జంతువుల  నుండి  కరోనా  వ్యాధి  వస్తుందా? సందేహాలు – అపోహలు

కోవిడ్‌-19 కరోనా వైరస్‌ డిసీజ్‌ అనేది కొత్తరకం సార్స్‌ కరోనావైరస్‌-2 అను వైరస్‌ వల్ల కలుగు వ్యాధి. ఈ వ్యాధి ప్రపంచం అంతటా వ్యాపించటమే కాకుండా, కొన్ని చోట్ల జంతువులలో కూడా ఈ వైరస్‌ గుర్తించటం వలన యాజమాన్యంలో చాలా సందేహాలు కలుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు కరోనా వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నందున వాటి యజమానులలో చాలా సందేహాలు కలుగుతున్నాయి. కరోనావైరస్‌ యొక్క కుటుంబంలో అనేక రకాలైన కరోనా వైరస్‌లు ఉన్నాయి. వివిధ జంతుజాతులు ఈ వైరస్‌ల బారిన పడే అవకాశం ఉంది. కానీ ఒక్కో వైరస్‌ ఒక్కో రకమైన వ్యాధిని కలుగజేస్తుంది. ఈ కరోనా వైరస్‌ కుటుంబంలో నాలుగు జాతులు ఉన్నాయి. ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా కరోనా వైరస్‌. సార్స్‌ కరోనావైరస్‌-2 బీటా కరోనా వైరస్‌ జాతికి చెందుతుంది. కుక్కలకు మరియు పిల్లులకు సోకు కరోనా వైరస్‌ ఆల్ఫా కరోనా వైరస్‌ జాతికి చెందుతుంది. సార్స్‌ కరోనా వైరస్‌-1 2002-2004 సంవత్సరంలో చైనాలో అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ అను వ్యాధి అకస్మాత్తుగా వ్యాపించి చాలామంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా 2012వ సంవత్సరంలో మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ వల్ల కూడా పలు దేశాలలో మరీ ముఖ్యంగా సౌదీ అరేబియాలో చాలామంది చనిపోవడం జరిగింది. ఈ రెండు వ్యాధిగ్రస్తులలో గుర్తించబడిన సార్స్‌ మరియు మెర్స్‌ కరోనా వైరస్‌లు బీటా జాతికి చెందినది. ఇవి కేవలం మనుష్యులలో మాత్రమే గుర్తించబడ్డాయి. చాలామంది ఈ వ్యాధుల బారిన పడినప్పటికీ జంతువులలో మాత్రం ఈ వ్యాధికారక వైరస్‌లు గుర్తించబడలేదు.

కుక్కల కరోనా వ్యాధి: కుక్కలలో కరోనా వైరస్‌ వల్ల జీర్ణవ్యవస్థకు సోకటం వల్ల విరేచనాలు అవుతాయి. ముఖ్యంగా కుక్కపిల్లలు ఎక్కువగా/బాగా బాధపడతాయి. కానీ కుక్కలకు ఈ వ్యాధి నివారణ కోసం టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం కుక్కలలో మాత్రమే పనిచేస్తాయి. కుక్కలలో కరోనావ్యాధి ముఖ్యంగా కుక్క పిల్లలలో ప్రేగులకు సంక్రమించు అంటువ్యాధి. వ్యాధి సోకిన కుక్క పిల్లలు స్వల్పకాలం పాటు ఉదర సంబంధమైన అసౌకర్యాలతో బాధపడతాయి. ఈ వైరస్‌ కేవలం జీర్ణాశయాంతర సమస్యలను మాత్రమే కలుగజేసి, మలం ద్వారా విసర్జించబడుతుంది. దీనివల్ల ఆహార పదార్థాలు, నీరు, పాత్రలు కలుషితమవుతాయి. కలుషితమైన ఆహార గిన్నెల నుండి తినడం లేదా సోకిన కుక్కలతో దగ్గరగా ఉండటం వలన ఆరోగ్యవంతమైన కుక్కలు వ్యాధిబారిన పడవచ్చు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలు మరియు అపరిశుభ్రమైన పరిసరాలు కరోనావైరస్‌ వ్యాప్తికి దోహదపడతాయి. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన దగ్గరి నుండి వ్యాధి లక్షణాలు కనపడడానికి 1 నుండి 4 రోజులు పడుతుంది. చాలా కుక్కలలో వ్యాధి లక్షణాలు 2-10 రోజుల వరకు ఉంటాయ. ఇతర వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు పరాన్నజీవుల వల్ల అనారోగ్య తీవ్రత ఎక్కువ అవడమే కాకుండా అవి తొందరగా కోలుకోలేవు. ఒకసారి వ్యాధి సోకిన తర్వాత దాదాపు ఆరు నెలల పాటు వ్యాధికారక వైరస్‌లు శరీరం నుండి విడుదల అవుతూ ఉంటాయి.

