- జిల్లా స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనలకు ఆదేశాలు
- ఆయా ప్రాంతాలలో ఉన్న డిమాండ్‌ను బట్టి ఎంపిక చేసిన పనిముట్లు/యంత్రాల సరఫరా
త్వరలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్దరించడానికి కావాల్సిన నిధులు, పథక అమలు తీరుతెన్నులపై వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావు, వ్యవసాయ డైరెక్టర్ గోపి, ఐఏఎస్ మరియు సహకార సంస్థల ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశం నిర్వహించారు.
వ్యవసాయమంత్రి తుమ్మల ఆదేశాలతో ఈ యాసంగి నుండి రైతులకు అవసరమైన పనిముట్లను, యంత్రాలను, సబ్సిడీపై సరఫరా చేయడానికి, ప్రణాళిక సిద్దంచేసామని అందులో భాగంగా జిల్లాల వారీగా ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లను, యంత్ర పరికరాల జాబితా సిద్దం చేసినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి తెలియజేశారు. అంతేగాక మంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లాల వారీగా యంత్ర పరికరాలు మరియు పనిముట్లు తయారీ దారుల సంస్థల సహకారంతో మార్కెట్లలో కొత్తగా వచ్చిన పరికరాలపై రైతులలో అవగాహన పెంపొందించే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా యంత్రాంగం ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నామని తెలియజేశారు.
ప్రస్తుతం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రోటవేటర్స్, ఎమ్.బి నాగళ్ళు, కల్టివేటర్స్, తైవాన్ స్ట్రేయర్లు, బేలర్స్, పవర్ వీడర్స్, మొక్కజొన్న వొలుచు యంత్రాలు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లు మున్నగువాటిని ప్రతిపాదించినట్లు తెలియజేశారు. రైతులకు అవగాహన కొరకు ఎగ్జిబిషన్లను ప్రభావవంతంగా నిర్వహించాలని, ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కావాల్సిన నిధులు కూడా సమకూర్చుకోవాలని, అలాగే సంబంధిత గౌరవమంత్రి వర్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి రైతులందరికీ సౌకర్యంగా ఉండేలా జిల్లా స్థాయిలో స్థలాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించారు.
వ్యవసాయశాఖ వారు తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి, ఇది ఆరంభం మాత్రమేనని, వ్యవసాయయాంత్రీకరణ నిరంతర కార్యక్రమము అని, అందుకని ఎక్కడా, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్టంగా నిబంధనలు రూపొందించి, రైతులకు ఈ సీజన్ లోనే యంత్రాలను, పనిముట్లను అందచేయాలని, జిల్లా స్థాయి ఎగ్జిబిషన్లను కూడా వెంటనే ఏర్పాటుచేయాలని, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వారందరినీ ఈ ఎగ్జిబిషన్లో భాగస్వామ్యం చేయాలని కోరారు.
ఎగ్జిబిషన్ సమాచారం అన్ని ప్రసారమాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి, రైతులను పెద్దఎత్తున పాల్గొనేటట్లు చేయాల్సిందిగా సూచించారు.

12 Nov, 2024
