“వ్యవసాయమే భారతదేశానికి వెన్నెముక” అనే మాట నేటికీ సత్యమే. అయితే నేటి రైతు వ్యవసాయం చేయడం అంత సులభం కాదు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కొత్తరకం పురుగులు–తెగుళ్ల విజృంభణ, నేల సారం తగ్గుదల, పోషక లోపాలు, నీటి కొరత వంటి ఎన్నో సమస్యలు పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమయంలో సరైన సమాచారం రైతుకు అందడం అత్యంత అవసరం. డిజిటల్ సాంకేతికత విస్తరించిన ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ రైతుకు మరో వ్యవసాయ పనిముట్టుగా మారింది. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఇప్పుడు రైతు తన పొలానికి సంబంధించిన అనేక విషయాలను క్షణాల్లో తెలుసుకునే అవకాశం కలిగింది. పురుగులు, తెగుళ్లను గుర్తించడం నుంచి వాతావరణ సూచనలు తెలుసుకోవడం వరకు, పంటల సాగు సలహాలు పొందడం నుంచి ఎరువులు, మందుల వినియోగంపై సూచనలు తెలుసుకోవడం వరకు అనేక సేవలు మొబైల్ యాప్‌ల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు మరియు వ్యవసాయ నిపుణుల నుంచి శాస్త్రీయ సలహాలను కూడా నేరుగా రైతుల చేతికి చేరవేస్తున్నాయి. దీనివల్ల రైతులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని నష్టాలను తగ్గించుకోవడంతో పాటు దిగుబడిని పెంచుకునే అవకాశం పొందుతున్నారు.
రైతులకు ఈ సేవలను మరింత చేరువ చేయడానికి భారత ప్రభుత్వంతో పాటు పలు వ్యవసాయ పరిశోధనా సంస్థలు అనేక మొబైల్ అప్లికేషన్లను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్ లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్ల నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించవచ్చు. ఈ యాప్‌లు పరిశోధనలో రూపొందిన శాస్త్రీయ సాంకేతికతను నేరుగా రైతు పొలం వరకు తీసుకెళ్లే వారధిగా పనిచేస్తున్నాయి.
- Plantix (ప్లాంటిక్స్)
ప్రపంచవ్యాప్తంగా రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్న వ్యవసాయ మొబైల్ అప్లికేషన్లలో ప్లాంటిక్స్ (Plantix) ఒకటి. రైతులు దీనిని “పంటల డాక్టర్” అని కూడా పిలుస్తుంటారు. పంటలో కనిపించే సమస్యలను వేగంగా గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను సూచించడం ఈ యాప్ ప్రత్యేకత. రైతులు పంట ఆకులు, కాండం, కాయలు లేదా ఇతర భాగాలపై కనిపించే లక్షణాలను మొబైల్‌తో ఫోటో తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే, కేవలం కొన్ని సెకన్లలోనే సమస్యను విశ్లేషించి అది పురుగు ఉధృతా, తెగులా లేదా పోషక లోపమా అనే విషయాన్ని గుర్తించి తెలియజేస్తుంది. అంతేకాకుండా సమస్యకు కారణాలు, నివారణ చర్యలు, సిఫారసు చేసిన పురుగుమందులు లేదా శిలీంద్రనాశకాలు, పోషక నిర్వహణ పద్ధతులను కూడా సూచిస్తుంది.
ఈ యాప్‌లో 700 కంటే ఎక్కువ పంటల పురుగులు, తెగుళ్లు మరియు పోషక లోపాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. రైతులు ప్రపంచంలోని ఇతర రైతులతో తమ అనుభవాలను పంచుకునే అవకాశం కూడా ఇందులో కల్పించారు. అలాగే, GPS సాంకేతికత ఆధారంగా సమీప ప్రాంతాల్లో ఏవైనా పురుగులు లేదా తెగుళ్లు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లయితే ముందుగానే హెచ్చరికలు అందిస్తుంది. స్థానిక వాతావరణ సమాచారాన్ని కూడా అందించడం వల్ల పిచికారీ, కలుపు నివారణ, నీటిపారుదల వంటి వ్యవసాయ పనులను సరైన సమయంలో చేపట్టేందుకు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.
