దీనిని తాజా ఆవు పేడను చనిపోయిన ఆవు కొమ్ములలో నింపి సారవంతమైన భూమిలో ఆకురాలుకాలం నుండి వసంత రుతువు వరకు పాతిపెట్టి తయారుచేస్తారు. తయారయిన కొమ్ము ఎరువు శక్తివంతమైన భూమి చైతన్య కారకం. దీనిని భూమిలో కాల్షియం చురుకుదనాన్ని, సూర్యుని / జీవ శక్తులను భూమికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఈ శక్తులు విత్తనం మొలకెత్తడం, వేర్లు వృద్ధి చేయడం, మొక్క పెరగడంతోపాటు భూమిలో హ్యూమస్ ఏర్పడటానికి దోహదపడతాయి. కొమ్ము ఎరువును భూమి నిర్మాణానికి, భూమిలో ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు, వానపాములను పెంచుతాయి. ఎకరానికి 85 గ్రాముల కొమ్ము ఎరువుని సరిపడే నీటిలో కలిపి సవ్యదిశలో ఒక గంటసేపు కలిపి మధ్యాహ్నం తర్వాత భూమిపై సంవత్సరానికి కనీసం రెండుసార్లు వసంత ఋతువు, ఆకులు రాల్చే కాలంలో నీటి బిందువుల రూపంలో పిచికారి చేయాలి. కొమ్ము ఎరువు అసలైన బయోడైనమిక్ ఎరువు.
మొక్కల ఎదుగుదలలో కీలకపాత్ర పోషించే పొటాషియంను అందించడానికి సులభ రీతిలో పొగాకు ద్రావణాన్ని తయారుచేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో తయారుచేసే ఈ ద్రావణాలు రైతులకు ఎంతో ఉపయోగకరం.
పొగాకు కాడలను ముక్కలుగా చేసుకుని ఒక కిలో కాడలకు ఏడు లీటర్ల నీటిని కలిపి ఏడు రోజుల పాటు నానబెట్టాలి. దీనివల్ల నీటిలో కరిగే పొటాష్ తయారవుతుంది. అరటి పండు ద్వారా కూడా పొటాష్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.
లీటర్ నీటికి మూడుశాతం ద్రావణాన్ని కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పొటాష్‌తో పాటు తెగుళ్ల బెడద తగ్గుతుంది.
ఇటుకల కిల్న్ అనేది ఇటుకలు లేదా రాళ్లతో శాశ్వతంగా నిర్మించే బయోచార్ తయారీ నిర్మాణం. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు ఈ పద్ధతి అనువైనది. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు సమూహాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామస్థాయి బయోచార్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విధానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
ముందుగా కిల్న్ అడుగు భాగంలో పొడి చెక్కలు లేదా చిన్న కొమ్మలను అమర్చి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు లేదా ఇతర పొడి పంట అవశేషాలను పొరలుగా నింపాలి. పై పొర మండడం ప్రారంభమైన తర్వాత కిల్న్ లో గాలి ప్రవేశాన్ని క్రమంగా నియంత్రించాలి. దీంతో అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.
అవశేషాలు ఎక్కువ భాగం నల్లని బయోచార్‌గా మారిన తర్వాత గాలి ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసి కిల్న్ ను మూసివేయాలి. అనంతరం పూర్తిగా చల్లారిన తర్వాత బయోచార్‌ను బయటకు తీసి బూడిదను వేరుచేయాలి. అవసరమైతే బయోచార్‌ను చిన్న ముక్కలుగా చేసి కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.
ఇటుకల కిల్న్ ద్వారా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నాణ్యమైన బయోచార్‌ను తయారు చేయవచ్చు. ప్రారంభ నిర్మాణ వ్యయం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలం ఉపయోగించుకునే అవకాశం ఉండటం, ఉత్పత్తి వ్యయం తగ్గడం, పెద్ద ఎత్తున బయోచార్ తయారీకి అనువుగా ఉండటం వల్ల గ్రామీణ స్థాయిలో సామూహిక బయోచార్ ఉత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.
