు నెలల్లో చెట్లు పాదుల్లో సమంగా చల్లి నేలలో కలిసేలా తిరగబెట్టాలి.  వర్షపాతం ఎక్కువగా ఉన్న  ప్రాంతాల్లో ఎరువులను వర్షాకాలం మొదట్లో ఒకసారి మరలా వర్షాకాలం చివర్లో రెండవసారి వెయ్యాలి.  వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వర్షాకాలం చివర్లో ఒకేసారి వేసుకోవాలి. 

పది సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి చెట్టుకు 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్‌ ను ఇచ్చే ఎరువులను వేయాలి. సేంద్రియ ఎరువులు మరియు జీవన ఎరువులను ఎక్కువగా వేసుకొంటే మంచిది. సేంద్రియ ఎరువులు చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోష్టు 20 కిలోలు తో పాటు 1 కిలో వేపపిండి, 250 గ్రా. చొప్పున  అజిటోబాక్టర్‌ లేదా అజోస్పైరిల్లం ను 25 0 గ్రా. ఫాస్ఫోబాక్టర్‌, 100 గ్రా. ట్రైకోడేర్మావిరిడిని కూడా వేసుకోవాలి.

మామిడిలో సూక్ష్మపోషకాల లోప లక్షణాలు కనిపిస్తే కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత 5 గ్రా. జింక్‌ సల్ఫేట్‌, 2 గ్రా. బోరాన్‌, 2 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌, 2 గ్రా. కాల్షియం సల్ఫేట్‌ను 1 లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. మొక్కలకు అందించే పోషకాలను సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. 

3. కలుపు యాజమాన్యం

మామిడిలో కోత తర్వాత వర్షాలు పడి కలుపు సమస్య ఎక్కువుగా వుంటుంది. కలుపును ఎప్పటికప్పుడు నివారిచుకోవాలి. లేకపోతే మామిడిని ఆశించే చాలా పురుగులు కలుపు మొక్కలపై నివాసం ఏర్పరుచుకొని వాటి జీవిత చక్రాలు  పూర్తి చేసుకొని మామిడిపై ఆసిస్తాయి. కలుపును సమర్ధవంతంగా నివారిచాలంటే తొలకరి వర్షాలు పడిన తర్వాత నేలను 2 సార్లు దున్నుకొని పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి. జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద, నవధాన్యాలు వంటి పంటలను తోటల్లో చల్లుకొంటే వర్షాలకు అవి పెరిగి కలుపు మొక్కలు రాకుండా చేస్తాయి. ఈ పచ్చి రొట్ట పైర్లు పూత థకు రాగానే వాటిని మళ్ళీ నేలలో కలియ దున్నాలి. ఈ విధంగా చేయటం వలన మల్చింగ్‌గా పనిచేసి కలుపు రాకుండా చేయటమే కాకుండా అవి కుళ్ల్లి సేంద్రియ ఎరువుగా మారి నేల సారవంతం పెరుగుతుంది. అంతే కాకుండా కలుపు నివారణకు చేసే ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా తక్కువ ఖర్చుతో కలుపు నివారించుకోవాలి.

4. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం

  •   కాయ కోత అనతరం లోతు దుక్కులు దున్నుకొంటే నేలలో ఉండే పురుగుల గుడ్లు మరియు నిద్రావస్థ థలు బయటపడి నాశనమౌతాయి.
  •  తేనెమంచు పురుగు ఉదృతి కొత్త చిగుర్లు వచ్చే సమయం నుండి ప్రారంభమవుతుంది. వీటి ఉధృతిని అరికట్టాలంటే చెట్ల కొమ్మలను పలచన చేయాలి. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కత్తిరించి చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకేలా చేయాలి. ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోటలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
  •   అక్టోబర్‌లో వర్షాలు లేనట్లైతే ఒకసారి చెట్ల పాదుల్లో నీటితడులు ఇవ్వటం వలన కూడా భూమిలో ఉండే గుడ్లు బయట పడతాయి.
  •  తోటలో రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.
  •  ప్రతి 2 నెలలకు ఒకసారి వేప నూనె 3000 పిపియం 3 మిల్లీ లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణాన్ని చెట్ల కొమ్మలు, మొదలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. దీనివలన  కొమ్మల పగుళ్ళలో దాక్కొని ఉన్న పురుగు కోశస్థ థలు నాశనమై వాటి ఉధృతి తగ్గుతుంది. 
  •   పిండి పురుగులు నివారణకు చెట్ల మొదలు నుండి 1 అడుగు ఎత్తులో 25 సెం.మీ. వెడల్పు ఉన్న 400 గేజు మందం ఉన్న పాలీథీన్‌ షీటుతో చుట్టాలి. ఇలా చేయటం వలన నేలలో ఉండే పిల్ల పురుగుల థలు చెట్టుపైకి పాకకుండా ఉంటాయి. చెట్ల పాదుల్లో వేపపిండి వేయటం వలన కూడా వీటిని నివారించుకోవచ్చు.
  •   పండు ఈగ ఆశించిన కాయలు రాలి ఉంటే వాటిని వెంటనే ఎరివేసి నేలలో లోతుగా కప్పటమో లేదా కాల్చివేయటం చేయాలి.
  •  ఆకు ముడత పురుగులు అల్లిన గూళ్ళను తొలగించి వాటిని కాల్చేస్తే ఆ గూడులో ఉండే గుడ్లు, పిల్ల పురుగు థలు నాశనం అయ్యి తోటలో వాటి ఉధృతి తగ్గుతుంది.
  •  తోటలో మిత్ర పురుగులను రక్షించటం వలన హానికర పురుగుల ఉధృతి అదుపులో ఉండి పంట నష్టం తగ్గుతుంది.
  •   సాధ్యమైనంత వరకు రసాయన మందుల పిచికారీ తగ్గించుకోవాలి. వీటికి బదులు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని  జీవ సంబంధిత మందులు అయినటువంటి వేపనూనె, కానుగ నూనె, బవేరియా బాసియానా, మెటారైజియం వంటి   సురక్షితమైనవి వాడుకొని నివారించుకోవాలి. 

డా. కె. రాధారాణి, ప్రధాన శాస్త్రవేత్త (హార్టీకల్చర్‌), డా. బి. కనక మహాలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త (ప్లాంట్‌ పాథాలజీ) జి. శాలిరాజు, శాస్త్రవేత్త, (ఎంటమాలజీ), మామిడి పరిశోధనా స్థానం, నూజివీడు. ఫోన్‌: 9948977535

Read More

మామిడిలో ఎరువుల యాజమాన్యం – సస్యరక్షణ చర్యలు

మామిడి తొందరగా కాపుకు రావటం, నాణ్యమైన ఉత్పత్తి మరియు అధిక దిగుబడి రావాలంటే మొక్కలు నాటినప్పటి నుండి వాటికి అందించే సమగ్ర ఎరువులపై ఆధారపడి ఉంటుంది.మొక్క వయస్సును బట్టి ఎరువులను అందించాలి.ఒక్కో మొక్కకు మొదటి సంవత్సరం 100 గ్రా. నత్రజని, 100 గ్రా. భాస్వరం, 100 గ్రా. పోటాష్‌ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 100 గ్రా. చొప్పున నత్రజని,  భాస్వరం,  పోటాష్‌ ను పెంచుతూ 10వ సంవత్సరం నుండి ఒక్కో చెట్టుకు కిలో చొప్పున నత్రజని,  భాస్వరం,  పోటాష్‌ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి.మొక్కకు కావలసిని పోషకాలను సేంద్రియ ఎరువు రూపంలో ఎక్కువగా వేసుకోవాలి.

నాలుగు సంవత్సరాల వయస్సు లోపు ఉన్న మొక్కలకు సిఫార్సు చేసిన ఎరువులను 2-3 నెలలకు ఒకసారి దఫాలుగా ఇవ్వాలి.కాపుకు వచ్చిన చెట్లకు మామిడి కోత అయిన వెంటనే సిఫార్సు చేసిన ఎరువులలో 2/3 వ వంతు ఎరువులను వేయాలి. పిందె ఏర్పడిన తర్వాత సిఫార్సు చేసిన ఎరువులలో 4 వ భాగం ఇవ్వాలి. దీనివలన ఎక్కువ దిగుబడి రావటమే కాకుండా తర్వాత సంవత్సరం నిలకడగా కాపు రావడానికి దోహద పడుతుంది. ఎరువులతో పాటు ప్రతి చెట్టుకు 1 కిలో వేప పిండి, 250 గ్రా. చొప్పున అజిటోబాక్టర్‌ లేదా అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టర్‌, పోటాష్‌ సాల్యుబులైజింగ్‌ బాక్టీరియా వంటి జీవన ఎరువులను అందించాలి. 

సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళు కాపుకు వచ్చిన ప్రతి చెట్టుకు జీవన ఎరువులతో పాటు 100 కిలోల పశువుల ఎరువు లేదా 25 కిలోల వర్మీకంపోష్టు వేసుకోవాలి.

ఎరువులను తొలకరిలో అంటే జులై-ఆగష్టు నెలల్లో చెట్లు పాదుల్లో సమంగా చల్లి నేలలో కలిసేలా తిరగబెట్టాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న  ప్రాంతాల్లో ఎరువులను వర్షాకాలం మొదట్లో ఒకసారి మరల వర్షాకాలం చివర్లో రెండవసారి వెయ్యాలి.వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వర్షాకాలం చివర్లో ఒకేసారి వేసుకోవాలి. మామిడి పిందె కట్టిన థ నుండి భుజాలు ఏర్పడేంత వరకు చాలా త్వరగా పెరుగుతాయి.ఈ దశ లో పోషకాలు అవసరం ఎక్కువగా వుంటుంది.నీటి వసతి ఉన్న తోటల్లో సిఫార్సు చేసిన ఎరువు మోతాదులో 4 వ వంతు కాయ గోళీకాయ సైజులో ఉన్నపుడు వేసుకోవాలి. 

సూక్ష్మధాతు లోపాల నివారణ

చాలా మామిడి తోటల్లో సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తున్నాయి. మన రాష్ట్రంలో చాలా తోటల్లో నేలలో సేంద్రియ పదార్దం తక్కువగా ఉంది. దీనివలన మొక్కకు కావలసిన పోషకాలు అందక దిగుబడులు తగ్గుతున్నాయి.

నేలలో సేంద్రియ పదార్దం బాగా పెరగడానికి మామిడి చెట్ల మద్య ఖాళీ స్థలంలో జీలుగ విత్తనాలు  10 కిలోలు ఎకరానికి లేదా జనుము 25 కిలోలు ఎకరానికి చొప్పున లేదా నవధాన్యాలు కానీ తొలకరిలో చల్లుకొని పూత థలో నేలలోకలియ దున్నాలి. ఇలా చేయటం వలన నేలలో సేంద్రియ పదార్దం పెరగటమే కాకుండా కలుపు సమస్య ఉండదు. పెట్టుబడి తగ్గుతుంది.సూక్ష్మధాతు పోషకాల లభ్యత పెరుగుతుంది. అలాగే మేలు చేసే సూక్ష్మ జీవులు పెరిగి నేల బాగా గుల్లబారుతుంది. దీనివలన నేలలోకి నీరు బాగా ఇంకి మొక్కకు అందుతుంది. 

జింకు లోప లక్షణాలు: 

జింకు లోపం సాధారనంగా చౌడు నేలల్లో కనబడుతుంది. జింకు లోపం ఉన్న తోటల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి. మొక్క పెరిగే థలో జింకు లోపిస్తే ఆకులు చిన్నగా మారి సన్నబడి పైకి లేదా కిందకి ముడుచుకు పోతాయి. కణుపుల మద్య దూరం తగ్గిపోయి ఆకులు గుబురుగా ఒకే చోట పెరుగుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి, కాయ పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గుతుంది.

