మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం లేని జీవితాలలో ఆనందం ఉండదు. కాబట్టి అందరికీ ఆరోగ్యం తప్పనిసరి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు మన పెద్దలు. మన ఆరోగ్యం ప్రధానంగా మనం పీల్చుకునే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, వ్యాయామం లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ నాలుగు అంశాలలో ఆహారం తప్పితే మిగతావి అన్నీ కూడా వేరేవారిపై ఆధారపడవలసిన అవసరంలేదు. ఆహారం మాత్రం చాలావరకు వేరేవారిపై ఆధారపడాలి. గ్రామాలలో జీవించేవారు, పంటల సాగు చేసే వారు మాత్రం కొంతవరకు తామే సొంతంగా పండించుకుంటూ కొంతవరకు మాత్రమే మిగతా వారిపై అంటే అవి పండించే రైతుల ద్వారా పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే వ్యాపారులపై ఆధారపడాలి. వేరే వారిపై ఆధార పడటం అంటే నమ్మకం కుదరక పోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం పెరటి తోట లేదా మిద్దెతోట లేదా ఇంటి పంట. ఇంటి పంట అవసరం ప్రస్తుతం అందరికీ ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి 12 సంవత్సరాల క్రితమే ఇంటి పంటను మొదలు పెట్టారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. సక్రమంగా ఇంటిపంటను చేపట్టినట్లయితే ఇంటి పంట ఒక బహుళార్థక సాధక ప్రాజక్ట్ అని రఘోత్తమ రెడ్డి తన అనుభవంలో గ్రహించారు.
రఘోత్తమరెడ్డిది స్వతహాగా వ్యవసాయ నేపథ్యం. చదువుకునే రోజుల్లో కూడా పొలం పనులలో తనవంతు పాత్ర పోషిస్తుండేవారు. సింగరేణిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా తన నివాస స్థలంలో పెరటి తోటను పెంచేవారు. మొత్తం మీద మొక్కల సాగులో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. సింగరేణి సంస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న రఘోత్తమరెడ్డి ఒకానొక సందర్భంలో తాను నిర్వర్తించే ఉద్యోగ బాధ్యతలు సరైనవి కావు అని భావించి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి మిద్దెతోట వైపు అడుగులు వేశారు. ఉప్పల్ సమీపములోని నారపల్లిలో 160 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. స్థలం తక్కువగా ఉండటం వలన పెరటి తోట కుదరదు. పెరటి తోటకు ప్రత్యామ్నాయం మిద్దెతోట అని గ్రహించి ఇంటి పైన మిద్దెతోట పెంచాలని నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేయించారు. మిద్దెపైన కుండీలలో మొక్కలు పెట్టి మొక్కల పెరుగుదలకు నీటిని అందిస్తుంటాము కాబట్టి ఆ నీరు క్రిందకు కారకుండా ఉండేందుకు వీలుగా స్లాబును వేయించారు. మిద్దెపై కొన్ని మడులు నిర్మించుకున్నారు. మొక్కలు పెంచుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలతో ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి గత 12 సంవత్సరాలకు పైగా మిద్దె తోటలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు బొప్పాయి, జామ, అరటి లాంటి పండ్ల మొక్కలను కూడా పెంచుతూ ఆరోగ్యరమైన దిగుబడులు తీస్తున్నారు.

మిద్దెపై నిర్మించిన మడులలో మరియు కుండీలు, ఇంట్లో వృథాగా పడిఉన్న కూలర్ బాక్సులు, బక్కెట్ల లాంటి వాటిలో కూడా వాటికి అనువైన మొక్కలు సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలను మొక్కలకు అందిస్తూ చీడపీడల నివారణకు వేపనూనె లాంటివి ఉపయోగిస్తుంటారు. ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో గడుపుతూ ప్రతి మొక్కను పరిశీలిస్తూ ప్రాథమిక థలో ఉన్న చీడపీడలను చేతులతో కూడా నివారిస్తుంటారు. ఎక్కవగా నాటు రకం విత్తనాలను ఉపయోగిస్తూ తాను పెంచిన మొక్క నుంచే విత్తనాలను అభివృద్ధిపరుస్తూ అవసరమైన తోటి ఇంటి పంట ఔత్సాహికులకు విత్తనాలను అందిస్తూంటారు.
