కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆ పంట నుండి తగిన ఆదాయం పొందాలంటే ఆయా పంటలను బట్టి ఒక నెల నుండి 4  లేదా 5 నెలలు పడుతుంది. ఈ లోగా దానికి కావలసిన పెట్టుబడి కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మేవారి దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఆ పంటకు ఏదైనా నష్టం జరిగి పంట పోతే వడ్డీ పెరిగిపోయి చేసిన అప్పు తీర్చలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మనం రోజూ చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి రైతులు సంవత్సరం పొడగునా ఒక ప్రణాళిక ప్రకారం అన్ని కూరగాయలను సాగు చేసుకొంటే రోజువారీ ఆదాయంతో అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోయినా, ఇంకేవిధమైన నష్టం జరిగినా ఒకటి రెండు పంట రకాలను  నష్టపోయినా మిగతా వాటి నుండి ఎంతోకొంత ఆదాయాన్ని పొందవచ్చు.

ప్రస్తుతం కూరగాయ పంటల సాగులో ఉండే సమస్యలు 

  • ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం వలన ఒక్కోసారి అధిక వర్షాల వలన పంట మొత్తం నష్ట పోవటం 
  • ఆ ప్రాంతంలో ఉండే రైతులందరూ ఒకే పంటను వేయటం వలన మార్కెట్లో ధర పడిపోవటం
  • పంట కోతకు వచ్చేవరకు ఆదాయం ఉండదు.
  • ఒకే  పంటను వేయటం వలన పురుగులు తెగుళ్ళ సమస్య అధికమవటం.
  • అధిక నష్టభయం.

సంవత్సరం పొడగునా అన్ని కూరగాయలను సాగు చేయటం ముఖ్య ఉద్దేశ్యం 

  • ఉన్న కొద్దిపాటి పొలాన్ని సమర్ధవంతంగా వినియోగించడం.
  • అన్ని రకాల కూరగాయలను ప్రతిరోజూ అమ్మకానికి అందుబాటులో ఉంచడం.
  • రోజువారీ ఆదాయం పొందడం.
  • అధిక ఉత్పత్తితో పాటు మంచి నాణ్యమైన కూరగాయలను పొందడం.
  • భూసార, నీటి యాజమాన్యంను పంట సాగు భాగంగా చేయటం.
  • పంట ఉత్పత్తి మరియు మార్కెట్‌ నష్టాన్ని తగ్గించడం.
  • పురుగులు, తెగుళ్ళ ఉధృతిని అదుపులో ఉంచడం.

సంవత్సరం పొడగునా కూరగాయల సాగు ప్రణాళిక 

పొలాన్ని తయారుచేసుకోవడం: ఉదాహరణకు ఒక రైతుకు ఒక అర ఎకరం పొలం వుంటే ఆ పొలాన్ని 4 అడుగుల వెడల్పు, ఒక అడుగు ఎత్తు మరియు 30 అడుగుల పొడవుతో మడులను ఏర్పాటు చేసుకోవాలి. ఒక మడికి ఇంకో మడికి మధ్య నడవటానికి, కలుపు తీయటానికి, సస్య రక్షణ, కోత వంటి పనులకు వీలుగా ఒక  అడుగు దూరం ఉంచాలి. ఉన్న మడుల్లో 25% పందిరి లేదా తీగ జాతి కూరగాయలు పెంచుకోవటానికి వీలుగా పందిరి ఏర్పాటు చేసుకోవాలి. మిగతా 75% మడుల్లో మిగతా కూరగాయలను సాగుచేసుకోవాలి. మడుల్లో 50% ఎర్రమట్టి, 20% పశువుల ఎరువు, 10% కుళ్ళిన పచ్చిరొట్ట ఎరువు, 10% వర్మీ కంపోస్టు, 10% జీవన ఎరువులు వేసుకోవాలి.  పొలం చుట్టూ అడుగు దూరంతో 3 వరుసలలో జొన్న, మొక్కజొన్న, కంది, ఆముదం వంటి పంటలను రక్షక పంటలుగా వేసుకొంటే పక్క పొలాల నుండి రసం పీల్చే పురుగుల వలస తగ్గుతుంది. ఈ పంటలకు ముందు ఒక వరుసలో మునగ, కూర అరటి, కర్వేపాకు పంటలను 9 అడుగుల దూరంతో వేసుకొంటే బహువార్షిక కూరగాయ పంటలను కూడా అమ్ముకోవచ్చు. అదే పొలంలో సొంతంగా సేంద్రియ ఎరువు తయారు చేసుకోవటానికి వీలుగా ఒక మూల గుంతను ఏర్పాటు చేసుకొని పంటకాలం పూర్తైన మొక్కలను మడుల్లో నుండి పీకి అవి ఎండిన తర్వాత ఆ గుంతలో వేసుకోవాలి. డ్రిప్‌ పద్ధతిలో నీటియజమాన్యం చేయటానికి వీలుగా ఒక నీటి టాంకును కూడా ఏర్పాటుచేసుకోవాలి.

