- ఎండు మిర్చి భారతదేశంలో ముఖ్యమైన వాణిజ్య పంట. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మిర్చి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది.
- ప్రస్తుత చాలా మంది మిరపను సాగు చేసే రైతులు ఎక్కువ ఎరువులు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందననే అపోహతో మిరప నారు నాటినప్పటినుండి ప్రతి 20 రోజులకు ఒకసారి మొత్తం 6-7 సార్లు పై పాటుగా కేవలం రసాయన ఎరువులను వేయటం జరుగుతుంది. దాదాపుగా పంట కాలంలో ఒక ఎకరానికి 24-30 మూటలు (1200-1500 కేజి/ఎ) వాడుతున్నారు. ఇది సాదారణం కంటే 2 నుండి 3 రేట్లు ఎక్కువగా వేస్తున్నారు. అదేవిధంగా కేవలం రసాయన ఎరువులపై పెట్టే పెట్టుబడి అధికంగా ఒక ఎకరానికి సుమారు 45,000-50,000 రూపాయలు అవుతుంది. దీనివల్ల పెట్టుబడి పెరగటమే కాకుండా, పురుగు, తెగుళ్ల ఉదృతి అధికం అవటం, నేల ఆరోగ్యం క్షీణించటం, పోషక లోపాలు ఏర్పడటం వల్ల దిగుబడి తగ్గి రైతుకు గిట్టుబాటు కాకుండా నష్టపోతున్నారు.
- మిరపలో రసాయన ఎరువులు అధికంగా ఉపయోగించడం వలన మరియు సేంద్రియ ఎరువులను పరిమితం చేయడం లేదా ఉపయోగించకపోవడం వలన నేల సమస్యలు మరియు సూక్ష్మపోషకాల లోపాలు ప్రధానంగా గమనించడమైనది. నేల సంరక్షణ పద్ధతులు, పచ్చి రొట్ట ఎరువు, పంట మార్పిడి మరియు సేంద్రియ ఎరువులను ఉపయోగించడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి, పంటకు కావలసిన పోషకాల లభ్యత మెరుగుపడుతుంది.
- నేల సేంద్రీయ కార్బన్ మరియు భౌతిక స్థితిని మెరుగుపరచడానికి వైవిధ్యమైన సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు (25t/ha) లేదా వర్మికంపోస్ట్ (5t/ha) బయో-ఏజెంట్లతో వృద్ది చేసిన ఎరువు, పిండి ఎరువులు, పంట అవశేషాలు మొదలైనవి ఉపయోగించాలి.
- సేంద్రియ పదార్థాన్ని మిరప పంటకు ఆహారంగా కాకుండా నేలలోని సూక్ష్మజీవులకు ఆహారంగా పరిగణించాలి. ఇవి నేల ఆరోగ్యాన్ని మరియు మొక్కల పోషణను చూసుకుంటాయి. పోషకాలను సమతుల్యంగా తీసుకోవడానికి ఆరోగ్యకరమైన నేల ప్రాథమికమైనది.
- సూక్ష్మజీవుల సంతతిని పెంపొందించడానికి బయోఫెర్టిలైజర్లు మరియు బయో-ఏజెంట్లను (అజాటోబాక్టర్, అజోస్పిరిల్లమ్, ఫాస్ఫోబాక్టీరియా, బాసిల్లస్ సబ్టిలస్ మరియు మైకోరైజా, సూడోమోనాస్, ట్రైకోడెర్మా మొదలైనవి) నేలకి అందించాలి.
- పచ్చి రొట్ట ఎరువుగా జనుము పంటను వేయడం వల్ల సేంద్రీయ పదార్థం మరియు పోషకాలు అధికంగా అందటంతో పాటు నేలలో వున్న నులి పురుగులను అణిచివేస్తుంది.
- పచ్చిరొట్ట వేయడం వలన త్రిప్స్, అఫిడ్స్ మరియు తెల్లదోమ ఉదృతి తగ్గించుకోవచ్చు. సేంద్రీయ పదార్థం ఎక్కువగా వుంటే వేరుకుళ్లు మరియు ఆకులపై వచ్చే తెగుళ్లు తగ్గుతాయి.

