జత కలిపే (బ్రీడింగ్‌) సమయంలో 

విత్తనపు పొట్టేలును / పోతును సంసిద్ధం చేయుట

‘విత్తనపు పొట్టేలు మందకు సగం బలం’ అనే నానుడి ఉంది. అంటే గొర్రెల మంద త్వరగా అభివృద్ధి చెంది, తద్వారా గొర్రెల కాపరికి ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. మందలో సంతానోత్పత్తికి పనికిరాని పొట్టేళ్లు ఉండడము వలన, సరైన సంఖ్యలో పొట్టేళ్ళు లేకపోవడం వలన మంద అభివృద్ధి కుంటుపడుతుంది.

విత్తనపు పొట్టేలు సామర్థ్యమును ఆ పొట్టేలు ఉత్పత్తి చేసే వీర్య పరిమాణము వీర్యం యొక్క నాణ్యత మరియు వీర్యాన్ని ఆడ గొర్రెలలో ప్రవేశపెట్టడముపై ఆధారపడి ఉంటుంది. విత్తనపు పొట్టేలు యొక్క సామర్థ్యానికి రుజువు వాటి ద్వారా జన్మించే గొర్రె పిల్లలు.

విత్తనపు పొట్టేలు వలన కలిగే ప్రయోజనాలు:

  • మంచి లక్షణాలు కలిగిన విత్తనపు పొట్టేలు వలన పుట్టే గొర్రె పిల్లలు అధిక బరువును కలిగి, తక్కువ శాతము మరణాల బారిన పడతాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి.
  • కవల పిల్లలు పుట్టే అనువంశిక లక్షణాలు ఉన్న జాతి విత్తనపు పొట్టేలును ఉపయోగించిన పుట్టే పిల్లలలో కవలలు పుట్టే లక్షణాలు కలిగి మంద అభివృద్ధికి తోడ్పడుతుంది.
  • ఒక గొర్రె లేదా మేక 2 సంవత్సరాలలో 3 ఈతలు ఈనడం వలన జీవాల పెంపకము లాభసాటిగా ఉండాలంటే మందలో తగినన్ని సంఖ్యలో పొట్టేళ్లు ఉండాలి.

విత్తనపు పొట్టేలు ఎంపికలో తీసుకోవలసిన సూచనలు:

  • గొర్రెల మందలో ప్రతి 20 లేదా 25 గొర్రెలకు ఒక విత్తనపు పొట్టేలు లేదా పోతు ఉండాలి. సాధారణంగా ఒక పొట్టేలు 2 లేదా 3 గొర్రెలను ఒక రోజులో దాటుతుంది. (జత కలుస్తుంది) ముఖ్యంగా ఎక్కువ శాతం (70%) గొర్రెలు వర్షాకాలంలో (జూన్‌-జూలై నెలల్లో) ఎదకు వస్తాయి. ఆ సమయంలో విత్తనపు పొట్టేళ్ల సంఖ్య తక్కువగా ఉంటే జత కలిసే అవకాశం మరియు చూలు నిలిచే అవకాశం తక్కువగా ఉంటుంది.
  • మందలో పుట్టిన పొట్టేలుపిల్లనే విత్తనపు పొట్టేలుగా కాపరులు ఎంపిక చేసుకుంటారు. దీని వలన పుట్టే పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుట్టడం, పెరుగుదల లోపించడం అనువంశిక జబ్బులతో పుట్టడం జరుగుతుంది.
  • మందలో ఒక విత్తనపు పొట్టేలును 3 సంవత్సరాల కన్నా ఎక్కువ రోజులు ఉంచిన, తన రక్త సంబంధికులైన గొర్రెలను దాటడం వలన పుట్టే పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుడతాయి.
  • విత్తనపు పొట్టేలుగా 2-21/2 సంవత్సరాల వయసు ఉన్న పొట్టేళ్లను ఎన్నుకోవాలి. ఆ విధంగా ఎంపిక చేసుకున్నచో 21/2-5 సంవత్సరాల వరకు బాగా జత కలిసి చూలు కడతాయి. 2 సంవత్సరాల లోపు వయసున్న పొట్టేలు జత కలిసినా వీర్య నాణ్యత సరిగా ఉండకపోవడం వలన చూలు కట్టే శాతం తక్కువగా ఉంటుంది. 6 సంవత్సరాల పైబడిన పొట్టేళ్లలో జత కలిసే ఆసక్తి తగ్గి, చూలు కట్టే శాతం తక్కువగా ఉంటుంది. కావున 2-21/2 సంవత్సరాల పొట్టేళ్లను ఎన్నుకోవాలి. 5-6 సంవత్సరాల తరువాత వాటిని మంద నుండి తీసివేయాలి.
  • కవల పిల్లలలో ఒకటైన పొట్టేలు పిల్లను విత్తనపు పొట్టేలుగా ఎన్నుకుంటే, కవలలు పుట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి.
  • మంచి జాతులైన పెరుగుదల ఎక్కువగా ఉండి, తొందరగా కోత వయసు వచ్చే జాతులైన నెల్లూరు, మాండ్యా, మేకలయితే బోయర్‌/బీటిల్‌/ఉస్మానిబాదీల పొట్టేలు/పోతులను ఎన్నుకోవాలి.
  • విత్తనపు పొట్టేలు యొక్క పుట్టిన బరువును, పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • విత్తనపు పొట్టేలు ద్వారా పుట్టిన పిల్లల పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలి.

