ఇంటిపంటతో ఆరోగ్యం, ఆహ్లాదం

మనందరికి ఆరోగ్యం తప్పనిసరి. ఆరోగ్యం లేని జీవితాలలో ఆనందం ఉండదు. కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం తప్పనిసరి అనే విషయం అక్షర సత్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి, నీటితో పాటు మంచి ఆహారం తీసుకోగలగాలి. మన ఆరోగ్యం ప్రధానంగా ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం కావాలంటే సాధ్యమయినంత వరకు వేరే వారి మీద ఆధారపడకుండా తామే సొంతంగా పండించుకుని తింటేనే మంచి ఆహారం దొరుకుతుందనే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొన్నాయి. మనం తినే అన్ని రకాల ఆహారాలు అందరం పండించుకోలేము కాబట్టి ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారు పండించుకోవటానికి కొంతమంది ఔత్సాహికులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టే ఇంటి పంటదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. వివిధ రంగాలలో ఉన్నవారు ఎవరికి అవకాశం ఉన్నంత మేరలో వారు కొన్ని మొక్కలు పెంచుకుంటున్నారు. ఇంట్లో మొక్కలు పెంచుకోవటం వలన ఆరోగ్యకరమయిన ఆహారం సొంతంగా పండించుకొని తినడముతో పాటు శారీరక శ్రమకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంటిపంటలో గడిపిన సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి మన శక్తి పెరుగుతుంది కాబట్టి మన రోజు వారి పనులలో సామర్థ్యం పెరిగి ఫలితాలు మంచిగా ఉంటాయనడములో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని గ్రహించి ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీనివాస్‌ తమ ఇంట్లో ఏ మాత్రం స్థలాన్ని వదలకుండా వివిధ రకాల మొక్కల పెంపకం చేస్తున్నాడు.

శ్రీనివాస్‌ది సాఫ్ట్‌వేర్‌ రంగం. కరోనా తరువాత ఆరోగ్యం యొక్క విలువ తెలుసుకుని ఆరోగ్యకరమయిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలంటే ఇంటి పంటే సరైన దారి అని నమ్మి 2022 వ సంవత్సరం ఆగస్టు నెలలో తమ ఇంటి మేడ మీద, బాల్కనీలో, మిద్దె మీద వివిధ రకాల మొక్కల పెంపకం మొదలు పెట్టి కొనసాగిస్తున్నాడు. మొక్కల పెంపకంతో పాటు అక్వేరియంలో చేపల పెంపకం మరియు కొన్ని రకాల పకక్షులను కూడా పెంచడానికి తగిన ఏర్పాట్లు చేసుకుని పెంపకం చేస్తున్నాడు. పకక్షులకు అవసరమయిన గింజలు కోసం సజ్జ, జొన్న లాంటి విత్తనాలను తమ ఇంటి పంటలో చల్లి వాటి ద్వారా వచ్చే దిగుబడిని పకక్షులకు ఆహారంగా అందిస్తూ వస్తున్నాడు. చేపలు మరియు పకక్షులు పెంపకం వలన మనసుకు ఆహ్లాదం కలిగి రోజు మొత్తం ఆనందంగా గడపడం శ్రీనివాస్‌ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.

తమ ఇంటిపంటలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు వివిధ రకాల పూలమొక్కలు పెంచుతున్నాడు. నీడపడే ప్రదేశంలో ఇండోర్‌ ప్లాంట్లని పెంపకం చేస్తున్నాడు. తనకు కొత్త రకాల మొక్కలంటే మక్కువ ఎక్కువ కాబట్టి ఏ కొత్తరకం మొక్క లేదా విత్తనం కనిపించినా వదలకుండా తన ఇంటి పంటలో పెంపకం మొదలు పెడుతుంటాడు. మొక్కల పెంపకానికి గ్రోబ్యాగ్స్‌, ప్లాస్టిక్‌ కుండీలను మాత్రమే వినియోగిస్తున్నాడు. మొక్కలలో పరపరాగ సంపర్కం సక్రమంగా జరగాలంటే సీతాకోకచిలకలు, తేనెటీగల లాంటివి కావాలి కాబట్టి వీటిని ఆకర్షించడానికి గాను పసుపురంగు పూవులుపూసే పూల మొక్కలను పెంపకం చేస్తున్నాడు. ఇంటిపంటలో నెమటోడ్స్‌ సమస్య రాకుండా ఉండటానికి గాను బంతి మొక్కలను పెంపకం చేస్తున్నాడు. సంవత్సరం పొడవునా ఇంటి పంట అందంగా కనిపించడానికి అవసరమయిన వివిధ రకాల పూల మొక్కలను పెంచుతూ ఇంటి పంట అందంగా కనిపించడానికి అవసరమయిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటున్నాడు కాబట్టే తమ ఇంటి పంట 365 రోజులు అందంగా ఉంటుందని శ్రీనివాస్‌ అంటున్నాడు.

మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి మరియు మంచి దిగుబడిని ఇవ్వడానికి అవసరమయిన సేంద్రియ పదార్థాలను సమయానుకూలంగా అందిస్తూ ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ఇంటి పంటను కొనసాగిస్తున్నాడు. తోటి ఇంటి పంటదారులతో ప్రతినిత్యం కలుస్తూ మెలకువలు తెలుసుకుంటూ అతి తక్కువ సమయంలో ఇంటి పంటలో నైపుణ్యం సాధించి అనేకమంది ప్రశంసలు పొందుతున్నాడు. కొత్తగా ఇంటి పంటను మొదలు పెట్టాలనుకునే వారికి శ్రీనివాస్‌ మార్గదర్శి కాగలడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.  

Read More

రఘోత్తమరెడ్డి గారి స్ఫూర్తితో ఇంటిపంట

వివిధ రకాల కారణాల వలన ఇటీవల కాలంలో ఇంటిపంటను నిర్వహించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇంటి పంటపై శ్రద్ధ ఉన్నవారు ఎవరికి అవకాశం ఉన్న ప్రాంతంలో అంటే పెరటిలో, బాల్కనీలో, మిద్దెమీద, గోడల మీద… ఎక్కడ అవకాశం ఉంటే ఆ స్థలంలో అవకాశం ఉన్న మొక్కలు పెంచుతూ ఉంటున్నారు. కొంతమందికి ఇంటిపంట మీద ఆసక్తి ఉన్నా కూడా వివిధ రకాల కారణాల వలన ఇంటి పంటను మొదలు పెట్టడం వాయిదా వేసుకుంటూ పోతుంటారు. ఇలా వాయిదా వేసుకుంటూ పోయేవారికి వేరేవారి నుంచి స్ఫూర్తి లభించిందంటే వాయిదాలను ప్రక్కకు నెట్టి కార్యాచరణలోకి దిగుతారు. కొత్తగా ఇంటి పంటను మొదలు పెట్టే అనేకమందికి అప్పటికే ఇంటిపంటను నిర్వహిస్తున్న ఇంటి పంటదారులు స్ఫూర్తిని కలిగించి ఉండవచ్చు. కాని ఇంటిపంట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొంది ఇంటి పంటను మొదలు పెట్టిన వారు ఎక్కువ మంది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. హైదరాబాదు నగరం అమీరుపేటలో గత ఆరు సంవత్సరాల నుంచి మిద్దెతోటను పెంచుతున్న తనకు రఘోత్తమరెడ్డి గారే స్ఫూర్తి అని అప్పారావు అంటున్నాడు.

అప్పారావు గారికి గత 15-20 సంవత్సరాల నుంచి ఇంటిపంట మీద మక్కువ ఉన్నా కూడా ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కాబట్టి ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలు తిరగవలసి వస్తుంది కాబట్టి ఉద్యోగంలో కొనసాగిన కాలంలో పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం చేపట్టకుండా కేవలం కొన్ని మొక్కలను మాత్రం పెంచుకుంటూ వస్తూ 6 సంవత్సరాల క్రితం తన ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తరువాత పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం మొదలు పెట్టాడు. హైదరాబాదు నగరం అమీరుపేటలో మిద్దెమీద ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. తనకు ఇంటిపంటమీద మక్కువ పెరగటానికి ఇంటి పంట నిపుణుడు రఘోత్తమరెడ్డిగారే స్ఫూర్తి అని అప్పారావు వివరిస్తున్నాడు.

తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచాలనే లక్ష్యంతో అప్పారావు ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. ఇందుకుగాను చిన్న చిన్న కంటెయినర్లను ఎక్కువగా మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నాడు. చిన్న కంటెయినర్లు అయితే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. మట్టి మిశ్రమం తక్కువగా పడుతుంది. అంతేకాకుండా కంటెయినర్‌ బరువు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక చోట నుండి ఇంకో చోటకి మార్చాలంటే సులభంగా ఉంటుంది. ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తమ మిద్దెతోటలో చిన్న కంటెయినర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. 

మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టిమిశ్రమంలో 30 శాతం మట్టి, 30 శాతం వర్మికంపోస్టు, 30 శాతం కోకోపిట్‌ లేదా ఇసుక మిగిలిన 10 శాతం వేపపిండిని ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా మట్టి మిశ్రమం తయారు చేసుకుని మొక్కల పెంపకం చేపట్టి తరువాత అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంటాడు. వారి ఇంటి పంటలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, పూల మొక్కల పెంపకం చేస్తుంటారు. అరుదైన రకాలను దూర ప్రాంతాల నుంచి తెప్పించి పెంపకం చేయడం అప్పారావు గారికి ఇష్టం కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా విత్తనాలను తెప్పించి మొక్కల పెంపకం చేస్తున్నారు. వారి ఇంటి పంటలో 15 నుంచి 20 రకాల వంగ, 50 నుంచి 60 రకాల టమాటతో పాటు పొట్టి అరటి, చిన్న కంటెయినర్‌లో పెరిగే మునగ, సంపంగి, డ్రాగన్‌ ఫ్రూట్‌, బత్తాయి, నిమ్మ మొక్కలతో పాటు అరుదైన పూల మొక్కలు, ఆకుకూరలు అనేకం ఉన్నాయి. 

ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీ విరమణ పొందిన తరువాత తన పూర్తి సమయాన్ని ఇంటి పంటపై పెట్టి ఇంటి పంట దారుల సంఖ్య పెంచడంలో తనవంతు పాత్రను పోషిస్తున్నాడు. రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొందిన అప్పారావు ఇంటి పంటను మొదలు పెట్టి విజయవంతంగా కొనసాగిస్తూ అనేకమందికి స్ఫూర్తిని కలిగిస్తున్నాడు.

పెంచుకుందాం… పంచుకుందాం…

అప్పారావు ఇంటి పంటను నిర్వహించడంతోపాటు ఇంటిపంటదారుల సంఖ్య పెరగటానికి విపరీతంగా కృషి చేస్తున్నాడు. ఇందుకుగాను వివిధ ప్రాంతాల నుంచి అరుదైన రకాల విత్తనాలను, మొక్కలను తెప్పించి తన ఇంటి పంటలో పెంపకం చేసి విత్తనాలను అభివృద్ధి చేసి భారతదేశం మొత్తం అడిగిన వారికి ఉచితంగా అంటే రవాణా ఖర్చులు కూడా తానే భరిస్తూ విత్తనాలను పంపిణీ చేస్తున్నాడు. తన దగ్గర విత్తనాలను తీసుకున్న వారు అవకాశం ఉంటే వారి దగ్గర ఉన్న విత్తనాలను అప్పారావు గారికి పంపిస్తుంటారు. వాటిని అప్పారావు గారు అవసరమయిన వారికి ఉచితంగా పంపిస్తుంటారు. ఈ విధంగా పెంచుకుందాం… పంచుకుందాం… అనే భావనతో ముందుకు సాగుతున్నారు.

Read More

వేలాడే తోటతో ఆకర్షితమైన ఇంటి అలంకరణ

కొద్దిగా సూర్యరశ్మి, సారవంతమైన మట్టి మిశ్రమం, కాస్తంత స్థలం ఉంటే చాలు. అందమైన కుండీల్లో మొక్కలను సైతం ఈ హ్యాంగింగ్‌ బాస్కెట్లలో ఆకర్షణీయంగా పెంచుకోవచ్చు. వివిధ వర్ణాల పూలతో కనువిందు చేస్తాయివి.

వేలాడే కుండీల్లో నాటే మొక్కల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. పెద్ద కుండీల్లో పెంచేందుకు ఒకే జాతి మొక్కలను, మరీ చిన్న కుండీలైతే ఒకే జాతి మొక్కలతో పాటు, ఒకే ఆకారంలో ఆకులు, పూలు అందించే వాటిని ఎంపిక చేసుకోవాలి. బహువార్షికాలను నాటితే చలి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సూర్యరశ్మి, నీటిని ఒకే మోతాదులో తీసుకునే మొక్కలను గుంపుగా పెంచుకోవాలి. ఈ మొక్కల మధ్య సమతుల్యం బాగుంటుంది.

రంగులూ ముఖ్యమే: ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ, ఊదా రంగు మొక్కలను ఎంచుకోవాలి. ఏకవర్ణ మొక్కలు కావాలనుకుంటే ఎరుపు మేలు. ఏకవార్షిక పూల రకాలుగా ఆకుపచ్చ ఆకులున్నవి బాగుంటాయి. కుండీల రంగు, వాటిని వేలాడదీసే ప్రాంతం, బయటి వాతావరణాన్ని బట్టి మొక్కల వర్ణాన్ని ఎంపిక చేసుకోవాలి. వేలాడే, పాకే లతలుగా ఎదిగే మొక్కలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

ఎలాంటి కుండీలంటే: ఇనుప పళ్లాలు, వెడల్పాటి సీసాలు, ప్లాస్టిక్‌, సిరామిక్‌ కుండీలు, చెక్క పెట్టెలు, మట్టి కుండలు.. ఇలా ఏదయినా వాడుకోవచ్చు. నీళ్లు బయటకు వెళ్లకపోతే మొక్క త్వరగా చనిపోతుంది. కాబట్టి వాటికి రంధ్రాలు ఉండాలి. మొక్క పెరిగేకొద్దీ కుండీ బరువూ ఎక్కువవుతున్నప్పుడు గొలుసులు, తాడుతో వాటికి ఊతమివ్వాలి. మొక్కను ఇసుక లేదా పెర్లైట్‌లో పెంచాలా అనేది నిర్ణయించుకోవాలి. దీనివల్ల వేర్లకు గాలి అంది బాగా పెరుగుతాయి. తేమా చక్కగా అందుతుంది. పద్ధతి ప్రకారం రెండు వంతుల పీట్‌ మాస్‌ ఒక్కోవంతు చొప్పున ఇసుక, పెర్లైట్‌ వాడాలి. ద్రవరూప ఎరువులు వాడితే మేలైన ఫలితాలు ఉంటాయి. పిచికారి చేయడం కన్నా మొక్కలు నాటేముందు మట్టిలో ఎరువులు కలపడం మేలు. మొక్కలన్నింటిని కుండీల్లో నాటాకే అనుకున్న ప్రదేశంలో వేలాడదీయాలి. 10-14 అంగుళాల వ్యాసార్థం ఉన్న కుండీలను ఎంచుకోవాలి. వీటిలో ఒక్కోదానిలో మూడు మొక్కలను నాటుకోవచ్చు.

మొక్కలకు ప్రతిరోజూ నీరు పోయాలి. మట్టి మిశ్రమం పైభాగం నుంచి 25 శాతం తేమను కోల్పోయినప్పుడు నీటిని పిచికారి చేయాలి. వారానికోసారి ద్రవరూప ఎరువులను అందించాలి. ఎత్తుగా పెరిగిన వాటిని ఆకృతి ప్రకారం కత్తిరించుకోవాలి. మొక్క నాటే ముందు మట్టిని, పరికరాలను స్టెరిలైజ్‌ చేయాలి లేదా 1:10 నిష్పత్తితో తయారు చేసిన క్లోరిన్‌ నీటితో తడపాలి. వాటి వేళ్లు ఉండల్లా చుట్టుకుపోతే బయటకు తీసి సరిచేసి మళ్లీ నాటాలి. కొత్తగా నాటిన మొక్కల్ని నాలుగైదు వారాల వరకు నేరుగా సూర్యరశ్మిలో ఉంచి తరువాత అనుకున్న ప్రదేశంలో వేలాడదీయాలి.

ఏ మొక్కలంటే: పూల మొక్కల్లో అబూటిలాన్‌ మెగా పొలిమికమ్‌, అలమంద, బిగోనియా (వేలాడే రకాలు), వేలాడే చామంతి, వేలాడే పెటూనియా, క్లైయాంథస్‌, బాల్‌సమ్‌, తలంబ్రాల మొక్క, ప్లెమ్‌ వాయిలెట్‌, కంప్యానులా, లిప్‌స్టిక్‌ మొక్కలు అనుకూలం. ఆకుల మొక్కల్లో కొలియస్‌, పిలోడెండ్రాన్‌, పోతస్‌, స్పైడర్‌ ప్లాంట్‌, ఫన్స్‌, జెబ్రినా, ఆస్పరాగస్‌, కంగారోవైన్‌, త్రేసిస్‌ కాన్షియా మొదలగు వాటిని ఎంచుకోవాలి.

దేవరాయ్‌ లవ కుమార్‌, పి.హెచ్‌డి స్కాలర్‌, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, న్యూఢిల్లీ, ఫోన్‌: 9515691254

Read More

మొక్కలపై మక్కువ సొంత ఇంటి కలను  వేగంగా నెరవేర్చింది

వివిధ రకాల కారణాల వలన ఇటీవల కాలంలో ఇంటి పంటను చేపట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇంటి పంటవలన ప్రయోజనాలను గ్రహించిన చాలామంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అంటే పెరట్లో, మేడ మీద, మెట్ల మీద, పిట్ట గోడల మీద.. ఈ విధంగా తమ అనకూలతను బట్టి కొన్ని మొక్కలను పెంచుతూ పోతున్నారు.

ఇంటి పంటను చేపట్టే వారిలో సొంత ఇంటిదారులతో పాటు అద్దెకు ఉండేవారు కూడా ఉన్నారు. సొంత ఇంటిదారులకు పెద్దగా ఇబ్బందులు ఉండవు కాని అద్దెకు ఉండే వారి విషయంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇల్లు మారవలసిన సందర్భంలో మొక్కలను కుండీలతో కలిపి వేరే ఇంటికి మార్చడము చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని మొక్కలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఉంటాయి. రవాణా ఖర్చులు, ఎగుమతి, దిగుమతి ఖర్చులు కూడా ఎక్కువగా అవుతుంటాయి. కాబట్టి ఇంటి పంటపై, పచ్చదనంపై మక్కువ ఉన్నవారు సొంత ఇంటి కలను తొందరగా సాకారం చేసుకోవాలని ఉంటారు. ఈ దారిలోనే నడచి తమకు పచ్చదనంపై ఉన్న మక్కువతో తమ సొంత ఇంటి కలను వేగంగా సాకారం చేసుకున్నారు విశాఖపట్టణం, మధురవాడకు చెందిన ఝాన్సీరాణి.

ఝాన్సీరాణి డిగ్రీ వరకు చదువుకుని కొన్ని రోజులు ఉద్యోగం చేసి పచ్చదనంపై ఉన్న మక్కువతో చేస్తున్న ఉద్యోగాన్ని మానివేసి, ప్రస్తుతం గృహిణి బాధ్యతలు నిర్వర్తిస్తూ తన పూర్తి సమయాన్ని కుటుంబానికి, తమ మిద్దెతోటకు కేటాయిస్తున్నారు. ఝాన్సీరాణికి పచ్చదనంపై మక్కువ చాలా ఎక్కువ. కాబట్టి అద్దె గృహాలలో ఉండే సమయంలో కూడా అవకాశం ఉన్న చిన్న ప్రదేశాన్ని కూడా వదలకుండా మొక్కలు పెంచుతుండేవారు. ఇళ్ళు మారవలసి వచ్చినప్పుడు మొక్కలను మార్చడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఎంతో ప్రేమగా, ఎంతో కాలం నుంచి పెంచుకున్న కొన్ని మొక్కలు పాడై పోవడం ఝాన్సీరాణిని బాధిస్తుండేవి. ఇలాంటి అన్ని సమస్యలకు సొంత ఇల్లు సరైన పరిష్కారం అని నిర్ణయించుకుని చాలా వేగంగా సొంత ఇంటి కలను సాకారం చేసుకుని 3 అంతస్తుల సొంత ఇంట్లో మిద్దె మీద మిద్దె తోటను పెంపకం చేయడముతో పాటు మూడు అంతస్తులకు ఎక్కేదారిలో ఉండే అన్ని మెట్ల మీద మరియు ఇంట్లో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలలో చివరకు గోడలకు కూడా వృథాగా పడవేసే నూనె క్యాన్‌లను బిగించి అన్నింటిలో ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంపకం చేస్తున్నారు.

