అన్నిపంటల్లో పురుగుల నివారణకు ఐదు శాతం వేప ద్రావణం

  • వేపలో ఉండే ‘అజాడిరెక్టిన్’ అనే పదార్థం పురుగు జీవిత దశలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది పురుగు గుడ్డు, లార్వా, ప్యూపా మరియు తల్లి పురుగులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది పురుగులపై ఉదర, స్పర్శ చర్యలను చూపుతుంది.
  • వేప ద్రావణాన్ని పొగాకు లద్దెపురుగు, శనగపచ్చ పురుగు, నామాల పురుగు, ఆకుముడత పురుగు మరియు రసంపీల్చే పురుగుల నివారణలో అన్ని పంటలలోను వాడవచ్చు.
  • వేప ద్రావణాన్ని నారుమడులలో కూడా పురుగుల నివారణలో ఉపయోగించవచ్చు.

కావలసిన పదార్థాలు :

  • వేపగింజలు – 5 కిలోలు * కుంకుడు కాయలు – 500 గ్రా.
  • సబ్బుపొడి – 100 గ్రా.

తయారు చేసే విధానం :

  • నీడలో బాగా ఎండిన (పై పొట్టు తీసిన) 5 కిలోల మంచి వేప గింజలను మెత్తగా రుబ్బి పిండి చేయాలి.
  • ఈ విధంగా తయారైన వేపపిండిని ఒక మూటలో కట్టి 10 లీటర్ల నీటిలో 10-12 గంటలు నానబెట్టాలి.
  • తర్వాత నీటిలో మూటను ముంచి పట్టుకొని 15-20 నిముషాల పాటు ద్రావణాన్ని పిండాలి. మధ్య మధ్యలో మూటను నీటిలో ముంచుతూ ద్రావణాన్ని సేకరించాలి.
  • ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి.
  • వడపోసిన ద్రావణానికి 100 గ్రాముల సబ్బుపొడిని లేదా అరకిలో కుంకుడు కాయ రసాన్ని కలపాలి.
  • ఈ వేప ద్రావణాన్ని 100 లీటర్ల నీటితో కలిపి, ఒక ఎకరం పొలంలో సాయంత్రం సమయంలో పంటపై పిచికారి చేసుకోవాలి.

ఉపయోగాలు :

  • రైతులు వేపగింజలను మే-జూన్ నెలలలో సేకరించుకొని గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా నిల్వ చేసిన వేప గింజలను సుమారు ఒక సంవత్సరం వరకు ఉపయోగించుకోవచ్చు.
  • నీడలో ఎండిన వేప గింజల పొడిని ఉపయోగించిన యెడల 10-15 కిలోల వేపపొడి అవసరపడుతుంది. (పంట దశను మరియు పురుగుల ఉధృతిని బట్టి)
  • వేప ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే పంటపై పిచికారి చేసుకోవాలి. నిల్వ ఉంచరాదు.
  • పంట దశను బట్టి, పురుగుల ఉధృతిని బట్టి మోతాదు పెంచుకోవలసి ఉంటుంది.
  • వేప ద్రావణాన్ని అన్ని పంటల లోను, నారుమళ్ళలోను వాడవచ్చు.
  • వేప ద్రావణాన్ని పండ్ల తోటలలో కూడా పిచికారి చేసుకొని మంచి ఫలితాలు సాధించవచ్చు.
  • వేప ద్రావణం చేయగా వచ్చిన పిప్పిని, పెరటి మొక్కలకు, పూల కుండీలకు వాడుకోవచ్చు.
  • సబ్బు పొడికి బదులుగా కుంకుడుకాయ లేదా శీకాకాయ పొడిని 500 గ్రా. వాడవచ్చు.
  • వేప ద్రావణాన్ని అన్ని పంటలలోను వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఉపయోగించవచ్చు.
  • పంట తొలిదశలలో ఆశించే రసం పీల్చే పురుగులు, చిన్న సైజు లార్వాల నియంత్రణలో వేప ద్రావణాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధించవచ్చు. పంటల తొలి దశలో (30-45 రోజులు) ఎకరాకు సుమారు 100 లీ. ద్రావణం అవసరమవుతుంది.
  • పంట పెరిగిన కొలదీ వేప ద్రావణం మోతాదు పెంచుకోవాలి.

వేప పప్పు ద్రావణం వలన లాభాలు :

  • పంట పూత దశలో పిచికారి చేస్తే రెక్కల పురుగులు వేప వాసనకు పంటపై గుడ్లు పెట్టవు.
  • గుడ్డు దశ, పిల్ల పురుగుదశలను వేప ద్రావణం నాశనం చేస్తుంది. వేప ద్రావణం చల్లిన ఆకులు చేదుగా ఉండడం వలన పిల్ల పురుగులు ఆకులను తినలేవు.
  • వేపలో ఉండే ‘అజాడిరెక్టిన్’ అనే పదార్థం పురుగు జీవిత దశలపై ప్రభావాన్ని చూపిస్తుంది. పురుగు తన జీవితచక్రం పూర్తి చేయలేక లార్వాగానో లేక నిద్రావస్థలోనో చనిపోతుంది.
  • వేప ద్రావణం మన ఆరోగ్యానికి గాని, మేలు చేసే పురుగులకు గాని, వాతావరణానికి గాని హానికరం కాదు.
  • వేప ద్రావణంలో ఉన్న అనేక ‘లిమోనాయిడ్స్’ పంటను ఆరోగవ్యవంతంగా ఉంచడానికి సహాయపడతాయి.
Read More

చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకం: మంత్రి తుమ్మల.

  • వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి రాష్ట్రం సిద్ధం
  • రాష్ట్ర, కేంద్ర వాటాలతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం
  • లబ్ధిదారుల ఎంపికపై కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు
  • చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకం
  • రైతుకు నచ్చిన కంపెనీ నుంచి వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసే వెసులుబాటు
  • సబ్సిడీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
  • ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం.. బీసీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ
  • ఎఫ్‌పీఓలను కస్టమ్ హైరింగ్ సెంటర్లుగా వినియోగించే అవకాశాలపై అధ్యయనం చేయాలి
  • రైతుల అభిప్రాయాలతో యాంత్రీకరణ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలి
    ……………………………………………………………………………………………………………………………………………………….
    గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పక్కన పెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2025-26 సంవత్సరం నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి అమలు చేస్తున్నామని చెప్పారు. 2025-26 సంవత్సరానికి పథకం కోసం రూ.71 కోట్లు కేటాయించగా, రూ.63 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులకు మరింత విస్తృతంగా యాంత్రీకరణ ప్రయోజనాలు అందించేందుకు 2026-27 సంవత్సరానికి రూ.147.99 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర, కేంద్ర వాటాలతో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టామని, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేయాల్సిన మార్గదర్శకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోందని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టి, రైతులకు పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైతుకు నచ్చిన కంపెనీ నుంచి పరికరం కొనుగోలు చేసే అవకాశం…
రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాన్ని తమకు నచ్చిన ఎంప్యానెల్ చేసిన కంపెనీ వద్ద కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం పథకం ద్వారా లబ్ధి పొందే రైతు ఒక నిర్దిష్ట సంస్థ లేదా ఎంపిక చేసిన సరఫరాదారుడి వద్ద నుంచే పరికరం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి లేకుండా, రైతుకు మరింత స్వేచ్ఛ ఉండే విధంగా విధానాన్ని రూపొందించాలని తెలిపారు.

సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేయనుండటం వల్ల రైతులు కూడా వ్యవసాయ పరికరం కొనుగోలు చేసే ముందు వివిధ కంపెనీల ధరలను, నాణ్యతను పరిశీలించి, తక్కువ ధరకు మంచి నాణ్యత కలిగిన పరికరం ఎక్కడ లభిస్తే అక్కడే కొనుగోలు చేసుకోవాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సబ్సిడీ సద్వినియోగం కావడంతో పాటు, ఎక్కువ మంది రైతులకు యాంత్రీకరణ పరికరాలు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు.

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం, బీసీ మరియు ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ అందుతుందని మంత్రి తెలిపారు. సబ్సిడీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో పాటు, పథకంలో పారదర్శకత పెరుగుతుందని మంత్రి అన్నారు.

37 రకాల వ్యవసాయ పరికరాలు…
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు అందించేందుకు ప్రస్తుతం 37 రకాల వ్యవసాయ పరికరాలను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో పథకం పరిధిలో 19 రకాల పరికరాలు మాత్రమే ఉండేవని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పరికరాల సంఖ్యను 37 రకాలకు పెంచినట్లు చెప్పారు.

ఇందులో పవర్ టిల్లర్, బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టిల్లర్/వీడర్, డిస్క్ ప్లౌ, కల్టివేటర్, లెవలింగ్ బ్లేడ్, రోటావేటర్, రోటో-పుడ్లర్, రివర్సిబుల్ ఎంబీ ప్లౌ, సబ్ సాయిలర్, బండ్ ఫార్మర్, సీడ్-కం-ఫెర్టిలైజర్ డ్రిల్, మల్టీ క్రాప్ ప్లాంటర్, రైజ్డ్ బెడ్ ప్లాంటర్, పోస్ట్ హోల్ డిగ్గర్, ప్లాస్టిక్ మల్చ్ లేయింగ్ మెషిన్, ఫెర్టిలైజర్ బ్రాడ్‌కాస్టర్, రిడ్జ్ ఫరో ప్లాంటర్, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్లాషర్, పవర్ వీడర్, మాన్యువల్ నాప్‌సాక్ స్ప్రేయర్, పవర్ నాప్‌సాక్ స్ప్రేయర్, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్, కిసాన్ డ్రోన్, కంబైన్ హార్వెస్టర్, మైజ్ కంబైన్ హార్వెస్టర్, మల్టీ క్రాప్ థ్రెషర్, విన్నోయింగ్ ఫ్యాన్, మైజ్ షెల్లర్, టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్స్, పసుపు బాయిలర్, పసుపు పాలిషర్, ప్యాడీ మొబైల్ డ్రైయర్, స్ట్రా బేలర్, రోటరీ ష్రెడర్, మల్చర్, రోటరీ స్ట్రా స్లాషర్, బ్రష్ కట్టర్ ఉన్నాయి.