విత్తనపు పొట్టేలు భౌతిక/శారీరక లక్షణాలు:

  • ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలి. ఎటువంటి అంటువ్యాధులు ఉండకూడదు.
  • కాలిగిట్టలు బలంగా ఉండాలి. కాలిగిట్టల వాపు, గాయాలు ఉండకూడదు.
  • మోకాళ్ళు, భుజాలు, కాలి పిక్కలు, తొడలు బలంగా ఉండి కండపుష్టి కలిగి ఉండాలి.
  • పొట్టేలు యొక్క శరీర స్థితి (బాడీ స్కోరింగ్‌ 3-3.5) మంచిగా ఉండాలి. బలహీనంగా ఎక్కువ కొవ్వు పట్టి ఉండకూడదు.
  • మెడ భాగం బలిష్టంగా ఉండాలి.
  • నడుము, వీపు భాగము బాగా విస్తరించి బలంగా ఉండాలి.
  • ప్రక్కటెముకలు బాగా అభివృద్ధి చెంది ఉండాలి. 
  • దంతాలు, కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి.
  • వృషణాలు పెద్దవిగా, ఎక్కువ చుట్టుకొలత (32 సెం.మీ. కన్నా ఎక్కువ) ఉండాలి. అంటే దాదాపు / గ్రాము కణజాలము నుండి 20 మిలియన్ల వీర్యకణాల ఉత్పత్తి అవుతాయి. కాబట్టి 32 సెం.మీ. కన్నా ఎక్కువ చుట్టుకొలత ఉన్నట్లయితే ఎక్కువ స్కలించే వీర్య పరిమాణము, వీర్య నాణ్యత కలిగి ఉంటాయి.
  • వృషణాల చుట్టూ ఉండే చర్మము (స్క్రోటమ్‌) వృషణాలు అతుక్కొని, దగ్గరగా ఉండాలి. వదులుగా ఉండరాదు.
  • వృషణాలు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసవి నందు శరీరానికి దూరంగా, చలికాలం నందు శరీరానికి దగ్గరగా ఉండాలి.
  • విత్తనపు పొట్టేలు ఎద లక్షణాలు గుర్తించగలిగి, ఆడ గొర్రెలను దాటుటకు (జత కలుపుటకు) ఆసక్తి చూపాలి.

విత్తనపు పొట్టేలు / పోతును జత కలిపే సమయానికి ముందు సంసిద్ధము చేయుట

బ్రీడింగ్‌ సమయం ముందు విత్తన పొట్టేలు ఆరోగ్యంగా, సంతానోత్పత్తికి సిద్ధంగా ఉండడము వలన ఎక్కువ శాతం గొర్రెలు చూలు నిలిచి, రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కావున పొట్టేలును 30-60 రోజుల ముందు భౌతికంగా పరీక్షించి, ఎటువంటి పద్ధతులు పాటించాలో కాపరులు తెలుసుకోవాలి.

సాధారణ ఆరోగ్యం: చురుకుగా ఉండాలి. మేత బాగా తీసుకోవాలి. నెమర బాగా వేయాలి. ఎటువంటి గాయాలు చీము గడ్డలు ఉండకూడదు.

అనారోగ్య లక్షణాలు: అసాధారణంగా ప్రవర్తన, నడక, పడుకోవడం లాంటివి ఉన్నప్పుడు తగిన చికిత్స చేయించడం, దగ్గు, జ్వరం, విరేచనాలు లాంటి అనారోగ్య లక్షణాలు ఉంటే గమనించి వైద్యం చేయించాలి.

వ్యాధి నిరోధక చర్యలు చేపట్టడం:

  • అంటువ్యాధులు సంభవించకుండా, టీకాలు ఇవ్వడం
  • గర్భస్రావాలు కలిగించే వ్యాధులైన బ్రూసెల్లోసిస్‌, విబ్రియోసిస్‌, ట్రైకొమోనియాసిస్‌ లాంటి వ్యాధులు లేకుండా చూసుకోవాలి.
  • బ్రీడింగ్‌ సీజన్‌ ముందే అంతర, బాహ్య పరాన్నజీవులను నిర్మూలించి పొట్టేలు ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవాలి.
  • బ్రూసెల్లోసిస్‌ లాంటి వ్యాధులు ఉన్నచో ఆ పొట్టేలును మంద నుండి తీసివేయాలి.

