తెలంగాణలో మిద్దెతోటల సాగుకు అన్నివిధాలా ప్రోత్సహం అందిస్తున్నామని రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకురాలు షేక్ యాస్మీన్ బాషా తెలిపారు. సిక్కిం రాష్ట్ర ఉద్యానశాఖ అదనపు సంచాలకుడు బిజు పెరియార్ గురువారం తమ బృందంతో కలిసి తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా మిద్దెతోటల పెంపకాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన యాస్మీన్ బాషతో సమావేశమై మిద్దెతోటల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తోటల సాగుకు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తూ పెంపకందారుల అనుమానాలను నివృత్తి చేస్తున్నామన్నారు.
ఈ నెల 22, 23 తేదీల్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కీలక శిఖరాగ్ర సభ ‘ఫూచర్ 2024’ జరగనుంది. ఈ నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింగెన్ (నెదర్లాండ్స్)కు చెందిన డాక్టర్ ప్రజల్ ప్రధాన్ సారథ్యంలోని పరిశోధకుల బృందం ఒక అధ్యయనం నిర్వహించింది. నగరాలు, నగర పరిసర ప్రాంతాల్లో ఇళ్ళపైన, ఖాళీ స్థలాలలో చేపట్టే వ్యవసాయ కార్యకలాపాలనే అర్బన్ అగ్రికల్చర్‌గా చెప్పవచ్చు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఇంటి పంటలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, పశుపోషణ, పాడి పరిశ్రమ, కోళ్ళు, చేపల పెంపకం.. వంటి కార్యకలాపాలన్నీ ఈ అర్బన్ అగ్రికల్చర్ కోవలోకే వస్తాయి. ‘అర్బన్ అగ్రికల్చర్’ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. కాని ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించే అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను పాటించగలిగినప్పుడే దాని ప్రయోజనాలు ఒనగూడతాయని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ స్పష్టం చేశారు. అర్బన్ అగ్రికల్చర్ వల్ల ఆహారం, విద్య, సాంఘిక సదుపాయాలను కల్పించడంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు సుస్థిరత ఎలా ఎలా చేకూరుతుందో శాస్త్రబద్ధంగా ఈ అధ్యయనం రుజువులు చూపించింది అని డాక్టర్ ప్రధాన్ వివరించారు.
మనందరికి ఆరోగ్యం తప్పనిసరి. ఆరోగ్యం లేని జీవితాలలో ఆనందం ఉండదు. కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం తప్పనిసరి అనే విషయం అక్షర సత్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి, నీటితో పాటు మంచి ఆహారం తీసుకోగలగాలి. మన ఆరోగ్యం ప్రధానంగా ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం కావాలంటే సాధ్యమయినంత వరకు వేరే వారి మీద ఆధారపడకుండా తామే సొంతంగా పండించుకుని తింటేనే మంచి ఆహారం దొరుకుతుందనే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొన్నాయి. మనం తినే అన్ని రకాల ఆహారాలు అందరం పండించుకోలేము కాబట్టి ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారు పండించుకోవటానికి కొంతమంది ఔత్సాహికులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టే ఇంటి పంటదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. వివిధ రంగాలలో ఉన్నవారు ఎవరికి అవకాశం ఉన్నంత మేరలో వారు కొన్ని మొక్కలు పెంచుకుంటున్నారు. ఇంట్లో మొక్కలు పెంచుకోవటం వలన ఆరోగ్యకరమయిన ఆహారం సొంతంగా పండించుకొని తినడముతో పాటు శారీరక శ్రమకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంటిపంటలో గడిపిన సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి మన శక్తి పెరుగుతుంది కాబట్టి మన రోజు వారి పనులలో సామర్థ్యం పెరిగి ఫలితాలు మంచిగా ఉంటాయనడములో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని గ్రహించి ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీనివాస్ తమ ఇంట్లో ఏ మాత్రం స్థలాన్ని వదలకుండా వివిధ రకాల మొక్కల పెంపకం చేస్తున్నాడు.
శ్రీనివాస్‌ది సాఫ్ట్‌వేర్ రంగం. కరోనా తరువాత ఆరోగ్యం యొక్క విలువ తెలుసుకుని ఆరోగ్యకరమయిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలంటే ఇంటి పంటే సరైన దారి అని నమ్మి 2022 వ సంవత్సరం ఆగస్టు నెలలో తమ ఇంటి మేడ మీద, బాల్కనీలో, మిద్దె మీద వివిధ రకాల మొక్కల పెంపకం మొదలు పెట్టి కొనసాగిస్తున్నాడు. మొక్కల పెంపకంతో పాటు అక్వేరియంలో చేపల పెంపకం మరియు కొన్ని రకాల పకక్షులను కూడా పెంచడానికి తగిన ఏర్పాట్లు చేసుకుని పెంపకం చేస్తున్నాడు. పకక్షులకు అవసరమయిన గింజలు కోసం సజ్జ, జొన్న లాంటి విత్తనాలను తమ ఇంటి పంటలో చల్లి వాటి ద్వారా వచ్చే దిగుబడిని పకక్షులకు ఆహారంగా అందిస్తూ వస్తున్నాడు. చేపలు మరియు పకక్షులు పెంపకం వలన మనసుకు ఆహ్లాదం కలిగి రోజు మొత్తం ఆనందంగా గడపడం శ్రీనివాస్ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.
తమ ఇంటిపంటలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు వివిధ రకాల పూలమొక్కలు పెంచుతున్నాడు. నీడపడే ప్రదేశంలో ఇండోర్ ప్లాంట్లని పెంపకం చేస్తున్నాడు. తనకు కొత్త రకాల మొక్కలంటే మక్కువ ఎక్కువ కాబట్టి ఏ కొత్తరకం మొక్క లేదా విత్తనం కనిపించినా వదలకుండా తన ఇంటి పంటలో పెంపకం మొదలు పెడుతుంటాడు. మొక్కల పెంపకానికి గ్రోబ్యాగ్స్, ప్లాస్టిక్ కుండీలను మాత్రమే వినియోగిస్తున్నాడు. మొక్కలలో పరపరాగ సంపర్కం సక్రమంగా జరగాలంటే సీతాకోకచిలకలు, తేనెటీగల లాంటివి కావాలి కాబట్టి వీటిని ఆకర్షించడానికి గాను పసుపురంగు పూవులుపూసే పూల మొక్కలను పెంపకం చేస్తున్నాడు. ఇంటిపంటలో నెమటోడ్స్ సమస్య రాకుండా ఉండటానికి గాను బంతి మొక్కలను పెంపకం చేస్తున్నాడు. సంవత్సరం పొడవునా ఇంటి పంట అందంగా కనిపించడానికి అవసరమయిన వివిధ రకాల పూల మొక్కలను పెంచుతూ ఇంటి పంట అందంగా కనిపించడానికి అవసరమయిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటున్నాడు కాబట్టే తమ ఇంటి పంట 365 రోజులు అందంగా ఉంటుందని శ్రీనివాస్ అంటున్నాడు.
మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి మరియు మంచి దిగుబడిని ఇవ్వడానికి అవసరమయిన సేంద్రియ పదార్థాలను సమయానుకూలంగా అందిస్తూ ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ఇంటి పంటను కొనసాగిస్తున్నాడు. తోటి ఇంటి పంటదారులతో ప్రతినిత్యం కలుస్తూ మెలకువలు తెలుసుకుంటూ అతి తక్కువ సమయంలో ఇంటి పంటలో నైపుణ్యం సాధించి అనేకమంది ప్రశంసలు పొందుతున్నాడు. కొత్తగా ఇంటి పంటను మొదలు పెట్టాలనుకునే వారికి శ్రీనివాస్ మార్గదర్శి కాగలడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
వివిధ రకాల కారణాల వలన ఇటీవల కాలంలో ఇంటిపంటను నిర్వహించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇంటి పంటపై శ్రద్ధ ఉన్నవారు ఎవరికి అవకాశం ఉన్న ప్రాంతంలో అంటే పెరటిలో, బాల్కనీలో, మిద్దెమీద, గోడల మీద… ఎక్కడ అవకాశం ఉంటే ఆ స్థలంలో అవకాశం ఉన్న మొక్కలు పెంచుతూ ఉంటున్నారు. కొంతమందికి ఇంటిపంట మీద ఆసక్తి ఉన్నా కూడా వివిధ రకాల కారణాల వలన ఇంటి పంటను మొదలు పెట్టడం వాయిదా వేసుకుంటూ పోతుంటారు. ఇలా వాయిదా వేసుకుంటూ పోయేవారికి వేరేవారి నుంచి స్ఫూర్తి లభించిందంటే వాయిదాలను ప్రక్కకు నెట్టి కార్యాచరణలోకి దిగుతారు. కొత్తగా ఇంటి పంటను మొదలు పెట్టే అనేకమందికి అప్పటికే ఇంటిపంటను నిర్వహిస్తున్న ఇంటి పంటదారులు స్ఫూర్తిని కలిగించి ఉండవచ్చు. కాని ఇంటిపంట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొంది ఇంటి పంటను మొదలు పెట్టిన వారు ఎక్కువ మంది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. హైదరాబాదు నగరం అమీరుపేటలో గత ఆరు సంవత్సరాల నుంచి మిద్దెతోటను పెంచుతున్న తనకు రఘోత్తమరెడ్డి గారే స్ఫూర్తి అని అప్పారావు అంటున్నాడు.
