ఒకప్పుడు పసిపాపలు, రోగులు, వృద్ధులకు అవసరమైన పాలను కల్తీచేయుట మహాపాపమని మన పూర్వీకులు భావించేవారు. కానీ సమాజంలో స్వార్థము, ధనకాంక్ష పెరిగి నైతిక విలువలు క్షీణిస్తున్నకొద్దీ ప్రజల నిత్యావసరమైన పాలను నీరు మరియు వివిధ ఇతర పదార్థాలు, రసాయనాలను కలిపి కల్తీ చేసి విక్రయించే వాణిజ్య విషసంస్కృతి పెరిగిపోతూ ఉంది. వివిధ రకాల కల్తీలను వ్యాపారులు కనిపెడ్తూవుండగా, వాటిని కనుగొని, గుర్తించి నియంత్రించే సాంకేతిక విధానాలను కూడా మన శాస్త్రజ్ఞులు ఆవిష్కరిస్తూనే ఉన్నారు. పాలలోని విలువైన పోషక ఘనపదార్థాలైన వెన్న, వెన్నకాని పదార్థాలను వివిధ మార్గాల ద్వారా తొలగించి, పాల విలువను, నాణ్యతను తగ్గించుట కూడా కల్తీ క్రిందనే భావించబడ్తుంది. అముల్, విజయ, విశాఖ వంటి పేరెన్నికగన్న బ్రాండ్ల పాలు, పాల పదార్థాలకు నకిలీ బ్రాండ్లు తయారు చేసి మార్కెట్లో విక్రయించుట ద్వారా ట్రేడ్ మార్క్ చట్టానికి సైతం తూట్లు పొడుస్తున్న నకిలీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపవలసిన ప్రభుత్వం ఆశించిన స్థాయిలో తనవంతు పాత్రను నిర్వహించకపోవుట దురదృష్టకరము.
పాల కల్తీ వల్ల ముప్పు – ఎలా?
1. వినియోగదారుడు కొనుగోలు చేసిన పాలలో ఉండవలసిన పరిమాణంలో పోషక నపదార్థాలు తగ్గిపోవుట వల్ల ఆర్థికపరమైన నష్టము
2. పాల మీద ఆధారపడే పసిపిల్లలు, వృద్ధులు, రోగులకు అందవలసిన స్థాయిలో పోషకాలు అందనందువల్ల ఎదురయ్యే పోషకాహార లోపాలు
3. అనేక అంటురోగక్రిములు కలిగిన మురుగు-అశుభ్రమైన నీటితో కలుషితమైన నీటితో కల్తీ చేయబడిన పాలు మరియు సీసము, నైట్రేట్, మెర్క్యూరీ వంటి పారిశ్రామిక వ్యర్థాలను కలిగిన నీటితో కల్తీ చేయబడిన పాలమీద దీర్ఘకాలం ఆధారపడే వినియోగదారులు తీవ్రమైన అనారోగ్యాలకు గురౌతున్నారు.
4. పచ్చి పాలను ఎక్కువ గంటలు-రోజులు నిల్వ ఉంచాలనే దురుద్దేశంతో ఫార్మలిన్ యాంటీబయోటిక్స్, సోడాబైకార్బొనేటు (వంటసోడా), డైక్రొమేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫినాయిల్, యూరియా, డిటర్జంటు వంటి ప్రమాదకరమైన రసాయనాలను కలుపుట. కల్తీకి వినియోగించే కొన్ని పదార్థాలు కిడ్నీ, చర్మం, ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులే కాక కాన్సర్స్‌ను కలిగించి ప్రాణాలకే ముప్పు తేవచ్చును.
5. వివిధ రకాల అన్యపదార్థాలతో పాలను కల్తీ చేయుట వల్ల పాలు సహజమైన రుచి, వాసన, నాణ్యతలను కోల్పోవటమేకాక ఈపాలతో చేసిన పాలపొడి పెరుగు, మజ్జిగ, కోవా, వెన్న, నెయ్యి వంటి పదార్థాల నాణ్యత కూడా క్షీణిస్తుంది. కొందరు వెన్న తీయగా వచ్చిన ‘వే’ ద్రవాన్ని పాలలో కల్తీ చేసి నీళ్ళు కిసిన పాలలో ఎస్.ఎస్.ఎఫ్ శాతాన్ని పెంచే కుతంత్రాలు కూడా పాల్పడవచ్చు. ఇందువల్ల పాలు విరిగిపోకుండా ఇతర రసాయనాలను కలిపి జాగ్రత్తపడ్తూ ఉంటాయి.
