జాజికాయ (మిరిస్టికా ఫ్రాగ్రెన్స్) అనే శాస్త్రీయ నామంతో పిలవబడే ఈ మొక్క ఇండోనేసియాలోని మొలక్కాస్ దీవులు దీని పుట్టినిల్లు. దీనిని సాధారణంగా ఇండోనేసియా మరియు గ్రెనెడౌ వంటి దేశాలలో విరివిగా సాగు చేస్తున్నారు. దీనిని మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమిళనాడులోని కర్టల్లామ్‌లో స్వాతంత్య్రానికి పూర్వం తెచ్చి వారి సుగంధద్రవ్య పంటల తోటలో నాటారు. తద్వారా మన దేశంలో ప్రాచుర్యంలోకి ఈ పంట వచ్చింది. మన దేశంలో దీని సాగు వాణిజ్య సరళిలో కేరళలోని త్రిశూర్, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాలలో, తమిళనాడులోని కన్యాకుమారి మరియు తిరునల్వేలి జిల్లాల్లో, మహారాష్ట్రలోని దపోలి, వెంగుర్లా ప్రాంతాలలో సాంప్రదాయబద్ధంగా సాగు చేస్తూ వస్తున్నారు. కానీ దీని సాగుకు మన తెలుగు రాష్ట్రాలలో కోస్తా ప్రాంతాలు కొబ్బరి మరియు వక్క తోటలలో అంతర పంటగా/ప్రత్యామ్నాయ పంటగా దీని సాగు చేయడం ద్వారా లాభసాటి సేద్యం సాధ్యమవుతుంది. ఈ మొక్క రెండు రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను ఇస్తుంది. జాజికాయ మరియు జాపత్రి రెండూ కూడా ఈ మధ్యకాలంలో అన్ని రకాల వంటలలో అతి ముఖ్యమైన స్థానం సంపాదించుకొంది. దీని సాగు చేయడం ద్వారా వీటి గిరాకీని అందిపుచ్చుకోవడమే కాకుండా లాభాలను పొందవచ్చు.

అవసరమైన వాతావరణం మరియు నేలలు
గాలిలో తేమ అధికంగా ఉండే ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. వర్షపాతం సంవత్సరం పొడవునా 1500 మిల్లీ మీటర్లు అంతకన్నా ఎక్కువ పొందే ప్రాంతాలలో సాగు చేపట్టవచ్చు. సముద్ర మట్టం నుంచి 1300 మీ. ఎత్తైన ప్రాంతాలలో కూడా సాగుచేపట్టవచ్చు. ఉష్ణోగ్రతలు 25-35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అనుకూలం. పొడి వాతావరణం ఉండే ప్రాంతాలలో సాగు చేపట్టరాదు. సారవంతమైన ఒండ్రునేలలు, ఎర్ర గరప నేలలు మరియు ఇసుక గరప నేలలలో సాగు చేపట్టవచ్చు. నీరు నిల్వ ఉండే మరియు మురుగు సౌకర్యం సరిగాలేని నేలలలో సాగు చేపట్టరాదు.
అందుబాటులో ఉన్న మేలైన రకాలు: కొంకణ్ సుగంధ, కొంకణ్ స్వాద్, కొంకణ్ శ్రీమంతీ, IISR కేరళీ, IISR విశ్వశ్రీ.