పంట నాటక ముందు సేంద్రీయ ఎరువుల యాజమన్యం
- తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట కోసం నవ ధాన్యాలను ఎకరానికి 15 కిలోల చొప్పున విత్తుకోవాలి. పచ్చిరొట్ట పైరు 45 రోజులు పెరిగిన తరువాత రోటవేటర్ తో నేలలో కలియదున్నాలి.
- ప్రయోజనాలు; నేలలో సేంద్రియ కర్బన నష్టాన్ని నివారిస్తుంది. భూసారాన్ని పెంచుతుంది. నేల వేడిమి తగ్గి, సూక్ష్మజీవుల చర్యలు వేసవిలో కూడా అందుబాటులో ఉంటాయి. దీని వల్ల ఎకరాకు 4-6 టన్నుల పచ్చిరొట్ట ఎరువు అందుతుంది. నేల 2 రెట్లు ఎక్కువ నీటిని ఒడిసి పడుతుంది. నేల గుల్లబారి గాలి ప్రసరణ బాగుంటుంది. సూక్ష్మ జీవులు 100 రెట్లు పెరుగుతాయి. పురుగు, తెగుళ్ల నిరోధక శక్తి పెరుగుతుంది. సూక్ష్మ పోషకాల లోపాలు రావు. రసాయన ఎరువుల వాడకం 30-50% తగ్గుతుంది. పంట బెట్ట/నీటి ముంపు నుండి తట్టుకుంటుంది.
- పచ్చిరొట్టె కలియదున్నిన 10-15 రోజుల తరువాత అంటే జులై రెండవ పక్షంలో, పశువుల ఎరువు ఒక ఎకరానికి 8-10 టన్నులు చల్లుకోవాలి.
- ఈ పశువుల ఎరువుతో పాటుగా 10 రోజుల ముందుగా తయారు చేసుకున్న జీవన ఎరువులు మిశ్రమంను వేసి దుక్కి దున్నలి.
- బయో ఏజెంట్స్ మిశ్రమం తయారీ: ఒక ఎకరానికి వర్మి కంపోస్ట్ 200 కిలోలు (లేదా) పశువుల ఎరువు 200 కిలోలను తీసుకొని దానికి 40 కిలోల వేప పిండిని కలపాలి.
- తరువాత Azotobacter, Phosphorus Solubilizing Bacteria (PSB) and Potash Mobilizing Bacteria (KMB) లాంటి బయో ఫర్టిలైజర్స్ మరియు ట్రైకోడెర్మ, సూడోమోనస్, బవేరియా, మెటరైజమ్ ప్రతిదీ 1 లీటరు చొప్పున తీసుకొని, వీటిని 1 కేజి బెల్లం పానకంలో కలిపి కంపోస్ట్ లో కలుపుకోని 10-12 రోజులు మగ్గ పెట్టి పొలంలో వేసి దున్నుకోవాలి. ఈ విధంగా పంట నాటిన 30 రోజులకి మరియు 60 రోజులకి ఒకసారి సాళ్ల మద్యన వేసి నీరు పెట్టాలి.
- ప్రయోజనాలు – నేల సారం, సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. పోషకాలు మొక్కలకు సులభంగా అందుతాయి. వేర్ల పెరుగుదల మెరుగుపడుతుంది. నేల నుంచి వచ్చే తెగుళ్లు తగ్గుతాయి. నేలలోని కీటకాలు నియంత్రణలోకి వస్తాయి. రసాయన ఎరువులు, పురుగుమందుల ఖర్చు తగ్గుతుంది.
- ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి 100 కేజిల వర్మి కంపోస్ట్ తో పాటుగా 2 కిలోల మైకోరైజా + 1 కిలో హుమిక్ ఆసిడ్ల మిశ్రమను కలిపి వేయడం వల్ల మొక్క వేరు వ్యవస్థ, శాకియ పెరుగుదల బాగా పెరుగుతుంది.

- ముందస్తు వర్షాకాల పొడి విత్తనాలు విత్తడం (Pre-Monsoon Dry Sowing – PMDS): (Source:APCNF)
- మిరప పంట సాగు చేయడానికి ముందు, కనీసం 9 రకాల పంటల విత్తనాలను (పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు మొదలైనవి) ఏప్రిల్/మే నెలల్లో, అంటే మిరప పంట చివరి కోతకు ఒక వారం ముందు విత్తుకోవాలి.
- ఈ పంటలను జూలై రెండవ వారం వరకు, అంటే మిరప పంట నాటే సమయం వరకు కొనసాగించాలి. దీనివల్ల పొలంలో మంచి మొక్కల పెరుగుదలతో పాటు అధిక జీవద్రవ్యరాశి (Biomass) లభిస్తుంది.
- విత్తనాల రకాల వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి.
- PMDS పద్ధతిని అనుసరించడం ద్వారా వివిధ రకాల పంటలు, కూరగాయలు, ఆకుకూరలలో కొంత భాగాన్ని కుటుంబ అవసరాల కోసం కోసి వినియోగించుకోవచ్చు.
- మిగిలిన పంట అవశేషాలను పశుగ్రాసంగా ఉపయోగించుకోవచ్చు లేదా నేలపై కప్పుగా (Mulch) పరచవచ్చు లేదా ప్రధాన పంటలో కలియదున్నవచ్చు.