రైతులకు ఉపయోగాలు
పంటలో కనిపించే లక్షణాలు ఏ సమస్యకు సంబంధించినవో తెలియక రైతులు తరచూ అయోమయానికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో ప్లాంటిక్స్ యాప్ తక్షణమే సమస్యను గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను సూచించడం ద్వారా సరైన మందును, సరైన మోతాదులో, సరైన సమయంలో ఉపయోగించేందుకు దోహదపడుతుంది. దీంతో అనవసరంగా మందుల వినియోగం తగ్గి సాగు ఖర్చులు ఆదా కావడంతో పాటు పంటను నష్టాల నుంచి కాపాడుకోవచ్చు. రైతు చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను “వ్యవసాయ సలహాదారుగా” మార్చే యాప్‌లలో ప్లాంటిక్స్ ఒకటి.
- RiceXpert (రైస్ ఎక్స్‌పర్ట్)
వరి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐసీఏఆర్–జాతీయ వరి పరిశోధన సంస్థ- కటక్ అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ రైస్ ఎక్స్‌పర్ట్ (RiceXpert). వరి సాగుకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఒకే వేదికపై రైతులకు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ యాప్, వరి రైతులకు డిజిటల్ వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తోంది.
పొలంలో కనిపించే పురుగులు, తెగుళ్లు, నులిపురుగులు (నెమటోడ్లు), కలుపు మొక్కలు, పోషక లోపాలు లేదా పోషకాల అధికత వంటి సమస్యలను రైతులు ఈ యాప్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. సమస్యకు సంబంధించిన ఫోటో, సందేశం లేదా వాయిస్ రికార్డును పంపితే నిపుణుల నుంచి శాస్త్రీయ సలహాలు అందుతాయి. అంతేకాకుండా, సమస్యకు అనుగుణంగా సిఫారసు చేసిన పురుగుమందు, దాని సరైన మోతాదు, ఎరువుల లెక్కింపు (Fertilizer Calculator) వంటి వివరాలను కూడా ఈ యాప్ అందిస్తుంది.
ఈ యాప్‌లో వివిధ వరి రకాలు, వ్యవసాయ యంత్రాలు, వాతావరణ సమాచారం, తాజా వ్యవసాయ వార్తలు, ఈ-సలహా (e-Advisory), ఈ-మార్కెటింగ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. రైతులు తమ సందేహాలను నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు పంపి తక్షణ పరిష్కారం పొందవచ్చు. అలాగే వరి ఉత్పత్తులను కొనుగోలుదారులకు పరిచయం చేసే అవకాశాన్ని కూడా ఈ యాప్ కల్పిస్తుంది.
రైతులకు ఉపయోగాలు
వరి సాగులో ఎదురయ్యే సమస్యలను త్వరగా గుర్తించి, సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టేందుకు రైస్ ఎక్స్‌పర్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎరువులు, పురుగుమందులను ఖచ్చితమైన మోతాదులో వినియోగించడానికి మార్గనిర్దేశం చేయడం వల్ల సాగు ఖర్చులు తగ్గి, పంట దిగుబడి మరియు నాణ్యత మెరుగుపడతాయి. అంతేకాకుండా, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు నేరుగా రైతుల చేతికి చేరడం ద్వారా శాస్త్రీయ వరి సాగు మరింత సులభంగా మారుతుంది.
- Crop Doctor (క్రాప్ డాక్టర్)
క్రాప్ డాక్టర్ (Crop Doctor) అనేది రైతులు తమ పంటల్లో వచ్చే సమస్యలను త్వరగా గుర్తించి, శాస్త్రీయ పరిష్కారాలను పొందేందుకు రూపొందించిన మొబైల్ అప్లికేషన్. దీనిని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం (IGKV), రాయ్‌పూర్ మరియు నేషనల్ ఇఇన్ఫర్ మాటిక్స్ సెంటర్ (NIC) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ యాప్ ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా రూపొందించబడింది.
రైతులు పంటలో కనిపించే పురుగులు, తెగుళ్లు లేదా పోషక లోపాల లక్షణాలను మొబైల్‌తో ఫోటో తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే, వాటిని విశ్లేషించి సంభావ్య సమస్యను గుర్తించి తగిన యాజమాన్య సూచనలను అందిస్తుంది. వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు వంటి ప్రధాన పంటలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన శాస్త్రీయ సలహాలను అందించడం ఈ యాప్ ప్రత్యేకత. అదనంగా, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, తాజా వ్యవసాయ సమాచారం వంటి ఉపయోగకరమైన వివరాలను కూడా రైతులకు చేరవేస్తుంది.
