ఇటీవల కాలంలో పాడి పరిశ్రమను, జీవాల పరిశ్రమను మేత కొరత తీవ్రంగా వేధిస్తోంది. పచ్చిక బీళ్లు కనుమరుగైపోతున్నాయి. మేతకొరత వల్ల పశువుల్ని పోషించలేక అనేకమంది తమవద్ద ఉన్న మేలు జాతి పశువుల్ని సైతం వట్టిపోయిన వెంటనే కబేళాలకు తరలిస్తున్నారు. నిర్వహణ సమస్యల కారణంగా వేలాది ఎకరాల పంట భూములు తోటలుగానూ, రియల్ ఎస్టేట్ వెంచర్లుగానూ మారిపోతున్నాయి. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి వంటి తోటలలో చెట్లకు మధ్య వీలైతే చెట్ల నీడలో కూడా అనేక పశుగ్రాసాలను పెంచవచ్చును. ఈ విధంగా తోటలలో పచ్చిగ్రాసాల సాగును సిల్విపాశ్చర్ అని వ్యవహరిస్తారు. ఈ తోటలలో పశుపోషణ, గొర్రెల పోషణలను చేపడ్తే పండ్ల సాగు కంటే పశుగ్రాసాల ద్వారా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వచ్చే స్థిరమైన నికర ఆదాయం ఎక్కువగా ఉంటాయి. అది ఎలాగో ఇప్పుడు చర్చిద్దాము.
భూసారాలు పెరుగుతాయి: పశువులు, గొర్రెల వ్యర్థాలతో భూమిలో కార్బన్ మరియు నత్రజని సహజరీతిలో పెరుగుటే కాక, భూమిలో నీటిని పీల్చుకొనే గుణం కూడా మెరుగుపడుతుంది. ఏటవాలు భూములేకాక వరదపీడిత ప్రాంతాలలో సారవంతమైన భూములు సైతం కోతకు గురయ్యే ముప్పు తగ్గుతుంది. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాల వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, రసాయన ఎరువుల అవసరాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ గ్రాస పైర్ల సాగును 3-4 సంవత్సరాలకు ఒకసారి పంటమార్పిడి చేస్తే ఈ ప్రయోజనం మరింతగా ఎక్కువగా ఉంటుంది. పారా నేపియర్ వంటి గ్రాసాల వేర్లు భూమిని కోతకు గురికాకుండా పటిష్టపరుస్తాయి.
కార్మికుల లభ్యత పెద్ద సమస్యగా మారిన ఈ రోజుల్లో తోటల కాపలాదారుల్ని తోటలో కొన్నిజీవాలను లేదా ఒకటి, రెండు పాడి పశువుల్ని పెంచడానికి వెసులుబాటు కల్పిస్తే ఈ అదనపు ఆదాయం వల్ల వారు నమ్మకంగా స్థిరంగా అదే కమతంలో విశ్వాసంగా కొనసాగగలరు.
చెట్ల మధ్య పెరిగే గ్రాసాల వల్ల తోటలలో జీవవైవిధ్యం పెరుగుట ద్వారా పరాగసంపర్కము మెరుగుపడి ఫలసాయాలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
చెట్లతో పాటు, చెట్ల మధ్య పచ్చగా పెరిగే గ్రాసాలకు అందించే సాగునీటి వల్ల తోటలలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. నేలరాలిన ఎండిన ఆకులు మరియు ఎండుగడ్డి రాపిడి వల్ల లేదా అగ్నిచోదకాల వల్ల మంటలు చెలరేగి తీవ్ర అగ్నిప్రమాదాలకు దారితీసి భారీనష్టాలను కలిగించటం ప్రతి వేసవిలోనూ మనం చూస్తూనే ఉన్నాము.
దూడలు, పడ్డలు, పాడి పశువులు, గొర్రెలు, మేకలకు ఎంతో విలువైన పోషకాలు సహజరూపంలో వివిధ రకాల గ్రాసాల ద్వారా లభిస్తాయి. సహజమైన పచ్చిమేతల వల్ల పశువుల ఎదుగుదలతో వాటి ఉత్పాదకత, ప్రత్యుత్పత్తి సామర్థ్యాలు గణనీయంగా పెరగటంతో పాటు ఖరీదైన సమీకృత దాణాల మీద ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. మండు వేసవిలో సైతం చెట్ల నీడలోని చల్లని వాతావరణం వల్ల గేదెలు ఎదకు వచ్చి చూడి కట్టగలవు. ఇందువల్ల అవి రాబోయే పాలకొరత రోజుల్లో అధిక స్థాయిలో పాలను ఉత్పత్తి చేయగలవు. తోటలలో లభ్యమయ్యే పచ్చిమేతలవల్ల దూడలు కూడా ఆరోగ్యంగా ఉండి వేగంగా యుక్త వయస్సుకు వస్తాయి. గేదెల్ని చల్లదనం కొరకు ప్రత్యేకంగా చెరువులు, కాల్వలు, నదులలోకి వదలటం, స్ప్రింక్లర్లతో తడపటం వంటి అవసరాలు ఉండవు. గడ్డిపెరిగిన తోటలలో పెరిగే పశువులు, జీవాల ఎదుగుదల మరియు ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.
