పశువులలో వచ్చు అతి ముఖ్యమైన బ్యాక్టీరియల్ వ్యాధులు క్షయ వ్యాధి. జోన్స్ వ్యాధి, ఆక్టినోమైకోసిస్, ఆక్టినో బాసిల్లాసిస్, ఆంత్రాక్స్, హిమరేజిక్ సెప్టిసీమియ బ్రుసెల్లోసిస్ మరియు క్లాస్ట్రీడియల్ వ్యాధులు.
క్షయవ్యాధి: దీనినే ట్యూబర్‌క్యులోసిస్ అందురు. ఇది మైకోబ్యాక్టీరియం అను వ్యాధి కారకము ద్వారా వస్తుంది. ఇది వ్యాధిగ్రస్త పశువుల పాలు వాటి దూడలు త్రాగుటవలన దూడలలో మరియు శ్వాస ద్వారా కూడ వ్యాపించును. వ్యాధిగ్రస్త పశువులు రోజు రోజుకు కృషించిపోవుట, పౌష్టికాహారము తీసుకున్నప్పటికి ఆరోగ్యం క్షీణించి పోవుట, తెమరుతో కూడుకొనిన మరియు విపరీతమైన దగ్గు వంటి లక్షణాలను కలిగి ఉండును.
జోన్స్ వ్యాధి : దీనినే పారాట్యుబర్ క్యులోసిస్ అని కూడా అందురు. ఇది మైక్రోబ్యాక్టీరియా పారాట్యుబర్ క్యులోస్ అను వ్యాధి కారకము ద్వారా కలుగును. కలుషిత ఆహార పదార్థాల ద్వారా వ్యాధి వ్యాప్తి జరుగును. వ్యాధి గ్రస్త పశువులు శారీరకంగా కృషించిపోవుట, పాలదిగుబడి తగ్గిపోవుట అబార్షన్స్, అధిక దాహరం ఉండి దుర్వాసన లేని, సాఫ్ట్‌గా మరియు పలుచగ విరోచనాలు ఉండును. సాధారణంగా జ్వరము ఉండదు.
ఆక్టినోమైకోసిస్ : దీనినే లంపీజా అని కూడా అందురు. ఆక్టినోమైసిస్‌బోవిస్ అను వ్యాధి కారకము సాధారణంగా పశువుల నోట్లో ఉండి, ఎప్పుడైన నోట్లో గాయాలైనపుడు, పళ్ళు వచ్చేటపుడు, ఈ వ్యాధి కారకము. ఆయా భాగాలలో చేరి వ్యాధిని కలుగజేయును. వ్యాధి లక్షణాలు, తొలిథలో క్రింది దవడ బయటివైపున నొప్పిలేని గడ్డలుగా వచ్చును. క్రమేన ఈ గడ్డలలో పసుపు పచ్చని, చిక్కని శ్లేష్మముతో కూడిన చీము చేరి, ఆ భాగము నొప్పిని కలిగించును. ఈ గడ్డలలో సల్ఫర్ గ్రాన్యూల్స్ అను పసుపు పచ్చని సూక్ష్మకణికలుంటాయి. ఈ వ్యాధితో బాధపడే పశువులు ఆహారం తీసుకోలేక, నీరసించిపోయి, నోటిలో దుర్వాసన మరియు పళ్ళు పదులైపోవుట, లాలాజలం / చొంగ ఎక్కువ కారుట వంటి లక్షణాలను చూపును.