యంత్రం లేదా ఇనుప డ్రమ్ అందుబాటులో లేని పరిస్థితుల్లో చిన్న గొయ్యి ద్వారా కూడా బయోచార్‌ను తయారు చేయవచ్చు. ఇందుకోసం సుమారు ఒక మీటరు లోతు గల గొయ్యిని తవ్వాలి. ఆ గొయ్యిలో పొడి పంట అవశేషాలను నింపి, పైభాగం నుంచి మంట వేయాలి. అవశేషాలు నల్లని రంగులోకి మారడం ప్రారంభమైన తరువాత గొయ్యిని మట్టి లేదా ఇనుప రేకుతో కప్పి, గాలి ప్రవేశాన్ని పరిమితం చేయాలి. ఈ దశలో ఆక్సిజన్ ప్రవేశం నియంత్రించబడటం వల్ల అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.
కొంత సమయం తరువాత గొయ్యిని పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మట్టి లేదా ఇనుప రేకును తొలగించి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను నిల్వ చేసుకోవచ్చు లేదా కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.
ఈ పద్ధతిలో ఆక్సిజన్ ప్రవేశాన్ని పరిమితం చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. గాలి ఎక్కువసేపు లోపలికి ప్రవేశిస్తే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.
నేల దేశ సంపద, దేశం సుభిక్షంగా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల అనగా అనేక బిలియన్ల బ్యాక్టీరియా, శిలీంధ్ర, నాచు ఇంకా అనేక రకాల సూక్ష్మజీవుల సహజీవనంతో తొణికిసలాడే సజీవమైన జీవధార వ్యవస్థగా గుర్తించాలి. ఇవి మొక్కల ఎదుగుదలకు పోషకంగానే కాక వర్షపు నీరును క్షామం కాలం వరకు ఉంచుకొని మొక్కలకు అందజేస్తా ఆరోగ్యంగా ఉంటేనే ఆహార భద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణంతోనే మానవాళి శ్రేయస్సు సాధ్యపడుతుంది.
ఇటీవల కాలంలో రైతాంగం విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడడం, అలాగే పంటల అవ శేషాలను కాల్చి వేయడం ద్వారా భూసారం గణనీయంగా క్షీణించడమే గాక పర్యావరణ కాలుష్యం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా వినాశనానికి దారి తీస్తూ జీవన వైవిధ్యం వినాశనం సంభవిస్తుంది. తద్వారా సరైన పోషకాలు లేని బీడు భూములు ఏర్పడుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రతి కిలో ఎరువుకు 17 నుండి 18 కిలోల ధాన్యం పండేది. కానీ ప్రస్తుతం ప్రతి కిలో ఎరువుకు కేవలం 3 కిలోల ధాన్యం మాత్రమే పండుతుంది. ఇది భూసారం క్షీణించడాన్ని సూచిస్తుంది.
భూసారాన్ని పెంచడానికి, నేల ఉత్పా దకతను మెరుగుపరచడానికి సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నజ్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరీతంగా తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడిని పెంచడానికి సూక్ష్మ జీవులను కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్ధాలలో కలిపి మరల భూమిలో వెయ్యవచ్చు.
నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు :
జీవన ఎరువులు వాడవలసిన మోతాదు ఏ ఏ పంటలకు
రైజోబియం 200 గ్రా. కంది,పెసర , మినుము, శనగ వంటి పంటలకు
అజటోబాక్టర్ 2 కిలోలు పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు
నీలి ఆకుపచ్చనాచు 4 కిలోలు వరి పంటకు మాత్రమే వాడాలి.
రైజోబియం: లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి. ఉపయోగించే విధానం: వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార, బెల్లం, లేక గంజి పౌడర్‌ను కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్ పొడిని బాగా కలపాలి. విత్తనం చుట్టూ పొరలు ఉండేలా జాగ్రత్త వహించాలి.
ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్ సంచిగానీ, ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించుకోవచ్చు. పది నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత రైతులు పొలంలో నాటుకోవలెను
అజటోబాక్టర్: పప్పుజాతి పంటలను మినహాయించి, మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక, మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది.
ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.
వాడే విధానం: ఏ పంటకు వాడినా రెండు కిలోల కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి
అజోస్ప్తెరిల్లమ్ : ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించారు. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చరొబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువశాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్‌జాతి పంటలకు తప్పించి, మిగతా పంటలకు వాడుకోవచ్చు. ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో ఇది పని చేస్తుంది.
ఉపయోగించే విధానం:
తక్కువ కాలం పంటలకు రెండు కిలోల అజోస్పెరిల్లమ్ కల్చర్‌ను 80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకేందుకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి.
ఆ నీటిలో రెండు కిలోల అజోస్పెరిల్లమ్ జీవన ఎరువును బాగా కలిపి, ఆ ద్రావణంలో పది నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనం చెరకు ముక్కలను పది నిమిషాలు ముంచి నాటుకోవాలి.
పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమి ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరం రూపంలోని మారుతుంది.
ఒక వేళ భూమి క్షార గుణం కలిగి వున్న, వేసిన భాస్వరం కాల్షియం, మెగ్నీషియం ఫాస్పేట్స్‌గా మారి, మొక్కకు లభ్యంకాదు.
ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేస్తే లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కకు దొరుకుతుంది.
భాస్వరంను అందించే జీవన ఎరువులు PSB (ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా) 2 కిలోలు/ 500 మీ.లీ/ఎకరాకు అన్ని పంటలకు వాడుకోవచ్చు
ఫాస్ప్ ఫంగై 2 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు
ఫాస్పేట్ మోబి లైజింగ్ మైకోరైజా 5 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు
పొటాషియం మోబిలైజర్స్: ప్రటూరియా అరాషనియా 2 కిలోలు నూనెగింజల పంటలకు ఎక్కువ ఉపయోగపడుతుంది
ఫాస్పోబాక్టీరియా : ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.
ఇది సమర్థవంతంగా పని చేసేందుకు సేంద్రియ కర్బనము అత్యవసరం. దీన్ని సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి, తద్వారా పంట దిగుబడి పెంచుతుంది
వాడే విధానం : ఎకరాకు 2.0 కిలోల ఫాస్పోబాక్టర్‌ను లేదా ద్రవ రూపంలో ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
పొటాషియం మొబిలైజర్స్ : ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఈ జీవన ఎరువుల్లో ఉండేటటువంటి మొబిలైజింగ్ సూక్ష్మజీవులు, విడుదల చేసే ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది.
వాడే విధానం : ఎకరాకు 2.0 కిలోల పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా లేదా ద్రవరుపం లో పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
డా. ఎం. వెంకట లక్ష్మి(సస్య పోషణ), డా.డి.సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి), డా. కె. రేవతి (సస్య రక్షణ) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా – 521 133. Ph: 8008201253
రైతు వ్యర్థంగా భావించే వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు, పప్పుధాన్యాల కాండాలు, కూరగాయ పంటల అవశేషాలు భూమికి అమూల్యమైన సహజ సంపద. వీటిలో సేంద్రియ పదార్థం, విలువైన పోషకాలు, నేల సారాన్ని పెంచే కార్బన్ సమృద్ధిగా ఉంటాయి. వాటిని కాల్చేస్తే ఈ సంపద మొత్తం నష్టపోతుంది. అదే శాస్త్రీయంగా వినియోగిస్తే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, ఎరువుల వినియోగం సమర్థవంతమవుతుంది, సాగు ఖర్చు తగ్గుతుంది.
రైతులు పంట అవశేషాలను కాల్చడానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. ఒక పంట కోసిన వెంటనే మరో పంట వేయాల్సిన అవసరం, కూలీల కొరత, అవశేషాలను తొలగించడానికి అయ్యే అధిక ఖర్చు, యంత్రాల లభ్యత లేకపోవడం వంటి సమస్యలు వారిని ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయి. కానీ తాత్కాలికంగా సమయం ఆదా చేసినా, దీర్ఘకాలంలో నేల సారాన్ని, పంట ఉత్పాదకతను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే పంట అవశేషాలను కాల్చడం కంటే వాటిని కంపోస్టు, వర్మీ కంపోస్టు, మల్చింగ్, పశువుల మేత, బయోగ్యాస్ లేదా బయోచార్ రూపంలో వినియోగించడం ఉత్తమ పరిష్కారం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బయోచార్ సాంకేతికత నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచడం, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నీటి నిల్వను పెంచడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతోంది. పంట అవశేషాలను సమస్యగా కాకుండా విలువైన వనరులుగా మార్చుకునే ఈ సాంకేతికత రైతులకు స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయానికి కొత్త దిశను చూపుతోంది.
బయోచార్ అనేది పంట అవశేషాలు, చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, ఇతర సేంద్రియ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో 250-700°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే నల్లని ఘన పదార్థం. సాధారణంగా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చితే వాటిలోని కార్బన్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. కానీ బయోచార్ తయారీ సమయంలో కార్బన్‌లో ఎక్కువ భాగం స్థిర రూపంలో నిల్వ ఉండి, తరువాత నేలలో కలిపినప్పుడు వందల నుంచి వేల సంవత్సరాల వరకు స్థిరంగా నిలిచి సేంద్రియ కార్బన్ నిల్వను పెంచుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, నీటిని మరియు పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.
