వ్యవసాయనికి అనుబంధ రంగమైన పుట్టగొడుగుల పెంపకం, యువతకు మరియు ఇంట్లోనే ఉంటూ ఉపాధి చేసుకోగలిగిన మహిళలకు ఎంతో లాభకారమైనది. వివిధ రకాల పుట్టగొడుగులు మన దేశములో సాగు చేయబడుచున్నవి. అందులో ముఖ్యముగా శ్రీకాకులము జిల్లా యొక్క వాతావరణ పరిస్థితుల్లో ముత్యపుచిప్ప పుట్టగొడుగు, వరి గడ్డి పుట్టగొడుగు మరియు పాల పుట్టగొడుగుల పెంపకము చేపట్టవచ్చును. ఎన్నో పోషక విలువలు కలిగి ఉండి, క్రొవ్వు మరియు పిండి పద్ధారం తక్కువగా ఉండటం మరియు ముఖ్యంగా మాంసకృత్తులు అధికంగా ఉండటం వీటి ప్రత్యేకత. పెరుగుదలకు కావాల్సిన లైసిన్ అనే అమైనో ఆమ్లం వీటిలో ఉండటం వల్ల ఇవి అధిక జీర్ణ శక్తిని (60-70%) కలిగి ఉంటాయి. పుట్టగొడుగుల్లో కొవ్వు పదార్ధాలు చాలా తక్కువగా ఉండటమేకాక ఇవి శరీరానికి అవసరమైన మంచి కొలస్ట్రాల్ ను పెంచుతూ, గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
ఇటీవల కాలంలో పుట్టగొడుగులలో ఉండే పోషక విలువలు, ఉపయోగాల గురించి అందరిలో అవగాహన పెరుగుతున్నందు వల్ల, మరియు వాతావరణ పరిస్ధితులకు అనుకూలమైన వివిధ రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉండటం వలన చాలా మంది నిరుద్యోగ యువత, రైతులతో పాటు మహిళలు కూడా పుట్టగొడుగుల పెంపకం పై ఆసక్తి చూపిస్తున్నారు.
1. ముత్యపు చిప్ప పుట్టగొడుగులు
ఈ పుట్టగొడుగులు విచ్చుకొని ముత్యపు చిప్ప ఆకారంలో ఉండటం వల్ల వీటికి ఆపేరు వచ్చింది. వీటిలో తెల్ల ముత్యపు చిప్ప, ఎల్లో ముత్యపు చిప్ప, గ్రే మరియు పింక్ రకం ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిని రైతులు తమ వద్ద లభించే వరిగడ్డితోనే కాక వ్యవసాయ సంబంధమైన ఏ వ్యర్ధపదార్డం ఉపయోగించి అయినా సులభంగా పండించవచ్చును. మిగతా రకాలతో పోలిస్తే ఇవి అధిక దిగుబడులను ఇస్తాయి. కాబట్టి తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడికి అధిక లాభాలను సంపాదించే రకంగా ఇవి ప్రాచుర్యాన్ని పొందాయి. వీటిని అధికంగా దక్షిణ భారతదేశంలో సాగు చేస్తారు.
సాగు చేయు విధానం :
వరిగడ్డి చౌకగా మరియు సులభంగా దొరకటం వల్ల దీన్ని వాడతారు. ముందుగా వరిగడ్డిని 3-5 సెం.మీ. ముక్కలుగా చేసుకోవాలి. తరువాత మంచి నీటిలో 4-6 గంటలు నానబెట్టిన తర్వాత నీటిని తీసివేయాలి. ఇలా నానబెట్టిన గడ్డిని గొనె సంచిలో నింపి వేడి నీటిలో ఒక గంట పాటు ఉంచి తరువాత తీసివేసి గడ్డిలో 60-65% తేమ ఉండేలా ఆరబెట్టాలి. తేమ శాతం తనిఖీ చేయడానికి చేతినిండా గడ్డిని తీసుకోని వెళ్ళ మధ్య ఉంచి పిండినట్లయితే నీరు కారకుండా ఉన్నట్లయితే తగినంత తేమ శాతం ఉన్నట్లుగా నిర్ధారించుకోవచ్చు. పాలిధీన్ సంచుల్లో ఆరబెట్టిన వరిగడ్డి ముక్కల్ని 5 సెం. మీ. మందాన వేసి విత్తనాన్ని అంచుల వెంట కాకుండా మధ్యలో వేయాలి. 1 కేజీ వరిగడ్డికి 50 గ్రా. స్పాన్ కలిపి మరి గట్టిగా వత్తకుండా సంచులలో నింపి రబ్బరు బ్యాండ్ బిగించాలి. తర్వాత సంచులను స్పాన్ రన్నింగ్ గదిలోకి మార్చాలి.
