రసాయనిక వ్యవసాయం వలన జరుగుతున్న అనర్థాల నుండి బయటపడటానికి అనేకమంది రైతులు సేంద్రియ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. వినియోగదారులు కూడా ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తరువాత సేంద్రియ ఉత్పత్తులవైపు మక్కువ చూపుతున్నారు. ఏదిఏమైనా కాని అటు రైతులు ఇటు వినియోగదారులు సేంద్రియంవైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. సేంద్రియ సాగు వలన తాము ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకొని సొంతంగా వినియోగించడముతో పాటు సమాజానికి కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. వీటన్నింటికంటే అతిముఖ్యంగా రాబోవు తరాల వారికి కలుషితం కాని భూమిని అందించవచ్చు. ఈ ఆలోచనతో అనేకమంది రైతులు సేంద్రియ బాట పడుతున్నారు. ఈ విధంగా ఆలోచించి తన తరువాత తర్వాత తరానికి కాలుష్యం కాని నేలనీ, ఆహారాన్ని అందించాలనే తలంపుతో తన రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చి వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు వికారాబాద్‌ జిల్లా, బొంతారం మండలం, రొంపల్లె గ్రామానికి చెందిన రాజు.

రాజుది వ్యవసాయ నేపథ్యం. రాజు ప్రధాన వృత్తి వ్యవసాయం. 10వ తరగతి వరకు చదువుకొని వ్యవసాయంలోనే కొనసాగుతూ వస్తూ అందరి రైతుల లాగానే తన పంటల సాగులో రసాయనాలు వినియోగిస్తూ కొనసాగుతున్నారు. రసాయనిక సేద్యం వలన పెట్టుబడులు పెరగడముతో పంటల సాగు గిట్టుబాటు కాకపోయినా కూడా తన ప్రధాన వృత్తి వ్యవసాయమే కనుక ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తూ పంటల కొనసాగిస్తూ మిరప, కంది, పత్తి లాంటి పంటల సాగు కొనసాగిస్తున్నాడు. తాను చేస్తున్న వ్యవసాయంలో నష్టాలు రావటంతో పాటు విచక్షణా రహిత రసాయనాల వినియోగం వలన భూమి కలుషతం కావడం గమనించి ప్రత్యామ్నాయ పద్ధతుల అన్వేషణలో వేగం పెంచి సేంద్రియ సాగు గురించి తెలుసుకుని అందుకు సంబంధించిన వివరాలు సేకరించి సేంద్రియ సాగులో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా కేవలం ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న వస్తువులను ఉపయోగించవలసి ఉంటుందని తెలుసుకుని అటువైపు అడుగులు వేసి తన రసాయనిక సేద్యాన్ని 2018వ సంవత్సరములో సేంద్రియంలోకి మార్చటం జరిగింది. 

సేంద్రియ సాగులో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకు సిద్ధమయ్యి వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేయడం మొదలు పెట్టాడు. సేంద్రియ సాగుకు అవసరమైన మన దేశీయ ఆవులను రెండింటిని పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటల సాగులో వినియోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నాడు. తన ఈ 5 సంవత్సరాల సేంద్రియ సాగు అనుభవంలో అరటి, జామ, క్యారెట్‌, పెసర, మినుము, ఉల్లి, బొప్పాయి, కంది లాంటి పంటలు పండించాడు. ఈ సంవత్సరం కంది, ఉల్లి, బొప్పాయి పంటలు పండించాడు. కంది, ఉల్లి పంటలు దిగుబడి సాధించాడు. బొప్పాయి ఇంకా దిగుబడి వస్తూనే ఉంది.

కంది: అర ఎకరంలో కంది పంట పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేశాడు. ఇందుకు గాను నాటు రకం సొంత విత్తనాలను ఉపయోగించాడు. అర ఎకరానికిగాను బాగా మాగిన ఆవుల ఎరువు ఒక ట్రక్కు వేయడంతో పాటు పంటకాలంలో ప్రతి సారి 100 లీటర్ల చొప్పున 5 సార్లు అంటే 500 లీటర్ల జీవామృతాన్ని కంది పంటకు అందించాడు. చీడపీడల నివారణకు థపర్ణి కషాయం మరియు పంచగవ్యలను కలిపి పిచికారి చేయించాడు. అర ఎకరానికి గాను 450 కిలోల కందుల దిగుబడి పొంది కిలో 100/-ల చొప్పున నేరుగా వినియోగదారులకు అమ్మకం చేశాడు.