ఝాన్సీరాణికి ఇంటిపంటలో 8 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రస్తుతం 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో మిద్దె మీద వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు., స్లాబు మీద నీరు పడితే స్లాబు పాడై పోతది కాబట్టి స్లాబు మీద నీరు పడకుండా స్టాండులు ఏర్పాటు చేసుకుని స్టాండుల మీద వివిధ సైజు ప్లాస్టిక్‌ కుండీలు, టబ్బులు ఏర్పాటు చేసుకుని ఆ టబ్బులలో బరువు తక్కువగా ఉండే సాయిల్‌ మిక్స్‌ని నింపి అందులో వివిధ రకాల మొక్కలు పెంపకం చేస్తున్నారు.

ప్రస్తుతం వారి మిద్దెతోటలో ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు, క్రోటాన్స్‌, పూలమొక్కలు, పండ్ల మొక్కలు లాంటి అవకాశం ఉన్న మొక్కలను వదలకుండా పెంపకం చేస్తున్నారు. మొక్కల నిర్వహణకు ఎక్కువగా ఫిష్‌ ఎమినో యాసిడ్‌, వేపనూనె, ఎగ్‌ ఎమినో యాసిడ్‌, ఫ్రూట్‌ పర్మెంటెడ్‌ జ్యూస్‌, థపర్ణి కషాయం, పంచగవ్య, అల్లం+ బెల్లం ద్రావణం, తాటికల్లు+ దాల్చిన చెక్క ద్రావణం, వెల్లుల్లి+ బెల్లం ద్రావణం లాంటి ఎన్నో రకాల ద్రావణాలను సొంతంగా తయారు చేసుకుంటూ మొక్కలకు ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన మిద్దె తోటను పెంచుతున్నారు. 

మిద్దె తోటలో పండే పంటలపై తమతో పాటు ప్రకృతిలో ఉండే వివిధ రకాల పకక్షులకు కూడా అధికారం ఉందని నమ్మి తమ మిద్దెతోటలో వివిధ రకాల పకక్షులు నివశించడానికి, పకక్షులు తమ మిద్దెతోటను ఉపయోగించుకోవటానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి వివిధ రకాల పకక్షులు వాటికి ఇష్టమైన అంజూర, దానిమ్మ లాంటి పండ్లను తమకంటే ముందు పకక్షులే తింటుంటాయి.

అయినా కాని మేము ఏ మాత్రం బాధపడకుండా పకక్షులు కూడా ప్రకృతిలో భాగం కాబట్టి పకక్షులకు ఆహారం ఏర్పాటుకు తమకు అవకాశం దొరికినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. కేవలం 800 చదరపు అడగుల విస్తీర్ణంలో రెండు, మూడు రెట్లు ఎక్కువ మొక్కలు పెంచుతున్న వారి మిద్దె తోటను అనేకమంది ప్రముఖులు సందర్శించారు. ఇంకా సందర్శిస్తూనే ఉన్నారు. మరిన్ని వివరాలు 63025 09928 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

ఇంటితోపాటు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వాలి

తల్లిదండ్రులు తమ ఆస్తులను తమ పిల్లలకు వారసత్వంగా అదించడం మన సాంప్రదాయం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎంత ఆస్తి ఉన్నా ఆరోగ్యం సక్రమంగా లేకుంటే ఉన్న ఆస్తిని ఆనందంగా అనుభవించలేరు. కాబట్టి ఆస్తి కన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడే ఆస్తి వలన ఉపయోగం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్లయితే మనం తినే ఆహారంలో ప్రత్యేకించి ఆకుకూరలు మరియు కూరగాయలలో విష రసాయన అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ సమస్యకు పరిష్కారంగా అవకాశం ఉన్నవారు ఇటిపంటను మొదలుపెట్టి తామే సొంతంగా కూరగాయలు, ఆకుకూరలతో పాటు కొన్ని రకాల పండ్లను పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలుగుతున్నారు. ఇలాంటి వారు తమ వారసులకు తమ ఇంటితోపాటు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని మిద్దెతోట నిపుణులు రఘోత్తమరెడ్డి అంటున్నారు. రఘోత్తమరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటి పంటలు చేసే వారందరికి సుపరిచితమైన పేరు రఘోత్తమరెడ్డి. 

వారసులకు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వాలనుకునేవారు మిద్దెమీద ఇటుకలతో మడులు నిర్మించుకోవాలి. అవి రెండు మూడు తరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. సాధారణంగా నలుగురు కుటుంబ సభ్యులు ఉండే ఒక కుటుంబానికి ఒకరోజుకు అవసరమయిన కూరగాయలు పొందాలంటే 16 చదరపు అడుగుల మడి సరిపోతుంది. అంటే 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఇటుకలతో మడి నిర్మించుకుంటే అందులో బెండ, టమాట లాంటి మొక్కలు 16 వరకు పెంచవచ్చు. ఈ 16 మొక్కలనుంచి ఒక కుటుంబానికి ఒక రోజుకి అవసరమైన కూరగాయలు పొందవచ్చు. లోతు విషయానికొస్తే కూరగాయల పెంపకానికి ఒక అడుగు లోతు మరియు పండ్ల మొక్కల పెంపకానికి రెండు లేదా మూడు అడుగుల లోతు మడులను నిర్మించుకుంటే అనుకూలంగా ఉంటుంది. ప్రతి రెండు మడుల తరువాత మూడవ మడి పండ్ల మొక్కల పెంపకంకుగాను ఎక్కువ లోతు గల మడి నిర్మించుకుని అందులో పండ్ల మొక్కలు పెంచుకుంటే వేసవికాలంలో నీడ ఏర్పడి కూరగాయలు, ఆకుకూరలు బాగా ఎదగడానికి అవకాశం ఉండటంతో పాటు, మిద్దెతోటలో చల్లదనం కూడా ఉంటుంది కాబట్టి వేసవికాలంలో వేడి నుంచి ఉపశమనం కోసం ప్రతి మూడవ మడి పండ్లమొక్కలకు కేటాయించాలి. 

మట్టి మిశ్రమంగా నల్లమట్టి, ఎర్రమట్టిలలో ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించుకోవచ్చు. ఎరువుగా బాగా మాగిన గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల ఎరువులలో ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించవచ్చు. రెండు వంతుల మట్టి ఒక వంతు బాగా మాగిన ఎరువును ఉపయోగించి విత్తనాలను నాటుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి మట్టి మొత్తాన్ని బాగా ఎండబెట్టినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇందుకుగాను మిద్దెతోటలో 30 శాతం దిగుబడితోను, 30 శాతం ఖాళీగా, 30 శాతం విత్తనాలను నాటినవిగా ప్రణాళిక వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది. విత్తనాల గురించి కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా నాటు విత్తనాల కొరకు ప్రయత్నించి అవి దొరకనట్లయితే సంకర జాతి విత్తనాలను కూడా వేసుకుని ఆ దిగుబడి నుండి మరలా మనము విత్తనాలను సేకరించినట్లయితే కొన్ని రోజులకు అవి నాటు విత్తనాలుగా రూపాంతరం చెందుతాయని రఘోత్తమరెడ్డి వివరిస్తున్నాడు.

చీడపీడల గురించి కూడా పెద్దగా ఇబ్బందులు పడనవసరం లేదు. మొక్కలో రోగనిరోధక శక్తి తగినంత ఉన్నట్లయితే ఆ మొక్కలను  చీడపీడలు అశించవు. పోషకాలు సక్రమంగా గల బాగా మాగిన పశువుల ఎరువు అందించి మంచి విత్తనాన్ని నాటినట్లయితే పెరిగే మొక్క తప్పనిసరిగా రోగనిరోధక శక్తితో పెరుగుతుంది. కాబట్టి అలాంటి మొక్కలకు చీడపీడలు ఆశించవు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పేను లాంటి చీడలు ఆశించిననట్లయితే పేను ఆశించిన ఆకులను తీసివేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

మొక్కలకు అందించే నీటి విషయంలో ఇంటి పంటదారులు తప్పనిసరిగా కామన్‌సెన్స్‌తో ఆలోచించాలి. మొక్కలకు నీరు అవసరం లేదు. కేవలం తేమ మాత్రమే అవసరం ఉంటుంది కాబట్టి మట్టిలోని తేమను గమనిస్తూ నీటిని అందించాలి. ఎక్కువ నీటిని అందించకుండా తగినంత నీటిని మాత్రమే అందించాలి. కాలాన్ని బట్టి నీటిని అందించవలసి ఉంటుంది. అన్ని కాలాలలో ఒకే రకమైన నీటి అవసరం ఉండదు. వివిధ కాలాలకు వివిధ రకాల నీటి అవసరాలు ఉంటాయి కాబట్టి కామన్‌సెన్స్‌ ఉపయోగించి నీటిని అందించవలసి ఉంటుంది.

దోసెడు మట్టి, పిడికెడు ఎరువు, ఒక విత్తనం ఉంటే మిద్దెతోటను ప్రారంభించవచ్చు. ఇటుకలతో మడులు కట్టుకోవడానికి ఇబ్బందులు పడేవారు ఫైబరు టబ్బులను కూడా కొనుగోలు చేసుకుని మిద్దెతోటను ప్రారంభించవచ్చు.