6. వివిధ రుతువుల మధ్య పాల ఉత్పత్తిలో భారీ వ్యత్యాసాలు కనిపించే గేదె పాడి ప్రాంతాలలో, పాల కొరత మరియు గిరాకీలు ఎక్కువగా ఉండే రోజులలో ముఖ్యంగా వేసవిలోనూ, పెళ్ళిళ్లు, జాతరలు, ఇతర పర్వదినాల సందర్భాలలో కల్తీ సమస్య మనకు ఎక్కువగా కనిపిస్తుంది.
వివిధ రకాల కల్తీలు:
నీటితో పాలను కల్తీ చేయుట: పచ్చి పాలను సన్నని ధారగా గ్లాసు మీదగానీ స్టీల్ ప్లేటు మీదగానీ వీలుగా జారవిడిస్తే నీరు కలిసిన పాలలో లోపించిన చిక్కదనం స్పష్టంగా కనిపిస్తుంది. పాలలో సహజంగా ఉండవలసిన కనీస వెన్న (గేదెపాలు 6 శాతం – ఆవుపాలలో 3.0 శాతం) వెన్న కాని పదార్థం (గేదెపాలు 9.0 శాతం – ఆవుపాలలో 8.5శాతం) లేకపోవడాన్ని లాక్టోమీటరు మరియు బ్యుటిరోమీటరు లేదా ఎలక్ట్రానిక్ మిల్క్ టెస్టింగ్ మిషన్ల ద్వారా సులువుగా కనుగొనవచ్చును. అయితే పాలలో అత్యంత తేలికగా ఉండే వెన్నను (క్రొవ్వును) తొలగించి, ఆ తర్వాత అదేపాలను కొంత నీటితో కల్తీ చేస్తే పాల సాంద్రత అంతగా మారకపోవచ్చును. ఇటువంటి ద్విముఖ మోసాల పట్ల కూడా వినియోగదారులు జాగ్రత్తపడాలి. పాల విక్రయస్థాయిలో పాలప్యాకెట్ల నుండి సిరంజిలతో పాలను తస్కరించి నీటితో భర్తీ చేసే సంఘటనలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి.
ఆవుపాలలో, నీటితోపాటు గేదె పాలను కలిపి విక్రయించుట
పర్వదినాలలో ఆవుపాలు అవసరమైన వినియోగదారులకు ఆవుపాలతో, గేదెపాలతోనే కాక నీటితో కొందరు కల్తీ చేసి విక్రయిస్తున్నారు. అనేక డెయిరీలు ఆవుపాల ఉత్పత్తిని ప్రోత్సహించుటకు ఆవుపాలలోని ఘనపదార్థాలకు అదనపు ధరను చెల్లిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఇటువంటి సందర్భాలలో నీళ్లతోపాటు గేదెపాలతో ఆవు పాలను కల్తీ చేయడాన్ని హంసటెస్టు అనే సులువుగా క్షేత్ర స్థాయిలోనే నిముషాలలో జరుపగల సీరం టెస్టింగుతో గుర్తించవచ్చును.
