మామిడి తొందరగా కాపుకు రావటం, నాణ్యమైన ఉత్పత్తి మరియు అధిక దిగుబడి రావాలంటే మొక్కలు నాటినప్పటి నుండి వాటికి అందించే సమగ్ర ఎరువులపై ఆధారపడి ఉంటుంది.మొక్క వయస్సును బట్టి ఎరువులను అందించాలి.ఒక్కో మొక్కకు మొదటి సంవత్సరం 100 గ్రా. నత్రజని, 100 గ్రా. భాస్వరం, 100 గ్రా. పోటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 100 గ్రా. చొప్పున నత్రజని, భాస్వరం, పోటాష్ ను పెంచుతూ 10వ సంవత్సరం నుండి ఒక్కో చెట్టుకు కిలో చొప్పున నత్రజని, భాస్వరం, పోటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి.మొక్కకు కావలసిని పోషకాలను సేంద్రియ ఎరువు రూపంలో ఎక్కువగా వేసుకోవాలి.
నాలుగు సంవత్సరాల వయస్సు లోపు ఉన్న మొక్కలకు సిఫార్సు చేసిన ఎరువులను 2-3 నెలలకు ఒకసారి దఫాలుగా ఇవ్వాలి.కాపుకు వచ్చిన చెట్లకు మామిడి కోత అయిన వెంటనే సిఫార్సు చేసిన ఎరువులలో 2/3 వ వంతు ఎరువులను వేయాలి. పిందె ఏర్పడిన తర్వాత సిఫార్సు చేసిన ఎరువులలో 4 వ భాగం ఇవ్వాలి. దీనివలన ఎక్కువ దిగుబడి రావటమే కాకుండా తర్వాత సంవత్సరం నిలకడగా కాపు రావడానికి దోహద పడుతుంది. ఎరువులతో పాటు ప్రతి చెట్టుకు 1 కిలో వేప పిండి, 250 గ్రా. చొప్పున అజిటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టర్, పోటాష్ సాల్యుబులైజింగ్ బాక్టీరియా వంటి జీవన ఎరువులను అందించాలి.
సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళు కాపుకు వచ్చిన ప్రతి చెట్టుకు జీవన ఎరువులతో పాటు 100 కిలోల పశువుల ఎరువు లేదా 25 కిలోల వర్మీకంపోష్టు వేసుకోవాలి.
ఎరువులను తొలకరిలో అంటే జులై-ఆగష్టు నెలల్లో చెట్లు పాదుల్లో సమంగా చల్లి నేలలో కలిసేలా తిరగబెట్టాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎరువులను వర్షాకాలం మొదట్లో ఒకసారి మరల వర్షాకాలం చివర్లో రెండవసారి వెయ్యాలి.వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వర్షాకాలం చివర్లో ఒకేసారి వేసుకోవాలి. మామిడి పిందె కట్టిన థ నుండి భుజాలు ఏర్పడేంత వరకు చాలా త్వరగా పెరుగుతాయి.ఈ దశ లో పోషకాలు అవసరం ఎక్కువగా వుంటుంది.నీటి వసతి ఉన్న తోటల్లో సిఫార్సు చేసిన ఎరువు మోతాదులో 4 వ వంతు కాయ గోళీకాయ సైజులో ఉన్నపుడు వేసుకోవాలి.
సూక్ష్మధాతు లోపాల నివారణ
చాలా మామిడి తోటల్లో సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తున్నాయి. మన రాష్ట్రంలో చాలా తోటల్లో నేలలో సేంద్రియ పదార్దం తక్కువగా ఉంది. దీనివలన మొక్కకు కావలసిన పోషకాలు అందక దిగుబడులు తగ్గుతున్నాయి.