ఇవేమి లేకున్నా కాని సంకల్పం ఉండాలే కాని గ్రోబ్యాగ్స్‌ లేదా ఖాళీ సిమెంటు సంచులతో కూడా మిద్దెతోటను ప్రారంభించవచ్చు. తక్కువ ఖర్చుతో మిద్దెతోటను ప్రారంభించి అనుభవం గడించిన తరువాత శాశ్వత టబ్బులు లేదా శాశ్వత మడులకు మారినట్లయితే ఫలితాలు బాగా ఉంటాయి. ఏది ఏమయినా కాని మన తరువాత తరం వారు ఆరోగ్యంగా, ఆనందంగా మన ఆస్తిని అనుభవించాలంటే ఆస్తితోపాటు మిద్దెతోటను వారసత్వంగా అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని రఘోత్తమరెడ్డి గట్టిగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు 90001 84107 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

పంటపొలాల్లో పక్షుల బెడద నియంత్రణ చర్యలు

పక్షులు వ్యవసాయంలో రెండు రకాల పాత్రలను పోషిస్తాయి. చాలా జాతుల పక్షులు పంటలకు లాభము కలుగజేస్తుండగా కొన్ని జాతుల పకక్షులు మాత్రం నష్టము కలుగజేస్తాయి. నష్టం చేసే పకక్షులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఇవి స్థిరంగా ఉండే వ్యవసాయ క్షేత్రాలను అలవాటు చేసుకుని అక్కడ వాటి సంఖ్య పెరిగి పంటలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంటాయి. కొన్ని సమయాలలో ఒకే జాతికి చెందిన పక్షులు ఒక ప్రదేశంలో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు మరియు ప్రదేశం మీద ఆధారపడి మరొక ప్రదేశంలో నష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి.

ఇటీవల కాలంలో పక్షుల సమస్య పెరగడం వలన వ్యవసాయంలో పక్షుల నియంత్రణ చేయవలసిన అవసరం ఏర్పడింది. కానీ ఈ పకక్షులు ఆహారపు గొలుసులో ప్రత్యేక పాత్రను పోషిస్తూ వ్యవసాయ మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. కొన్ని అంతరించిపోతున్న పక్షి జాతులు కూడా పంటలకు అక్కడక్కడా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పక్షులకు ఏవిధమైన హాని కలుగకుండా వాటి నియంత్రణ చేయాలి. 

మన దేశంలో సుమారు 1364 పక్షి జాతులు గుర్తించబడ్డాయి. వీటిలో 81 జాతులు స్థానికమైనవి. వీటిలో కొన్ని పకక్షులు మాంసాహారులుగా జీవిస్తూ చిన్న చిన్న పురుగులను మరియు ఎలుకలను తింటూ రైతుకు మేలు చేస్తాయి. మరికొన్ని పకక్షులు మొక్కలలో పరాగ సంపర్కానికి మరియు విత్తన వ్యాప్తికి దోహదపడతాయి. అయినప్పటికీ కొన్ని జాతుల పక్షులు వివిధ థలలో పంటలను పాడుచేస్తూ రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి.

మన రాష్ట్రంలో మొక్కజొన్న, జొన్న, వరి మరియు ప్రొద్దుతిరుగుడు మొదలైన పంటలను పక్షులు ఎక్కువగా పాడుచేస్తాయి. ముఖ్యంగా పక్షులలో రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు, కాకులు, గోరింకలు మరియు నెమళ్ళ వలన పంటలకు అధిక నష్టము కలుగుతుంది. ముఖ్యంగా ఈ నష్టము తక్కువ విస్తీర్ణం కలిగిన పంట పొలాల్లో మరియు ఎక్కువ పకక్షుల స్థావరాలు ఉన్న ప్రాంతాలలో జరుగుతుంది.

ఉదాహరణకు మొక్కజొన్న పంటలో పక్షుల దాడిని పరిశీలించినట్లయితే విత్తనము విత్తినప్పటినుండి పావురాలు, కాకులు, విత్తిన గింజలను ఏరుకుని తింటాయి. విత్తనము మొలకెత్తే థలో కాకులు లేత మొగ్గ భాగాలను పెకిలించి తింటాయి. విత్తనము పాలుపోసుకునే సమయంలో రామచిలుకలు కంకిని తొలిచి గింజలను తింటాయి. గింజ పట్టిన తరువాత రామ చిలుకలు, కాకులు గింజలను వలచుకుని తింటాయి. వివిధ థలలో పక్షులు చేయు నష్ట శాతాన్ని గమనించినట్లయితే విత్తే థ మరియు విత్తనం మొలకెత్తే థలో పావురాలు, కాకులు, గోరింకలు, రామచిలుకలు, నెమళ్ళు, గువ్వలు దాడి చేసి 10-20% నష్టాన్ని కలుగజేస్తాయి. గింజ పాలుపోసుకునే థలో రామచిలుకలు, కాకులు, దాడిచేసి 6-39% నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ విధంగా మొక్కజొన్నలో పక్షుల వలన 10-40 % వరకు నష్టము జరుగుతుంది.

అదేవిధంగా పొద్దుతిరుగుడు చూసినట్లయితే ముఖ్యంగా రామచిలుకలు, కాకులు, గోరింకల వలన నష్టము అధికంగా జరుగుతుంది. విత్తనాలు వేయునప్పుడు కాకుల బెడద ఎక్కువగా ఉంటుంది. గింజ పాలుపోసుకునే థ నుండి గట్టిపడే వరకు రామచిలుకల ద్వారా 40% వరకు నష్టము కలుగుతుంది.

వేరుశనగ పంటలో విత్తనం విత్తే థ నుండి మొలకెత్తే వరకు కాకులు, పావురాలు, నెమళ్ళు, పిచ్చుకలు వలన 15-75 % వరకు నష్టము జరుగుతుంది. అదేవిధంగా గింజ ఏర్పడే థ నుండి గట్టిపడే థ వరకు చిలుకలు, కాకులు, పావురాలు, నెమళ్ళు వలన 10-50% వరకు నష్టము జరుగుతుంది. వరిలో గమనించినట్లయితే గింజ గట్టిపడే థలో పకక్షుల వలన నష్టము అధికంగా ఉంటుంది.

పక్షులు దాడి చేయు విధానం:

పక్షులు దాడి చేయు విధానం వివిధ పంటలలో భిన్నంగా ఉంటుంది. పక్షులు వాతావరణ పరిస్థితులు, సమయం, పంటథ మొదలైన వాటిమీద ఆధారపడి పంటపై దాడి చేస్తాయి. ఉదాహరణకు మొక్కజొన్న పంటలో మొదటిగా విత్తనాలు విత్తునప్పుడు ఉదయం వేళల్లో సుమారు 5 గంటల నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కాకులు మరియు పావురాలు దాడి చేసి గింజలను ఏరుకుని తింటాయి. అదేవిధంగా నీటి తడులు ఇచ్చిన వెంటనే విత్తనాలు నీటిలో నాని ఉబ్బుతాయి అప్పుడు పక్షులు వాటిని మూడు రోజులు వరకు దాడి చేసి ఏరుకుని తింటాయి. కానీ కాకులు మాత్రం విత్తనాలు మొలకెత్తే వరకు దాడి చేస్తాయి. కంకులు కట్టే థలో రామచిలుకలు 2 నుండి 10 వరకు గుంపులుగా దాడి చేస్తాయి. అవి కంకి పై భాగాన్ని చీల్చి తియ్యని అక్షాన్ని తింటాయి. కంకి నుండి వ్రేలాడే సన్నని పట్టు వంటి నూగును కొరికివేస్తాయి. దీనివలన పరాగ సంపర్కం జరగకపోవడం వలన కంకులలో గింజలు ఏర్పడవు. గింజలు ఏర్పడిన తర్వాత పాలుపోసుకునే థలో లేత కంకికి ఒక చీలికనేర్పరచి వాడియైన వంపు కలిగిన ముక్కుతో లోపలి గింజలను తింటాయి. ఈ థలో జరిగే దాడి వలన విత్తనాలు లేని కంకులు బోసిగా కనిపిస్తాయి. 

వివిధ పంటలలో పక్షులు కలుగజేసే నష్టాన్ని అరికట్టడానికి వన్యప్రాణి సంరక్షణా చట్టానికి అనుగుణంగా పర్యావరణానికి హాని చేయని మరియు తక్కువ ఖర్చుతో కూడిన సులభమైన పద్ధతులు క్రింద వివరించడం జరిగినది. ఈ పద్దతులను ఉపయోగించి పంటలలో పక్షుల వలన సంభవించే నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చును.

1. విత్తన శుద్ధి:

వేపనూనె 5 మి.లీ. ఒక కెజీ విత్తనాలకు పట్టించి 24 గంటల తర్వాత విత్తుకోవాలి లేదా తగినంత కోడిగ్రుడ్డు ద్రావణంలో విత్తనాలను నానబెట్టి విత్తినట్లయితే అవి పక్షులకు రుచించవు. 

ఈ విధంగా విత్తన శుద్ధి చేసి నాటడం వలన విత్తనాలు పక్షులు తినవు కావున అన్ని విత్తనాలు మొలకెత్తుటకు అవకాశం ఉంటుంది.

2. వేపగింజల కషాయం పిచికారీ పద్ధతి:

బాగా ఎండబెట్టిన ఒక కిలో వేప గింజలను బాగా పొడిగా చేసి పల్చని గుడ్డలో కట్టి, 10 లీటర్ల నీరున్న బకెట్‌లో ఒక రోజంతా నానబెట్టాలి. మరుసటి రోజు గుడ్డనుబాగా అదిమి పిండినట్లయితే తెల్లని పాలవంటి కషాయం నీటిలోకి దిగుతుంది. పలుసార్లు దీనిని గట్టిగా పిండి అదనంగా 10 లీటర్ల నీటిని చేర్చినప్పుడు 5% వేపగింజల కషాయం తయారు అవుతుంది.. ఈ రకంగా తయారు చేసిన కషాయాన్ని చేతి పంపు సహాయంతో పంటపై పిచికారీ చేసినచో పక్షులు గింజలను తినడానికి విముఖత చూపుతాయి. ఈ పద్ధతి ద్వారా 7-10 రోజుల వరకు పక్షులు పంటను నష్ఠపరచకుండా కాపాడవచ్చు. వేపగింజల ద్రావణాన్ని ఆముదం నూనె మిశ్రమంతో కలిపి పంటపై పిచికారీ చేస్తే దీని ఫలితం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో నిరూపించబడినది.

