భారతదేశంలో ప్రతి ఒక్కరూ వ్యవసాయ మూలల నుండి వచ్చిన వారే. ప్రతి ఒక్కరికీ వ్యవసాయంతో సంబంధాలు ఉండే ఉంటవి. వారో, వారి తండ్రో, వారి తాతా లేక వారి ముత్తాతో ఏవరో ఒకరు వ్యవసాయం చేసే ఉంటారు. అందుకే ఎవరో అన్నారు భారతదేశంలో ప్రతి ఒక్కరూ వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటారు. వ్యవసాయం గురించి మాట్లాడని భారతీయులు చాలా తక్కువగా ఉంటారు. అందువలననో ఏమోగాని ఎంతటి వారైనా ఏ రంగంలోని వారైనా, వారి వారి రంగంలో ఎంతో ఎత్తుకి ఎదిగిన వారైనా వారి మొక్క చివరి మజిలీగా వ్యవసాయం ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ ప్రముఖులు కె. చంథ్రేఖరరావు గారికి, నారా చంద్రబాబు నాయుడి గారికి వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖరరెడ్డి గారికి వ్యవసాయ క్షేత్రం ఉంది. వీరితోపాటు మనదేశంలో అనేకమంది రాజకీయ నాయకులకు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలితకి వ్యవసాయ క్షేత్రం ఉంది.
ప్రముఖ సినీనటులు పవన్‌కళ్యాణ్, ప్రకాష్‌రాజ్ మరియు తదితరులకు కూడా సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న జైన్ ఇరిగేషన్, రిలయన్స్, చందనబ్రదర్స్, అగ్రిగోల్డ్, శివశక్తి బయోటెక్… ఇలా చెప్పుకుంటూ పోతే ఇతర రంగాలలో ఉన్న చాలామందికి వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఈ విధంగా అన్ని రంగాలలో ఉన్నవారు చాలా మంది వ్యవసాయంతో సంబంధాలు కలిగి ఉన్నారు. అదే విధంగా ఉద్యోగాలలో ఉన్నవారు కూడా పదవీ విరమణ తరువాత మరి కొంత మంది ఉద్యోగాలు కొనసాగిస్తూ కూడా వ్యవసాయం చేసేవారు మనకు తారసపడడము మామూలే. మనదేశంలో ఎక్కువమంది యువతరం తమ లక్ష్యంగా ఎంపిక చేసుకునే రంగం సాఫ్ట్‌వేర్. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా విసిగివేసారిపోయిన యువత ఆ రంగం నుంచి వ్యవసాయరంగం వైపు అడుగులు వేయడం, అదీనూ సేంద్రీయ వ్యవసాయం చేయటానికి ముందుకు రావటం సర్వసాధారణమైన విషయం అని అందరికీ తెలిసిందే. కారణము ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరియొక్క చివరి మజిలీ వ్యవసాయం. అదీనూ ఈ మధ్య కాలంలో అయితే సేంద్రియ వ్యవసాయం అనేది అర్థమవుతుంది. అదేకోవకు చెందినవారు సుకవాశి హరిబాబు.
గుంటూరు జిల్లా, తెనాలి ప్రాంతానికి చెందిన హరిబాబు తెనాలి వి.యస్.ఆర్. కాలేజీలో బి.కామ్. పూర్తి చేసి ఎం.కాం.లో చేరి కొన్ని అనివార్య కారణాల వలన ఎం.కాం. మధ్యలోనే ఆపివేయటం జరిగింది. తెనాలి వి.యస్.ఆర్. కాలేజీలో చదువుకునే రోజులలో విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు.
