మన దక్షిణాది రాష్ట్రాలలో అంతగా కనిపించకపోయినప్పటికీ రాజస్థాన్ రాష్ట్రంలో లాభదాయకమైనదేకాక అక్కడి గో ప్రేమికులు భక్తి భావంతో ఆదరించే రాథిజాతి పశువులు రాజస్థాన్ రాష్ట్రపు అధిక వేడిని, అనావృష్టిని, మేత కొరత తదితర ప్రతికూల పరిస్థితులలో పాల ఉత్పత్తితోపాటు వ్యవసాయ గ్రావిూణ రవాణాలోనూ ప్రసిద్ధిగాంచాయి. రాజస్థాన్ బికనీర్ జిల్లాలోని లుంకరాన్సర్ తాలూకాతో రాథిజాతి పశువుల ప్రధాన ఉత్పత్తి కేంద్రము అక్కడ నుండి ఈ పశువుల్ని దిగుమతి చేసుకోవచ్చు. ఈ జాతి ఆవును జమదగ్ని మహాముని ఆశ్రమంలో పూజలు అందుకుంటూ వుండేదని రాజస్థానీయుల నమ్మకం. ఈ ఆవులను రాజస్థాన్ రాణులు అని కూడా పిలుస్తారు.
సింథి, సాహివాల్ మరియు తార్పార్కర్ జాతి పశువుల జన్యుకలయిక ద్వారా స్థిరమైన జాతిగా రాథిజాతి ఆవిర్భవించిందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. రాథిజాతి పశువులలో ఉపతెగలైన రాథి పశువులు పాల ఉత్పత్తికి, రాథ్ పశువులు పని చేయడానికి పేరుగాంచాయి. మధ్యస్థమైన శరీర బరువు కలిగిన రాథి పశువులు రోజుకు సగటున 5 నుండి 10 లీటర్ల పాలను, గరిష్ఠంగా రోజుకు ఇరవై లీటర్ల వరకు పాలను 4.4 నుండి 9.00 శాతం వెన్నతో అందిస్తూ యజమానులకు మంచి లాభాలను ఆర్జించగలవు. ఈత మొత్తంలో 1500 నుండి 3000 లీటర్ల పాలను వీటి నుండి ఆశించవచ్చు.
గోధుమ రంగు చర్మం విూద తెల్లని మచ్చలు చారలు కలిగి, విశాలమైన నుదురు ప్రకాశవంతమైన కళ్లు, ఆకర్షణీయమైన మధ్యస్థంగా వుండే గంగడోలు చిన్న మూపురం పొడవైన తోక కలిగిన ఈ పశువుల కొమ్ములు కొంత సన్నగా ప్రక్కకు, వెనక్కు తిరిగి వుంటాయి.

వ్యాధి నిరోధక శక్తితోపాటు మంచి శరీరదారుఢ్యం కలిగిన రాథి జాతి ఆవులు ఉత్పత్తి చేసే ఎ2 పాలు ఉన్నతమైన పోషక విలువలతోపాటు అనేక ఔషధ సుగుణాలను కలిగి మలబద్ధకం, అజీర్తి, కీళ్లవాతం, నరాలు-నాడీమండల సమస్యలు కలిగిన వారికి ఈ పాలలోని యాంటి ఆక్సిడెంట్సుతోపాటు ప్రత్యేక ఎమైనో ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే దేశీ గోవుల ఎ2 పాలన్నింటిలో రాథిజాతి ఆవుపాలు ఉత్తమమైనవిగా గుర్తించబడ్డాయి.
పర్యావరణ మార్పులవల్ల ఏటేటా మన వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ వున్నాయి. కాబట్టి భవిష్యత్తులో నాణ్యమైన ఎ2 పాల ఉత్పత్తికి ఇతర దేశీ ఆవులకంటే మన తెలుగు రాష్ట్రాలలో ఎండ తీవ్రతను సమర్థంగా భరించగల ఈ రాథిగోవుల పెంపకం ద్వారా ఎక్కువ వెన్నతో ఎడాది పొడవునా సుస్థిరంగా పాలను ఉత్పత్తి చేయవచ్చును. ఈ ఆవుల పాలు, నెయ్యిలకు ఇతర పశువుల ఉత్పత్తులకంటే ఎక్కువ డిమాండుతోపాటు అధిక ధరలు కూడా కొనసాగుతున్నాయి. సింథి, సాహివాల్, గిర్ పశువులకంటే తక్కువ శరీర బరువులు కల్గిన రాథి ఆవుల నిర్వహణ ఖర్చులు కూడా తక్కువే. పిండమార్పిడి ద్వారా అత్యుత్తమ స్థాయి సెక్స్‌డ్ వీర్యం వల్ల అత్యంత విలువైన రాతి జాతి ఆవు పిండాలను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిచేసి, ప్రత్యేక సాంకేతిక పద్ధతిలో సేకరించి సాధారణ స్థాయి ఆవుల గర్భాలలో ప్రవేశపెట్టి తొమ్మిది నెలలు పెంచి, రోజుకు 15-20 లీటర్ల పాలను ఉత్పత్తి చేయగల ఎంతో లాభదాయకమైన గో సంతతిని పొందవచ్చును.
జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డిడిబి) ఆనంద్ (గుజరాత్) వారు 2002 నుండి ఈ విశిష్ఠమైన గో సంతతి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ కృషిలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ మరియు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖలు, విశ్వవిద్యాలయాలు పాలుపంచుకుంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో రానున్న రోజుల్లో అత్యధిక వేసవి తాపాలను తట్టుకుంటూ విలువైన పాలను అందించుటలో రాథిజాతి గోవుల అవసరం వుంది.
డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