3. కోడిగ్రుడ్డు ద్రావణం పిచికారీ:

కుళ్ళిన కోడిగ్రుడ్డులను సేకరించి వాటిని పగులగొట్టి ద్రావణాన్ని వేరుపరచాలి. ఈ ద్రావణాన్ని 25 మీ.లీ. ఒక లీటరు నీటికి కలిపి గింజ పాలుపోసుకునే థలో పంట పై పిచికారీ చేసినచో ఆ వాసనలు పక్షులకు తీవ్రమైన చిరాకును కలుగచేస్తాయి మరియు గింజలు పక్షులకు రుచించవు, అందువలన అవి పంట పొలాల వైపునకు రాకుండా దూరంగా వెళ్లిపోతాయి. దీని ద్వారా వచ్చు వాసన సుమారు 10-15 రోజుల వరకు పనిచేసి పక్షులను రాకుండా చేస్తుంది. అవసరమైనచో రెండవ విడత కూడా పిచికారీ చేసుకోవచ్చు.

4. రిబ్బన్‌ పద్ధతి:

ఈ పద్దతిలో ఒక వైపు తెలుపు రంగు, మరొక వైపు ఎరుపు రంగు కలిగి, పాలీప్రొపిలీన్‌తో తయారు చేయబడి అర అంగుళం వెడల్పు కలిగిన తళ తళ మెరిసే రిబ్బన్లను వెదురు బొంగుల సాయంతో పంటపై ఒక అడుగు ఎత్తులో ఉత్తర దక్షిణ దిశలో కట్టుకోవాలి. ఈ కర్రలకు రిబ్బన్లను 3 లేదా 4 మెలికలు త్రిప్పి కర్రల మధ్య దూరం 10 మీటర్లు ఉండేలా చూసి కట్టవలెను. పక్షుల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే కర్రల మధ్య దూరం 5 మీటర్లు తగ్గించి కట్టవలెను. 

ఈ విధంగా కట్టడం వలన సూర్యరశ్మి రిబ్బన్‌ పైన పడి ఆ రిబ్బన్లు తళ తళ మెరిసి పకక్షుల కంటికి తీవ్రమైన అసౌకర్యమును కలిగించును కావున పక్షులు పంట పొలం వైపు దృష్ఠి సారించలేవు. రిబ్బన్లు గాలికి రెపరెపమని శబ్దం చేయడం వలన పక్షులు బెదిరి పంట పొలాల నుండి దూరంగా వెళ్లిపోతాయి. ఈ పద్ధతి ద్వారా సుమారు 10 -15 రోజుల వరకు పక్షుల బెడదను అరికట్టవచ్చు. రిబ్బన్‌ పద్దతిని విత్తనం విత్తే థలో మరియు గింజ పాలుపోసుకునే థ లో కూడా ఉపయోగించవచ్చు. ఒక ఎకరా పొలంలో 100 మీ. నిడివిగల రిబ్బన్లు సుమారు 10 వరకు అవసరపడతాయి. ఎకరాకు రూ. 1000/- వరకు ఖర్చవుతుంది.

5. నెమళ్ళ యాజమాన్యం:

నెమళ్ళ నష్టతీవ్రతను తగ్గించడానికి కొబ్బరిత్రాడు / పురికొస తాడును విత్తనం విత్తే థలో పొలానికి 4 వైపులా కర్రలను పాతి భూమికి ఒక అడుగు ఎత్తులో పంట పైన అడ్డు నిలువు వరుసలలో ఒక మీటరు మధ్య ఎడంగా ఖాళీ ఉంచుకుని కట్టినట్లయితే, పంటల మీదికి ఎగురుతూ వచ్చే నెమళ్ళు పంట పొలాలపై దిగినప్పుడు వాటి కాళ్ళకి ఈ త్రాడు చుట్టుకొని రెక్కలు చిక్కుకుపోతాయి దీనికి నెమళ్ళు భయాందోళనకు గురై ఆర్తనాదాలు చేయుచు దూరంగా పారిపోతాయి. కాయలు ఏర్పడే థలో పంట గట్టు వెంబడి భూమి నుండి ఒక అడుగు ఎత్తులో 3 వరుసలు పంటచుట్టూ కట్టినట్లయితే నెమళ్ళ బెడదను సమర్థవంతంగా అరికట్టవచ్చు.

6. కాగితపు ప్లేట్‌ల పద్ధతి:

ఈ పద్దతిలో ఒక వైపు వెండి పూతను పోలిన మెరుపు గల చిరుతిండ్లు తినే కాగితపు ప్లేట్లను తీసుకుని వెండి పూత పైకి వచ్చేటట్లు ప్రొద్దుతిరుగుడు పువ్వు కాడకు అమర్చవలెను. అప్పుడు సూర్యరశ్మి సోకినప్పుడు వెండిపూత తళ తళ మెరిసి పక్షుల కళ్ళకి అసౌకర్యం కలిగించును. ఒకవేళ సూర్యరశ్మి లేకపోయినా పేపర్‌ ప్లేట్లు పకక్షులు వాలడానికి ఆధారం లేకుండా చేస్తాయి. ఫలితంగా పువ్వులో గింజ నష్టం అరికట్టబడుతుంది. ఈ పద్ధతి సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ పద్ధతి ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ ప్రొద్దుతిరుగుడు పంట గింజ పాలుపోసుకునే థలో సమర్థవంతంగా పకక్షుల బెడదను అరికట్టుతుంది.

7. ఆర్తనాద పద్ధతి:

ఈ పద్ధతిలో పంటను నష్టపరచు వివిధ పక్షుల ఆర్తనాదములను మరియు పరభక్షక పక్షుల కఠిన శబ్దాలను రికార్డు చేసి శబ్దోత్పతి యంత్రాల ద్వారా పంట పొలాలకు సమీప ప్రాంతం నుండి ఆర్తనాదాలు ఉత్పత్తి చేస్తారు. అప్పుడు పంటను నష్టం చేయు పకక్షులు బెదిరి ఆపద ఉన్నదని బ్రాంతికి గురై పంటపొలాల నుండి దూరంగా పారిపోతాయి. ఈ పద్దతిలో ఉపయోగించే యంత్రం ఖరీదు సుమారు రూ. 20000/- (సోలార్‌ ప్లేట్లతో), విద్యుత్‌ సరఫరాతో పనిచేయు యంత్రం ఖరీదు రూ. 15000/- ఈ యంత్రం సుమారుగా 4-5 ఎకరాల విస్తీర్ణం గల పంట పొలాలకు సమర్థవంతంగా పనిచేయుచున్నదని ప్రయోగపూర్వకంగా రుజువు చేయబడినది.

8. శబ్ద ప్రయోగ పద్ధతి:

ఈ పద్ధతిలో అధిక మొత్తంలో ప్రేలుడు శబ్ధాలనుత్పత్తిచేయు యంత్రాలను ఉపయోగించి పక్షులను భయబ్రాంతులకు గురి చేస్తారు. ఈ శబ్దాలను ఉత్పత్తి చేయు యంత్రం కాల్షియమ్‌ కార్బైడ్‌ అనే ముడి పదార్థం ద్వారా పని చేస్తుంది. కానీ మార్కెట్‌లో కాల్షియమ్‌ కార్బైడ్‌ ఉత్పత్తి తగ్గిన కారణంగా ఎల్‌.పి.జి.గ్యాస్‌తో నడిచే కొత్త యంత్రాలను రూపొందించారు. ఈ యంత్రాలు రూ. 40,000/- వరకు ధర పలుకుతాయి. కానీ శాశ్వతంగా వీటిని ఉపయోగించి అధిక మొత్తంలో శబ్దాన్ని ఉత్పత్తి చేసి 3-4 ఎకరాల విస్తీర్ణం లో శాశ్వతంగా పంటను కాపాడవచ్చు. ఈ యంత్రాన్ని ఒకే ప్రదేశంలో కాకుండా పంట చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఉపయోగించుట ద్వారా వెలువడే తీవ్రమైన శబ్దానికి పక్షులు దూరప్రాంతాలకు పారిపోతాయి. వీటిని చేపలు/రొయ్యల చెరువుల దగ్గర కూడా పకక్షులను బెదిరించడానికి ఉపయోగిస్తారు. 

ప్రస్తుతం మార్కెట్టులో సోలార్‌ శక్తితో పనిచేసే అగ్రి ఇ-కెనాన్‌ అనే పరికరం కూడా అందుబాటులో ఉన్నది. ఇది నిరంతరం వివిధ శబ్ధాలను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తూ పంటలను పకక్షుల బారినుండి సమర్థవంతంగా రక్షిస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.25000/- 

9. గూళ్ళ నిర్ములనా పద్ధతి:

పొలము గట్లపైనున్న పొదలలో గూళ్ళను నిర్మూలించడం, చెట్ల తొర్రలను మూయడం మరియు ఆవాస ప్రాంతాలలో పక్షి గూళ్ళను తొలగించడం ద్వారా పకక్షులు రాకుండా చేయవచ్చు.

10. ప్రత్యామ్నాయా ఆహార సరఫరా:

పంట పొలాల సమీపంలో, ఆవాస ప్రాంతాలలో వృధాగా ఉన్న భూములలో మరియు పొలం గట్ల వెంబడి వివిధ అడవి జాతి పండ్ల చెట్లు పెంచడం వలన వీటి యొక్క ఫలాలు వివిధ పక్షులను ఆకర్షిస్తాయి. తద్వారా పక్షులకు ప్రత్యమ్నాయ ఆహారం లభించి పంట పొలాల మీద పకక్షులు దాడి చేయడం తగ్గుతుంది. మరియు అడవి జాతి ఫలసాయం వలన రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా ఆడవి జాతి పండ్ల చెట్లయిన చీమ చింత, మోదుగ, రావి, మర్రి, పర్కి, కల్మికాయలు, మొర్రి, తూనిక జీడిపండ్లు, రేగు, చింత, వెలగ మొదలైనవి పక్షులకు ప్రత్యామ్నాయ ఆహరం అందించడంలో ప్రముఖమైనవి.

