మనది అధిక జనాభా కలిగిన దేశం. మన దేశం అధిక జనాభాలో చైనాను దాటి ఇటీవలే ప్రథమ స్థానానికి ఎగబాకింది. జనాభా పెరుగుదలతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తూంది. పెరుగుతున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చూపించే అంత మొత్తంలో పరిశ్రమలు లేదా వ్యవసాయేతర మార్గాలు రాగలవా? అంటే సమాధానం ప్రశ్నార్థకమే. పెరుగుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపించే సత్తా మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకే ఉందనే విషయం అక్షర సత్యం. ఈ విషయాన్ని అనేకమంది రైతులు నిరూపించారు. ఇంకా నిరూపిస్తూనే ఉన్నారు. ఈ కోవలో చేరింది శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలం, రామన్నపేటకు చెందిన వరలక్ష్మి.
వరలక్ష్మిది వ్యవసాయ నేపథ్యం. వారికి కేవలం అర ఎకరం పొలం మాత్రమే ఉంది. అర ఎకరం పొలంలో వరి పంట సాగు చేస్తూ జీవితాలను కొనసాగిస్తుండగా సుభాష్‌పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి వినడం జరిగింది. ఈ పద్ధతుల గురించి ఇంకా ఎక్కువ అవగాహన కలిగించుకునేందుకు గాను వరలక్ష్మి బావగారు గుంటూరులో ఏర్పాటు చేసిన సుభాష్ పాలేకర్ గారి అవగాహనా సదస్సుకు హాజరయ్యి అన్ని విషయాలను కక్షుణ్ణంగా తెలుసుకుని తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ, భూమి ఆరోగ్యం కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సక్రమమైనవి అని తెలుసుకుని ఈ వ్యవసాయ పద్ధతిని తమ జీవనోపాధిగా మలుచుకోవాలని నిర్ణయించుకుని 2018వ సంవత్సరంలో 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటల సాగు మొదలు పెట్టారు.

5 ఎకరాలలో మొదటి పంటగా వరి పంటని సాగు చేస్తుంటారు. దుక్కిలో ఘనజీవామృతం అందించడంతో పాటు ఎకరానికి 30 కిలోల వివిధ రకాల విత్తనాలను పిఎమ్‌డిఎస్ (ప్రీమాన్‌సూన్ డ్రై సోయింగ్ పద్ధతి) పద్ధతిలో చల్లి అవి పూతకు వచ్చే సమయంలో భూమిలో కలియదున్ని వరి సాగు మొదలు పెడతారు. ప్రస్తుతం 5 ఎకరాలలో స్వర్ణ రకం వరి సాగులో ఉంది. ఈ రకానికి చీడపీడల బెడద తక్కువగా ఉండడంతో పాటు ఆహారంగా తినడానికి కూడా బాగా ఉంటాయి కాబట్టి ఈ రకాన్ని ఎంచుకున్నారు. 5 ఎకరాలకు గాను ఒక ఎకరంలో లైను నాటు పద్ధతి, మిగతా 4 ఎకరాలలో మామూలు నాట్లు వేసే పద్ధతిని పాటించి వరి నారుని నాటించారు. నారు నాటే ముందు కూడా పశువుల ఎరువు మరియు ఘనజీవామృతంను దమ్ములో అందించారు. నారు నాటిన తరువాత క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని అందిస్తూ వస్తుంటారు. చీడపీడల నివారణకు గాను కాలి బాటలు తీయడం, పక్షి స్థారాలు ఏర్పాటు చేయడం, పసుపు రంగు జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేస్తుంటారు. గట్లపై ఎర పంటలుగా బంతి లాంటి పంటలు కూడా సాగు చేస్తుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చీడపీడలు ఆశించినట్లయితే నీమాస్త్రం, అగ్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, జిల్లేడు కషాయం లాంటి వాటిని పిచికారి చేస్తుంటారు.

మామూలు నారు నాటే పద్ధతితో పోల్చుకుంటే లైనులో నారు నాటే పద్ధతిలో మొక్కలకు గాలి, వెలుతురు సక్రమంగా అందించడం వలన చీడపీడల బెడద తక్కువగా ఉండడం, దుబ్బు బాగా చేసి, ఎక్కువ పిలకలు రావడం, వచ్చిన అన్ని పిలకలు వెన్ను వేయడం వారు ప్రత్యక్షంగా చూశారు. పిలకలు ఎక్కువగా రావడము వలన దిగుబడి ఎకరానికి 3 బస్తాల వరకు పెరగడముతో పాటు, కోత సులభంగా ఉండడము, కోత కోసిన తరువాత వాటిని ప్రక్కకు పడవేసినప్పుడు అవి దుబ్బుల మీద పడడం జరిగి వర్షం లాంటి ఇబ్బందులు ఏర్పడినా కూడా వడ్లు పాడవకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయని వరలక్ష్మి అంటున్నారు.

వరి పంట అయిన తరువాత రబీ సీజనులో మినుము, పెసర లాంటి అపరాల పంటలు, గోరుచిక్కుడు లాంటి కూరగాయ పంటలు వేస్తుంటారు. గట్ల మీద వివిధ రకాల ఆకుకూరలు, వంగ, బెండ, టమాట, బీర, కాకర లాంటి కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు. గట్ల మీద వేసిన కూరగాయలను సొంతానికి ఉపయోగించుకుని మిగిలిన వాటిని నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తుంటారు. వాటి మీద వచ్చిన ఆదాయం వరి మరియు అపరాల పంటలకు పెట్టుబడిగా సరిపోతుంది. కాబట్టి వరి మరియు అపరాల పంటలలో వచ్చిన దిగుబడి మొత్తం నికర ఆదాయంగా మిగులుతుందని వరలక్ష్మి అన్నారు.

ఎకరానికి 22 నుండి 25 బస్తాల వడ్లను పండించి, వడ్లను అదేవిధంగా అమ్మకుండా కొన్ని రోజులు నిల్వ ఉంచి పాతవి అయిన తరువాత బియ్యం పట్టించి 25 కిలోల బస్తాను 1400/-ల చొప్పున నేరుగా వినియోగదారులకు అమ్ముతూ వస్తున్నారు. అపరాలు అయిన పెసర, మినుములను కూడా అదేవిధంగా అమ్మకుండా వాటిని పప్పు పట్టించి నేరుగా వినియోగదారులకు ఆశాజనకమైన ధరలకు అమ్మకం చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నామని వరలక్ష్మి తెలియజేశారు.

వారి గ్రామంలో ఎన్‌పియం షాపు ఏర్పాటు చేసి ఆ షాపు ద్వారా తమ పంట ఉత్పత్తులను అమ్మకం చేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల ఎరువులు, కషాయాలు, ద్రావణాలను తోటి రైతులకు అమ్మకం చేసి ఆదాయం గడిస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారం ఉండి, అందుబాటులో ఉన్న అన్ని వనరులను సక్రమంగా ఉపయోగించుకోగలిగితే స్వయం ఉపాధిగా ప్రకృతి వ్యవసాయం సరైనదారి అని వరలక్ష్మి కుటుంబం నిరూపిస్తున్నారు. మరిన్ని వివరాలు 9390307751 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
– వై. శ్రవణ్ కుమార్, స్పెషల్ కరస్పాండెంట్