నేలలో సేంద్రియ పదార్దం బాగా పెరగడానికి మామిడి చెట్ల మద్య ఖాళీ స్థలంలో జీలుగ విత్తనాలు 10 కిలోలు ఎకరానికి లేదా జనుము 25 కిలోలు ఎకరానికి చొప్పున లేదా నవధాన్యాలు కానీ తొలకరిలో చల్లుకొని పూత థలో నేలలోకలియ దున్నాలి. ఇలా చేయటం వలన నేలలో సేంద్రియ పదార్దం పెరగటమే కాకుండా కలుపు సమస్య ఉండదు. పెట్టుబడి తగ్గుతుంది.సూక్ష్మధాతు పోషకాల లభ్యత పెరుగుతుంది. అలాగే మేలు చేసే సూక్ష్మ జీవులు పెరిగి నేల బాగా గుల్లబారుతుంది. దీనివలన నేలలోకి నీరు బాగా ఇంకి మొక్కకు అందుతుంది.
జింకు లోప లక్షణాలు:
జింకు లోపం సాధారనంగా చౌడు నేలల్లో కనబడుతుంది. జింకు లోపం ఉన్న తోటల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి. మొక్క పెరిగే థలో జింకు లోపిస్తే ఆకులు చిన్నగా మారి సన్నబడి పైకి లేదా కిందకి ముడుచుకు పోతాయి. కణుపుల మద్య దూరం తగ్గిపోయి ఆకులు గుబురుగా ఒకే చోట పెరుగుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి, కాయ పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గుతుంది.

జింకు లోపాన్ని నివారించడానికి 5 గ్రా. జింకు సల్ఫేట్‌ను ఒక లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి లోపాన్ని సవరించుకోవాలి.
బోరాన్ లోప లక్షణాలు
ఆకులు పొట్టిగా ఉండి ఆకు కొనలు నొక్కుకుపోయినట్లుగా మారి పెలుసుబారిపోతాయి.బోరాన్ లోపిస్తే కాయ పెరిగే థలో పగుళ్ళు ఏర్పడతాయి.

దీని నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రా. బోరాన్ ను చెట్ల పాదుల్లో వేయాలి.అలాగే కొత్తగా చిగుర్లు వచ్చే థలో 1-2 గ్రా. బోరాన్ ను లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారి చేసుకోవాలి.
ఇనుప ధాతు లోప లక్షణాలు
సున్నపు నేలల్లో పెంచిన తోటల్లో ఇనుము ధాతు లోపం ఎక్కువుగా కనిపిస్తుంది. ఇనుము లోపిస్తే ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి తెల్లగా మారుతాయి. ఆకుల పరిమాణం తగ్గుతుంది. ఇనుము లోపం తీవ్రత ఎక్కువైతే ఆకులు కొనలు నుండి ఎండుకొంటూ వస్తాయి. చెట్టు పెరుగుదల తగ్గి కాపు అంతగా రాదు. వచ్చినా కాయ నాణ్యత బాగుండదు. ఇనుము లోపం తీవ్రత చిన్న మొక్కలలో ఎక్కువైతే మొక్కలు చనిపోయే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.

ఈ లోపాన్ని నివారించాలంటే 2.5 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ మరియు 1 గ్రా. నిమ్మ ఉప్పు ఒక లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత 2 సార్లు చెట్టు మొత్తం తడిచేలా పిచికారి చేయాలి.
పొటాషియం లోప లక్షణాలు
ఆకులు అంచులు మాడిపోవటం అనేది పొటాషియం లోపం యొక్క ప్రధాన లక్షణం. ఆకు అంచు మాడటం ఆకుకొన నుండి ప్రారంభమై క్రిందికి వ్యాపిస్తుంది. కాయ నాణ్యత తగ్గుతుంది. చెట్టు చీడపీడలను తట్టుకొనే శక్తి కోల్పోతుంది.
దీని నివారణకు చెట్టుకు సిఫార్సు చేసిన పోటాష్ ఎరువు మోతాదును చెట్ల పాదుల్లో వేసి కలియబెట్టాలి. రాలిన ఆకులను నేలలో కలిపి తిరగబెడితే కుళ్ళి సేంద్రియ పదార్ధం పెరిగి చెట్టుకు కావలసిన పొటాషియం మూలకం అందుతుంది.