11. ఆకు చుట్టుపద్ధతి:

మొక్కజొన్న పంటలో ఇది అతిముఖ్యమైన పద్ధతి. ఇందులో గింజలు పాలు పోసుకునే థలో కంకి చుట్టూ ఉన్న ఆకులను చుట్టి పక్షులకు కనపడకుండా చేయాలి. ఈ విధంగా గట్లనుండి 3-4 వరుసల వరకు ఆకులను చుట్టి పక్షుల దృష్టిని మరల్చి పంటలను రక్షించవచ్చు. తక్కువ విస్తీర్ణంలో పంటలకు ఇది అనుకూలమైన పద్ధతి. ఇది చాలా ప్రభావవంతమైన ఎటువంటి సామాగ్రి పరికరాలు అవసరం లేనటువంటి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆమోదయోగ్యమైన పద్ధతి.

12. తెర పంట పద్ధతి:

సాధారణంగా మొక్కజొన్న పంటలో రామచిలుకలు పంట గట్ల వెంబడి 2-3 వరుసలలో ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. పశుగ్రాస వంగడాలైన జొన్న గాని, మొక్కజొన్నను దగ్గర దగ్గరగా స్క్రీన్‌ క్రాప్‌/తెర పంటగా వేయడం ద్వారా లోపల ఉన్న మొక్కజొన్న పంటను పకక్షుల కంటికి కన్పించకుండా సమర్థవంతంగా పక్షుల బారి నుండి కాపాడవచ్చు. తెర పంట పశుగ్రాసంగా ఉపయోగపడి రైతుకు అదనపు ఆదాయాన్ని కూడా చేకూరుస్తుంది.

పైన సూచించిన పద్ధతులని ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో అమలు పరిస్తే వచ్చే ఫలితాల కన్నా అవసరంమేరకు రెండు మూడు పద్ధతులు కలిపి మిశ్రమంగా సమగ్ర సస్యరక్షణ అమలుపరచినట్లయితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

డా|| నామాల శ్రీనివాసరావు, శ్రీమతి బి.అనూష, డా|| టి. శ్రీనివాస్‌, జి. ఝాన్సీరాణి, వి. రమ్య శ్రీ, ఆచార్య ఎన్‌ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య అనుబంధ విభాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మారుటేరు-534122, ఆంధ్రప్రదేశ్‌.

Read More

మిద్దెమీదనే పల్లెటూరు, రిసార్ట్‌

వివిధ రకాల కారణాల వలన పట్టణాలలో, నగరాలలో ఇంటిపంట లేదా మిద్దెతోట సంస్కృతి రోజురోజుకు పెరుగుతూ ఉంది. మొదటలో తమ ఇంటి అవసరాలకు సరిపోను కూరగాయలు మరియు ఆకుకూరలతో మొదలైన ఇంటిపంటను కొందరు పట్టుదలతో నందనవనంగా మార్చుకుంటున్నారు. మనసు ఉంటే మార్గాలు అనేకం అన్నట్లు, సంకల్పం ఉంటే ఏదైనా అసాధ్యం కాదు అని కొంతమంది ఇంటిపంట ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. అలాంటి ఔత్సాహికులలో హైదరాబాద్‌ కొంపల్లిలో మిద్దెతోటను నిర్వహిస్తున్న శోభ ముందువరుసలో ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

శోభకు మొక్కలన్నా, పల్లెటూరు అన్నా, పచ్చదనం అన్నా మక్కువ ఎక్కువ. పరిస్థితుల ప్రభావంతో పల్లెటూరుని వదలి నగరంలో జీవనం కొనసాగించవలసి రావడంతో వాటన్నింటిని మిస్‌ అవుతున్నామన్న లోటు నుంచి బయటకు రావటానికి తన మిద్దెతోటను ఒక నందనవనంగా తీర్చిదిద్ది మిద్దెతోటలోనే ఒక పల్లెటూరును, ఒక రిసార్టును సృష్టించి మనసు ఉంటే మార్గం తప్పక ఉంటుందని నిరూపిస్తున్నారు.

కొంపల్లిలోని గేటెడ్‌ కమ్యూనిటీలో, తమ విల్లా పైన అందుబాటులో ఉన్న 200 గజాల మిద్దెను రెండు భాగాలుగా చేసుకుని ఒకవైపు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరియు రెండోవైపు పూలు మరియు క్రోటాన్స్‌ను పెంచుతూ మిద్దెమీదకు వచ్చిన అందరూ రిసార్టులో మరియు పల్లెటూరులో ఉన్న అనుభూతి పొందేలా తమ మిద్దెతోటను తీర్చిదిద్దారు. మిద్దెమీద ఒక ప్రాంతంలో పల్లెటూరులో ఉండే అన్ని అంశాలను సొంతంగా తయారు చేసి ఏర్పాటు చేసుకున్నారు. వృధాగా పడవేసే ఏ వస్తువులను కూడా వదలకుండా తనకు అనుకూలంగా డిజైన్‌ చేసుకుని అందులో మొక్కలు పెంచుతుంటారు. చివరకు తాగిపడవేసే కొబ్బరి బోండాలను కూడా వృథాగా పడేయకుండా కొబ్బరి బోండాలకు రంగులు వేసి డిజైన్లు వేసి ఏదో ఒక మొక్కను పెంచుతుంటారు. ఈ విధంగా ఖాళీ పెరుగు డబ్బాలు, నూనె సీసాలు లాంటి వాటన్నింటిలో మొక్కలు పెంచుతుంటారు. మిద్దెతోపాటు పెరటిలో కూడా విల్లా నాలుగు ప్రక్కల పెరటి గోడపక్కన కూడా పసుపు, మిరప, వగ, టమాటాలాంటి మొక్కలు పెంచుతున్నారు.

మిద్దెతోటలో పాలకూర, చుక్కకూర, మెంతికూర, పొదీనా, కొత్తిమీర, బీర, కాకర, చిక్కుడు, సొర, వంగ, టమాట, మునగ, సపోట, జామ, అంజూర, మామిడి, స్టార్‌ఫ్రూట్‌, జీడిమామిడి, వాటర్‌ యాపిల్‌, మల్లె, మందార, గన్నేరు మొదలగు మొక్కల పెంపకం చేస్తున్నారు. అవకాశం ఉన్న చోట వ్రేలాడే కుడీలను కూడా నిర్వహిస్తున్నారు.

పసుపు సాగులో శోభగారిని ప్రత్యేకించి చెప్పుకోవలి. తమ ఇంటి పంటలో పసుపును ఎక్కువగా సాగు చేస్తున్నారు. తనకు పసుపు సాగుపై మక్కువ పెరగడంతో తమ గేటెడ్‌ కమ్యూనిటీలో ఖాళీ ప్రాంతంలో పసుపును సాగు చేసి తోటి వారికి పసుపును ఉచితంగా పంపిణీ చేశారు. ఎవరికి వారు తమకు సంవత్సరానికి సరిపోయేటంత పసుపును తామే సొంతంగా పండించుకోవటానికి ముందుకు రావాలన్నదే శోభ ధ్యేయం. పసుపు సులభమైన పంట కాబట్టి ఎవరైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా పసుపును పండించుకోవవచ్చు అని తోటి ఇంటిపంటదారులకు చెప్పడంతో పాటు ఇంటిపంట అవగాహనా సదస్సుల ద్వారా కూడా వేరేవారికి చెబుతూ ఉంటారు.

మట్టి మిశ్రమంలో ఎర్రమట్టి, కోకోపిట్‌, వర్మికంపోస్ట్‌, ఇసుక, వేపపిండిలతో మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని మొక్కలు పెంచుతుంటారు. తరువాత అవసరాన్నిబట్టి ఆముదాల పిండి, బోన్‌ మీల్‌, కిచెన్‌ వేస్ట్‌లను మొక్కలకు బలంగా అందించడంతో పాటు చీడపీడల నివారణకు బూడిద, వేపనూనె, పులిసిన మజ్జిగలను వినియోగిస్తుంటారు. కొత్తగా ఇంటిపంటను చేపట్టేవారు మొదటిలో చిన్న చిన్న టబ్బులలో మెంతికూర, పాలకూర, పొదీనా లాంటివాటి పెంపకాన్ని చేపట్టి అనుభవం గడిచే కొలది మొక్కల సంఖ్యను పెంచుకుంటూ పోతే ఫలితం బాగా ఉంటుందని కొత్తగా ఇంటి పంటలోకి అడుగు పెట్టేవారికి శోభ సలహా ఇస్తున్నారు.          

– వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

ఆహ్లాదకర వాతావరణానికి మిద్దెతోట సరైనదారి

మన ఆరోగ్యాన్ని కాపాడుటలో మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, శారీరక శ్రమ, మన మానసిక పరిస్థితి, ప్రకృతితో మమేకమవడం లాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కాని ప్రస్తుత కాంక్రీట్‌ జంగిల్స్‌ మరియు ఉరుకుల పరుగుల జీవితాలలో ఇవన్నీ అందుబాటులో దొరకడము చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ అందుబాటులో లేకపోవడముతో చాలామంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి తమతమ ఆరోగ్యాలను సంరక్షించుకోవాలనుకునే వారందరూ తమకు అవకాశం ఉన్నంతలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు అందుబాటులోకి వచ్చిన మార్గమే ఇంటిపంట. ఇంటి పంట వలన రసాయనాలు లేని కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లను పొందడముతో పాటు పచ్చదనం వలన వాతావరణ కాలుష్యం తగ్గటంతో పాటు ఇంటి పంట వలన శారీరక శ్రమకు అవకాశం కుదురుతుంది కాబట్టి ఆహ్లాదకర వాతావరణానికి ఇంటి పంట సరైనదారి అని నమ్మి ఇంటిపంటను ఇప్పటి వరకు చేపట్టిన వారు, ఇంకా చేపట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.  ఆరోగ్యకర ఆహారాన్ని పొందడముతో పాటు యోగా చేసుకోవటానికి, తనకిష్టమైన సంగీతాన్ని పచ్చని మొక్కల మధ్య ఆస్వాదించటానికి సరైన దారి ఇంటిపంట అని గ్రహించి విజయవాడ, పటమట ప్రాంతానికి చెందిన భారతిదేవి మిద్దెతోటను మొదలు పెట్టారు.