చదువు అవగానే హైదరాబాద్ వెళ్ళి కొంతకాలం, కొన్ని ప్రభుత్వశాఖలలో కాంట్రాక్టరుగా వ్యాపారం చేయటము జరిగింది. పరిస్థితులు అనుకూలించక వ్యాపారాన్ని మానివేసి కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన వ్యాపారం చేయటము జరిగింది. ఇందులో కూడా హరిబాబు ఇమడలేకపోయారు. ఈ రెండు వ్యాపారాలలో ఇమడలేకపోవటానికి ప్రధాన కారణం ప్రభుత్వ శాఖలలో ఉన్న అవినీతే అని హరిబాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు. తరువాత కొన్ని సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఫైనాన్సియర్‌గా వ్యాపారం చేశారు. ఇందులోను ఇమిడలేక సొంతంగా బుల్లితెర సీరియల్స్ నిర్మించడం జరిగింది. 600 ఎపిసోడ్‌ల సీరియల్స్ ‘జీవన తీరాలు’ మరియు ‘జీవన సంధ్య’లను నిర్మించినందుకుగాను ఈ రెండు సీరియల్స్‌కు వరుసగా మూడు సంవత్సరాలలో రెండింటికి కలిపి 6 నంది అవార్డులు అందుకుని హ్యాట్రిక్ సాధించిన ఘనుడు హరిబాబు. అదే సమయములో ‘కలహాల కాపురం’ అనే సీరియల్ కూడా నిర్మించి జెమిని టి.వి. ద్వారా ప్రసారం చేయటము జరిగింది.
ఎన్నిరకాల వ్యాపారాలు చేసినా, సేవారంగంలో, సినీ, బుల్లితెర రంగంలో ఉన్నా కూడా తన వ్యాపకం అయిన వ్యవసాయాన్ని మాత్రం వదలకుండా హైదరాబాదు గచ్చిబౌలిలో 2 ఎకరాలలో సుమారు 30 రకాల పండ్ల మొక్కలను 1987 నుంచి 2005 వరకు పెంచటము జరిగింది. ఆ సమయంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ రకాల మొక్కలను సాగుచేసిన అనుభవంతో 2013 మరియు 2014 సంవత్సరాలలో హైదరాబాదు శివారు మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామంలో 10 ఎకరాల భూమిని కొనుగోలుచేసి వెంటనే వివిధ రకాల మొక్కల పెంపకం చేపట్టారు. ఇక్కడ వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుండి 2015 డిసెంబరు వరకు రసాయనాలను ఉపయోగిస్తూ వచ్చారు. 2015 డిసెంబరులో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని గురించి తెలుసుకోవటము జరిగింది. వెంటనే రసాయన వ్యవసాయాన్ని మానివేసి ప్రకృతి వ్యవసాయాన్నే చేయాలని నిర్ణయం తీసుకొని ఆవులను పోషిస్తూ 2016 జనవరి నుండి రసాయనాలను ఉపయోగించటము మానివేసి ప్రకృతి వ్యవసాయం చేయటము మొదలు పెట్టడము జరిగింది. జీవామృతం చేసుకోవటానికి తోట మధ్యలో పెద్ద సిమెంట్ తొట్టెలను ఏర్పాటు చేసుకొని అందులో తయారు చేసుకొన్న జీవామృతాన్ని మొక్కలకు అందిస్తున్నారు. జీవామృతంతో పాటు వివిధ రకాల నూనెలను కూడా కలుపుకుని మొక్కలకు అందిస్తున్నారు. మొత్తం 10 ఎకరాలలో ఉన్న వివిధ రకాల మొక్కలను పొలంలో ఉన్న ఒకే ఒక్క 2 అంగుళాల నీటి సామర్థ్యం గల బోర్‌వెల్‌తో పండించటం జరుగుతుంది.
రైతులు అధిక ఆదాయం పొందాలంటే దేశంలో ఉన్న అవినీతి మరియు దళారీ వ్యవస్థ అంతం అవటంతోపాటు రైతులు కూడా వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంలో ఇంటెన్సివ్‌గా చేయాలి. అప్పుడే రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలడు అని హరిబాబు అభిప్రాయపడ్డారు. ఎవరు ఎన్ని గొప్పగొప్ప వృత్తులలో ఉన్నాకూడా చివరిగా సేదతీరేది మాత్రం వ్యవసాయంలో అనేది ఎంతోమంది అనుభవాలు చెప్పకనే చెబుతున్నవి. నేను కూడా వ్యాపారరంగం, సినీ రంగం, రాజకీయ రంగం, బుల్లితెర రంగం, వ్యవసాయ రంగం మరియు సామాజిక సేవారంగం అన్నింటిలో అనుభవం గడించాను. కానీ చివరిగా వ్యవసాయ రంగంలోనే ప్రస్తుతము తృప్తిగా సేదతీరటం జరుగుతుంది. నా అనుభవం నేర్పిన పాఠం ఏమిటంటే మనషులను నమ్ముకోవటం కంటే మొక్కలను నమ్ముకోవటమే ఉత్తమం. అందుకనే తాను వివిధ రకాల మొక్కలను పెంచుతున్నాను అనే అభిప్రాయంలో హరిబాబు ఉన్నారు.