రైతులకు ఉపయోగాలు
పంటలో సమస్య కనిపించిన వెంటనే వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్మార్ట్‌ఫోన్ ద్వారానే ప్రాథమిక నిర్ధారణ చేసుకునే అవకాశం ఈ యాప్ కల్పిస్తుంది. సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టవచ్చు. దీంతో పంట నష్టాన్ని తగ్గించడంతో పాటు, అనవసరంగా పురుగుమందులు లేదా ఎరువుల వినియోగాన్ని కూడా నివారించవచ్చు. రైతులకు శాస్త్రవేత్తల సలహాలను వేగంగా అందిస్తూ, పొలం మరియు వ్యవసాయ నిపుణుల మధ్య వారధిగా ఈ యాప్ సమర్థవంతంగా పనిచేస్తుంది.
- Kisan Suvidha (కిసాన్ సువిధా)
రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2016లో కిసాన్ సువిధా మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. రైతులు రోజువారీ వ్యవసాయ నిర్ణయాలను సులభంగా తీసుకునేందుకు అవసరమైన అనేక సేవలను ఈ యాప్ ఒకే చోట అందిస్తుంది. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు సులభంగా ఉపయోగించుకోవచ్చు.
ఈ యాప్ ద్వారా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పాటు ఐదు రోజుల వాతావరణ సూచనలను తెలుసుకోవచ్చు. దీనివల్ల పిచికారీ, కోత, నీటిపారుదల వంటి వ్యవసాయ పనులను వాతావరణానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోవచ్చు. అదనంగా, వివిధ పంటలకు సంబంధించిన స్థానిక మార్కెట్ ధరలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, గోదాములు, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.
పంటల్లో వచ్చే పురుగులు, తెగుళ్లను గుర్తించి వాటి నివారణకు అవసరమైన సమీకృత పురుగు యాజమాన్య సూచనలు కూడా ఈ యాప్ అందిస్తుంది. అంతేకాకుండా, రైతులు తమ సందేహాలను వ్యవసాయ నిపుణులకు పంపించి వ్యక్తిగత సలహాలు పొందే అవకాశం కూడా కల్పించబడింది. దీంతో శాస్త్రీయ పద్ధతులను అనుసరించి పంటలను సమర్థవంతంగా నిర్వహించడం సులభమవుతుంది.
రైతులకు ఉపయోగాలు
వ్యవసాయానికి సంబంధించిన అనేక సేవలను ఒకే యాప్‌లో అందించడం కిసాన్ సువిధా ప్రత్యేకత. వాతావరణ సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. మార్కెట్ ధరల ఆధారంగా సరైన సమయంలో పంటను విక్రయించి మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. అలాగే, శాస్త్రీయ సలహాలు, పురుగులు–తెగుళ్ల నివారణ పద్ధతులు, వ్యవసాయ పరికరాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట పొందడం వల్ల రైతులు సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు శాస్త్రీయంగా, లాభదాయకంగా వ్యవసాయం చేయడానికి ఈ యాప్ ఎంతో దోహదపడుతుంది.
- ANGRAU DAATTC App
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) ఆధ్వర్యంలోని జిల్లా వ్యవసాయ సలహా మరియు శిక్షణ కేంద్రాలు రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి ANGRAU DAATTC Appను అభివృద్ధి చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ యాప్, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు రైతుల మధ్య సమర్థవంతమైన సమాచార వారధిగా పనిచేస్తోంది.
ఈ యాప్ ద్వారా రైతులు పంటల వారీగా సాగు సిఫారసులు, మెరుగైన వంగడాల వివరాలు, పురుగులు–తెగుళ్ల గుర్తింపు మరియు యాజమాన్య పద్ధతులు, పోషక నిర్వహణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వంటి శాస్త్రీయ సమాచారాన్ని పొందవచ్చు. అదనంగా, రైతులకు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలకు సంబంధించి వ్యవసాయ నిపుణుల సలహాలు, తాజా వ్యవసాయ సాంకేతికతలు, శిక్షణా కార్యక్రమాలు, క్షేత్ర ప్రదర్శనలు మరియు విశ్వవిద్యాలయం విడుదల చేసే తాజా సూచనలు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి.