జింకు లోపాన్ని నివారించడానికి 5 గ్రా. జింకు సల్ఫేట్‌ను ఒక లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి లోపాన్ని సవరించుకోవాలి. 

బోరాన్‌ లోప లక్షణాలు

ఆకులు పొట్టిగా ఉండి ఆకు కొనలు నొక్కుకుపోయినట్లుగా మారి పెలుసుబారిపోతాయి.బోరాన్‌ లోపిస్తే కాయ పెరిగే థలో పగుళ్ళు ఏర్పడతాయి.

దీని నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రా. బోరాన్‌ ను చెట్ల పాదుల్లో వేయాలి.అలాగే కొత్తగా చిగుర్లు వచ్చే థలో 1-2 గ్రా. బోరాన్‌ ను లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారి చేసుకోవాలి.

ఇనుప ధాతు లోప లక్షణాలు

సున్నపు నేలల్లో పెంచిన తోటల్లో ఇనుము ధాతు లోపం ఎక్కువుగా కనిపిస్తుంది. ఇనుము లోపిస్తే ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి తెల్లగా మారుతాయి. ఆకుల పరిమాణం తగ్గుతుంది. ఇనుము లోపం తీవ్రత ఎక్కువైతే ఆకులు కొనలు నుండి ఎండుకొంటూ వస్తాయి.  చెట్టు పెరుగుదల తగ్గి కాపు అంతగా రాదు. వచ్చినా కాయ నాణ్యత బాగుండదు.  ఇనుము లోపం తీవ్రత చిన్న మొక్కలలో ఎక్కువైతే మొక్కలు చనిపోయే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.

ఈ లోపాన్ని నివారించాలంటే 2.5 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌ మరియు 1 గ్రా. నిమ్మ ఉప్పు ఒక లీటర్‌ నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో కొత్త  చిగుర్లు వచ్చిన తర్వాత 2 సార్లు చెట్టు మొత్తం తడిచేలా పిచికారి చేయాలి.

పొటాషియం లోప లక్షణాలు

ఆకులు అంచులు మాడిపోవటం అనేది పొటాషియం లోపం యొక్క ప్రధాన లక్షణం.  ఆకు అంచు మాడటం ఆకుకొన నుండి ప్రారంభమై క్రిందికి వ్యాపిస్తుంది.  కాయ నాణ్యత తగ్గుతుంది. చెట్టు చీడపీడలను తట్టుకొనే శక్తి కోల్పోతుంది.

దీని నివారణకు చెట్టుకు సిఫార్సు చేసిన పోటాష్‌ ఎరువు మోతాదును చెట్ల పాదుల్లో వేసి కలియబెట్టాలి. రాలిన ఆకులను నేలలో కలిపి తిరగబెడితే కుళ్ళి సేంద్రియ పదార్ధం పెరిగి చెట్టుకు కావలసిన పొటాషియం మూలకం అందుతుంది.

అన్నిరకాల సూక్ష్మధాతు లోపాలు ఒకేసారి కనిపిస్తే జింకు సల్ఫేట్‌ 5 గ్రా., ఫెర్రస్‌ సల్ఫేట్‌ 2.5 గ్రా., బోరాక్స్‌ 2 గ్రా., కాల్షియం సల్ఫేట్‌ 2 గ్రా., మెగ్నీషియం సల్ఫేట్‌ 2 గ్రా. ఒక లీటర్‌ నీటికి చొప్పున కలిపి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు అంటే జూన్‌-జులై, సెప్టెంబర్‌-అక్టోబర్‌ మరియు డిసెంబర్‌-జనవరి నెలల్లో పిచికారీ చేసుకోవాలి.

అలాగే పూమొగ్గ తొందరగా ఏర్పడటానికి, విచ్చుకోవటానికి 10గ్రా. పొటాషియం నైట్రేట్‌ ను ఒక లీటర్‌ నీటికి చొప్పున కలిపి అక్టోబర్‌ నెలలో పిచికారీ చేయాలి.

సస్య రక్షణ చర్యలు:

  • కాయ కోత అనతరం లోతు దుక్కులు దున్నుకొంటే నేలలో ఉండే పురుగుల గుడ్లు మరియు నిద్రావస్థ థలు బయటబడి నాశనమౌతాయి.
  • తేనెమంచు పురుగు ఉదృతిని అరికట్టాలంటే చెట్ల కొమ్మలను పలచన చేయాలి. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కత్తిరించి చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకేలా చేయాలి.
  • ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
  • తోటలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
  • అక్టోబర్‌లో వర్షాలు లేనట్లైతే ఒకసారి చెట్ల పాదుల్లో నీటితడులు ఇవ్వటం వలన   కూడా భూమిలో ఉండే గుడ్లు బయట పడతాయి.
  • తోటలో రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.
  • ప్రతి 2 నెలలకు ఒకసారి వేప నూనె 3000 పిపియం 3 మిల్లీ లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణాన్ని చెట్ల కొమ్మలు, మొదలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. దీనివలన  కొమ్మల పగుళ్ళలో దాక్కొని ఉన్న పురుగు కోశస్థ థలు నాశనమై వాటి ఉధృతి తగ్గుతుంది. 
  • పిండి పురుగులు నివారణకు చెట్ల మొదలు నుండి 1 అడుగు ఎత్తులో 25 సెం. మీ. వెడల్పు ఉన్న 400 గేజి మందం ఉన్న పాలీతీన్‌ షీటుతో చుట్టాలి. ఇలా చేయటం వలన నేలలో ఉండే పిల్ల పురుగుల థలు చెట్టుపైకి పాకకుండా ఉంటాయి.
  • పండు ఈగ ఆశించకుండా ఉండడానికి కాయలు పక్వథకు చేరగానే ఆలస్యం చేయకుండా కోసుకోవాలి. అలాగే కాయలకు కవర్లు తొడగటం వలన పండు ఈగ బారి నుండి రక్షించవచ్చు.
  • ఒకవేళ అప్పటికే పండు ఈగ ఆశించి కాయలు రాలి ఉంటే వాటిని వెంటనే ఎరివేసి నేలలో లోతుగా కప్పటమో లేదా కాల్చివేయటం చేయాలి.
  • ఆకు ముడత పురుగులు అల్లిన గూళ్ళను తొలగించి వాటిని కాల్చేస్తే ఆ గూడులో ఉండే గుడ్లు, పిల్ల పురుగు థలు నాశనం అయ్యి తోటలో వాటి ఉధృతి తగ్గుతుంది.
  • తోటలో మిత్ర పురుగులను రక్షించటం వలన హానికర పురుగుల ఉధృతి అదుపులో ఉండి పంట నష్టం తగ్గుతుంది.
  • సాధ్యమైనంత వరకు రసాయన మందుల పిచికారీ తగ్గించుకోవాలి. వీటికి బదులు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని  జీవ సంబంధిత మందులు  అయినటువంటి వేపనూనె, కానుగ నూనె, బవేరియా బాసియానా, మెటారైజియం వంటి సురక్షితమైనవి వాడుకొని నివారించుకోవాలి. స్థూల మరియు సూక్ష్మపోషకాలను సేంద్రియ రూపంలో అందుబాటులో ఉన్నవాటిని ఉపయోగిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.

డా. కె. రాధారాణి, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌, డా. బికెఎం లక్ష్మి, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌, డా. జి. స్రవంతి, సైంటిస్ట్‌, మామిడి పరిశోధనా సంస్థ, నూజివీడు.

Read More

లాభసాటి మామిడి సాగు ఎలా?

మామిడి ఉష్ణ మండల  మరియు ఉప  ఉష్ణ మండల వాతావరణానికి అనుకూలం. ఉప ఉష్ణ మండల వాతావరణంలో చలి ఎక్కువైనప్పుడు ఉష్ణోగ్రతలు బాగా తగ్గినప్పుడు లేత కొమ్మలు, లేత ఆకులు అనారోగ్యానికి గురి అవుతాయి, మామిడి అధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌ అల్పఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మరియు వర్షపాతం 300 మి.మీ.వరకు, సముద్రమట్టం నుండి 1200 మీటర్ల ఎత్తు వరకు తట్టుకొని పెరగగలుగుతాయి. వర్షపాతం సమముగా సంవత్సరం అంతా ఉండడం ముఖ్యం. అధిక వర్షాలు, పూర్తి బెట్ట పరిస్థితులలో పూత, పిందె రాలడం జరుగుతుంది. పీహెచ్‌ 6 నుండి 7.5 వరకు బాగా అనుకూలం.

బాగా ప్రాచుర్యం పొందిన రకాలు 

తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన రకాలు: పండూరి మామిడి, ఆల్ఫాన్సో, కొత్తపల్లి కొబ్బరి, చిన్న రసాలు, పెద్ద రసాలు, కేసరి, దసేరి, మల్లికా, నీలం, మెట్టవలస, బొబ్బిలి పీచు, బంగినపల్లి, హిమాయత్‌.

మామిడి గుజ్జు కొరకు: తోతాపురి.  

2 లేదా 3 సార్లు కాపు వచ్చే పచ్చి మామిడి రకాలు: పునాస, రాయల్‌ స్పెషల్‌.

ఎక్కువ ధర గల రకాలు: మియాజకి, రెడ్‌ పాల్మార్‌, హర్‌ వంగ్యా, బనానా మాంగో, బారి 11, కటిమొళి

అంటుకట్టే పద్దతి, ఒకే మొక్కకు అనేక రకాలు అంట్లు కట్టడం 

ఏదయినా విత్తన మొక్కకు (రూట్‌ స్టాక్‌) మనకు కావలిసిన మొక్క కొమ్మను (సయాన్‌) అంటు కట్టడం. 6 నెలల అనంతరం ప్రధాన పొలములో గుంతలు తీసి, ఎరువు వేసి, జీవన ఎరువులు మరియు జీవన శిలీంద్రనాసినితో కలిపి మొక్కలు పెట్టాలి. పెద్ద మొక్కలకు ఒక మొక్కకు అనేక రకాల అంటు కట్టవచ్చు. ఒక మొక్కకు గరిష్టముగా 300 రకాలు అంటు కట్టినారు

మొక్కల సాంద్రత

మొక్కల సాంద్రత పూర్వం ఒక ఎకరాకు 40 మొక్కలు. కోత కోయడం, తెగుళ్లు, కీటకాల నివారణకు పిచికారీ చేయడం  కష్టం, ఖర్చు ఎక్కువ. 

అధిక సాంద్రతలో 200 మొక్కలు, అత్యధిక సాంద్రతలో 400-600 మొక్కలు వేయుచున్నారు. అధిక సాంద్రత, అత్యధిక సాంద్రతలో వేసిన మొక్కలకు ప్రతి సంవత్సరం కొమ్మ కత్తిరింపులు విధిగా చేయాలి. కోత కోయడం, తెగుళ్లు, కీటకాల నివారణకు పిచికారీ చేయడం తేలిక. 

ఆచ్ఛాదనా మరియు పచ్చిరొట్ట పంటలు 

ఆచ్ఛాదన చేయడం వలన మొక్క వేరు వ్యవస్థ వద్ద తేమ ఉండి, సూక్ష్మజీవులు బాగా వృద్ధిచెంది, మొక్క ఆరోగ్యాన్ని కాపాడుతాయి. తీగజాతి మొక్కలు ఉత్తమం. ఉదా|| చిలకడ దుంప. అదనపు ఆదాయం మరియు పశువులకు మంచి ప్రోటీన్‌ గల పచ్చి మేత దొరుకుతుంది

వర్షాకాలంలో మట్టిలో పోషకాలు పెరగడం కోసం ధబోల్కర్‌ పద్దతిలో వివిధ రకాలు విత్తనాలను వేసుకొని 45 రోజుల తరువాత పూత థలో మట్టిలో కలియ దున్నాలి.

మామిడి పూతకు ముందు, తర్వాత అంతర పంటలు, 

మామిడి పూతకు ముందు కీటకాలు, తెగుళ్ళ నిర్వహణ 

మామిడి పూత థ  మరియు పిందె థలో కీటకాలు ఆశిస్తాయి. కావున పూతకు ముందు కనీసం 10 రోజుల ముందుగా పూతకు వచ్చే విధముగా పసుపు రంగు పూలు కలిగిన పంటలు సన్‌ఫ్లవర్‌, ఆవాలు, జనుము వేసుకోవాలి. దీనివలన మిత్ర పురుగులు ఆకర్షింపబడి, కీటకాలను నివారిస్తాయి. కీటకముల వలన మొక్కల ఆకులు, పువ్వులు, కాయలకు కలిగిన గాయాల వలన ద్వితీయ సంక్రమణ ద్వారా తెగుళ్లు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

రసం పీల్చు పురుగుల వ్యర్ధాల వలన ఆకులపై నల్లని మసి వలే ఉండి, కిరణజన్య సంయోగ క్రియ జరగకుండా ఉండడం వలన మొక్క ఆరోగ్యం దెబ్బ తింటుంది. సబ్బు నీరు పలుమార్లు పిచికారీ చెయ్యాలి.

మామిడి మొక్క ఎత్తు ఎక్కువుగాను, గుబురుగాను ఉన్నప్పుడు కీటకాలు నివారించడం కష్టం. బ్లాక్‌ త్రిప్స్‌ (నల్ల తామర) బెడద నివారణ కోసం, అవి ఆశించే మిర్చి పంటను కొద్దిగా వేసుకొని, పలుమార్లు పిచికారీ చేసి నివారించాలి.  

నెల వారీగా చెయ్యవలసిన పనులు ఎరువులు, పోషకాల మరియు కీటకాల, తెగుళ్ళ నిర్వహణ

వివిధ ప్రాంతాలలో సీజన్‌లోను, రకమును బట్టి కోతల పనులు తేడాలుండడం వలన నెలవారీ పనులు సరైన సమయంలో చేపట్టాలి.

జూన్‌, జులై మామిడి కాయ కోత అనంతరం నీరు బాగా పెట్టి పోషకలోప  నివారణ చేపట్టాలి. ఘన జీవామృతం వెయ్యాలి.        ఘనజీవామృతం 2 టన్నుల / 1ఎ + జీవన బ్యాక్టీరియాలు, ఎన్‌పికె మరియు బవేరియా, మెటారైజియం ట్రైకోడెర్మాలు నేల ద్వారా ఎరువుతో ఇవ్వాలి. ఫ్రూట్‌ ఫ్లై ల్యూర్‌లను మార్చాలి.

ఆగష్టు, సెప్టెంబర్‌ కొమ్మ కత్తిరింపులు, తెగుళ్లు, పోషక లోప నివారణ చేపట్టాలి. కలుపు నివారణ పనులు చెయ్యాలి, పచ్చిరొట్ట ఎరువులు వెయ్యాలి. కాండం తొలుచు పురుగు, గమ్మోసిస్‌, విల్ట్‌ గమనించి నివారణ చెయ్యాలి. కాండం తొలుచు పురుగు నివారణకు తూజా పిచికారీ చెయ్యాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువ తేడాలుండడం వలన, మొక్కల భాగాలూ గాయపడడం వలన  గమ్మోసిస్‌, విల్ట్‌ వంటి తెగుళ్ళు వస్తాయి. 

కొమ్మ కత్తిరింపులు గాలి, సూర్యరశ్మి బాగా వచ్చేలా చెయ్యాలి. ఎండు కొమ్మలు తీసివేయాలి. గాయపడిన భాగాలకు ఆవు మూత్రము, ఇంగువ, పసుపు కాషాయం పిచికారీ చెయ్యాలి.

15 రోజుల అనంతరం  మీనామృతం, కిడ్నీ బీన్స్‌ /రాజ్మా, ఉలవలు  మొలకల కషాయం, అగ్నాస్త్రం, ఆవు మూత్రము, ఇంగువ, పసుపు కాషాయం పిచికారీ చెయ్యాలి. లేదా

మీనామృతం, కిడ్నీ బీన్స్‌ /రాజ్మా ఉలవలు  మొలకల ద్రావణం. సూడోమోనాస్‌ లేదా బాసిల్లస్‌ సుబ్టిల్లీస్‌  మరియు  బవేరియా, మెటారైజియం, వెర్టిసీలియం పిచికారీ చేయాలి. 

అక్టోబర్‌, నవంబర్‌ పూత ముందు థ – నత్రజని, బోరాన్‌ పోషక లోపాలు లేకుండా చూసుకోవాలి. ఘన జీవామృతం 2 టన్నులు / ఎకరానికి  వెయ్యాలి. కలుపు నివారణ పనులు చెయ్యాలి, పచ్చిరొట్ట ఎరువులు పూత థలో దున్నాలి.

కీటకాలు, లీఫ్‌ వెబ్‌, తెగుళ్లు లేకుండా ముందు జాగ్రత్తగా తగిన మందులు పిచికారీ చెయ్యాలి. పండు ఈగ నివారణకు పూత కాలం ముందు నుండి ఫ్రూట్‌ ఫ్లై ల్యూర్‌లను పెట్టుకోవాలి.

మీనామృతం, కిడ్నీ బీన్స్‌ /రాజ్మా మొలకల కషాయం, అగ్నాస్త్రం/ నేల వేము కషాయం, ఆవు మూత్రము, ఇంగువ, పసుపు కాషాయం పిచికారీ చెయ్యాలి. లేదా

మీనామృతం, కిడ్నీ బీన్స్‌ /రాజ్మా ఉలవలు  మొలకల ద్రావణం. సూడోమోనాస్‌ లేదా బాసిల్లస్‌ సుబ్టిల్లీస్‌  మరియు  బవేరియా, మెటారైజియం, వెర్టిసీలియం పిచికారీ చేయాలి. 

డిసెంబర్‌, జనవరి మామిడి పూత పొడవుగా ఉంటే, చివర భాగములో ఆడ పూల సంఖ్య ఎక్కువుగా ఉంటుంది. ఎక్కువ కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. పూత థలో-  రసం పీల్చు పురుగులు, తేనె మంచు పురుగులు, సూఠీ మౌల్డ్‌, పౌడర్‌ మిల్డ్యూ ఆశిస్తాయి. ఫ్రూట్‌ ఫ్లై ల్యూర్‌లను మార్చాలి.

మీనామృతం, కిడ్నీ బీన్స్‌ / రాజ్మా మొలకల కషాయం, ఆగ్నాస్త్రం /  నేల వేము కషాయం ఆవు మూత్రం, ఇంగువ, పసుపు కాషాయం కొబ్బరి నీరు, పిచికారీ చెయ్యాలి. లేదా

మీనామృతం, కిడ్నీ బీన్స్‌ /రాజ్మా ఉలవలు  మొలకల ద్రావణం,. కొబ్బరి నీరు  సూడోమోనాస్‌ లేదా బాసిల్లస్‌ సుబ్టిల్లీస్‌  మరియు  బవేరియా, మెటారైజియం, వెర్టిసీలియం పిచికారీ చేయాలి. 

ఫిబ్రవరి, మార్చి మామిడి కాయ పరిమాణం పెరిగే థ – నీరు బాగా పెట్టాలి. పోషకాలు, ఎరువులు అందచేయాలి. ఘన జీవామృతం 2 టన్నులు / ఎకరానికి వెయ్యాలి. ఫ్రూట్‌ ఫ్లె ౖల్యూర్‌లను మార్చాలి. రసం పీల్చు పురుగులు, పౌడరి మిల్డ్యూ ఆశిస్తాయి. మీనామృతం, సొయా  బీన్‌  మొలకల కషాయం, అగ్నాస్త్రం, ఆవు మూత్రం, ఇంగువ, పసుపు కాషాయం పిచికారీ చెయ్యాలి లేదా మీనామృతం, సోయాబీన్‌, ఉలవలు మొలకల ద్రావణం. సూడోమోనాస్‌ లేదా బాసిల్లస్‌ సుబ్టిల్లీస్‌ మరియు బవేరియా, మెటారైజియం, వెర్టిసీలియం పిచికారీ చేయాలి.

ఏప్రియల్‌, మే మామిడి కాయ కోత కాలములో  నీరు తక్కువగా  పెట్టాలి లేదా కోతకు 15 రోజుల ముందుగా నీరు ఇవ్వరాదు. నీరు ఎక్కువైతే పండు తియ్యదనం, నిల్వ సామర్ధ్యం తగ్గుతుంది. ఫ్రూట్‌ ఫ్లై ల్యూర్‌లను మార్చాలి 

మామిడి పూతకు అనుకూల పరిస్థితులు మరియు పంట కాలం

మామిడి పూత వాతావరణమును అనుసరించి వస్తుంది. శీతాకాలంలో రాత్రి అల్పఉష్ణోగ్రత18 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే తక్కువగా ఉన్నప్పుడు అనుకూలం. ఈ ఉష్ణోగ్రత మామిడి రకమును బట్టి కూడా మారుతుంది. అందువలన అన్ని ప్రాంతాలలో ఒకేసారి పూత రాదు. ఒకే ప్రాంతంలో అన్ని రకాలు ఒకేసారి పూతకు రావు. పూత మనకు కనబడడానికి కనీసం 20నుండి 30 రోజులకు ముందు అంతర్లీనంగా ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు16 కి.మీ. లోపుగా ఉండాలి. ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే తక్కువగా ఉండాలి. గాలి వలన తోట చుట్టూ చెట్లు తక్కువ పూత వచ్చే అవకాశం ఉంది, కావున విండ్‌ బ్రేకర్స్‌గా చెట్లు పెంచడం మంచిది. ఈ కాలంలో సైక్లోన్‌ వలన పూత తక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ కొంతమంది దానిని వేరే విధముగా వక్రీకరిస్తున్నారు. పూతకు ముందు చెట్లకు నీరు ఉన్నప్పటికీ దాని ప్రభావం పూత మీద ఉండదు. ఈ కారణం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదే నిజమైతే కోస్తా, నీటి వనరులు ఉన్న ప్రాంతాలలో పూత రాకూడదు. కానీ అలా జరగడం లేదు. చీడ పీడలు లేకుండా, బోరాన్‌, నత్రజని వంటి పోషక లోపాలు లేకుండా చెట్లు ఉండేలా చూసుకోవాలి. వీటి ప్రభావం, పూత మరియు ఆడ పూల సంఖ్య మీద ఉంటుంది.

నైరుతి రుతు పవనాల ప్రదేశాలలో ముందుగాను, వరుసగా కేరళ, పశ్చిమ కర్ణాటక, తెలంగాణ, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లలో ఫిబ్రవరి నుండి  జూన్‌ వరకు, ఈశాన్య రుతు పవనాల వలన దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమ, తమిళనాడు పాంతాలు అనంతరం ఉత్తర భారతదేశంలో ఆగష్టు వరకు మామిడి కోతకు వస్తుంది.

పండు ఈగ నిర్వహణకు ల్యూర్‌లు పెట్టడం 

పండు ఈగ వలన, మామిడిలో నష్టం విపరీతంగా ఉన్నది. దీని నివారణకు పూత కాలం ముందు నుండి ఫ్రూట్‌ ఫ్లై ల్యూర్‌లను పెట్టుకోవాలి. ల్యూర్‌ లను ఆగష్టు వరకు ప్రతి నెల క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి. చాలా మంది రైతులు కోతకు ఒక నెల ముందు మాత్రమే పెట్టుచున్నారు. దీనివలన ఎక్కువ ఫలితం ఉండదు. సామూహికంగా పెట్టడం వలన మెరుగయిన ఫలితాలు ఉంటాయి.