అప్పారావు గారికి గత 15-20 సంవత్సరాల నుంచి ఇంటిపంట మీద మక్కువ ఉన్నా కూడా ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కాబట్టి ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలు తిరగవలసి వస్తుంది కాబట్టి ఉద్యోగంలో కొనసాగిన కాలంలో పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం చేపట్టకుండా కేవలం కొన్ని మొక్కలను మాత్రం పెంచుకుంటూ వస్తూ 6 సంవత్సరాల క్రితం తన ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తరువాత పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం మొదలు పెట్టాడు. హైదరాబాదు నగరం అమీరుపేటలో మిద్దెమీద ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. తనకు ఇంటిపంటమీద మక్కువ పెరగటానికి ఇంటి పంట నిపుణుడు రఘోత్తమరెడ్డిగారే స్ఫూర్తి అని అప్పారావు వివరిస్తున్నాడు.
తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచాలనే లక్ష్యంతో అప్పారావు ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. ఇందుకుగాను చిన్న చిన్న కంటెయినర్లను ఎక్కువగా మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నాడు. చిన్న కంటెయినర్లు అయితే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. మట్టి మిశ్రమం తక్కువగా పడుతుంది. అంతేకాకుండా కంటెయినర్ బరువు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక చోట నుండి ఇంకో చోటకి మార్చాలంటే సులభంగా ఉంటుంది. ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తమ మిద్దెతోటలో చిన్న కంటెయినర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు.
మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టిమిశ్రమంలో 30 శాతం మట్టి, 30 శాతం వర్మికంపోస్టు, 30 శాతం కోకోపిట్ లేదా ఇసుక మిగిలిన 10 శాతం వేపపిండిని ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా మట్టి మిశ్రమం తయారు చేసుకుని మొక్కల పెంపకం చేపట్టి తరువాత అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంటాడు. వారి ఇంటి పంటలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, పూల మొక్కల పెంపకం చేస్తుంటారు. అరుదైన రకాలను దూర ప్రాంతాల నుంచి తెప్పించి పెంపకం చేయడం అప్పారావు గారికి ఇష్టం కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా విత్తనాలను తెప్పించి మొక్కల పెంపకం చేస్తున్నారు. వారి ఇంటి పంటలో 15 నుంచి 20 రకాల వంగ, 50 నుంచి 60 రకాల టమాటతో పాటు పొట్టి అరటి, చిన్న కంటెయినర్‌లో పెరిగే మునగ, సంపంగి, డ్రాగన్ ఫ్రూట్, బత్తాయి, నిమ్మ మొక్కలతో పాటు అరుదైన పూల మొక్కలు, ఆకుకూరలు అనేకం ఉన్నాయి.
ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీ విరమణ పొందిన తరువాత తన పూర్తి సమయాన్ని ఇంటి పంటపై పెట్టి ఇంటి పంట దారుల సంఖ్య పెంచడంలో తనవంతు పాత్రను పోషిస్తున్నాడు. రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొందిన అప్పారావు ఇంటి పంటను మొదలు పెట్టి విజయవంతంగా కొనసాగిస్తూ అనేకమందికి స్ఫూర్తిని కలిగిస్తున్నాడు.
పెంచుకుందాం… పంచుకుందాం…
అప్పారావు ఇంటి పంటను నిర్వహించడంతోపాటు ఇంటిపంటదారుల సంఖ్య పెరగటానికి విపరీతంగా కృషి చేస్తున్నాడు. ఇందుకుగాను వివిధ ప్రాంతాల నుంచి అరుదైన రకాల విత్తనాలను, మొక్కలను తెప్పించి తన ఇంటి పంటలో పెంపకం చేసి విత్తనాలను అభివృద్ధి చేసి భారతదేశం మొత్తం అడిగిన వారికి ఉచితంగా అంటే రవాణా ఖర్చులు కూడా తానే భరిస్తూ విత్తనాలను పంపిణీ చేస్తున్నాడు. తన దగ్గర విత్తనాలను తీసుకున్న వారు అవకాశం ఉంటే వారి దగ్గర ఉన్న విత్తనాలను అప్పారావు గారికి పంపిస్తుంటారు. వాటిని అప్పారావు గారు అవసరమయిన వారికి ఉచితంగా పంపిస్తుంటారు. ఈ విధంగా పెంచుకుందాం… పంచుకుందాం… అనే భావనతో ముందుకు సాగుతున్నారు.
ప్రతిమనిషికి అన్నింటికంటే ముఖ్యం ఆనందం. ఆనందం కావాలంటే ఆరోగ్యం తప్పనిసరిగా ఉండాలి. ఆరోగ్యం సక్రమంగా లేకుండా వివిధ రకాల అనారోగాలతో ఇబ్బందులు పడేవారు ఆనందంగా తమ జీవితాన్ని కొనసాగించలేరు. ఎన్ని లక్షల కోట్లు డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం సక్రమంగా లేకుంటే అన్ని లక్షల కోట్లు వృథా అనే విషయం అందరికి తెలిసిందే కాని వాస్తవాన్ని గ్రహించలేకపోవచ్చు. కాని ఆ విషయం కరోనా తరువాత అందరికి తెలిసి వచ్చింది. లక్షల కోట్లు డబ్బు ఉన్న వాళ్ళు కూడా కంటికి కనిపించని చిన్న వైరస్ దెబ్బకు భయపడి ఇల్లుదాటి బటకు రాలేదు అనే విషయం మన అందరం ప్రత్యక్షంగా చూశాము. కరోనా వల్ల ఆరోగ్యం యొక్క విలువ ప్రతి ఒక్కరూ బాగా గ్రహించగలిగారు. సంపాదన కోసం ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ఎంత సంపాదించినా కాని ఆరోగ్యం సరిగ్గా లేకపోతే సంపాదించిన సొమ్ము ఎందుకు పనికిరాకపోవచ్చు. కాబట్టి సంపాదన కంటే ఆరోగ్యం ముఖ్యం. కాని కొన్ని కనీస అవసరాలకు సంపాదన తప్పనిసరి కాబట్టి కనీస అవసరాల కొరకు తప్పనిసరిగా సంపాదన కోసం ప్రయత్నించాల్సిందే. కొంతమంది కుటుంబ ఆర్థిక పరిస్థితులు కనీస అవసరాల కొరకు భార్యా, భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయవలసిన అవసరము లేకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరి ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయం తమ అవసరాలకు సరిపోయినట్లయితే ఇంకొకరు తమ సమయాన్ని కుటుంబం కోసం, కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయించినట్లయితే ఆరోగ్యంగా, ఆనందంగా తమ జీవితాలను కొనసాగించవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన పద్మిని గారు తన భర్త సాంబశివరావుగారి ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం తమకు సరిపోతుంది కాబట్టి తాను ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా తన పూర్తి సమయాన్ని తమ కుటుంబం కోసం మరియు కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నారు.
పద్మిని గారిది వ్యవసాయ నేపథ్యం. తన చిన్నతనం నుంచి తండ్రితో కలిసి పొలాలకు వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యవసాయ మూలాలు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యవసాయం అన్నా, మొక్కలన్నా, పచ్చదనం అన్నా మక్కువ ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఈ కోవకే చెందిన పద్మిని గారికి కూడా చిన్నతనం నుంచి మొక్కలన్నా, పచ్చదనం అన్నా చాలా మక్కువ కాబట్టి ఉన్నత చదువులు చదివిన పద్మిని ఎలాంటి ఉద్యోగ ప్రయత్నం చెయ్యకుండా తన భర్త సహాయ సహకారాలతో ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటారు. భర్త ఉద్యోగ భాధ్యతల రీత్యా వివిధ ప్రాంతాలు తిరుగుతున్న సమయాలలో కూడా ప్రతి చోట మొక్కలు పెంచుతూ ప్రాంతం మారినపుడు అన్ని మొక్కలను తమతో పాటు రవాణా చేస్తూ ఉండేవారు. వేరేప్రాంతానికి మారవలసి వచ్చినపుడు ఇంటి సామను కంటే మొక్కలకు సంబంధించిన సామాను ఎక్కువగా ఉండేది. అయినా కాని ఏ మాత్రం ఆలోచించకుండా తాము మారిన కొత్త ప్రాంతానికి మొక్కలను కూడా మారుస్తూ వచ్చి నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాదు, మదీనాగూడలో సొంత ఇంటిని నిర్మించుకొని ఆ ఇంటి మిద్దెమీద వివిధ రకాల మొక్కల పెంపకం చేస్తూ వస్తున్నారు.
