భూమిపై జీవనం కొనసాగించే అనంతకోటి జీవరాశులకు, చివరకు మొక్కలతో సహా అన్నింటికి ప్రకృతితో అనుబంధం ఉంటుంది. ప్రకృతిలో అందుబాటులో ఉండే ఎండ, గాలి, నీరు లాంటివాటిని గ్రహిస్తూ అన్ని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రకృతికి విరుద్ధంగా ఏ జీవి తన మనుగడను కొనసాగించలేదు. ఏదో తప్పనిసరి పరిస్థితులలో కొంత సమయం ప్రకృతికి విరుద్ధంగా ఉండవలసిన పరిస్థితులు నెలకొన్నా అవి మరలా కొంత సమయానికి ప్రకృతికి అనుకూలంగా మారవలసిందే. అడవులలో లేదా రోడ్లప్రక్కన పెరిగే జంతువులు మరియు మొక్కలను గమనించినట్లయితే అవి చాలా వరకు ప్రకృతితో మమేకమై జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. అందువలననే అవి ఆరోగ్యంగా తమ జీవనాన్ని కొనసాగించగలుగుతున్నాయి. జంతువుల విషయానికొస్తే మనిషి ప్రమేయం లేకుండా ఉండే అన్ని జంతువులు వాటి అవసరము మేరకు ప్రకృతిలో అందుబాటులో ఉండే ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఆయా జంతువుల నుండి వచ్చే ఉత్పత్తులు సక్రమమైన, అవసరమైన నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉంటాయి. అలా కాకుండా మనిషి ప్రమేయం మొదలయిందంటే జంతువులు అనారోగాల భారిన పడడము, వాటి ఉత్పత్తులు నాణ్యత కోల్పోవడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులలో పశుపోషణలాంటి వాటిలో మనిషి ప్రమేయం మితిమీరింది అని చెప్పవచ్చు. పాలకొరకు పోషించే పశువులను ఒకసారి గమనించినట్లయితే కొంతమంది పశుపోషకలు తమ పశువులను షెడ్లలో కట్టివేసి వాటిని ఏమాత్రం బయటకు వదలకుండా కట్టి వేసిన ప్రాంతానికి మేత, నీటిని అందిస్తూ వాటి ద్వారా పాలు పొందుతున్నారు. ఇలాంటి పెంపకం విధానాల వలన పాలలో ఉండవలసిన పోషకాలు సక్రమంగా ఉండకపోవడంతో పాటు పశువులు తరచుగా అనారోగాల బారిన పడతుంటాయి. ఇటీవల కాలంలో అంటే దేశీ జాతి ఆవు పాలు మరియు నెయ్యిల యొక్క విలువ మరియు మన ఆరోగ్యాన్ని కాపాడుటలో దేశీ జాతి ఆవు పాలు, పెరుగు, నెయ్యిలలో లభించే పోషకాల పాత్ర తెలుసుకున్న తరువాత చాలామంది దేశీ జాతి ఆవుల పోషణవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దేశీజాతి గోశాలను ప్రారంభించిన వారిలో చాలామంది ఆవులను ఒకే ప్రదేశంలో కట్టివేసి ఏమాత్రం ఎండకు తిప్పకుండా మేత మరియు నీటిని వాటికి అందిస్తూ గోఉత్పత్తులను పొందుతూ వాటిని అమ్మకం చేస్తున్నారు. ఆవులను ఏమాత్రం ఎండకు తిప్పకపోవడం వలన అలాంటి ఆవుల ద్వారా వచ్చే ఉత్పత్తులలో నాణ్యత సక్రమంగా ఉండదు అని తెలుసుకున్న కొంతమంది ఔత్సాహికులు ఆవులను ప్రకృతిసిద్దంగా ఎండలో తిరగనిస్తూ ప్రకృతి సిద్ధంగా దొరికే మేతలను తినటానికి అవకాశం ఇస్తూ గో-శాలను నిర్వహిస్తూ అలాంటి ఆవులు ద్వారా వచ్చిన పాల నుండి సాంప్రదాయ పద్ధతిలో నెయ్యిని ఉత్పత్తి చేస్తూ నాణ్యమైన నెయ్యి ఉత్పత్తికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఈ కోవకే చెందుతారు అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలంలో గోశాలను నిర్వహిస్తున్న వర్మ.
