కరోనాతో సంబంధం లేకుండా పంటల ఉత్పత్తి క్రితం 2 సంవత్సరాలలో జరిగింది. పండిన పంటను మార్కెటింగ్‌ చేయడంలో రైతులు ఇబ్బంది పడినారు. ప్రస్తుతం కరోనా మెల్లమెల్లగా పెరుగుతున్నది. మే నెలలో ఇంకా ఎక్కువయి థర్డ్‌వేవ్‌ రావచ్చని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మే నెల (భరణి, కృతిక, రోహిణి కార్తెలు)లో వ్యవసాయపు పనుల గురించి తెలుసుకుందాం.

వరి: తెలంగాణలో మద్దతు ధరకు వరి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొని చర్యలు తీసుకుంటున్నది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పద్ధతి పాటిస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వాల పలుకుబడి కూడా పెరుగుతుంది. మే నెలలో చలికాలపు పంట మార్కెట్‌కు ఎక్కువగా వస్తుంది. ధరలు తక్కువగా ఉన్నప్పుడు వడ్లను నిల్వ చేసి పాతయినాక బియ్యం చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ప్రతి రైతు వడ్లను బియ్యం చేసి అమ్ముకునేందుకు అనుకూలమైన చిన్న చిన్న మొబైల్‌ మిల్లులను సబ్సిడీలిచ్చి ప్రోత్సహిస్తే, పెద్ద మిల్లులపై ఆధారపడడం తగ్గుతుంది. రైతులకు, వినియోగదారులకు అనుకూలంగా ధరలుంటాయి. ప్రతి రైతూ వడ్లను పాతవయ్యేంతవరకు నిల్వ చేయడం, బియ్యం చేసి అమ్మడం వంటి కార్యక్రమాలు గ్రామాల్లో చేపట్టవచ్చు. వర్షాకాలపు వరి నారుపోయుట, మే చివరి వారంలో మొదలవుతుంది. రోహిణి కార్తె 25-5-22 నుండి 7-5-22 వరకు ఉంటుంది. ఈ కార్తెలో నారుపోసి, నాటిన వరి, చీడపీడల బారిన పడకుండా, చాలావరకు తప్పించుకుంటుంది. నీటి లభ్యత అనుకూలంగా ఉండి, ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి అనుకూలంగా లేని చోట మాత్రమే వరి వేస్తే మంచిది. వరి పంట దేశ అవసరాలకు మించి పండుతున్నందున, ఎగుమతి చేయడానికి విలువ పెంచిన సరుకు తయారు చేసి బయటి దేశాలకు పంపడానికి ప్రయత్నాలు ఎక్కువ చేయాలి. ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వంతంగా మార్కెట్‌ చేసుకోగలమనే రకాలనే సాగు చేస్తే మంచిది. కొత్త రకాలను కొద్ది భూమిలో పండించి ఈసారి లాభసాటి ధరకమ్ముడుపోతే, వచ్చే సీజన్లలో వీటి విస్తీర్ణాన్ని పెంచవచ్చు.