మానవ వనరుల సద్వినియోగం: ప్రతి తోటలో సంరక్షకులుగా ఉండే కాపలాదారులతోనే గ్రాసాల సాగుకు అవసరమయ్యే మానవ వనరుల అవసరాలు చాలావరకు తీరగలవు. తోటలలో గ్రాసాల సాగును ప్రారంభించడానికి జూలై-ఆగస్టు నెలలు చాలా అనుకూలమైనవి. ప్రారంభానికి ముందు భూసార పరీక్షలు జరిపించి నేలకు అనుకూలమైన గ్రాసాలను ఎంపిక చేసుకొనుట మరియు భూమిలోని లోపాలను సరిదిద్దగల చర్యల్ని చేపట్టుట మంచిది. వాణిజ్య సరళిలో దూడలు, పడ్డలు, వట్టిపోయిన పశువుల పెంపకాన్ని జీవాల పెంపకాన్ని సిల్విపాశ్చర్‌కు అనుబంధంగా ప్రారంభిస్తే వాటి పోషణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.
ప్రస్తుతం చాలా తోటలలో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ సదుపాయాలు ఉన్నాయి. వాటినే వినియోగించుకుంటూ గ్రాసాలను సాగు చేస్తే గ్రాసాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. గ్రాసాలను కోసి మేపలేని సందర్భాలలో తోటలో పశువుల్ని, జీవాలను స్వేచ్ఛగా వదిలితే అవే మేస్తాయి. ఇందువల్ల వాటిని మేపవలసిన శ్రమ కూడా తగ్గుతుంది.
సిల్విపాశ్చర్‌కు – ఏఏ గ్రాసాలను ఎలా ఎంచుకోవాలి: నీటి ఎద్దడిని, వేసవి తీవ్రతలను తట్టుకుని, బురద నేలల్లో కూడా నశించకుండా ఉండే రకాలు, పోషక విలువలు ఎక్కువగా ఉండి, దంటు తక్కువగా ఉండే మృదువైన గ్రాసాలు, తక్కువ సూర్యరశ్మిలో చెట్ల నీడలో కూడా పెరగగలిగే రకాలు, ఎక్కువ సాగునిచ్చే రకాలు, విష స్వభావాలు లేని గ్రాసాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పశువులు, జీవాలు, తొక్కినప్పటికీ నశించని అతివృష్టి, అనావృష్టులను తట్టుకోగల గుణం కూడా ఈ గ్రాసాలలో ఉండాలి.
అవిసె, సుబాబుల్, మల్బరీ చెట్లు కూడా చాలా పుష్టివంతమైన గ్రాసాలను అందిస్తాయి. కొబ్బరి, తమలపాకు తోటలు వాటి సాగుకు చాలా శ్రేష్ఠమైనవి. తోట హద్దుల మీద సుబాబుల్, నేపియర్ వంటి ఎత్తుగా పెరిగే గ్రాసాలను ఎంపిక చేసుకోవచ్చు.
పారాగాడ్డి, దీనానాధ్ గ్రాసాలు మరియూ అంజన్ గడ్డి, గరిక గడ్డి, లూసర్న్, బెర్సీమ్, జనుము, స్ట్రెలో హమాటా, పిల్లిపెసర, అలసంద, వెల్వెట్ బీన్స్, ఉలవ తదితర గ్రాసాలను సాగు చేస్తే ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేస్తూ ఉండాలి.
తోటలలో చెట్ల మధ్య, గట్ల మీద, చేపల చెరువుల గట్ల మీదకూడా పశుగ్రాసాలను సాగు చేస్తూ పశువులు, జీవాల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఆర్థిక, సాంకేతిక సహకారాలు అందించి ప్రోత్సహిస్తే పాడిపరిశ్రమకు జీవాల పెంపకానికీ రైతాంగానికీ, ఎంతో మేలు చేకూరగలదు.
డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