ప్రతి రోజు గదిలో తగినంత తేమ, ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3-4 వారాల్లో బెడ్లపైన తెల్లని శిలింధ్రం దట్టంగా వ్యాపిస్తుంది. ఇలా తయారైన బెడ్లపైన పాలిధీన్ సంచులను శుద్ధి చేసిన బ్లేడుతో కత్తిరించాలి. గదిలో గాలి మరియు వెలుతురు సరఫరా అయ్యేలా చూసుకోవాలి.
ఇలా చేసిన తర్వాత 6-7 రోజులకు మొదటి పంట వస్తుంది. బెడ్లను రోజుకు 2 సార్లు తడిపి తేమ 65% ఉండేలా చూసుకోవాలి. తర్వాత 15 రోజుల వ్యవధిలో రెండవ మరియు మూడవ పంట వస్తుంది. బెడ్లను ప్రతిరోజు పరిశీలిస్తూ నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగు ఉన్న బెడ్లను తీసి దూరంగా గుంటలో వేయాలి. లేకుంటే ఇతర బెడ్లకు వ్యాపించే అవకాశం ఉన్నది. ప్రతి కిలో ఎండు గడ్డి నుండి దాదాపు కిలో పచ్చి పుట్టగొడుగులు వస్తాయి. వీటిని తాజాగా ఉన్నప్పుడే 24 గంటల్లో మార్కెటింగ్ చేయాలి. ఫ్రిజిలో అయితే 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదే ఎల్లో పుట్టగొడుగులు గది ఉష్ణోగ్రత వద్ద 3 రోజులు మరియు ఫ్రిజ్ లో అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
2. పాల పుట్టగొడుగులు
ఈ పుట్టగొడుగుల పెంపకం కొద్దిపాటి చిన్న మార్పులతో ముత్యపుచిప్ప పుట్టగొడుగుల పెంపకమును పోలి ఉంటుంది. ఈ పుట్ట గొడుగుల పెంపకానికి 30-35 డిగ్రీల సెం. ఉష్ణోగ్రత మరియు 80-95% గాలిలో తేమ తగిన వెలుతురు అవసరం. మార్చి నుండి అక్టోబరు వరకు గల వాతావరణం చక్కగా అనుకూలిస్తుంది. పరిస్దితులకు అనుకూలంగా తగుపాటి జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరమంతా ఈ పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చును.
సాగుచేయు విధానం
వీటి సాగులో రెండు థలు ఉంటాయి. మొదటి 21- 24 రోజులు ఇంక్యుబేషన్ కోసం డార్క్ రూమ్ సృష్టించుకోవాలి. 24వ రోజున కేసింగ్ చేసి కాంతి అందే చోట సాగు చేయాలి.
పాల పుట్టగొడుగు సాగు కోసం వరిగడ్డిని సేకరించి క్రీమిరహితం చేసుకోవాలి. ఇలా క్రిమీరహితం చేసిన గడ్డిని 50% తేమశాతం ఉండేలా ఆరబెట్టుకోవాలి. నాణ్యమైన పాల పుట్టగొడుగు స్పాన్‌ను తీసుకొని, సమాన నాలుగు భాగాలుగా చేసుకోవాలి. స్పానింగ్ చేసే ముందు చేతులను క్రిమిరహితం చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ సంచిలో స్పాన్ మరియు వరిగడ్డి పొరలుగా వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బ్యాగులకు రంధ్రాలు పెట్టి వాటిని డార్క్ రూమ్ లో 21-24 రోజుల వరకు ఉంచవలెను. డార్క్ రూమ్ లో 28-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి.
కేసింగ్ ప్రక్రియ 24 వ రోజున పాటించవలెను. ఇందుకోసం నల్లమట్టి, కొకోపీట్, వెర్మికాంపోస్ట్,వంటివి వాడవలెను. పి. హెచ్ నిర్వహణ కోసం చాక్ పౌడెర్ వంటివి కలపవచ్చు. ఒక సంచిని రెండు భాగాలుగా చేసి దానిమీద కేసింగ్ మట్టిని వేసుకోవాలి. ఇలా కేసింగ్ చేసిన వాటిని కాంతి అందే గదిలో పెట్టుకోవాలి. ఇక్కడ 28-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 80-85% తేమశాతం ఉండవలెను. ప్రతిరోజు పైన ఉన్న మట్టిలో తేమశాతం ఉండేలా చూసుకోవాలి. ఒక 10-12 రోజుల తరువాత మొలకలు కనిపిస్తాయి అనంతరం 18-20 రోజుల్లో పంట అందుతుంది.