రైతుల అవసరాలు, సాగు విధానాల్లో వస్తున్న మార్పులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని పథకం అమలు మధ్యలో కూడా రైతులకు ఉపయోగపడే కొత్త వ్యవసాయ పరికరాలను చేర్చుకునేలా విధానాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

యాంత్రీకరణలో ఎఫ్‌పీఓలకు కీలక పాత్ర…
వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను (ఎఫ్‌పీఓలను) భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ఎఫ్‌పీఓల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని, వాటిని పథకం అమలులో ఎలా ఉపయోగించుకోవచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

చిన్న, సన్నకారు రైతులు ప్రతి వ్యవసాయ పరికరాన్ని సొంతంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, ఎఫ్‌పీఓల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వ్యవసాయ పరికరాలను రైతులకు అద్దెకు అందించే అవకాశాన్ని పరిశీలించాలని మంత్రి ఆదేశించారు.

ఒక్క రైతు ఖరీదైన యంత్రాన్ని కొనుగోలు చేయడం కంటే, ఒక ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో పరికరాలను అందుబాటులో ఉంచి అవసరమైన సమయంలో రైతులకు అద్దెకు అందిస్తే, తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రైతులు యాంత్రీకరణ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు.

రైతుల అభిప్రాయాలనూ సేకరించాలి..
వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రైతులకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు రైతుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని మంత్రి తుమ్మల తెలిపారు.

వచ్చే మంగళవారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ఎఫ్‌పీఓల ప్రతినిధులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.

రైతుల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, రైతులకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి తుది రూపం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Read More

ఔషధమొక్క…. ఉలిమిడి

ఉలిమిడి ఒక పవిత్ర టెంపుల్ ప్లాంట్. ఇది ఒక పుష్పించే చెట్టు. ఈ చెట్టుని కొన్నిసార్లు సాలీడు చెట్టు అంటారు. ఎందుకంటే అందంగా ఉండే దీని పూలు పొడవాటి సాలీడు వంటి పుప్పొడి కాడలను కలిగి ఉంటుంది. ఇది ఒక చిన్న విస్తరించు చెట్టు. ఆకులు 3చిన్న ఆకులు కలిగి ఉంటాయి. వీటిని నలిపినపుడు సువాసన వస్తుంది. ఆ పూలు పెద్దవిగా, తెలుపు నుండి పసుపు. ఎరుపు రంగు, నీలి రంగు కలిగి ఉంటాయి. అండాశయం చిన్నకాడపై ఉంటుంది. బెర్రి కండ కలిగి గుండ్రంగా 2.5 – 5.0 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.

సాధారణ నామం : వరుణ / క్రటీవ శాస్త్రీయ నామం : క్రటీవా రెలిజియోసా కుటుంబం: కాప్పరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • చెట్టు ఆకులు, బెరడుని ఔషధ ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. దీనిని రక్తం శుద్ధి చేయడానికి విస్తారంగా ఉపయోగిస్తారు.
  • ప్రోస్ట్రీట్ ఎన్‌లార్ౙ్‌మెంట్ చికిత్సలో ఉపయోగిస్తారు. యూరినరిబ్లాడర్ సమస్యలను నయం చేస్తుంది.
  • జీర్ణశక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. గుండె సమస్యలను సరిచేయడానికి ఉపయోగపడుతుంది.
  • రక్త సమస్యలను సరిచేస్తుంది. కడుపులో నులి పురుగుల చికిత్సకు ఉపయోగపడుతుంది.
  • మూత్ర పిండాలలో రాళ్ళను కరిగిస్తుంది. మైగ్రెయిన్, తలనొప్పికి ఉపశమనమిస్తుంది. డయేరియా చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • ఉలిమిడి క్లోరోఫాం ద్రావణం మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పురుగులను 4, 5, 6, 7వ రోజున సమర్ధవంతంగా నివారించింది. కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పురుగులపై దీని ప్రభావం అధికంగా ఉంది. ఈ ద్రావణంలో ఉన్న ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్ కీటకనాశక చర్యకు కారణం (డయఫ్, అతని అనుచరులు, 2014).
  • క్రటీవారెలిజియోసా, ఫైకస్ తోనింగీ, టపినాంతెస్ బాంగ్‌లెన్సిస్ ద్రావణాలను సైటోఫిలస్ ఒరైజె, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై పరీక్షించారు. క్రటీవా రెలిజియోసాక్లోరోఫాం ద్రావణం కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజెలను సమర్ధవంతంగా నివారించింది. కాని సైక్లోహెక్సాన్ మరియు మిథనాల్ ద్రావణాలు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పైన మాత్రమే సమర్ధవంతంగా పనిచేశాయి. ఫైకస్‌తో నింగీ సైక్లోహెక్సేన్ మరియు మిథనాల్ ద్రావణాలు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై సమర్ధవంతంగా పనిచేశాయి. టాపినాంతెస్ బాగ్వెన్సిస్ సైక్లోహెక్సాన్, క్లోరోఫాం, మిథనాల్ ద్రావణాలు సైటోఫిలస్ ఒరైజెపై సమర్ధవంతంగా పనిచేశాయి. కాల్లసోబ్రూకస్ లేటస్, సైటోఫిలస్ జియామేస్, రెండు పురుగులపై, పైరిల్లా, ఫైకస్‌ల కన్నా టపినాంతిస్ బాంగ్వెన్సిస్ ద్రావణం మాత్రమే అతి సమర్ధవంతంగా పని చేసింది. (డయోఫ్, అతని అనుచరులు, 2016).
  • అలసంద నిల్వ గింజలకు అత్యధిక నష్టం కలిగించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులపై క్రటీవా నలగ్గొట్టిన ఆకులు స్పర్శ చర్య ద్వారా 100% పెద్ద పురుగులు చంపబడ్డాయి (0.0218 గ్రా. /సె.మీ.3) ఇదే మోతాదు 90% పురుగు గుడ్లను బయోసైడ్ చర్య ద్వారా చంపింది. ఫ్యూమిగేషన్ ప్రయోగాలలో 0.0291 గ్రా./సెం.మీ.3 మోతాదు వద్ద 100% పెద్ద పురుగులను, 86.49% గుడ్లను చంపింది. క్రటీవా ఆకు పొడి నీటి ద్రావణం (0.1 గ్రా./సెం.మీ.3) 57.7% గుడ్లను చంపింది. ఇదే మోతాదు 7వ మరియు 9వ రోజు 100% పెద్ద పురుగులను చంపింది (ఫయె, అతని అనుచరులు, 2012).
  • క్రటీవ, వేప, సెన్నా మొక్కలు ఫ్యూమిగేషన్ ప్రభావాన్ని కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ గుడ్లు, పెద్ద పురుగులపై పరీక్షించారు. నలగ్గొట్టిన ఆకుల పొగను పెద్ద పురుగులపై ప్రయోగించారు. అన్ని మొక్కలలో గుడ్ల చావు పెరిగిన పొగ మోతాదుతో పెరిగింది. కాని వేప ఫ్యూమిగేషన్ చర్య మిగతా మొక్కల కన్నా అధికంగా ఉంది. పెద్ద పురుగులపై క్రటీవ ఆకుల ఫ్యూమిగేషన్ చర్య మిగతా రెండు మొక్కల కన్నా అధికంగా ఉంది. ఈ మూడు మొక్కల ఆకులను కలిపి ఫ్యూమిగేట్ చేస్తే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై దీని ప్రభావం అత్యధికంగా ఉంటుంది (పాయె, అతని అనుచరులు, 2017).
  • క్రటీవా బెరడు ఇథనాల్ ద్రావణం ప్రభావం క్లోరోఫాం మరియు హెక్సేన్ ద్రావణాల కన్నా ఎంటరోకోకస్ ఫీకాలిస్, ఎస్కరిచియా కోలి, స్టెఫైలోకోకస్‌లపై అధికంగా ఉంది. ఎంటరోకోకస్ ఫీకాలిస్ పెరుగుదల అత్యధికంగా అరికట్టబడింది (గౌసల్య అండ్ శరవన్ బాబు, 2013)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

విరిగిన బియ్యం… కలుపుకు కొత్త అడ్డుకట్టా?రైతు పొలంలో లభించే వనరుతో కొత్త ఆలోచన

“కలుపు మొక్కలకు మందు అవసరమేనా? మన వంటింటి ధాన్యంలోనే ఒక ప్రత్యామ్నాయం దాగి ఉందా?”
వ్యవసాయంలో కలుపు మొక్కలు రైతులకు కనిపించని పోటీదారులు. పంట మొలకెత్తిన కొద్ది రోజులకే కలుపు మొక్కలు పొలంలో విస్తరించి, పంటతో నీరు, పోషకాలు, సూర్యకాంతి మరియు స్థలానికి పోటీ పడతాయి. కలుపును సరైన సమయంలో నియంత్రించకపోతే పంట ఎదుగుదల మందగించి, దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
సాంప్రదాయంగా రైతులు చేతి కలుపు, అంతరకృషి, యాంత్రిక కలుపు నివారణ మరియు రసాయనిక కలుపు మందులను ఉపయోగిస్తున్నారు. అయితే పెరుగుతున్న కూలీల ఖర్చు, కలుపు మందుల ధర, కలుపు మందులకు నిరోధకత పెరగడం, నేల ఆరోగ్యం మరియు పర్యావరణంపై ప్రభావం వంటి అంశాల కారణంగా ప్రత్యామ్నాయ కలుపు నియంత్రణ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో విరిగిన బియ్యాన్ని (Broken Rice) నేలపై మల్చింగ్ పదార్థంగా ఉపయోగించి కలుపు మొలకలను తగ్గించే ఆలోచన ఆసక్తికరమైన వ్యవసాయ పద్ధతిగా నిలుస్తోంది.

విరిగిన బియ్యం… కలుపుకు అడ్డుకట్టా?
వరి మిల్లింగ్ సమయంలో మొత్తం బియ్యంతో పాటు కొంత భాగం విరిగిన బియ్యంగా లభిస్తుంది. సాధారణంగా ఇది తక్కువ విలువ కలిగిన ఉత్పత్తిగా పరిగణించబడుతుంది. అయితే దీనిని వ్యవసాయంలో ఒక వనరుగా ఉపయోగించవచ్చా అనే ఆలోచన ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది.

విరిగిన బియ్యాన్ని పంట వరుసల మధ్య నేల ఉపరితలంపై సమానంగా పలుచని పొరగా చల్లితే, అది ఒక రకమైన సేంద్రియ మల్చింగ్ (Organic Mulching) పొరగా పనిచేసే అవకాశం ఉంది.