వ్యాధి లక్షణాలు: చాలా కుక్కలలో వ్యాధి లక్షణాలు బయటకు కనిపించవు. కొన్నింటిలో మాత్రమే వ్యాధి లక్షణాలు బహిర్గతం అవుతాయి. అప్పుడప్పుడు వ్యాధి లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వ్యాధిసోకిన కుక్కలు ముఖ్యంగా చిన్న కుక్కపిల్లలలో అకస్మాత్తుగా విరేచనాలు అవడం ప్రారంభమవడమే కాకుండా అతిసారంలాగా మారే అవకాశం ఉంది. బద్ధకంగా ఉంటూ ఆకలి మందగిస్తుంది. మలం వదులుగా ఉండి, నారింజ రంగులో దుర్వాసన కూడి ఉంటుంది. అప్పుడప్పుడు రక్తం లేదా శ్లేష్మం కలిగి ఉండవచ్చు. ఒకవేళ అది మిశ్రమ సంక్రమణ అయి ఉంటే ఉదాహరణకు కరోనా వ్యాధి, పార్యోవైరస్‌ రెండు ఉన్నట్లయితే అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

చికిత్స: కరోనా వైరస్‌ సంక్రమణకు నిర్ధిష్టమైన చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీబయాటిక్‌ మందులు వైరస్‌ సంక్రమణలకు పనిచేయవు. కానీ ఇవి ఇతర బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగపడవచ్చు. తీవ్రమైన అతిసారం వల్ల శరీరంలోని నీటిశాతం బాగా తగ్గిపోతుంది. కాబట్టి కుక్కపిల్లలకు వెంటనే గ్లూకోజ్‌ సీసాలను ఎక్కించాలి. అతిసారం ఆగిపోయిన తర్వాత 24 గంటల పాటు ఆహారం ఇవ్వకుండా క్రమక్రమంగా కొద్దిమొత్తంలో ఆహారం ఇస్తూ మొదలుపెట్టాలి. 

వ్యాధి నియంత్రణ: కుక్కల కరోనావ్యాధికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అన్ని కుక్కలకు ఈ టీకా మందును ఇవ్వకూడదు. అది దాని యొక్క జీవనశైలి మరియు టీకాలతో వచ్చు దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని సలహా ఇవ్వాలి. ఈ టీకా కేవలం కుక్కలకు మాత్రమే పనిచేస్తుంది. మనుష్యులలో సంక్రమించే కోవిడ్‌-19 నివారణకు ఈ టీకా పనిచేయదు.   

కళ్యాణి పుట్టి, 9550862090, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, వెటర్నరీ బయోటెక్నాలజీ విభాగం

Read More

సేంద్రియ ఎరువు… సముద్రపు ఆల్గే

జనాభా పెరుగుతున్న కొద్ది ఆహార పదార్థాలు మరియు పీచుపదార్థాల ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. దీనివల్ల ప్రతీ యూనిట్‌ విస్తీర్ణంలో ఆహార పదార్థాల మరియు పంటల దిగుబడి పెంచటానికి రసాయన మందుల వాడకం కూడా పెరుగుతూ వస్తుంది. కానీ ఎక్కువ రసాయనిక ఎరువుల వల్ల విపరీతమైన వ్యాధులు వస్తున్నాయి. దాంతోపాటు పర్యావరణ కాలుష్యం అధికం అవుతుంది. కాబట్టి దీనిని తగ్గించటానికి ప్రస్తుత రోజల్లో మొక్కల నుంచి తీయబడ్డ పదార్థాలను వ్యవసాయరంగంలో, ఉద్యానరంగంలో ఉపయోగిస్తున్నారు. కాబట్టి రసాయనిక ఎరువుల స్థానంలో క్రమంగా ప్రత్యామ్నాయ స్థానంలో సహజసిద్ధమైన ఎరువులు ఉపయోగించటం ఎంతో ఉపయోగకరం. సహజసిద్ధమైన ఎరువులు సులభంగా సూక్ష్మజీవులతో విచ్ఛిన్నం చేయబడతాయి. విషపూరితం కావు. పర్యావరణాన్ని కాలుష్యం కలిగించవు. మనుష్యులకు, జంతువులకు, పకక్షులకు హానికరం కాదు. 

సీవీడ్‌ అనేది కంటికి కనిపించే సముద్రపు ఆల్గే. వీటిని ఆహారంగా, పశువులకు మేతగా, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. పరిశ్రమ పదార్థాలయిన అగార్‌, ఆల్జినేట్‌లను తయారు చేయడానికి కూడా సీవీడ్‌ని ఉపయోగిస్తారు. ప్రస్తుత రోజుల్లో రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సీవీడ్‌ని ఉపయోగిస్తున్నారు. సీవీడ్‌ ద్రవరూపంలో, బయోస్టిమ్యులెంట్‌ రూపంలో మార్కెట్‌లో లభిస్తాయి.

బారదేశంలో 800 రకాల సముద్రపు ఆల్గేలు భారతదేశ తీరప్రాంతాలైన అలల మధ్య ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో కనుగొనబడ్డాయి. దీనిలో దాదాపుగా 60 రకాల జాతులను మాత్రమే వాణిజ్యపరంగా ఉపయోగకరమైనవిగా గుర్తించారు. ఇవి తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీపాలు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, అండమాన్‌నికోబార్‌, పశ్చిమబెంగాల్‌, ఒరిస్సా తీరప్రాంతాలలో లభిస్తాయి. దీనిలో కొన్ని జాతులను మాత్రమే వ్యవసాయరంగంలో ఉద్యానరంగంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

వీటిలో ముఖ్యమైన సీవీడ్‌ రకాలు:

కప్పాఫికస్‌ ఆల్వరెజి: ఇది తినడానికి వీలయ్యే ఎర్రటి సముద్రపు ఆల్గే. ఇది ఉష్ణమండల ప్రాంతాలలో అధికంగా పెరిగే, లభించే ఆల్గలలో ఒకటి. ఈ ఆల్గే 23.4 మి.గ్రా./లీ. ఐబిఏ, 27.8 మి.గ్రా./లీ. జిబ్బర్లిన్‌, 31.9 మి.గ్రా. సైటోకైనిన్‌ కలిగి ఉంటుంది.