వివిధ రకాల మొక్కల పెంపకం…
ఎక్కువ రకాల మొక్కలను పెంచడంలో బహుశా హరిబాబుకు ఎవరూ సాటి ఉండకపోవచ్చు. తన 10 ఎకరాల పొలములో అటవీ మొక్కలైన టేకు, ఎర్రచందనం, శ్రీగంధం, సిల్వర్‌ఓక్, పహజన్, రోజ్‌ఉడ్, ఔషధ మొక్కలైన శతావరి, అశ్వగంధ, బిళ్ళగన్నేరు, రుద్రాక్ష, మారేడు, వేప, తులసి, అడ్డసర, కలబంద, నేలవేము, మాసపత్రి, సుగంధద్రవ్య మొక్కలైన లవంగం, బిర్వాని ఆకు, దాల్చిన చెక్క, యాలకలు, జాజికాయ, మిరియాలు, తమలపాకు మరియు పండ్ల మొక్కలైన లిచి, మామిడి, పనస, సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, నారింజ, సపోట, దానిమ్మ, జామ, డ్రాగన్‌ఫ్రూట్, వివిధరకాల చెర్రిమొక్కలు, రంబూటన్, జబోడిక, కొబ్బరి, అరటి మరియు చెరకు, వాక్కాయ, కూరగాయలతోపాటు ఇంకా అనేక రకాల మొక్కలను పెంచుతున్నారు. వివిధ రకాల మొక్కలను అందుబాటును బట్టి కర్నాటకలోని మడికెరి, అగుంబే, శృంగేరి, బెంగుళూరు, కేరళలోని కేసర్‌గౌడ్, త్రిచూర్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కడియంలనుంచి సేకరించాడు.
హరిబాబు సాగుపట్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి పెరిగింది. ఎందరో వారి క్షేత్రాన్ని సందర్శిస్తూ, వారి విధానాల గురించి తెలుసుకుంటున్నారు. ఆ దిశగా మేము కూడా ప్రయాణిస్తామని ప్రతిజ్ఞ చేయటం ఓ శుభ పరిణామం.
జీవామృతం, నూనెల మిశ్రమం
తయారీ మరియు వాడకం
200 లీటర్ల సామర్థ్యంగల ప్లాస్టిక్ డ్రమ్ములో 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కిలోల ఆవుపేడ, 2 కిలలో బెల్లం, 2 కిలోల ఉలవ పిండి, 1 కిలో గట్టు మట్టి మరియు వివిధ రకాల నూనెల మిశ్రమము 1 1/2 కిలోలు, మిగిలినది నీరు పోసుకొని మొత్తం కలిపి 2,3 రోజులు నిల్వ ఉంచిన తరువాత చెట్టు వయస్సును బట్టి ఒక్కొక్క చెట్టుకు 2 నుంచి 5 లీటర్ల చొప్పున 15 నుంచి 20 రోజులకు ఒకసారి అందిస్తుంటారు. అదే దాషామాలో ఎక్కువ మొత్తంలో జీవామృతాన్ని పెద్ద సిమెంటు తొట్టెల్లో కూడా తయారుచేసుకుంటూ ఉంటారు.
నూనెల మిశ్రమం : వేపనూనె 15 కిలోలు, చేప నూనె 5 కిలోలు, పత్తి నూనె 15 కిలోలు, కొబ్బరి నూనె 15 కిలోలు, వేరుశనగ నూనె 15 కిలోలు, అవనూనె 15 కిలోలు, ప్రొద్దుతిరుగుడు నూనె 15 కిలోలు, సీతాఫలం విత్తనాల నూనె 5 కిలోలు, తవుడు నూనె 15 కిలోలు, కుసుమ నూనె 15 కిలోలు మరియు నువ్వుల నూనె 15 కిలోలు. ఈ నూనెలన్నింటిని కలిపి నూనెల మిశ్రమం తయారు చేసుకొని 9 కిలోల ఈ నూనెల మిశ్రమానికి 1 లీటరు ఎమల్సిఫైర్ కలుపుకుని ఉపయోగిస్తుంటారు.
సుకవాశి హరిబాబు Cell: 8985753339
హైదరాబాద్