మల్చింగ్ వల్ల నేల ఉపరితలానికి సూర్యకాంతి నేరుగా చేరడం తగ్గుతుంది. దీంతో కొన్ని కలుపు విత్తనాల మొలక మరియు ప్రారంభ పెరుగుదల అణచివేయబడవచ్చు. అదే సమయంలో నేలలోని తేమ త్వరగా ఆవిరైపోకుండా కొంతమేర పరిరక్షించబడే అవకాశం ఉంది.

అయితే, విరిగిన బియ్యం అన్ని రకాల కలుపు మొక్కలను పూర్తిగా నియంత్రిస్తుందని భావించకూడదు. దీని ప్రభావం కలుపు జాతి, బియ్యం పరిమాణం, వేసిన పొర మందం, నేల తేమ, ఉష్ణోగ్రత మరియు పంట పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?
విరిగిన బియ్యం ద్వారా కలుపు నివారణలో ప్రధానంగా మూడు భౌతిక ప్రభావాలు ఉండవచ్చు.

  1. కాంతి తగ్గింపు
    కలుపు విత్తనాల్లో కొన్ని కాంతి లభ్యతకు స్పందించి మొలకెత్తుతాయి. నేలపై బియ్యం ముక్కల పొర ఏర్పడటం వల్ల విత్తనాలకు అందే కాంతి తగ్గుతుంది. ఫలితంగా కొన్ని కలుపు మొక్కల మొలక తగ్గే అవకాశం ఉంటుంది.
  2. భౌతిక అవరోధం
    మొలకెత్తిన కలుపు మొక్క నేల నుంచి పైకి రావడానికి ఒక నిర్దిష్ట భౌతిక శక్తి అవసరం. నేలపై ఏర్పడిన మల్చింగ్ పొర ఈ ప్రక్రియకు కొంత అవరోధంగా పనిచేయవచ్చు.
  3. నేల తేమ పరిరక్షణ
    సేంద్రియ మల్చింగ్ సాధారణంగా నేల ఉపరితలం నుంచి నీటి ఆవిరీభవనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. విరిగిన బియ్యం కూడా ఒక పొరగా ఏర్పడితే నేల తేమను కొంతకాలం నిలుపుకోవడంలో సహాయపడే అవకాశం ఉంది.

బియ్యంలో ఉన్న రహస్యమేమిటి?
విరిగిన బియ్యంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా పిండి పదార్థం (starch), ఉంటాయి. నేలలో తేమ ఉన్నప్పుడు సూక్ష్మజీవులు ఈ సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తాయి.

ఈ ప్రక్రియ నేలలోని సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం సమయంలో ఏర్పడే సూక్ష్మపర్యావరణ మార్పులు కలుపు విత్తనాల మొలకపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే దీనిని “బియ్యం సహజ కలుపు మందు” అని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు. కలుపు నివారణకు కారణమయ్యే ఖచ్చితమైన జీవరసాయన ప్రభావాలను నిర్ధారించడానికి నియంత్రిత ప్రయోగాలు అవసరం.
అందువల్ల విరిగిన బియ్యాన్ని ప్రస్తుతం సేంద్రియ మల్చింగ్ పదార్థంగా పరిశీలించడం మరింత సముచితం.

రైతులకు ఎందుకు ఆసక్తికరం?
తక్కువ విలువైన వనరుకు కొత్త ఉపయోగం
వరి మిల్లులలో లభించే విరిగిన బియ్యాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే, ఒక ఉప ఉత్పత్తిని వ్యవసాయ అవసరానికి మళ్లించే అవకాశం ఉంటుంది.

కలుపు నియంత్రణ ఖర్చు తగ్గించే అవకాశం
చేతి కలుపు మరియు యాంత్రిక కలుపు నివారణకు అయ్యే ఖర్చును కొంతమేర తగ్గించడానికి ఇది సహాయపడవచ్చు. అయితే ఆర్థిక ప్రయోజనం ప్రాంతం, బియ్యం ధర మరియు అవసరమైన మోతాదుపై ఆధారపడి ఉంటుంది.

“కలుపు మొక్కలు పంటతో నీరు, పోషకాలు మరియు స్థలానికి పోటీ పడతాయి.”

నేల తేమ పరిరక్షణ
మల్చింగ్ వల్ల నేల తేమను నిలుపుకోవడం సాధ్యమైతే, నీటిపారుదల అవసరాన్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉంది.

సేంద్రియ పదార్థం పునర్వినియోగం
బియ్యం నేలలో క్రమంగా విచ్ఛిన్నమవడంతో సేంద్రియ పదార్థం నేల వ్యవస్థలోకి తిరిగి చేరుతుంది.

పొలంలో ఎలా ప్రయోగించాలి?
ఈ పద్ధతిని రైతులు వెంటనే పెద్ద విస్తీర్ణంలో అమలు చేయకుండా ముందుగా చిన్న విస్తీర్ణంలో పరీక్షించడం మంచిది.

దశ 1: సరైన సమయం
పంట స్థాపన పూర్తయిన తరువాత, కలుపు మొలకెత్తే ప్రారంభ దశలో మల్చింగ్ చేయడం గురించి పరిశీలించవచ్చు. పంట విత్తనాలు లేదా చిన్న మొక్కలను పూర్తిగా కప్పివేయకుండా జాగ్రత్త అవసరం.

దశ 2: బియ్యం పరిమాణం
విరిగిన బియ్యాన్ని సమాన పరిమాణంలో చిన్న ముక్కలుగా ఉండే విధంగా ఉపయోగించడం వల్ల పొర సమానంగా ఏర్పడవచ్చు.

దశ 3: సమానంగా చల్లడం
బియ్యాన్ని నేలపై ఒకే చోట ఎక్కువగా పేరుకుపోకుండా, పంట వరుసల మధ్య సమానంగా చల్లాలి.

దశ 4: పోలిక చేయడం
ఒక చిన్న భాగాన్ని బియ్యం చల్లకుండా వదిలి, మిగిలిన భాగంలో బియ్యం మల్చింగ్ చేయడం ద్వారా రెండు ప్రాంతాల్లో కలుపు సంఖ్యను పోల్చాలి.

దశ 5: ఫలితాలను నమోదు చేయడం
రైతు లేదా పరిశోధకుడు క్రింది అంశాలను గమనించాలి:
• కలుపు మొక్కల సంఖ్య
• కలుపు మొక్కల పొడి బరువు
• నేల తేమ
• పంట ఎత్తు
• పంట జీవపదార్థం
• పంట దిగుబడి
• ఒక ఎకరాకు అయ్యే ఖర్చు
• కలుపు నియంత్రణకు అయ్యే మొత్తం వ్యయం

ఒక ప్రయోగం ఎలా ఉండాలి?
ఉదాహరణకు, ఒక రైతు ఒక ఎకరంలో ఈ పద్ధతిని పరీక్షించాలనుకుంటే, మొత్తం పొలాన్ని ఒకేసారి మార్చకుండా చిన్న పరీక్షా ప్రాంతాలను ఏర్పాటు చేయవచ్చు.
A – నియంత్రణ: ఎలాంటి బియ్యం మల్చింగ్ లేకుండా సాధారణ పద్ధతి
B – తక్కువ మోతాదు: విరిగిన బియ్యం పలుచని పొర
C – మధ్యస్థ మోతాదు: కొంచెం మందమైన పొర
D – ఎక్కువ మోతాదు: మందమైన పొర

ఈ నాలుగు ప్రాంతాల్లో కలుపు సాంద్రత, నేల తేమ మరియు పంట ఎదుగుదలను పోల్చితే రైతుకు తన పొలానికి సరిపోయే విధానం గురించి ప్రాథమిక సమాచారం లభిస్తుంది.

గమనిక: పై మోతాదులు కేవలం ప్రయోగ రూపకల్పనకు ఉదాహరణలు మాత్రమే. రైతులకు ఖచ్చితమైన ఎకరాకు మోతాదును శాస్త్రీయ క్షేత్ర పరిశోధన లేకుండా సిఫారసు చేయకూడదు.

“నేలపై ఏర్పడే సేంద్రియ పొర కలుపు మొలకలను అణచివేయడంలో సహాయపడే అవకాశం ఉంది.”

జాగ్రత్తలు తప్పనిసరి!
విరిగిన బియ్యం సేంద్రియ పదార్థం కాబట్టి దానిని అధిక మోతాదులో ఉపయోగించడం ఎల్లప్పుడూ మంచిదని చెప్పలేం.

అధికంగా చల్లితే:
• ఎలుకలు, పక్షులు లేదా ఇతర జీవులను ఆకర్షించే అవకాశం ఉంది.
• బియ్యం తేమతో కలిసినప్పుడు త్వరగా కుళ్లే అవకాశం ఉంది.
• సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరగవచ్చు.
• నేలలో పోషకాల లభ్యతపై తాత్కాలిక ప్రభావం ఉండవచ్చు.
• అధిక మందంతో పొర ఏర్పడితే పంట మొలక లేదా పంట ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.

అందువల్ల “ఎక్కువ బియ్యం = ఎక్కువ కలుపు నియంత్రణ” అనే సూత్రాన్ని అనుసరించకూడదు.

అన్ని పంటలకు సరిపోతుందా?
అవసరం లేదు.
విరిగిన బియ్యంతో మల్చింగ్ పద్ధతి వివిధ పంటలు మరియు నేలల్లో భిన్నంగా పనిచేయవచ్చు. వరి, మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాలు మరియు కూరగాయ పంటల్లో వేర్వేరు ఫలితాలు రావచ్చు.
అలాగే, కలుపు జాతులు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చిన్న విత్తనాల కలుపు మొక్కలపై ఒక రకమైన ప్రభావం ఉండవచ్చు; బలమైన వేర్లు లేదా భూగర్భ కాండాలతో పెరిగే కలుపు మొక్కలపై ప్రభావం తక్కువగా ఉండవచ్చు.

అందువల్ల పంట–కలుపు–నేల పరిస్థితికి అనుగుణంగా ఈ పద్ధతిని పరిశీలించాలి.

సమగ్ర కలుపు నియంత్రణలో ఒక భాగంగా…
వ్యవసాయంలో ఒకే పద్ధతిపై ఆధారపడటం కంటే సమగ్ర కలుపు నియంత్రణ (Integrated Weed Management – IWM) మరింత ప్రభావవంతమైన విధానం.

విరిగిన బియ్యం మల్చింగ్ను అవసరాన్ని బట్టి:
సకాలంలో విత్తడం + సరైన పంట సాంద్రత + మల్చింగ్ + యాంత్రిక కలుపు నివారణ + అవసరమైనప్పుడు మాత్రమే కలుపు మందులు వంటి పద్ధతులతో కలిపి ఉపయోగించవచ్చు.
ఇలా చేయడం ద్వారా కలుపు నియంత్రణలో ఒకే రసాయనిక పద్ధతిపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు.