- మిరప పంటలో అంతర పంటలు మరియు బహుళ పంటల సాగును ప్రోత్సహించడం (Intercropping and Polycropping):
- మిరప పంట సాగు విధానంలో అంతర పంటలు మరియు బహుళ పంటల కలయికను తప్పనిసరిగా పెంపొందించాలి.
- అంతర పంటలుగా ఉల్లి, కందులు, దుంపజాతి కూరగాయలు, ఆకుకూరలు మరియు తీగజాతి కూరగాయలను మిరప పంటలో భాగంగా సాగు చేయాలి.
- ప్రధాన పంటతో పాటు అంతర పంటలు, ఇతర పంటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా తప్పనిసరిగా నమోదు చేయాలి.

- విత్తనాలు మరియు నారుమొక్కల శుద్ధి (Seed and Seedling Treatment):
- విత్తనాలు మరియు నారు మొక్కలను నాటడానికి ముందు బీజామృతంతో శుద్ధి చేయాలి.
- ఘనజీవామృతం (Ghanajeevamrutham – GJM) వినియోగం:
- చివరి దుక్కి సమయంలో క్రింది మోతాదులో పదార్థాలను పొలంలో వేయాలి.
• ఘనజీవామృతం టైపు-2 -1,000–1,500 కిలోలు
• వేపపిండి (Neem Cake) – 200 కిలోలు
• ట్రైకోడెర్మా విరిడే (Trichoderma viride) – 4 కిలోలు
• ఘనజీవామృతం టైపు-1: ఎకరాకు మొత్తం 500 కిలోలు, రెండు విడతలుగా వేయాలి.
o మొదటి విడత: నాటే సమయంలో 250 కిలోలు.
o రెండవ విడత: నాటిన 45 రోజుల తర్వాత (45 DAT) 250 కిలోలు.
• ఈ పదార్థాలను మొక్కల దగ్గర వరుసల్లో లేదా మొక్కల మొదళ్ల వద్ద వేసే పద్ధతిలో (Placement Method) వినియోగించాలి.

- ద్రవజీవామృతం (Dravajeevamrutham – DJM) వినియోగం:
అ) నేల ద్వారా అందించడం (Soil Application):
- నాటిన 40వ రోజు నుంచి మొత్తం 7 సార్లు (40, 60, 90, 120, 140, 150, 160 వ రోజు), ప్రతి సారి ఎకరాకు 200 లీటర్ల చొప్పున అందించాలి.
ఆ) ఆకులపై పిచికారీ (Foliar Application): - క్రింది షెడ్యూల్ ప్రకారం ద్రవజీవామృతాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
నాటిన రోజుల తర్వాత ద్రవజీవామృతం మోతాదు నీటి పరిమాణం
15వ రోజు 5 లీటర్లు 100 లీటర్లు
50వ రోజు 10 లీటర్లు 125 లీటర్లు
75వ రోజు 10 లీటర్లు 125 లీటర్లు
105వ రోజు 15 లీటర్లు 150 లీటర్లు
115వ రోజు 30 లీటర్లు 150 లీటర్లు
130వ రోజు 30 లీటర్లు 150 లీటర్లు
- ఎదుగుదలను ప్రోత్సహించే పదార్థాల వినియోగం (Growth Promoters):
i. పంచగవ్య (Panchagavya):
• ఎకరాకు 4 లీటర్ల పంచగవ్యను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
• పుష్పించే దశ నుంచి మొత్తం 4 సార్లు పిచికారీ చేయాలి.
పిచికారీ సమయం:
• మొదటి పిచికారీ – నాటిన 25 రోజుల తర్వాత
• రెండవ పిచికారీ – నాటిన 50 రోజుల తర్వాత
• మూడవ పిచికారీ – నాటిన 75 రోజుల తర్వాత
• నాల్గవ పిచికారీ నాటిన – 115 రోజుల తర్వాత