గ్రాసిలేరియా ఎడ్యులిస్‌: ఇది ఎర్రటి ఆల్గే కుటుంబానికి చెందినది. ఇది భారతదేశ ఉప అలల ప్రాంతాలలో అధికంగా లభించే ఆల్గే. ఈ ఆల్గే నుండి తీయబడిన ద్రవం/సారంలో ఫాస్ఫరస్‌ 278.5 మి.గ్రా./లీ., సోడియం 195.2 మి.గ్రా./లీ., ఐరన్‌ 12.7 మి.గ్రా./లీ., మాంగనీస్‌ 32.9 మి.గ్రా./లీ. కలిగి ఉంటాయి.

వీటితో పాటు గెలిడైఎల్లా ఎకరోజా ఆస్కోఫిల్లమ్‌ నోడోసమ్‌ కూడా ముఖ్యమైనది.

సీవీడ్‌ తయారు చేసుకొను పద్ధతులు:

తీరప్రాంతాల నుంచి సేకరించిన సముద్రపు ఆల్గేని మొదట సముద్రపు నీటితో బాగా శుభ్రపరచుకోవాలి. దీనివల్ల ఆల్గేకు అంటుకొని ఉన్న మలినాలు, ఇసుక రేణువులు, ఇతర ఆల్గేపై పెరిగే అవసరం లేని మొక్కలు తొలగించబడతాయి. తర్వాత వీటిని పాలిథీన్‌ సంచులలో ఉంచి, వీటిని మంచుపెట్టెలో ఉంచుకోవాలి. తర్వాత వీటిని తయారు చేయు ప్రదేశానికి తీసుకువచ్చి వీటితో ఆల్గేకు అంటుకొని ఉన& లవణాలు తొలగించబడేలా శుభ్రపరచుకోవాలి. తర్వాత తాజా శుభ్రమైన ఆల్గేను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. 1 కిలో ఆల్గే నుంచి సారాన్ని/ద్రవాన్ని సేకరించుకోవాలి. ఈ ద్రవాన్ని/సారాన్ని రెండుపొరల మస్లిన్‌వస్త్రం గుండా పోస్తే వడబోసుకోవాలి. దీనివల్ల ఇతర చిన్న చిన్న మొక్క బాగాలు కూడా తొలగించబడతాయి. ఇలా లభించిన ద్రవం 100% సాంద్రత కలిగిన ద్రవరూప సీవీడ్‌. దీనిని 0-4 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వద్ద నిల్వ చేసుకోవాలి. మొక్కలకు అనుగుణంగా అవసరమైన మోతాదులో దీని నుండి (100% లిక్విడ్‌ సీవీడ్‌) వివిధ మోతాదులను (ఉదాహరణకు 25%) తయారు చేసుకోవచ్చు.

అదేవిధంగా 50 గ్రా.ల ఎండిన పౌడర్‌ని 50 మి.లీ. ల నీటిలో రెండురోజులపాటు నానబెట్టి తర్వాత మస్లిన్‌ వస్త్రంతో వడపోసుకుని కూడా వినియోగించుకోవచ్చు. 

సముద్రపు ఆల్గేని బాగా 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో ఎండబెట్టుకోవాలి. తర్వాత మెత్తని పౌడర్‌ను తయారు చేసుకోవాలి. దీని నుంచి ఎరువు తయారీ కోసం 50 గ్రా. పౌడర్‌ని 50 మి.లీ. నీటిలో ఒక గంటపాటు మరగబెట్టుకోవాలి. తర్వాత మస్లిన్‌ వస్త్రం ద్వారా వడపోసుకోవాలి. ఈ వడపోసిన మిశ్రమాన్ని 50 మి.లీ. వరకు చేసుకోవాలి. దీనివల్ల 100% మోతాదుగల మిశ్రమాన్ని పొందవచ్చు.

పైన తెలిపిన మూడు పద్ధతులలో తీయబడ్డ ద్రవరూప సీవీడ్‌ని తదుపరి ఉపయోగించేవరకు 0-4 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో నిల్వ చేసుకోవాలి. తర్వాత 100% మోతాదుగల ద్రావణాన్ని మొక్కల రకాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వివిధ మోతాదులో నీటితో కలిపి తయారు చేసుకోవచ్చు.

ఈ పద్ధతిలో తాజా సముద్రపు ఆల్గేని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. వీటికి బలమైన ఆమ్లాలయిన హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం లేదా సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని కలిపి 30 నిమిషాలపాటు 40-50 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో ఇంకుబేట్‌ చేసుకోవాలి. ఈ ఆమ్లం సంక్లిష్ట పదార్థాలని ద్రవరూప మిశ్రమం నుంచి తీసివేస్తాయి.