ఒకే కూరగాయ పంటను ఒకే సారి ఒక్క చోటే వేసుకోకుండా తయారు చేసుకొన్న మడుల్లో 3 లేదా 4 చోట్ల కొన్ని రోజుల వ్యవధితో వేయాలి. ఇలా వేయటం వలన మొదట వేసిన పంట కోత కాలం పూర్తైన వెంటనే రెండోది కోతకి సిద్ధంగా ఉంటుంది. అలాగే రెండోది పూర్తైన సమయానికి మూడోది, ఆతర్వాత నాలుగోది కోతకు సిద్ధంగా ఉండి ఆ పంట సంవత్సరం పొడవునా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

మడుల్లో కూరగాయపంటలను వేసుకున్నపుడు ఒకే పంటగా కాకుండా అంతర పంటలు లేదా మిశ్రమ పంటలు (ఒకే స్థలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు) వేసుకుంటే పురుగులు తెగుళ్ళ బెడదను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.

ఒకే స్థలంలో ప్రతీ సారీ అదే పంటను సాగు చేయకుండా పంట మార్పిడి చేస్తూ ఉండాలి. పంట మార్పిడి చేసినపుడు ఒకే కుటుంబానికి చెందిన పంటలను అలాగే ఒకే రకమైన పోషకాలు అవసరమున్న పంటలను ప్రతీ సారీ ఒకే స్థలంలో వేయకూడదు.నేలనుండి పోషకాలు తీసుకొన్న పంటలను నేలకు పోషకాలు అందించే పంటలైన లేగ్యూం కుటుంబానికి చెందిన చిక్కుడు జాతి పంటలతో పంటమార్పిడి చేసుకోవాలి.

అంతర పంటలు వేసుకున్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు 

  • త్వరగా పెరిగే పంటలను నెమ్మదిగా పెరిగే పంటల మధ్యలో వేయాలి. (ఉదా: కారెట్‌, ముల్లంగి వంటి పంటలను  టమాట, వంగ వంటి పంటల మధ్యలో వేయాలి.)
  • పొడుగ్గా పెరిగే పంటల మధ్యలో పొట్టిగా పెరిగే పంటలను వేయాలి. (ఉదా: టమాట, వంగ, మిరప వంటి పంటల మధ్య ఆకుకూరలు)
  • లోతైన వేరువ్యవస్థ కలిగిన పంటల మధ్య పైపైన వేర్లు ఉండే పంటలను వేయాలి. (ఉదా: బెండ మధ్యలో ఉల్లి, వెల్లుల్లి పంటలు) 

పురుగులు తెగుళ్ళు ఆశించకుండా పంటను కాపాడుట

  • చీడ పీడలను తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవాలి.
  • విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి.
  • శనగపచ్చ పురుగు నుండి రక్షణకు బంతిని ఎర పంటగా వేయాలి.
  • ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి.
  • పసుపు, నీలం  రంగుపూసిన అట్టలను  ఎకరాకు 4-5 పెడితే వైరస్‌ తెగుళ్ళకు వాహకాలుగా పనిచేసే రసం పీల్చే పురుగులు  దీనికి ఆకర్షింపబడి  వాటి ఉధృతి తెలుస్తుంది. 
  • చీడపీడలు ఆశించే మొక్కల భాగాలను ఎప్పటికప్పుడు తొలగించటం వలన మిగతా మొక్కలకు సోకకుండా తీవ్రతను తగ్గించవచ్చు.
  • కీటకాల లార్వాలను తినటానికి వీలుగా పొలంలో అక్కడక్కడ పక్షి స్థావరాలను (పంగల కర్రలు) ఏర్పాటు చేయాలి.
  • దీపపు ఎరలను పొలంలో అక్కడక్కడా పెట్టుకోవాలి.

ఈ ప్రణాళికను అనుసరించటం మొదట్లో కష్టం అనిపించినా సాధన చేస్తూ ఉంటె ఎలాంటి ప్రణాళిక వేసుకుంటే మార్కెట్‌ గిరాకీకి అనుగుణంగా ఏఏ కూరగాయ పంటలను సంవత్సరం పొడవునా పండించుకోవచ్చో సులభంగా అర్ధమవుతుంది. మొదట్లో కొన్ని ముఖ్యమైన పంటలతో మొదలు పెట్టి క్రమేపి పెంచుకొంటూ పోతూ ఉంటే ఈ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయవచ్చు. ఈ విధంగా వేసుకోవటం వలన రైతు ప్రతి రోజూ ఆదాయాన్ని పొంది అప్పుల బాధను అధిగమించవచ్చు.

డా. కె. రాధారాణి, ప్రధాన శాస్త్రవేత్త, డా.వై.యస్‌.ఆర్‌. హార్టీకల్చరల్‌ యూనివర్సిటీ