ii. ఎగ్ అమైనో యాసిడ్ (Egg Amino Acid):
• ఎకరాకు 200–250 మి.లీ. ఎగ్ అమైనో యాసిడ్‌ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
• మొత్తం రెండు సార్లు పిచికారీ చేయాలి.
o నాటిన 130 రోజుల తర్వాత– మొదటి పిచికారీ.
o నాటిన 150 రోజుల తర్వాత– రెండవ పిచికారీ.
- తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలు (Non-Negotiable Practices):
క్రింది పేర్కొన్న అన్ని పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలి.
అ) అంతర పంటలు (Intercrops):
• రెండు మిరప మొక్కల మధ్య 50–100 గ్రాముల చొప్పున దుంపజాతి పంటలు మరియు ఇతర కూరగాయల విత్తనాలు విత్తాలి. ఉల్లి, ముల్లంగి, కొత్తిమీరతో సహా వివిధ ఆకుకూరలు మరియు ఇతర కూరగాయలను సాగు చేయాలి. వీటితో పాటు బంతి పూల నారుమొక్కలను కూడా నాటాలి.
ఆ) పొలం చుట్టూ రక్షణ పంటలు (Border Crops):
• జొన్న, సజ్జ లేదా మొక్కజొన్న పంటలను పొలం చుట్టూ 4 వరుసల్లో సాగు చేయాలి. విత్తనాల మోతాదు: ఎకరాకు 1–2 కిలోలు.
ఇ) ఉచ్చు పంటలు (Trap Crops):
• హెలికోవర్పా (Helicoverpa) పురుగు నివారణకు బంతి పూల మొక్కలను సాగు చేయాలి. విత్తనాల మోతాదు: 50 గ్రాములు.
• స్పోడోప్టెరా (Spodoptera) పురుగు నివారణకు ఆముదం పంటను ఉచ్చు పంటగా సాగు చేయాలి. విత్తనాల మోతాదు: 250 గ్రాములు.
ఈ) పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలు (Yellow and Blue Sticky Traps):
• ఎకరాకు 20–25 పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేయాలి.
• నాటిన 10వ రోజు (10 DAT) వీటిని పొలంలో అమర్చాలి.
ఉ) లింగాకర్షక బుట్టలు (Pheromone Traps):
• హెలికోవర్పా మరియు స్పోడోప్టెరా పురుగుల కోసం ఎకరాకు ఒక్కో రకానికి 8 చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. నాటిన 20–30 రోజుల మధ్య వీటిని అమర్చాలి.
ఊ) పక్షులు వాలేందుకు కర్రలు (Bird Perches):
• ఎకరాకు 10–15 పక్షులు వాలేందుకు అనువైన కర్రలను ఏర్పాటు చేయాలి.
• ఇవి పురుగులను తినే పక్షులను ఆకర్షించి సహజసిద్ధమైన పురుగు నివారణకు సహాయపడతాయి.

ఋ) కాంతి ఉచ్చులు (Light Traps):
- ఎకరాకు ఒక కాంతి ఉచ్చును ఏర్పాటు చేయాలి.
- పురుగుల ఉధృతి ప్రారంభం కాకముందే లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయడం:
• హెలికోవర్పా మరియు స్పోడోప్టెరా వంటి పురుగుల ఉధృతి ప్రారంభమైన తర్వాత కాకుండా, వాటి ఉనికి లేదా నష్టం కనిపించకముందే లింగాకర్షక బుట్టలను పొలంలో ఏర్పాటు చేయాలి.
• ముందస్తుగా బుట్టలను ఏర్పాటు చేయడం ద్వారా పురుగుల ఉనికిని గుర్తించడంతో పాటు వాటి సంతానోత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుంది. - ఏడాది పొడవునా పంటల వైవిధ్యం (365 Days of Green Cover):
• మార్చి నెలలో మిరప పంట కోత పూర్తయిన వెంటనే, కనీసం 9 రకాల పంటల విత్తనాలను PMDS పద్ధతిలో విత్తుకోవాలి.
• లేదా ఇతర పంటల సమూహాలతో (బహుళ పంటల సాగు – Polycropping) 365 రోజుల పాటు పొలంలో పచ్చదనం ఉండేలా పంటల సాగును కొనసాగించాలి.
• దీని ద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరగడం, నేల ఆరోగ్యం మెరుగుపడటం, జీవవైవిధ్యం అభివృద్ధి చెందడం మరియు నేల కప్పు నిరంతరంగా ఉండటం సాధ్యమవుతుంది.
యం. ఆదినారాయణ (ఉద్యాన శాస్త్రవేత్త), ఇ. రవి గౌడ్ (విస్తరణ శాస్త్రవేత్త), డి. బాలరాజు (సస్య రక్షణ శాస్త్రవేత్త) డా. జి. ధనలక్ష్మి (ప్రధాన శాస్త్రవేత్త), కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లె, నంద్యాల జిల్లా.
Ph: 9701278174