ఇందులో పైన తెలిపిన పద్ధతిలో ఉపయోగించిన ఆమ్లం స్థానంలో సోడియం హైడ్రాక్సైడ్‌ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్‌ క్షారాలను వినియోగిస్తారు. ఈ పద్ధతిలో కూడా తాజా సముద్రపు ఆల్గేని చిన్నముక్కలుగా కత్తిరించుకొని, బలమైన క్షారాలను కలుపుకొని అధిక ఉష్ణోగ్రతలో (70-100 డిగ్రీ సెంటీగ్రేడ్‌) 30 నిమిషాల పాటు ఇంకుబేట్‌ చేసుకోవాలి.

ఇది కొంచెం క్లిష్టమైన, ఆధునిక పద్ధతి. దీనిలో ఎండిపోయిన సముద్రపు ఆల్గేని నీటిలో బాగా నానబెట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమానికి సూక్ష్మతరంగాలను పంపి వేడి చేయడం వల్ల ద్రవరూప సముద్రపు ఆల్గే ఎరువును పొందవచ్చు.

వ్యవసాయరంగంలో ప్రాధాన్యత

  • సముద్రపు ఆల్గే ఎరువులు ద్రవరూపంలో, గుళికలుగా, పౌడరు రూపంలో మార్కెట్‌లో లభ్యమవుతాయి.
  • వీటిని ఎరువులుగా ఆకులమీద పిచికారి చేసేవిధంగా, కండిషనర్లుగా, నేలలో కలిపేవిధంగా వినియోగించుకోవచ్చు. 
  • ఇది అన్ని రకాలైన ధాన్యాలు, పప్పులు, పూల మొక్కలలో లాభదాయకమైన ప్రభావాన్ని చూపించినవిగా కనుగొనబడ్డాయి.
  • ఈ సీవీడ్‌ ఎరువులు కలుపు మరియు వ్యాధికారక శిలీంద్ర రహితం
  • నేలలో కంటే ఆకులమీద పిచికారి చేయటం వల్ల మొక్కలు పోషకాలను త్వరగా గ్రహించుకొంటాయి.
  • ఆకులమీద పిచికారి చేయటం వల్ల ధాన్యం, కూరగాయలు, పండ్లతోటల్లో మొక్కల ఎదుగుదల మరియు దిగుబడిని పెంచూయి.
  • ఈ ద్రవరూప సముద్రపు ఆల్గే ఎరువులు తక్కువ మోతాదులో (1:1000) క్రియాశీలకంగా పనిచేస్తాయి.

విత్తన అంకురోత్పత్తిలో ప్రాధాన్యత

  • విత్తనాలను తక్కువ మోతాదు సముద్రపు ఆల్గే ఎరువులో నానబెట్టి విత్తుకోవడం వల్ల ఎక్కువ అంకురోత్పత్తి, వేరు మరియు మొక్క పెరుగుదల అధికంగా ఉంటుంది. తక్కువ మోతాదులో మొక్క ఎదుగుదలకు అవసరమైన ఆక్సిన్లు, జిబ్బర్లిన్లు, సైటోకైనిన్‌లు, సూక్ష్మ, స్థూల పోషకాలు లభ్యమవుతాయి.
  • ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే అంకురోత్పత్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మోతాదుల్లో అధిక లవణాలు ఉండి అంకురోత్పత్తి నారు పెరగకుండా చేస్తాయి.
  • ఇవి మొక్కలకు అవసరమైన హార్మోన్లు కలిగి ఉండటం వల్ల, వేరు మరియు మొక్క పెరుగుదలను మెరుగుపరుస్తాయి.
  • అధిక కార్బన్‌ సమీకరణవల్ల కిరణజన్య సంయోగక్రియ పెరిగి పండ్లతోటలు మరియు పూల దిగుబడి పెరుగుతుంది.
  • ఇవి మొక్క ఎదుగుదలకు, అభివృద్ధికి కారణమైన మొక్క పెరుగుదల నియంత్రణకారులను కలిగి ఉండటం వల్ల మొక్కల్లో వార్ధక్య థ తగ్గిస్తుంది.
  • నేలలో లాభదాయకమైన సూక్ష్మజీవులు పెరుగుదలకు దోహదపడతాయి.
  • సీవీడ్‌ని వాడటం వల్ల మొక్కల్లో పర్యావరణ ఒత్తిడులను తట్టుకొని సామర్ధ్యం పెరుగుతుంది.
  • యాంటీఆక్సిడెంట్స్‌ పెరుగుదలకు దోహదపడతాయి.
  • ఈ సేంద్రియ ఎరువులను వినియోగించటం వల్ల కీటకనిరోధక, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
  • అదేవిధంగా ఈ సీవీడ్‌ ఎరువులలో సైటోకైనిన్లు ఉండటం వల్ల మొక్కల్లో క్రియాశీలమైన, ఉపయోగకరమైన వేరుబుడిపెల పెరుగుదలకు దోహదపడతాయి.
  • ఈ సముద్రపు ఆల్గే ఎరువులలో సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండటం వల్ల మొక్కలకు అవసరమైన తేమని, పోషకాలను వేరుకు అందుబాటులో ఉంచుతాయి. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది.
  • సీవీడ్‌ వేరు విస్తరణను పెంచటం వల్ల ప్రోటీన్‌ తయారీకి అవసరమైన నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌ను మరియు సల్ఫర్‌ను అధికంగా గ్రహించుకొని ప్రోటీన్‌ శాతాన్ని పెంచుతాయి.
  • ఈ సీవీడ్‌ హార్మోన్లు, ఎంజైములు, పెరుగుదల నియంత్రణకారులు కలిగి ఉండటం వల్ల పంటల మరియు పూల నిల్వ కాలాన్ని కూడా పెంచుతాయి.