మిద్దెతోటను పెంచినందువలన ఇంటిలోపల ఉష్ణోగ్రత ఎండాకాలంలో కొద్దిగా తగ్గడం రఘోత్తమరెడ్డి తెలుసుకున్నారు. వేడి తగ్గి చల్లదనం లభిస్తే ఎండాకాలం ఏసిలు, కూలర్ల అవసరం లేకుండా పోయింది కాబట్టి విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. సాయంకాలం సమయంలో కొంత సమయం కుటుంబ సభ్యులందరూ మిద్దె తోటలో గడిపినట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపినట్లవుతుంది. అందరూ ఎంతో కొంత శారీరక శ్రమ చేయటానికి అవకాశం కుదురుతుంది. కాబట్టి మిద్దె తోటను ఒక బహుళార్ధక సాధక ప్రాజక్ట్ అని రఘోత్తమరెడ్డి అంటారు. రఘోత్తమ రెడ్డి స్వతహాగా కవి కాబట్టి మిద్దె తోటలో గడుపుతూ కవితలు రాస్తూ ఉంటారు.

ప్రస్తుతం గ్రామాలలో ఉన్న రైతులు ఏకపంట విధానానికి అలవాటు పడ్డారు కాబట్టి గ్రామాలలో కూడా ఇంటి పంట అవసరం ఉందని గ్రహించారు. పట్టణాలలో మరియు గ్రామాలలో కూడా ఇంటి పంట సాగుదారులను పెంచాలనే ధ్యేయంతో ఇంటిపంట ఆవశ్యకతను, ఇంటి పంటలో మెళకువలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి తెలియచేస్తూ ఉంటారు. రైతునేస్తం తరఫున ఇంటి పంటపై జరుగుతున్న అవగాహన సదస్సులకు హాజరయ్యి తన అనుభవ పాఠాలను తోటి ఔత్సాహికులకు తెలియచేస్తుంటారు. అవగాహనా సదస్సులకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఏ ప్రాంతానికైనా వెళ్ళి అక్కడ అవగాహనా సదస్సులలో భాగస్వాములవుతుంటారు. మిద్దెతోటకు సంబంధించిన పుస్తకాలను కూడా రైతునేస్తం పబ్లికేషన్స్ ద్వారా ముద్రించారు. ఇంటి పంట అభివృద్ధికి శక్తికి మించి కృషి చేస్తున్నారు.
ప్రస్తుత సమాజంలో సమాచారాన్ని విశ్వవ్యాపితం చేయటానికి సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రఘోత్తమ రెడ్డి ప్రతిరోజూ ఇంటి పంటకు సంబంధించిన సమాచారాన్ని, చిత్రాలను వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా తోటి ఔత్సాహికులకు తెలియ చేస్తుంటారు. తాను తెలియపరిచే సమాచారం అంతా కూడా సరళమైన తెలుగు భాషలో అందరికీ అర్థం అయ్యేలా తెలుగులో టైపు చేసి పంపిస్తుంటారు. జిల్లాల వారీగా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి తన సూచనలను సలహాలను ప్రతి జిల్లాలోని మారుమూల ప్రాంతాలలోని మిద్దెతోట/ఇంటిపంట ఔత్సాహికులకు చేరేలా చర్యలు చేపడుతుంటారు. ఇంటి పంటకు సంబంధించి సదస్సులు ఏర్పాటు చేసే నిర్వాహకుల ఆహ్వానం మేరకు సదస్సులకు హాజరై తన అనుభవ పాఠాలను వివరిస్తూ ఉంటారు. సదస్సుకు హాజరయ్యే ఔత్సాహికుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని సదస్సులకు హాజరవుతూ ఎక్కువ మందిని ఇంటిపంట వైపు అడుగులు వేయించడమే తన లక్ష్యం అంటూ ముందుకు నడుస్తున్నారు. ఇంటి పంట/పెరటి తోట / మిద్దె తోటల పెంపకంలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ అనుభవం ఉన్న వారి గురించి ప్రస్తావిస్తే రఘోత్తమరెడ్డి ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. మరిన్ని వివరాలు 90001 84107 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