రైతు నుంచి పరిశోధనా క్షేత్రం వరకు
ఈ ఆలోచనను రైతు స్థాయిలో ఉపయోగకరమైన సాంకేతికతగా మార్చాలంటే శాస్త్రీయ పరిశోధన చాలా అవసరం.

పరిశోధకులు క్రింది అంశాలపై ప్రయోగాలు నిర్వహించాలి:
విరిగిన బియ్యం మోతాదు × కణ పరిమాణం × మల్చింగ్ సమయం × నేల తేమ × పంట రకం × కలుపు జాతి
ఈ అంశాల కలయికలో ప్రయోగాలు నిర్వహించి కలుపు నియంత్రణ శాతం, పంట దిగుబడి, నీటి వినియోగం, నేల ఆరోగ్యం మరియు ఆర్థిక లాభాలను అంచనా వేయాలి.

“వ్యవసాయంలో కొత్త ఉపయోగం కోసం పరిశీలిస్తున్న ఒక అందుబాటులో ఉన్న వనరు.”

అలాగే విరిగిన బియ్యాన్ని ఇతర సేంద్రియ మల్చింగ్ పదార్థాలు—పంట అవశేషాలు, గడ్డి, వరి పొట్టు మొదలైన వాటితో పోల్చడం ద్వారా దాని నిజమైన ప్రయోజనాన్ని అంచనా వేయవచ్చు.

చివరి మాట
వ్యవసాయంలో కొత్త సాంకేతికత అనేది ఎల్లప్పుడూ ఖరీదైన యంత్రం లేదా ఆధునిక రసాయనం మాత్రమే కాదు. మన చుట్టూ అందుబాటులో ఉన్న వనరులను తెలివిగా ఉపయోగించుకోవడం కూడా ఒక సాంకేతికతే.
విరిగిన బియ్యం కూడా అలాంటి ఒక వనరుగా మారవచ్చు. నేలపై సేంద్రియ మల్చింగ్ పొరగా ఉపయోగించడం ద్వారా కలుపు మొలకలను తగ్గించడం, నేల తేమను పరిరక్షించడం మరియు వ్యవసాయ ఉప ఉత్పత్తిని తిరిగి పొలంలో ఉపయోగించడం వంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

అయితే, దీనిని రైతులకు ఖచ్చితమైన కలుపు మందు లేదా నిర్ధారిత కలుపు నివారణ పద్ధతిగా ఇప్పుడే ప్రకటించకుండా, పరిశోధన ఆధారంగా పరీక్షించి, సరైన మోతాదు మరియు పంటకు అనుకూలమైన విధానాన్ని నిర్ధారించడం అవసరం.

“వ్యర్థం కాదు… వనరే!”
వరి మిల్లులో విలువ తక్కువగా కనిపించే విరిగిన బియ్యం, శాస్త్రీయంగా ఉపయోగిస్తే రైతు పొలంలో విలువైన సేంద్రియ వనరుగా మారే అవకాశం ఉంది.

డాక్టర్ వై. నందిని (అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి, కావేరి యూనివర్సిటీ, హైదరాబాద్): 8686839559
డాక్టర్ ఆర్. సందీప్ కుమార్ (టీచింగ్ అసోసియేట్, PJTAU, హైదరాబాద్): 7396462208
డాక్టర్ టి. శ్రవణ్ (టీచింగ్ అసోసియేట్, PJTAU, జగిత్యాల): 7416344239
కె. అనిల్ కుమార్ (టీచింగ్ అసోసియేట్, PJTAU, సంగారెడ్డి): 9441579403

Read More

బ్రహ్మి

బ్రహ్మి లేదా గోటుకోలా మొక్కలో ట్రైటెర్పినాయిడ్స్ అదికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఆసియాటికోసైడ్స్ గాయాలు త్వరగా మానడానికి సహాయపడతాయి.

ఈ మొక్క చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు యాంటీఆక్సీడెంట్ స్థాయిలను పెంచుతుంది. గాయపడిన ప్రాంతానికి రక్తప్రసరణ మెరుగుపడటానికి, కొత్త కణాలు మరియు కణజాలం ఏర్పడటానికి సహాయపడుతుంది. అలాగే సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

బ్రహ్మి ఆకుల రసాన్ని చిన్న గాయాలు, కాలిన గాయాలు, మచ్చలు మరియు ఇతర చర్మ సమస్యలపై సంప్రదాయంగా లేపనంగా ఉపయోగిస్తారు. గాయపడిన లేదా కాలిన భాగంలో కొత్త కణాల ఏర్పాటుకు, కణజాల వృద్ధికి మరియు చర్మ దృఢత్వం పెరగడానికి ఇది సహాయపడుతుంది. దీనిలోని ఆసియాటికోసైడ్స్ సంధాన కణజాలం ఏర్పడటాన్ని ప్రోత్సహించి, యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. అందువల్ల చిన్న గాయాలు, మచ్చలు, శస్త్రచికిత్స అనంతరం ఏర్పడే గాయాలు, కాలిన చర్మ గాయాలు మరియు వెరికోస్ అల్సర్లలో సహాయకంగా ఉపయోగించబడుతుంది.

బ్రహ్మీ ఆకులను శుభ్రంగా కడిగి తయారు చేసిన పసరును సంప్రదాయంగా గాయంపై లేపనంలా పూసి, గాజు గుడ్డతో కట్టు కడతారు. అయితే లోతైన గాయాలు, తీవ్రమైన కాలిన గాయాలు లేదా ఇన్ఫెక్షన్ ఉన్న గాయాలకు స్వయంగా ఆకు పసరు లేదా ఇతర పదార్థాలు ఉపయోగించకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.

బ్రహ్మీ/గోటుకోలా ఆధారిత గుళికలు, క్రీములు మరియు ఆయింట్‌మెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని వైద్యుల లేదా అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుల సూచన మేరకు ఉపయోగించడం మంచిది.

బ్రహ్మీ/గోటుకోలా సాగు సాంకేతికతః

  1. అనుకూలమైన నేల
    సారవంతమైన, మంచి నీటి పారుదల కలిగిన ఇసుక-లోమి లేదా లోమి నేలలు అనుకూలం. నేలలో సేంద్రియ పదార్థం అధికంగా ఉండటం మంచిది. నీరు నిలిచిపోయే నేలలను నివారించాలి. సుమారు ఉదజని 5.5-7.0 మధ్య నేల అనుకూలంగా ఉంటుంది. తేమను నిలుపుకునే నేలలో మంచి పెరుగుదల ఉంటుంది.
  2. వాతావరణం:
    ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల వాతావరణం అనుకూలం.
  • సుమారు 20-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మంచి పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.
  • అధిక తేమ మరియు మితమైన నీడలో కూడా బాగా పెరుగుతుంది.
  • నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా సాగు చేయవచ్చు.
  1. నీటి పారుదలః
    బ్రహ్మీకి నేలలో తగినంత తేమ నిరంతరం ఉండటం అవసరం. వేసవిలో సాధారణంగా 3-5 రోజులకొకసారి, నేల పరిస్థతిని బట్టి నీరు ఇవ్వవచ్చు. డ్రిప్ లేదా స్ప్రింక్లర్ పద్ధతులను ఉపయోగించవచ్చు. నీరు నిలిచిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  2. ఎరువుల యాజమాన్యం:
    భూమిని సిద్ధం చేసేటప్పుడు బాగా కుళ్లిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వేయాలి. సాధారణంగా హెక్టారుకు సుమారు 10-15 టన్నుల సేంద్రియ ఎరువు ఉపయోగించవచ్చు. నేల పరీక్ష ఆధారంగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఇవ్వడం మంచిది. సేంద్రియ సాగులో వర్మీకంపోస్ట్, జీవ ఎరువులను ఉపయోగించవచ్చు. సమతుల్య పోషక యాజమాన్యం పాటించాలి.
  3. కోత మరియు దిగుబడి:
    నాటిన తరువాత సుమారు 3-4 నెలలకు మొదటి కోత తీసుకోవచ్చు. నేలకు దగ్గరగా ఆకులు మరియు కొమ్మలను కోయాలి. తగిన నీరు, పోషకాలు అందిస్తే తదుపరి కోతలు కూడా తీసుకోవచ్చు. సాగు విధానం, నేల, వాతావరణం మరియు నిర్వహణను బట్టి సాధారణంగా హెక్టారుకు సుమారు 10-20 టన్నుల తాజా ఆకులు/హెర్బ్ లభించవచ్చు.
  4. విలువ ఆధారిత ఉత్పత్తులు:
    బ్రహ్మీ ఆకులను తాజా రూపంలో లేదా ఎండబెట్టి వివిధ ఉత్పత్తులుగా మార్చుకోవచ్చు.
    • బ్రహ్మీ ఆకుల పొడి
    • బ్రహ్మీ టీ
    • బ్రహ్మీ హెర్బల్ డ్రింక్
    • బ్రహ్మీ జ్యూస్/స్క్వాష్
    • బ్రహ్మీ ఎక్స్‌ట్రాక్ట్
    • బ్రహ్మీ క్యాప్సూల్స్ మరియు టాబ్లెట్లు
    • బ్రహ్మీ హెర్బల్ ఆయింట్‌మెంట్/క్రీమ్
    • బ్రహ్మీ సబ్బులు మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులు
    • హెర్బల్ హెయిర్ ఆయిల్
    • బ్రహ్మీ ఆధారిత న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులు
    విలువ జోడింపు ద్వారా తాజా ఆకులు కంటే నిల్వ కాలం పెంచడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఔషధంగా లేదా వ్యాధి చికిత్స కోసం విక్రయించే ఉత్పత్తులకు సంబంధిత నాణ్యత, భద్రత మరియు నియంత్రణ ప్రమాణాలను పాటించాలి.