ఇటువంటి ఉపయోగాల వల్ల ప్రస్తుత రోజుల్లో సహజసిద్ధమైన సముద్రపు ఆల్గే వినియోగం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. 

దరిపల్లి శ్రీలక్ష్మి, పిహెచ్‌.డి, ఫ్లోరికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్‌, బిధన్‌ చంద్ర కృషి విశ్వవిద్యాలయం, మోహన్‌పూర్‌, పశ్చిమబెంగాల్‌. ఫోన్‌: 70324 60731

Read More

ఏప్రిల్‌ నెలలో సేద్యపు పనులు

కరోనా ప్రభావం తగ్గిపోతున్నది. చలికాలపు పంటలు చేతికొచ్చే సమయం. వేసవిలో ఎండలు సాధారణం కంటే ఎక్కువ వుంటాయనే ప్రెడిక్షన్‌లు. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్‌ (రేవతి, అశ్విని, భరణి కార్తె తొలి రోజులు)లో వివిధ పంటలలో ఆచరించవలసిన పనులను గురించి తెలుసుకుందాం. పంటల నమ్ముకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కూడా తెలుసుకుందాం.

వరి: వార్తల్లో విశేషంగా వినిపిస్తూ, రాజకీయాలతో ముడిపడిన పంట. నవంబరులో విత్తిన వరి పంట కోతలు ఏప్రిల్‌లో ఉంటాయి. కొన్ని చోట్ల ఈ నెలలో ఈదురుగాలులు, వడగండ్ల వానలు వచ్చి తయారైన పంట దెబ్బతినవచ్చు. వీటి నుండి వీలైనంత వరకు తప్పించుకోవాలంటే, పంట తయారైన వెంటనే కోయాలి. యంత్రాల సహాయం తీసుకుంటే పని తొందరగా అవుతుంది. పిలక, పూత, పాలుపోసుకొను, గింజ గట్టిపడుథ వరకు భూమిలో తేమ తగ్గకుండా ఉంచితే నూక శాతం బాగా తగ్గి, గట్టి బియ్యం ఎక్కువగా వస్తాయి. పంట కోసినాక ఏప్రిల్‌ ఎండల్లో తెగ ఎండితే, ఎక్కువగా నూకలొస్తాయి. కాబట్టి వడ్లను మోతాదుగానే ఆరనివ్వాలి. రైతులకు మేలు చేయాలంటే ప్రభుత్వాలు రైతుల దగ్గర కొని ఎక్స్‌పోర్ట్‌ చేయడానికి అపార అవకాశాలున్నాయి. అప్పుగా ఎక్స్‌పోర్ట్‌ చేసి, తర్వాత వడ్డీతో సహా వసూలు చేసుకుంటే నష్టాలు అంతగా ఉండవు. లాభాలు కూడా రావచ్చు. కొద్దిపాటి నష్టాలున్నా ప్రభుత్వాలు భరిస్తే ఆ ప్రభుత్వాలకు రైతుల్లో మహామంచి పేరొస్తుంది. పాతబియ్యానికి ఎక్కువ ధర వస్తుంది. వీలున్న రైతులు, రైతు సంఘాలు వడ్లను నిల్వ చేసి, పాతవయినాక బియ్యం చేసి అమ్మవచ్చు. వరి నిల్వకు పల్లెల్లో ఖాళీగా ఉన్న రూములు/ఇండ్లు వాడవచ్చు. ఎడగారు (రాయలసీమ), కత్తెర (తెలంగాణ), షష్ఠికం (ఉత్తరకోస్తా) పంటల పేరుతో ఈ నెలలో వరి విత్తే రైతులు, వరికి బదులుగా పశుగ్రాసాలు, పూలు అధిక ధరలు పలికే కూరగాయలు పంట పెట్టవచ్చు. ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఎక్కువ భూమిలో సాగు చేయవచ్చు. స్వంత అవసరాలకు వీలైనంత వరకు సేంద్రియ పద్ధతిలో పండించాలనే రైతులకు ఈ నెల గొప్ప సదవకాశం. కనీసం పాతిక లేక అర ఎకరంలో సేంద్రియ పద్ధతిలో పండించి ఎక్కువగా ఉన్న పంటను అధిక ధరలకు అమ్ముకోవచ్చు. ప్రతి సంవత్సరం, విస్తీర్ణాన్ని కొద్దికొద్దిగా పెంచుతూ పోతూ, కొన్నేళ్ళల్లో మొత్తం సేంద్రియ పద్ధతిలోకి అదీ దిగుబడులు తగ్గకుండా పండించవచ్చు. మనుషుల, పంటల మరియు భూమి ఆరోగ్యంతో పాటు డబ్బు లాభాలు స్వంతం చేసుకోవచ్చు. ఇండ్ల ముందరకొచ్చి వడ్లను బియ్యం చేసే చిన్న మిషన్‌లను ప్రభుత్వాలు సబ్సిడీమీద ఇస్తే పెద్ద మిల్లుల మీద ఆధారపడడం తగ్గి రైతులు బాగుపడతారు.

