తాజాగా ‘ఆక్స్‌ఫామ్’ సంస్థ విడుదల చేసిన నివేదిక భారతదేశంలోని ప్రజల మధ్య నెలకొన్న తీవ్ర ఆర్థిక అసమానతలను ఎత్తిచూపింది. దేశంలోని అత్యంత ధనికులైన పది శాతం మంది దేశ సంపదలో 77 శాతాన్ని తమ చేతుల్లో బంధించారు. 2017లో దేశంలో సృష్టించబడ్డ అదనపు సంపదలో 73 శాతం అత్యంత ధనికులైన ఒక శాతం మందికి దక్కింది. దేశంలో 67 కోట్ల పేదలకందరికీ కలిపి దక్కింది ఒక్క శాతం మాత్రమే. దేశ ప్రధాని తరచుగా నినదించే ‘సబ్‌కీ సాథ్, సబ్ కో వికాస్’ (అందరితో కలిసి అందరి అభివృద్ధి) మంత్రంలోని డొల్లతనాన్ని పై గణాంకాలు బట్టబయలు చేసాయి. దేశంలో వ్యవసాయరంగంపై ఆధారపడుతున్న రైతులు, కౌలుదార్లు, వ్యవసాయ కూలీల్లో 99 శాతం మంది అత్యంత పేదల్లోనే ఉన్నారని చెప్పటానికి ఆధారాలు కోకొల్లలు.
గత రెండు శతాబ్దాల ప్రపంచ చరిత్రను గమనిస్తే వ్యవసాయరంగంపై ఆధారపడ్డవారు పేదలుగా మారిన ఉదంతాలు పుష్కలంగా ఉన్నాయి. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించినా, సోషలిజం ఎండమావివైపు పరిగెత్తినా, మిశ్రమ ఆర్ధిక విధానాలను అనుసరించినా, దేశాలన్నింటిలోనూ వ్యవసాయరంగం నీరసించటం, పారిశ్రామిక రంగం, సేవారంగం బలపడటం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారవేత్తలు ఈ కొత్తరంగాలను స్వాధీనం చేసుకోవటం, ఆర్థికంగా లాభించిన వారు ప్రభుత్వాలను శాసించటం, సాంకేతిక ప్రగతి వారి నిచ్చెలకు మెట్లు కావటం చర్విత చరణమే. ఆదాయం తగ్గుతున్న కొద్దీ వ్యవసాయరంగం నుండి శ్రామికులు నిష్క్రమించి, ఇతర రంగాల్లో ఉపాధి పొందగలిగిన దేశాల్లో వ్యవసాయంలో మిగిలినవారు కనీస జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. కాని దక్షిణాసియా దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో వేరే ఉపాధి మార్గాలను అనుసరించే పెట్టుబడి, అవకాశాలు, నైపుణ్యం, వ్యవహార దక్షత లేక పంజరాల్లో చిలకల్లా చిక్కి, ఆర్థికంగా దోపిడీకి గురై శల్యమౌతున్నారు. జాతీయోత్పత్తిలో 14 శాతం వాటా ఉన్న వ్యవసాయరంగంపై దాదాపు 50 శాతం ఆధారపడటం వల్ల వారి సగటు ఆదాయం జాతీయ సగటు ఆదాయంలో సగం కన్నా తక్కువగా ఉంటున్నది. కమతాలు చిన్నవిగా ఉండటం వల్ల రైతులు, ఖర్చులతో పాటు కౌలు భారం వల్ల కౌలుదారులు, ఎక్కువ రోజులు పనిదొరకనందువల్ల వ్యవసాయ కూలీలు అతితక్కువ ఆదాయాలు పొందగలుగుతున్నారు. కుటుంబ ఖర్చులు పెరుగుతుండటం, ఆదాయాల్లో వృద్ధిలేకపోవటంతో అప్పుల పాలవుతున్నారు.
ఆదాయ సంక్షోభం
ప్రభుత్వ దృష్టిలో వ్యవసాయ రంగంలో సంక్షోభమే లేదు. గిరాకీ మించిన లభ్యత ఉండటం వల్ల ఆహార ధాన్యాల కొరత లేదు. వంట నూనెలు, అపరాలు మాత్రమే దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. దిగుమతుల విలువను మించి వ్యవసాయ ఎగుమతులుండటం వల్ల ప్రభుత్వాలు ఆందోళన చెందడం లేదు. అయితే రైతులు, కూలీల ఆదాయాల విషయంలో మాత్రం సంక్షోభం తీవ్రతరమౌతున్నది. 1991లో నూతన ఆర్థిక విధానాలను అవలంబించడం మొదలైన తర్వాత ఈ సంక్షోభం ఎక్కువైంది. 1998 నుండి 2004 మధ్య ఎన్.డి.ఏ. ప్రభుత్వ కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గాయి. రైతుల ఆదాయాలు తగ్గటంతో వ్యవసాయ కూలీలకు లభించే కూలి రేట్లు స్తబ్ధంగా ఉండిపోయాయి. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ తగ్గింది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, పారిశ్రామిక ఉత్పత్తుల ధరల మధ్య నిష్పత్తి తగ్గి, వ్యాపార తులనాత్మకత దెబ్బతిని, వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. రైతుల ఆత్మహత్యలు దేశంలోని అనేక ప్రాంతాలలో పెరిగిపోయాయి. 1998-2004 మధ్య వ్యవసాయరంగం కేవలం 1.76 శాతం చొప్పున మాత్రమే ప్రతి ఏటా పెరిగింది. అయితే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గటం వల్ల మధ్యతరగతి వారు, పట్టణ ప్రజలు సంతోషించారు. విదేశీ పెట్టుబడిదారులు, దేశీయ తయారీదార్లు లాభాలు సంపాదించారు. అధికారంలో ఉన్న పార్టీ ‘దేశం వెలిగిపోతుంది’ అని ప్రచారం చేసింది. ద్రవ్యోల్బణం తగ్గటం, ఆర్థిక లోటు అదుపులో ఉండటం, విదేశీ పెట్టుబడులు పెరగటం ఆ ప్రచారానికి దోహదపడింది. కాని గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయేతర గ్రామీణ ప్రజలు ఆర్థికంగా దిగజారిపోయారు. గ్రామీణ ప్రజల అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రసార మాధ్యమాలు ఎన్.డి.ఏ. తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని జోశ్యం చెప్పాయి. కాని 2004లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు వెలిగిపోవటం లేదని నిరూపించాయి. యూ.పి.ఏ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది.
కొంతపుంజుకున్న వ్యవసాయరంగం
కాంగ్రెసు పార్టీ నాయకత్వంలో పనిచేసిన యూ.పి.ఏ. పదేళ్ళపాటు అధికారంలో ఉంది. 2004-05 నుండి 2012-13 వరకు వ్యవసాయాభివృద్ధి రేటు సాలీనా 3.84 శాతంగా నమోదైంది. అయితే 2013-14 వ సంవత్సరంలో ఈ రంగం కొంత వెనుకంజ వేయటం వల్ల 2004-05 నుండి 2013-14 మధ్య వ్యవసాయాభివృద్ధి రేటు 3.5 శాతంగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగటం ఇందుకు దోహదపడింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను భారీగా పెంచింది. 2004-05లో వరి ధాన్యానికి మద్దతు ధర క్వింటాలుకి 560 రూపాయలు. 2013-14లో ఆ మద్దతు ధర రూ. 1310/- పెరిగింది. యూ.పి.ఏ. పాలించిన పదేళ్ళ కాలంలో వరికి కనీస మద్దతు ధర 134 శాతం పెరిగింది. గోధుమ మద్ధతు ధర 2004-05లో క్వింటాలుకి రూ. 640/-గా ఉండగా, 2013-14లో ఆ మద్దతు ధర క్వింటాలుకి రూ. 1400/-కి పెరిగింది. పదేళ్ళకాలంలో గోధుమ మద్దతు ధర 119 శాతం పెరిగింది. ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ఆకర్షణీయమైన ధరలు లభించాయి. ఫలితంగా 2004-05 నుండి 2011-12 మధ్య రైతుల ఆదాయాలు సాలీనా 5.52 శాతం పెరిగాయి. ఈ కాలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, జాతీయ ఆహార భద్రతా చట్టం, సమాచార హక్కు చట్టం వంటి ప్రగతిశీల పథకాలు అమలయ్యాయి. వాటివల్ల వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ పేదలకు మేలు జరిగింది. 