మనది వ్యవసాయక దేశం అయినప్పటికీ, ఎక్కువమంది ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై అధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నా కూడా రైతులందరూ ఆర్థికంగా విజయం సాధించగలుగుతున్నారా? అని అడిగితే సమాధానం లేదు అని వస్తుంది. వివిధ రకాల కారణాల వలన ఎక్కువమంది రైతులు తమ పంటల సాగులో దిగుబడులు అయితే సాధించగలుగుతున్నారు కాని ఆర్థికంగా లాభాలు ఆర్జించలేకపోతున్నారు. తమ పంటల సాగుని లాభాల బాటలో నడిపించుకోవడానికి కొంతమంది రైతులు సేంద్రియ బాట పడుతున్నారు. సేంద్రియ బాటపట్టిన రైతులందరూ లాభాలు ఆర్జించగలుగుతున్నారా? అంటే సమాధానం లేదు అని వస్తుంది. రసాయనిక వ్యవసాయంతో పోల్చితే సేంద్రియ సాగులో అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అశ్రద్ధ చేయకుండా సద్వినియోగం చేసుకోగలిగితే సేంద్రియ సాగులో విజయం తథ్యం అని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లా, ఉంగుటూరు గ్రామానికి చెందిన గద్దె వెంకటరత్నం (రత్నాజి).
రత్నాజీది వ్యవసాయ నేపధ్యం. తోటి రైతుల లాగానే తమ పంటల సాగులో రసాయనాలు కూడా వినియోగిస్తూ సాగుని కొనసాగిస్తుండగా 2006వ సంవత్సరములో తమ ప్రక్క పొలంలో గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గోశాల పరిధిలో భూపతిరాజు రామకృష్ణంరాజు గారు గో-ఆధారిత వ్యవసాయం మొదలు పెట్టి రత్నాజీ గారిని కూడా అడగడము జరిగింది. గో-ఆధారిత వ్యవసాయంతో కాలుష్యం తగ్గుతుందని గ్రహించిన రత్నాజీ 2008 వ సంవత్సరం నుంచి తాను పండించే పంటలను గో-ఆధారిత వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం మొదలు పెట్టాడు. ఇందుకుగాను మొత్తం 9 దేశీయ జాతి ఆవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తమ పంటల సాగులో వినియోగిస్తున్నాడు. తమ సొంత పొలం 9 ఎకరాలతో పాటు కొంత పొలాన్ని కౌలుకి తీసుకుని వరి పంటతో పాటు ఎకరంన్నర విస్తీర్ణంలో సమీకృత వ్యవసాయం చేస్తున్నాడు.

ప్రస్తుతం కుజూ పటాలియా, తులసిబోసో, పిఎల్‌ఏ 1100 మొదలగు రకాలు సాగులో ఉన్నాయి. విత్తనాన్ని బీజామృతంతో విత్తనశుద్ధి చేయడముతో పాటు నారును కూడా బీజామృతంలో ముంచి బీహారు కూలీల చేత నాటించారు. దుక్కిలో వివిధ వర్గాలకు చెందిన వివిధ రకాల విత్తనాలను ఎకరానికి 18 నుంచి 20 కిలోల విత్తనాలను పచ్చిరొట్టగా చల్లి అవి పెరిగి పూత వచ్చే సమయంలో ఆపచ్చిరొట్టను రోటావేటరు సహాయంతో భూమిలో కలియదున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల ఘనజీవామృతం అందించి బీహారు కూలీల సహాయంతో నారు నాటించారు. ఈ పద్ధతిలో కాలిబాటలు ఉండడముతో పాటు మొక్కలకు గాలి వెలుతురు బాగా అందుతాయి కాబట్టి చీడపీడల ప్రభావం చాలా తక్కువగా ఉండడము రత్నాజీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. దుక్కిలో పచ్చిరొట్ట మరియు ఘనజీవామృతం అందిస్తూ వస్తూండడము వలన తమ భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి మొక్కలు బాగా రోగనిరోధక శక్తితో పెరుగుతున్నాయి. దానికి తోడు జీవవైవిధ్యాన్ని కాపాడటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి రత్నాజీగారి పొలంలో మిత్ర పురుగుల నిష్పత్తి అనుకూలంగా ఉండడమ వలన చీడపీడల ప్రభావం చాలా తక్కువగా ఉండటము రత్నాజీ గమనించాడు. రెండు సంవత్సరాల క్రితం పంటపై ఆశించే చీడపీడల నివారణకు వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాల పిచికారి అవసరముండేది. కాని గత రెండు సంవత్సరాల నుంచి చీడపీడల కొరకు ఏవిధమైన చర్యలు చేపట్టనవసరం పడటము లేదు. నారు నాటడం, నేలకు జీవన ఎరువులు, జీవ శిలీంద్రనాశినులు, జీవ కీటకనాశినులు కలిపిన ఘనజీవామృతం, ద్రవజీవామృతం లాంటివి క్రమం తప్పకుండా అందిస్తూ ఉన్నారు. అయినా కాని ఎకరానికి మన పురాతన వరి వంగడాలు అయితే 25 నుంచి 30 బస్తాలు, పిఎల్ రకం ఎకరానికి 44 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు.

