ప్రకృతిలో పువ్వులు అత్యంత అద్భుతమైన సృష్టి. పువ్వులు సంతోషకరమైన భావోద్వేగాలను మరియు సానుకూల సామాజిక ప్రవర్తనను పెంపొందించడం ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. పువ్వులు అత్యంత ఒత్తిడి నుంచి ఉపశమనం కల్గించే స్వభావాన్ని కల్గి ఉంటాయి. భయం, ఆందోళనను తగ్గిస్తాయి. రైతులు పుష్పాలను రెండు రకాలుగా కోస్తారు. వాటిలో మొదటి రకం విడిపువ్వులు, రెండవ రకం కట్‌ ఫ్లవర్స్‌. విడిపుష్పాలు పూజలకు, పూలజడ, పూమాలల తయారీలో ఉపయోగిస్తారు.  కాడలతో పాటుగా కోసే పుష్పాలను కట్‌ఫ్లవర్స్‌ అంటారు. శుభకార్యాలలో, వివాహ కార్యాలలో, అలంకరణకు మరియు వ్యక్తుల సన్మాన సభలలో బోకే రూపంలో అందిస్తారు.

కట్‌ఫ్లవర్స్‌ కోత సమయంలో, కోసిన తరువాత తగు జాగ్రత్తలు పాటిస్తే మరిన్ని రోజులు పూలను తాజాగా ఉంచడానికి వీలుపడుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

  • పువ్వులను కత్తిరించటం ఉదయం లేదా సాయంత్ర సమయాలలో మాత్రమే చెయ్యాలి.
  • కటింగ్‌ టూల్స్‌ పదునైనవై ఉండాలి, కటింగ్‌ టూల్స్‌ని క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలి.
  • కోసిన పూలను పరిశుభ్రమైన, నీడ ఉన్న ప్రదేశాలలో ఉంచాలి.
  • కోసిన పూలను శుభ్రమైన వెచ్చని నీటితో నింపిన బక్కెట్లలో పెట్టాలి. బక్కెట్లలో నీటి లోతు, కాడను కప్పడానకి తగినంత ఉండాలి.
  • నీటికి దిగువన కాడలపై ఉన్న ఆకులను తొలగించాలి.

పుష్పం తాజాదనాన్ని బయోటిక్‌, అబయోటిక్‌ ఫ్యాక్టర్స్‌ ప్రభావితం చేస్తాయి. తాజాదనాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు నీటి సంబంధాలు, పిండి పదార్థాల స్థితి (రిజర్వ్‌ ఫుడ్‌ మెటీరియల్‌), ఇథిలిన్‌ మరియు సూక్ష్మజీవులు. కట్‌ ఫ్లవర్స్‌ తల్లి మొక్క నుండి వేరు చేయబడిన తరువాత నీళ్లు, పోషక సహజ వనరులను కోల్పోతాయి. ఫలితంగా జీవక్రియ రిజర్వు చేసిన ఆహార పదార్థాల వ్యయంతో జరుగుతాయి. కాబట్టి కృత్రిమంగా పూలకి నీరుతో పాటు జీవన ప్రక్రియకు కావలసిన పదార్థాలను అందించడం ద్వారా మరికొన్ని రోజులు పూలు తాజాగా ఉంటాయి. వ్యాపారులు తాజాగా ఉంచడం కోసం ఎన్నో రకాల రసాయనాలను వాడుతారు. అలా కాకుండా మనకు సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించడం వలన పూలను తాజాగా ఉంచడంతో పాటు వాతావరణాన్ని కూడా రక్షించుకోవచ్చు. ఇలా సహజ, సురక్షితమైన మరియు చవకైన సమ్మేళనాలు ఉపయోగించడం ఎంతో మేలు.

కట్‌ఫ్లవర్‌ తాజాదనాన్ని పెంచే కొన్ని సహజ పదార్థాలు:

చక్కెర: కట్‌ పువ్వులను తాజాగా ఉంచడానికి చక్కెర ఉపయోగిస్తారు. పూలు కత్తిరించి ఉంచిన నీటిలో చక్కెరను కలపడం వలన మరికొన్ని రోజులు పూలను తాజాగా ఉంచవచ్చును. తల్లి మొక్క నుండి వేరుపర్చిన కట్‌ఫ్లవర్స్‌కు శ్వాసక్రియ జరుపుకోడానికి చక్కెర తోడ్పడుతుంది. గులాబి మరియు కార్నేషన్‌ లాంటి పూలు ఉంచిన నీటిలో చక్కెర వాడటం వలన పూల యొక్క రంగును మరింత మెరుగుపరుస్తుంది. ఒక్క లీటరు నీటికి 10 గ్రాములు లేదా 20 గ్రాముల చక్కెరను ఉపయోగించాలి.

