గతాన్ని ఒక్కసారి గమనించినట్లయితే రైతు కుటుంబానికి చెందిన వారిలో చాలామంది ఉన్నత చదువులు చదివి వ్యవసాయ రంగాన్ని వీడి ఉద్యోగ, వ్యాపార రంగాలకు వలసలు వెళ్ళారు. ఇంకా వెళుతున్నారు. కాబట్టే వ్యవసాయ రంగం మీద ఆధారపడే జనాభా తగ్గుతూ వస్తుంది. కాని రెండోవైపు పరిశీలించినట్లయితే అంతకు మునుపే వ్యవసాయరంగాన్ని వీడి ఉద్యోగ, వ్యాపార రంగాలకు వలసలు వెళ్ళినవారిలో కొంతమంది ఆర్థికంగా బలపడిన తరువాత తిరిగి వ్యవసాయరంగం వైపు తమ అడుగులు వేస్తున్నారు. దాని పర్యవసానమే ఇటీవల కాలంలో ఉద్యోగ రంగం నుండి ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ రంగం నుండి వ్యవసాయరంగం వైపు అదీను సేంద్రియ వ్యవసాయ రంగం వైపు కొంతమంది అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. నల్లగొండ జిల్లా, కనగల్లు మండలం నరసింహపురం గ్రామానికి చెందిన జల్లా పుండరీకం ఇదే దారిలో నడిచి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయరంగంలోకి అడుగు పెట్టాడు.

వ్యవసాయ నేపథ్యానికి చెందిన పుండరీకర ఉన్నత చదువులు చదివి ఉద్యోగ రంగంలో ప్రవేశించి 20 నుంచి 25 సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో పలు దేశాలతో పాటు మన దేశంలోని ప్రముఖ నగరాలలో కూడా తన ఉద్యోగ సేవలు అందించవలసి వచ్చింది. మంచి జీతంతో విలాసవంతమైన సౌకర్యాలతో కుటుంబంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఏదో అసంతృప్తి మనసులో కలిగి తమ అసంతృప్తికి సరైన పరిష్కారం వ్యవసాయరంగం అని తెలిసి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయంలో అడుగు పెట్టడం జరిగింది. తమ అంతిమ లక్ష్యం వ్యవసాయం అని గ్రహించి వెంటనే తమకు అనుకూలమైన పంట, అంటే అప్పటి వరకు మట్టి వాసనకు దూరంగా ఎసి గదులకు పరిమితమై ఉద్యోగాలు చేశారు కాబట్టి అలాంటి సౌకర్యాలను వదలి నేరుగా మట్టిలో కాలుపెట్టి 365 రోజులు శారీరక శ్రమ చేయడం కొంత ఇబ్బందిగా ఉండవచ్చు అని భావించి తమకు అనుకూలమైన పంటల కొరకు పరిశీలించి, పరిశోధించి తమ జీవన శైలికి అనుకూలమైన పంట మల్బరీ తోట పెంపకం, దానికి అనుసంధానంగా పట్టు పురుగుల పెంపకం సరైనదారి అని నమ్మి 2015వ సంవత్సరములో అటువైపు అడుగులు వేశారు. పట్టు పురుగుల పెంపకంలో రెండు విభాగాలు ఉంటాయి. అవి మల్బరీ తోట పెంపకం మరియు పట్టు పురుగుల పెంపకం. ఈ రెండింటి గురించి పుండరీకం అందించిన వివరాలు…

మల్బరీసాగు: మల్బరీలో అనేక రకాలు ఉన్నా కాని పట్టుపురుగుల పెంపకానికి అనువైన రకాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని మార్పులు చేసి మంచి రకాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. సంబంధిత శాస్త్రవేత్తలు అభివృద్ధిపరచిన విక్టరి1 (ఙ1) రకాన్ని నాటుకోవడం జరిగింది. తన ఈ ఎనిమిది సంవత్సరాల అనుభవంలో లైనుకి, లైనుకి మరియు మొక్కకు, మొక్కకు 4þ4 లేక 3þ3 అడుగుల దూరం అనుకూలంగా ఉంటుంది.