మిద్దె మీద మొక్కల పెంపకం చెయ్యాలి కాబట్టి ఇంటి నిర్మాణ సమయంలోనే నీరు స్లాబులోకి ఇంకకుండా జాగ్రత్తలు వహించారు. స్లాబు మీద కూడా స్టాండ్లు ఏర్పాటు చేసి స్టాండ్‌ల మీదనే వివిధ రకాల కుండీలు, బకెట్ల లాంటివి ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. తాను ఇంటిపంటను చేసేది తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కాబట్టి మొదటగా తమ ఆహారాలకు అవసరమయిన కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లకు ప్రాముఖ్యతను ఇచ్చి కొన్ని రకాల పూల మొక్కలు కూడా పెంచుతున్నారు. తమ ఇంటి అవసరాలకు అవసరమయిన కూరగాయలు, ఆకుకూరలు సగానికి పైగా తామే సొంతంగా పండించుకుంటూ మిగతావి బయట మార్కెట్‌లో కొనుగోలు చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. పండ్ల విషయానికొస్తే జామ, దానిమ్మ, యాపిల్‌బేర్, అంజూర లాంటి పండ్లను సొంత మిద్దె తోట నుంచి పొందుతూ కొన్ని రకాలను బయట నుంచి కొనుగోలు చేస్తుంటారు.
ప్రతిరోజు ఉదయం, సాయంకాలం కలిపి మూడు నుంచి నాలుగు గంటలు మిద్దెతోటకు కేటాయించి మొక్కలకు అవసరమయిన పనులను తానే సొంతంగా చేస్తూ శారీరక శ్రమకు అవకాశం ఇస్తున్నారు. మొక్కల పెంపకానికి ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా కేవలం సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తుంటారు. విత్తనాలను కూడా తామే సొంతంగా తమ ఇంటి పంట నుంచి సేకరిస్తూ ఉపయోగిస్తుంటారు. మిరప, టమాట, వంగ లాంటి మొక్కలను కూడా సొంతంగా నారు పోసుకుంటుంటారు. కొమ్మల ద్వారా అభివృద్ధి చేయగల మొక్కలను కూడా సొంతంగా అభివృద్ధి చేసుకుని ఉపయోగిస్తూ ఉంటారు. చీడపీడల నివారణ కొరకు తప్పనిసరి పరిస్థితులలో ఎగ్‌ఎమినో యాసిడ్ లాంటివి పిచికారి చేస్తుంటారు. మొదటగా చీడపీడలు ఆశించిన ఆకులను, కొమ్మలను కడగడం లేదా అంతవరకు తుంచడం చేస్తుంటారు. మొక్కలకు పోషకాలకు గాను కిచెన్‌లో వృథాగా పడవేసే కూరగాయల, పండ్ల తొక్కలు, బియ్యం కడిగిన నీటిని ఉపయోగిస్తుంటారు. సంవత్సరంలో ఒకటి లేదా రెండుసార్లు పశువుల ఎరువు లేదా మేకల ఎరువును అందిస్తుంటారు. తోటి ఇంటి పంటదారులతో ప్రతినిత్యం సంభాషణలు జరుపుతూ అవసరమయిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటారు.
మనం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలగాలి. ఆరోగ్యకరమైన ఆహారానికి కొంతలో కొంత సరైన దారి ఇంటి పంట అని గ్రహించిన పద్మిని తన చదువు అయిన తరువాత ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా తన సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం, ఇంటిపంటకోసం కేటాయించి తోటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి
ఇంటి పంటకు అవసరమయిన కుండీలు, ఎరువులు, ద్రావణాలు, విత్తనాలు, మొక్కలు మొదలగు వాటి కొరకు వివిధ ప్రాంతాలు తిరగవలసి వస్తుంది. అలాంటి సమయాలలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అవుతుంది. కొన్నిసార్లు ఇంటి పంట అవసరాలకు దూర ప్రాంతం వెళ్ళవలసి వచ్చినప్పుడు అవి కొనుగోలు చేసే ధర కంటే రవాణాకు ఎక్కువ ఖర్చు పెట్టవలసి రావడంతో పాటు సమయాన్ని కూడా ఎక్కువగా కేటాయించవలసి వస్తుంది. అలాంటి సమయాలలో పద్మిని భర్త సాంబశివరావు తోడుగా ఉంటూ ఏ మాత్రం విసుగు చెందకుండా ఎంత దూరం అయినా రావడంతో పాటు డబ్బును, సమయాన్ని కేటాయించడానికి ఏమాత్రం వెనుకాడడు కాబట్టి తాను విజయవంతంగా ఇంటి పంటను నిర్వహించగలుగుతున్నాని భర్త సాంబశివరావుకి పద్మిని కృతజ్ఞతలు తెలియచేశారు.
ఆరోగ్యం విలువ అనంతం
గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే గతంలో మనిషి పుట్టింది సంపాదన కోసమే అన్నట్లు ప్రవర్తించారు. కాబట్టే తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి సంపాదన కోసం తాపత్రయ పడ్డవారు చాలామంది ఉన్నారు. కాలం గడిచే కొలది డబ్బు అందరికి అందుబాటులోకి రావడంతో పాటు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న తరువాత ఆరోగ్యం విలువ చాలా వరకు ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. ఎదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. పోయినప్పుడే దేని విలువ అయినా తెలిసేది అనే విషయం అక్షర సత్యం. కాబట్టే ఆరోగ్యంగా ఉన్నపుడు ఆరోగ్యం విలువ తెలుసుకొనని వారు ఆరోగ్యం పాడైపోయిన తరువాత ఆరోగ్యం విలువ గుర్తించగలుగుతున్నారు కాని కొన్ని సమయాలలో ఎంత గుర్తించినా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు ఎంత ఖర్చు పెట్టినా కూడా బాగు చేసుకోలేకపోతున్నారు. బాగా డబ్బు ఉన్న వాళ్లు కూడా వచ్చిన రోగాల నుంచి బయట పడలేక ఇబ్బందులు పడిన వారి గురించి మనం ప్రతినిత్యం వింటూనే ఉంటాము. ఇలాంటి సందర్భాలు ఎదురైనపుడు ఆరోగ్యం విలువ అనంతం అని అర్థం అవుతుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన పద్మిని తమ కనీస అవసరాలు తన భర్త సంపాదనతో తీర్చుకోగలుగుతున్నారు కాబట్టి తన సమయాన్ని కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయించాలని నిర్ణయించుకొని ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి, మంచి నీరుతో పాటు మంచి ఆహారం తినగలగాలి. గాలి, నీరు ప్రకృతి నుంచి లభిస్తున్నాయి కాబట్టి తమ పరిధిలో ఉన్న ఆహారాన్ని ఎలాంటి విష రసాయనాలు లేకుండా తామే ఇంటి అవరణలోనే పండించుకోవాలనే లక్ష్యంతో ఎక్కువ ప్రాంతాలు తిరిగినా, ఎన్ని ఇళ్లు మారినా కూడా ఇంటి పంటను వదలకుండా కొనసాగిస్తూ తమ కుటుంబానికి అవసరమయిన కొంత ఆహారాన్ని తమ పరిధిలో పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా, ఆనందంగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు.
తల్లిదండ్రులు తమ ఆస్తులను తమ పిల్లలకు వారసత్వంగా అదించడం మన సాంప్రదాయం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎంత ఆస్తి ఉన్నా ఆరోగ్యం సక్రమంగా లేకుంటే ఉన్న ఆస్తిని ఆనందంగా అనుభవించలేరు. కాబట్టి ఆస్తి కన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడే ఆస్తి వలన ఉపయోగం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్లయితే మనం తినే ఆహారంలో ప్రత్యేకించి ఆకుకూరలు మరియు కూరగాయలలో విష రసాయన అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ సమస్యకు పరిష్కారంగా అవకాశం ఉన్నవారు ఇటిపంటను మొదలుపెట్టి తామే సొంతంగా కూరగాయలు, ఆకుకూరలతో పాటు కొన్ని రకాల పండ్లను పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలుగుతున్నారు. ఇలాంటి వారు తమ వారసులకు తమ ఇంటితోపాటు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని మిద్దెతోట నిపుణులు రఘోత్తమరెడ్డి అంటున్నారు. రఘోత్తమరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటి పంటలు చేసే వారందరికి సుపరిచితమైన పేరు రఘోత్తమరెడ్డి.
