బహుళ ప్రయోజనకారి అరటి
అరటి అనగానే మనకు అరటి పండ్లు మాత్రమే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. లేదా అరటి ఆకులు అరటి పూవులు కూడా కొంతమందికి గుర్తుకు వస్తాయి. కాని అరటి చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగపడతాయి. ఒక అరటి మొక్కను నాటినట్లయితే అనేక పిలకలు వస్తూనే ఉంటాయి. అరటి వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి తమ ఇంటి ప్రక్కన కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని వివిధ రకాల అరటి మొక్కలు పెంచుతున్నాడు విజయవాడకు చెందిన సురేష్.
సురేష్‌ది వ్యవసాయ నేపథ్యం. అయినాకాని ఉన్నత చదువులు చదివి వ్యవసాయానికి దూరం జరిగి విజయవాడలోని ఒక మల్టీస్పెషాలటీ వైద్యశాలలో ఐ.టి. మేనేజరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సురేష్‌కి వ్యవసాయం అన్నా, మొక్కలన్నా, పచ్చదనం అన్నా మక్కువ చాలా ఎక్కువ. తన మక్కువను తీర్చుకొనటానికి విజయవాడ మాచవరం డౌన్‌లో కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని దాంట్లో వివిధ రకాల అరటి మొక్కలు సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం తన అరటి వనంలో 7 రకాల అరటి మొక్కలు ఉన్నాయి. కర్పూర, రెండు రకాల చక్రకేళి, ఎర్ర అరటి, పచ్చఅరటి, రెండు రకాల కూర అరటి మొక్కలను తెలిసిన రైతుల వద్ద నుంచి తెలిసిన ఇంటి పంట దారుల నుంచి సేకరించి 7 రకాల అరటి మొక్కలతో అరటి వనాన్ని పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు.

అరటి మొక్కలతోపాటు పడి మొలసిన కొన్ని రకాల మొక్కలను కూడా సురేష్ పెంచుతున్నాడు. వాటిలో నల్ల ఉమ్మెత్త, పారిజాతం, గురివింద మొక్కలు కూడా ఉన్నాయి. అరటి మొక్కలు పెరిగిన తరువాత ఆ మొక్కల కింద నీడ ఉండి నర్సరీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సురేష్ ఆవిధంగా కూడా అరటి మొక్కల నీడను కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆ నీడలో కొన్ని రకాల మొక్కలను పెంపకం చేస్తూ తాను ఉపయోగించుకోవడంతో పాటు, ఇంటిపంటదారులకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఉచితంగా అందచేస్తుంటాడు. కొన్నిసార్లు తానే రవాణా ఖర్చులు కూడా భరించి ఉచితంగా విత్తనాలు, మొక్కలు పంపిస్తుంటాడు. సురేష్ విత్తన నిధిని మెయింటేన్ చేస్తూ కొన్ని రకాల పురాతన, నాటు విత్తనాలను సంరక్షిస్తూ, వృద్ధి పరుస్తూ, తన వద్దలేని విత్తనాలను తోటి రైతుల వద్ద నుంచి, తోటి ఇంటి పంటదారుల నుంచి, తెలిసిన వారి నుంచి సేకరిస్తూ అవసరమైన వారికి అందిస్తుంటాడు. ఈ విధంగా పచ్చదనం పెంచడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నాడు.

తన అరటి వనంలో అరటితో పాటు వివిధ రకాల మొక్కలను పూర్తి సేంద్రియ పద్ధతులతో పెంపకం చేస్తున్నారు కాబట్టి తేనెటీగలు తేనె తుట్టెలను పెడుతుంటాయి. ఈ తేనె టీగల వలన అరటి పంటలో పరపరాగ సంపర్కము సక్రమంగా జరిగి అరటి పండ్ల నాణ్యత, రుచి పెరగటంతోపాటు అరటి గెలలు కూడా పెద్దగా వస్తున్నాయి. గెలలో అన్ని కాయలు గట్టిపడి నాలుగు, ఐదు కాయలు పండి రంగు మారిన తరువాత గెలను కోసి ప్రకృతి సిద్ధంగా పండించి కొన్ని కాయలను తాము వినియోగించుకుంటూ మిగిలిన కాయలను అడిగిన వారికి అమ్మకం చేసి ఆదాయాన్ని కూడా పొందుతున్నాడు.

అరటి మొక్కలలో అన్ని భాగాలు ఉపయోగపడతాయి. అరటి ఆకులు అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. అరటి గెలలో కాయలు పడిన తరువాత గెల చివరన మిగిలిన పువ్వులతో కూర చేసుకోవచ్చు. అరటి గెలలో కాయలు కోసిన తర్వాత మిగిలే దూటను కూడా కొంతమంది కూరగా చేసుకోవడానికి ఉపయోగిస్తుంటారు. అరటి బోదెలో దొప్పలను కూడా కార్తీక మాసంలో దీపాలు పెట్టి నీటిలో వదలటానికి ఉపయోగిస్తుంటారు. మిగిలి పోయిన అరటి బోదెను వేస్ట్‌డికంపోజరుతో కుళ్ళించినట్లయితే మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఈ విధంగా అరటి మొక్కలోని ఏభాగం వృధా కాకుండా అరటి మొక్క మొత్తం ఉపయోగపడడంతో పాటు అరటి మొక్క నుండి ప్రతినిత్యం పిలకలు వస్తుంటాయి. ఆ పిలకలు ముదిరిన తరువాత తవ్వి మరలా నాటుకోవచ్చు. కాబట్టి అరటిని బహుళ ప్రయోజనకారి అని తెలుసుకున్న సురేష్ అరటి వనాన్ని సృష్టించాడు. మరిన్ని విరాలు 89850 68899 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

