గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే ప్రతిరైతు పంటలసాగుతో పాటు పశుపోషణ, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం చేస్తూ తమ ఇంటి అవసరాలకు సరిపోను కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటూ తమ అవసరాలు తీరగా మిగిలిన దిగుబడులు బయట అమ్మకం చేస్తూ ఉండేవారు. అసలు వ్యవసాయం మొదలయ్యిందే తమ ఆహార అవసరాలు తీర్చుకోవడానికి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆది మానవులు తమ ఆకలిని తీర్చుకోవడానికి వేటాడి మాంసాన్ని తినడంతోపాటు తమ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఆహార పంటలు సాగు చేస్తూ తమ ఆకలిని తీర్చుకునేవారు. ఆవిధంగా మొదలైన వ్యవసాయం అనేక మార్పులకు గురయ్యి వ్యాపారంగా మారి ఏక పంట విధానానికి మారిన తరువాతనే రైతులు నష్టాల పాలవడం, తమ ఆహార అవసరాలకు కూడా వేరే రైతులు పండించిన ఆహారాల మీద ఆధారపడటం, రసాయనాలు ఉపయోగించిన ఆహార పదార్థాలను తినడం లాంటివి జరిగి ఆరోగ్యాలు దెబ్బతీసుకుంటున్నారు. వీటికి పరిష్కారం సేంద్రియ సాగు మరియు సమీకృత సేద్యం అని తెలుసుకున్న కొంతమంది రైతులు తిరిగి మన తాతముత్తాతలు చేసిన వ్యవసాయ పద్ధతులను తిరిగి అమలు పరుస్తున్నారు. ఈకోవకే చెందుతారు సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన శేషుకుమార్‌.

శేషుకుమార్‌ ఒకటిన్నర ఎకరాలలో సమీకృత సేద్యం మొదలుపెట్టాడు. శేషుకుమార్‌ ప్రధాన లక్ష్యం ప్రధానంగా తమకు కావలసిన ఆహారం విష రసాయనాలు లేకుండా పండించుకుని తాము తింటూ మిగిలినవి అమ్మి ఆదాయం పొందడం. భూమిని నమ్ముకుంటే భూమి మనలను మోసం చేయదు అనే సిద్ధాంతాన్ని నమ్మి 2021 నవంబరులో సమీకృతం సేద్యాన్ని ప్రారంభించాడు. ముందుగా పొలంలో ఎలివేటెడ్‌ షెడ్‌ నిర్మాణం చేసి ఈ షెడ్‌లో పైభాగంలో గొర్రెలను పెంచుతూ క్రింద భాగంలో కోళ్ళను పెంచుతున్నాడు. వాన పాముల ఎరువు తయారీకి కూడా ఒక షెడ్‌ ఏర్పాటు చేసుకుని గొర్రెల ఎరువును వానపాములకు ఆహారంగా వేసి వానపాములు ఎరువును తయారు చేసి తాను సాగు చేసే వివిధ రకాల మొక్కలకు అందిస్తున్నాడు. పుట్టగొడుగుల పెంపకాన్ని కూడా మొదలుపెట్టారు.

ప్రస్తుతం తన పొలంలో వివిధ రకాల పండ్ల మొక్కలు అంటే సంవత్సరం పొడవునా ఏదో ఒకటి అందుబాటులో ఉంటే మన భవిష్యత్తుతరాల వారు విష రసాయనాలు లేని పండ్లు, కూరగాయలు తింటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలనే లక్ష్యంతో అన్ని కాలాలలో వచ్చే పండ్ల రకాలు అయిన జామ, పనస, యాపిల్‌బేర్‌, సపోట, యాపిల్‌, బత్తాయి, నిమ్మ, చింత, డ్రాగన్‌ఫ్రూట్‌, అంజూర, కొబ్బరి, సీతాఫలం, అరటి, బొప్పాయి, 14 రకాల మామిడి మొక్కలు సాగు చేస్తున్నాడు. ఇంటి అవసరాలకు సరిపోను వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాడు. సుభాష్‌ పాలేకర్‌ చెప్పిన విధంగా నత్రజనిని స్థిరీకరించే మునగ మొక్కలను సాగు చేస్తూ వాటి నీడలో కొబ్బరి, జామ మొక్కలను సాగు చేస్తున్నాడు.

తాను చేసే సమీకృత సేద్యంలో మొదట తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి కాబట్టి 5 లక్షలకు పైగానే పెట్టుబడి పెట్టాడు. మొదటి సంవత్సరంలో గొర్రెలు, కోళ్ళ వలన కొంత ఆదాయం లభించింది. భవిష్యత్తులో తమకు అవసరమైన ఆరోగ్యకర ఆహారం తమ సొంత పొలం నుంచి పొందటంతో పాటు ఆర్థికంగా కూడా తన సమీకృత సేద్యం లాభాలని అందించగలదనే నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. మరిన్ని వివరాలు 99121 16331 కి ఫోను చేసి తెలుసుకోగలరు.