దేశంలో అన్ని వర్గాల ప్రజలు వారి భవిత కోసం, ప్రగతి కోసం ఆరాటపడుతున్నారు. అప్పుడప్పుడు విధిలేని పరిస్థితుల్లో రోడ్లు ఎక్కి ఆందోళనలకు దిగుతున్నారు. వారి హక్కులు అనండి లేదా వారి సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తూ కొన్నిసార్లు విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే మరోవైపు ఆరుగాలం కష్టించి తన చెమట చుక్కలను ఆహార రంగంలో దేశ స్వయం సమృద్ధికోసం అహర్నిశలు రైతులు తమ జీవితాలను ధారపోస్తున్నారు. అకాల వర్షాలకు నోటికాడ పంట నాశనం అయినా చీడపీడలతో దిగుబడులు, వాటి నాణ్యత దెబ్బతిన్నా, తనను తాను ఓదార్చుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు.
ప్రతి థలో వారికి ఎదురీతే. ఇటీవల కురిసిన అకాల వర్షాలు దెబ్బతీశాయి. పంట దిగుబడి వచ్చినా, మార్కెట్ కనికరించక ఇబ్బందులే. ఎన్ని పథకాలు అండగా ఉన్నా, భరోసా అనుకున్నా అనుకున్న ఫలితం రాక వ్యవసాయం గిట్టబాటు కావటం లేదు. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నది, ఉండేది రైతులోకం ఒక్కటే. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆచరణలో మాత్రం ఒరిగేది ఏమీ లేదు సుమా. ఇతరరంగాల సమస్యలను అధిగమించటానికి జరుగుతున్నంత కృషి, ప్రయత్నం, మేధో మథనం రైతు దిశగా సాగకపోవటం శోచనీయం. అయినా ఏనాడూ రైతు తన పని మానుకోలేదు. తన శక్తియుక్తులను కూడదీసుకుని నిరంతరం ఒక పంటకాలం తరువాత మరో పంటకాలం గురించి ఆలోచిస్తూ, దేశ భవిష్యత్‌కు భరోసాగా ఉంటున్నారు. తను కృంగి, కృశించిపోతున్నా దేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఇంతెందుకు… కాలం కలిసి రాలేదు. ప్రకృతి అండగా లేదు. అంతా సమస్యల వలయమే. ఎవ్వరూ రాకపోయినా ఉన్న వనరులతో మంచి దిగుబడులు సాధించి దేశ లక్ష్యాలను సాధించారు. అందుకు నిదర్శనమే నిన్నగాక మొన్న కేంద్రం తాజాగా ప్రకటించిన అంచనాలు. దాదాపు అన్ని పంటలలో అంచనాలకు మించి ఉత్పత్తి వస్తుందని నిగ్గు తేల్చారు. అంటే రైతులు ప్రభుత్వ అంచనాలను మించి అదరగొట్టినట్లే కదా! ఇది వారికి ఎప్పుడూ అలవాటే. థాబ్దాలుగా వారి రికార్డ్స్‌ను వారే తిరిగి రాస్తున్నారు. అయితే వారి కృషికి త్యాగానికి తగిన న్యాయం జరగకపోవటమే పెద్ద విషాదం.
ఇన్ని అపశ్రుతులు, అవరోధాలు ఎదురైనా రైతులు వారి శక్తియుక్తులుతో ఎదుర్కొని ఉత్పత్తి సాధిస్తున్నారు లక్ష్యాలకు అనుగుణంగా. కరోనా సమయంలో కూడా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ఆదుకుంది. అన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా దేశానికి అండగా నిలిచారు. నిలుస్తున్నారు కూడా. కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022-23 తిండిగింజల ఉత్పత్తి లక్ష్యం 288.31 మిలియన్ టన్నులు కాగా, సవరించిన అంచనాల ప్రకారం 303.3 లక్షల టన్నులు.. అలానే ఇతర వాటిలో కూడా…

దీనిని బట్టి అర్థమయ్యే విషయం ఒక్కటే మనం అంతా జైకిసాన్ అంటూ వారికి మద్దతుగా, వారి సంక్షేమం కోసం పని చేయాలి. వారి బాగుకోసం పాటుపడాలి. వారు విశ్రమిస్తే దేశం మొత్తం దివాళానే అన్న సంగతి మరచిపోకూడదు. ‘జైకిసాన్ జైకిసాన్ జైకిసాన్’ నినాదం మరోసారి దేశమంతా మార్మ్రోగాలి. వారిని రక్షించుకోవటం మన అందరి బాధ్యత.
– వెంకటేశ్వర రావు