మామిడి పిందె దశ –  కీటకాలు, తెగుళ్ల నిర్వహణ అకాల వర్షాలు –  ఆంత్రాక్నోస్‌ 

మామిడి పిందె థ లేదా పూత ఫలదీకరణం చెందటం. దీనికి అనువైన ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్‌. ఈ ఉష్ణోగ్రతలో పువ్వులు కాయలుగా ఎక్కువగా మారుతాయి. మొదటి పూత కంటే రెండవసారి వచ్చిన పూతలో ఫలదీకరణ శాతం ఎక్కువగా ఉంటుంది 

కీటకముల వలన మొక్కల ఆకులు, పువ్వులు, కాయలకు కలిగిన గాయాల వలన ద్వితీయ సంక్రమణ ద్వారా తెగుళ్లు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతల తేడా 15 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువగా ఉన్నా లేదా వేసవి కాలంలో వర్షాలు వచ్చినప్పుడు తెగుళ్లు ఎక్కువగా సోకుతాయి.

అకాల వర్షాల వలన, మామిడి కాయల మీద మంగు మచ్చలు రావడం, క్రుళ్ళిపోవడం జరుగుతుంది. అకాల వర్షాల వలన ఆంత్రాక్నోస్‌ వంటి తెగుళ్ళు వస్తాయి, దీని నివారణకు సుడోమోనాస్‌ లేదా బాసిల్లస్‌ సుబ్టిల్లీస్‌ పిచికారీ చేయాలి. 

మామిడి పండ్లు కోత, అనంతరం పాటించవలసిన జాగ్రతలు

మామిడి పండ్లు కోతకు 40శాతం రంగు వచ్చినవి ఎంపిక చేసుకొని కొయ్యాలి. కాయలు క్రింద పడేలా కోయకూడదు, దెబ్బలు తగలకుండా కొయ్యాలి. అనంతరం సొన కాయకు అంటుకోకూడదు. కాయముచ్ఛిక పొడవుగా ఉండాలి. కాయలను 52 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో 2 నిముషాలు ఉంచడం వలన అంత్రాక్నోస్‌ వ్యాప్తి నివారింపబడుతుంది. ఇత్లీన్‌ వాయువును పంపించి మరింత బాగా పక్వానికి వచ్చేలా చెయ్యడం ఆధునిక పద్దతి. టమోటాలు, ముగ్గిన అరటిపండ్లు ఉంచి పక్వానికి వచ్చేలా చెయ్యడం పూర్వ పద్దతి.

మామిడిలో తియ్యదనం పరీక్షించడానికి రిఫ్రాక్టోమీటర్‌ను ఉపయోగిస్తారు. దీనినే బ్రిక్స్‌ అంటారు. ఇది 20 కంటే ఎక్కువగా ఉంటే బావుంటుంది. పండూరికి బ్రిక్స్‌ 28 వరకు ఉంటుంది.

ప్రాసెసింగ్‌: పచ్చి మామిడి కాయలను తురిమి ఎండబెట్టి చూర్ణం చేసి ఆమ్‌ చూర్‌గా అమ్మవచ్చు.

మామిడి పండును శీతల గిడ్డంగులలో ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము. కావున పండును జ్యూస్‌గా చేసి 80 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద వేడి చేసి వాక్యూమ్‌ ప్యాకింగ్‌ చేసి ఒక సంవత్సరానికి పైగా శీతలీకరణ లేకుండా నిల్వ ఉంచుకోవచ్చు.

మరిన్ని వివరములు కొరకు మా వెబ్‌సైట్‌ను వీక్షించండి.

www.gaps.org.in/telangana

Mango website

http://plumware.in/plumware/mysql/poc_agri.php

ఎం. సుబ్రమణ్యంరాజు,  HEART Trust, మేనేజింగ్‌ ట్రస్టీ, హైదరాబాద్‌, ఫోన్‌: 7659855588

Read More

మామిడిలో కొమ్మ కత్తిరింపులు, యాజమాన్య పద్ధతులు

మామిడి పంటకు మనదేశం ప్రసిద్ధి చెందినది. మామిడి సాగులో మనదేశం మొదటి స్థానంలో, ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో మనదేశం వాటా దాదాపుగా 65 శాతం వరకు ఉంది. ఉత్పత్తిలో మనదేశం ముందు ఉన్నప్పటికీ ఉత్పాదకతలో  మిగతా దేశాలతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నాము. అంతే కాకుండా గత థాబ్దకాలంలో ఉత్పత్తి కూడా హెక్టారుకు 8.1 టన్నుల నుండి 5.5 టన్నులకు పడిపోయింది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో రకాల లభ్యత మరియు వైవిధ్యం చాలా ఎక్కువ. వివిధ రకాల అవసరాలకు (పచ్చళ్ళు, రసాలు, కోత రకాలు మొదలైనవి) అనువైన రకాలు చాలా వున్నాయి. కాబట్టి ప్రపంచ మార్కెట్లో మన వాటా పెంచడానికి, ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా కత్తిరింపులు చేపట్టడం చాల అవసరం.

కత్తిరింపుల వలన లాభాలు

  • ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది.
  • చెట్టుకు గాలి వెలుతురు బాగా సోకి దిగుబడి పెరుగుతుంది.
  • తోటలో అంతర కృషి పనులు చేయటానికి అనువుగా వుంటుంది
  • నాణ్యమైన పండ్ల ఉత్పాదకత పెరుగుతుంది.
  • చీడ పీడల బెడద తగ్గుతుంది.
  • చెట్టు ఎత్తును అదుపులో ఉంచుకోవచ్చు

ఈ కత్తిరింపుల ప్రక్రియ  మొక్క వయస్సును బట్టి చేపట్టాలి. లేత మొక్కలలో ఒకరకంగా, కాపుకు వచ్చిన తోటల్లో ఒకరకంగా, ముదిరిన తోటల్లో ఒకరకంగా చేయాలి.

లేత తోటలలో కత్తిరింపులు 

మొక్కై వంగనదే మానై వంగదు అనే సామెత మన అందరికి తెలిసిందే. మొక్క థలోనే మామిడిని మంచి ఆకారంతో పెంచుకోవాలి. మొక్క నాటిన తర్వాత కాండం బలంగా పెరగడానికి ఒక మీటరు ఎత్తు వరకు పక్క కొమ్మలు లేకుండా పెరగనివ్వాలి. ఆ తర్వాత మొక్క మొదలు నుండి 70 సెం. మీ. ఎత్తులో కాండాన్ని అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో కత్తిరించాలి. తర్వాత అక్కడ నుండి ప్రధాన కొమ్మలు పెరుగుతాయి. నాలుగు వైపులా పెరిగిన 4 ప్రధాన కొమ్మలను మాత్రమే పెరగనిచ్చి 1 మీ. పొడవు పెరిగిన తర్వాత 70 సెం. మీ.కు కత్తిరిస్తే అక్కడనుండి ద్వితీయ కొమ్మలు పెరుగుతాయి. ప్రతి ప్రధాన కొమ్మపై 2-3 ద్వితీయ కొమ్మలను మాత్రమే సమాన దూరంలో పెరగనివ్వాలి. అలాగే ప్రతి ద్వితీయ కొమ్మపై 2 -3 తృతీయ కొమ్మలను పెరగనిచ్చి మిగతా కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన చెట్టు నిటారుగా పెరగకుండా గుబురుగా పెరిగి దిగుబడి పెరుగుతుంది. ఈ కత్తిరింపులు చేసినపుడు ఎండిన కొమ్మలు, తెగులు సోకిన కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు తీసివేయాలి.

కాపుకు వచ్చిన తోటల్లో కత్తిరింపులు

మామిడి కాయలు కొమ్మల చివర్లలో గుత్తులుగా కాస్తాయి. కనీసం 6-8 వారాల వయస్సు పై బడిన కొమ్మలపై మాత్రమే పూత వస్తుంది. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న  కొమ్మలపై పూత రాదు. కాబట్టి కాయ కోత వెంటనే  కత్తిరింపులు చేస్తే కొత్త చిగుర్లు పెరిగి పూత వచ్చేటప్పటికి వాటి వయస్సు 8 వారాలపైనే ఉంటుంది. కాపుకు వచ్చిన తోటల్లో రెండు సార్లు కత్తిరింపులు చేసుకోవాలి.

మొదటి కత్తిరింపులు

మొదటి కత్తిరింపులు కాయ కోత వెంటనే చేపట్టాలి. కాయలు పెరిగిన పూత  కాడలను తొలగించి అక్కడనుండి కొమ్మలను కనీసం 10-15 సెం. మీ. వెనక్కి కత్తిరించాలి. అలాగే బాగా కిందకు వేలాడిన కొమ్మలను తీసేయాలి. చెట్టు లోపలి భాగంలో అడ్డదిడ్డంగా ఒకదానిపై ఒకటిగా పెరిగిన కొమ్మలను తీసివేస్తే చెట్టు లోపల భాగాలలో గాలి, వెలుతురు ప్రసరణకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా చెట్టు లోపల భాగంలో నిటారుగా పెరిగే 2-3 కొమ్మలను కత్తిరించాలి. కత్తిరింపులు చేసినపుడు కొమ్మలు చీలిపోకుండా జాగ్రత్తగా కత్తిరించాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లలో 25% కన్నా ఎక్కువ కొమ్మలు కత్తిరిస్తే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తెగులు సోకిన కొమ్మలు, ఎండిన కొమ్మలు ఉంటే తీసివేయాలి.

రెండవసారి కత్తిరింపులు

రెండవసారి కత్తిరింపులు పూతకు ముందు అంటే నవంబర్‌ – డిసెంబర్‌ నెలల మధ్యలో చేయాలి. ఈ కత్తిరింపులు 1-2 వారాల్లో పూర్తి చేయాలి. ఈ కత్తిరింపుల్లో భాగంగా పూతకు ముందు ఏవైన కొత్త చిగుర్లు వస్తే 10-15 సెం మీ. వెనక్కి (ముదురు భాగం వరకు) కత్తిరించాలి. లేకపోతే ఆ కొమ్మలపై పూత రాదు. అలాగే బాగా కిందకు వేలాడి నేలను తాకే కొమ్మలను తీసేయాలి. ఈ థలో కూడా చెట్టు మధ్యలో లోపలి భాగంలో వత్తుగా పెరిగిన కొమ్మలు లేదా కొమ్మ భాగాలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మ భాగాలను తీసేసి గాలి, వెలుతురు సోకేటట్లు చేయాలి. దీనివలన కాయలు పండిన తర్వాత మంచి రంగు సంతరించుకొని నాణ్యంగా ఉండి అధిక ధర పలుకుతాయి. 

ముదిరిన తోటల్లో కత్తిరింపులు

మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు 50-60 సంవత్సరాలు పైబడినవే ఉండటం వలన వాటి ఉత్పత్తి తగ్గి ఆదాయం రావటం లేదు. ఈ ముదురు తోటలు  ఎత్తుగా ఉండడం వలన సస్య రక్షణ చర్యలు చేపట్టడానికి కూడా అనువుగా ఉండక దిగుబడులు తగ్గుతున్నాయి. అందువలన రైతులు వాటి యాజమాన్యం చేపట్టలేక ముదురు తోటలను తొలగించి వాటి స్థానంలో వేరే పంటలు అంటే నీటి వసతి ఉన్న వాళ్ళు ఆయిల్‌ పాం తోటలు నీటి వసతి లేని వాళ్ళు మళ్ళీ అంటు కట్టిన మామిడి మొక్కలను నర్సరీలనుండి తెచ్చుకొని వేసుకొంటున్నారు. మళ్ళీ కొత్తగా వేసుకోవటం వలన పెట్టుబడి ఎక్కవ అవటమే కాకుండా వాటి నుండి ఆదాయం పొందడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ నష్టాన్ని భరించాలంటే కొత్త మొక్కలు వేసుకోకుండా ఉన్న ముదురు తోటలని పూర్తిగా తొలగించకుండా వాటి వేరు వ్యవస్థను ఉపయోగించుకొని ఎక్కువ పెట్టుబడి లేకుండా ప్రూనింగ్‌ పద్ధతి ద్వారా వాటిని సులభంగా పునరిద్ధరించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు.