డా. యం.ఆర్. భానుశ్రీ, డా. వి. జయశ్రీ, డా. యం. జగన్‌మోహన్‌రెడ్డి
వ్యవసాయ కళాశాల, పాలెం, నగర్ కర్నూల్ జిల్లా. ఫోన్ : 9618874445

Read More

ఔషధ మొక్క… చెంగల్వ కోస్టు

సాధారణ నామం: ఎలిగెంట్ కాస్టన్, కేవుకంద, బోగచ్చిక దుంప, బేసికదుంప
శాస్త్రీయ నామం: కోస్టస్ స్పీసియోసస్
కుటుంబం: జింజిబెరేసి

ఇది అల్లం దుంప వంటి వేరుగల మొక్క. దుంప అల్లం కంటే పెద్దగా ఉంటుంది. కొమ్మలు సాధారణంగా వర్తులాకారపు వంపు కలిగి 1-2 మీ. ఎత్తు పెరుగుతాయి. కణుపుకు ఒకటి చొప్పున సామాన్య పత్రాలు దీర్ఘచతురస్రాకారములో ఉండి మెత్తని నూగు కలిగి ఉంటాయి. పుష్పాలు తెల్లగా, పెద్దవిగా కొమ్మచివర దట్టమైన గుత్తివలె ఏర్పడతాయి. రక్షక పత్రాలు ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఫలాలు కూడా ఎర్రగా ఉంటాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దుంపలకు లేదా కొమ్ములకు ఔషధ గుణాలున్నాయి. ఈ దుంపల నుండి డయోస్ జెనిన్ అనే స్టిరాయిడ్ లభిస్తుంది.
  • విరేచనకారి, క్రిమిసంహారి, జీర్ణశక్తిని అభివృద్ది చేస్తుంది. జ్వరము, చర్మవ్యాధులు, ఉబ్బు కామెర్లకు ఉపయోగపడుతుంది. పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. గర్భనిరోధక మందుల తయారీలో డయోస్‌జెనిన్ స్టిరాయిడ్ ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • చెంగల్వకోస్టుని విస్తృతంగా అలంకరణ మొక్కగా పెంచుతారు. చెంగల్వకోస్టు ద్రావణాలు (2500, 5000, 10000, 20000 పిపియం) ప్లూటెల్లా క్లైలోస్టెల్లా లార్వాలపై గణనీయమైన నివారణ చర్య చూపాయి. ఇథనాల్ ద్రావణం అత్యంత సమర్ధవంతంగా ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా లార్వాలను నివారించింది. లార్వాలపై ద్రావణాల ప్రభావం ఈ క్రింది క్రమంలో ఉంది.
  • ఇథనాల్ & క్లోరోఫాం & బ్యూటనాల్ & నీరు (అశిష్ కుమార్, అతని అనుచరులు, 2016).
  • చెంగల్వకోస్టు ద్రావణం షిగెల్లా, స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, క్లెబ్సియెల్లా న్యుమోనియే, సూడోమోనాస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, సాల్మొనెల్లాపై గణనీయమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి. చెంగల్వకోస్టు ద్రావణం నుండి వేరు చేసిన అవినోకోసైడఎ, ట్రెగోజెనిన్, సపోనిన్‌బి, సపోనిన్‌సి, బోట్రైటిస్ సినరియా, ఆల్టర్నేరియా టెన్యుస్సిమా, ఫ్యుజేరియంపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించాయి (సింగ్, అతని అనుచరులు, 1992).
  • చెంగల్వకోస్టు ద్రావణం రెండు మచ్ౘ్ల ఎర్రనల్లి, టెట్రానైకస్ అర్టికె ఆడపురుగుల పునరుత్పత్తిని, పొదిగిన గుడ్ల శాతాన్ని, గుడ్లు పెద్ద పురుగుల దశకు చేరే శాతాన్ని, జీవిత చక్రంలో ప్రతిదశ సమయాన్ని సమర్ధవంతంగా అరికట్టింది. ఈ ద్రావణం 79.67% లార్వాలను అకారిసైడల్ చర్య ద్వారా చంపింది. గుడ్లు పొదిగే సమయాన్ని బాగా పెంచింది (ఇస్మాయిల్, 2017).
  • చెంగల్వ కోస్టు (కోస్టస్ స్పీసియోసా), కోస్టస్ లాసెరస్, కోస్టస్ గ్లోబోసస్ దుంపల నుండి వేరు చేసిన డయోస్‌జెనిన్ ప్లూటెల్లా క్లైలోస్టెల్లాపై తక్కువ స్పర్శ, ఓవిసైడల్ చర్యను ప్రదర్శించింది. కాని అధిక శక్తివంతమైన కీటకపెరుగుదల క్రమబద్ధీకరణ చర్య, అధిక గుడ్లు పెట్టకుండా నిరోధించే చర్యను ప్రదర్శించింది. లార్వా, ప్యూపాల రూపాలలో కూడా మార్పు తెచ్చింది. కాని ప్లూటెల్లా క్లైలోస్టెల్లా నాశించే పారసైటాయిడ్, కొటీసియా ప్లూటెల్లాకు ఎలాంటి హాని చేయలేదు (పిపిత్‌సంగ్‌చన్ అండ్ మొరాల్లోరెజెసస్, 2005).
  • చెంగల్వకోస్టు వేరు ద్రావణం డెంగ్యూ మరియు యెల్లో ఫీవర్ వాహకం ఈడెస్ ఈజిప్టిపై గణనీయమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. అందువలన దీనిని డెంగ్యు మరియు యెల్లోఫీవర్ నివారణలో ఉపయోగించవచ్చు (అడెబాజొ, అతని అనుచరులు, 2012).
  • చెంగల్వకోస్టు దుంపను నలగ్గొట్టి పేస్టు చేసి దాని నుండి రసం పిండాలి. ఈ రసాన్ని నీటిలో కలిపి వరి చేలో పంటపై పిచికారి చేసి రైస్‌హిస్పా (తాటాకు తెగులు)ని నివారించవచ్చు. ఈ పద్ధతిని అస్సామ్‌లో కామ్‌రూప్ జిల్లాలోని అమ్‌టోలా గ్రామ రైతులు ఆచరిస్తున్నారు (హరేన్‌కల్టియా, 2003).
  • చెంగల్వకోస్టు ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి టెట్రానైకస్ అర్టికెని అకారిసైడల్ చర్య ద్వారా నియంత్రించింది (ఇస్మాయిల్).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

కాయతొలుచు పురుగు నివారణకు పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణం

పచ్చిమిర్చిలో ‘కాప్సిసిన’ అనే ఆల్కలాయిడ్ మరియు వెల్లుల్లిలో ‘అల్లెసిస’ అనే ఆల్కలాయిడ్‌లు ఉంటాయి. వీటి ప్రభావం వల్ల పురుగుకు స్పర్శ చర్య ద్వారా ‘తిమ్మిరి’ గుణాన్ని కలిగిస్తాయి. దీనివలన పురుగు మొక్క పై నుండి క్రిందపడి చనిపోతుంది.
శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్రగొంగళి పురుగు (మూడవ దశ వరకు) నివారణకు ఈ ద్రావణాన్ని పత్తి, కంది, శనగ, వేరుశనగ, ఆముదం, వంగ, టమాట, మిరప పంటలలో రైతులు పురుగు ఉధృతిని బట్టి వాడవచ్చు.

కావలసిన పదార్థాలు :
పచ్చిమిర్చి : 3 కిలోలు
వెల్లుల్లి : అరకిలో
కిరోసిన్ : పావులీటరు (250 మి.లీ.)
సబ్బుపొడి : 100 గ్రా.

తయారు చేసే విధానం :

  • 3 కిలోల పచ్చిమిరప కాయలను కాడలు తీసి వాటిని మెత్తగా నూరి, దానిని 10 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా బాగా నానబెట్టాలి.
  • అరకేజి వెల్లుల్లిపాయలను పొట్టుతీసి వాటిని బాగా నూరి 250 మి.లీ. కిరోసిన్‌లో ఒక రాత్రంతా నానబెట్టాలి.
  • మర్నాడు పచ్చిమిర్చి ద్రావణాన్ని ఒక పలుచని గుడ్డతో వడపోయాలి.
  • మిరప ద్రావణం, వెల్లుల్లి ద్రావణం, 100 గ్రాముల సబ్బుపొడి ద్రావణం, ఈ మూడింటిని బాగా కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి.
  • ఈ విధంగా తయారు చేసిన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పొలంలో సాయంత్రం పూట పిచికారి చేయాలి.

ఉపయోగాలు: పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణాన్ని వంగలో వచ్చే కాయతొలుచు పురుగు నివారణకు, బెండ, టమాట పంటల నాశించే కాయతొలుచు పురుగుల నివారణకు, పత్తిలో వచ్చే కాయతొలుచు పురుగుల నియంత్రణకు వాడి మంచి ఫలితాలు సాధించవచ్చు.

జాగ్రత్తలు :

  • ఈ ద్రావణం చాలా శక్తివంతమైన క్రిమిసంహారకంగా పనిచేస్తుంది.
  • ఈ ద్రావణం పంటలపై పిచికారి చేసిన 4-5 రోజుల తర్వాత పశువుల పేడ, మూత్రం ద్రావణం పిచికారి చేయడం చాలా మంచిది. దీని వలన పంటలకు పోషకాలు లభించి ఆరోగ్యవంతంగా ఉంటాయి.
  • ఈ ద్రావణం తయారు చేయునపుడు ఒంటికి నూనె రాసుకోవటం అవసరం.
  • పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పంటలపై పిచికారి చేయునపుడు ఒంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
  • పంట కాలంలో 1-2 సార్లు మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.
  • తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
    పచ్చిమిర్చికి ప్రత్యామ్నాయంగా ఎండుమిర్చిని కూడా ఉపయోగించవచ్చు.
Read More

ఔషధ మొక్క…. కొత్తిమీర

కొతిమీర 50 సెం.మీ. ఎత్తు పెరిగే మెత్తని మొక్క. ఆకులు అనేక ఆకారాలలో ఉంటాయి. మొక్క మొదలు వద్ద ఆకులు వెడల్పుగా ఉండి అనేక భాగాలుగా ఉంటాయి. పూత వచ్చే కాండాలపై ఆకులు సన్నగా ఈకలులా ఉంటాయి. పూలు చిన్న అంబెల్‌పై ఏర్పడతాయి. తెలుపు లేదా లేత పింకు రంగులో ఉంటాయి. కాయ గుండ్రంగా 2-6 మి.మీ. పొడవు, 3-5 మి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.