వారసులకు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వాలనుకునేవారు మిద్దెమీద ఇటుకలతో మడులు నిర్మించుకోవాలి. అవి రెండు మూడు తరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. సాధారణంగా నలుగురు కుటుంబ సభ్యులు ఉండే ఒక కుటుంబానికి ఒకరోజుకు అవసరమయిన కూరగాయలు పొందాలంటే 16 చదరపు అడుగుల మడి సరిపోతుంది. అంటే 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఇటుకలతో మడి నిర్మించుకుంటే అందులో బెండ, టమాట లాంటి మొక్కలు 16 వరకు పెంచవచ్చు. ఈ 16 మొక్కలనుంచి ఒక కుటుంబానికి ఒక రోజుకి అవసరమైన కూరగాయలు పొందవచ్చు. లోతు విషయానికొస్తే కూరగాయల పెంపకానికి ఒక అడుగు లోతు మరియు పండ్ల మొక్కల పెంపకానికి రెండు లేదా మూడు అడుగుల లోతు మడులను నిర్మించుకుంటే అనుకూలంగా ఉంటుంది. ప్రతి రెండు మడుల తరువాత మూడవ మడి పండ్ల మొక్కల పెంపకంకుగాను ఎక్కువ లోతు గల మడి నిర్మించుకుని అందులో పండ్ల మొక్కలు పెంచుకుంటే వేసవికాలంలో నీడ ఏర్పడి కూరగాయలు, ఆకుకూరలు బాగా ఎదగడానికి అవకాశం ఉండటంతో పాటు, మిద్దెతోటలో చల్లదనం కూడా ఉంటుంది కాబట్టి వేసవికాలంలో వేడి నుంచి ఉపశమనం కోసం ప్రతి మూడవ మడి పండ్లమొక్కలకు కేటాయించాలి.
మట్టి మిశ్రమంగా నల్లమట్టి, ఎర్రమట్టిలలో ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించుకోవచ్చు. ఎరువుగా బాగా మాగిన గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల ఎరువులలో ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించవచ్చు. రెండు వంతుల మట్టి ఒక వంతు బాగా మాగిన ఎరువును ఉపయోగించి విత్తనాలను నాటుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి మట్టి మొత్తాన్ని బాగా ఎండబెట్టినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇందుకుగాను మిద్దెతోటలో 30 శాతం దిగుబడితోను, 30 శాతం ఖాళీగా, 30 శాతం విత్తనాలను నాటినవిగా ప్రణాళిక వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది. విత్తనాల గురించి కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా నాటు విత్తనాల కొరకు ప్రయత్నించి అవి దొరకనట్లయితే సంకర జాతి విత్తనాలను కూడా వేసుకుని ఆ దిగుబడి నుండి మరలా మనము విత్తనాలను సేకరించినట్లయితే కొన్ని రోజులకు అవి నాటు విత్తనాలుగా రూపాంతరం చెందుతాయని రఘోత్తమరెడ్డి వివరిస్తున్నాడు.
చీడపీడల గురించి కూడా పెద్దగా ఇబ్బందులు పడనవసరం లేదు. మొక్కలో రోగనిరోధక శక్తి తగినంత ఉన్నట్లయితే ఆ మొక్కలను చీడపీడలు అశించవు. పోషకాలు సక్రమంగా గల బాగా మాగిన పశువుల ఎరువు అందించి మంచి విత్తనాన్ని నాటినట్లయితే పెరిగే మొక్క తప్పనిసరిగా రోగనిరోధక శక్తితో పెరుగుతుంది. కాబట్టి అలాంటి మొక్కలకు చీడపీడలు ఆశించవు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పేను లాంటి చీడలు ఆశించిననట్లయితే పేను ఆశించిన ఆకులను తీసివేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
మొక్కలకు అందించే నీటి విషయంలో ఇంటి పంటదారులు తప్పనిసరిగా కామన్‌సెన్స్‌తో ఆలోచించాలి. మొక్కలకు నీరు అవసరం లేదు. కేవలం తేమ మాత్రమే అవసరం ఉంటుంది కాబట్టి మట్టిలోని తేమను గమనిస్తూ నీటిని అందించాలి. ఎక్కువ నీటిని అందించకుండా తగినంత నీటిని మాత్రమే అందించాలి. కాలాన్ని బట్టి నీటిని అందించవలసి ఉంటుంది. అన్ని కాలాలలో ఒకే రకమైన నీటి అవసరం ఉండదు. వివిధ కాలాలకు వివిధ రకాల నీటి అవసరాలు ఉంటాయి కాబట్టి కామన్‌సెన్స్ ఉపయోగించి నీటిని అందించవలసి ఉంటుంది.
దోసెడు మట్టి, పిడికెడు ఎరువు, ఒక విత్తనం ఉంటే మిద్దెతోటను ప్రారంభించవచ్చు. ఇటుకలతో మడులు కట్టుకోవడానికి ఇబ్బందులు పడేవారు ఫైబరు టబ్బులను కూడా కొనుగోలు చేసుకుని మిద్దెతోటను ప్రారంభించవచ్చు.
ఇవేమి లేకున్నా కాని సంకల్పం ఉండాలే కాని గ్రోబ్యాగ్స్ లేదా ఖాళీ సిమెంటు సంచులతో కూడా మిద్దెతోటను ప్రారంభించవచ్చు. తక్కువ ఖర్చుతో మిద్దెతోటను ప్రారంభించి అనుభవం గడించిన తరువాత శాశ్వత టబ్బులు లేదా శాశ్వత మడులకు మారినట్లయితే ఫలితాలు బాగా ఉంటాయి. ఏది ఏమయినా కాని మన తరువాత తరం వారు ఆరోగ్యంగా, ఆనందంగా మన ఆస్తిని అనుభవించాలంటే ఆస్తితోపాటు మిద్దెతోటను వారసత్వంగా అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని రఘోత్తమరెడ్డి గట్టిగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు 90001 84107 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
పక్షులు వ్యవసాయంలో రెండు రకాల పాత్రలను పోషిస్తాయి. చాలా జాతుల పక్షులు పంటలకు లాభము కలుగజేస్తుండగా కొన్ని జాతుల పకక్షులు మాత్రం నష్టము కలుగజేస్తాయి. నష్టం చేసే పకక్షులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఇవి స్థిరంగా ఉండే వ్యవసాయ క్షేత్రాలను అలవాటు చేసుకుని అక్కడ వాటి సంఖ్య పెరిగి పంటలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంటాయి. కొన్ని సమయాలలో ఒకే జాతికి చెందిన పక్షులు ఒక ప్రదేశంలో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు మరియు ప్రదేశం మీద ఆధారపడి మరొక ప్రదేశంలో నష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి.
ఇటీవల కాలంలో పక్షుల సమస్య పెరగడం వలన వ్యవసాయంలో పక్షుల నియంత్రణ చేయవలసిన అవసరం ఏర్పడింది. కానీ ఈ పకక్షులు ఆహారపు గొలుసులో ప్రత్యేక పాత్రను పోషిస్తూ వ్యవసాయ మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. కొన్ని అంతరించిపోతున్న పక్షి జాతులు కూడా పంటలకు అక్కడక్కడా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పక్షులకు ఏవిధమైన హాని కలుగకుండా వాటి నియంత్రణ చేయాలి.
మన దేశంలో సుమారు 1364 పక్షి జాతులు గుర్తించబడ్డాయి. వీటిలో 81 జాతులు స్థానికమైనవి. వీటిలో కొన్ని పకక్షులు మాంసాహారులుగా జీవిస్తూ చిన్న చిన్న పురుగులను మరియు ఎలుకలను తింటూ రైతుకు మేలు చేస్తాయి. మరికొన్ని పకక్షులు మొక్కలలో పరాగ సంపర్కానికి మరియు విత్తన వ్యాప్తికి దోహదపడతాయి. అయినప్పటికీ కొన్ని జాతుల పక్షులు వివిధ థలలో పంటలను పాడుచేస్తూ రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి.
మన రాష్ట్రంలో మొక్కజొన్న, జొన్న, వరి మరియు ప్రొద్దుతిరుగుడు మొదలైన పంటలను పక్షులు ఎక్కువగా పాడుచేస్తాయి. ముఖ్యంగా పక్షులలో రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు, కాకులు, గోరింకలు మరియు నెమళ్ళ వలన పంటలకు అధిక నష్టము కలుగుతుంది. ముఖ్యంగా ఈ నష్టము తక్కువ విస్తీర్ణం కలిగిన పంట పొలాల్లో మరియు ఎక్కువ పకక్షుల స్థావరాలు ఉన్న ప్రాంతాలలో జరుగుతుంది.
ఉదాహరణకు మొక్కజొన్న పంటలో పక్షుల దాడిని పరిశీలించినట్లయితే విత్తనము విత్తినప్పటినుండి పావురాలు, కాకులు, విత్తిన గింజలను ఏరుకుని తింటాయి. విత్తనము మొలకెత్తే థలో కాకులు లేత మొగ్గ భాగాలను పెకిలించి తింటాయి. విత్తనము పాలుపోసుకునే సమయంలో రామచిలుకలు కంకిని తొలిచి గింజలను తింటాయి. గింజ పట్టిన తరువాత రామ చిలుకలు, కాకులు గింజలను వలచుకుని తింటాయి. వివిధ థలలో పక్షులు చేయు నష్ట శాతాన్ని గమనించినట్లయితే విత్తే థ మరియు విత్తనం మొలకెత్తే థలో పావురాలు, కాకులు, గోరింకలు, రామచిలుకలు, నెమళ్ళు, గువ్వలు దాడి చేసి 10-20% నష్టాన్ని కలుగజేస్తాయి. గింజ పాలుపోసుకునే థలో రామచిలుకలు, కాకులు, దాడిచేసి 6-39% నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ విధంగా మొక్కజొన్నలో పక్షుల వలన 10-40 % వరకు నష్టము జరుగుతుంది.