బాగా ఎత్తుగా పెరిగిన ముదురు చెట్ల కొమ్మలను భూమట్టం నుండి అంటే ఎక్కడైతే కొమ్మలు ఏర్పడతాయో అక్కడ నుండి ఒక అడుగు ఎత్తు వరకు ఉంచి కత్తిరించాలి. అన్ని కొమ్మలు ఒకే సారి కత్తిరించకుండా ఒక వైపు ఉన్న కొమ్మలను ఉంచి వేరొక వైపు ఉన్న కొమ్మలను కత్తిరించుకోవాలి. ఇలా చేస్తే కత్తిరించిన కొమ్మలపై మళ్ళీ చిగుర్లు వచ్చే వరకు కావలసిన పోషకాలను మిగతా సగం కొమ్మల నుండి (కత్తిరించకుండా చెట్టుపై వదిలేసిన కొమ్మలు) పొందుతుంది. అంతే కాకుండా ఈ కొమ్మలనుండి ఎంతో కొంత దిగుబడిని పొందవచ్చు. కత్తిరించిన కొమ్మలపై కొన్ని వారాల తర్వాత చిగుర్లు వస్తాయి. ఇలా వచ్చిన చిగుర్లను ఒక్కో  కొమ్మకు 4 వైపులా 25-30 సెం.మీ. దూరంలో వచ్చిన బలమైన కొమ్మలు మాత్రమే ఉంచి మిగతావి ఎప్పటికప్పుడు వచ్చినవి వచ్చినట్టే తీసేయాలి.

ఒకవేళ ముదురు తోటలు టెంకల  ద్వారా పెరిగినవి అయితే ప్రూనింగ్‌ తర్వాత పెరిగిన కొమ్మలపై మనకు నచ్చిన లేదా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ గిరాకీ ఉండే రకాలను గ్రాఫ్టింగ్‌ చేసుకోవచ్చు. గ్రాఫ్టింగ్‌ చేసిన భాగం అతుక్కొన్న తర్వాత అతుకు కింద భాగం పై వచ్చిన చిగుర్లను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇలా చేసిన చెట్ల నుండి 3 సంవత్సరాల్లో దిగుబడి పొందవచ్చు.

కత్తిరింపులు చేసేటప్పుడు కొంచెం ఏటవాలుగా చేయాలి. లేకపోతే వర్షం పడినపుడు నీరు కొమ్మలపై ఉండిపోయి శిలీంద్రాలు ఆశించి చెట్లు చనిపోయే అవకాశంఉంటుంది. కొమ్మలు కత్తిరించిన ప్రతి సారి కత్తిరించిన ప్రదేశంలో బోర్దో పేస్టు పూయాలి.

కత్తిరింపుల తర్వాత యాజమాన్యం

కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టు వయస్సును బట్టి సిఫార్సు చేసిన ఎరువులను వేసి నీటి తడులు ఇవ్వాలి.

ఎక్కువుగా సేంద్రియ ఎరువు మరియు జీవన ఎరువులను వేసుకోవాలి. కాపుకు వచ్చిన తోటల్లో మొదటి కత్తిరింపుల తర్వాత తొలకరి వర్షాల సమయంలో ఎరువులు వేసుకొంటే మొక్కకి పోషకాలు అందుతాయి ఒక వేళ వర్షాలు లేనట్లయితే నీటి తడులు ఇచ్చుకోవాలి.

కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత సూక్ష్మధాతు (జింకు, బోరాన్‌, ఇనుము మొదలైన) లోపాలు గమనిస్తే జింక్‌ 2-5 గ్రా., బోరాన్‌  1-2 గ్రా. ఐరన్‌ సల్ఫేట్‌ 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ 2 గ్రా. ఒక లీటర్‌ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నీటి యాజమాన్యాన్ని, పురుగులుా, తెగుళ్ల యాజమాన్యాన్ని సరైన సమయంలో చేసుకోవాలి.

కాబట్టి రైతులు ఈ విధంగా కత్తిరింపులు చేసుకొని తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్లైతే నాణ్యమైన దిగుబడి వచ్చి అధిక ఆదాయాన్ని పొందుతారు.        దీ

డా. కె. రాధారాణి, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ (హార్టి), డా. బి.కె.ఎం. లక్ష్మి, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ (ప్లాంట్‌ పథాలజీ) మరియు డా. జి. స్రవంతి, సైంటిస్ట్‌ (ఎంటమాలజీ), మామిడి పరిశోధనా స్థానం, నూజివీడు. 

Read More

విలువ జోడింపుతోనే మామిడి సాగు లాభదాయకం

పండ్లలో రారాజుగా మామిడిని పిలుస్తారు. మామిడి పండుకు ఉండే రుచి వలన ఆ పండుకు ఆపేరు వచ్చింది. మన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా మామిడి పండును బాగా ఇష్టపడుతుంటారు. కానీ అన్ని దేశాల వాతావరణాలు మామిడి పంటకు అనుకూలం కాదు కాబట్టి పండే దేశాల నుండి దిగుమతి చేసుకుని మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తుంటారు. ప్రజలకు మధురానుభూతిని అందించే మామిడి పండు రైతులకు లాభాలను చేకూర్చుతుందా అంటే జవాబు కాదు అని వస్తుంది. మామిడి సాగు చేసే రైతులు చాలా వరకు సరైన లాభాలు ఆర్జించలేకపోతున్నారు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉంటే దిగుబడి ఉండదు. రెండూ ఉంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన కాయలు రాలిపోతవి. సాధారణంగా మామిడి కాయలు మార్చి, ఏప్రియల్‌, మే, జూన్‌ మాసాలలో (కొన్ని రకాలు తప్ప) ఎక్కువ రకాలు దిగుబడులను ఇస్తాయి. కానీ ఈ మాసాలలో వాతావరణంలో మార్పులు జరిగి  విపరీతంగా గాలులు రావడం జరుగుతుంది. గాలి ఎక్కువగా వచ్చిన సందర్భాలలో మామిడి కాయలు చాలా వరకు రాలిపోతుంటాయి. అలా రాలి పోయిన కాయలను రైతులు అయినకాడికి అమ్ముకొని ఎంతో కొంత వచ్చిందని సర్దుకుపోతుంటారు. అన్నీ ఒడిదుడుకులు తట్టుకుని దిగుబడిని మొత్తాన్ని సరైన ధరలకు అమ్ముకోగలిగితే మామిడి సాగు లాభదాయకంగా ఉంటుంది. లేదంటే మామిడి రైతులు నష్టాలు భరించవలసిందే. దానికి సరైన పరిష్కారం విలువ జోడింపే అని మామిడికి వివిధ రకాలుగా విలువ జోడించి మామిడితో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తూ తన మామిడి సాగును లాభాల బాటలో నడిపిస్తున్నాడు కృష్ణాజిల్లా జి.కొండూరు ప్రాంతానికి చెందిన ఎం. నారాయణ ప్రసాదు.

నారాయణ ప్రసాదుది వ్యవసాయ నేపధ్యమైనాకానీ ఇంజనీరింగు వరకు చదువుకుని తన ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో వివిధ రకాల పరిశ్రమలకు సలహాలు ఇస్తుంటారు. వీరికి 50 సంవత్సరాల పైబడ్డ వయస్సు గల 50 ఎకరాల మామిడితోట ఉంది. అయినా కాని మామిడి సాగుపై అంత శ్రద్ధ పెట్టకుండా వచ్చిన కాడికి ఆదాయం పొందుతూ తన ఇంజనీరింగ్‌ వృత్తిలో కొనసాగుతున్న సమయంలో 2014 వ సంవత్సరంలో విజయవాడలో సుభాష్‌పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ పద్ధతిలో ప్రధానంగా ఒక దేశీ ఆవుతో 30 ఎకరాలు సాగు చేయగల పద్ధతి వారికి బాగా నచ్చి అటు వైపు ఆలోచించి తన మామిడి తోటలో సేంద్రియ పద్ధతులు పాటించాలని తలచి 2014 నుంచి తన మామిడి తోటలో పూర్తి సేంద్రియ పద్ధతులు పాటించడం మొదలు పెట్టి కొనసాగిస్తున్నాడు.

సేంద్రియ పద్ధతులు పాటించడము మొదలు పెట్టిన తరువాత అందుకు అవసరమైన దేశీయ ఆవుల పోషణ మొదలు పెట్టి వాటి వ్యర్థాలను తన మామిడి తోట సాగులో వినియోగిస్తున్నాడు. పాదులలో మాగిన పశువుల ఎరువు క్రమం తప్పకుండా అందించడంతో పాటు ఘనజీవామృతం, ద్రవ జీవామృతాలను కూడా అవసరాన్ని బట్టి క్రమం తప్పకుండా అందిస్తూ వస్తున్నాడు. చీడపీడల నివారణకు వేపనూనె, వేప కషాయం, పుల్లటి మజ్జిగలను పంటపై క్రమం తప్పకుండా ఉపయోగించడంతోపాటు లింగాకర్షక ఎరలను, పండుఈగ బుట్టలను కూడా ఏర్పాటు చేస్తుంటాడు. మామిడి తోటలో ఎత్తులో ఉన్న కాయలకు కవరు తొడగడము ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మధ్యస్థంగా ఉన్న కాయలకు కవరు తొడుగుతున్నాడు. కవరు తొడిగిన కాయలు నాణ్యత పెరిగింది కాబట్టి మంచి ధరకు అమ్మగలుగుతున్నాడు. యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటిస్తే పెద్ద వయస్సు ఉన్న మామిడి చెట్టు నుంచి కూడా మంచి దిగుబడిని సాధించవచ్చని నిరూపిస్తున్నాడు.

మామిడి సాగులో మంచి ఆదాయం రావాలంటే మామిడికాయల వృథాను తగ్గించగలగాలి. ఇందుకు గాను కొన్ని కాయలను ఆమ్‌చూర్‌ తయారు చేయడానికి, కొన్ని పండ్లను మామిడి తాండ్ర తయారు చేయటానికి, కొన్నింటిని మామిడి పండ్లుగా అమ్మకం చేస్తున్నాడు. ఏది ఏమయినా కాని తన మామిడి తోటలో సాధించిన దిగుబడి ఏమాత్రం వృథాకాకుండా పంట మొత్తాన్ని అమ్ముకోగలుగుతున్నాడు. తన మామిడి తోటలో తోతాపురి, రసాలు, బంగినపల్లి, అల్ఫోన్సా లాంటి మామిడి రకాలను సాగు చేస్తున్నాడు.

మామిడి తాండ్ర: సరైన ధరకు అమ్మకం చేయలేని మామిడి పండ్ల నుంచి మామిడి తాండ్రను తయారు చేస్తున్నాడు. ఇందుకు గాను అప్పట్లో 8 లక్షలు ఖర్చు చేసి డ్రయ్యరును కొనుగోలు చేసుకున్నాడు. మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి మిక్సీ సహాయంతో మామిడి గుజ్జు చేసి అందులో పూర్తి సేంద్రియంగా తయారు చేసిన బెల్లాన్ని కలిపి అవసరమైనంత మందంలో ట్రేలలో పోసి ట్రేలను డ్రైయ్యరులో పెట్టినట్లయితే గంటకు రెండు లీటర్ల నీళ్ళు ఆవిరి అయిపోతాయి. అందులో ఉన్న నీటిశాతాన్ని బట్టి గట్టిగా తయారయిన తరువాత ట్రేల నుంచి తీసి అవసరమయినంత కొలతల ప్రకారం ముక్కలుగా కోసి మామిడి తాండ్రను అమ్మకం చేస్తున్నాడు. మామిడి కాయలకంటే రెండు, మూడు రెట్ల అధిక ధరకు మామిడి తాండ్రను అమ్మగలుగుతున్నారు.

