మన ఆరోగ్యాన్ని కాపాడుటలో మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, శారీరక శ్రమ, మన మానసిక పరిస్థితి, ప్రకృతితో మమేకమవడం లాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కాని ప్రస్తుత కాంక్రీట్‌ జంగిల్స్‌ మరియు ఉరుకుల పరుగుల జీవితాలలో ఇవన్నీ అందుబాటులో దొరకడము చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ అందుబాటులో లేకపోవడముతో చాలామంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి తమతమ ఆరోగ్యాలను సంరక్షించుకోవాలనుకునే వారందరూ తమకు అవకాశం ఉన్నంతలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు అందుబాటులోకి వచ్చిన మార్గమే ఇంటిపంట. ఇంటి పంట వలన రసాయనాలు లేని కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లను పొందడముతో పాటు పచ్చదనం వలన వాతావరణ కాలుష్యం తగ్గటంతో పాటు ఇంటి పంట వలన శారీరక శ్రమకు అవకాశం కుదురుతుంది కాబట్టి ఆహ్లాదకర వాతావరణానికి ఇంటి పంట సరైనదారి అని నమ్మి ఇంటిపంటను ఇప్పటి వరకు చేపట్టిన వారు, ఇంకా చేపట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.  ఆరోగ్యకర ఆహారాన్ని పొందడముతో పాటు యోగా చేసుకోవటానికి, తనకిష్టమైన సంగీతాన్ని పచ్చని మొక్కల మధ్య ఆస్వాదించటానికి సరైన దారి ఇంటిపంట అని గ్రహించి విజయవాడ, పటమట ప్రాంతానికి చెందిన భారతిదేవి మిద్దెతోటను మొదలు పెట్టారు.

భారతీదేవి కాస్మొటాలజిస్ట్‌. వీరికి చిన్నతనం నుంచి పచ్చదనం, సంగీతం, యోగాల మీద మక్కువ చాలా ఎక్కువ. తన వృత్తిలో తీరిక లేకుండా ఉండే భారతీదేవి తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకుంటూ కాస్మొటాలజిస్ట్‌గా తన వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ సంగీతానికి, యోగాకి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. వాటితోపాటు ఇంటి పంటపై కూడా మక్కువ ఉంది కాబట్టి కొంత సమయాన్ని కేటాయించి తమ మిద్దె మీద కొన్ని రకాల మొక్కల పెంపకం చేపట్టి కొనసాగిస్తున్న పరిస్థితులలో కరోనా రావడం జరిగింది. కరోనా సమయంలో ఎక్కువ సమయం ఇంటి వద్దనే గడపవలసి రావడముతో ఆ సమయాన్ని తమ మిద్దె తోటలోని మొక్కల సంఖ్యను పెంచటానికి కేటాయించి మిద్దెతోటను అభివృద్ధి చేశారు.

మిద్దెమీద మొక్కల పెంపకం చేస్తున్నారు కాబట్టి స్లాబుమీద నీరుపడి స్లాబు పాడవకుండా ఉండటానికి వీలుగా స్లాబుకు వాటర్‌ ఫ్రూప్‌ కోటింగ్‌ను వేయించడంతో పాటు స్టాండులు ఏర్పాటు చేసుకుని స్లాండులపై కుండీలు, టబ్బులు, డ్రమ్ములు లాంటివి ఏర్పాటు చేసుకుని వాటిలో మొక్కల పెంపకం చేస్తున్నారు. అన్ని రకాల మొక్కలకు ఒకే రకమైన కంటెయినర్లు ఉపయోగించకుండా మొక్కల రకాలను బట్టి కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. ఆకుకూరలకు వెడల్పు మూతి ఉండే టబ్బులను, పండ్ల మొక్కల పెంపకానికి డ్రమ్ములను, కూరగాయలకు బక్కెట్లను…. ఈ విధంగా మొక్కల రకాన్ని బట్టి అందుకు అనుకూలంగా ఉండే కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. మట్టి మిశ్రమంలో మట్టి, ఎరువు, వేపపిండి, ఇసుక లాంటి వాటిని కలుపుకున్నారు. మట్టి మిశ్రమములో కోకోపిట్‌ను ఉపయోగించలేదు. ఈ మట్టి మిశ్రమము మూడు నెలల వరకు మొక్కలకు పోషకాలను అందిస్తుంది. కాబట్టి మూడునెలల తరువాత మరలా అవసరమైన మట్టి మిశ్రమాన్ని అందిస్తుంటారు. కంటెయినర్లలోని మట్టి గట్టిపడినట్లయితే మొక్క పెరగదు కాబట్టి మట్టి గట్టిపడకుండా ఉండేందుకు గాను క్రమం తప్పకుండా మట్టిని కలుపుతూ మట్టి గుల్లగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇంట్లో వృథాగా పడి ఉండే ప్లాస్టిక్‌ బక్కెట్లు మరియు ఇతర సామాగ్రిని కూడా కంటెయినర్లగా ఉపయోగిస్తూ&వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.