ఆక్టినోబాసిల్లోసిస్ : దీనినే ఉడన్ టంగ్ లేదా నాలుక వాపు వ్యాధి అని కూడా అందురు. ఈ వ్యాధి కారకము అనగా ఆక్టినోబాసిల్లస్ లిగ్నిరేసి, లంపీజా కారకము మాదిరిగానే పశువు నోట్లో ఉండి, నోట్లో ఏవైన గాయాలు అయినపుడు, ఆ గాయము యొక్క ప్రదేశాన్ని చేరి వ్యాధిని కలిగించును. వ్యాధి లక్షణాలు ముఖ్యంగా అతిగా వాచిపోయి, గట్టిగా మారిన నాలుక మరియు ఇది నోటి నుండి బయటకు వేలాడుతుంది. అందువలన పశువు నోటిని పూర్తిగా మూయలేకపోవుట జరుగును. అంతేగాక లాలాజలం అధికంగా కారుట, శ్వాస తీసుకొనుట కష్టంగా ఉండి, నాలుకపైన పుండ్లు ఏర్పడి, వాటి నుండి చీముతో కూడిన పసుపు పచ్చని స్రావాలు కలిగి, సల్ఫర్ గ్రాన్యూల్స్‌ని కలిగి ఉండును.

ఆంత్రాక్స్ : దీనినే దొమ్మరోగము, ఊల్ సార్టర్స్ వ్యాధి, స్లీనిక్ ఫీవర్ అని కూడా అందురు. ఇది బాసిల్లస్ ఆంత్రాసిస్ అను వ్యాధి కారకము వలన కలుషిత పదార్థాలను తినటం వలన, కలుషిత గాలి పీల్చుట ద్వారా వ్యాపించును. ఈ వ్యాధిసోకిన పశువులు మరణాల బారినపడుతూ, అధిక ఉష్ణోగ్రత అనగా 107ఓFగా ఉండును. అంతేకాక గడ్డకట్టని, టారీ రంగులో ఉండే రక్తము అన్ని సహజ రంధ్రాలనుంచి కారుట చూడవచ్చును. ఈ యొక్క వ్యాధి సోకిన మరియు వ్యాధి లక్షణాలను చూపిన పశువులలో శవ పరీక్షలో పశువులను తెరువకుండా జాగ్రత్తగా డిస్పోజ్ చేయవలెను. ఎందుకనగ ఈ వ్యాధి సోకిన పశువులను కాని, వాటి ఉత్పత్తులను కాని తాకినపుడు మనుషులలో సోకును. ఈ వ్యాధి సోకిన మనుషులలో మాలిగ్నెంట్ పుస్ట్యూల్స్ లేదా మాలిగ్నెంట్ కార్బంకుల్స్ అనునవి శరీరంపై రావటం, ఊపిరితిత్తుల వ్యాధిని కలిగి ఉండటం చూడవచ్చును.
గొంతువాపు వ్యాధి: దీనినే హిమరేజిక్ సెప్టిసీమియా లేదా షిప్పింగ్ ఫీవర్ అని కూడా అందురు. ఇది పాశ్చురెల్లా మల్టోసిడా అని కారకము ద్వారా వచ్చును. ఈ కారకము పశువు శ్వాస నాళంలో జీవిస్తూ, కరువు కాటకాలు, తుఫానులు, అధిక దూరాలు రవాణా చేయునపుడు, పశువు ఒత్తిడికి గురైనపుడు ఈ కారకము ఊపిరితిత్తులను చేరి వ్యాధిని కలిగించును. ఈ వ్యాధి సోకిన పశువులు అధిక జ్వరము అనగా 104-106 ఓF ఉండి, భ్రాంకోన్యుమోనియా, కష్టంగా శ్వాస తీసుకోవటం వంటి వ్యాధి లక్షణాలను కలిగి ఉండును.