ఈ రెండింటిలో కూడా 4þ4 బాగా ఉంటుంది. ఎందుకంటే మల్బరి మొక్క ఒకసారి నాటుకుంటే 20 సంవత్సరాలకు పైబడి దిగుబడిని ఇస్తుంది కాబట్టి అందుకు అనుకూలంగా నాటుకోవలసి ఉంటుంది. నాటిన తరువాత క్రమం తప్పకుండా ప్రూనింగ్‌ చేయవలసి ఉంటుంది. మొక్క పెరిగే క్రమంలో 8 అంగుళాలు పెరిగిన తరువాత మొక్కను ప్రూనింగ్‌ చేసినట్లయితే రెండు లేదా మూడు కొమ్మలు పక్కన రావడము జరుగుతుంది. పక్కకొమ్మలను మూడు అంగుళాలు పెరిగిన తరువాత మరలా ప్రూనింగ్‌ చేయాలి. మరలా పక్కకొమ్మలను మూడు అంగుళాలు పెరిగిన తరువాత మరలా ప్రూనింగ్‌ చేయాలి. వచ్చిన కొమ్మలను మరలా ప్రూనింగ్‌ చేయాలి. ఈ విధంగా ప్రూనింగ్‌ చేసుకుంటూపోతే మూడు నుంచి నాలుగు నెలల్లో 25 నుంచి 30 కొమ్మలుపైగా వచ్చి కోతకు సిద్ధం అవుతుంది. మొక్క వయస్సు పెరిగేకొలది మొక్క యొక్క వేరు వ్యవస్థ కూడా భూమిలో బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి భూమిలోని పోషకాలను సక్రమంగా వినియోగించుకొని మొక్క ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేసిన మల్బరి తోటలో లభించే మల్బరి ఆకుతో 200 నుంచి 250 ఈఓఉ (డిసీజ్‌ ఫ్రీ లార్వా) (ంశ్రీజూ ఈఓఉ= 500 లార్వాలు)లను పెంచవచ్చు. మల్బరి ఆకును సున్నితమైన పట్టుపురుగులకు ఆహారంగా ఇస్తాము కాబట్టి మల్బరి సాగుకు ఎలాంటి విష రసాయనాలు ఉపయోగించకూడదు. నికోటిన్‌ కలిగిన పుగాకు పదార్థాలను కూడా ఉపయోగించకూడదు. సేంద్రియ సాగులో వినియోగించే జీవ సంబంధిత కీటకనాశనులు, ఉదాహరణకు బవేరియా బాసియానా లాంటివి కూడా ఉపయోగించకూడదు కాబట్టి తాను వేపగింజల కషాయం, జీవామృతం, వేస్ట్‌డికంపోజరులను మాత్రమే మల్బరి సాగుకు ఉపయోగిస్తున్నాని, ఈ పద్ధతిలో మొత్తం 4 ఎకరాలలో మల్బరి సాగును పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నానని పుండరీకర వివరించాడు.

పట్టు పురుగుల పెంపకం: పట్టు పురుగుల పెంపకానికి షెడ్‌ తప్పనిసరి కాబట్టి తాను 100 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పులతో 2500 చదరపు అడుగుల షెడ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ముందుచూపుతో పెద్ద షెడ్‌ను ఏర్పాటు చేసుకున్నాను కాని ప్రభుత్వ సబ్సిడీ పొందాలంటే 50 అడుగుల పొడవు 20 అడుగుల వెడల్పు అంటే 1000 చదరపు అడుగుల షెడ్‌ సరిపోతుంది. రెండున్నర ఎకరాలను ఒక యూనిట్‌గా సమకూర్చి ప్రభుత్వం వారు సబ్సిడీని అందచేస్తున్నారు. 1000 అడుగుల షెడ్‌ మరియు ఇతర సామాగ్రితో పాటు మల్బరి మొక్కలు, మొక్కలు నాటడానికి అయ్యే ఖర్చులు అన్నీ కలిపి ఒక యూనిట్‌ ధర 7,20,000/-గా నిర్ణయించి అందులో 50% అంటే రు. 3,60,000/- సబ్సిడీని అందిస్తున్నారు.