ప్రత్తి: ఈసారి ప్రత్తి ధరలు క్వింటాలు 10 వేల రూపాయలు దాటాయి. వర్షాలు బాగా పడి, లేక నీటి వసతి ఉన్న చోట మే నెల కడవారంలో (రోహిణిలో) విత్తేపత్తిలో చీడపీడల ముఖ్యంగా గులాబిరంగు పురుగు బాధ చాలా తక్కువగా ఉంటుంది. అధిక సాంద్రతతో చల్కా భూముల్లో కూడా సాగు చేయవచ్చు. సాలుకు సాలుకు 80 సెం.మీ. సాలులో మొక్కల మధ్య 20 సెం.మీ. దూరంలో మొక్కలు నాటి ఎకరాకు 25000 మొక్కలు పెంచవచ్చు. చైనా నుండి ప్రత్తి దిగుమతి ఆపి వేయడం వలన, గులాబి రంగు పురుగు ఉధృతి వలన ప్రత్తి లభ్యత తగ్గి క్రితం సంవత్సరం ప్రత్తి పంటకు మంచి ధర లభించింది. దిగుమతులు మానేస్తే మన రైతులే, ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, ఎక్కువ లబ్ది పొందే అవకాశముంది. అధిక సాంద్రత ప్రత్తి సాగును, వర్షాధారంగానూ, నీటితడులతోను సాగు చేయవచ్చు. విత్తన మోతాదు 3 కిలోలు/ఎకరాకు. ప్రత్తి పంట అధిక సాంద్రత పద్ధతిలో త్వరగా పూర్తి అవుతుంది. కావున తదుపరి పంటగా, శనగ, పెసర, మినుము, నువ్వులు, వేరుశనగ పంటలను సాగు చేయవచ్చు. నీటి ఆధారమున్నచోట ఇది సాధ్యపడుతుంది. మే నెల చివరన ముంగారి ప్రత్తిని విత్తడం రాయలసీమ, తెలంగాణలలో అలవాటు. రాయలసీమలో శ్రీనంది రకం 8-9 క్వి./ఎ. దిగుబడినిస్తూ ప్రాచుర్యంలో కొస్తున్నది. ఇప్పటికే మంచి ప్రాచుర్యంలో ఉండి, అత్యధిక దిగుబడిలిచ్చుట మీరు గమనించిన రకాలను/హైబ్రిడ్‌లను ఎంపిక చేసుకొని ప్రత్తిని సాగు చేయండి. కొత్తరాలకు కొద్ది విస్తీర్ణంలో ప్రయత్నించి, దిగుబడి బాగుంటే వచ్చే సంవత్సరం విస్తీర్ణాన్ని పెంచవచ్చు. వ్యవసాయంలో ఒడిదుడుకులను తగ్గించాల్సిన అవసరముంది.

మొక్కజొన్న: అత్యధిక దిగుబడులు సాధించడానికి, మే చివరి వారం నుండి  జూన్‌ మొదటి వారం వరకు విత్తవచ్చు. భూమిలో తేమ తప్పనిసరి కాబట్టి మంచి వర్షం లేదా నీటి తడి అవసరం. ఎకరాకు 40-45 క్వి. దిగుబడినివ్వగలిగిన పలు ప్రైవేట్‌ హైబ్రిడ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

అల్లం: మే నెలలోపలే విత్తడం పూర్తి చేయవలసిన పంట. తర్వాత విత్తితే దుంపకుళ్ళు ఎక్కువ. దిగుబడులు బాగా తగ్గుతాయి. అధిక పచ్చి అల్లం మరియు ఎండుఅల్లం (శొంఠి) కొరకు అనువైన రకాలు: ఆంధ్రప్రదేశ్‌కు: రియోడిజనీరో, వైనాడ్‌లోకల్‌, తెలంగాణకు: రియోడిజనీరో, మారన్‌. ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి, ఎక్కువ తేమ లభ్యమయ్యే ప్రాంతాల్లో అల్లం దిగుబడి బాగా ఎక్కువ. కొంత ఎండ, కొంత నీడ తగిలే పందిరి కూరగాయతోటలు, ద్రాక్ష, మామిడి, కొబ్బరి, బొప్పాయి, నిమ్మ, జామ తోటల్లో కూడా ఈ పంట పండుతుంది. విత్తనమోతాదు: 600-800 కిలోలు/ఎకరాకు.

పసుపు: ఆంధ్రప్రదేశ్‌లో 6-7నెలల్లో తవ్వకానికి వచ్చే స్వల్పకాలిక రకాలను విత్తడానికి మే నెల చివరి వారం అనుకూలం. ఈరకాలనే తెలంగాణలో జూన్‌ మొదటి పక్షంలో నాటడం అనుకూలం. అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకాలు: ఐ.ఐ.ఎస్‌.ఆర్‌. ప్రతిభ, దిగుబడి: 15-16 ట/ఎ. పంటకాలం: 185-190 రోజులు, రికవరి శాతం: 18.5; ఐ.ఐ.ఎస్‌.ఆర్‌.ప్రభ: దిగుబడి: 15 ట/ఎ, పంటకాలం: 195 రోజులు. రికవరి శాతం: 19.5.