క్లాస్ట్రీడియల్ వ్యాధులు: ఇందులో అతి ముఖ్యమైనవి జబ్బువాపు వ్యాధి మరియు ఎర్రమూత్ర వ్యాధి. జబ్బు వ్యాధినే బ్లాక్‌లెగ్ లేదా నల్ల జబ్బు అనువు కూడా అందురు. వ్యాధి కారకము క్లాస్ట్రీడియంతో పైగా ఉండును. ఇది కలుషిత ఆహారము, గాయాల ద్వారా వ్యాప్తి చెందును. 6 నెలల నుండి 2 సంవత్సరాల వయస్సుగల పశువులలో చూడవచ్చును. ఈ వ్యాధి సోకిన పశువులు చనిపోయి కనిపించడం, 106 ఓF జ్వరము, కుంటుట, కండరాల వాపు, ముఖ్యంగ జబ్బు వాచిపోయి, ముట్టినపుడు నొప్పి కలుగకుండ ఉండి కిర్‌కిర్‌మను క్రిపిటేటింగ్ శబ్దాలు వచ్చును. బ్యాసిల్లరీ హీమోగ్లోబినూరియా లేదా ఎర్రమూత్ర వ్యాధి క్లాస్ట్రీడియం హీమోలైటికమ్ అను కారకము ద్వారా కలుగును. దీనివలన పశువు శరీర ఉష్ణోగ్రత 104-107 F గా / అధికంగా ఉండి, నలతగా ఉండును. ఈ వ్యాధి సోకిన పశువులలో ఎర్ర రక్త కణాలు చనిపోవటంవలన మూత్రం ఎర్రగపోవుట బయటకి కనిపించే శ్లేష్మపొరలు పాలిపోయి ఉండి పసుపు రంగును కలిగి ఉండును. ఇవేకాక పాలదిగుబడి తగ్గిపోవుట, ఆకలి లేకపోవుట, నెమరు వేయకపోవుట, మలబద్ధకం, వెన్ను వంగిపోయి కష్టంగా నడుచుట, నాడి మరియు శ్వాసవేగం అధికంగా ఉండటం వంటి లక్షణాలను చూపిస్తూ 12-24 గంటలలో మరణించును.

కోల్‌బాసిల్లోసిస్ : దీనినే పారుడు రోగము, తెల్లబేదులు, స్కోర్స్ లేదా వైట్ డయోడియ అని కూడా అందురు. ఈ వ్యాది అప్పుడే జన్మించిన లేగదూడలో సాధారణంగా వచ్చును. ఇది పశ్చిరేశియా కోలై అను వ్యాధి కారము వలన వస్తుంది. ఈ వ్యాధి 2 వారాలు వయస్సులోపు దూడలలో కూడా కలుగును. ఈ వ్యాధి సోకుట అనునది ముఖ్యంగా ఆహారం సరిగ అందించకపోవుట, ముర్రుపాలు సరిగ్గా త్రాగించకపోవుట, క్రిక్కిరిసి ఉన్న షెడ్లు, పాకలలో శుభ్రత లోపము, వాతావరణంలో తేడాలు, అధిక వేడి / చలి మొదలగు పరిస్థితులు, శారీరక మరియు భౌతిక ఒత్తిడి, ప్రతికూల వాతావరణం మరియు అపరిశుభ్రత పరిస్థితులలో జరుగును. గర్భాశయంలో ఉన్న శిశువుకు తల్లి రక్తం ద్వారా మరియు సరిగా కత్తిరించని నాభినాళం ద్వారా జీర్ణాశయం చేరి, వ్యాధినిరోధకశక్తి క్షీణించినపుడు, ఈ జీవి విడుదల చేయు విషపదార్థాల వలన అధికంగా పారుకొనుట మరియు నేలపై సాగిలపడుట వంటి వ్యాధి లక్షణాలను చూపును.
ఇలాంటి వ్యాధులు పశువుల్లో వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరుచేసి, సరైన చికిత్స అందించి, ఆరోగ్యంగా ఉన్న పశువులలో సరైన సమయంలో టీకాలు వేయించినట్లయితే మరియు అన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే పశువులలో వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
డా|| ఎం. జీవనలత, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, సెల్ : 94902 92468; డా|| ఎం.కె. శ్రీకాంత్, పశువైద్యాధికారి, రాజేంద్రనగర్, హైదరాబాద్. సెల్: 96526 55255