భారతీదేవి కాస్మొటాలజిస్ట్‌. వీరికి చిన్నతనం నుంచి పచ్చదనం, సంగీతం, యోగాల మీద మక్కువ చాలా ఎక్కువ. తన వృత్తిలో తీరిక లేకుండా ఉండే భారతీదేవి తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకుంటూ కాస్మొటాలజిస్ట్‌గా తన వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ సంగీతానికి, యోగాకి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. వాటితోపాటు ఇంటి పంటపై కూడా మక్కువ ఉంది కాబట్టి కొంత సమయాన్ని కేటాయించి తమ మిద్దె మీద కొన్ని రకాల మొక్కల పెంపకం చేపట్టి కొనసాగిస్తున్న పరిస్థితులలో కరోనా రావడం జరిగింది. కరోనా సమయంలో ఎక్కువ సమయం ఇంటి వద్దనే గడపవలసి రావడముతో ఆ సమయాన్ని తమ మిద్దె తోటలోని మొక్కల సంఖ్యను పెంచటానికి కేటాయించి మిద్దెతోటను అభివృద్ధి చేశారు.

మిద్దెమీద మొక్కల పెంపకం చేస్తున్నారు కాబట్టి స్లాబుమీద నీరుపడి స్లాబు పాడవకుండా ఉండటానికి వీలుగా స్లాబుకు వాటర్‌ ఫ్రూప్‌ కోటింగ్‌ను వేయించడంతో పాటు స్టాండులు ఏర్పాటు చేసుకుని స్లాండులపై కుండీలు, టబ్బులు, డ్రమ్ములు లాంటివి ఏర్పాటు చేసుకుని వాటిలో మొక్కల పెంపకం చేస్తున్నారు. అన్ని రకాల మొక్కలకు ఒకే రకమైన కంటెయినర్లు ఉపయోగించకుండా మొక్కల రకాలను బట్టి కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. ఆకుకూరలకు వెడల్పు మూతి ఉండే టబ్బులను, పండ్ల మొక్కల పెంపకానికి డ్రమ్ములను, కూరగాయలకు బక్కెట్లను…. ఈ విధంగా మొక్కల రకాన్ని బట్టి అందుకు అనుకూలంగా ఉండే కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. మట్టి మిశ్రమంలో మట్టి, ఎరువు, వేపపిండి, ఇసుక లాంటి వాటిని కలుపుకున్నారు. మట్టి మిశ్రమములో కోకోపిట్‌ను ఉపయోగించలేదు. ఈ మట్టి మిశ్రమము మూడు నెలల వరకు మొక్కలకు పోషకాలను అందిస్తుంది. కాబట్టి మూడునెలల తరువాత మరలా అవసరమైన మట్టి మిశ్రమాన్ని అందిస్తుంటారు. కంటెయినర్లలోని మట్టి గట్టిపడినట్లయితే మొక్క పెరగదు కాబట్టి మట్టి గట్టిపడకుండా ఉండేందుకు గాను క్రమం తప్పకుండా మట్టిని కలుపుతూ మట్టి గుల్లగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇంట్లో వృథాగా పడి ఉండే ప్లాస్టిక్‌ బక్కెట్లు మరియు ఇతర సామాగ్రిని కూడా కంటెయినర్లగా ఉపయోగిస్తూ&వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.

వీరి మిద్దెతోటలో చింతచిగురు కోసం చింత, సపోట, జామ, అంజీర, డ్రాగన్‌ఫ్రూట్‌, దానిమ్మ, అరటి, ఉసిరి, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి మొదలగు మొక్కలతో పాటు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఆల్‌స్సైసెస్‌ మొక్క, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, బీర సొర, కాకర లాంటి తీగజాతి కూరగాయల మొక్కలను కూడా ఆయా మొక్కలకు అనుకూలమైన కంటెయినర్లలో పెంచుతున్నారు. వీటితో పాటు కొన్ని రకాలను పాలినేషను కొరకు, మిద్దెతోట అందంగా కనిపించేందుకుగాను పెంచుతున్నారు. వేసవి కాలంలో మొక్కల పాదులలో కొబ్బరి పీచు లేదా ఎండు ఆకులను ఏర్పాటు చేయడం వలన ప్రయోజనం బాగా ఉంటుందని ఆవిధంగా చేస్తున్నారు. వేసవి కాబట్టి పిచ్చుకలకు, పకక్షులకు తాగేందుకు నీటిని కూడా మొక్కల నీడలో ఏర్పాటు చేయడం వలన వివిధ రకాల పకక్షులు వీరి మిద్దెతోటలో కనిపిస్తుంటాయి.

వీరికి సంగీతంపై మక్కువ ఎక్కువ కాబట్టి ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో వీణవాయించటానికి కేటాయిస్తారు. మిద్దెతోటలో వీణ వాయించటముంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వీణవాయించటం వలన పొందే తృప్తితో పాటు మిద్దెతోటలోని మొక్కలకు కూడా ప్రతిరోజు సంగీతాన్ని వినిపిస్తున్నారు. అంతేకాకుండా తాను చిన్నతనం నుంచి యోగా చేస్తుంటారు. ఇప్పుడు మిద్దెతోటలో యోగా చేయడం వలన ఫలితాలు ఇంకా ఆశాజనకంగా ఉంటున్నాయని భారతీదేవి అంటున్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో గడపడం వలన శారీరక శ్రమకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు.

తమ ఇంట్లో తమ చేతులతో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా మంచి రుచిగా ఉంటాయని, కూరగాయలు, ఆకుకూరలు త్వరగా ఉడుకుతాయని, తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మిద్దెతోటలో ఉసిరి, చింత లాంటి విటమిన్లు అందుబాటులో ఉండే మొక్కలను పెంచి వాటిని ఆహారంగా తీసుకున్నట్లయితే మన శరీరానికి కావలసిన విటమిన్లు సహజ సిద్ధంగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి మిద్దెతోట వలన అందరికీ ప్రత్యేకించి స్త్రీలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు  ఉంటాయి కాబట్టి అందరు ఇంటి పంటను తప్పని సరిగా చేపట్టాలని భారతీదేవి కోరుతున్నారు. కొత్తగా ఇంటి పంటను చేపట్టే వారు మొదటలో ఆకుకూరలతో మొదలుపెడితే ఫలితాలు బాగుంటాయనే సూచనను ఇంటిపంటను మొదలు పెట్టేవారికి ఇస్తున్నారు.   

  – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

వృథా వస్తువులతో మిద్దెతోట

కారణాలు ఏమైనా కాని ఇంటిపంట చేపట్టే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో కొన్ని మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు పెంచుకోవటానికి అనేక రకాల కుండీలు, టబ్బులు, డ్రమ్ములలాంటివి వివిధ రకాల కొలతలలో అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఇలాంటివి అన్నీ కూడా కొంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖర్చు ఎక్కువుగా అవుతుంది. తక్కువ ఖర్చుతో ఇంటి పంటను మొదలు పెట్టాలనుకునేవారు తమ ఇంట్లో అందుబాటులో ఉండే వృథా అయిన ఫ్రిజ్‌ డబ్బాలు, బక్కెట్లు, కూలర్‌ డబ్బాల లాంటి వాటితో మొదలు పెడుతున్నారు. వాటన్నింటితో పాటు ఇంట్లో అనేక రకాల బిందెలు, కుండీలు, నీళ్ళ డబ్బాల లాంటి వాటిని కూడా తమ మిద్దెతోటలో వినియోగిస్తున్నారు నెల్లూరు పట్టణంలోని మైపాడు గేటు సమీపములో మిద్దెతోటను పెంచుతున్నారు విజయ.

విజయ గారిది వ్యవసాయ నేపథ్యం. ప్రస్తుతం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన విజయకి మొక్కలన్నా, పచ్చదనం అన్నా బాగా ఇష్టం కాబట్టి ఇంటిపంటలను మొదలు పెట్టాలని ఆలోచించి తమ మిద్దెమీద మిద్దె తోట పెంపకానికి అవకాశం ఉంది కాబట్టి మిద్దెతోటను సాగు చేస్తున్నారు. జీరో బడ్జెట్‌తో మిద్దెతోటను మొదలు పెట్టాలనే తలంపుతో మొక్కల పెంపకానికి అవసరమయిన కుండీలు లేదా డ్రమ్ముల లాంటివాటిని బయట నుంచి కొనుగోలు చేయకుండా తమ ఇంట్లో వృథాగా పడి ఉండే బక్కెట్లు, డబ్బాలు, కుండీలు, బియ్యం డబ్బాలు, స్టీలు బిందెలు, ఫ్రిజ్‌ డబ్బాల లాంటి వాటిని తమ మిద్దె తోటలో ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు పాతసామానుకు ఉల్లిపాయలు అమ్మేవారి వద్ద నుంచి తక్కువ ధరకు ప్లాస్టిక్‌ బక్కెట్లు, ప్లాస్టిక్‌ డబ్బాలు లేదా ఏ ఇతర సామాన్లు మొక్కల పెంపకానికి అనుకూలంగా ఉంటాయో అలాంటి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఏది ఏమైనా కాని మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటెయినర్ల కోసం సాధ్యమయినంతవరకు ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్‌లో చేయాలన్నదే విజయ గారి లక్ష్యం. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ ఇంట్లో ఏ వస్తువును వృథాగా పడవేయకుండా చివరికి పగిలిపోయిన కుండలలో కూడా మొక్కలు పెంచుతున్నారు. 

మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టి మిశ్రమం కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా తమ మిద్దెతోటలో ఉండే మొక్కల నుండి లభించే ఎండు ఆకులతో పాటు బయట అందుబాటులో ఉండే ఎండు ఆకులను కూడా సేకరించి ఎండు ఆకులు మరియు మట్టిని పొరలు పొరలుగా వేసుకుంటూ పైన 25 శాతం భాగం మాత్రమే ఎరువు, మట్టితో నింపి అందులో మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఈ పద్ధతి వలన లోపల వేసిన ఎండు ఆకులు నిదానంగా కుళ్లుతుంటాయి కాబట్టి మొక్క నాటిన లేదా విత్తనం పెట్టిన 60 నుండి 90  రోజుల వరకు మొక్కకు పోషకాలు ప్రధానంగా అందుతుండడము విజయ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. మొక్కకు అవసరమైన పోషకాలు సక్రమంగా అందడము వలన మొక్కల రోగనిరోధక శక్తి పెరిగి చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుంది. తాను పెంపకం చేసే మిద్దెతోటలో చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుంది కాట్టి చీడపీడల నివారణ కొరకు పెద్దగా ఇబ్బందులు ఉండడం లేదు.