ఆమ్‌చూర్‌ తయరీ: ఆమ్‌చూర్‌కి గిరాకి రోజురోజుకి పెరుగుతూ ఉంది. మన దేశంలోనే కాకుండా కొన్ని ఇతర దేశాలలో కూడా ఆమ్‌చూర్‌ని ఉపయోగిస్తున్నారు. పుల్లగా ఉన్న కాయలు ఆమ్‌చూర్‌కి ఉపయోగిస్తుంటారు. రాలిపోయిన కాయలు లేదా పండించడానికి అవకాశాలు లేని కాయలతో ఆమ్‌చూర్‌ తయారు చేస్తున్నారు. ఇందుకు గాను కాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి డ్రై చేస్తున్నాడు. మామిడి ముక్కలను డ్రై చేయడానికి తన ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో సుమారు 8 లక్షల వ్యయంతో 60þ20 అడుగులలో పాలీ డ్రైయ్యరును తయారు చేసుకున్నాడు బయట కంటే ఈ డ్రయ్యరులో సుమారు 15 సెంటిగ్రేడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టే త్వరగా ఎండుతున్నాయి. ఈ డ్రయ్యరును ఆమ్‌చూర్‌ తయారీకి, పొదీనా పొడి తయారీకి, అల్లంతో శొంఠి తయారీకి ఉపయోగిస్తున్నాడు. తన మామిడితోటలో అంతర పంటలుగా పొదీనా మరియు అల్లంలను సాగు చేస్తూ వాటిని పొడి చేస్తున్నారు. పచ్చి అల్లంకి మార్కెట్‌లో మంచి ధర లభించడం లేదు కనుక అల్లంని ఎండబెట్టి శొంఠి పొడిచేసి కిలో 150/-లకు అమ్మకం చేస్తున్నాడు. ఆమ్‌చూర్‌ పొడిని కిలో రూ. 300/- నుంచి రూ. 400/- లకు అమ్మకం చేస్తూ వృథా మామిడి కాయల నుంచి కూడా ఆదాయం పొందుతున్నాడు. 

మామిడిపండ్లు మాగబెట్టుట: మామిడి పండ్లను మాగబెట్టటానికి 24 టన్నుల సామర్థ్యం గల గదిని నిర్మించుకుని ఆ గదిలో తన ఇంజనీరింగ్‌ ఆలోచనతో స్లాండ్లు ఏర్పాటు చేసుకుని మామిడి పండ్లను మాగబెడుతున్నాడు. ఇందుకుగాను తయారయిన కాయలను చెట్టు నుంచి చిక్కం సహాయంతో కోసి స్టాండ్లలో ఏర్పాటు చేసిన గడ్డిపై అమర్చి కొంతకుళ్ళిన టమాటాలు లేదా కుళ్ళిన అరటి పండ్లను ఆ గదిలో ఉంచడం జరుగుతుంది. ఈ కుళ్లిన అరటి లేదా టమాటాల నుంచి ఇథలిన్‌ అనే గ్యాసు ఉత్పత్తి అయ్యి మామిడి కాయలను పండించటానికి ఉపయోగపడుతుంది. హానికారకమైన కార్బైడ్‌ లాంటి పొడులను ఉపయోగించకుండా సహజ సిద్ధంగా పండించి నాణ్యత దెబ్బతినకుండా అట్టపెట్టెలలో స్టాక్‌ చేసి వినియోగదారులకు అందిస్తున్నాడు. కొంతమంది వినియోగదారులు నేరుగా తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు.

అన్ని రకాల మెలకువలు పాటిస్తూ పూర్తి సేంద్రియ పద్ధతులతో మామిడి సాగు చేస్తూ దిగుబడి వృధా కాకుండా మామిడి పండ్లు, ఆమ్‌చూర్‌, మామిడి తాండ్రలుగా అమ్మకం చేస్తూ తన మామిడి సాగును లాభాల బాటలో నడిపిస్తున్నాడు.

మరిన్ని వివరాలు 95155 04531 కి ఫోను చేసి తెలుసుకోగలరు.   – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

మామిడి సాగు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 13 లక్షల ఎకరాల్లో మామిడి తోటలను రైతులు పెంచుతున్నారు. సాలీనా 25-30 లక్షల టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తిచేస్తున్నారు. అయితే మంచి సాగుపద్ధతులు పాటించి మరింత దిగుబడితోపాటు నాణ్యమైన పండ్ల ఉత్పత్తులను పొందవచ్చు. మన మామిడి పండ్లకు అనేక దేశాల్లో మంచి గిరాకీ ఉన్నప్పటికీ ఆయా దేశాలు నిర్దేశించిన గరిష్ఠ పరిమితులను మించి వీటి అవశేషాలు ఉండటం వల్ల ఆశించిన రీతిలో మామిడి ఎగుమతులను పెంచలేక పోతున్నాం. గత ఒకటిన్నర థాబ్దాల నుండి అభివృద్ధి చెందిన దేశాలన్నీ విషరహితమైన సేంద్రియ ఆహారాన్ని కోరుకుంటున్నారు. ఈ ఉత్పత్తులకు దేశవిదేశాల్లో గిరాకీ పెరుగుతోంది. దీనివల్ల ఔత్సాహిక వ్యవసాయదారులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అధిక ధరలను పొందుతున్నారు. మామిడిలో కూడా సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లకు దేశవిదేశాల్లో డిమాండ్‌ నానాటికీ పెరుగుతోంది. మామిడి రైతులకు నూతన మంత్రం సేంద్రియ సాగు

రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో మామిడితోలను సాగు చేయడంవల్ల చెట్లకు పురుగులు, తెగుళ్ళను తట్టుకునే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. యునైటెడ్‌ కింగ్డమ్‌ భారతదేశం నుండి ఎగుమతి అయ్యే మామిడి పండ్లపై నిషేధం విధించిన్నప్పటికీ సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడి పండ్లకు కొత్త మార్కెట్లలో డిమాండ్‌ వుందని రైతులు నమ్ముతున్నారు. సేంద్రియ వ్యవసాయంవల్ల రైతులకు సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు, ఆదాయం లభిస్తుంది. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక డిమాండ్‌ వుంది. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్లను వెతుక్కోనవసరం లేదు. కస్టమర్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుని నేరుగా రైతుల నుండి సరుకును కొంటారు. సూరత్‌, నవసారి, వేల్సాడ్‌లో మామిడి సాగులో వున్న 57,000 హెక్టార్లలో సుమారు 28,000 హెక్టార్లు సేంద్రియ సాగులో వున్నాయని వ్యవసాయ నిపుణుల అభిప్రాయం.
మామిడిలో హార్మోన్ల పిచికారి హానికరం

మామిడిలో పూత అధికంగా రావడానికి, దిగుబడులు పెరగడానికి రైతులు పాక్లోబ్యూట్రజోల్‌ వంటి హార్మోన్లను పిచికారి చేస్తారు.  ఈ హార్మోన్లు దీర్ఘకాలంలో మామిడి చెట్లకు హాని కల్గిస్తాయి. దీనివలన చెట్లలో వంధ్యత్యమేర్పడి వాటి జీవితకాలం 10 సంవత్సరాలు తగ్గుతుంది. ఒకసారి ఈ హార్మోన్లను పిచికారి చేస్తే భవిష్యత్తులో అవి సహజంగా పూత పూయలేవు. ప్రతి సంవత్సరం దిగుబడి రావడానికి హార్మోన్లను తప్పనిసరిగా పిచికారి చేయాలి. మామిడి తోటల్లో హార్మోన్లను పిచికారి చేయడంవలన ఆ ప్రాంతంలోని ఇతర మొక్కలలో పూత చక్రాలు దెబ్బతింటాయి. పశ్చిమ బెంగాల్‌లో మామిడి పట్టణంగా పేరుగాంచిన మాల్డాలోని మామిడి తోటల్లో కూడా అధికంగా హార్మోన్లను పిచికారి చేయడంవలన ఇదే సమస్యతలెత్తింది. హార్మోన్ల పిచికారిపై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన 5-10% ధనిక రైతులు మాత్రమే నికర ఉత్పత్తిని పొందగలిగారు. ఎకరన్నర తోటలో మంచి దిగుబడులు పొందడానికి రూ. 2 లక్షలు పైగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ తీవ్ర సమస్యకు సేంద్రియ సాగు మాత్రమే పరిష్కారం. 


భూమి తయారి : భూమిని దున్ని చదును చేయాలి. సరైన నీటి పారుదల, మురుగునీరు పారుదల సౌకర్యాలు కలిగించడానికి కొద్దిపాటి కాలువనేర్పాటు చేయాలి. మొక్కలు నాటడానికి గుర్తులు పెట్టిన తర్వాత వేసవి నెలలో 90þ90þ90 సెం.మీ. గుంతలు త్రవ్వాలి. గుంతలు తీసేటపుడు పై పొరల్లోని మట్టిని, క్రింద పొరల్లోని మట్టిని ప్రతి గుంతకు దగ్గరగా 2-4 వారాలు విడివిడిగా కుప్పలుగా పోసి వుంచాలి. దీని వలన హానికర శిలీంద్రాలు సూర్యరశ్మి సోకి నశిస్తాయి. వేర్లకు బాగా గాలి సోకుతుంది. ప్రతి గుంతను 20 కి. పశువుల ఎరువు, 5 కి. వర్మింకపోస్టు, జీవన ఎరువులు (అజోస్పైరిల్లం, ఫాస్ఫో బాక్టీరియా)తో నింపాలి. వర్షాలు ప్రారంభమవగానే జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచాలి. లెగ్యూమ్‌ జాతికి చెందిన పచ్చి రొట్ట పైర్లను పెంచడంవల్ల నత్రజని స్థిరీకరించబడి, మొత్తం క్షేత్రాన్ని అద్భుత పచ్చదనం కప్పివుంచడం వలన తేమ నష్టాన్ని నివారిస్తుంది.
మొక్కలను నాటే దూరం : వరుసల మధ్య, మొక్కకు, మొక్కకు మధ్య దూరం 7 నుండి 10 మీ. 

మొక్క అంట్లు : నాటు మొక్కల అంట్లను సేంద్రియ నర్సరీ నుండి సమకూర్చుకోవడం శ్రేయస్కరం.

రకాలు : నీలం, బెంగలోర, ఆల్ఫాన్సో, రుమాని, బంగినపల్లి, జహింగీర్‌, మల్గోవా, మల్లిక, అమ్రపాలి, అర్క అన్‌మోల్‌, అర్క అరుణ, అర్కపునీత్‌, అర్క నీల్‌కిరణ్‌.

మొక్కలు నాటడం : వర్షాలు, నీటిపారుదల సౌకర్యాల లభ్యతను బట్టి జులై – డిశంబర్‌ నెలల మధ్య కాలంలో నాటవచ్చు.

నీటి యాజమాన్యం : మొక్కల 2 సంవత్సరాల వయసు వరకు క్రమం తప్పకుండా నీరందించాలి. కొత్తగా నాటిన అంట్లకు ప్రతిరోజు 25-30 లీ. నీరివ్వాలి. పెరిగి చెట్లలో కాయలేర్పడిన తర్వాత 10 రోజులకొకసారి నీరిస్తే దిగుబడులు పెరుగుతాయి. డ్రిప్‌ పద్ధతిలో నీరందించడం మంచిది.

కలుపు యాజమాన్యం : మొదటి కొద్ది సంవత్సరాలు మొక్కల పొదులో వరిగడ్డితో ఆచ్భాదన చేయడం వల్ల కలుపు నివారణ జరుగుతుంది. పెరిగిన మామిడి తోటల్లో నీడ, రాలిన ఆకులవల్ల కలుపు సమస్య తక్కువగా వుంటుంది.