అదేవిధంగా పొద్దుతిరుగుడు చూసినట్లయితే ముఖ్యంగా రామచిలుకలు, కాకులు, గోరింకల వలన నష్టము అధికంగా జరుగుతుంది. విత్తనాలు వేయునప్పుడు కాకుల బెడద ఎక్కువగా ఉంటుంది. గింజ పాలుపోసుకునే థ నుండి గట్టిపడే వరకు రామచిలుకల ద్వారా 40% వరకు నష్టము కలుగుతుంది.
వేరుశనగ పంటలో విత్తనం విత్తే థ నుండి మొలకెత్తే వరకు కాకులు, పావురాలు, నెమళ్ళు, పిచ్చుకలు వలన 15-75 % వరకు నష్టము జరుగుతుంది. అదేవిధంగా గింజ ఏర్పడే థ నుండి గట్టిపడే థ వరకు చిలుకలు, కాకులు, పావురాలు, నెమళ్ళు వలన 10-50% వరకు నష్టము జరుగుతుంది. వరిలో గమనించినట్లయితే గింజ గట్టిపడే థలో పకక్షుల వలన నష్టము అధికంగా ఉంటుంది.
పక్షులు దాడి చేయు విధానం:
పక్షులు దాడి చేయు విధానం వివిధ పంటలలో భిన్నంగా ఉంటుంది. పక్షులు వాతావరణ పరిస్థితులు, సమయం, పంటథ మొదలైన వాటిమీద ఆధారపడి పంటపై దాడి చేస్తాయి. ఉదాహరణకు మొక్కజొన్న పంటలో మొదటిగా విత్తనాలు విత్తునప్పుడు ఉదయం వేళల్లో సుమారు 5 గంటల నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కాకులు మరియు పావురాలు దాడి చేసి గింజలను ఏరుకుని తింటాయి. అదేవిధంగా నీటి తడులు ఇచ్చిన వెంటనే విత్తనాలు నీటిలో నాని ఉబ్బుతాయి అప్పుడు పక్షులు వాటిని మూడు రోజులు వరకు దాడి చేసి ఏరుకుని తింటాయి. కానీ కాకులు మాత్రం విత్తనాలు మొలకెత్తే వరకు దాడి చేస్తాయి. కంకులు కట్టే థలో రామచిలుకలు 2 నుండి 10 వరకు గుంపులుగా దాడి చేస్తాయి. అవి కంకి పై భాగాన్ని చీల్చి తియ్యని అక్షాన్ని తింటాయి. కంకి నుండి వ్రేలాడే సన్నని పట్టు వంటి నూగును కొరికివేస్తాయి. దీనివలన పరాగ సంపర్కం జరగకపోవడం వలన కంకులలో గింజలు ఏర్పడవు. గింజలు ఏర్పడిన తర్వాత పాలుపోసుకునే థలో లేత కంకికి ఒక చీలికనేర్పరచి వాడియైన వంపు కలిగిన ముక్కుతో లోపలి గింజలను తింటాయి. ఈ థలో జరిగే దాడి వలన విత్తనాలు లేని కంకులు బోసిగా కనిపిస్తాయి.
వివిధ పంటలలో పక్షులు కలుగజేసే నష్టాన్ని అరికట్టడానికి వన్యప్రాణి సంరక్షణా చట్టానికి అనుగుణంగా పర్యావరణానికి హాని చేయని మరియు తక్కువ ఖర్చుతో కూడిన సులభమైన పద్ధతులు క్రింద వివరించడం జరిగినది. ఈ పద్దతులను ఉపయోగించి పంటలలో పక్షుల వలన సంభవించే నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చును.
1. విత్తన శుద్ధి:
వేపనూనె 5 మి.లీ. ఒక కెజీ విత్తనాలకు పట్టించి 24 గంటల తర్వాత విత్తుకోవాలి లేదా తగినంత కోడిగ్రుడ్డు ద్రావణంలో విత్తనాలను నానబెట్టి విత్తినట్లయితే అవి పక్షులకు రుచించవు.
ఈ విధంగా విత్తన శుద్ధి చేసి నాటడం వలన విత్తనాలు పక్షులు తినవు కావున అన్ని విత్తనాలు మొలకెత్తుటకు అవకాశం ఉంటుంది.
2. వేపగింజల కషాయం పిచికారీ పద్ధతి:
బాగా ఎండబెట్టిన ఒక కిలో వేప గింజలను బాగా పొడిగా చేసి పల్చని గుడ్డలో కట్టి, 10 లీటర్ల నీరున్న బకెట్‌లో ఒక రోజంతా నానబెట్టాలి. మరుసటి రోజు గుడ్డనుబాగా అదిమి పిండినట్లయితే తెల్లని పాలవంటి కషాయం నీటిలోకి దిగుతుంది. పలుసార్లు దీనిని గట్టిగా పిండి అదనంగా 10 లీటర్ల నీటిని చేర్చినప్పుడు 5% వేపగింజల కషాయం తయారు అవుతుంది.. ఈ రకంగా తయారు చేసిన కషాయాన్ని చేతి పంపు సహాయంతో పంటపై పిచికారీ చేసినచో పక్షులు గింజలను తినడానికి విముఖత చూపుతాయి. ఈ పద్ధతి ద్వారా 7-10 రోజుల వరకు పక్షులు పంటను నష్ఠపరచకుండా కాపాడవచ్చు. వేపగింజల ద్రావణాన్ని ఆముదం నూనె మిశ్రమంతో కలిపి పంటపై పిచికారీ చేస్తే దీని ఫలితం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో నిరూపించబడినది.
3. కోడిగ్రుడ్డు ద్రావణం పిచికారీ:
కుళ్ళిన కోడిగ్రుడ్డులను సేకరించి వాటిని పగులగొట్టి ద్రావణాన్ని వేరుపరచాలి. ఈ ద్రావణాన్ని 25 మీ.లీ. ఒక లీటరు నీటికి కలిపి గింజ పాలుపోసుకునే థలో పంట పై పిచికారీ చేసినచో ఆ వాసనలు పక్షులకు తీవ్రమైన చిరాకును కలుగచేస్తాయి మరియు గింజలు పక్షులకు రుచించవు, అందువలన అవి పంట పొలాల వైపునకు రాకుండా దూరంగా వెళ్లిపోతాయి. దీని ద్వారా వచ్చు వాసన సుమారు 10-15 రోజుల వరకు పనిచేసి పక్షులను రాకుండా చేస్తుంది. అవసరమైనచో రెండవ విడత కూడా పిచికారీ చేసుకోవచ్చు.
4. రిబ్బన్ పద్ధతి:
ఈ పద్దతిలో ఒక వైపు తెలుపు రంగు, మరొక వైపు ఎరుపు రంగు కలిగి, పాలీప్రొపిలీన్‌తో తయారు చేయబడి అర అంగుళం వెడల్పు కలిగిన తళ తళ మెరిసే రిబ్బన్లను వెదురు బొంగుల సాయంతో పంటపై ఒక అడుగు ఎత్తులో ఉత్తర దక్షిణ దిశలో కట్టుకోవాలి. ఈ కర్రలకు రిబ్బన్లను 3 లేదా 4 మెలికలు త్రిప్పి కర్రల మధ్య దూరం 10 మీటర్లు ఉండేలా చూసి కట్టవలెను. పక్షుల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే కర్రల మధ్య దూరం 5 మీటర్లు తగ్గించి కట్టవలెను.
ఈ విధంగా కట్టడం వలన సూర్యరశ్మి రిబ్బన్ పైన పడి ఆ రిబ్బన్లు తళ తళ మెరిసి పకక్షుల కంటికి తీవ్రమైన అసౌకర్యమును కలిగించును కావున పక్షులు పంట పొలం వైపు దృష్ఠి సారించలేవు. రిబ్బన్లు గాలికి రెపరెపమని శబ్దం చేయడం వలన పక్షులు బెదిరి పంట పొలాల నుండి దూరంగా వెళ్లిపోతాయి. ఈ పద్ధతి ద్వారా సుమారు 10 -15 రోజుల వరకు పక్షుల బెడదను అరికట్టవచ్చు. రిబ్బన్ పద్దతిని విత్తనం విత్తే థలో మరియు గింజ పాలుపోసుకునే థ లో కూడా ఉపయోగించవచ్చు. ఒక ఎకరా పొలంలో 100 మీ. నిడివిగల రిబ్బన్లు సుమారు 10 వరకు అవసరపడతాయి. ఎకరాకు రూ. 1000/- వరకు ఖర్చవుతుంది.
