ఈ వ్యాధి వేడి రక్తం గల ప్రతి జంతువులోను మరియు మనుషులలోను కలుగు అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధిలో ముఖ్యంగా మెదడు మరియు వెన్నుపాము కణాలు దెబ్బతినుట వలన నాడీమండల వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి.
రేబీస్ వ్యాధిని ”హైడ్రోఫోబియా”, ”లిస్సా మరియు రేజ్” అని కూడా పిలుస్తారు.
వ్యాధి కారకం: ఈ వ్యాధి ”రాబ్డ విరిడె” జాతికి చెందిన లోస్సా వైరస్ వలన కలుగుతుంది. ఈ వైరస్ బుల్లెట్ ఆకారంలో ఉండి సుమారు 70 నుండి 80 మి.మీ. పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా జంతువులలో వ్యాధులను కలిగించే వ్యాధి కారక వైరస్‌ను ”స్రీట్ వైరస్” అని, ప్రయోగశాలలో సీరియల్ పసాజ్ చేసిన వైరస్‌ను ఫిక్స్డ్ వైరస్ అని అంటారు.

ఈ వ్యాధిబారిన పడే పశువులు: గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, పందులు, కుక్కలు, పిల్లులు, నక్క, కోతులు, ఉడతలు ఇలా వేడి రక్తం గల ప్రతి పశువులోను మరియు మనుషులలో వచ్చే ఒక ‘జునోసిస్’ వ్యాధి.
వ్యాధి సోకే మార్గం: ఈ వ్యాధి ముఖ్యంగా వ్యాధిగ్రస్త జీవి కరవడం వలన (కుక్కలు, నక్కలు, పిల్లులు, ముంగిసలు, గబ్బిలాలు), వ్యాధిబారిన పడిన పశువుల లాలాజలం, కంటి స్రావాలు చర్మగాయాలపై పడినప్పుడు, కొన్ని సందర్భాలలో వ్యాధిబారిన పడిన పశువుల పాలు మరియు వ్యాధితో చనిపోయిన పశువుల మాంసం సరిగా ఉడకబెట్టనట్లయితే కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ.
ఇంకుబేషన్ పీరియడ్: సాధారణంగా రేబీస్లో ఇంక్యుబేషన్ పీరియడ్ 1 రోజు నుండి 60 రోజుల వరకు ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ వ్యాధిగ్రస్త జీవి కాటు వేసే లేదా గాయం చేసే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. మెడ లేదా తల దగ్గర కరిచినట్లయితే 1 లేదా 2 నెలల లోపు వ్యాధి లక్షణాలు బయట పడును. ఇతర శరీర భాగాలలో కరిచినట్లయితే 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఒక్కసారి రేబిస్ వ్యాధి లక్షణాలు బయట పడినట్లయితే 10 రోజుల లోపు ఆ పశువు చనిపోతుంది.
వ్యాధి లక్షణములు: ఈ వ్యాధిలో ప్రధానంగా రెండు రకములైన లక్షణములు కనిపించును. అవి 1) ప్యూరియస్ థ లక్షణములు, 2) డంభ్ థ లక్షణములు.
ప్యూరియస్ దశ లక్షణములు: వ్యాధిగ్రస్త పశువుల ప్రవర్తనలో మార్పు ఉంటుంది. యజమాని మాట పశువు వినదు. పశువు ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కదానిని కరవాలి అనే లక్షణం ఉంటుంది. అందువలన కుక్కలు కనిపించిన ప్రతి పశువును, మనుషులను కరవడమే కాక ఎదురుగా ఉన్నచెక్కలు, ఇనుము, రాళ్ళు వంటివి కూడా కొరుకుతూ ఉంటుంది. ప్రతి చిన్న చర్యకు కూడా తీవ్రమైన ప్రతిచర్యను చూపిస్తాయి. కుక్కలు విపరీతంగా అరుస్తాయి. క్రమేపి ఆకలి నశించి కళ్ళు ఎర్రబడి ఉంటాయి. కుక్కలు నీటిని త్రాగలేక నీరును చూసి చాలా భయపడతాయి. ఈ ప్యూరియస్ థ సుమారు 1-7 రోజుల వరకు ఉంటుంది.