ప్రూనింగ్‌ : మొక్క పరిమాణం నియంత్రణకు, పండు రంగు మెరుగు పరచడానికి మామిడి చెట్లలో కత్తిరింపులు ముఖ్యం. చెట్లలో బాగా గాలి, వెలుతురు ప్రసరించడానికి ఫ్రూనింగ్‌ చేస్తారు. దీనివలన పురుగులు, తెగుళ్ళ సమస్య తగ్గుతుంది. కాయలు మంచి రంగుతో ఏర్పడతాయి. కొమ్మ చివర కుళ్ళు నివారణకు చెట్టులో చనిపోయిన కొమ్మలను కత్తిరించాలి.  నీటి కొమ్మలను, చెట్టులో క్రింది కొమ్మలను కత్తిరించాలి. చెట్టులో బాగా సూర్యకాంతి, గాలి ప్రసరణకు ఎగుడు దిగుడుగా, అడ్డదిడ్డంగా, తెగులు సోకిన, ఎండు కొమ్మలను, బలహీనంగా వున్న కొమ్మలను కత్తిరించాలి. మూడు సంవత్సరాలకొకసారి ఆగస్టు-సెప్టెంబర్‌ నెలల్లో ఫ్రూనింగ్‌ చేయాలి. సంవత్సరానికొకసారి ఆగస్టు-సెప్టెంబర్‌ నెలలో చివరి కొమ్మలను, బలహీనమైన కొమ్మలను కత్తిరించి ఆరోగ్యవంతమైన కొమ్మలనుంచాలి. 

అవసరమైన పోషకాలు : మామిడి నాటిన థ నుండి పూర్తిగా పెరిగిన చెట్లు థ వరకు పంచగవ్య, వర్మికంపోస్టు ఎరువులను వేసి చెట్లకు అవసరమైన పోషకాలను సరఫరా చేసి, పురుగులు, తెగుళ్ళను నివారించవచ్చు. వానపాములను ఉపయోగించి వర్మికంపోస్టు తయారు చేస్తారు. చురుకుదనం పెంచిన వానపాములున్న వర్మింకపోస్టు బెడ్‌ ద్వారా నీరుపారించి వర్మి వాష్‌ సేకరిస్తారు. ఇది అన్ని పంటలకు సేంద్రియ పిచికారిగా ఉపయోగిస్తుంది.
జీవసంబంధమైన పద్ధతులు : ఆచ్ఛాదన, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, కంపోస్టు వాడటం. ప్రధాన పోషకాలు వాడదగిన సేంద్రియ పదార్థాలు నత్రజని  లెగ్యూమ్‌ జాతి మొక్కలు, ఆచ్ఛాదన, కోళ్ళ ఎరువు, బ్లడ్‌ మీల్‌, రక్తం, ఎముకలు, చేపల ఎమల్షన్‌, కంపోస్టుభాస్వరం రాక్‌ఫాస్ఫేట్‌, గుయాన, కంపోస్టు, రక్తం, ఎముకలుపొటాషియం కంపోస్టు, సీవీడ్‌, పొటాషియం సల్ఫేట్‌కాల్షియం సున్నపు రాళ్ళు, డోలమైట్‌, లైమ్‌శాండ్‌, మైక్రోనైజ్డ్‌ లైమ్‌మెగ్నీషియం డోలమైట్‌ లేదా మెగ్నసైట్‌, మెగ్నీషియం సల్ఫేట్‌గంధకం జిప్సం, పొటాషియం సల్ఫేట్‌సూక్ష్మపోషకాలు కంపోస్టు, సీవీడ్‌, ఫిష్‌ ఎమల్షన్‌, నాచురల్‌ కీలేట్స్‌, ఐరన్‌ సల్ఫేట్‌, మెగ్నీషియం సల్ఫేట్‌, బోరిక్‌ యాసిడ్‌ మామిడి తోటలో నాణ్యమైన పండ్ల ఉత్పత్తి సాధించిన రైతుల అనుభవం ద్వారా కోడిగుడ్లు, నిమ్మరసం ద్రావణం నాణ్యమైన పండ్ల ఉత్పత్తికి దోహదపడుతుందని రుజువయింది.ద్రావణం తయారు చేసే పద్ధతి : ఈ ద్రావణం తయారు చేయడానికి 10 కోడిగుడ్లను వెడల్పాటి మూతిగలగాజు సీసాలో జాగ్రత్తగా పగలకుండా అమర్చిగుడ్లు మునిగేంతవరకు సుమారు అర లీటరు నిమ్మరసం పోయాలి. గుడ్ల పైన నిమ్మరసం కనీసం ఒక అంగుళం ఉండాలి. మూత పెట్టగానే గ్రుడ్లలో నుంచి గాలి బయటకు రావడం, బుడగల ద్వారా గమనించవచ్చు. ప్రతి రోజు మూత తీసిగ్రుడ్ల పైన రసం ఉన్నదీ, లేనిదీ చూసి, లేని యెడల మరల కొంచెం నిమ్మరసం పోయాలి. ఈ విధంగా 10 రోజుల వరకు చేసి 11వ రోజున ప్లాస్టిక్‌ గిన్నెలో గుడ్ల ద్రావణాన్ని పోసి చేతితో బాగా పిసకాలి. ఈ విధంగా బాగా పిసికిన తర్వాత పలుచటి గుడ్డులో ద్రావణాన్ని వడపోసి దానికి 250 గ్రా|| నల్ల బెల్లం కలపాలి. ఈ ద్రావణాన్ని శుభ్రపరచిన సీసాలో పోసి మూత క్రింద ప్లాస్టిక్‌ పేపర్‌ పెట్టి గాలి చొరబడకుండా మూత బిగించాలి. *    ఈ ద్రావణం సుమారు 2 నెలల వరకు నిల్వవుంటుంది.*    200 మి.లీ. ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి ఎకరంలోని పంటపై సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.*    కోడిగుడ్లు-నిమ్మరసం ద్రావణం ”అమినో యాసిడ్‌’గా పనిచేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి కావలసిన ప్రోటీన్లను అందిస్తుంది.*    ఈ ద్రావణాన్ని పంటలలో పిచికారి చేయడం వలన పండ్ల నాణ్యత పెరుగుతుంది.మామిడి, కొబ్బరి చెట్లకు కునపజలం : మాంసం – 1 కి., మినుములు – 250 గ్రా., నువ్వులు – 250 గ్రా., ఆవుపాలు-1 లీ., నీరు-5 లీ. తయారు చేసే విధానం : మేక పోతు మాంసాన్ని చిన్న ముక్కలుగా కోసి శుభ్రంగా కడిగిన తర్వాత మట్టికుండతో పోసిన 5 లీ. నీటిలో కలిపి నీరు ఆవిరయ్యే వరకు ఉడకబెట్టాలి.*    ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడకట్టి అందులో మెత్తగా నూరిన మినుములు, నువ్వుల పొడి వేసి బాగా కలియబెట్టాలి.*    కుండపై మూతపెట్టి, గుడ్డతో వాసినకట్టి భూమిలోకాని, మట్టి దిబ్బలోకానీ, పెంటకుప్పలోగానీ 10 రోజులుంచాలి.*    10 రోజుల తర్వాత ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి.*    ఈ విధంగా తయారైన 5 లీ. ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి ఒక ఎకరా పంటపై సాయంత్రం వేళ పిచికారి చేయాలి.*    ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోను 1-2 సార్లు పిచికారి చేయవచ్చు. దీనివలన పంటలు ఆరోగ్యవంతంగా పెరిగి, పంటల నాణ్యత పెరగుతుంది.

మోతాదు :  అర లీటరు కునపజలాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. 5 లీ. కునపజలాన్ని 100 లీ. నీటిలో కలిపి ఎకరం విస్తీర్ణంలోని పంటపై పిచికారి చేయాలి.ఆచ్ఛాదనకు ఉపయోగించే పదార్థాలు : చెట్టు బెరడు, వేరుశనగ పొట్టు, కలుపుమొక్కలు, గడ్డి మొక్కలు, ఉడ్‌చిప్స్‌, సైలేజి, వరి, గోధుమ గడ్డి, చెట్ల నుండి రాలిన ఆకులు, వరి ఊక, కొబ్బరి పీచు, అరటి, చెరకు చెత్త మొదలైనవి. ఆచ్ఛాదన భూమిలో తేమ ఆవిరైపోకుండా కాపాడుతుంది. కలుపు పెరుగదు. ఉష్ణోగ్రతలో మార్పులు తగ్గుతాయి. నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
పచ్చిరొట్ట ఎరువులు : లెగ్యూమ్‌ జాతి పంటలను పెంచి భూమిలోకి కలియ దున్నాలి. దీనివలన భూమి భౌతిక నిర్మాణం, భూసారం పెరుగుతాయి. పంటకు పోషకాల లభ్యత పెరిగి దిగుబడి పెరుగుతుంది. భూమిలోని సూక్ష్మజీవులకు ఆహారంగా పనిచేసి అభివృద్ధి చెందేలా చేస్తాయి. జనుము, జీలుగ, విశిష్టమైన పచ్చిరొట్ట పంటలు. పచ్చిరొట్ట ఎరువులు వేసిన తర్వాత వేరుశనగను అంతరపంటగా వేస్తే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. గ్లైరిసిడియా, సుబాబుల్‌, కానుగ మొక్కలను కూడా పచ్చిరొట్ట ఎరువుగా వాడతారు.

జీవన ఎరువులు : జీవన ఎరువులను సేంద్రియ వ్యవసాయంలో విస్తారంగా వాడతారు. రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్‌, ఫాస్ఫోబాక్టీరియా, బ్లూగ్రీన్‌ ఆల్గే వాటిలో ముఖ్యమైనవి. మామిడిలో అజోస్పైరిల్లం, ఫాస్ఫో బాక్టీరియా రైతులు ఎక్కువగా ఉపయోగించే జీవన ఎరువులు. ఎకరానికి 2 కి. ఫాస్ఫో బాక్టీరియా పశువుల ఎరువుతోగాని, ఇసుకతోగాని కలిపి చల్లాలి. 2-3కి. అజోస్పైరిల్లంను 10-15కి. పశువుల ఎరువుతో కలిపి చల్లాలి.

కంపోస్ట్‌ ఎరువులు : కంపోస్టింగ్‌ సన్న, చిన్న కారు రైతుల క్షేత్రాల్లో భూసారాన్ని పెంచి ఉత్పాదకతను పెంచే అద్భుత పద్ధతి. రైతుల క్షేత్రాల్లోని పంట అవశేషాలను, విసర్జితాలను ఉపయోగించి తామే కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా భూసారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. జీవన ఎరువులు, కంపోస్టు, వర్మికంపోస్టు వాణిజ్యపరంగా మార్కెట్లో లభిస్తున్నాయి.

అంతరసేద్యం : తోటలో మధ్య ఖాళీ స్థలాన్ని దున్నడం ద్వారా నేలగుల్లబారి గాలి బాగా ప్రసరించి వేర్లు బాగా పెరుగుతాయి. కలుపు మొక్కలు రావు. అలాగే నేలలో వుండే పురుగులు నిద్రావస్థలో చనిపోతాయి. లేత తోటల్లో ఖాళీ స్థలాన్ని దున్ని అంతర పంటలు, పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకుంటే మొక్కలు ఏపుగా పెరిగి త్వరగా కాపుకొస్తాయి. కాపుకు వచ్చిన తోటల్లో తొలకరి వర్షాలకు ఒకసారి దున్నడం వలన వర్షపు నీరు బాగా నేలలోకి ఇంకి నేలకోత నాపుతుంది. ఆగస్టులో రెండవసారి దున్నితే కలుపురాదు. అలాగే నేలలో వుండే పిండి పురుగులు, పండు ఈగ నిద్రావస్థ థలోనే నశిస్తాయి. వాలుకి అడ్డంగా దుక్కి చేసి, కాంటూరు గట్లు వేసుకుంటే వర్షపునీరు, నేల సారం కొట్టుకుపోకుండా వుంటుంది. వేసవిలో చెట్లు ఎండిపోవు. ఎండుపుల్ల పడదు. వేరు కుళ్ళు ఆశించదు. పూత, కోత బాగా వస్తుంది.

