ఈ వ్యాధిని గొంతువాపు అనే కాకుండా గురక వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి ఆవుల్లో కన్నా గేదెలలో ఎక్కువగా వస్తుంది. మరియు 2-3 సంవత్సరముల వయస్సు గల గేదెలలో తరచుగా వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి బారిన పడిన పశువులకు సరైన సమయములో చికిత్స అందించకపోతే 24-48 గంటలలో ఆ పశువు మరణించే అవకాశాలు ఎక్కువ.

వ్యాధి కారకము: ఈ వ్యాధి పాశ్చురెల్లా మల్టోసిడా మరియు పాశ్చురెల్లా హిమోలైటికా అనే గ్రామ్‌ నెగటివ్‌ బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలలో కలుగు ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన గ్రామాలలోనే అదే పశువుకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే వ్యాధికి సంబంధించిన సూక్ష్మక్రిములు ఆ గ్రామాల్లోని పాడి పశువుల యొక్క టాన్సిల్స్‌ మరియు నాసిగాగ్రస ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి. కాని వాతావరణ పరిస్థితులు సూక్ష్మక్రిములకి అనుకూలంగా లేకపోవడంలో ఈ వ్యాధి అనేది బయటపడదు.

ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు సడన్‌గా మారినప్పుడు, వేడి నుండి చల్ల వాతావరణంకి మారినప్పుడు మరియు భారీ వర్షాలు పడటం మరియు నీరు మరియు దాణా లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించటం, పాడి పశువుల శరీరంలో ఎక్కువ నట్టలు పెరగడం లేదా వేరే వైరల్‌ వ్యాధి వలన పశువు నిరోధకశక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు సూక్ష్మక్రిములు ఎక్కువగా వృద్ధి చెంది వ్యాధిని కలిగిస్తాయి. 

వ్యాధి వ్యాప్తి చెందు విధానం: వ్యాధి సోకిన పశువు యొక్క చొంగతో కలుషితమైన గడ్డి, నీరు మరియు గాలి ద్వారా ఆరోగ్యమైన పశుకు వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు:

  • అధిక జ్వరం – 106-107 డిగ్రీల ఫారెన్‌హీట్‌
  • నోటి నుండి చొంగ కారుతుంది.
  • పశువు యొక్క గొంతు, మెడ ముందుకాళ్ళ మధ్య భాగంలో నీరు చేరుతుంది.
  • ఊపిరితిత్తుల్లో నీరు ఎక్కువగా చేరడం వలన శ్వాస తీసుకోవడంలో గురక శబ్దం వస్తుంది.
  • సూక్ష్మక్రిములు ప్రేగులలో స్థిరపడి విషపదార్థాలను విడుదల చేయడం వలన పేడ పలుచగా పెడుతుంది.
  • పాల దిగుబడి తగ్గుతుంది.

చికిత్స:

  • లక్షణాలు చూపించిన తొలిరోజున పశువైద్యాధికారిని సంప్రదించాలి.
  • సల్ఫాడిమిడిన్‌ 150 మి.గ్రా./ కిలో బరువు చొప్పున నరానికి ఈ మందును ఇవ్వాలి. ఒక మూడు రోజుల పాటు వాడాలి.
  • అంతేకాకుండా సెప్టిమోఫర్‌ సోడియం వంటివి ఇవ్వడం వలన మంచి ఫలితం ఉంటుంది.
  • దాంతోపాటుగా ఎన్‌ఎస్‌ఏఐడిఎస్‌, యాంటిపైరెటిక్స్‌ మరియు వాపు (నీరు) తగ్గించటం కోసం ఫ్రుస్‌మైడ్‌ని ఇవ్వాలి.

నివారణ:

  • వ్యాధి సోకిన పశువును వేరుగా ఉంచి చికిత్సని అందించాలి.
  • అలాగే వ్యాధి సోకిన పశువు మేత, నీరు ఇతర పశువులకు ఇవ్వరాదు.
  • వ్యాధి సోకిన గ్రామాల్లో ప్రతీ ఏడాది వర్షాకాలం ఆరంభంలో ప్రతీ ఏడాదీ ఒక్కసారి టీకాలు ఇవ్వాలి. (జూన్‌ మొదటి వారంలో టీకాలను వేయించాలి)
  • వ్యాధి సోకిన గ్రామాల్లో పశువుల శాఖలో 0.5% ఫినాల్‌ను పిచికారి చేయడం వలన సూక్ష్మజీవులు మరణిస్తాయి.

డా. ఎం. వెంకట ప్రసన్న, వెటర్నరీ డాక్టర్‌, మైదుకూరు – 516172