ఈ యాప్‌లో రైతులు తమ పంటలో కనిపించే సమస్యలను ఫోటోల రూపంలో పంపించి శాస్త్రవేత్తల సలహాలు పొందే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, జిల్లాల వారీగా రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారం, హెచ్చరికలు మరియు అత్యవసర వ్యవసాయ సూచనలు సకాలంలో అందించడం ద్వారా పంట నష్టాలను తగ్గించేందుకు ఈ యాప్ దోహదపడుతోంది.
రైతులకు ఉపయోగాలు
ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ANGRAU DAATTC App ద్వారా స్థానిక పరిస్థితులకు అనుగుణమైన శాస్త్రీయ వ్యవసాయ సలహాలను సులభంగా పొందవచ్చు. పురుగులు, తెగుళ్లు, పోషక లోపాలు వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చు. అలాగే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులను ప్రణాళిక చేసుకోవడంతో పాటు, విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవడం, సాగు వ్యయాన్ని తగ్గించడం మరియు లాభదాయకమైన వ్యవసాయాన్ని సాధించడం సాధ్యమవుతుంది.
- Kapas Kisan (కపాస్ కిసాన్)
పత్తి రైతులు తమ పంటను కనీస మద్దతు ధర కింద సులభంగా విక్రయించేందుకు భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ కపాస్ కిసాన్. పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా మరియు రైతు స్నేహపూర్వకంగా మార్చేందుకు ఈ యాప్‌ను రూపొందించారు.
ఈ యాప్ ద్వారా రైతులు ఇంట్లో నుంచే స్వీయ నమోదు చేసుకోవచ్చు. అనంతరం సమీపంలోని CCI కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించేందుకు తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ముందుగానే ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. పత్తి నాణ్యత పరీక్ష, ఆమోదించిన పరిమాణం, చెల్లింపు ప్రక్రియ వంటి వివరాలను కూడా రైతులు తమ మొబైల్‌లోనే రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, విక్రయించిన పత్తికి సంబంధించిన చెల్లింపు స్థితిని కూడా ఈ యాప్ ద్వారా సులభంగా పరిశీలించవచ్చు.
రైతులకు ఉపయోగాలు
కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ MSP కొనుగోలు వ్యవస్థతో అనుసంధానమవుతారు. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. మొత్తం కొనుగోలు ప్రక్రియ డిజిటల్ రూపంలో ఉండటంతో పారదర్శకత పెరిగి, చెల్లింపుల వివరాలు కూడా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు కనీస మద్దతు ధరను సకాలంలో పొందడంతో పాటు, పత్తి విక్రయ ప్రక్రియను సులభంగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు.
- APAIMS 2.0
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరియు వ్యవసాయ శాఖకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడానికి రూపొందించిన సమగ్ర మొబైల్ అప్లికేషన్ APAIMS 2.0. కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML), ఉపగ్రహ సమాచారం, భౌగోళిక సాంకేతికతలను ఉపయోగించి రైతులకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు శాస్త్రీయ సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యం.
ఈ యాప్ ద్వారా రైతులు ఈ-పంట నమోదు, భూమి వివరాలు, రైతు యూనిక్ ఐడీ, ప్రభుత్వ పథకాల అర్హత, విత్తనాలు, ఎరువుల పంపిణీ, సబ్సిడీలు, పంటల స్థితి, వాతావరణ సమాచారం వంటి అనేక సేవలను ఒకే వేదికపై పొందవచ్చు. అంతేకాకుండా, పొలం స్థాయిలో పురుగులు, తెగుళ్లపై ముందస్తు హెచ్చరికలు, పంటల ఆధారంగా వ్యక్తిగత వ్యవసాయ సూచనలు, సమస్యలను ఫోటోల ద్వారా అధికారులకు పంపే సౌకర్యం కూడా ఇందులో ఉంది. రైతు సేవా కేంద్రాలు (RSKs), వ్యవసాయ అధికారులు మరియు రైతులను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానించడం ద్వారా వ్యవసాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించే ప్రయత్నం ఈ వ్యవస్థ చేస్తోంది.