5. నెమళ్ళ యాజమాన్యం:
నెమళ్ళ నష్టతీవ్రతను తగ్గించడానికి కొబ్బరిత్రాడు / పురికొస తాడును విత్తనం విత్తే థలో పొలానికి 4 వైపులా కర్రలను పాతి భూమికి ఒక అడుగు ఎత్తులో పంట పైన అడ్డు నిలువు వరుసలలో ఒక మీటరు మధ్య ఎడంగా ఖాళీ ఉంచుకుని కట్టినట్లయితే, పంటల మీదికి ఎగురుతూ వచ్చే నెమళ్ళు పంట పొలాలపై దిగినప్పుడు వాటి కాళ్ళకి ఈ త్రాడు చుట్టుకొని రెక్కలు చిక్కుకుపోతాయి దీనికి నెమళ్ళు భయాందోళనకు గురై ఆర్తనాదాలు చేయుచు దూరంగా పారిపోతాయి. కాయలు ఏర్పడే థలో పంట గట్టు వెంబడి భూమి నుండి ఒక అడుగు ఎత్తులో 3 వరుసలు పంటచుట్టూ కట్టినట్లయితే నెమళ్ళ బెడదను సమర్థవంతంగా అరికట్టవచ్చు.
6. కాగితపు ప్లేట్‌ల పద్ధతి:
ఈ పద్దతిలో ఒక వైపు వెండి పూతను పోలిన మెరుపు గల చిరుతిండ్లు తినే కాగితపు ప్లేట్లను తీసుకుని వెండి పూత పైకి వచ్చేటట్లు ప్రొద్దుతిరుగుడు పువ్వు కాడకు అమర్చవలెను. అప్పుడు సూర్యరశ్మి సోకినప్పుడు వెండిపూత తళ తళ మెరిసి పక్షుల కళ్ళకి అసౌకర్యం కలిగించును. ఒకవేళ సూర్యరశ్మి లేకపోయినా పేపర్ ప్లేట్లు పకక్షులు వాలడానికి ఆధారం లేకుండా చేస్తాయి. ఫలితంగా పువ్వులో గింజ నష్టం అరికట్టబడుతుంది. ఈ పద్ధతి సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ పద్ధతి ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ ప్రొద్దుతిరుగుడు పంట గింజ పాలుపోసుకునే థలో సమర్థవంతంగా పకక్షుల బెడదను అరికట్టుతుంది.
7. ఆర్తనాద పద్ధతి:
ఈ పద్ధతిలో పంటను నష్టపరచు వివిధ పక్షుల ఆర్తనాదములను మరియు పరభక్షక పక్షుల కఠిన శబ్దాలను రికార్డు చేసి శబ్దోత్పతి యంత్రాల ద్వారా పంట పొలాలకు సమీప ప్రాంతం నుండి ఆర్తనాదాలు ఉత్పత్తి చేస్తారు. అప్పుడు పంటను నష్టం చేయు పకక్షులు బెదిరి ఆపద ఉన్నదని బ్రాంతికి గురై పంటపొలాల నుండి దూరంగా పారిపోతాయి. ఈ పద్దతిలో ఉపయోగించే యంత్రం ఖరీదు సుమారు రూ. 20000/- (సోలార్ ప్లేట్లతో), విద్యుత్ సరఫరాతో పనిచేయు యంత్రం ఖరీదు రూ. 15000/- ఈ యంత్రం సుమారుగా 4-5 ఎకరాల విస్తీర్ణం గల పంట పొలాలకు సమర్థవంతంగా పనిచేయుచున్నదని ప్రయోగపూర్వకంగా రుజువు చేయబడినది.
8. శబ్ద ప్రయోగ పద్ధతి:
ఈ పద్ధతిలో అధిక మొత్తంలో ప్రేలుడు శబ్ధాలనుత్పత్తిచేయు యంత్రాలను ఉపయోగించి పక్షులను భయబ్రాంతులకు గురి చేస్తారు. ఈ శబ్దాలను ఉత్పత్తి చేయు యంత్రం కాల్షియమ్ కార్బైడ్ అనే ముడి పదార్థం ద్వారా పని చేస్తుంది. కానీ మార్కెట్‌లో కాల్షియమ్ కార్బైడ్ ఉత్పత్తి తగ్గిన కారణంగా ఎల్.పి.జి.గ్యాస్‌తో నడిచే కొత్త యంత్రాలను రూపొందించారు. ఈ యంత్రాలు రూ. 40,000/- వరకు ధర పలుకుతాయి. కానీ శాశ్వతంగా వీటిని ఉపయోగించి అధిక మొత్తంలో శబ్దాన్ని ఉత్పత్తి చేసి 3-4 ఎకరాల విస్తీర్ణం లో శాశ్వతంగా పంటను కాపాడవచ్చు. ఈ యంత్రాన్ని ఒకే ప్రదేశంలో కాకుండా పంట చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఉపయోగించుట ద్వారా వెలువడే తీవ్రమైన శబ్దానికి పక్షులు దూరప్రాంతాలకు పారిపోతాయి. వీటిని చేపలు/రొయ్యల చెరువుల దగ్గర కూడా పకక్షులను బెదిరించడానికి ఉపయోగిస్తారు.
ప్రస్తుతం మార్కెట్టులో సోలార్ శక్తితో పనిచేసే అగ్రి ఇ-కెనాన్ అనే పరికరం కూడా అందుబాటులో ఉన్నది. ఇది నిరంతరం వివిధ శబ్ధాలను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తూ పంటలను పకక్షుల బారినుండి సమర్థవంతంగా రక్షిస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.25000/-
9. గూళ్ళ నిర్ములనా పద్ధతి:
పొలము గట్లపైనున్న పొదలలో గూళ్ళను నిర్మూలించడం, చెట్ల తొర్రలను మూయడం మరియు ఆవాస ప్రాంతాలలో పక్షి గూళ్ళను తొలగించడం ద్వారా పకక్షులు రాకుండా చేయవచ్చు.
10. ప్రత్యామ్నాయా ఆహార సరఫరా:
పంట పొలాల సమీపంలో, ఆవాస ప్రాంతాలలో వృధాగా ఉన్న భూములలో మరియు పొలం గట్ల వెంబడి వివిధ అడవి జాతి పండ్ల చెట్లు పెంచడం వలన వీటి యొక్క ఫలాలు వివిధ పక్షులను ఆకర్షిస్తాయి. తద్వారా పక్షులకు ప్రత్యమ్నాయ ఆహారం లభించి పంట పొలాల మీద పకక్షులు దాడి చేయడం తగ్గుతుంది. మరియు అడవి జాతి ఫలసాయం వలన రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా ఆడవి జాతి పండ్ల చెట్లయిన చీమ చింత, మోదుగ, రావి, మర్రి, పర్కి, కల్మికాయలు, మొర్రి, తూనిక జీడిపండ్లు, రేగు, చింత, వెలగ మొదలైనవి పక్షులకు ప్రత్యామ్నాయ ఆహరం అందించడంలో ప్రముఖమైనవి.
11. ఆకు చుట్టుపద్ధతి:
మొక్కజొన్న పంటలో ఇది అతిముఖ్యమైన పద్ధతి. ఇందులో గింజలు పాలు పోసుకునే థలో కంకి చుట్టూ ఉన్న ఆకులను చుట్టి పక్షులకు కనపడకుండా చేయాలి. ఈ విధంగా గట్లనుండి 3-4 వరుసల వరకు ఆకులను చుట్టి పక్షుల దృష్టిని మరల్చి పంటలను రక్షించవచ్చు. తక్కువ విస్తీర్ణంలో పంటలకు ఇది అనుకూలమైన పద్ధతి. ఇది చాలా ప్రభావవంతమైన ఎటువంటి సామాగ్రి పరికరాలు అవసరం లేనటువంటి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆమోదయోగ్యమైన పద్ధతి.
12. తెర పంట పద్ధతి:
సాధారణంగా మొక్కజొన్న పంటలో రామచిలుకలు పంట గట్ల వెంబడి 2-3 వరుసలలో ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. పశుగ్రాస వంగడాలైన జొన్న గాని, మొక్కజొన్నను దగ్గర దగ్గరగా స్క్రీన్ క్రాప్/తెర పంటగా వేయడం ద్వారా లోపల ఉన్న మొక్కజొన్న పంటను పకక్షుల కంటికి కన్పించకుండా సమర్థవంతంగా పక్షుల బారి నుండి కాపాడవచ్చు. తెర పంట పశుగ్రాసంగా ఉపయోగపడి రైతుకు అదనపు ఆదాయాన్ని కూడా చేకూరుస్తుంది.
పైన సూచించిన పద్ధతులని ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో అమలు పరిస్తే వచ్చే ఫలితాల కన్నా అవసరంమేరకు రెండు మూడు పద్ధతులు కలిపి మిశ్రమంగా సమగ్ర సస్యరక్షణ అమలుపరచినట్లయితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
డా|| నామాల శ్రీనివాసరావు, శ్రీమతి బి.అనూష, డా|| టి. శ్రీనివాస్, జి. ఝాన్సీరాణి, వి. రమ్య శ్రీ, ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య అనుబంధ విభాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మారుటేరు-534122, ఆంధ్రప్రదేశ్.