సాధారణ నామం : కోరియాండర్ శాస్త్రీయ నామం : కోరియాండ్రం సెటైవం కుటుంబం: ఎపియేసి (అంబెల్లిఫెరే)

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • కొతిమీర బహుళ ఆరోగ్య ప్రయోజనాలు గల మొక్క. ఇది అద్భుతమైన ఆకలిని కలిగిస్తుంది. కడుపులో జీర్ణాశయంలో అనేక ఎంజైములు, జీర్ణ రసాలు స్రవించడానికి సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచి విరేచనం సాఫీగా అయేలా చేస్తుంది. ఇది ఆహారంలో పీచు పదార్థం అందిస్తుంది. జీర్ణకోశంలో వాయువులను విడుదల చేస్తుంది. మలబద్దకం, మొల్లలు, కడుపునొప్పికి ప్రయోజనకారి. దగ్గు తగ్గించడానికి, నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఒక అద్భుత యాంటిసెప్టిక్. కఫాన్ని తగ్గించి, జ్వరాన్ని పోగొట్టి చల్లదనాన్ని ఇస్తుంది.
  • కొతిమీరలో అనేక పోషక విలువలుండటం వలన దీనిని “ప్రపంచ అద్భుత హెర్బల్ మొక్క”గా పరిగణిస్తారు. ఇది అనేక పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, యాంటిసెప్టిక్, బాధనాశక, ఉత్తేజిత, శిలీంద్రనాశక లక్షణాలు కలిగి ఉంటుంది.
  • కొతిమీర విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఎసెన్షియల్ ఆయిల్స్, ఆమ్లాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఆకులలో కాల్షియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, సోడియం ఉంటాయి.
  • 100 గ్రా. కొతిమీరలో 3.67 గ్రా. పిండిపదార్థాలు, 2.13 గ్రా. ప్రోటీన్లు, 0.52 గ్రా. కొవ్వు, 2.80 గ్రా. పీచు, 23 కి. క్యాలరీల శక్తి, 62 మైక్రోగ్రాముల ఫోలియేట్స్, 1.11 మి.గ్రా. నియాసిన్, 0.55 మి.గ్రా. పాంటోథీనిక్ యాసిడ్, 0.14 మి.గ్రా. పైరిడాక్సిన్, 0.16 మి.గ్రా. రైబోఫ్లేవిన్, 0.067 మి.గ్రా. థయామిన్, 6748 ఐయు విటమిన్ ఎ, 27 మి.గ్రా. విటమిన్ సి, 2.50 మి.గ్రా. విటమిన్ ఇ12, 310 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటాయి.
  • కొతిమీర కొలెస్టరాల్‌ని తగ్గిస్తుంది. జీర్ణకోశ కదలికలు సాఫీగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్‌కి మంచిది. అల్ౙీమర్ వ్యాధిని తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మూత్రనాళ వ్యాధులను నివారించి మూత్రం సాఫీగా పారేలా చేస్తుంది. మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
  • కొతిమీరలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ కీళ్ళ నొప్పుల వల్ల కలిగే శరీర వాపుని తగ్గిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. కండ్ల కలక చకిత్సకు అద్భుత ఔషధం కొతిమీరలో ఉండే బీటాకెరోటిన్, యాంటిఆక్పిడెంట్లు కంటి సంబంధిత సమస్యలను నివారిస్తాయి. నోటి పుండ్ల నివారణకు ఇంటిమందు. ఎముకలను బలపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుంది. రుతు సమస్యలకు మహిళలు 5 గ్రా. కొత్తిమీర, ఒక చెంచా పంచదార అర లీటరు నీటిలో కలిపి మరగించిన కషాయాన్ని వడపోసి రోజుకి 3 సార్లు సేవించాలి. కేశ నష్టాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కోలన్ క్యాన్సర్‌ని నివారిస్తుంది.
  • కొతిమీర చట్నీ తయారు చేసి వడ్డించవచ్చు. పొడి చేసిన గింజలను కేకుల తయారీలో ఉపయోగించవచ్చు. గ్రైప్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు. కొతిమీర యాంటిసెప్టిక్, అనాల్ౙెసిక్, అఫ్రోడియాసిక్, యాంటిస్పాస్మోడిక్, డియోడరెంట్, ఫంగిసైడల్, స్టిమ్యుటెంట్, స్టమకిక్, యాంటి బయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొతిమీరలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. యాంటిక్యాన్సర్, యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

వ్యవసాయరంగంలో

  • కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్‌లో లినలూల్ (57.57%), జిరానిల్ అసిటేట్ (15.09) ఎక్కువగా ఉంటాయి. ఈ రసాయనాలు ట్రైబోలియం కాస్టానియం కంటే కొల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించాయి. (ఖని, రహ్‌దారి, 2012).
  • టమాట పంటలో కొతిమీరని అంతరపంటగానే వేయడం వల్ల వివిధ రసం పీల్చే పురుగులు, తెల్లదోమ (బెమిసియా టబాసి), పేనుబంక (ఎఫిస్‌గాసిపి), జాసిడ్స్ (ఎంపోవాస్కాస్పీసీస్), తామర పురుగులు (త్రిప్స్ టబాసి), రెండు మచ్ౘ్ల ఎర్రనల్లి (టెట్రానైకస్ అర్టికె) సమర్ధవంతంగా, గణనీయంగా నివారించబడ్డాయి. ఈ పరిశోధనా ఫలితాలు ఆర్థిక పంటలతో ఆకర్షక మొక్కలను పెంచే పద్ధతిని సమగ్ర సస్యరక్షణ పథకాలలో ఒక భాగంగా సిఫారసు చేసి ఆర్థిక పంటలను పురుగుల బారి నుండి రక్షించవచ్చని వెల్లడించాయి (అబోషనాబ్, అతని అనుచరులు, 2017).
  • సహజ సుగంధపంటలైన పైపర్‌నైగ్రం, క్యూమినం సిమ్నియం, సిన్నమోమం వెరం, అల్లియం సెటైవం, కోరియాండ్రం సెటైనం, కర్కుమ, ఫీనిక్యులం వుల్గేర్, ట్రైగొనెల్లా ఫీనం గ్రీకం, సైజిగియం ఆరోమాటికం, క్యాప్సికం, జింజిబర్ అఫిసినాలిస్, మురయూ కోయినిగీ, బ్రాసికా నైగ్రా, సోడియం క్లోరైడ్‌లను కలిపిన మిశ్రమాన్ని పాటింగ్ మట్టితో కలిపి మొక్కలకు వేయాలి. ఈ జీవ పురుగు మందు వికర్షక చర్య, జీర్ణాశయంలో నిలిచిపోవడం, పక్షవాతం, ఊపిరాడకుండా చేయడం ద్వారా పురుగులను నివారిస్తాయి. ఈ జీవమందుని పొడిరూపంలో లేదా ద్రవరూపంలో పంటపై పిచికారి చేసి పురుగులను 48-72 గంటలలో నివారించవచ్చు. (గండిఐషాడోటి, 2012). ఈ జీవ పురుగు మందుని చ.మీ.కి. 100-500 గ్రా. చొప్పున వేయాలి.

జీవపురుగుమందులోని పదార్థాలు
మొక్క శాతం
పైపర్ నైగ్రమ్ 25.75
క్యుమినం సైమినం 15.45
సిన్నమోమం వెరమ్ 11.05 కోరియాండ్రం సెటైవం 12.80
కర్కుమ 7.44
ఫీనిక్యులం వుల్గేర్ 2.37
ట్రైగోనెల్లా ఫీనంగ్రీకం 3.65
సైజిగియం ఆరోమాటికం 2.58
క్యాప్సికం 1.38
జింజబర్ అఫిసినానిస్ 3.36
మురయా కోయినిగీ 1.60
బ్రాసికా నైగ్రా 0.03
సోడియం క్లోరైడ్ 0.17

  • కొతిమీర ఎసెన్షియల్ ఆయిల్ ఆల్టర్నేరియా టెన్యుయిస్, ఆస్పర్ౙిల్లస్ ఒరైజె, పెనిసిలియంక్రైసోజినం శిలీంద్రాలనరికట్టాయి (డోవిగిచ్, 1971)
  • జాన్‌కౌస్కా & జైట్కా (2016) క్యారట్ పంటలో కొతిమీర (కోరియాండ్రం సెటైవం), సమ్మర్ సావొరి (సాటురేజ హార్టెన్సిస్) అంతర పంటలప్రభావంపై అధ్యయనం చేశారు. అంతర పంటలు క్యారట్‌రస్ట్‌ఫ్లెå (సైలారోజే) వలన వేర్లకు కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించాయి. అంతర పంటలు వేసిన క్యారట్ క్షేత్రంలో ఆకులపై సిల్లిడ్ (ట్రైయజా విరిడ్యులా), పేనుబంక, వేర్లపై నులిపురుగుల నష్టం గణనీయంగా తక్కువగా ఉంది. కొతిమీర, సావరి అంతర పంటలుగా వేయడం వలన క్యారట్ పంటలో ప్రయోజనకర కీటకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయోగాలు జరిపిన అన్ని సంవత్సరాలలో కొతిమీరని అంతర పంటగా వేసిన క్యారట్ క్షేత్రంలో బదనికలు అక్షింతల పురుగులు, సిర్పిడ్ ఈగల సంఖ్య అధికంగా ఉంది.
  • కొతిమీరలో ఉన్న లిమలూల్ (68.2%), పైనీన్ (5.5%), టెర్పినిన్ (5.5%) అనే ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే అకాంతోసెరిడస్ ఒబ్టెక్షన్‌పై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించాయి (రిగ్నాల్ట్‌రోగర్, 1997).
  • కొతిమీర మొక్కలు పురుగుల సహజశత్రువులైన అల్లిక రెక్కల పురుగు (క్రైసోవా), అక్షింతల పురుగులు (కాక్సినెల్లిడ్స్), హోవర్ ఈగలు, పరాన్నజీవులైన చిన్న కందిరీగలను ఆకర్షిస్తాయి.
  • కాలీఫ్లవర్ పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాకెå్ౙలోసెల్లా సమగ్ర సస్యరక్షణ పథకంలో కొతిమీరని కాలీఫ్లవర్‌లో అంతర పంటగా వేయడం ఒక పద్ధతి.