జొన్న: హైదరాబాద్‌లో జొన్న పిండి కిలో 70 రూపాయలకు రిటైల్‌గా అమ్ముతున్నారు. రైతుకు మంచి ధర వస్తుంది. జనవరిలో విత్తిన జొన్నలో కంకినల్లి, గింజబూజు ఆశించే అవకాశమున్నది. వీటి నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు ఏప్రిల్‌లో తీసుకోవాలి.

సజ్జ: పంట కోతలు ఈ నెలలో ఉంటాయి. పిలక కంకుల కంటే, ప్రధాన కాండపు కంకి ముందుగా కోత కొస్తుంది. అందువలన కనీసం రెండుసార్లయినా కంకులు కోయాలొస్సుంది.

పెసర, మినుము: ఈ పంటల కోతలు ఏప్రిల్‌లో ఉంటాయి. ఊరి సంఘాలు రిటైల్‌గా అమ్మకాలు మొదలుపెడితే, మధ్యవర్తుల లాభాలు కూడా రైతులకే దక్కుతాయి. ఊరందరి వినియోగదారులకు తక్కువ ధరకు, పెసరపప్పు, మినపప్పు దొరుకుతుంది.

వేరుశనగ: డిశంబరులో విత్తిన వేరుశనగను ఏప్రిల్‌లో భూమిలో నుండి తీయాల్సుంటుంది. కాయలు తెగిపోకుండా భూమినుండి బయటకు తీయాలంటే, భూమిలో తగినంత తేమ ఉండాలి. ట్రాక్టరుతో నడిచే బ్లేడు గుంటక లేక వేరుశనగ డిగ్గర్‌ను వాడవచ్చు. పారనాగలి (నాగలి చివర పార ఉన్నది) కూడా ఉపయోగించవచ్చు. తక్కువ ధర వేరుశనగ డిగ్గర్‌లను ప్రాచుర్యంలోకి తేవాల్సిన అవసరముంది. సబ్సిడీలో సప్లయి చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాయలను చెనిగి చెట్ల నుండి వేరుచేయడానికి స్ట్రిప్పర్‌ను ఉపయోగించి త్వరగా పని ముగించవచ్చు. ప్రతి ఊరిసంఘం అద్దె పాత్రిపదికన యంత్రాలను రైతులకు సప్లయి చేయవచ్చు. సబ్సిడీ మీద ఇలాంటి యంత్రాలను ఇంకా ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహించాలి. ఈ నెలలో పండిన కాయలను విత్తనానికి వాడాలంటే, నీడలో ఆరబెట్టాలి. ఎండలు తీవ్రంగా ఉండుట వలన ఎండలో ఆరబెడితే మొలకశాతం బాగా తగ్గుతుంది. కాయలను నిల్వ చేయాలంటే తేమ శాతం 9 కంటే తక్కువ ఉండాలి. పచ్చికాయగా అమ్ముకోవాలంటే, మట్టి లేకుండా శుభ్రం చేసి అమ్మితే ఎక్కువ రేటొస్తుంది.

కొత్తిమీర: ఎండవేడి ఎక్కువగా ఉన్నందున ఏప్రిల్‌, మే నెలలో కొత్తిమీర సరిగా ఎదగదు. కొంత నీడ, కొంత ఎండ ఉంటే ఎండాకాలంలో కొత్తిమీర బాగా వస్తుంది. షేడ్‌నెట్‌లు సబ్సిడీలో దొరుకుతుంటే తీసుకొని మంచి కొత్తిమీర పంట తీయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో తొలి నెల నుండి ఏప్రిల్‌, మే నెలల్లో కూడా సబ్సిడీ మీద షేడ్‌నెట్లు దొరికే విధంగా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకుంటే రైతులుకు మేలు జరుగుతుంది. చౌడు భూముల్లో సాధారణ రకాల కొత్తిమీర సరిగా ఎదగదు. కో-2 అనే రకం చౌడు భూముల్లో కూడా వస్తుంది. సాధారణ నేలల్లో విత్తడానికి అధిక ఆకుదిగుబడినిచ్చే రకాలు: ఆర్‌.సి.ఆర్‌-446, ద్వా-3, పంత్‌హరితిమా, హిస్సార్‌ ఆనంద్‌, సాధన, కో-1, కో-2, కో-3.

పొదీన: మసాలా కూరల్లో విరివిగా వాడే పుదీనా ఆకుకు కూడా ఎండాకాలంలో మంచి గిరాకీ ఉంటుంది. రంజాన్‌ నెల కూడా ఏప్రిల్‌లో ఉన్నందున దీనికి మంచి గిరాకీ ఉండే అవకాశముంది. ఈ పంటను, కాండపు ముక్కల ద్వారా మరియు వేర్ల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరా పొలానికి 3-4 క్వింటాళ్ళ కాండపు ముక్కలు నాటడానికి అవసరముంటాయి. వరుసల మధ్య 45 సెం.మీ. కాండపు ముక్కలు నాటి, మట్టితో కప్పాలి. చిగురు వచ్చి తీగలుగా ఎదుగుతాయి. దిగుబడి: 15-20 టన్నులు/ఎకరాకు. అనువైన రకాలు: సక్షమ్‌, కోసి, శిలిక్‌, హిమాలయ.