మన ఆరోగ్యాన్ని కాపాడుటలో మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, శారీరక శ్రమ, మన మానసిక పరిస్థితి, ప్రకృతితో మమేకమవడం లాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కాని ప్రస్తుత కాంక్రీట్ జంగిల్స్ మరియు ఉరుకుల పరుగుల జీవితాలలో ఇవన్నీ అందుబాటులో దొరకడము చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ అందుబాటులో లేకపోవడముతో చాలామంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి తమతమ ఆరోగ్యాలను సంరక్షించుకోవాలనుకునే వారందరూ తమకు అవకాశం ఉన్నంతలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు అందుబాటులోకి వచ్చిన మార్గమే ఇంటిపంట. ఇంటి పంట వలన రసాయనాలు లేని కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లను పొందడముతో పాటు పచ్చదనం వలన వాతావరణ కాలుష్యం తగ్గటంతో పాటు ఇంటి పంట వలన శారీరక శ్రమకు అవకాశం కుదురుతుంది కాబట్టి ఆహ్లాదకర వాతావరణానికి ఇంటి పంట సరైనదారి అని నమ్మి ఇంటిపంటను ఇప్పటి వరకు చేపట్టిన వారు, ఇంకా చేపట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆరోగ్యకర ఆహారాన్ని పొందడముతో పాటు యోగా చేసుకోవటానికి, తనకిష్టమైన సంగీతాన్ని పచ్చని మొక్కల మధ్య ఆస్వాదించటానికి సరైన దారి ఇంటిపంట అని గ్రహించి విజయవాడ, పటమట ప్రాంతానికి చెందిన భారతిదేవి మిద్దెతోటను మొదలు పెట్టారు.
భారతీదేవి కాస్మొటాలజిస్ట్. వీరికి చిన్నతనం నుంచి పచ్చదనం, సంగీతం, యోగాల మీద మక్కువ చాలా ఎక్కువ. తన వృత్తిలో తీరిక లేకుండా ఉండే భారతీదేవి తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకుంటూ కాస్మొటాలజిస్ట్‌గా తన వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ సంగీతానికి, యోగాకి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. వాటితోపాటు ఇంటి పంటపై కూడా మక్కువ ఉంది కాబట్టి కొంత సమయాన్ని కేటాయించి తమ మిద్దె మీద కొన్ని రకాల మొక్కల పెంపకం చేపట్టి కొనసాగిస్తున్న పరిస్థితులలో కరోనా రావడం జరిగింది. కరోనా సమయంలో ఎక్కువ సమయం ఇంటి వద్దనే గడపవలసి రావడముతో ఆ సమయాన్ని తమ మిద్దె తోటలోని మొక్కల సంఖ్యను పెంచటానికి కేటాయించి మిద్దెతోటను అభివృద్ధి చేశారు.
మిద్దెమీద మొక్కల పెంపకం చేస్తున్నారు కాబట్టి స్లాబుమీద నీరుపడి స్లాబు పాడవకుండా ఉండటానికి వీలుగా స్లాబుకు వాటర్ ఫ్రూప్ కోటింగ్‌ను వేయించడంతో పాటు స్టాండులు ఏర్పాటు చేసుకుని స్లాండులపై కుండీలు, టబ్బులు, డ్రమ్ములు లాంటివి ఏర్పాటు చేసుకుని వాటిలో మొక్కల పెంపకం చేస్తున్నారు. అన్ని రకాల మొక్కలకు ఒకే రకమైన కంటెయినర్లు ఉపయోగించకుండా మొక్కల రకాలను బట్టి కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. ఆకుకూరలకు వెడల్పు మూతి ఉండే టబ్బులను, పండ్ల మొక్కల పెంపకానికి డ్రమ్ములను, కూరగాయలకు బక్కెట్లను…. ఈ విధంగా మొక్కల రకాన్ని బట్టి అందుకు అనుకూలంగా ఉండే కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. మట్టి మిశ్రమంలో మట్టి, ఎరువు, వేపపిండి, ఇసుక లాంటి వాటిని కలుపుకున్నారు. మట్టి మిశ్రమములో కోకోపిట్‌ను ఉపయోగించలేదు. ఈ మట్టి మిశ్రమము మూడు నెలల వరకు మొక్కలకు పోషకాలను అందిస్తుంది. కాబట్టి మూడునెలల తరువాత మరలా అవసరమైన మట్టి మిశ్రమాన్ని అందిస్తుంటారు. కంటెయినర్లలోని మట్టి గట్టిపడినట్లయితే మొక్క పెరగదు కాబట్టి మట్టి గట్టిపడకుండా ఉండేందుకు గాను క్రమం తప్పకుండా మట్టిని కలుపుతూ మట్టి గుల్లగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇంట్లో వృథాగా పడి ఉండే ప్లాస్టిక్ బక్కెట్లు మరియు ఇతర సామాగ్రిని కూడా కంటెయినర్లగా ఉపయోగిస్తూ&వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.
వీరి మిద్దెతోటలో చింతచిగురు కోసం చింత, సపోట, జామ, అంజీర, డ్రాగన్‌ఫ్రూట్, దానిమ్మ, అరటి, ఉసిరి, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి మొదలగు మొక్కలతో పాటు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఆల్‌స్సైసెస్ మొక్క, క్యాబేజీ, కాలీఫ్లవర్, బీర సొర, కాకర లాంటి తీగజాతి కూరగాయల మొక్కలను కూడా ఆయా మొక్కలకు అనుకూలమైన కంటెయినర్లలో పెంచుతున్నారు. వీటితో పాటు కొన్ని రకాలను పాలినేషను కొరకు, మిద్దెతోట అందంగా కనిపించేందుకుగాను పెంచుతున్నారు. వేసవి కాలంలో మొక్కల పాదులలో కొబ్బరి పీచు లేదా ఎండు ఆకులను ఏర్పాటు చేయడం వలన ప్రయోజనం బాగా ఉంటుందని ఆవిధంగా చేస్తున్నారు. వేసవి కాబట్టి పిచ్చుకలకు, పకక్షులకు తాగేందుకు నీటిని కూడా మొక్కల నీడలో ఏర్పాటు చేయడం వలన వివిధ రకాల పకక్షులు వీరి మిద్దెతోటలో కనిపిస్తుంటాయి.
వీరికి సంగీతంపై మక్కువ ఎక్కువ కాబట్టి ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో వీణవాయించటానికి కేటాయిస్తారు. మిద్దెతోటలో వీణ వాయించటముంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వీణవాయించటం వలన పొందే తృప్తితో పాటు మిద్దెతోటలోని మొక్కలకు కూడా ప్రతిరోజు సంగీతాన్ని వినిపిస్తున్నారు. అంతేకాకుండా తాను చిన్నతనం నుంచి యోగా చేస్తుంటారు. ఇప్పుడు మిద్దెతోటలో యోగా చేయడం వలన ఫలితాలు ఇంకా ఆశాజనకంగా ఉంటున్నాయని భారతీదేవి అంటున్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో గడపడం వలన శారీరక శ్రమకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు.
తమ ఇంట్లో తమ చేతులతో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా మంచి రుచిగా ఉంటాయని, కూరగాయలు, ఆకుకూరలు త్వరగా ఉడుకుతాయని, తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మిద్దెతోటలో ఉసిరి, చింత లాంటి విటమిన్లు అందుబాటులో ఉండే మొక్కలను పెంచి వాటిని ఆహారంగా తీసుకున్నట్లయితే మన శరీరానికి కావలసిన విటమిన్లు సహజ సిద్ధంగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి మిద్దెతోట వలన అందరికీ ప్రత్యేకించి స్త్రీలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి అందరు ఇంటి పంటను తప్పని సరిగా చేపట్టాలని భారతీదేవి కోరుతున్నారు. కొత్తగా ఇంటి పంటను చేపట్టే వారు మొదటలో ఆకుకూరలతో మొదలుపెడితే ఫలితాలు బాగుంటాయనే సూచనను ఇంటిపంటను మొదలు పెట్టేవారికి ఇస్తున్నారు.
ప్రతి వ్యక్తికి కొన్ని సరదాలు / అలవాట్లు / వ్యాపకాలు ఉంటాయి. ప్రస్తుతం సమాజంలో వ్యక్తుల అలవాట్లను గమనించినట్లయితే చాలావరకు తమకు, సమాజానికి నష్టం కలిగించేవిగానే ఉన్నాయి. ఉదాహరణకు కొంతమందికి డ్రైవింగ్ సరదాగా ఉండవచ్చు. అనవసరమైన డ్రైవింగ్ వలన ఇంధనము రూపంలో డబ్బు ఖర్చు అవటంతోపాటు ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవచ్చు. ఇంకొంతమంది ప్రొగత్రాగడానికి, డ్రగ్స్‌కు, అల్కహాలుకు, బెట్టింగుల లాంటి అలవాట్లను సరదాగా మొదలు పెట్టి చివరకు వాటికి బానిసలు అయ్యి ఎంతో నష్టపోతుంటారు. ఇంకా కొంతమంది ఫోన్ల వాడకం సరదాగా మొదలు పెట్టి అది అలవాటుగా మారి చివరకు ఫోన్లకు కూడా బానిసలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవిధంగా చెప్పుకుంటూపోతే సమాజంలో అనేక రకాల సరదాలు, అలవాట్ల వలన తాము నష్టపోవడంతోపాటు సమాజానికి కూడా నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మన సరదాలు, మన అలవాట్లు మనతో పాటు తోటి వారికి ఉపయోగపడేవిగా, మన ఆరోగ్యాన్ని కాపాడేవిగా, శారీరక శ్రమకు అవకాశం ఉండేవిగా ఉండాలి. అప్పుడు అన్ని రకాలుగా ఫలితాలు ఉంటాయి. అలాంటి సరదాలలో/అలవాట్లలో ఇంటిపంట మొదటి వరుసలో ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది ఇంటిపంటవైపు అడుగులు వేశారు, వేస్తున్నారు. ఈ కోవకు చెందుతారు హైదరాబాద్ రాంపల్లి, నేతాజీనగర్‌లో టెర్రస్‌గార్డెన్ పెంచుతున్న ఎలిజబెత్.