తమ పంటల సాగులో పెట్టుబడులు తగ్గించుకోవటానికి వివిధ రకాల జీవన ఎరువులు, జీవ శిలీంద్ర నాశినులు, జీవకీటక నాశనులు ఎన్‌ఐపిహెచ్‌ఎం నుంచి మదర్ కల్చర్ సేకరించి తానే సొంతంగా ఇంటి దగ్గరే వాటిని అభివృద్ధి పరచుకొని పంటల సాగులో వినియోగిస్తున్నాడు. జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నీమాస్త్రం, అగ్నాస్త్రం, థపర్ణికషాయం లాంటి వాటిని సొంతంగా తయారు చేసుకుంటూ అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటున్నాడు. వచ్చిన వడ్ల దిగుబడిని ఒక సంవత్సరంపాటు నిల్వ ఉంచి పాతబడిన తరువాత బియ్యం పట్టించి కిలో బియ్యం 70/-లకు అమ్మకం చేసుకుంటూ వస్తున్నాడు. మార్కెట్‌లో ధర ఇంకా అధికంగా ఉన్నా కాని అందరికీ అందుబాటులో ధర ఉండాలన్న లక్ష్యంతో కిలో 70/-ల చొప్పున మాత్రమే అమ్మకం చేస్తున్నాడు. 75 కిలోల వడ్ల బస్తాను మరపట్టించి 56 కిలోల ముడిబియ్యాన్ని పొందుతూ కిలో రూ. 70/- చొప్పున అమ్మకం చేస్తూ బస్తా వడ్ల నుంచి రూ. 3,920/-లు ఆదాయం పొందుతున్నాడు.

ఎకరంన్నర పొలంలో ఇండోనేషియా మోడల్ సమీకృత వ్యవసాయాన్ని చేస్తున్నాడు. 70 సెంట్లలో వరి సాగు చేస్తూ దాని ప్రక్కనే 5 మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతు కందకం త్రవ్వి అందులో నీటిని నింపి కొరమేను, శీలావతి, కట్ల, రూప్‌చంద్ లాంటి చేపలను పెంచుతూ దాని ప్రక్కనే ఇంకో 40 సెంట్లలో వివిధ రకాల పండ్ల మొక్కలు, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు ఇంటికి అవసరమైన పసుపు, అల్లం లాంటి పంటలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు. రాబోవు రోజులలో ఇంటికి అవసరమైన ఔషధ మొక్కలను కూడా సాగు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం ఈ ఎకరంన్నర సమీకృత వ్యవసాయం నుంచి మూడున్నర లక్షల ఆదాయం పొందడం జరిగింది.

తాము సాగు చేసే వరి పొలంలో అజొల్లాకూడా దానంతట అదే పెరుగుతూ ఉంటుంది. అజొల్లా వలన వరిపైరులో కలుపు సమస్య తగ్గడంతో పాటు గాలిలోని నత్రజని మొక్కలకు అందుతుంది కాబట్టి పంట ఏపుగా పెరుగుతుంది. పశువులకు దాణాగా అజొల్లాను అందించడంతో పాటు చేపలకు కూడా అజొల్లాను ఆహారంగా అందిస్తున్నాడు. మిగతా వారు పెంచే చేపలతో పోల్చితే తాము పెంచే చేపలను కిలోకు 30 నుంచి 40 రూపాయలు ఎక్కువ ధరకు అమ్మినా కూడా వినియోగదారులు తాము పెంచే చేపలను కొనుగోలు చేయడం రత్నాజీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.

సేంద్రియ సాగులో అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను అమలుపరుస్తూ వచ్చిన దిగుబడిని అదేవిధంగా అమ్మకం చేయకుండా విలువజోడించి మంచి ధరకు వినియోగదారులకు నేరుగా అమ్మకం చేయడంతో పాటు సమీకృత వ్యవసాయ పద్ధతులను కూడా అమలు పరుస్తూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసకోగలిగితే సేంద్రియ సాగు విజయం తధ్యం అని రత్నాజీ నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9948796638 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