స్ప్రైట్‌, సెవన్‌ అప్‌: స్ప్రైట్‌, సెవన్‌ అప్‌ లాంటి కూల్‌డ్రింక్స్‌ కూడా పూల తాజాదనాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు. పూలను ఉంచిన నీటిలో సూక్ష్మజీవులను నియంత్రించటం చాలా ముఖ్యం. సూక్ష్మజీవుల సంఖ్య ఆసిడ్‌ వాతావరణంలో పెరగదు. స్ప్రైట్‌, సెవన్‌ అప్‌, కార్బొనేటెడ్‌ మరియు ఆమ్లీకృత నీరు కావడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. ఇలా సులువుగా మనకి అందుబాటులో ఉండే వాటి ద్వారా పూలను మరికొన్ని రోజులు తాజాగా ఉంచవచ్చు. ఒక్క లీటరు నీటికి 50 లేదా 100 మి.లీ. స్ప్రైట్‌ లేదా సెవన్‌ అప్‌ని కలపడం వల్ల మంచి ఫలితాలని పొందవచ్చు.

బ్లీచింగ్‌ పౌడర్‌, ఆస్పిరిన్‌, కర్పూరం: బ్లీచింగ్‌ పౌడర్‌, ఆస్పిరిన్‌, కర్పూరం బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తాయి. పూలు కత్తిరించి ఉంచిన నీటిలో వీటిని వాడడం వలన కట్‌పూలను తాజాగా ఉంచవచ్చు.

బ్లీచింగ్‌ పౌడర్‌ – 50 లేదా 100 మి.గ్రా. లీటర్‌ నీటికి కలపాలి.

ఆస్పిరిన్‌ – 250 లేదా 500 మి.గ్రా. లీటర్‌ నీటికి కలపాలి.

కర్పూరం – 150 లేదా 300 మి.గ్రా. లీటర్‌ నీటికి కలపాలి. 

ఎసెన్షియల్‌ ఆయిల్స్‌: సుగంధ మొక్కల యొక్క పువ్వులు, గింజలు, ఆకులు, బెరడు, కలప, పండ్లు మరియు వేర్ల వంటి వివిధ భాగాల నుండి సేకరించిన నూనెలను ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ అంటారు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ అనేది సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూల సహజమైన మొక్కల ఉత్పత్తి. ఇది కొన్ని క్రిములకు వ్యతిరేకంగా బలమైన యాంటిమైక్రోబియల్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను పూలు కత్తిరించి ఉంచిన నీటిలో తగిన మోతాదులో ఉపయోగించడం ద్వారా సూక్ష్మజీవుల సంఖ్యను నియంత్రించడానికి తోడ్పడుతుంది. అజోవాన్‌, థెమ్‌ ఆయిల్‌, జెరేనియం ఆయిల్‌, యూకలిప్టస్‌ ఆయిల్‌ లాంటివి మార్కెట్‌లో సులువుగా లభ్యం అవుతాయి.

పండ్ల సారం, హెర్బల్‌ పదార్థాలు: పుల్లని నారింజ సారం, యాపిల్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ కట్‌ ఫ్లవర్స్‌ యొక్క తాజాదనాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. వాటిలో ఉండే మాలిక్‌ యాసిడ్‌ మరియు సిట్రిక్‌ యాసిడ్‌ నీటి యొక్క పీహెచ్‌ని తగ్గిస్తాయి. దాని ద్వారా పూకాడలు ఎక్కువ నీటిని గ్రహిస్తాయి మరియు బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది. మెరింగ ఆకుసారం, మెంతకార్డీఫోలియా సారంలను కూడా ఉపయోగిస్తున్నారు.

ఈ విధంగా సహజంగా మరియు సులువుగా అందుబాటులో ఉండే పదార్థాలను ఉపయోగిస్తూ కట్‌ ఫ్లవర్స్‌ని తక్కువ ఖర్చుతో మరికొన్ని రోజులు తాజాగా ఉంచవచ్చు.

ఎ. సౌజన్య (9704886759), ఎం.ఎస్సీ., పూలవిభాగం, కాలేజ్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌, డా. కె. కళాధర్‌ బాబు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (హార్టీకల్చర్‌), డా. పి. ప్రశాంత్‌, సీనియర్‌ సైంటిస్ట్‌ అండ్‌ హెడ్‌, పూల పరిశోధనా స్థానం, డా. యస్‌. ప్రణీత్‌ కుమార్‌, సైంటిస్ట్‌ (క్రాప్‌ ఫీసియోలజీ), శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయము.