జీవాల పెంపకం అనేది కులవృత్తిగా తెలుగు రాష్ట్రాలలో తరతరాలుగా వస్తున్నది. ఇప్పుడు అనేక వర్గాల వారు కూడా గొర్రెలు మరియు మేకల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్నారు. అయితే ఈ జీవాల పెంపకం అనేది చాలా వరకు ఆరుబయట మేపే ప్రక్రియ. దీని వలన జీవాలు రాత్రి, పగలు కూడా, ఎండ, వాన మరియు చలిగాళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండి అనేక రకమైన వ్యాధులు సంక్రమించి తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. 

ముఖ్యంగా శీతాకాలంలో తీవ్రమైన చలి గాలులకు గురవడం వలన పి.పి.ఆర్‌,  గాలి కుంట వ్యాధి,  నీలి నాలుక,  దొమ్మరోగం మరియు నిమోనియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  ఈ వ్యాధులకు వివిధ రకముల సూక్ష్మాతి సూక్ష్మజీవులు (వైరస్‌) మరియు సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా) కారణం.

ముఖ్యంగా ఈ కాలంలో పి.పి.ఆర్‌ వ్యాధి జీవాలలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. పి.పి.ఆర్‌ వ్యాధి కారకం పారామిక్సో వైరస్‌ కుటుంబానికి చెందిన మారబిల్లి (ఖళిజీలీరిజిజిరి ఖీరిజీతిరీ) జాతి వైరస్‌ వలన కలుగుతుంది. దీనిని ముసర వ్యాధి, పారుడు రోగం,  లేక గోట్‌  ప్లేగ్‌  అని కూడా అంటారు. వ్యాధి సోకిన పశువులను మందలోకి ప్రవేశించడం వలన, దగ్గు తుంపర్ల వలన లేక వ్యాధి సోకిన పశువుల మలమూత్ర విసర్జ కాల వలన ఇతర పశువులకు ఈ వ్యాధి సోకుతుంది.

జీవాలలో ఈ వ్యాధులు వ్యాప్తి చెందితే అధిక మరణాలు సంభవించి రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తాయి. పశుశాలాల్లో లేక జీవాల కొట్టాల్లో లేక ఫారాల్లో జీవాల్లో తీవ్రమైన జ్వరం, దగ్గు, ముక్కు మరియు నోటి నుండి నీరు  కారటం లేదా చీము కారడం నోటిలో మరియు ముక్కుల్లో పుండ్లు అవ్వడం లేక కాళ్ల గిట్టల మధ్య పుండు ఏర్పడడం, పలుచటి రక్తంతో కూడిన విరోచనాలు  మరియు పశువులు మేత తీసుకోకుండా, నెమరు వేయకుండా ఉండడాన్ని గమనించినప్పుడు రైతులు సరైన సమయంలో వ్యాధి సోకిన జీవాలను వేరు చేసి పశు వైద్యుని సంప్రదించి సరైన చికిత్స చేయించి, వ్యాధి నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించి ఈ కాలంలో లాభాలను పొందవచ్చును.

శీతాకాలంలో పశుశాలాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యలు

*  వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేయాలి.

*  నీరసించి ఉన్న జీవాలకు  తేలికగా జీర్ణమయ్యే గంజి లాంటి ఆహారాన్ని అందించాలి.

*  క్రొత్తగా కొనుగోలు చేసిన జీవాలను వేరుగా ఉంచి వ్యాధులు లేవని నిర్ధారించాకే మందలోకి కలపాలి.

*  పశువైద్యని సంప్రదించి సరైన చికిత్స ఇప్పించాలి.

*  స్థానికంగా వచ్చే వ్యాధులకు పశువైద్యని సంప్రదించి వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించాలి. 

*  ముఖ్యంగా పి.పి.ఆర్‌,  నీలి నాలుక (బ్లూ టంగ్‌) వ్యాధులకు శీతాకాలానికి ముందే టీకాలు వేయించాలి.

*  టీకాలు వేసే వారం రోజుల ముందు నట్టల మందులు తప్పనిసరిగా వేయించాలి.

*  దోమలు, ఈగల బెడద కోసం వేపాకు పొగ కొట్టాల్లో వేయాలి.

*  రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పశువులుగా ఒకచోట ఉండడం వలన తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నది.  కావున  ఫారాలలో  పరదాలు  కట్టడం ద్వారా చలి ఒత్తిడిని తగ్గించవచ్చు.

*  వాతావరణంలో  తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలి ధారాళంగా ఉండే విధంగా చూసుకోవాలి.

*  జీవాలకు సమీకృత దాణా పచ్చ గ్రాసం మరియు పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 

డా. ఎస్‌. వంశీకృష్ణ, ఎం.వీ.ఎస్సీ, పీహెచ్‌డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, వెటర్నరీ మైక్రోబయాలజీ విభాగం, పశువైద్య కళాశాల, మామ్నూర్‌, వరంగల్‌, పి.వి. నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాయలం, ఫోన్‌: 8712908696