పూత పెరగడానికి చర్యలు : తోటల్లో తేనెటీగ పట్టులను ఏర్పాటు చేసుకుంటే తేనెటీగల సంచారం వలన పరపరాగ సంపర్కం ఎక్కువగా  జరిగి పూత అధికంగా ఏర్పడుతుంది. దీనివలన పంట దిగుబడి, 20 నుండి 30 శాతం పెరుగుతుంది. పొలం నాలుగు మూలలా మార్కెట్లో లభించే తేనెపట్టుగదులను తెచ్చి తేనె పట్టుల నేర్పాటు చేసుకోవచ్చు. కొన్నిసార్లు తేనె పట్టులు సహజంగా చెట్లకు పడతాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మామిడి తోటల్లో సస్యరక్షణ : తోటని పరిశుభ్రంగా వుంచాలి. పురుగులు, తెగుళ్ళు ఆశించిన కొమ్మలు, కాయలు, ఇతర మొక్క భాగాలను కత్తిరించి నాశనం చేయాలి. తోటల చుట్టూ గాలులను తట్టుకునే ఎత్తైన చెట్లను నాటాలి. కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. జీవవైవిధ్యం పెంచాలి. బదనికలను ప్రోత్సహించాలి. పూతకు ఒక నెల ముందు 20 లీ. జీవామృతాన్ని 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15 రోజుల తర్వాత నీమాస్త్రం తయారు చేసి పిచికారి చేయాలి. పిందెలు ఏర్పడిన తర్వాత ఒకసారి జీవామృతం, 15 రోజుల తర్వాత నీమాస్త్రం, 30 రోజుల తర్వాత 6 లీ. పుల్ల మజ్జిగను 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. 

పురుగు వికర్షిణి : పంచగవ్య మొక్కల పెరుగుదలను పెంచే సేంద్రియ పదార్థం. దీనిని ఆవు పేడ, ఆవు మాత్రం, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి సరైన పాళ్ళలో కలిపి తయారు చేస్తారు. దీనిని మొక్కలపై పిచికారి చేస్తారు. దీనిలో అనేక ప్రధాన సూక్ష్మపోషకాలు, ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు. ఉంటాయి. ఇది మొక్కల పెరుగుదలకు, సమర్థవంతమైన పురుగు వికర్షిణిగా పని చేస్తుంది.  ఒక ప్లాస్టిక్‌ లేదా సిమెంటు ట్యాంకు లేదా మట్టికుండలో 5 కి. తాజా ఆవుపేడ, ఒక లీటరు ఆవు నెయ్యి బాగా కలిపి దీనిని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు బాగా కలపాలి. ఇలా 3-4 రోజులు కలపాలి. సుమారు 3 లీ. ఆవు పాలు, 2 లీ. ఆవు పెరుగు, 3 లీ. చెరకు రసం, 3 లీ. లేత కొబ్బరి నీరు, 10-12 బాగా మగ్గిన అరటి పండ్లను బాగా కలిపి ఈ మిశ్రామనికి కలపాలి. మొత్తం ద్రావణాన్ని 15 రోజులు పులియ నివ్వాలి. ఈ పాత్రను నెట్‌తో లేదా నూలుగుడ్డలో కప్పి వుంచి గాలి అడేలా చూడాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి రెండు, మూడు సార్లు కలుపుతూ 15 రోజుల అలా చేసిన తర్వాత ఉపయోగించవచ్చు. 6-7 సంవత్సరాల వయసున్న మామిడి చెట్లకు, ప్రతి చెట్టుకి 10 కి. వర్మికంపోస్టు, 30 లీటర్ల నీటిలో 1 లీ. పంచగవ్య మిశ్రమం కలిపిన ద్రావణం ఆకులపై, చెట్టు మొదలులో పిచికారి చేయాలి. పంచగవ్యను ఆకులపై పిచికారి చేయడం, చెట్టు మొదలులో పిచికారి చేయడాన్ని 4-5 సార్లు చేయాలి. పూత థ ముందు (జనవరి-మార్చి) మొదటి పిచికారి చేస్తే పూత ఎక్కువగా ఏర్పడుతుంది. 15-20 రోజుల తర్వాత రెండవ పిచికారి చేయాలి. ఈ ప్రక్రియను పూత చిన్న పిందెలుగా మారే థ వరకు కొనసాగించాలి. ఒకసారి చిన్న పిందెలు ఏర్పడటం ప్రారంభమవగానే నెలకొకసారి పిచికారి చేయాలి. పంచగవ్య, వర్మికంపోస్టు ఉపయోగించడం వల్ల కాయల పరిమాణం, సంఖ్య, రంగు పెరుగుతుందని గమనించారు.

సిఫారసు చేసిన పద్దతి: ఒక హెక్టారు క్షేత్రంలోని మామిడి చెట్లపై 25 లీటర్ల పంచగవ్యను 750 – 800 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. 4-5 టన్నుల వర్మింకపోస్టు వేయాలి. పంచగవ్య పిచికారి అన్ని కాయలు కొసే చెట్లలో సాధారణంగా ఆశించే పండు ఈగను సమర్థవంతంగా నివారిస్తుంది. సేంద్రియ ఎరువులు వాడిన చెట్లలో ఆకులు పెద్ద పరిమాణంలో వుండి, చెట్లు గుబురుగా పెరిగి, బలమైన వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. పండ్ల రుచి, నిల్వగుణం కూడా అతి సంతృప్తికరంగా వుంటాయి.
సేంద్రియ సాగుకి అనుకూలమైన మామిడి రకం ‘ఆల్ఫాన్సో’తమిళనాడులో కాంచీపురం, తిరునవ్వేలి జిల్లాలలో మామిడి రకాలలో రాజుగా పేరుగాంచిన అల్ఫాన్సో సేంద్రియ సాగు పద్ధతులలో అధిక దిగబడులనిస్తుంది. ఈ జిల్లాలలోని సన్న, చిన్న కారు రైతులు దీని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు, ఆదాయం పొందారని చెన్నైలోని ట్రాక్టర్స్‌ అండ్‌ ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ లి. వైస్‌ ప్రెసిడెంట్‌ యస్‌.యస్‌. నాగరాజన్‌ చెబుతున్నారు.
ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతకర్త సుభాష్‌ పాలేకర్‌ సిఫారసులు సేంద్రియ మామిడి రైతులు ఈ క్రింది పెట్టుబడిలేని వ్యవసాయ పద్ధతులనాచరించి మంచి ఫలితాలు పొందవచ్చు.*    తోటవాలుకు అడ్డంగా రెండు మామిడి వరుసల మధ్య ‘ఙ’ ఆకారంలో (3 అ. వెడల్పు, 1.5 అ. లోతు)గాడిని త్రవ్వి గాడిలో కాష్టపదార్థాలు (పంట అవశేషాలు) పరచాలి.*    వర్షాకాలం మొదలైన తర్వాత గాడిలోని కాష్ట పదార్థాల మీద జీవామృతాన్ని (200-400 లీ. ఎకరానికి) పోయాలి. జీవామృతం వర్షం నీటితోపాటు అడుగున వున్న భూమి పొరల్లోకి చేరినపుడు భూమిలో సమాధి స్థితిలో వున్న సహజ దేశీయ వానపాములు ఉత్తేజితం చెంది భూమిపైకి మరియు లోపలికి కదులుతూ భూమిలో వుండే పోషకాలను మట్టితోపాటు తింటూ రంధ్రాలు చేస్తూ వాటి విసర్జితాలను భూమి మీద విసర్జిస్తుంటాయి. ఈ విసర్జితాలు అన్ని పోషకాలు కలిగి ఉంటాయి. క్రమంగా గాడిలోని కాష్టపదార్థాలు కూడా కుళ్ళిపోయి పోషకాలతో నిండిన జీవ సేంద్రియ పదార్థం ఏర్పడి మొక్కలకు అన్ని విధాల ఉపయోగపడుతుంది. ఈ విధంగా గుల్లబారిన నేల వర్షపు నీటిని బాగా పీల్చుకుని వర్షాభావ పరిస్థితులలో కూడా మొక్కలకు నీటి కొరత లేకుండా చేస్తుంది. ఇలా ఏర్పడిన సేంద్రియ పదార్థం వాతావరణంలోని తేమను గ్రహించి మొక్కలకు నీటికొరత లేకుండా చేస్తుంది. త్రవ్విన గాడికి రెండు వైపులా ఏకదళ, ద్విదళ బీజ పంటలను పెంచడం ద్వారా, నాలుగు మామిడి చెట్లు మధ్య మునగ చెట్ల వంటి వాటిని పెంచడం వలన వాతావరణంలో అధికంగా వున్న నత్రజని మొక్కలకందుబాటులోకి వస్తుంది.
మామిడి పంటకాలంలో సస్యరక్షణతేనె మంచు పురుగు : *    జనవరిలో పూత మొగ్గ బయటపడటానికి ముందు తేనె మంచు పురుగుల నివారణ కొరకు 100 లీ. నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా 300 మి.లీ. 1500 పిపియం అజాడి రిక్టిన్‌తోపాటు 300 గ్రా. నీటిలో కరిగే గంధకం పిచికారి చేయాలి.*    ప్రత్యామ్నాయంగా లీటరు నీటికి 3-5 మి.లీ. పంచగవ్య లేదా 50 మి.లీ. జీవామృతం, 3-5 గ్రా. ట్రైకోడెర్మావిరిడి, 2 గ్రా. బివేరియా బాసియానా, లేదా 3 గ్రా. వర్టిసిల్లియం లెకాని కలిపి పిచికారి చేయాలి.*    పూత కాడలు లేదా పుగుత్తులు బయటకు వచ్చి, పూలు వికసించడానికి ముందు లీటరు నీటికి 3-5 మి.లీ. పంచగవ్య లేదా 50 మి.లీ. జీవామృతం, 3 గ్రా. వర్చిసిల్లియం, 3-5 గ్రా. బివేరియా బాసియానా, 5 గ్రా. ట్రెకోడెర్మా విరిడి కలిపి పిచికారి చేయాలి.
తామర పురుగులు *    ఫిబ్రవరిలో పిందె థలో తేనె మంచు పురుగు, తామర పురుగుల నివారణకు 1500 పిపియం అజాడిరిక్టిన్‌ లీటరు నీటికి 3 మి.లీ.,  5 గ్రా. ట్రెకోడెర్మావిరిడి, 3-5 గ్రా. బివేరియా బాసియానా, 3-5 గ్రా. వర్టిసిల్లియం లెకాని, 50 మి.లీ. జీవామృతం లేదా 3 మి.లీ. పంచగవ్య కలిపి పిచికారి చేయాలి. *    15-20 సంవత్సరాల వయస్సున్న చెట్టుకి 15-20 కి. వర్మికంపోస్టు, 5 లీ. జీవామృతం పాదులో పోసి నీరు పెట్టాలి. వీటితోపాటు చెట్టుకి 100 గ్రా. అజోస్పైరిల్లం, 100 గ్రా. ఫాస్పోబాక్టీరియా వాడితే మరింత ప్రయోజనకరం.*    మార్చి-ఏప్రిల్‌లో పిందెలు పెరగటం జరుగుతుంది. ఈ థలో పాదులో 15-20 రోజులకొకసారి నీరు పెట్టాలి.*    ఎండలో పెరిగే సమయంలో లీటరు నీటికి 15-20 గ్రా. నీటిలో కరిగే సున్నం కలిపిన ద్రావణాన్ని కాయలపై పిచికారి చేయాలి.*    పిందెలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నపుడు వీటిపై టెంక పురుగు గుడ్లను పెడుతుంది. వీటి నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ. వేపగింజల కషాయం పిచికారి చేయాలి.
పండుఈగ  : మే-జూన్‌ నెలలో పండు ఈగ తాకిడికి పండ్లు చెడిపోకుండా కాపాడటానికి కోతకు నెలరోజుల ముందు ఎకరానికి 5-6 మిథైల్‌ యూజినాల్‌ పండు ఈగ ఎరలను ఏర్పాటు చేయాలి.

Read More