రిటైర్డ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌  డా|| కె. రామచంద్రం

గతంలో వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టకముందు సేంద్రియ పదార్థం తగిన మోతాదులో అందిస్తూ పంటల సాగు చేపట్టేవారు కాబట్టి సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణం ఉండేది.  ప్రస్తుత పరిస్థితుల్లో నేలలో సేంద్రియ పదార్థం తక్కువగా ఉంది కాబట్టి సేంద్రియ పదార్థాన్ని పెంచుకోడానికి అవసరమైన చర్యలు అయినటువంటి పచ్చిరొట్ట పైర్లు వేయడం, వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియదున్నడం మరియు సేంద్రియ ఎరువులు ఉపయోగించడానికి చర్యలు చేపట్టి క్రమంగా సేంద్రియ పదార్థాన్ని పెంచుకుంటూ పోతే సేంద్రియ సాగు విజయవంత మవుతుందని ఏప్రిల్‌ 29, 30, మే 1 తేదీలలో రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేంద్రియ సాగు విధానం, కషాయాలు, మిశ్రమాల తయారీతోపాటు రైతులు పండిరచిన వ్యవసాయ దిగుబడులకు విలువ జోడిరపు వంటి అంశాలపై గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్‌లో నిర్వహించిన రైతు శిక్షణా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ముఖ్య అతిధిగా పాల్గొన్న రిటైర్డ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌  డా. కె. రామచంద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా. సుధ, రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పొల్గొన్నారు.

పంటల దిగుబడులు, నాణ్యతను పెంచటం, స్వయం ఉపాధిగా తేనేటీగల పెంపకం బాగా ఉపయోగపడుతుంది. తక్కువ పెట్టుబడితో తేనేటీగల పెంపకం చేపట్టవచ్చు. ప్రస్తుత సమాజంలో తేనే వాడకం రోజు రోజు పెరుగుతూ వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తేనేటీగల పెంపకం చేపట్టగలిగితే స్వయం ఉపాధిగా ఉపయోగపడడంతోపాటు రైతులకు పంట దిగుబడి, నాణ్యత పెరుగుతుందనే లక్ష్యంతో  తేనేటీగల పెంపక విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా. సుధ  విపులంగా వివరించారు. అదే విధంగా తక్కువ పెట్టుబడితో స్ధాపించుకోదగ్గ కుటీర పరిశ్రమలలో పాల పుట్టగొడుగుల పెంపకం ముందు వరుసలో       ఉంటుంది. అంతే కాకుండా అదనపు ఆదాయ వనరుగా కూడా వీటి పెంపకాన్ని సులభంగా చేపట్టవచ్చు అని వివరిస్తూ పాల పుట్టగొడుగుల పెంపకం విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ  డా. సుధ  వివరించారు.

ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన గోశాల, కట్టెగానుగతో నూనె తీసే ప్రక్రియ, వానపాముల ఎరువు, ఘనజీవామృతం తయారీ విధానం ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. 

ఆహారమే ఔషధం కావాలి : డా. జి.వి. పూర్ణచంద్‌

మనం తినే ఆహారం మనకి శక్తిని ఇవ్వడంతోపాటు మన ఆరోగ్యాన్ని కాపాడగలిగేదిగా ఉండాలి. కాని ప్రస్తుతం మన ఆహారపు అలవాట్లు పరిశీలించినట్లయితే ఈరోజుల్లో మనలో చాలా మంది తినే ఆహారం శక్తిని సక్రమంగా ఇవ్వకపోగా రసాయనాలతో పండిరచిన ఆహారాన్ని తింటున్నాము కాబట్టి మనం తినే ఆహారంలో ఉండే రసాయనిక అవశేషాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం వైపు అడుగులు వేయాలి. అందుకు అనుగుణంగా రైతులు కూడా రసాయానాలు లేకుండా పోషకాలు సక్రమంగా గల ఆహార పదార్థాలను అందించే వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేయాలి. ఏది ఏమైనా గాని మనం తినే ఆహారం మనకు ఔషధంలా పనిచేయాలని శిక్షణా కార్యక్రమం మూడవ రోజు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. జి.వి. పూర్ణచంద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ సహాయ సంచాలకులు కె. శ్రీకాంత్‌ రెడ్డి, సేంద్రియ రైతులు మీసాల రామకృష్ణ, శబరీనాధ్‌, ఏడుకొండలు మరియు రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పొల్గొన్నారు.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండే ఆకు కూరలు మరియు కూరగాయలు చాలా వరకు రసాయనాలతో పండిరచినవే అందుబాటులో ఉంచుతున్నారు. కొన్ని సార్లు రైతులు రసాయనాలు పిచికారి చేసిన వెంటనే కూరగాయలు, ఆకుకూరలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచడం వలన వాటిలో ఉండే విష రసాయనిక అవశేషాలు ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం సేంద్రియ పద్ధతులలో కూరగాయలు మరియు ఆకుకూరలు పండిరచడమే. బొప్పాయి మరియు అరటి పంటలు సేంద్రియ సాగుకు అనుకూలం అని మీసాల రామకృష్ణ అన్నారు.  రసాయనిక వ్యవసాయంలో జామ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జామ పంటను ఆశించే నెమటోడ్స్‌ సమస్యకు రసాయనాల్లో సరైన పరిష్కారం లేదు. సేంద్రియంలోనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయం శబరీ అనుభవ పూర్వకంగా తెలుసుకుని గత కొన్ని సంవత్సరాల నుంచి జామ సాగును పూర్తి సేంద్రియ పద్ధలతో సాగు చేస్తూ ఎలాంటి సమస్య లేకుండా మంచి దిగుబడులు సాధించవచ్చని తన అనుభవాన్ని రైతులకు జామ రైతు శబరీనాధ్‌  వివరించారు.

వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపునకు సంబంధించిన వివిధ యంత్రపరికాల వివరాలు అనగా వాటి ధర, అవి పనిచేసే విధానాలను, అవి దొరికే ప్రదేశాలను రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. శిక్షణకు హాజరైన రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు.