మామిడిలో కోతలు పూర్తి అయిన తరువాత రైతులు ఈ క్రింది తెలియజేసిన పద్ధతులు చేపట్టినట్లయితే రాబోయే పంటకాలంలో మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు.
* చెట్టు ప్రధాన కాండం మీద 2 లేదా 3 బలమైన కొమ్మలను పెరగనిచ్చి మిగతావి తీసివేసి చెట్టు లోపలికి గాలి మరియు వెలుతురు బాగా ప్రసరించేటట్లు చూడాలి.
* ప్రక్క కొమ్మల పొడవు 80 సెం.మీ.లు ఉంచి చివర్లను కత్తిరించాలి.
* పెద్ద చెట్లలో ప్రతి సంవత్సరము కాయ కోత తరువాత అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, చీడపీడలు వచ్చిన కొమ్మలు, వేలాడుతున్న కొమ్మలు, ఎండు కొమ్మలు తీసివేయుట వలన సూర్యరశ్మి చెట్టంతా బాగా సోకి మంచి కాపునిస్తుంది.

* చెట్ల నుంచి కాయలు కోసిన తరువాత మిగిలిపోయిన తొడిమలను కత్తిరించాలి. కత్తిరింపుచేసిన తరువాత ప్రతి రెమ్మ చివరి నుంచి 3-5 చిగుర్లు వస్తే రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని అందినమేర తీసివేయాలి.
* కత్తిరించిన ఎండు కొమ్మలను, చెట్ల క్రింద రాలిన ఎండు పుల్లలను ప్రోగు చేసి దూరంగా కాల్చివేయాలి.
* కొమ్మలు కత్తిరింపు చేసిన తరువాత 0.3% కాపర్ ఆక్సీక్లోరైడ్ (బ్లైటాక్స్) పేస్టును పూయవలెను. వీలుకాని ఎడల అదే మందును పిచికారి చేసుకోవాలి.
* చెట్టు కాండంపైన ఒకవేళ రంధ్రాలను గమనించినట్లయితే గట్టి ఇనుప తీగను లోపలికి చొప్పంచి కాండం తొలిచే పురుగులను బయటకు లాగి చంపివేయాలి.
* తొలకరి జీలుగ (10 కిలోలు/ఎకరానికి) లేదా జనుము (25 కిలోలు/ఎకరానికి) లాంటి పచ్చిరొట్ట విత్తనాలను చెట్ల మధ్య వేసి 45-50 రోజులలో (పూతకు వచ్చే సమయంలో) భూమిలో కలియదున్నాలి. 10 సంవత్సరాలు పైబడ్డ చెట్టుకి చివికిన పశువుల ఎరువు (సుమారు 10 తట్టలు) లేదా వర్మికంపోస్టు (10 కిలోలు) ప్రతి చెట్టు పాదులో వేయాలి.
ఈ యాజమాన్య చర్యలు చేపట్టగలిగితే డిసెంబరు నెలలో ఏర్పడే పూత మంచి దిగుబడినిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మామిడిలో రాబోయే పంట కాలంలో అధిక దిగుబడులతో పాటు మంచి నాణ్యత గల దిగుబడి పొందవచ్చు.
డా. ఎం. రాజ్‌కుమార్, డా. బి. మాధవి, శాస్త్రవేత్త (సాయిల్ సైన్స్), డా. పి. హరికాంత్, కె. మౌనిక, ఎ. నితిష్, ఎ. వైష్ణవి, జి. నవ్య, ఫల పరిశోధన స్థానం, సంగారెడ్డి. ఫోన్: 99515 10516.