కాలీఫ్లవర్ పంటలో డైమండ్ బ్యాక్ మాత్ యాజమాన్యానికి సిఫారసు చేసిన సమగ్ర సస్యరక్షణ పథకం
క్ర.సం. ట్రీట్‌మెంట్ మోతాదు/ప్లాట్ ఎన్నిసార్లు ఉపయోగించాలి
1. కొతిమీరని అంతర పంటగా సాగు చేయడం అర కిలో విత్తనం ఒకసారి
2. రసాయన పురుగుమందు లోర్స్‌బాన్ (2%) పిచికారి 16 మి.లీ/8 లీ. 3 సార్లు
3. 2% వేపగింజల కషాయం పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు
4. 2% వేపనూనె పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు
5. జీవనియంత్రణట్రైకోగ్రామాకిలోనిస్ (పారసైటాయిడ్) ప్యూపాల కార్డు
(పర్వీన్, ఖాన్)

  • కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్ స్పోడోప్టెరా లిట్టొరాలిస్ 3వ దశ లార్వాలపై అత్యధిక ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది. (సౌగ్విర్, అతని అనుచరులు, 2013).
  • కూరగాయల సాగులో కొతిమీరను సహవాస పంటగా వేస్తే పేనుబంకను వికర్షిస్తుంది. ఎర్రనల్లి, పొటాటో బీటిల్స్ ఆశించకుండా చేస్తుంది.
    కొతిమీర సహజ శత్రువుల జీవిత కాలాన్ని పెంచుతుంది. అల్లిక రెక్కల పురుగు, హోవర్ ఈగ, ట్రైకోగ్రామా కిలోనిస్ పారసైటాయిడ్‌ని ఆకర్షిస్తుంది (టినాకా, 2014).
  • ఇర్వింగ్, అతని అనుచరులు (2014) కొత్తిమీర డాలికోగెనిడియా టస్మానికా సహజ శత్రువు జీవిత కాలాన్ని పెంచుతుందని నిరూపించారు.
  • కొతిమీర నుండి సృష్టించిన కొత్త సస్యరక్షణ ఎసెన్షియల్ ఆయిల్ ఉత్పత్తులు మూడు పేనుబంక జాతులు మాక్రోసైఫం రోజే, ఎఫిస్ నెరీ, ఎఫిస్ పోమి లపై గట్టి కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అటనసోప, 2017).
  • బెల్‌పెప్పర్‌లో అధిక నష్టం కలిగించే యూరోపియన్ కార్న్‌బోరర్, ఆస్ట్రినియా న్యూబిలాలిస్ సంరక్షణ జీవనియంత్రణకు అధ్యయనం జరిపారు. కొతిమీర, డిల్, బక్‌వీట్ అంతర పంటలను 3 బదనికలు చిన్నపైరేట్‌నల్లి (ఓరియస్ ఇన్సిడియోసస్), పింక్ మచ్చల అక్షింతల పురుగు (కోలియోయెగిల్లా మాక్యులేటస్), ఆకుపచ్చ అల్లిక రెక్కల పురుగు (క్రైసోపాస్పీ.)ని ఆకర్షించడానికి ఎంచుకున్నారు. వీటిని బెల్ పెప్పర్ ప్లాట్ల దక్షిణహద్దులో ఒకదాని తర్వాత ఒకటి 5వరుసల్లో నాటారు. బెల్ పెప్పర్ పంటలో కొతిమీర, డిల్‌ని కలిపి రెండు వరుసల్లో నాటారు. బక్ వీట్‌ని పంటలేని భూమిలో ఒక వరుసలో నాటారు.
  • పరిశోధనా ఫలితాలు అంతర పంటలు బెల్‌పెప్పర్‌ని తీవ్రంగా ఆశించే యూరోపియన్ కార్న్‌బోరర్‌ని సమర్ధవంతంగా నివారించాయని వెల్లడించాయి. అంతర పంటలు చిన్నపైరేట్ నల్లి, పింక్ మచ్చల అక్షింతల పురుగులు అధికంగా యూరోపియన్ కార్న్‌బోరర్ గుడ్లను తినడాన్ని ప్రోత్సహించాయి. (బికర్‌టన్, హోమిల్టన్, 2017).
  • ఫాబా చిక్కుడు రకాలలో కొతిమీరని అంతరపంటగా వేయడం వలన పేనుబంక పురుగులు, ఎఫిస్ క్రాక్సివొర గణనీయంగా తగ్గిపోయాయి. బదనికలు, గింజ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ప్లాట్ చుట్టూ కొతిమీర స్ట్రిప్ వేసిన 843 రకం ఫాబి చిక్కుడు ప్లాటులో అతి తక్కువ పేను బంక పురుగుల సంఖ్య నమోదైంది (రిజ్క్, 2011).
  • గ్రీన్‌హౌస్ టమాట సాగులో తెల్లదోమ, ట్రైఎల్యురాడెస్ వేపొరేరియంపై వికర్షక పంటలు తులసి, పుదిన, డిల్, వెల్లుల్లి, ఉల్లి, పార్ల్సీ, కొతిమీర ప్రభావంపై అధ్యయనం చేపట్టారు. ముందుగా వికర్షక పంటల విత్తనాలను చల్లి తర్వాత టమాట నారు మొక్కలను నాటారు. కొతిమీరపై అతి తక్కువ తెల్లదోమలు నమోదవడం వలన దీనిని అత్యుత్తమ వికర్షక మొక్కగా సిఫారసు చేశారు (తస్లి, అతని అనుచరులు, 2017).
  • కొతిమీర పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది. కొతిమీర కషాయం తయారు చేయడానికి 200 గ్రా. ధనియాలను దంచి 1 లీ. నీటిలో కలిపి 10ని. మరిగించాలి. తర్వాత ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలపాలి. ఉదయంవేళ ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలిపి పురుగాశించిన మొక్క భాగాలపై పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు. (పట్నాయక్, 2017).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పందిరి సాగు – రైతుకు లాభదాయకమైన సాగు విధానం

కూరగాయల సాగులో సాంప్రదాయ విధానాలు రైతు ఆదాయానికి భరోసా ఇవ్వడం లేదు. రైతులు అందుబాటులో ఉన్న వనరులు, శాస్త్రీయ పద్ధతులను ఆచరించడం ద్వారా ఆశించిన వ్యవసాయాన్ని పొందే వీలుంటుంది. సాధారణంగా కూరగాయలకు మార్కెట్లో ధరల వ్యత్యాసం అధికంగా ఉంటుంది. దీనిని అవకాశంగా మలచుకొని పంట దిగుబడులు తక్కువగా వచ్చే కాలాన్ని గుర్తించి, ఆ సమయంలో ఉత్పత్తులు చేతికి అందేలా సాగు వ్యవధిని సర్దుబాటు చేసుకొని మంచి ఫలితాలను సాధించుకోవాలి.

నిలకడ మార్కెట్‌ ధర మరియు నిత్యం గిరాకీ పలికే పంటల్లో తీగజాతి కూరగాయలు ఒకటి. అందువల్ల రైతులు వాటి సాగుపై ఎక్కువ మక్కువ చూపిస్తారు. రైతు కష్టాన్ని ప్రోత్సహించే దిశగా సాగు విధానం మరింత బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంలో ఈ పందిరి టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది.

సాధారణంగా ఈ జాతి మొక్కలకు కాండం సన్నగా, లతలా తీగలు పాకి ఉంటాయి. వాటి పెరుగుదల మరియు అభివృద్ధికై పందిళ్లు లేదా ట్రెల్లిస్‌లు అనే సాంకేతిక నిర్మాణంపై ఊతం అందించడాన్నే పందిరి సాగు లేదా పెండాల్‌ సాగు అంటారు.

ప్రయోజనాలు

  • మొక్కలకు గాలి, సూర్యరశ్మి ఎక్కువగా ప్రసరించడం వల్ల శిలీంధ్రాల బెడద చాలా తక్కువగా ఉంటుంది.
  • పంట దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుంది.
  • చీడపీడలు మరియు తెగుళ్ల బెడద తగ్గుతుంది.
  • భారీ వర్షాలకు కూరగాయలు పడిపోకుండా కాపాడుకోవచ్చు.
  • అధిక భూతాపం నుంచి పంటలను కాపాడవచ్చు.
  • అంతర పంటలను వేసుకునే వెసులుబాటు కలిగిస్తుంది. వాటి ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
  • అంతరకృషి సులభంగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

నష్టాలు / రైతుకు ఎదురయ్యే ఇబ్బందులు
పందిరి నిర్మాణానికి ప్రారంభ దశలో అధిక పెట్టుబడి అవసరమవడం వల్ల, రైతులు పెద్దఎత్తున పందిరి సాగును చేపట్టేందుకు కొంత వెనుకంజ వేస్తున్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం, చిన్న మరియు సన్నకారు రైతులు పందిరి సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ (Horticulture Department) ద్వారా అందించే పందిరి నిర్మాణ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి.

సంవత్సరం పొడవునా పందిరిపై ఒకే రకమైన తీగజాతి కూరగాయలను సాగు చేయడానికి రైతులు కొంత వెనుకడుగు వేస్తుంటారు. అయితే, పందిరి నిర్మాణాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ వివిధ రకాల తీగజాతి కూరగాయలతో పాటు లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన కూరగాయలు, సెమీ-డిటర్మినేట్ మరియు ఇండిటర్మినేట్ టమాట రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. అంతేకాకుండా పందిరి కింద అనువైన అంతర పంటలను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.

పందిరి సాగుకు అనువైన పంటలు: తీగజాతి కూరగాయలు: బీర, సొర, దొండ, కాకర, కీరదోస, నేతిబీర, ఆగాకర, పొట్ల, పర్వల్‌. ఇతర కూరగాయలు: తీగచిక్కుడు, యార్డ్‌లాంగ్‌ బీన్స్‌, సెమీ-డిటర్మినేట్‌ మరియు ఇండిటర్మినేట్‌ టమాట రకాలు : వానాకాలంలో: పూసా రూబీ, అర్క వికాస్‌. యాసంగిలో: పూసా రూబీ, పూసా ఎర్లీ, అర్క వికాస్‌, అర్క సౌరభ్‌. వేసవిలో: మారుతం, పీకేఎం-1, అర్క వికాస్‌, అర్క సౌరభ్‌.

పందిరి సాగుకు అనువైన అంతర పంటలు: వానాకాలంలో: తీగజాతి కూరగాయలతో పాటు తోటకూర, మెంతికూర, కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు. యాసంగిలో: కాకరతో పాటు స్వల్పకాలిక క్యాబేజీ, కాలీఫ్లవర్‌ రకాలు మరియు దుంప కూరలైన క్యారెట్‌, బీట్‌రూట్‌, ముల్లంగి సాగు చేసుకోవచ్చు.

నేలల ప్రాముఖ్యత
పందిరి నిర్మాణానికి నేలలు చాలా కీలకమైనవి. ఒండ్రు నేలలు, చౌడు నేలలు, నీరు నిలిచే నల్లరేగడి నేలలు శాశ్వత పందిరి వేసుకోవడానికి అనువైనవి కావు. ఇసుక, ఎర్ర నేలలు, దుబ్బ నేలల్లో పందిరిపై సాగు చేసుకోవచ్చు.