అన్నిరకాల సూక్ష్మధాతు లోపాలు ఒకేసారి కనిపిస్తే జింకు సల్ఫేట్ 5 గ్రా., ఫెర్రస్ సల్ఫేట్ 2.5 గ్రా., బోరాక్స్ 2 గ్రా., కాల్షియం సల్ఫేట్ 2 గ్రా., మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రా. ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు అంటే జూన్-జులై, సెప్టెంబర్-అక్టోబర్ మరియు డిసెంబర్-జనవరి నెలల్లో పిచికారీ చేసుకోవాలి.
అలాగే పూమొగ్గ తొందరగా ఏర్పడటానికి, విచ్చుకోవటానికి 10గ్రా. పొటాషియం నైట్రేట్ ను ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి అక్టోబర్ నెలలో పిచికారీ చేయాలి.
సస్య రక్షణ చర్యలు:
- కాయ కోత అనతరం లోతు దుక్కులు దున్నుకొంటే నేలలో ఉండే పురుగుల గుడ్లు మరియు నిద్రావస్థ థలు బయటబడి నాశనమౌతాయి.
- తేనెమంచు పురుగు ఉదృతిని అరికట్టాలంటే చెట్ల కొమ్మలను పలచన చేయాలి. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కత్తిరించి చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకేలా చేయాలి.
- ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
- తోటలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
- అక్టోబర్‌లో వర్షాలు లేనట్లైతే ఒకసారి చెట్ల పాదుల్లో నీటితడులు ఇవ్వటం వలన కూడా భూమిలో ఉండే గుడ్లు బయట పడతాయి.
- తోటలో రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.
- ప్రతి 2 నెలలకు ఒకసారి వేప నూనె 3000 పిపియం 3 మిల్లీ లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణాన్ని చెట్ల కొమ్మలు, మొదలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. దీనివలన కొమ్మల పగుళ్ళలో దాక్కొని ఉన్న పురుగు కోశస్థ థలు నాశనమై వాటి ఉధృతి తగ్గుతుంది.
- పిండి పురుగులు నివారణకు చెట్ల మొదలు నుండి 1 అడుగు ఎత్తులో 25 సెం. మీ. వెడల్పు ఉన్న 400 గేజి మందం ఉన్న పాలీతీన్ షీటుతో చుట్టాలి. ఇలా చేయటం వలన నేలలో ఉండే పిల్ల పురుగుల థలు చెట్టుపైకి పాకకుండా ఉంటాయి.
- పండు ఈగ ఆశించకుండా ఉండడానికి కాయలు పక్వథకు చేరగానే ఆలస్యం చేయకుండా కోసుకోవాలి. అలాగే కాయలకు కవర్లు తొడగటం వలన పండు ఈగ బారి నుండి రక్షించవచ్చు.
- ఒకవేళ అప్పటికే పండు ఈగ ఆశించి కాయలు రాలి ఉంటే వాటిని వెంటనే ఎరివేసి నేలలో లోతుగా కప్పటమో లేదా కాల్చివేయటం చేయాలి.
- ఆకు ముడత పురుగులు అల్లిన గూళ్ళను తొలగించి వాటిని కాల్చేస్తే ఆ గూడులో ఉండే గుడ్లు, పిల్ల పురుగు థలు నాశనం అయ్యి తోటలో వాటి ఉధృతి తగ్గుతుంది.
- తోటలో మిత్ర పురుగులను రక్షించటం వలన హానికర పురుగుల ఉధృతి అదుపులో ఉండి పంట నష్టం తగ్గుతుంది.
- సాధ్యమైనంత వరకు రసాయన మందుల పిచికారీ తగ్గించుకోవాలి. వీటికి బదులు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని జీవ సంబంధిత మందులు అయినటువంటి వేపనూనె, కానుగ నూనె, బవేరియా బాసియానా, మెటారైజియం వంటి సురక్షితమైనవి వాడుకొని నివారించుకోవాలి. స్థూల మరియు సూక్ష్మపోషకాలను సేంద్రియ రూపంలో అందుబాటులో ఉన్నవాటిని ఉపయోగిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.
డా. కె. రాధారాణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, డా. బికెఎం లక్ష్మి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, డా. జి. స్రవంతి, సైంటిస్ట్, మామిడి పరిశోధనా సంస్థ, నూజివీడు.

