ఒక నమ్మకం… రోగి గొంతులో అమృతమవుతుంది. ఒక విశ్వాసం… ఆటగాడికి ఊపిరి అవుతుంది. ఒక భరోసా… చంటి పిల్ల ఆకలి తీరుస్తుంది. దైనందిన జీవితంలో అంతర్బాగమైన పాలు, పాల ఉత్పత్తులు కేవలం నాణ్యత, నమ్మకం, విశ్వసనీయత పునాదులపై నిలుస్తుంది.
చిన్న, సన్నకారు రైతుల నుండి ప్రామాణిక పద్ధతుల్లో సేకరించి, నాణ్యతా పరీక్షలు చేసి, 24 గంటల్లో శుద్ధీకరించి ప్యాకింగ్ చేసి ఇవ్వగల సత్తా ఒక్క సహకార డెయిరీలకే సాధ్యం.
పాడి రైతుల నుండి మంచి పాలకు మంచి ధర అందించాలనే సమాఖ్య ఛైర్మన్ సోమ భరత్ కుమార్, ఎం.డి. అధర్ సిన్హాల స్వప్నం ఫలించి ‘పాలమిత్ర యాప్’ అందుబాటులోకి తేబడింది. రైతు చెంతనే పాల పరీక్ష జరిపి, వెనువెంటనే అతడి చరవాణికి పాల కొలత, ధర, పాలకు వచ్చే మొత్తం డబ్బులు సంక్షిప్త సమాచారం రూపంలో అందించే దిశగా ‘విజయ తెలంగాణ’ పారదర్శకతకు పెద్దపీట వేసింది. పైలట్ ప్రాజెక్టుగా మొదట జనగామ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ప్రారంభించి, క్రమేపి అన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని విస్తరించడం జరుగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 పాల పరిధుల్లో 5250 పై చిలుకు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా, 1,50,000 పైగా పాడి రైతులు పాలను విజయ డెయిరీకి అందిస్తున్నారు.
ఈ యాప్ ద్వారా 15 రోజులకోసారి పాల పైకం, రైతు బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది. పాల సేకరణ స్థాయిలోనే పాల కొలత, నాణ్యత నమోదు చేయబడతాయి. అంతేకాక, పాడి రైతులకు వెనువెంటనే సంక్షిప్త సందేశం రూపంలో పాల వివరాలు చేరవేయబడతాయి. రిజిస్టర్లలో, పుస్తకాల్లో కాకుండా పాల కొనుగోలు వివరాలు మొబైల్ యాప్ ద్వారా సరళంగా నమోదు చేసే వాలున్న ఈ ‘యాప్’ సహకార రంగంలోనే ఒక మైలు రాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా ఈ యాప్ వెలువరించబడగా, రోజు వారీ పాల ధర తెలవడం రైతు కష్టానికి తగు ప్రతిఫలం అందించినట్లవుతుంది.
అంతేకాక, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పాడి పశువుల కొనుగోలుకు ఒప్పందం చేసుకుని పాడి రైతులకు భరోసా కల్పిస్తోంది విజయ తెలంగాణ.
పాడి పరిశ్రమ పసిడి బాటలో నడవడానికి కావలసిన పశుదాణా, లవణ మిశ్రమం, దాణా పోషఖాలు అందిస్తోంది.
మౌలిక స్థాయిలో పాడి రైతుల సంఘాల ఏర్పాటు, మూతబడిన సుమారు 70 బల్క్‌కూలింగ్ యూనిట్లను పాడిరైతులు/ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహణ ఖర్చులు అందించి నడిచేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని, రాబోవు కొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చే మెగా డెయిరీ పాల నిర్వహణ సామర్థ్యం పూర్తిగా వినియోగించుకునేలా అడుగులు వేస్తోంది.
శిక్షణలు, సామర్థ్యాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామ స్థాయిలో నాణ్యమైన పాలసేకరణ, గ్రామాల్లో వినియోగించే పాల పరీక్షా పరికరాల పనితీరు మెరుగుపర్చడం లాంటి చర్యలు చేపట్టింది. అవకాశమున్న చోట తెలంగాణ ఆగ్రో కేంద్రాల ద్వారా పాలసేకరణ కూడా చేపడుతూ పాడి పశువుల కొనుగోలుకై ముద్ర, పిఎంఈజిపి, కెసిసి ఋణాలు, పశుసంవర్థక శాఖతో వైద్యశిబిరాలు, గోపాలమిత్రల సేవలను పాల ఉత్పత్తి పెంపుదలకు ఉపయోగించుకోవడం లాంటి పలు చర్యలతో స్వయం సమృద్ధి దిశగా విజయ తెలంగాణ అడుగులు వేస్తోంది.
మధుసూదనరావు, ఉప సంచాలకులు, విజయ డెయిరీ, ఆదిలాబాద్