పాలకూర: అత్యధిక పోషక విలువలు గలిగిన ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. ఇందులో ఇనుము, కాల్షియం, మాంసకృత్తులు, విటమిన్‌ ఎ, సి, పుష్కలంగా ఉంటాయి. అధిక దిగుబడి రావాలంటే ఉదజని సూచిక 7.0 కు దగ్గర గా ఉన్న భూములు అత్యంత అనుకూలం. అయినా ఉదజని సూచిక 10.5 ఉన్న అధిక క్షారనేలల్లో కూడా, ఈ పంట తీసుకోవచ్చు. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: ఊటీ-1: దిగుబడి 24 ట/ఎ., జాంనగర్‌ గ్రీన్‌ : దిగుబడి 16-19 ట/ఎ. 

తోటకూర: అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: పూసాకీర్తి: 22 ట/ఎ. పూసాకిరణ్‌: 14 ట/ఎ. ఎర్రతోటకూర రకాలు: అర్క సుగుణ, అర్క అరుణ, దిగుబడి: 3-5 ట/ఎ.

సిరికూర: కాండం కూడా కూరగా ఉపయోగపడుతుంది. దిగుబడి : 4-5 ట/ఎ.

మెంతికూర: ఆకు కోసం సంవత్సరమంతా సాగు చేయవచ్చు.విత్తిన 25-30 రోజులకు మొదటి కోత, తర్వాత 10-15 రోజుల కొకకోత 2-3 కోతలు తీసుకోవచ్చు. అనుకూలమైన రకాలు: గుజరాత్‌ మేథి, లాంమేథి-1 (ఎల్‌.ఎఫ్‌.సి-84), లాంమేథి-2 (ఎల్‌.ఎఫ్‌.సి-103).

టమాట: ప్రాజెక్టుల్లో చెరువుల్లో బాగా నీరున్నందున భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. టమాట సాగు చేయడం రైతులకు బాగా వచ్చు. ఎక్కువ విస్తీర్ణంలో పంట పెట్టడం వలన దిగుబడి ఎక్కువగా వస్తున్నది. వాతావరణంలో ఎండ బాగా ఉంటే దిగుబడి బాగుంటుంది. మేఘావృతమైతే దిగుబడి బాగా పడిపోతుంది. ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. మేఘావృతమైన వాతావరణం ఏర్పడితే తప్ప దిగుబడి తగ్గదు. ధరలు పెరగవు. మంచి ధరలు రావాలంటే విస్తీర్ణాన్ని నియంత్రించాలి. తక్కువ రేట్లున్నపుడు టమాటతో విలువ పెంచే పదార్థాలు (వాల్యూయాడెడ్‌ ప్రాడక్ట్సు) చేసి విక్రయించుకోవాలి.

వంగ: టమాట ధరల కంటే వంగ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ పంట కాలం ఎక్కువవడం వలన రైతులు ఈ పంటపై తక్కువ మొగ్గుచూపుతున్నారు. ప్రాంతాలవారీగా వేరు వేరు రకాలను ఇష్టపడుట వలన అన్ని ప్రాంతాలకు అనువైన రకాలు. ఉత్పిత్తి తక్కువ. టమాట రేట్లతో పోలిస్తే ఈ పంట రేట్లు ఒడిదుడుకులు లేకుండా మధ్యస్థంగా ఉంటున్నాయి. నల్ల రకాల కంటే తెల్ల వంకాయలకు ధర ఎక్కువ. పుచ్చులను తెల్లరకాలలో గుర్తు పట్టడం సులభం కావడం కూడా తెల్లవంకాయల గిరాకీకి కారణం.

కీరదోస: ఎండలు ముదిరేకొద్దీ ఈ పంటకు గిరాకీ ఎక్కువ. పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌ల విస్తీర్ణం మరియు దిగుబడి పెరుగుతున్నది. కీరదోసపై ప్రజాదరణ కూడా పెరుగుతున్నది. ప్రతి ఫంక్షన్‌లోను కీరదోస ముక్కలు సాలాడ్‌గా పెట్టడం అలవాటైపోతున్నది. అందువలన, ఇప్పట్లో ఈ పంటకు మంచి ధరలే ఉండే అవకాశమున్నది. అనుకూలమైన ఆడ, మగ వేర్పాటు లేని (పార్థినోకార్పిక్‌) రకాలు: సన్‌-9728, సన&-3019, కియోన్‌.

కూరమిరప/కాప్సికం/బెంగుళూరు మిర్చి: పల్లెల్లో కూడా ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినడం పెరిగిపోవడం, చైనీస్‌ వంటకాలైన నూడుల్స్‌ వంటి వాటికి ప్రజలు ఆకర్షితులవడం ఈ పంటకు గిరాకీ పెంచుతున్నది. ఎండాకాలంలో శుభకార్యాలు, ఫంక్షన్‌లు ఎక్కువగా ఉంటాయి. దీనికితోడు అనుకూలమైన, అత్యధిక దిగుబడి (40ట/ఎ) నివ్వగల హైబ్రిడ్‌లు, హరిత గృహాల్లో పండించడానికి విత్తనాలు బజార్లో పుష్కలంగా దొరుకుతున్నాయి. కొన్ని మంచి హైబ్రిడ్‌లు: ఎరుపు: ట్రిపుల స్టార్‌, నతాషా, ఇన్స్‌పిరేషన్‌, బోంబె, పసరిల్లా. పసుపు: సన్‌యెజ్‌, ఓరోబెల్లి, బచ్చాట, స్వర్ణ, ఆకుపచ్చ: యమున, ఇంద్ర.