ఎలిజిబెత్ రెండున్నర సంవత్సరాల క్రితం సరదా కోసం ఇంటి పంటను మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆ ఇంటి పంట తమ ఆరోగ్యాలను కాపాడటంతో పాటు తన పరిచయాలను కూడా పెంచి ఒక మంచి సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సరదాకోసం మొదలు పెట్టిన ఇంటి పంట ద్వారా రెండున్నర సంవత్సరాలలో నైపుణ్యాన్ని పెంచుకొని తక్కువ కాలంలో తోటి వారికి అవగాహన కల్పించే స్థాయికి ఎలిజబెత్ ఎదిగింది. ఎలిజబెత్ ప్రస్తుతం తన అనుభవాలను తోటి వారికి పంచడంతో పాటు ఉద్యాన శాఖ వారు ఇంటి పంటపై ఏర్పాటు చేసే అవగాహన సదస్సుల ద్వారా కూడా తన అనుభవాలను తోటి ఇంటి పంటదారులకు తెలియచేస్తున్నారు.
తన ఇంటి పంటలో పునాస మామిడి, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, పందిరిమామిడి, అల్‌టైమ్ మామిడి లాంటి మామిడి మొక్కలు, యాపిల్ బేర్ 5 మొక్కలు, నేరేడు రెండు రకాలు, దానిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్, అంజూర, అరటి, స్టార్‌ఫ్రూట్, జీడిమామిడి, టేబుల్ నిమ్మ, తీపినిమ్మ, బత్తాయి, చింత మొదలగు పండ్ల మొక్కలతో పాటు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలతో పాటు మందార, గులాబి లాంటి మొక్కలు కూడా పెంచుతున్నారు.
తమ ఇంటిపంటలో ఉన్న మొక్కలను ప్రతిరోజూ గమనిస్తూ పిండినల్లి లాంటి చీడపీడలను బ్రష్‌తో, పేనుబంకను (ఎఫిడ్స్) గంజి+ఇంగువ+పసుపు ద్రావణంతో నివారించుకుంటున్నారు. ప్రతి 10 రోజులకు మ్యాజిక్ కంపోస్టు (వివరాలను బాక్సు చూడగలరు)ను అందిస్తున్నారు. తీగజాతి కూరగాయలకు 3 జి కటింగ్ (వివరాలకు బాక్సు చూడగలరు) చేస్తూ ఎక్కువ దిగుబడి పొందుతున్నారు. కాకర, సొర, బీర లాంటి తీగ జాతి కూరగాయలు మగ, ఆడపూలు విడివిడిగా ఉంటాయి కాబట్టి రెండుకంటే ఎక్కువ మొక్కలు వేస్తున్నారు. తన ఇంటి పంటలో ఉన్న మొక్కలలో కొన్నింటిని తోటి ఇంటిపంట దారుల వద్ద నుంచి సేకరించి అభివృద్ధి చేసినవి ఉన్నాయి అని తనకు మొక్కలు అందచేసిన వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిధంగా తాను కూడా ఇతరులకు విత్తనాలు, మొక్కలు అందచేస్తూ తోటివారిని ఇంటిపంటవైపు అడుగులు వేయించడంలో తన వంతు కృషి చేస్తున్నారు. తన అనుభవాన్ని వేరే వారికి తెలియపరచడానికి ఏవిధమైన ఇబ్బంది పడకుండా తోటి వారిని ఇంటి పంట వైపు ప్రోత్సహిస్తున్నారు. తమ కుటుంబానికి, తోటి సమాజానికి, పర్యావరణానికి ఉపయోగపడే అలవాటును సరదాగా తీసుకొని కొనసాగిస్తున్న ఎలిజబెత్‌ని నిజంగా అభినందించవలసిందే. మరిన్ని వివరాలు మరియు ఇంటి పంటకు అవసరమైన సలహాలను ఎలిజబెత్ 8142055527కి ఫోను చేసి తెలుసుకోగలరు.
మ్యాజిక్ ఫార్ములా
200 గ్రాముల ఆవపిండి, 200 గ్రాముల వర్మికంపోస్టు, 200 గ్రాముల వేపపిండి, 50 గ్రాముల తాజా టీ పొడి, తొక్కతో ఉన్న 4 అరటి పండ్ల పేస్టు. వాటన్నింటిని 20 లీటర్ల నీటిలో కలిపి ప్రతి రోజు రెండుసార్ల చొప్పున కట్టెతో 3 రోజులు కలిపితే మ్యాజిక్ కంపోస్టు తయారవుతుంది. 4వ రోజు నుండి ఈ ద్రవ ఎరువును ఉపయోగించుకోవచ్చు. లీటరు ద్రవ ఎరువుకు 10 లీటర్ల నీటిని కలిపి సాయంకాలం పూట మొక్కల పాదులలో అందించాలి. సున్నితమైన మొక్కలకు అయితే ఒక లీటరు ద్రవ ఎరువుకు 15 లీటర్ల నీటిని కలిపి మొక్కల పాదులలో అందించాలి. ఈ ద్రవ ఎరువును ప్రతి 10 రోజులకు ఒకసారి మొక్కలకు అందిస్తే ఫలితం బాగా ఉంటుంది.
మట్టి మిశ్రమం
30 శాతం ఎర్రమట్టి, 30 శాతం వర్మికంపోస్టు లేదా మాగిన ఆవుపేడ, 30 శాతం ఇసుక (కోకోపిట్ తప్పనిసరి కాదు) 10% వేప పిండిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నట్లయితే 30 నుంచి 40 రోజుల వరకు ఎలాంటి పోషకాలు అందించ కుండానే మొక్కలు ఎదుగుతాయి. 40 రోజుల తరువాత పోషకాలు అందించవలసి ఉంటుంది.
అలోవేరాతో అనేక ఉపయోగాలు
ఆలోవేరాని అంగుళం ముక్కలుగా కోసుకుని, ఒక లీటరు నీటిలో ఒక ముక్క వేసి 5 గంటలు నానిన తరువాత ఆ నీటిని మొక్కకు ఒక్కొక్క కప్పు చొప్పున పాదులలో అందిస్తే వర్షాకాలంలో నీరు ఎక్కువ అయినందువలన వచ్చే సమస్య నుండి మొక్క తేరుకుంటుంది. అంతేకాకుండా మల్బరి, గులాబి, మందార లాంటి కొమ్మలను కలబంద జ్యూస్‌లో ముంచి నాటుకున్నట్లయితే త్వరగా వేర్లు అభివృద్ధి చెందుతాయి అని ఎలిజబెత్ తాను పాటించిన పద్ధతులు వివరించారు.
3జి కటింగ్
బీర, సొర, కాకర లాంటి తీగజాతి మొక్కలను 3 జి కటింగ్ చేసినట్లయితే ఎక్కువ ఆడపూలు పుష్పించి దిగుబడి పెరుగుతుందని ఎలిజబెత్ వివరిస్తున్నారు. ఇందుకు గాను తీగజాతి కూరగాయ మొక్క రెండు అడుగులు పెరిగిన తరువాత తల త్రుంచినట్లయితే రెండు ఇగుర్లు వస్తాయి. అవి కూడా ఒక అడుగు వచ్చిన తరువాత మరలా వాటి తలను త్రుంచితే ఈసారి ఒక్కొక్క దానికి రెండు చొప్పున రెండు తీగలకు 4 తీగలు వస్తాయి. మరలా అవి కూడా ఒక అడుగు పెరిగిన తరువాత తల గిల్లినట్లయితే ఈసారి 8 తీగలు వస్తాయి. ఈ 8 తీగలను వదలి వేసినట్లయితే ఎక్కువ బ్రాంచీలు వచ్చి ఆడ పూల శాతం పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుందని ఎలిజబెత్ తన అనుభవాన్ని వివరించారు.
చింత చిగురు పొందడం
ఇంట్లో డ్రమ్ములో చింత చెట్టు పెంచుకొంటూ ముదురు ఆకులని క్రమం తప్పకుండా గిల్లుతూ ఉన్నట్లయితే చింత చిగురు వస్తూ ఉంటుంది. తాను ఆ విధంగానే తన మిద్దె తోటలో పెంచుతున్న చింత చెట్టు నుండి చింత చిగురు పొందుతున్నానని ఎలిజబెత్ వివరించారు.