రైతులకు ఉపయోగాలు
APAIMS 2.0 ద్వారా రైతులు ప్రభుత్వ వ్యవసాయ సేవలను కార్యాలయాల చుట్టూ తిరగకుండా మొబైల్‌లోనే పొందగలుగుతున్నారు. ఈ-పంట నమోదు, ప్రభుత్వ పథకాల లబ్ధి, విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ వివరాలు, పంటలపై వ్యక్తిగత సలహాలు, వాతావరణ హెచ్చరికలు వంటి సేవలు ఒకే యాప్‌లో అందుబాటులో ఉండటం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతాయి. అంతేకాకుండా, పొలం స్థాయిలో ముందస్తు పురుగు–తెగుళ్ల హెచ్చరికలు అందడం వల్ల రైతులు తక్షణ నివారణ చర్యలు చేపట్టి పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. రాష్ట్రంలో డిజిటల్ వ్యవసాయానికి నాంది పలికిన సమగ్ర వ్యవసాయ వేదికగా APAIMS 2.0 రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది.
ముగింపు
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో మొబైల్ అప్లికేషన్లు రైతుకు కొత్త బలంగా మారాయి. పంట సాగు ప్రారంభం నుంచి కోత వరకు ప్రతి దశలో రైతుకు అవసరమైన సమాచారం, శాస్త్రీయ సలహాలు, వాతావరణ హెచ్చరికలు, పురుగులు–తెగుళ్ల యాజమాన్యం, పోషక నిర్వహణ, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలను ఒకే వేదికపై అందిస్తూ వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. ప్లాంటిక్స్, రైస్ ఎక్స్‌పర్ట్, క్రాప్ డాక్టర్, కిసాన్ సువిధా, ఫార్మ్-ఓ-పీడియా, ఏఎన్‌జీఆర్‌ఏయూ డాట్టిక్, కపాస్ కిసాన్, ఏపీఏఐఎంఎస్ 2.0 వంటి మొబైల్ అప్లికేషన్లు రైతులకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. వీటి వినియోగం ద్వారా పురుగులు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా నివారించడంతో పాటు, ఎరువులు మరియు పురుగుమందులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం వల్ల సాగు వ్యయం తగ్గి పంట దిగుబడి, నాణ్యత, లాభదాయకత పెరుగుతాయి.
అయితే, ఈ మొబైల్ అప్లికేషన్లు రైతులకు సహాయక సాధనాలు మాత్రమే. వాటి ద్వారా అందిన సమాచారాన్ని స్థానిక పరిస్థితులు, నేల స్వభావం, వాతావరణం, పంట దశలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులు సూచించే సాంకేతిక సలహాలతో సమన్వయం చేసుకొని అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు, ఉపగ్రహ సాంకేతికత, డ్రోన్లు, సెన్సార్ ఆధారిత వ్యవసాయం, ఖచ్చితత్వ వ్యవసాయం వంటి ఆధునిక సాంకేతికతలు ఈ మొబైల్ అప్లికేషన్లతో మరింతగా అనుసంధానమవుతాయి. దీంతో రైతులకు ప్రాంతాలకనుకూలంగా, పంటనిర్దిష్టంగా, సమయానుకూలంగా మరింత ఖచ్చితమైన సలహాలు అందుబాటులోకి వస్తాయి. ఇది వ్యవసాయాన్ని ఉత్పాదకంగా, లాభదాయకంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
డిజిటల్ వ్యవసాయం అనేది భవిష్యత్తు కాదు… అది ఇప్పటికే వర్తమానమైంది. ఈ సాంకేతిక అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు–తెగుళ్ల వల్ల కలిగే నష్టాలను కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. అందువల్ల ప్రతి రైతు కనీసం తన పంటకు ఉపయోగపడే ఒకటి లేదా రెండు విశ్వసనీయ వ్యవసాయ మొబైల్ అప్లికేషన్లను వినియోగించడం నేటి అవసరం.
డా. ఏం. ఉదయ్ భాస్కర్, డా. ఏం. ఉషా
వ్యవసాయ విస్తరణ విభాగం, ఆచార్య ఎన్. జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు
ఫోన్: 9494666359