ఇటీవల ఆర్గానిక్ దేశీ ఆవుపాలకు గేదె పాలకంటే రెట్టింపు ధర పలుకుతోంది. దీనిని ఆసరాగా తీసుకొని దేశీఆవుపాలలో విదేశీ ఆవుల పాలను, గేదె పాలను, నీటిని, కొన్ని సందర్భాలలో పసుపు నీటిని కలిపి మోసాలు చేస్తున్నారు. నీరుతోపాటు పశువుల మూత్రం, తెల్ల పెయింట్, రిఫైన్డ్ ఆయిల్, ఆల్కలీ యూరియా, డిటర్జంట్, మెలామిన్ వంటి ప్రమాదకరమైన రసాయన పదార్థాలను చక్కెర, వంటనూనెలు, జంతువుల క్రొవ్వులు, నీటితో కలిపి కృత్రిమ పాలుగా చేసి, అసలు పాలతో కలిపి మార్కెట్లో విక్రయిస్తూ అత్యంత ఏహ్యమైన మోసాలకు కూడా కొందరు పాల్పడుతున్నారు. ఇటువంటి పాలకు సహజమైన, రంగు, రుచి, వాసనలు ఉండవు. ఈ పాలు సాధారణ గది ఉష్ణోగ్రతలో సైతం 6-7 గంటలు పులిసిపోకుండా, విరిగి పోకుండా, తోడు పెడితే పెరుగుగా మారకుండా ఉంటాయి. అనుమానించిన వెంటనే ఈ పాల నమూనాలను సంబంధిత కల్తీ నిరోధక శాఖ అధికారులకు పాల నమూనాతో సహా ఫిర్యాదు చేస్తే, వారు కొన్ని రసాయన పరీక్షలు, ఎలీసా, ఫేజ్, పి.సి.ఆర్. వంటి సీరమ్ పరీక్షలు మరియూ లిక్విడ్ క్రొమాటోగ్రాపీ వంటి ఆధునిక పరీక్షలు జరిపి కల్తీని నిర్ధారించగల్గుతారు.
కల్తీలను గుర్తించే విధానాలు:
పాలలో సహజంగా ఉండవలసిన నీటి శాతం కంటే ఎక్కువ ఉంటే పాలసాంద్రత తగ్గిపోతుంది. దీనిని సాధారణంగా లాక్టోమీటరుతో గుర్తించవచ్చు. ఇప్పుడు చాలా పాల సేకరణ కేంద్రాలలో వెన్న శాతంతో పాటు వెన్నకాని పదార్థాల (ఎస్.ఎన్.ఎఫ్)ను కూడా సులువుగా తెలుసుకునే ఎలక్ట్రానిక్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. సరియైన పద్ధతిలో పాల నమూనా సేకరించి, ఖచ్చితమైన పరిమాణంలో టెస్టింగ్‌లో వాడితే పాలలో వెన్న-వెన్న కాని పదార్థాలను సులువుగా తెలుసుకోగలము.
కాలం వల్ల (ఏజింగ్) నాణ్యతను కోల్పోయే పాలను వాసనతో కనుగొనుట సాధ్యమే అయినప్పటికీ, ఎలక్ట్రానిక్ ముక్కు అనే పరికరంతో పరిమాణపూర్వకంగా ఖచ్చితంగా తెలుసుకోగలము.
ఆవుపాలలో గేదె పాలను కల్తీ చేయడాన్ని హంస టెస్టు ద్వారా ఒక నిముషంలో గుర్తించవచ్చును. పాలు:డిస్టిల్డ్‌వాటరు 1:10 నిష్పత్తిలో కలిపి, గ్లాసుస్లైడ్ మీద ఒక బొట్టు (చుక్క) వేసి, దీనితో హంస టెస్టు రియేజంటును కలిపితే పాల తరకలు అరనిముషంలో ఏర్పడితే ఆవుపాలలో గేదెపాలు కలిసినట్లు నిర్ధారణ అవుతుంది.

చెక్కెరతో పాల కల్తీ: 5 మిల్లీలీటర్ల పాల నమూనాలో ఒక మిల్లీ లీటరు గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు 0.1 గ్రాము రిసోర్సినాల్ కలిపి, టెస్ట్‌ట్యూబును నీళ్లలో ఉంచితే, పాలనమూనా ఎర్రగామారితే ఈ విధమైన కల్తీ నిర్ధారణ అవుతుంది.
గంజి-పిండి వంటి పదార్థాలతో పాలు కల్తీ జరిగితే 5 మిల్లీ లీటర్ల పాలనమూనాకు ఒక చుక్క 0.1 శాతం అయొడిన్ ద్రావణం కలిపితే నీలంరంగు కనిపిస్తే ఈ రకమైన కల్తీల నిర్ధారణ జరుగుతుంది.
ఫార్మలిన్ కలిసిన పాలను గుర్తించుట: టెస్ట్‌ట్యూబ్‌లో 10 మిల్లీలీటర్ల నమూనాను తీసుకుని దానికి 5 మిల్లీలీటర్లు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని, కొంచెం ఫెర్రిక్ క్లోరైడ్‌ను కలిపి, కదల్చకుండా ఉంచితే కొంతసేపటికి ఊదారంగు లేదా నీలంరంగు వలయం రెండు ద్రవాల మధ్య కనిపిస్తే అది ఫార్మలిన్ కల్తీని నిర్ధారిస్తుంది.