2008-13 మధ్య కూలీరేట్లు ఏటా 6 శాతం చొప్పున పెరిగాయి. ద్రవ్యోల్బణపు ప్రభావాన్ని తీసివేయగా వాస్తవంగా కూలిరేట్లలో ఏర్పడ్డ వృద్ధి ఆ స్థాయిలో ఉంది. రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల స్థితిగతులు మెరుగవటంతో ఈ పదేళ్ళ కాలంలో దేశంలో పేదరికం గణనీయంగా తగ్గింది. 2004-05లో వ్యవసాయ ధరలు పారిశ్రామిక ధరల నిష్పత్తి సూచీ 85గా ఉండగా, 2010-11లో అది 103కి పెరిగింది. కొంతమేరకు వ్యవసాయరంగానికి న్యాయం జరిగినట్లు ఈ సూచీ తెలియజేస్తున్నది. ఇదేకాక వ్యవసాయరంగానికి బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టటం వల్ల దీర్ఘకాల పెట్టుబడుల్లో వృద్ధి సంభవించింది. రసాయన ఎరువుల వినియోగం కూడా బాగా పెరిగింది. 2000-01లో 16.7 మిలియన్ టన్నుల రసాయనక ఎరువుల్ని వాడగా 2010-11లో అది 28.1 మిలియన్ టన్నులకు పెరిగింది. 2004-05లో ట్రాక్టర్ కొనుగోళ్ళు 2 లక్షల 47 వేలుండగా, 2013-14లో అవి 6 లక్షల 97 వేలకు పెరిగాయి. పవర్ టిల్లర్ల కొనుగోళ్ళు 2004-05లో 17,481 యూనిట్లుగా ఉండగా 2013-14కి అవి 56,000కి పెరిగాయి. అలాగే రైతులకిచ్చే సంస్థాగత రుణాలు కూడా ఈ పదేళ్ళ కాలంలో బాగా పెరిగాయి. యూ.పి.ఏ. ప్రభుత్వ కాలంలో వ్యవసాయరంగంలో పెట్టుబడులు, దిగుబడి ఆదాయాలు, కూలిరేట్లు, గ్రామీణ ఉపాధి అవకాశాలు పెరగటం వల్ల వ్యవసాయ రంగం కొంత వరకు తేరుకుంది. గ్రామీణ పేదరికం తగ్గింది. అయితే చివరి రెండు సంవత్సరాల్లో వ్యవసాయ ప్రగతి కొంత మందగించింది.
మళ్ళీ గ్రహణం
2014లో ఎన్.డి.ఏ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యూ.పి.ఏ. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించి, విదేశాల్లో దాచ్చుకున్న నల్లధనాన్ని తెచ్చి, ప్రజలకు పంచుతామనే వాగ్ధానంతో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు. పాత ప్రభుత్వంలో అవినీతి జరిగినట్లు నిరూపించిందీలేదు, ఎవరినీ శిక్షించిందీ లేదు. విదేశాల నుండి నల్లధనాన్ని తెచ్చిందీ లేదు. వ్యవసాయరంగం నుండి శ్రద్ధ మరల్చి, తమకు మద్దతు పలికిన పెట్టుబడిదారులు, మధ్యతరగతి ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. 2014, 2015 సంవత్సరాల్లో ఏర్పడిన కరవు పరిస్థితులు కూడా వ్యవసాయాదాయాలను దెబ్బతీశాయి. 2013-14లో వ్యవసాయ రంగానికి కేటియంచిన బడ్జెట్‌తో పోలిస్తే 2015-16 బడ్జెట్‌లో కేటాయింపులు 25 శాతం తగ్గాయి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసివేస్తే వాస్తవ కేటాయింపులు ఇంకా తక్కువ. 2016-17లో కేటాయింపులు పెరిగినా 2013-14లో కేటాయింపుల స్థాయికి చేరుకోలేదు. 2017-18, 2018-19లో కేటాయింపులు పెరిగినట్లు కనిపిస్తున్నది. కాని అది వాస్తవంగా పెరగలేదు. 2016-17 వరకు వడ్డీపై ఇచ్చే రాయితీని, బీమాపై సబ్సిడీలను ఆర్థిక శాఖ పద్దుల్లో చూపించే వారు. కాని 2017-18 నుండి దానిని వ్యవసాయ శాఖ కేటాయింపుల్లో చూపిస్తున్నారు. ఇలా తెలివితేటల్ని ప్రదర్శించి, వ్యవసాయానికి సాయం పెంచుతున్నట్లు చెప్పుకున్నారు. 2013-14 నుండి 2017-18 వరకు వ్యవసాయరంగంలో పెరుగుదల రేటు 2.9 శాతానికి తగ్గింది. ఇది భౌతికంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో కనిపించిన పెరుగుదల రేటు. వ్యవసాయరంగంలో జోడించిన విలువను పరిశీలిస్తే సాలీనా 0.5 శాతం వృద్ధి మాత్రమే ఉంది. అది కూడా ఉద్యాన పంటలు, అనుబంధ రంగాల్లో మాత్రమే ధనాత్మక మార్పు ఉంది. మూడింట రెండు వంతుల వాటా ఉన్న సాంప్రదాయ పంటల్లో జోడించిన విలువలో తగ్గుదలే ఉంది. 2011-12 నుండి 2017-18 వరకు రైతుల ఆదాయాలు సాలీనా 1.36 శాతం తగ్గుదల నమోదైంది. 2010-11లో 28.1 మిలియన్ టన్నుల ఎరువుల్ని వాడగా 2016-17లో 26 మిలియన్ టన్నులకు తగ్గింది. ట్రాక్టర్ల కొనుగోళ్ళు 2013-14లో 6.97 లక్షలుండగా 2016-17లో అవి 5.82 లక్షలకు తగ్గింది. పవర్ టిల్లర్ల కొనుగోళ్ళు 2013-14లో 56వేలుండగా, 2016-17లో 45,200 కు తగ్గాయి. రుణ వితరణ కూడా మందగించింది. రైతుల రుణ భారం పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడుల్లో సాలీనా ఒక శాతం తగ్గుదల నమోదైంది. వ్యవసాయ ధరలు-పారిశ్రామిక ధరలు నిష్పత్తి సూచీ 2015-16లో 97కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగినప్పుడు దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని పెంచుతున్నది. కాని ముడిచమురు ధరలు తగ్గినప్పుడు పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించటం లేదు. 2016లో వెలువడ్డ నోట్ల రద్దు నిర్ణయం అసంఘటిత రంగంపై చావు దెబ్బకొట్టింది. వ్యవసాయ కార్మికుల నిజవేతనాలు 2014 నుండి 2018 మధ్య సాలీనా 0.87 శాతం మాత్రమే పెరిగాయి. వ్యవసాయేతర గ్రామీణ కార్మికుల నిజవేతనాల్లో వృద్ధి సాలీనా 0.23 శాతం మాత్రమే ఉంది. వ్యవసాయ ఎగుమతులు మందగించాయి. అవకాశాలున్నప్పుడు ఎగుమతులపై ఆంక్షలు పెట్టడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు నినాదం ప్రహసనంగా మిగలటంతో దానిపైన సమీక్షలే లేకుండా పోయాయి. కరోనా కాలంలో గిరాకీ లేక, మార్కెట్లు పనిచేయక కోళ్ళ పరిశ్రమ, కూరగాయల ఉత్పత్తిదార్లు దెబ్బతిన్నారు. కరోనా తగ్గిన తర్వాత కూడా వ్యవసాయాదాయాల్లో చెప్పుకోదగ్గ మార్పు లేదు. 2017 నుండి 2021 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రైతు ఆందోళనలు వారి అసంతృప్తికి అద్దం పట్టాయి.
భవిష్యత్తు నిరాశాజనకం
ఇప్పటివరకు పొందుపరిచిన ప్రభుత్వ గణాంకాలు వ్యవసాయోత్పత్తులు పెరుగుతున్నా, రైతులు, కౌలుదార్లు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయేతర గ్రామీణ కార్మికులు ఆదాయ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. 1998-2004 మధ్య వ్యవసాయ సంక్షోభం తీవ్రమైంది. 2004 నుండి 2014 వరకు వ్యవసాయరంగం, రైతు, కూలీలు కొంత తేరుకున్నట్లు తెలుస్తుంది. 2014 తర్వాత రైతులు, కూలీలు, వ్యవసాయేతర గ్రామీణ పరిశ్రమ కార్మికులు ఆదాయ నష్టాన్ని అనుభవిస్తున్నారు. ఆక్స్ ఫామ్ సంస్థ వెలువరించిన ఆదాయ వ్యత్యాసాల నివేదిక దేశంలో తీవ్రతరమౌతున్న ఆర్థిక అసమానతలను వెల్లడించింది. గ్రామీణ రంగంలో ఉన్న రైతు, కార్మికులు, పట్టణ పేదలు దేశ ప్రగతిలో వాటాను పొందలేకపోతున్నారు. ఆదాయ వంచితులు దేశంలో అత్యధికులుగా ఉన్నా వారి మధ్య ఐక్యత లోపించటం వల్ల రాజకీయ ప్రత్యామ్నాయం బలపడటం లేదు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో రానున్న ఎన్నికల దృష్ట్యా వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కొన్ని తాయిలాలు లభించవచ్చు. అభివృద్ధి ఫలాలు విస్తృతంగా పంపిణీ కాకుంటే దేశం ముందుకు వెళ్ళదు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో మూడవ పెద్ద వ్యవస్థగా అవతరించడం అనే ఎండమావులుగానే మిగలవచ్చు.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
(రిటైర్డ్ ఞ కన్సల్టెంట్ ఇక్రిసాట్), ఫోన్: 83098 59517, 70328 11608