శరీర స్థితి (బాడీ స్కోరింగ్‌): మంచి శరీరస్థితి (బాడీ స్కోరింగ్‌ 3-4) ఉండాలి, బలహీనంగా లేదా ఎక్కువ కొవ్వు పట్టి ఉండకూడదు.

కళ్ళు మరియు కంటి శ్లేష్మ పొరలు: 

  • కంటిచూపు ఉందో లేదో పరీక్షించాలి. కళ్ళ నుండి నీరు కారడము, అనువంశిక కంటి సంబంధ (ఎంటిరోపియాన్‌ లాంటి) సమస్యలు ఏమైనా ఉన్నచో చికిత్స చేయించాలి.
  • కంటిలోని శ్లేష్మ పొరలు గులాబి రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు, పాలిపోయి, ఎర్రగా కంది ఉన్నట్లయితే అనారోగ్యంగా ఉన్నట్టు. శ్లేష్మ పొరలు వాపు ఉండకూడదు.
  • ఉన్ని జాతులైతే కళ్ళ చుట్టూ ఉన్నిని కత్తిరించాలి.

దంతాలు: దంతాలు పరీక్షించి వయసును నిర్ధారించుకోవాలి. దంతాలు ఊడిపోయిన (గమ్మర్స్‌) పొట్టేళ్లను తొలగించాలి.

మెడ మరియు తలను పరీక్షించాలి: గజ్జి క్రిములు, నీలినాలుక వలన నాలుక వాపు, కంటేజియస్‌ ఎక్తిమా (మూతి పుండ్లు, నాసల్‌ బాట్‌) లాంటి వ్యాధులు ఉన్నాయేమో పరీక్షించుకోవాలి.

కాళ్ళు మరియు కాలి గిట్టలు:

  • గిట్టలు ఆరోగ్యంగా ఉండి, ఎక్కువ పెరిగిన వాటిని కత్తిరించాలి.
  • గిట్టలు మధ్య భాగంలో ఏవైనా పుండ్లు గాయాలు ఉన్నాయో పరీక్షించాలి.
  • కాలి గిట్టల పుండ్లు (ఫుట్‌ రాట్‌, ఫుట్‌ స్కాల్డ్‌, గాలికుంటు) లాంటి వ్యాధులను నివారించాలి.
  • గిట్టలు ఆరోగ్యంగా ఉండి కుంటుబడకుండా ఉండే పొట్టేలు బాగా జత కలుస్తుంది.
  • కాళ్ళ నొప్పులు, కుంటుతూ ఉండడం గమనించి వైద్యం చేయించాలి.

ఉన్నిని కత్తిరించడం: ఉన్నినిచ్చే జాతులలో కళ్ళు చుట్టూ, పురుషాంగం చుట్టూ ఉన్నిని, శరీరంపైన ఉన్న ఉన్నిని బ్రీడింగ్‌ సీజన్‌ ముందు కత్తితరించాలి.

పురుషాంగం, పురుషాంగం చుట్టూ ఉన్న చర్మం: 

  • పురుషాంగం యొక్క శ్లేష్మమును పరీక్షించాలి.
  • పురుషాంగము చుట్టూ ఉన్న చర్మము వాపుకు గురై వ్యాధి కలిగి ఉన్నట్లయితే దీనిని ”ఫిజిల్‌ రాట్‌” అంటారు. చికిత్స చేయించాలి. సంభోగ సమయంలో నొప్పి కలిగి ఉంటుంది.
  • యురేత్రాను పరీక్షించాలి. 

వృషణాలు:

  • వృషణాలు రెండు సమాన పరిమాణము కలిగి ఉండాలి.
  • వృషణాలు మెత్తగా లేదా గట్టిగా లోపల గడ్డలు ఉండకూడదు.
  • నొక్కి చూసినప్పుడు దృఢంగా ఉండాలి.
  • వృషణాలు గాయాలు బారిపడి ఉండకూడదు, గాయాల నుండి కోలుకున్నను వీర్యోత్పత్తి తక్కువగా ఉంటుంది.
  • వృషణాలు శరీరం లోపల (క్రిప్టార్కిడ్‌) ఉన్న పొట్టేలును తీసివేయాలి.
  • వాపుకు గురి కాకూడదు, వాపుకు గురైనచో మంద నుండి తీసివేయాలి.
  • వ్యాధి కలిగి ఉన్నచో 2-3 వారాల పాటు వీర్య ఉత్పత్తిపై ప్రభావము చూపి, తక్కువగా ఉంటుంది.