ఉల్లి: రెండున్నర ఎకరాలలో ఉల్లి సాగు చేస్తున్నాడు. రెండున్నర ఎకరాలలో ఒకేసారి కాకుండా రెండు దఫాలుగా నారు నాటించాడు. ఇందుకుగాను దుక్కిలో రెండున్నర ఎకరాలకు సుమారు మూడు ట్రక్కుల పశువుల ఎరువు తోలించాడు. నాటు రకం తెల్ల ఉల్లి రకం విత్తనాలను నారు పోసుకున్నాడు. రెండున్నర ఎకరాలకు సుమారు 5 కిలోల విత్తనం ఉపయోగించాడు. కిలో విత్తనం 650/-ల చొప్పున  5 కిలోలకు గాను 3250/-లు విత్తనం కొరకు ఖర్చు చేశాడు. జనవరి 15న నారు పోసుకుని 30 రోజులు పెరిగిన నారుని ప్రధాన పొలంలో నాటించాడు. ప్రధాన పొలంలో మడులు ఏర్పాటు చేసుకుని మడులలో నారు నాటించాడు. రెండున్నర ఎకరాలకు గాను ప్రతిసారి 500 లీటర్ల చొప్పున 3 సార్లు అంటే 1500 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా ఉల్లి పంటకు అందించాడు. చీడపీడల నివారణకు ఒకసారి థపర్ణి కషాయం మరియు పంచగవ్య మిశ్రమాన్ని పిచికారి చేయించాడు. మొదటి దఫా అంటే ఫిబ్రవరి రెండవ వారంలో నాటిన ఉల్లి ఏప్రియల్‌ 25 కి దిగుబడి పొందడం జరిగింది. ఎకరానికి 9000 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కిలో 20/-ల చొప్పున నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నాడు. 

బొప్పాయి: 4 ఎకరాలలో బొప్పాయి సాగులో ఉంది. ఎకరానికి 800 మొక్కల చొప్పున కో-15 రకం మొక్కలను ఒక్కొక్కటి 20/-ల చొప్పున 4 ఎకరాలకు గాను 3200 మొక్కలు కొనుగోలు చేసుకుని 2022  జనవరిలో నాటించాడు. 4 ఎకరాలకు గాను దుక్కిలో మూడు ట్రక్కుల కోడి ఎరువు అందించాడు. ప్రతి 20 రోజులకు ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని భూమికి అందించడంతో పాటు చీడపీడల నివారణకు పంచగవ్య, థపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగలను ఇప్పటి వరకు 5 సార్లు పంటపై పిచికారి చేయించారు. 2022 జులై ఆఖరి వారంలో దిగుబడి మొదలయ్యింది. ఇప్పటి వరకు సుమారుగా ఎకరానికి 18 టన్నుల చొప్పున దిగుబడి పొంది టన్ను 11 వేల నుంచి 15 వేల రూపాయల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నాడు. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన కొనుగోలు దారులకు కిలో 11/- నుంచి 15/-లకు అమ్మకం చేస్తున్నాడు. కొద్ది మొత్తంలో కొనుగోలు చేసే వినియోగదారులకు మరియు సేంద్రియ దుకాణాలకు కిలో 24/-ల చొప్పున అమ్మకం చేస్తున్నాడు. వచ్చిన దిగుబడిలో సుమారుగా 20 శాతం వరకు 24/-ల చొప్పున అమ్మకం చేస్తూ వస్తున్నాడు. ఈ రకం బొప్పాయి వైరస్‌ రెసిస్టెంట్‌ అవడం వలన ఈ రకాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటి వరకు వైరస్‌ మొక్కలు అసలు కనిపించలేదు. ఇంకా దిగుబడి వస్తూనే ఉంది. పంటను గమనించినట్లయితే ఎకరానికి ఇంకా 12 టన్నులకు తగ్గకుండా వచ్చేలా ఉంది. అంటే సుమారుగా ఎకరానికి 30 టన్నుల దిగగుబడి సాధించవచ్చు.

రసాయనిక వ్యవసాయం వలన జరిగే నష్టాల నుంచి బయట పడటానికి శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న సేంద్రియ పద్ధతుల బాట పట్టి తాను ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ సమాజానికి విష రసాయనాలు లేని ఆహారాన్ని రాజు అందిస్తున్నాడు. మరిన్ని వివరాలు 8309861250 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

  – డి. ప్రసాద్‌, ‘రైతునేస్తం’ ప్రత్యేక ప్రతినిధి