3. వరిగడ్డి పుట్టగొడుగులు
ఈ పుట్టగొడుగులు ఉత్తరకోస్తాంధ్రలో మరియు ఒడిస్సా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేయబడుచున్నవి. వీటిని పెంచటానికి వరిగడ్డిని ఉపయోగిస్తారు. వీటి కాడలు మృదువుగా ఉండి పొడవుంటాయి. వీటి పెరుగుదలకు 30-350 సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు 85-90% గాలిలో తేమ ఉండే ప్రదేశాలు అనుకూల మైనవి. వరిగడ్డి పుట్టగొడుగులను గడ్డి పుట్టగొడుగులు అని, ప్యాడి స్ట్రా పుట్టగొడుగులు అని అంటారు. ఈ పుట్టగోడుగులు విత్తనం వేసిన 15 రోజులలో కోతకు వస్తాయి. ఈ రకం పుట్టగొడుగుల నిల్వ కాలం 24 గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత పుట్టగొడుగులు నీరులాగ వాసన ప్రసరింపచేస్తాయి.
సాగు చేయు విధానం
ఒక కిలో వరిగడ్డిని సుమారు 5 సెం. మీ. మందం, 85-90 సెం.మీ. పొడవు గల కట్టలుగా కట్టాలి. ఇటుకలు పేర్చి నేల మట్టానికి కొంచెం ఎత్తుగా మడి చేయడానికి ప్లాటఫారామ్ తయారు చేయాలి. గడ్డి కట్టలను నీటిలో ముంచి సుమారు 12-16 గంటలు నానబెట్టి తీయాలి. ఎక్కవగా ఉన్న నీరు జారిపోయేటట్లుగా కట్టలను 15-20 నిమిషాలు నిలబెట్టాలి. కొయ్య చట్టాన్ని తుడుచి శుభ్ర పరచాలి. దానిని ప్లాట్ ఫాం పై ఉంచి మొదటి వరుస 6-8 గడ్డి కట్టలను ఒకదాని ప్రక్కన ఒకటిగా పేర్చాలి. మొదటి వరుస కట్టలపై పుట్టగొడుగుల విత్తనాన్ని అంచుల నుండి 10 సెం. మీ ఎడంగా కుప్పలుగా నాలుగు ప్రక్కలా ఉంచాలి. మొదటి వరుస గడ్డి కట్టల పై సుమారుగా 5 గ్రా. పప్పుపోడిని మరియు నీటిని చల్లాలి. అదే విధంగా మొదటి వరుసకు అడ్డంగా నీటిని చల్లాలి. అదే విధంగా మొదటి వరుసకు అడ్డంగా రెండో వరుస వేసి మూడవ వరుసకు అడ్డంగా నాల్గవ వరుస గడ్డి కట్టలను పేర్చుతూ వరుసల మధ్య విత్తనాన్ని, పప్పుపొడి, యూరియా నీళ్ళను చల్లాని. ఐదవ వరుస పై అంచుల వెంటనే కాకుండా ఉపరితలం అంతటా విత్తనం పప్పుపొడి, యూరియా నీళ్ళను చల్లాలి. చేతులతో కట్టలను కొంచెం నొక్కి మైనపు కాగితంతో కప్పాలి. ప్రతి రోజు మైనపు కాగితాన్ని తీసి మడిలో తేమ ఆరిపోకుండా కొంచెం మంచి నీటిని చల్లాలి. గది/పాకలో తగినంత తేమ, చల్లదనం కొరకు గోడల వెంట తడిపిన గొనె పట్టాలను వ్రేలాడదీసి అవసరము మేర వాటిని నీటితో తడుపుతూ ఉండాలి. వారము నుండి పది రోజులలో పుట్టగొడుగుల మొలకలను గమనించవచ్చును.

ఇవి 4-5 రోజులలో బాగా పెద్దవి అవుతాయి. గొడుగులు విచ్చుకోకముందే అంటే గుండు థలోనే వాటిని కోసుకోవాలి. ఒక వారం రోజులలో రెండవ కాపు మరొక వారంలో మూడవ కాపు వస్తాయి. పుట్టగొడుగులు ప్రతి మడికి 2-3 కిలోలు రాగలవు. మడికి చీమలు పట్టకుండా 10 శాతం బి.హెచ్.సి పొడిన చల్లాలి. మడిని నీలి / ఆకుపచ్చ / నలుపు రంగు గల శిలీంధ్రము ఆశించే అవకాశముంది. అటువంటి వాటిని తీసి నాశనం చేయాలి. లేనిచో మిగిలిన వాటికీ కూడా ఈ శిలింధ్రం వ్యాపించి ఎక్కువ నష్టం కలుగచేస్తుంది. గొడుగులు విచ్చుకోక ముందు కోయవలెను. కోసిన తరువాత వేడి నీళ్ళలో గాని, ఉప్పు నీళ్ళలో గాని ఉంచవలెను.