నాటడం మరియు నాటుకునే సమయం
సాధారణంగా విత్తనం ద్వారా ప్రవర్ధనం చేసిన వాటిని నాటుకోవడానికి వినియోగిస్తారు. కానీ ఈ పంట యొక్క పుష్పాలు (ఆడ మరియు మగ పుష్పాలు) ఒక మొక్కపైన కాకుండా వేరు వేరు మొక్కల పైన వస్తాయి. కావున విత్తనం ద్వారా ప్రవర్ధనం చేసినట్లు అయితే నాటిన మొక్కలలో 50 శాతం మగ మరియు 50 శాతం ఆడ మొక్కగా మారడానికి ఆస్కారం ఉంది. మనం విత్తనం ద్వారా పెంచిన మొక్కలను నాటినచో సరైన నిష్పత్తిలో ఆడ మరియు మగ మొక్కలు ఉండకపోవడం మూలాన లాభసాటి సాగు సాధ్యమవదు. దీనిని నివారించడానికి మనం కొమ్మ అంట్లు లేదా మొగ్గ అంట్లు చేసిన మొక్కలను ప్రతి 20 ఆడ మొక్కలకు, ఒక మగ మొక్కను నాటటడం ద్వారా పంటను లాభసాటిగా మరియు మంచి దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంది. 12-18 నెలల వయస్సు గల మొక్కలను వరుసల మధ్య ఎనిమిది మీటర్లు మరియు మొక్కల మధ్య ఎనిమిది మీటర్లు ఉండేలా చూసుకొని కొబ్బరి మొక్కల మధ్యలో నాటుకోవాలి. అదే వక్క తోటలలో ప్రతి మూడు వరుసల తర్వాత ఒక జాజికాయ పంటను ఏక పంటగా నాటుకోవాలంటే ఈ మొక్కలకు నీడ అవసరం అందుకు అనుగుణంగా నీడనిచ్చే మొక్కలుగా మోదుగ, సిల్వర్ ఓక్ లేదా గ్లైరిసీడియా 5-6 నెలలు ముందుగా నాటుకోవాలి. వర్షాలు ఆరంభమైనప్పుడు లేదా వర్షాకాలం ముగుస్తున్న సమయంలో నీటి వసతి గల ప్రాంతాలలో నాటుకోవడం అనుకూలం. దీని కోసం 60 సెం.మీ. వెడల్పు, 60 సెం.మీ. పొడవు, లోతు గల గుంతల్లో పశువుల ఎరువు, కంపోస్ట్ కలిపి నాటుకోవాలి.
ఎరువుల యాజమాన్యం
మంచి ఎదుగుదల మరియు రాబడి కోసం సమగ్ర ఎరువుల యాజమాన్యం అత్యంత కీలకం. సేంద్రియ ఎరువులు పది కిలోలు ప్రతి మొక్కకు వేసుకోవాలి. ఎదిగిన 15 సంవత్సరముల వయస్సు కలిగిన మొక్కలకు గరిష్టంగా 50 కిలోలు వేసుకోవాలి. 20 గ్రా. నత్రజని, 18 గ్రా. భాస్వరం, 50 గ్రా. పొటాషియం ప్రతి మొక్కకు మొదటి సం||లో అందించాలి. ఎదిగిన లేదా 15 సం|| వయస్సు మొక్కలకు 500 గ్రా. నత్రజని, 250 గ్రా. భాస్వరం, 1000 గ్రా. పొటాషియం ప్రతి సం|| ప్రతి మొక్కకు అందించాలి. ఎరువులను 2 దఫాలుగా మొదట మే-జూన్ మరియు రెండవసారి సెప్టెంబర్-అక్టోబర్ మాసంలో సేంద్రియ ఎరువులతో పాటు వేసుకోవాలి. మొక్క వేర్లు తక్కువ లోతులలో ఉండటం వలన ఎరువులను మొక్క కాండం నుంచి 1-5 మీటర్ల దూరంలో మాత్రమే వేసుకోవాలి. పొలంలో కలుపు లేకుండా నివారించుకోవాలి. దీనికోసం అంతరకృషి క్రమం తప్పకుండా చేసుకోవాలి. అందించే ఎరువులను సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
కోత మరియు కోతానంతర చర్యలు
విత్తనం ద్వారా వృద్ధి చేసిన మొక్కలు నాటిన 7-8 సంవత్సరాల తర్వాత మరియు కొమ్మంట్లు లేదా మొగ్గంట్లు నాటిన తోటలలో 4-5 సంవత్సరాల తర్వాత పూత మరియు కాత మొదలవుతుంది. 15-20 సంవత్సరాల వయస్సుగల తోటలు స్థిరమైన దిగుబడులను అందిస్తాయి. మొక్కలు సంవత్సరానికి 6 సార్లు కొత్త చిగుర్లు తొడగటం గమనించవచ్చు. అందులో మే-జూన్ మరియు సెప్టెంబర్ మాసంలో వీటి తీవ్రత గణనీయంగా అధికంగా ఉంటుంది. ఇందులో మగ జాతి మొక్కలు సంవత్సరం పొడవునా పుష్పిస్తాయి. కానీ ఆడ జాతి మొక్కలు సంవత్సరంలో 7 మాసాల కాలం పాటు మాత్రమే పుష్పిస్తాయి. అత్యధికమైన మగ మరియు ఆడ పుష్పాలను మొక్కలపై జూలై మరియు అక్టోబర్ మాసంలో గమనించవచ్చు. కీటకాలు మరియు గాలి ద్వారా పరాగ రేణువుల రవాణా జరిగి ఫలదీకరణం జరిగి కాయ ఏర్పడుతుంది. కోతకు వచ్చిన కాయలలో పగుళ్లు ఏర్పడి లోపల ఉన్నటువంటి జాపత్రి, రకాన్ని బట్టి ముదరు ఎరుపు/ఊదారంగు/పసుపు వర్ణంలో కన్పించిన వెంటనే కోసుకోవాలి. కోసిన వెంటనే జాజికాయ మరియు జాపత్రిని వేరు చేసి జాపత్రిని 10-15 రోజుల పాటు ఎండనివ్వాలి. ఎండిన జాపత్రి పెలుసుగా మరియు ఎరుపు లేదా తేలిన పసుపు వర్ణంలోకి మారుతుంది. జాజికాయ 4-8 వారాల పాటు ఎండలో లేదా కృత్రిమ పద్ధతుల ద్వారా ఓవెన్ డ్రైయర్ ఉపయోగించి లోపల విత్తనం శబ్దం చేసే వరకు ఎండనివ్వాలి. తర్వాత కాయలను పగలకొట్టి విత్తనం తీసి మార్కెట్టుకు తరలించాలి. ఇందులో జాజికాయ మరియు జాపత్రి మాత్రమే కాకుండా కాయలో ఉండే గుజ్జు లేదా తోలును ఊరగాయలు, జామ్ మరియు జెల్లీ తయారీలో వినియోగించవచ్చు.
దిగుబడి

ప్రతి కాయ సగటున 60 గ్రా. బరువు. అందులో విత్తనం 6-7 గ్రా. జాపత్రి 3-4 గ్రా. మిగిలినది గుజ్జు ఉంటుంది. పూర్తిగా వృద్ధి చెందిన మొక్క నుండి సగటున 2000-3000 కాయలను ప్రతి సంవత్సరం కాస్తుంది. సంవత్సరానికి 65% ఆడ జాతి మొక్కలను కలిగిన తోటల నుండి 800 కిలోల జాజికాయ మరియు 100 కిలోల జాపత్రి, ప్రతి హెక్టారుకు దిగుబడిని పొందవచ్చు. కొమ్మంట్లు లేదా మొగ్గంట్లు నాటిన తోటలలో మరింత అధిక దిగుబడిని తొందరగానే పొందవచ్చును.
సస్యరక్షణ చర్యలు
సాధారణంగా ఎండు తెగులు మరియు వడలు తెగులుతో పాటుగా కాయ కుళ్ళు గమనించవచ్చు. ఎండు తెగులు ఆశించిన మొక్కలలో ఎదిగిన మరియు ఎదుగుతున్న కొమ్మలలో చిగుర్లు నుండి కొమ్మలు ఎండిపోవడం గమనించవచ్చు. ఆశించిన కొమ్మలను కత్తిరించి, కత్తిరించిన చోట బోర్డియక్స్ పేస్ట్ పూసినచో నివారించవచ్చు. వడలు తెగులు ఆశించిన కొమ్మలు మరియు ఆకులలో వడలు లక్షణాలు గమనించినచో 1% బోర్డో మిశ్రమం పిచికారి చేయాలి. కాయకుళ్ళు ఆశించిన చెట్లలో కాయ పగుళ్లు మరియు జాపత్రి కుళ్ళడం గమనించవచ్చు. 1% బోర్డో మిశ్రమం పిచికారీ చేసి నివారించవచ్చు.
డా. సిలారు రఘువీర్, అక్కుర్తి నీరజ, గండికోట బ్రాహ్మణి,
డా. చంద్రమోహన్ రెడ్డి, ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట,
డా. వైయస్‌ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం.