నువ్వులు: వర్షాకాలంలో విత్తే నువ్వు పంటను అధిక దిగుబడుల కొరకు రాయలసీమలో మే-జూన్‌ నెలల్లోను, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మే 15 నుండి మే 31 వరకు విత్తుకోవచ్చు. తెలంగాణలో మే రెండవ వారం లోపు లేక ఆగస్టు రెండవ పక్షంలో విత్తాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక దిగుబడినివ్వగల్గిన తెల్లనువ్వుల రకం జగిత్యాల తిల్‌-1 (జె.సి.ఎస్‌-1020): దిగుబడి 5-8 క్వి/ఎ. వర్షాకాలంలో పంటకాలం: 90-125 రోజులు. ఇతర నువ్వుల రకాల కంటే 2 క్వి./ఎ. ఎక్కువ దిగుబడినిస్తున్నట్లు వార్తలు. ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణాలోను విత్తనోత్పత్తి చేపట్టి అధిక దిగుబడితోపాటు అధిక ఆదాయం పొందవచ్చు. విత్తనాల కొరకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల వారిని 0874-277281 లేదా 9989625213 కు ఫోను చేసి సంప్రదించవచ్చు. చలికాలం, వేసవి కాలాల్లో కూడా ఈ రకం పండుతుంది. కావున విత్తనానికి అమ్ముకునే అవకాశం ఉంది.

కొత్తిమీర: మే నెలలో అధిక ఆదాయంతో పాటు అధిక రోగనిరోధక శక్తిని ఇవ్వగలిగిన పంట. కరోనా సమయంలో ఎక్కువ రోగనిరోధక శక్తినివ్వగలిగే పంటలకు ప్రాధాన్యం ఎక్కువ. కొత్తిమీర, ఎక్కువ ఎండ వేడి ఉన్న మే నెలలో సరిగా ఎదగనందున, పాక్షిక నీడ కలిగిక తోట పంటలు, పందిరి కూరగాయ పంటల నడుమ పెంచవలసి ఉంటుంది. షేడ్‌నెట్లు, నెట్‌హౌస్‌లు, పాలీహౌస్‌లలో ఈ పంట బాగా వస్తుంది. మే నెలలో కూడా చల్లగా ఉండే ప్రాంతాలైన చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతం, తూర్పు కనుమలు, ఎత్తైన గిరిజన ప్రాంతాలు ఈ పంటను పండించడానికి అనుకూలం. అరకు, పాడేరు ప్రాంతాలు మొదలైన ఎత్తైన ప్రాంతాలు అనుకూలం. ఇక్కడ పండించిన కొత్తిమీరను మిగతా ప్రాంతాలకు రవాణా చేసుకుని ఎండాకాలంలో మంచి ఆదాయం పొందవచ్చు. జూన్‌ నెలలో కూడా కొత్తిమీరకు మంచి ధర వస్తుంది. కో-2 అనే రకం చౌడు భూముల్లో కూడా పెరుగుతుంది. సాధారణ పొలాల్లో పంట పెట్టడానికి అనుకూలమైన అధిక దిగుబడినిచ్చే కొత్తిమీర రకాలు: హిస్సార్‌ఆనంద్‌, పంత్‌హరితిమా ద్వా, ఆర్‌.సి.ఆర్‌-446, కో-1, కో-2, కో-3. తెలివిగా మార్కెట్‌ చేసుకుంటే మంచి పంటకు ఎకరాకు లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

పొదీన: రోగనిరోధక శక్తి ఎక్కువగా గల సూపర్‌ ఫుడ్‌లలో పొదీనా ఒకటి. ఎక్కువ ఎండల్లో కూడా పెరుగుతుంది. మే నెల పెండ్లిం డ్లలో, శుభకార్యాల్లో, మసాలా దినుసుగా బిరియానీలోకి దీనిని వాడుతారు. పొదీనాను అలాగే అమ్ముకోవచ్చు. ఎక్కువ విస్తీర్ణం పంటబెట్టితే తైలం తయారీ చేసి అమ్ముకోవచ్చు. మంచి రకాలు: కోసి, సక్షమ్‌, శిలిక్‌, హిమాలయ. ఎకరాకు 15-20 ట. పొదీన వస్తుంది. నూనె తీస్తే 70-75 కిలోలు వస్తుంది. ఈ పంట లాభదాయకమే.