ఎపిడిడమస్‌: వృషణాలు క్రింది భాగాన పరీక్షించిన బుడిపెలాంటి నిర్మాణం ఉంటుంది. దీనినే ‘ఎపిడిడమస్‌’ అంటారు. ఇది వాపునకు గురైనట్లయితే బ్రూసెల్లా వ్యాధి వలన వాపు కలిగినట్లు నిర్ధారణ అయితే పొట్టేలును మంద నుండి తీసివేయాలి.

వీర్యం: వీర్యం నీరు లాగా ఉంటే వంద్యత్వం ఉండే అవకాశం ఉంటుంది. వీర్యం ”క్రీమ్‌” రంగు ఉంటే వీర్య నాణ్యత బాగుంటుంది.

  • విత్తనపు పొట్టేలు మందలో ఉంచడం వలన పొట్టేలు యొక్క వాసన, శబ్దం మరియు పొట్టేలును చూడడం వలన ఎక్కువ శాతం గొర్రెలు ఎదకు వచ్చి చూలు కడతాయి. దీనినే పొట్టేలు ప్రభావం అంటారు.
  • విత్తనపు పొట్టేలును బ్రీడింగ్‌ సీజన్‌నకు 2-3 నెలలు ముందు మంద నుండి వేరు చేసి అకస్మాత్తుగా మందలోనికి తీసుకు రావడం వలన 70-80% గొర్రెలు ఎదకు వస్తాయి. దీనినే ”టెలిస్కోపింగ్‌” అంటారు.
  • యుక్త వయసుకు వచ్చిన కొత్త విత్తనపు పొట్టేళ్లను ఈతలు ఈనిన పాత గొర్రెలతో జత కలపవలెను.
  • అనుభవం ఉన్న పాత విత్తనపు పొట్టేళ్లుతో యుక్త వయసుకు వచ్చిన గొర్రెలను దాటించాలి.
  • ఎక్కువ వయసు (6 సం|| పైబడి) ఉన& పొట్టేళ్ల యందు బ్రూసెల్లోసిస్‌ వ్యాధి ఉండే అవకాశం ఉంది కావున వాటి రక్త నమూనాలు పరీక్షించి వ్యాధి ఉన్నవాటిని తీసి (ఏరి) వేయాలి. ఒక మంద నుండి ఇంకొక మంద వారు పొట్టేలు మార్పిడి చేసుకునే సమయంలో బ్రూసెల్లా లాంటి వ్యాధులు లేవని నిర్ధారణ చేసుకోవాలి.
  • అనువైన వాతావరణ పరిస్థితులు కల్పించాలి. శరీర ఉష్ణోగ్రత కన్నా వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వీర్య ఉత్పత్తిపై ప్రభావం ఉంటుంది. కావున వేడి నుండి కలిగే ఒత్తిడిని తట్టుకొనే విధంగా చర్యలు చేపట్టాలి.

పోషణ:

  • పోషణ అనునది పొట్టేలు లేదా పోతు యొక్క శరీర స్థితిని ప్రభావితం చేస్తుంది. పోషణ లోపం వలన బలహీనంగా ఉన్న పొట్టేలు జత కలుపుటకు ఆసక్తి చూపదు. శక్తి తక్కువగా ఉండడం వలన వీర్య నాణ్యత తక్కువుండి చూలు కట్టే శాతం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా బలసిన పొట్టేళ్ళు చురుకుగా ఉండక జత కలిసేందుకు ఆసక్తి చూపవు.
  • బ్రీడింగ్‌ సీజన్‌ 2 నెలల ముందు పొట్టేలు 12% మాంసకృత్తులు కలిగిన 250 గ్రాముల దాణా లేదా 500 గ్రాములు కాయజాతి ఎండు గడ్డిని ఇవ్వాలి. ఈ విధంగా పోషించిన జత కలిసే సమయంలో వృషణాలు చుట్టుకొలత పెరిగి వీర్యోత్పత్తి అధికంగా ఉంటుంది.
  • పచ్చిక బయళ్ళు మేసే మందలలో బ్రీడింగ్‌ సీజన్‌ తరువాత పొట్టేళ్ళు దాదాపు 15% శరీర బరువును కోల్పోతుంది.
  • బ్రీడింగ్‌ సీజన్‌ ముందు విత్తనపు పొట్టేలుకు విటమిన్‌ ఏ, డి, ఇ లు ఇవ్వాలి.        దీ

డా. వి. రామచంద్రారెడ్డి, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశుసంవర్థక శిక్షణా కేంద్రం, రెడ్డిపల్లి, అనంతపురం జిల్లా.