చేమగడ్డ: ఏప్రిల్‌లో కూడా వీటిని నాటవచ్చు. అరటి, కొబ్బరి వంటి తోటల్లో అంతర పంటగా దీనిని సాగు చేయవచ్చు. చేమ దుంపల పొలంలో మొదటి 2 నెలల్లో పంట పూర్తయ్యే ఫ్రెంచ్‌ బీన్స్‌, ముల్లంగి పంటలను అంతర పంటలుగా సాగు చేసి అధికాదాయాన్ని పొందవచ్చు. మంచి రకాలు: భావపురి (కె.సి.ఎస్‌-2): 8 నెలలు, 14 ట/ఎ. కె.సి.ఎస్‌-3: 5 నెలలు, 9.6 ట/ఎ. విత్తనంగా తల్లి దుంపల నుండి పిలకదుంపలు వాడినప్పటి కంటే ఎక్కువ దిగుబడి పొందవచ్చు. విత్తడానికి 300-400 కిలోలు/ఎకరానికి దుంపలు అవసరం. 

అల్లం: ఈ పంట విత్తడానికి ఏప్రిల్‌ తొలివారం నుండి మే కడ వరకు అనుకూలం. జూన్‌-జులైల్లో గాలులతో కూడిన అధిక వర్షాలకు పడిపోకుండా అల్లం మొక్కలు నిలదొక్కుకోవాలంటే ముందుగా విత్తడం అవసరం. భూమిలో తేమ తగినంతగా లేకపోతే నీటి తడి ఇచ్చి లేకపోతే వర్షం బాగా పడినాక విత్తుకోవాలి. ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి, ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలు అల్లం దిగుబడికి అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ ఉండే ద్రాక్ష, నిమ్మ, బొప్పాయి, మామిడి, కొబ్బరి, జామ తోటలు పందిరి కూరగాయ తోటల్లోను ఈ పంటను పండించవచ్చు. అధిక పచ్చి అల్లం మరియు ఎండు అల్లం కొరకు అనువైన రకాలు తెలంగాణకు : మారన్‌, రియోడిజనీరో. ఆంధ్రప్రదేశ్‌కు : వైనాడ్‌ లోకల్‌, రియోడిజనీరో.

పసుపు: ఈ పంట తవ్వి తీయడం ఏప్రిల్‌లో ఉంటుంది. ఉడకబెట్టడం, ఆరబెట్టడం, పాలిషింగ్‌, గ్రేడింగ్‌, మార్కెట్‌కు పంపుట ఈ నెలలో ఉంటాయి. ట్రాక్టరుతో త్రవ్వించడం వలన ఎక్కువ విస్తీర్ణంలోని పంటను వెలికి తీయవచ్చు. తక్కువ గాయాలు తగిలిన దుంపలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిలో మిగిలిపోయే దుంపలు కూడా తక్కువ.

నిమ్మ, బత్తాయి: కొమ్మ కత్తిరింపులు, వేరుమూలాల్నుండి పెరిగే కొమ్మలు, కాండంపై 2 అడుగుల వరకు పెరిగే కొమ్మలు, నీడన ఉన్న అనవసరమైన, ఎండిన పుల్లలను కత్తిరించాలి. కత్తిరించిన చోట బోర్డోపేస్టు పూసి తెగుళ్ళు సోకకుండా కాపాడవచ్చు. 

పశువుల మేత: ఎండల్లో పచ్చిమేతకు మంచిగిరాకీ. ఈ నెలలో విత్తదగిన పశుగ్రాస పంట: జొన్న, పి.సి.-6 అనే రకం సున్నారపు నేలల్లో కూడా పెరుగుతుంది. ముందుగా విత్తిన పశువుల మేత పంటల నుండి, మేతను సేకరించి బాగా ఎక్కువ ధరకు ఎండాకాలంలో అమ్ముకునే వీలుంది.

మామిడి: ఈ పంటకు నీటి తడులను ఆపాలి. బాగా తయారైన లేత ఆకుపచ్చ రంగున్న కాయలు, అందులో కండ లేత పసుపు రంగుకు మారినటువంటి కాయలు కోయడానికి అనుకూలం. మామిడి కాయలను ఇథిలిన్‌ వాయువుతో మాగబెట్టవచ్చు. కాల్షియం కార్బైడ్‌ ద్వారా మాగబెట్టరాదు.

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి దేశీయ ఆవులను సబ్సిడీ రూపంలో ఇస్తే రైతుల, ప్రజల ఆరోగ్యానికి సేవ చేసినట్లవుతుంది.

పలు పంటలపైన, రైతు సంఘాలపైన సలహాలు, సూచనలు పొందగోరే వారు 9494408619 కు ఫోను చేయవచ్చు. సంఘాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కూడా ఏర్పాటు చేయించుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో SALLA NARAYANASWAMY/Profsnswamy అకౌంట్లలో పోస్టింగులలో వివిధ విషయాలపై వివరణలను, ఫొటోలతో సహా చూడవచ్చు. సలహాలు, సూచనలు రైతులకు ఉచితం.

Read More