పాలకూర: ఈ పంట అత్యధిక దిగుబడులు పొందాలంటే ఉదజని సూచిక 7.0కు దగ్గరుండాలి. ఉదజని సూచిక 10.5 ఉన్న భూముల్లో కూడా ఈ పంట పండుతుంది. ఈ ఆకుకూరలో విటమిన్‌ ఎ, సి, ఐరన్‌, కాల్షియం, మాంసకృత్తులు దండిగా ఉంటాయి. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: ఊటీ: 24 ట/ఎ., జాబ్‌ నగర్‌ గ్రీన్‌ : 16-19 ట/ఎ. ఇతర ఆకుకూరలు: తోటకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర, పొన్నగంటి కూర, కొయ్యగూర, సోయకూర మొదలైనవి కొద్ది విస్సీర్ణంలో, కొద్దిపాటి నీటితో పండించి, మంచి ఆదాయం పొందవచ్చు. రోగనిరోధక శక్తి ఆకుకూరలలో అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ. ఊబకాయం గలవారికి, మధుమేహ రోగగ్రస్తులకు బాగా ఉపయోగం.

 పూలు- కనకాంబరం: మే, జూన్‌ నెలల్లో నారు పెంచి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నాటుకోవాలి. పూలకాడల్లో పూలు తెంపడం అయిపోయాక, పూలగుత్తులను, ఎండిన కొమ్మలను తీసివేస్తే సంవత్సరం పొడవునా కనకాంబరం పూలను పొందవచ్చు. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది. నాటిన 3 సం|| వరకు పూత పూస్తుంది. కాని, 2 సం|| పంట తీసుకొని తర్వాత తీసివేస్తే లాభదాయకం. రెండు సంవత్సరాలలో పూల దిగుబడి ఎకరాకు 1500 నుండి 2000 కిలోలు.

టమాట: విస్తీర్ణాన్ని నియంత్రించడం వలన, ఈ పంట ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఇదే పరిస్థితి మే నెలలో కూడా ఉండవచ్చు. జూన్‌, జులై నెలల్లో ధరలు పెరిగే అవకాశముంది. మేఘావృతమైన వాతావరణం, వర్షాల వలన, దిగుబడి తగ్గి ధరలు పెరగవచ్చు. వాతావరణంలో ఎండ బాగా ఉంటే దిగుబడి బాగుంటుంది. మేఘావృతమైతే దిగుబడి బాగా పడిపోతుంది. ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. మేఘావృతమైన వాతావరణం ఏర్పడితే తప్ప దిగుబడి తగ్గదు. ధరలు పెరగవు. మంచి ధరలు రావాలంటే విస్తీర్ణాన్ని నియంత్రించాలి. తక్కువ రేట్లున్నపుడు టమాటతో విలువ పెంచే పదార్థాలు (వాల్యూయాడెడ్‌ ప్రాడక్ట్సు) చేసి విక్రయించుకోవాలి.

రోహిణిలో నీటి లభ్యత-పంటలు: ఈ కార్తె (25-5-22 నుండి 7-6-22 వరకు)లో నీరు పుష్కలంగా ఉంటే, బెండ, గోరుచిక్కుడు, కాకర, పొట్ల, గుమ్మడి, సొర విత్తవచ్చు. వర్షాకాలపు కూరగాయల నార్లు పోసుకోవచ్చు. కంది, పెసర, మినుము పంటలను విత్తవచ్చు. రేగు, దానిమ్మ మొక్కలను నాటవచ్చు. కామంచి, పామరోజా వంటి సువాసన మొక్కల విత్తనాలు విత్తుకోవచ్చు.

మామిడి: పండ్లను తోటల్లోనే వరిగడ్డి, బోదగడ్డిలో కార్బైడ్‌ వేయకుండా మాగబెట్టి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. మందులు వేయకుండా ప్రకృతి సిద్ధంగా మాగబెట్టినట్లు బోర్డు పెట్టితే నమ్మకమున్న వాళ్లంతా ఎక్కువ రేటిచ్చి కొంటారు.

కీరదోస: సాలాడ్‌గా బహుళ ప్రాచుర్యం పొందిన పంట. హరిత గృహాల్లో (పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లు, షేడ్‌ నెట్లలో) ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నా ధరలు తగ్గకుండా వినియోగమవుతున్నది. అనుకూలమైన పార్థినోకార్పిక్‌ రకాలు: కియోన్‌, సన్‌-9728, సన్‌-3019.

బెంగుళూరు మిర్చి: ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఎక్కువగా వాడుతున్నారు. అత్యధిక దిగుబడి (40 ట/ఎ.) నివ్వగల్గిన రకాల విత్తనాలు బజార్లో దొరుకుతున్నాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

పశువులమేత: ఎండాకలంలో పశువుల మేతకున్న గిరాకీని సొమ్ము చేసుకోవడానికి, ముందుగా పంటబెట్టిన అన్ని రకాల పశువుల మేతను సేకరించి ఎక్కువ ధరలకు ఎండాకలంలో అమ్ముకునే వీలుంది. జొన్నలో పి.సి.-6 అనే రకం సున్నారపు భూముల్లో కూడా పెరుగుతుంది. ఇటువంటి భూములలో సాగు చేసి పశువులమేతగా అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది.
జూన్‌-జూలైలో పెట్టే పంటల విత్తనాలు, ఎరువుల సేకరణ: విత్తనాలు, ఎరువులు సేకరించుకోవడానికి మేనెలను ఉపయోగించుకోవచ్చు. డిమాండు ఎక్కువగా ఉన్న రకాలు, దొరకవేమోననే అనుమానాలున్న వాటిని సేకరించి పెట్టుకోవచ్చు. వర్షాధార పంటలలో, తేమ ఆరిపోకముందే విత్తడం త్వరగా పూర్తి చేయవచ్చు.

మట్టిపరీక్షలు: మట్టి పరీక్షలు చేయించి, దాని ప్రకారం ఎరువులను వాడి, ఎరువుల ఖర్చు తగ్గించవచ్చు. దిగుబడులు అధికంగా ఉంచుతూ ఖర్చు తగ్గించి, లాభాన్ని పెంచవచ్చు.

శిక్షణలు: అన్ని ట్రైనింగ్‌ ప్రోగ్రాములను సద్వినియోగపరచు కొనుటకు మే నెలలో పనులు తక్కువగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. 

ఎఫ్‌.పి.ఓ.ల ఫెయిల్యూర్స్‌ తగ్గించడం: రైతు ప్రజా సంఘాలను పటిష్టపరచు కోవడానికి మే నెల అనుకూలం. ఎఫ్‌పిఓల ఏర్పాటు చేసుకోవడానికి, సమావేశాలకు సమయం కేటాయించే అవకాశం మే నెలలో ఎక్కువ. చిరస్థాయి గ్రామ సంఘాలు తొలుత ఏర్పాటు చేసి, వాటికనుబంధంగా ఎఫ్‌.పి.ఓలు ఏర్పాటు చేస్తే ఎఫ్‌పిఓల ఫెయిల్యూర్స్‌ చాలా వరకు తగ్గించవచ్చు. చిరస్థాయి రైతు ప్రజా (గ్రామ) సంఘాలు, ఎఫ్‌పిఓల డైరెక్టర్లను, తప్పిదాలు చేయకుండా కట్టడి చేస్తాయి. తద్వారా ఎఫ్‌పిఓ (రైతు ఉత్పత్తిదారుల సంస్థ)లు మునిగిపోకుండా, మునిగి పోయినవి కూడా తిరిగి పనిచేసేవిధంగా కాపాడుతాయి. ప్రతి పల్లెలోనూ రైతు ప్రజా (గ్రామ) సంఘం ఏర్పాటుద్వారా ఉత్పత్తిదారులను, వినియోగదారులను ఒకే సంస్థలో ఉంచవచ్చు. వినియోగదారుల్లో ఉన్న ఆర్థిక శక్తి, మేనేజ్‌మెంట్‌ క్యాపబిలిటీ, రైతుల ఆర్థిక శక్తిని మెరుగుపరచడానికి బాగా పనికొస్తుంది. మున్ముందు, ప్రతి పల్లె, ప్రతి జనావాసంలోని అందరి ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, ప్రభుత్వాలకు దోహదపడుతుంది. రాజకీయాలకతీతంగా జరిగే ఈ అభివృద్ధిని అన్ని పార్టీల మానిపెస్టోల్లో చేర్చుకుని, గెలిచినవారు ఆచరిస్తే, ఆ పార్టీ వారు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారు. పలు పంటలపైన, రైతు సంఘాల ఏర్పాటు, పటిష్టమైన ఎఫ్‌.పి.ఓ.ల ఏర్పాటు మీద వివరంగా తెలుసుకో గోరేవారు 94944 08619 కు ఫోను చేయవచ్చు. సంఘాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కూడా ఏర్పాటు చేయించుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో SALLA NARAYANASWAMY/Profsnswamy అకౌంట్లలో పోస్టింగులలో వివిధ విషయాలపై వివరణలను, ఫొటోలతో సహా చూడవచ్చు. సలహాలు, సూచనలు రైతులకు ఉచితం.