యూరియా గుర్తింపు: టెస్ట్‌ట్యూబ్‌లో 5.0 మిల్లీలీటర్ల నమూనాను తీసుకొని దానికి సమాన పరిమాణంలో పి-డైమిథైల్ ఎమైనోబెంజాల్‌డిహైడ్ రియేజెంటును కలిపినప్పుడు స్పష్టమైన పసుపురంగుకు మారితే యూరియా ఆ నమూనాలో ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.
బోరిక్ పౌడరు, బోరాక్స్ గుర్తింపు: టెస్ట్‌ట్యూబ్‌లో 5 మి.లీ. నమూనాకు 1.0 మి.లీ. గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపి అందులో టర్మరిక్ పేపరును ముంచితే, ఆ పేపరురంగు పసుపు నుండి ఎర్రగా మారుతుంది.
డిటర్జంటును గుర్తించుట: టెస్ట్ ట్యూబులో 5.0 మి.లీ. పాల నమూనాను తీసుకొని దానికి 0.1 మి.లీ. 0.5% బ్రోయోక్రిసాల్ పర్సుల్ ద్రావణాన్ని కలిపినప్పుడు ఊదారంగు కనిపిస్తే అది డిటర్జంటు ఉనికిని స్పష్టం చేస్తుంది.
అధిక పాల దిగుబడికి, చేపుకు కొందరు పాలు పిండే ముందు చేపు ఇంజక్షను (ఆక్సిటోసిన్) అనే ఇంజక్షను ఇస్తారు. ఈ హార్మోను అవశేషాలు పాలద్వారా ప్రతిరోజూ అదే పాల మీద ఆధారపడే వినియోగదారుల ఆరోగ్యాలను పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇటువంటి అక్రమాలు మన దృష్టికి వస్తే స్థానిక వైద్యశాఖ/ఆహారకల్తీ నివారణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
నాణ్యమైన పాలపొడి, ద్రవరూపంలోని పాలలోని నీటిని, వెన్నను వివిధ శాస్త్రీయ మార్గాల ద్వారా తొలగిస్తేనే తయారవుతుంది. పాలను పొడి రూపంలో దీర్ఘకాలం నిల్వ చేసి, అవసరమైనప్పుడు స్టెరిలైజ్ చేసిన నీరు, పాశ్చురైజ్ చేసిన పాలు, వెన్ననూనె (బటర్ ఆయిల్)తో నిర్ణీత ప్రమాణాలలో కలుపుటను కల్తీగా భావించకూడదు. పాలలో సహజంగా ఉండవలసిన వెన్న, వెన్నకాని పదార్థాలు తప్ప, అన్యపదార్థాలు పాలలో కనిపించకూడదు.
పాలలోని వెన్న-వెన్నకాని పదార్థాల శాతాలను బట్టి పాలను స్కిమ్డ్‌మిల్క్ (వెన్న లేని పాలు) డబుల్ టోన్డ్ మిల్క్ 1.5 శాతం వెన్న, టోన్డ్ మిల్ (3.0 శాతం వెన్న) స్టాండర్డ్ మిల్క్ (4.5 శాతం వెన్న) హోల్ మిల్క్ (6.0 శాతం వెన్న) గా వివిధ డెయిరీలు వేర్వేరు ధరలకు విక్రయించుటను చట్టప్రకారం అనుమతించబడింది.
పైన పేర్కొన్న వివిధ కల్తీ గుర్తింపు పరీక్షలు మనకు కల్తీ జరిగినట్లు అనుమానించుటకు తప్ప నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు సరిపోవు. అనుమానితులపై జిల్లా కలెక్టరు, స్థానిక సంస్థ (పంచాయతీ-మున్సిపాలటీ, కర్పొరేషన్)ల అధికారులకు, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదును అవసరమైతే తాజా పాలనమూనాతో పాటు సమర్పించి చట్టపరంగా దోషుల్ని కోర్టు ఉత్తర్వుల ద్వారా శిక్షించవచ్చును.
డా. ఎం.వి.జి. అహోబలరావు, 9393055611