ప్రస్తుతం తన షెడ్‌లో 200 ఈఓఉ లు ఉన్నాయి. పట్టుపురుగుల పెంపకంలో 5 థలు ఉంటాయి. ప్రభుత్వ పరిశోధన సంస్థ వారు జనిటికల్లి మోడిఫైడ్‌ ఈఓఉ లను ఉత్పత్తి చేస్తున్నారు. కోళ్ళ పరిశ్రమలో ఉన్నట్టే ఇందులో కూడా హచరీస్‌ ఉంటాయి. గుడ్డు థ నుండి మొదటి రెండు థలు చాకీ సెంటర్‌ వాళ్లు నిర్వహిస్తుంటారు. చాకీ సెంటర్‌ వాళ్ళు 6 నుంచి 8 రోజులు పురుగు లార్వాలను పోషించి రైతులకు అందిస్తుంటారు. రైతుల దగ్గర పట్టు పురుగులు ఉండేది కేవలం 22 రోజులు మాత్రమే. రైతు దగ్గరకు వచ్చిన తరువాత మొదట 14 రోజులు అంటే 3వ థ 14 రోజులు మల్బరి ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా ఇవ్వవలసి ఉంటుంది. 14వ రోజు నుంచి 16 రోజుల మధ్య పట్టు పురుగులు స్పిన్నింగ్‌కి వస్తాయి. స్పిన్నింగ్‌ 4 రోజులు ప్రక్రియ ఉంటుంది. స్పిన్నింగ్‌ పూర్తి అవగానే కకూన్‌ తయారవుతుంది. కకూన్‌ తయారయిన వెంటనే మార్కెట్‌ చేయవలసి ఉంటుంది. దేశం మొత్తం కకూన్‌ కొనుగోలు చేసే మార్కెట్లు ఉన్నాయి కాబట్టి రైతుకు అనుకూలమైన స్థలంలో కకూన్‌లను అమ్ముకోవచ్చు. మార్కెట్‌లో అమ్మిన ధరకు సంబంధం లేకుండా కిలోకు 75/- తెలంగాణ ప్రభుత్వం, కిలోకు 50/-లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదనంగా అందచేస్తుంది. ఏ మార్కెట్‌లో అమ్మినా కాని ఆ మార్కెట్‌లో అమ్మిన రసీదును చూపించి అదనపు ధరను పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న పంట 200 ఈఓఉ కి సంబంధించింది. కకూన్స్‌ని ఇటీవలే అమ్మకం చేశాను. 200 ఈఓఉ లకు గాను 120 కిలోలు మంచివి, 20 కిలోల జాలీవి కలిపి మొత్తం 140 కిలోల దిగుబడి పొందడం జరిగింది. మంచి కకూన్స్‌ని కిలో 495/-లు, జాలీ కకూన్స్‌కి కిలో 150/- ధర లభించింది. అదనంగా మొత్తం 140 కిలోలకు తెలంగాణ ప్రభుత్వం కిలోకు 75/- ల చొప్పున ఇవ్వడం జరిగిందని పుండరీకం వివరించాడు. పట్టు పురుగులు చాలా సున్నితమయినవి కాబట్టి షెడ్‌లో ఉష్ణోగ్రతలు మరియు తేమశాతాలను నియంత్రించవలసి ఉంటుంది. మొదటిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కాని రెండు మూడు పంటలు తీసిన తరువాత అనుభవం పెరుగుతుంది కాబట్టి ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి రైతులు నిరభ్యంతరంగా పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు అని పుండరీకం వివరించాడు. మరిన్ని వివరాలు 94907 54201 కి ఫోను చేసి తెలుసుకోవచ్చు.

కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయరంగం, అదీను సేంద్రియ వ్యవసాయరంగంలో కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువగా అవసరం పడుతుంది. ప్రస్తుత సమాజాన్ని గమనించినట్లయితే వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టడానికి మహిళలు వెనుకంజ వేస్తున్నారు. కుటుంబంలోని మగవారికి వ్యవసాయరంగం అంటే మక్కువ ఉన్నా కాని ఆ కుటుంబంలోని మహిళలు వ్యతిరేకంగా ఉండటం వలన చాలామంది మగవారు వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. కొంతమంది మగవారు తమ కుటుంబంలో మహిళల ఇష్టాన్ని పెడచెవిని పెట్టి తాము వ్యవసాయ రంగంలో దిగి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నా కూడా తమ పంటల సాగుని కొనసాగిస్తున్నారు. పుండరీకరకి ఇలాంటి బాధలు ఏమీ లేవు. పుండరీకం ఉద్యోగం వదలి వ్యవసాయరంగంలో అడుగు పెట్టాలన్న నిర్ణయాన్ని తన అర్థాంగి జ్యోతి ఆనందంగా అంగీకరించింది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుండరీకం పట్టుపురుగుల పెంపకంలో అడుగుపెట్టగలిగాడు. ఈ రంగంలో అడుగు పెట్టిన తరువాత వీరి అనుభవంలో తెలిసిన విషయం ఏమిటంటే పట్టుపురుగుల పెంపకంలో విజయం సాధించాలంటే కుటుంబసభ్యులు అందరు కలసి ప్రత్యక్షంగా పనిచేయవలసి ఉంటుందని గ్రహించారు. అందుకు అనుకుగుణంగా ప్రతిరోజు జ్యోతి పొలానికి వచ్చి పట్టు పురుగులకు మల్బరీ ఆకులను ఆహారంగా అందించడము, కూలీల చేత పని చేయించడం లాంటి విషయాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి తాను ఇంతకాలం ఈ రంగంలో కొనసాగగలిగాను. లేకుంటే ఈ రంగంలో కొనసాగటం కష్టంగానే ఉండేది. తన ఈ విజయంలో తన అర్థాంగి జ్యోతి పాత్ర చాలా ఉంది, తాను సహకారం అందించడము వలననే పట్టుపురుగుల పెంపకంలో కొనసాగ గలుగుతున్నానని వివరిస్తూ, సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి తన అర్థాంగి జ్యోతికి పుండరీకం కృతజ్ఞతలు తెలియజేశారు. 

పట్టుదల తప్పనిసరి

ఏరంగంలోనైనా విజయం సాధించాలంటే పట్టుదల తప్పనిసరి అనే విషయం అందరికి తెలిసిందే. కాని మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయరంగంలో పట్టుదల పరిమాణం చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయరంగం ఎక్కువగా వాతావరణం మీద ఆధారపడుతుంది. వ్యవసాయరంగం విజయంలో మన పాత్ర కంటే ప్రకృతి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎంత ప్రయత్నించినా కాని ప్రకృతి అనుకూలించనట్లయితే ఫలితాలు ప్రతికూలంగా వస్తాయి. కాబట్టే వ్యవసాయరంగంలో పట్టుదల పరిమాణం చాలా ఎక్కువ అవసరముంటుంది. పట్టుపురుగుల పెంపకం గురించి ఆలోచిస్తే మల్బరి మొక్కల పెంపకం, పట్టుపురుగుల పెంపకం రెండూ కూడా ప్రకృతి మీద ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. మనం ఎంత ప్రయత్నించినా కూడా ప్రకృతి అనుకూలించనట్లయితే రైతులు నష్టపోవలసి వస్తుంది. పట్టుపురుగులు చాలా సున్నితమయినవి. అతిజాగ్రత్తలు తీసుకుని వీటిని పెంచవలసి ఉంటుంది. సరైన అవగాహన లేకుండా పట్టు పురుగుల పెంపకం చేపట్టినట్లయితే ఫలితాలు ప్రతికూలంగా ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టే చాలామంది పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టి కొనసాగించలేక వెనుదిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సందర్భంలో పుండరీకర అన్నీ ఆలోచించి పట్టుపురుగుల పెంపకం రంగంలోకి అడుగుపెట్టాడు. ముందుగానే అన్ని రకాలుగా పరిశీలించి, పరిశోధించి, అనేకమంది పట్టు పురుగుల పెంపకం చేసే రైతులను కలసి, అనేకమంది శాస్త్రవేత్తలు, అధికారులను కలసి వారి అభిప్రాయాలను సేకరించి ఈ రంగంలో అడుగుపెట్టి ఎదురయ్యే అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ గత 8 సంవత్సరాల నుంచి పట్టుపురుగుల పెంపకాన్ని పట్టుదలతో కొనసాగిస్తున్నాడు.