డంభ్దశ లక్షణములు: ఈ మూగథ లక్షణములో క్రింది దవడ నాలుక స్వరపేటిక, వెనుక కాళ్ళు, పక్షవాతానికి గురి అవుతాయి. ఈ దశలో కుక్కలు కరవలేవు. కాని వాటి లాలాజలంలో మాత్రం వైరస్ అధికంగా ఉంటుంది. అరుపులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. క్రింది దవడ వ్రేలాడుతు ఉంటుంది. నోరు పూర్తిగా మూత పడదు. చివరకు కుక్కలు 1-10 రోజులలోపు చనిపోతాయి.
నిర్ధారణ: వ్యాధి చరిత్ర వ్యాధి లక్షణాలు, వ్యాధికారక చిహ్నములు ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. కుక్క కరిచిన తరువాత 10 రోజుల వరకు కుక్కను గమనిస్తూ ఉండాలి. 10 రోజుల లోపు ఆ కుక్క చనిపోతే దానికి రేబిస్ వ్యాధి ఉంది అని నిర్ధారణ చేయవచ్చు. ”నిగ్రిబాడిస్ టెస్ట్” ప్లోరోసెంట్ ఆంటీబాడీ టెస్ట్‌ల ద్వారా కూడా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
చికిత్స: వ్యాధిగ్రస్త జీవి కరిచిన వెంటనే ఆ ప్రదేశాన్ని మొదట నీటితో బాగా శుభ్రపరచాలి. ఆ తరువాత వెంటనే ఆంటీసెప్టిక్ ద్రావణంతో గాయాలను శుభ్రం చేయాలి. గాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కట్టుకట్టుట కుట్లు వేయుట చేయరాదు. ఈ వ్యాధికి ఎటువంటి ప్రత్యేకమైన చికిత్స లేదు.
వ్యాధి లక్షణములకు చేయు చికిత్స: ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఆంటీఇన్ఫ్లమేటరీ నొప్పులను తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్, జ్వరం తగ్గించడానికి ఆంటీపైరటిక్స్ ఔషధములను ఇవ్వవలెను.
నివారణ: వైరస్‌తో కలుషితమైన ఆహారాన్ని ఇవ్వకూడదు. వ్యాధితో బాధపడుతున్న కుక్కలను లేదా పశువులను వేరు చేయాలి. కుక్కలు లేదా పశువులు ఈ వ్యాధితో చనిపోయిన యెడల వాటిని శవపరీక్ష చేయుట, వాటి పాలు త్రాగుట నిషేధం. వీధికుక్కల నివారణ మరియు మనుషులతో ఈ వ్యాధి గురించి అవగాహన చాలా అవసరం.
కుక్క కరిచిన ఎడల రేబిస్ టీకాను ఈ క్రింది షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి. కుక్క కరిచిన రోజును లేదా మొదటి టీకా వేసిన రోజును ‘0’ రోజుగా లెక్కించి, తరువాత 3, 7, 14, 28, 90 రోజులలో మొత్తం 6 మోతాదులను ఇవ్వవలెను.
కుక్కలలో ఈ వ్యాధి రాకుండా ఉండుటకు: మూడవ నెలలో మొదటి మోతాదును మరియు నాలుగవ నెలలో బూస్టర్ మోతాదును తిరిగి ప్రతి సంవత్సరం ఈ టీకాను వాటి జీవిత కాలం ఇచ్చినట్లయితే ఈ వ్యాధిని కుక్కలలో రాకుండా నివారించవచ్చు.
డా. ఎం. వెంకట ప్రసన్న, వెటర్నరీ డాక్టర్, మైదుకూరు – 516172