వీరి మిద్దెతోటలో చింతచిగురు కోసం చింత, సపోట, జామ, అంజీర, డ్రాగన్‌ఫ్రూట్‌, దానిమ్మ, అరటి, ఉసిరి, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి మొదలగు మొక్కలతో పాటు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఆల్‌స్సైసెస్‌ మొక్క, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, బీర సొర, కాకర లాంటి తీగజాతి కూరగాయల మొక్కలను కూడా ఆయా మొక్కలకు అనుకూలమైన కంటెయినర్లలో పెంచుతున్నారు. వీటితో పాటు కొన్ని రకాలను పాలినేషను కొరకు, మిద్దెతోట అందంగా కనిపించేందుకుగాను పెంచుతున్నారు. వేసవి కాలంలో మొక్కల పాదులలో కొబ్బరి పీచు లేదా ఎండు ఆకులను ఏర్పాటు చేయడం వలన ప్రయోజనం బాగా ఉంటుందని ఆవిధంగా చేస్తున్నారు. వేసవి కాబట్టి పిచ్చుకలకు, పకక్షులకు తాగేందుకు నీటిని కూడా మొక్కల నీడలో ఏర్పాటు చేయడం వలన వివిధ రకాల పకక్షులు వీరి మిద్దెతోటలో కనిపిస్తుంటాయి.

వీరికి సంగీతంపై మక్కువ ఎక్కువ కాబట్టి ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో వీణవాయించటానికి కేటాయిస్తారు. మిద్దెతోటలో వీణ వాయించటముంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వీణవాయించటం వలన పొందే తృప్తితో పాటు మిద్దెతోటలోని మొక్కలకు కూడా ప్రతిరోజు సంగీతాన్ని వినిపిస్తున్నారు. అంతేకాకుండా తాను చిన్నతనం నుంచి యోగా చేస్తుంటారు. ఇప్పుడు మిద్దెతోటలో యోగా చేయడం వలన ఫలితాలు ఇంకా ఆశాజనకంగా ఉంటున్నాయని భారతీదేవి అంటున్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో గడపడం వలన శారీరక శ్రమకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు.

తమ ఇంట్లో తమ చేతులతో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా మంచి రుచిగా ఉంటాయని, కూరగాయలు, ఆకుకూరలు త్వరగా ఉడుకుతాయని, తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మిద్దెతోటలో ఉసిరి, చింత లాంటి విటమిన్లు అందుబాటులో ఉండే మొక్కలను పెంచి వాటిని ఆహారంగా తీసుకున్నట్లయితే మన శరీరానికి కావలసిన విటమిన్లు సహజ సిద్ధంగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి మిద్దెతోట వలన అందరికీ ప్రత్యేకించి స్త్రీలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు  ఉంటాయి కాబట్టి అందరు ఇంటి పంటను తప్పని సరిగా చేపట్టాలని భారతీదేవి కోరుతున్నారు. కొత్తగా ఇంటి పంటను చేపట్టే వారు మొదటలో ఆకుకూరలతో మొదలుపెడితే ఫలితాలు బాగుంటాయనే సూచనను ఇంటిపంటను మొదలు పెట్టేవారికి ఇస్తున్నారు.   

  – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