వీరి మిద్దెతోటలో ఆకుకూరలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుటలో ఆకుకూరలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాబట్టి రోజు మార్చి రోజు తమ ఆహారంలో ఆకుకూర ఉండేలా తమ మిద్దెతోటలో ఆకుకూరలను పెంచుతున్నారు. తోటకూర, కొత్తిమీర, పొదీనా, రెండు రకాల బచ్చలి కూర, పొన్నగంటి కూర, రెండు రకాల గోంగూర, మెంతికూర పెంచడముతోపాటు ఆవాలు, వాము లాంటి వాటిని కూడా మిద్దెతోటలో పెంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తున్నారు. వీటితోపాటు మునగ ఆకు, తమలపాకు లాంటి వాటిని కూడా తమ వంటలలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. వంగ, బెండ, టమాట లాంటి కూరగాయలతో పాటు తీగజాతి కూరగాయల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. తీగజాతి కూరగాయల పెంపకానికి ఎక్కవ స్థలం అవసరం లేకపోగా దిగుబడి కూడా బాగా వస్తుంది కాబట్టి బీర, కాకర, పొట్ల, దోస లాంటి కూరగాయలు 365 రోజులు వచ్చేలా విత్తనాలను వేస్తుంటారు. ఏది ఏమైనా కాని తమ ఇంటి అవసరాలకు సరిపోయే కూరగాయలు, ఆకుకూరలను అతి తక్కువ ఖర్చుతో ఒక విధంగా చెప్పాలంటే ఖర్చు లేకుండా ఆరోగ్యంగా పెంచుతూ ఉపయోగిస్తున్నారు. వీరు పెంపకం చేసే చింత చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చింత చిగురు కోసమని చింత చెట్టును పెంచుతున్నారు. ఆ చెట్టు నుండి ప్రతినిత్యం చింతచిగురు పొందుతున్నారు. చింత చెట్టు పెద్ద చెట్టు అయిన తరువాత తమ ఇంటి చుట్టుప్రక్కల వారు తమ తమ అవసరాలకు ఆ చెట్టు నుండి చింత చిగురును పొందుతుంటారు. వీటితో పాటు కరివేపాకు, బొప్పాయి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, కొబ్బరి, కుంకుడు, బత్తాయి, నారింజ, గన్నేరు, మల్లె లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు.

తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి మొక్కల పెంపకం గురించి, పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అనునిత్యం తెలియ చేయడంతో పాటు స్కూలు ఆవరణలో కూడా కొన్ని మొక్కలను పిల్లల చేత నాటిస్తుంటారు. అంతేకాకుండా ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అవకాశం ఉన్న చోట మొక్కల పెంపకం చేపడుతుంటారు. కొత్తగా ఇంటి పంటను చేపట్టే వారు ఇంట్లో వృథాగా ఉండే వస్తువులను తమ ఇంటి పంటలో ఉపయోగిస్తే జీరోబడ్జెట్‌తో ఇంటి పంటను మొదలు పెట్టవచ్చు అని సలహా ఇస్తున్నారు.        – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

తక్కువ ఖర్చుతో టెర్రస్‌ గార్డెన్‌ 

పలు రకాల కారణాల వలన ఇటీవల కాలంలో హైదరాబాద్‌ నగరంతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా ఇంటి పంటను చేపట్టే వారు పెరుగుతున్నారు. ఇంటిపంటదారుల సంఖ్య పెరిగేకొలది ఇప్పటి వరకే ఇంటి పంట మొదలు పెట్టిన వారికి మరియు కొత్తగా మొదలు పెట్టే వారికి అనేక రకాలుగా ఉపయోగం ఉంటుంది. మొదటలో కొద్ది మంది మాత్రమే ఇంటి పంటను చేస్తున్న సమయంలో విత్తనాల కొరకు, చిన్న చిన్న సలహాల కొరకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇంటి పంట దారుల సంఖ్య పెరిగే కొలది అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి ఇంటిపంట వైపు అడుగులు వేసే వారి సంఖ్య ఏఏటికాయేడు పెరుగుతూ ఉంది. ఇంటి పంట వైపు అడుగులు వేసేవారిలో అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు ఉంటున్నారు. మిగతా వారితో పోల్చుకుంటే ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీవిరమణ చేసిన వారికి ఇంటిపంట బాగా ప్రయోజనకారిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  తమకు అవసరమయిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల లాంటి వాటిని ఎలాంటి రసాయనాలు వేయకుండా ఆరోగ్యకరంగా పండించుకొని తింటూ తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు పదవీ విరమణ అయిన తరువాత ఎలాంటి వ్యాపకం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఇంటి పంట ఒక ఆరోగ్యకర వ్యాపకంగా ఉపయోగపడుతుండడంతో పదవీవిరమణ చేసిన వారికి అన్ని రకాలుగా ప్రయోజనకారి ఇంటిపంట అని గ్రహించి తాము చేస్తున్న ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన తరువాత టెర్రస్‌ గార్డెన్‌ మొదలు పెట్టారు హైదరాబాదు మధురానగర్‌కి చెందిన వినయకుమార్‌, సృజన దంపతులు.

వినయ్‌కుమార్‌ పవర్‌గ్రిడ్‌లో మేనేజరు బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. సృజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ పదవీ విరమణ పొందారు. వీరు తమ పదవీ విరమణ అయిన తరువాత ఒక మంచి వ్యాపకం కోసం 2020వ సంవత్సరములో తమ మిద్దె మీద మిద్దెతోటను ప్రారంభించారు. మిద్దెతోట వలన ఆరోగ్యకర ఆహారాన్ని పొందడముతో పాటు శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం దొరుకుతుందని ఇటువైపు అడుగులు వేశారు. వారు మిద్దెతోటను ప్రారంభించే సమయానికి అనేక మంది ఇంటి పంటదారులు ఉన్నారు కాబట్టి కొన్ని రకాల మెళకువలు చేపట్టడానికి అవకాశం కుదిరింది. తెలుసుకున్న వెళకువలలో భాగంగా మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటెయినర్ల విషయంలో ఎక్కువ ఖర్చు చేయకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లో అందుబాటులో ఉండే వృథాగా పడవేసే టైర్లు, డబ్బాలు, నీటి డబ్బాలు, బక్కెట్లు, నూనె టిన్నుల లాంటి వాటితో పాటు స్క్రాప్‌ దుకాణాలలో తక్కువ ధరలో అందుబాటులో ఉండే కూరగాయల ట్రేలు, సూట్‌కేసుల లాంటి వాటిని అతి తక్కువ ధరలో సేకరించి వివిధ రకాల మొక్కల పెంపకం మొదలు పెట్టారు.

టెర్రస్‌ మీద నీళ్ళు పడితే స్లాబ్‌ పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి కంటెయినర్లను స్లాబ్‌ మీద పెట్టకుండా కొంచెం ఎత్తులో ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం వలన స్లాబ్‌ మీద పడిన నీరు వెంటనే ఆరిపోయి స్లాబ్‌ పాడవకుండా కాపాడుకోగలిగారు. మట్టి మిశ్రమానికి గాను మిద్దెతోట ప్రారంభించిన మొదటిలో ఒక ట్రాక్టరు ట్రక్కు మట్టిని కొనుగోలు చేసుకుని ఇప్పటివరకు ఆ మట్టిని వినియోగిస్తున్నారు. మట్టి మిశ్రమములో మట్టి, కోకోపిట్‌, ఎరువులను సమానంగా తీసుకుని దానికి కొద్దిమొత్తంలో వేపపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని కంటెయినర్లలో నింపి మొక్కల పెంపకం మొదలు పెట్టారు.

విత్తనాల కొరకు కూడా పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. మిద్దెతోట ప్రారంభించిన కొత్తలో ఒక్కసారి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది. తరువాత తమ మిద్దెతోటలోని మొక్కల నండి విత్తనాలను సేకరించి తాము ఉపయోగిస్తూ తోటివారికి అందిస్తూ ఉన్నారు. ఇందుకు గాను ఇంటి పంటను పెంచేవారితో కొన్ని గ్రూపులను ఏర్పాటు చేసుకుని ఆ గ్రూపులలో విత్తనాల గురించి, ఇంటి పంటకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకుంటూ, ఒకరికొరకు చేదోడుగా ఉంటూ, విత్తనాలు, నారు లాంటి వాటిని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిద్దె తోటను కొనసాగిస్తున్నారు. మొక్కలకు పోషకాలకు మరియు చీడపీడల నివారణకు గో-కృపామృతం, వేస్ట్‌డికంపోజర్‌, కిచెన్‌ వేస్ట్‌ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు. అన్ని రకాల మెలకువలు తీసుకుంటూ తక్కువ ఖర్చుతో మిద్దెతోటలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. తమ మిద్దెతోటలో వివిధ రకాల ఆకుకూరలతో పాటు, వంగ, టమాట, చిక్కుడు, పచ్చిమిర్చి, చింత, ఉసిరి, స్ట్రాబెర్రి, జామ, సపోట, యాపిల్‌ బేర్‌, నిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్‌, బత్తాయి లాంటి వాటితో పాటు తులసి, అరటి లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులలో పెంపకం చేస్తున్నారు.కొత్తగా ఇంటిపంటను చేపట్టేవారు కంటెయినర్ల విషయంలో ఎక్కువ 

ఖర్చు  పెట్టకుండా తమ ఇంట్లో వృథాగా పడి ఉన్న టైర్లు, వాటర్‌ క్యానులు, నూనె క్యానులు, బక్కెట్ల లాంటి వాటితో పాటు స్క్రాప్‌ దుకాణాలలో దొరికే కూరగాయల ట్రేలు, ప్లాస్టిక్‌ డబ్బాలు, బక్కెట్లు లాంటి వాటిని తక్కువ ధరలో కొనుగోలు చేసుకుని మొక్కల పెంపకం చేపట్టగలిగగితే ఖర్చులు తక్కువగా అవుతాయి. విత్తనాల విషయంలో తమ లాంటి ఇంటి పంట దారులను సంప్రదిస్తే విత్తనాలు అందుబాటులోవస్తాయి కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే కొత్తగా ఇంటిపంటను చేపట్టే వారిని వారు కోరుతున్నారు.

  – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More
  • 1
  • 2