ప్రస్తుతం వాతావరణ మార్పులు, నేల సారం క్షీణించడం, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బయోచార్ ఒక స్థిరమైన పరిష్కారంగా గుర్తింపు పొందుతోంది. ఇది నేలలో కార్బన్‌ను దీర్ఘకాలం నిల్వ ఉంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వాతావరణ అనుకూల మరియు సుస్థిర వ్యవసాయానికి కూడా కీలకమైన సాంకేతికతగా నిలుస్తోంది.
డ్రమ్ పద్ధతిలో బయోచార్ తయారి చిన్న, సన్నకారు రైతుల స్థాయిలో తక్కువ ఖర్చుతో బయోచార్‌ను 200 లీటర్ల సామర్థ్యం గల పాత ఇనుప డ్రమ్ సహాయంతో తయారు చేయవచ్చు. ముందుగా డ్రమ్ అడుగు భాగంలో మరియు కింది ప్రక్కవైపున కొద్దిపాటి గాలి ప్రవేశించేలా చిన్న రంధ్రాలు చేయాలి. అనంతరం పొడి పంట అవశేషాలను చిన్న ముక్కలుగా చేసి డ్రమ్‌లో గట్టిగా నింపాలి. తరువాత డ్రమ్‌కు మూత బిగించి, మూత అంచులను బంకమట్టితో మూసివేయాలి. దీంతో డ్రమ్‌లోకి గాలి ప్రవేశించడం నియంత్రించబడుతుంది.
ఆ తర్వాత డ్రమ్‌ను పొయ్యి లేదా ఇటుకలతో ఏర్పాటు చేసిన మంటపై ఉంచి వేడి చేయాలి. సుమారు 20-25 నిమిషాల తర్వాత మూత అంచుల వద్ద నుంచి నీలిరంగు వాయువు విడుదల కావడం ప్రారంభమవుతుంది. ఈ దశలో డ్రమ్‌లో ఉష్ణోగ్రత 300-400°C వరకు చేరుకొని పైరోలిసిస్ ప్రక్రియ పూర్తవుతుంది.
నీలిరంగు వాయువు విడుదల తగ్గిన తర్వాత మంటను ఆర్పివేయాలి. అనంతరం డ్రమ్‌ను జాగ్రత్తగా దించి నేలపై ఉంచాలి. వెంటనే అడుగు భాగంలోని రంధ్రాలను కూడా బంకమట్టితో మూసివేయాలి. దీంతో గాలి లోపలికి ప్రవేశించకుండా నిరోధించబడి, పంట అవశేషాలు పూర్తిగా బూడిదగా మారకుండా కార్బన్ రూపంలో నిల్వ చేయబడతాయి.
డ్రమ్‌ను సుమారు రెండు గంటల పాటు అలాగే ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మూతను తీసి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను చిన్న ముక్కలుగా లేదా పొడి రూపంలో తయారు చేయాలి. అనంతరం దీనిని కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి కొంతకాలం ఉంచిన తర్వాత పొలంలో ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. బయోచార్ తయారీలో ఆక్సిజన్ ప్రవేశం పరిమితంగా ఉండాలి. గాలి ఎక్కువగా ప్రవేశించినట్లయితే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.
డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921
మొదట కడిగిన బియ్యాన్ని ఉడకబెట్టి ఒక చెక్క పెట్టెలో వుంచి దాన్ని చెట్టు కింద నీడలో గుంత తీసి పూడ్చి పెట్టాలి. నాలుగు రోజుల తరువాత దానిని వెలికితీయాలి. దీనిని చో మెధడ్‌లో ఐయంఓ (ఇండీజినిస్ మైక్రో ఆర్గానిజమ్)గా వ్యవహరిస్తారు. ఇందులో బెల్లాన్ని కలిపితే ఐయంఓ తయారవుతుంది. దీన్ని నిలువ వుంచుకుని మొక్కలకు స్ప్రే చేయాలి. దీనివల్ల మొక్కకు అన్ని రకాలైన పోషకాలు అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది.
గమనికః మొదటగా లీటర్ నీరు నిలువ వుంచడానికి లీటరున్నర పాత్రను తీసుకోవాలి. అపుడే బాక్టీరియా పాత్రలో ప్రవేశించడానికి అవకాశముంటుంది.
ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది.
ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.