పుట్టగొడుగులపై వచ్చే వ్యాధులు-నివారణ
ఏ రకానికి చెందిన పుట్టగొడుగులు అయినా, పరిశుభ్రమైన వాతావరణంలో తగు జాగ్రత్తలతో పెంచి ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి. లేకుంటే తరచుగా బెడ్స్ మీద నలుపు, ఆకుపచ్చ బూజులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి బెడ్లపై కనిపిస్తే దానిని జాగ్రత్తగా చాకుతో తీసివేసి, ఆ ప్రదేశాలలో బావిస్టిన్ (0.1 శాతం) పిచికారి చేయాలి. స్పాన్ రన్నింగ్ గదుల్లో దోమలు, నల్లులు, స్ప్రింగ్ టైల్స్, నులి పురుగులు, బాక్టీరియా మరియు వైరస్ ఆశిస్తాయి. పుట్టగొడుగులను ప్రధానంగా స్టాప్ మిల్ డ్యూ, బ్రౌన్ ప్లాస్టర్ మోల్డ్, వైట్ ప్లాస్టర్ మౌల్డ్, అవివ్ గ్రీన్ మాల్డ్, నలుపు, ఆకుపచ్చ, బాక్టీరియా మచ్చ తెగుళ్ళు ఆశిస్తాయి.
వీటి నివారణకు గదిలో బావిస్టిన్ (0.1 శాతం) లేదా ఫార్మాల్డీహైడ్ (10%) గదులు, గోడల వెంట గోనె సంచుల పైన మరియు నేల మీద ఉన్న ఇసుక పైన ప్రతి 10 రోజులకు ఒకసారి చల్లాలి. అలానే బెడ్స్‌లో దోమ కన్పించినట్లయితే వేప ద్రావణాన్ని (5 మి. లీ./లీ. నీటికి) కలిపి చల్లాలి. పుట్టగొడుగుల బెడ్‌పై బాక్టీరియా మచ్చలు కనిపేస్తే 2 గ్రా. బ్లీచింగ్ పౌడర్ 10 లీ. నీటిలో కలిపి చల్లాలి. క్రాపింగ్ రూమ్‌లో ఎప్పటికప్పడు ఫార్మలిన్ 5% ద్రావణాన్ని పిచికారి చేయాలి.
పుట్టగొడుగుల పెంపకములో పాటించవలసిన మెళకువలు
* మంచి రకం విత్తనం (స్పాన్)నే వాడాలి. సాగు చేయు స్థలంలో పూర్తి పరిశుభ్రతను పాటించాలి.
* గదిలో తగినంత ఉష్ణోగ్రత, తేమ వుండేలా జాగ్రత్త వహించాలి.
* వారానికి కనీసం 2 సార్లు గోడలు, నేలపై ఫార్మాలిన్ ద్రావణాన్ని పిచికారి చేయాలి.
* పిచికారి చేసే సమయంలో బెడ్స్ పై నీరు పడకుండా తప్పనిసరిగా ఏదైనా కప్పాలి. క్రాపింగ్ రూములలో తగినంత వెలుతురు, గాలి ప్రసరణ వుండేలా చూడాలి.
* క్రాపింగ్ సమయంలో పుట్టగొడుగులు తీసిన తరువాత మాత్రమే బెడ్స్‌పై నీరు చల్లాలి.
* గదిలోకి ఎలుకలు, కీటకాలు ప్రవేశించకుండా చూడాలి. గది కిటికీలకు జాలి బిగించాలి.
* ఆకుపచ్చని నల్లని మచ్చలు కనిపించిన బెడ్స్ తక్షణం అక్కడి నుండి తొలగించి పారవేయాలి. తద్వారా వ్యాధి వ్యాపిచకుండా నిరోధించవచ్చు.
డా.వై.సృజన, డా.ఎస్.రమేష్ బాబు, డా.డి.శ్రీనివాస్, పి. అంజని శ్రీ, ఎస్.జోష్ణ, డి. అఖిల సిరి, అన్షుమన్ రౌల్, కే.చాందినీ, దేవి శివాని కోట, ఎస్.దినేష్, బి.హర్షవర్ధన్, డి.ఝాన్సీ, మొనీష్ రెడ్డీ, బి.మౌనిక, సిహెచ్. మౌనిక, వ్యవసాయ కళాశాల నైరా, శ్రీకాకుళం జిల్లా, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము.