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఆహారాల వలన మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అనే విషయం తెలుసుకున్న వర్మ తనకు ఉన్న పరిధిలో దేశీ జాతి ఆవు పాల వలన ఆరోగ్యాలు మెరుగుపడతాయని తెలుసుకుని దేశీ జాతి ఆవులతో గోశాలను నిర్వహించాలని తలచి 2010వ సంవత్సరంలో కొన్ని ఆవులతో గోశాలను ప్రారంభించి నెమ్మదిగా ఆవుల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు. తన వద్ద అభివృద్ధి చెందిన ఆవులు మరియు కొనుగోలు చేసుకున్న ఆవులతో కలిపి ప్రస్తుతం వర్మగారు సుమారు 50 ఆవులను పోషిస్తున్నారు. వాటిలో ఎక్కువగా రాజస్థాన్ ప్రాంతానికి చెందిన రాఠీ జాతివే ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్ ప్రాంతానివి అయితే మన వాతావరణానికి బాగా అనుకూలంగా ఉంటాయని గ్రహించి రాఠీ జాతిని కొనసాగిస్తున్నారు. పరిశీలన నిమిత్తం ఒక ఒంగోలు, ఒక తార్‌పార్కర్, ఒక కాంక్రెజ్, ఒక సాహివాల్ ఆవును పోషిస్తున్నారు. వాటి గర్భధారణ కొరకు పుంగనూర్, సాహివాల్, రాఠీ ఎద్దులను ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ఎద్దు చొప్పున పెంపకం చేస్తూ తన గోశాలలోని ఆవులన్నింటిని ప్రకృతిసిద్ధంగానే గర్భధారణ చేయిస్తుంటారు. కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లను చేయించరు.
గోశాల మొదలు పెట్టిన కొత్తలో పాలను అమ్మకం చేస్తూ వచ్చారు. కాని పాలకు అందే ధర ఆశాజనకంగా ఉండకపోవడంతో పాల అమ్మకం ఆపివేసి నెయ్యిని అమ్మకం చేస్తున్నారు. ఆవు నెయ్యి ఎక్కువ భాగం ఔషధ రూపంలో ఉపయోగిస్తున్నారు కాబట్టి నెయ్యిలో ఉండవలసిన పోషకాలు సక్రమంగా ఉండాలంటే ఆవులను ఎండలో తిరగనియ్యాలని అని గ్రహించి అన్ని ఆవులను ప్రతిరోజూ ఎండలోనే వదిలేస్తున్నారు. రాత్రి సమయంలో మరియు వర్షం వచ్చిన సందర్భంలోనో ఆవులను షెడ్‌లలో ఉంచుతుంటారు. రోజు మొత్తం ఆవులన్ని ఎండలోనే తిరుగుతూ అవసరమైన గడ్డిని, మొక్కలను తింటూ ఉంటాయి. మేతకొరకు 4 ఎకరాలలో సూపర్ నేపియర్ సాగు చేయడంతో పాటు ప్రతినెల రెండు ఎకరాల చొప్పున మొక్కజొన్నను సాగు చేస్తూ మొక్కజొన్న కండె తయారయిన స్టేజ్‌లో మొక్కజొన్నను కట్ చేసి, సూపర్ నేపియర్ కలిపి చాఫ్‌కట్టర్‌లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పచ్చిమేతగా అందిస్తుంటారు. మొక్కజొన్న కండే తయారయిన స్టేజ్‌లో దాణాలో ఉండవలసిన పోషకాలు మొక్కజొన్నలో ఉంటాయి కాబట్టి ఎలాంటి దాణాను అందించనవసరం పడడం లేదు. ఎండుమేతగా వేరుశనగ చెత్తను ఒక్కొక్క ఆవుకు రోజుకు 4 నుంచి 5 కిలోలు అందిస్తుంటారు. ఇంతకు మించి ఆవులకు ఎలాంటి దానాను అందించడం లేదు.

వీరి గోశాలలో మంచి పాల దిగుబడి అంటే రోజుకు 10 నుంచి 20 లీటర్లు ఇచ్చే రాఠీ జాతికి చెందిన ఆవులు ఉన్నాయి. ఇందుకుగాను ఆవులు కొనుగోలు సమయంలో ఎలాంటి అశ్రద్ధకు తావు ఇవ్వకుండా రాజస్థాన్ వెళ్ళి అక్కడ నెలరోజుల వరకు బస చేసి ఆ ప్రాంతం మొత్తం తిరిగి మంచి పాల దిగుబడిని ఇవ్వగలిగిన ఆవులను కొనుగోలు చేయడంతో పాటు తన దగ్గరకు వచ్చిన తరువాత కూడా ఎలాంటి అశ్రద్ధకు తావు ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నాడు కాబట్టి మంచి పాల దిగుబడి పొందుతున్నాడు.
నెయ్యి తయారీ…. ప్రతిరోజు వచ్చిన పాలను సన్నని సెగపై ఇత్తడి గిన్నెలలో సుమారు మూడు గంటలు వేడి చేసి ఆ పాలను పెరుగు చేసి పెరుగును చిలికి వెన్నను సేకరించి ఆ వెన్నను మరలా సన్నని సెగపై మూడు గంటలు పైగా వేడి చేసి నాణ్యమైన నెయ్యిని పొందుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని తయారు చేసి నెయ్యిని 200 గ్రాముల గాజు సీసాలలో ప్యాక్ చేసి మార్కెట్ చేస్తున్నారు.
మరిన్ని వివరాలు 9701703656 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