పందిళ్ల రకాలు

  1. తాత్కాలిక పందిళ్లు
  2. శాశ్వత పందిళ్లు

తాత్కాలిక పందిళ్లు
సాగు చేసే పంట రకాన్ని బట్టి పందిరి నిర్మాణం చేసుకోవచ్చు. వెదురు కర్రలు, క్రీపర్ మెష్‌ ఉపయోగించి ఈ తాత్కాలిక పందిళ్లు వేయబడతాయి. క్రీపర్ మెష్‌ను ప్రధానంగా కాకర సాగు చేయడానికి ఉపయోగిస్తారు. జి.ఐ. మెష్‌ను ఐరన్‌ పోల్‌ లేదా వెదురు కర్రల సాయంతో ఒక వైపుకు గోడలాగా నిర్మించి, తీగలను ఈ మెష్‌పైకి ఎక్కిస్తూ పాకించవచ్చు. పంటకోత అనంతరం అవసరం లేని పక్షంలో తీసివేయవచ్చు. కాని ఇది శ్రమ మరియు ఖర్చుతో కూడుకున్నది.

ట్రెల్లిస్‌ విధానం
శాస్త్రీయ సాగు విధానంలో స్టేకింగ్‌ లేదా ట్రెల్లీసింగ్‌ మరో పద్ధతి. కర్రలను ఉపయోగించి సాధారణంగా తీగ రకం టమాటను ఈ పద్ధతిలో సాగుచేస్తారు. ట్రెల్లిస్‌ సాగులో 6–8 అడుగుల పొడవుండే కర్రలను (స్థానికంగా దొరికేవైతే ఖర్చు తగ్గుతుంది) 6–7 అడుగుల దూరంలో, ఒకటిన్నర నుంచి 2 అడుగుల లోతు తీసిన రంధ్రంలో పాతాలి. కర్రల వ్యాసార్థం ఒకటిన్నర నుంచి రెండున్నర సెం.మీ. ఉంటే మంచిది.

  • నాటిన 16–24 రోజుల్లోపు ఈ విధానాన్ని ప్రారంభించడం మంచిది.
  • కర్రలను నాటేముందు నీటిలో ముంచాలి లేదా లీటరు నీటికి 5 మి.లీ. క్లోరోపైరిఫాస్‌తో తయారుచేసిన ద్రావణంలో ముంచి నాటాలి. ఇలా చేసినట్లయితే ఈ కర్రలను తర్వాత పంటలకు కూడా వాడుకోవచ్చు.
  • కర్రలను కలుపుతూ జి.ఐ. వైరు వీలైనంత గట్టిగా లాగి కట్టాలి.
  • వరుసలో మొదటి కర్రకి (విద్యుత్ స్థంభాలకు ఇచ్చే సపోర్ట్ లాగా) ఆధారం ఇవ్వాలి. దీనివల్ల ముందు ముందు కాయల బరువువల్ల వైరు క్రిందికి వాలడాన్ని తగ్గించవచ్చు.
  • పురిని టమాట చెట్టుకున్న బలమైన కొమ్మకి పైన క్రరలను సమాంతరంగా కలిపిన జి.ఐ వైరుకి బిగుతుగా కట్టాలి.. మొక్కలోని బలమైన కొమ్మకు పురిని కట్టేటప్పుడు మరీ బిగుతుగా కాకుండా వదులు ముడివేస్తే చెట్టుకొమ్మలకు ఇబ్బంది ఉండదు. తరువాత వీటిని గమనిస్తూ ఉండాలి

ఆదాయ వ్యయాలు
సాధారణంగా టమాట సాగు చేస్తే సుమారు ఎకరాకు రూ.35 వేల ఖర్చు కాగా, దిగుబడి మొక్కకు సుమారు 3–4 కిలోల వరకు వస్తుంది. అదే ట్రెల్లిస్‌ పద్ధతిలో మల్చింగ్‌, డ్రిప్‌ ఏర్పాటుకు మొత్తం రూ.60 నుంచి రూ.70 వేల ఖర్చవుతుంది. ఈ సాగు విధానంలో ఎకరాకు 7000 మొక్కలు వస్తాయి. పెట్టుబడి ఎక్కువైనా ఆదాయం 2–3 రెట్లు పెరిగే అవకాశముంటుంది. అంటే ఒక మొక్క నుంచి 15–20 కిలోల నాణ్యమైన దిగుబడి తీసుకోవచ్చు.

శాశ్వత పందిళ్లు
సిమెంట్‌ లేదా రాతి స్తంభాలను ఉపయోగించి నిర్మించే పందిళ్లనే శాశ్వత పందిరి అంటాం. మనం పండించే పంటకు అనుగుణంగా 6 నుంచి 10 అడుగుల ఎత్తు గల స్తంభాలను ఎంచుకోవచ్చు. ఉదా: దొండ, ఆగాకర వంటి పంటలకు 7 నుంచి 8 అడుగుల స్తంభాలు సరిపోతాయి. అదే పొట్ల, బీర, కాకర, సొర వంటి పంటలకు 10 అడుగుల స్తంభాలు అవసరమవుతాయి. 20–25 సెం.మీ. వెడల్పు ఉన్న స్తంభాలను 18 × 25 అడుగుల లేదా 15 × 15 అడుగుల దూరంలో, 30 × 45 సెం.మీ. గుంతలలో అమర్చుకోవాలి. సాధారణంగా 10 అడుగుల స్తంభాలను 18 × 5 అడుగుల దూరంలో నిర్మించినట్లయితే ఎకరానికి సుమారు 185 స్తంభాలు అవసరం. సుమారు 1.5 నుంచి 2.0 అడుగుల స్తంభాలను గుంతలో ఉంచి, మిగిలిన 8–8.5 అడుగుల స్తంభం భూమిపైన ఉంటుంది. పందిరి నిర్మాణం బలంగా ఉండడానికి చుట్టూ బయట ఉన్న స్తంభాలకు సపోర్టుగా ఉన్న స్తంభాలు అమర్చబడతాయి. స్తంభాల మధ్యలో 8 మి.మీ. మరియు 12 మి.మీ. జి.ఐ. వైర్‌ మధ్యలో జాలి అల్లికకు ఉపయోగిస్తారు. ఒక్కొక్కటి 6 క్వింటాళ్ల చొప్పున అవసరమౌతాయి.

పందిరిపై ఖర్చు : పందిరి నిర్మాణానికి ఎకరానికి 2,20,000, ఖర్చు అవుతుంది. ఉద్యానశాఖ వాళ్ళు ఈ నిర్మాణానికి 50% సబ్సిడీని అందిస్తారు.

డా.టి.వినోద్ కుమార్, వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త, Ph: 8309673514
బి. భాస్కర్ రావు ఉద్యాన శాస్త్రవేత్త, జి. భవాని
కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరిఖిల్లా, పెద్దపల్లి జిల్లా.

Read More

మన్యంలో పసిడి కాంతులు: కొండ చరియలపై వలిసెల సాగు విధానాలు

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ముఖ్యమైన నూనెగింజల పంట వలిశెలు. మన రాష్ట్రంలో ఈ పంట 6000 హెక్టార్లలో సాగు చేబడుతూ, 2 వేల టన్నుల ఉత్పత్తి నిస్తున్నది. సరాసరి దిగుబడి హెక్టారుకు 390 కిలోలు వస్తుంది. గింజలో నూనె శాతం 35-45 వరకు వుంటుంది. ఈ నూనెను కేవలం వంటల్లోనే కాకుండా సబ్బులు, వార్నిష్ ల తయారీలోనూ, సౌందర్య సాధనాల తయారీలోను విరివిగా వాడతారు. నూనె తీయగా మిగిలిన పిండిని పశువుల దాణాగా, ఎరువుగా కూడా వాడుతారు. మన రాష్ట్రంలో ఈ పంటను ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదవరిలోని ఏజెన్సీ ప్రాంతాలలో సాగు చేస్తున్నారు.

విత్తే సమయం : ఆగస్టు రెండవ పక్షం నుండి సెప్టెంబర్ మొదటి పక్షం వరకు వితటానికి అనుకూలం. విత్తటం ఆలస్యం అయితే పూత, గింజకట్టు దశల్లో పైరు వర్షాభావానికి లోనై దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి.

రకాలు:
కే.జి.ఎన్.– 2 : 50 రోజుల్లో పూతకు వస్తుంది. 190 సెం. మీ., ఎత్తు పెరుగుతుంది. కాలపరిమితి 100-110 రోజులు. ఎకరాకు 4 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. ప్రస్తుత సాగులో వున్న దేశవాళి రకం కంటే ఇది 40-50 శాతం ఎక్కువ.
జె. ఎన్.ఎస్. -6 : ఎకరాకు 3-4 క్వింటాళ్లు దిగుబడినిచ్చి 110 రోజుల్లో కోతకొస్తుంది.
జె. ఎన్.ఎస్. -28 : ఎకరాకు 4-5 క్వింటాళ్లు దిగుబడినిచ్చి 100-110 రోజుల్లో కోతకొస్తుంది.
జె. ఎన్.ఎస్. -30 : ఎకరాకు 4-5 క్వింటాళ్లు దిగుబడినిచ్చి 110 రోజుల్లో కోతకొస్తుంది.

నేలలు: తేలికపాటి గరప నేలలు, కొండ వాలు భూములు, పోడు నెలలు, తేమ నిల్వ యుంచుకొని మురుగు నీరు పోయే వసతి గల అన్నీ రకాల నెలలు అనుకూలం.

నేల తయారీ: నేలను 2-3 సార్లు బాగా దున్ని మెత్తగా తేయారు చేసి విత్తుకోవాలి.

విత్తటం: ఎకరాకు 3 కిలోల విత్తనం అవసరం. సాధారణంగా గిరిజన రైతులు విత్తనాలను నేలపై వెదజల్లి చెట్టు కొమ్మను నేలపై లాగి విత్తనాన్ని మట్టితో కలియబెడతారు. కాని వరుసల మధ్య 30 సెం. మీ, వరుసలలోని మొక్కల మధ్య 10 సెం. మీ., దూరంలో విత్తితే దిగుబడులు బాగుంటాయి.

ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరాకు 2.5 టన్నుల పశువుల ఎరువు వేయాలి.

  • అజోస్పైరిల్లం (Azospirillum): ఈ బ్యాక్టీరియా గాలిలో ఉండే నత్రజనిని గ్రహించి మొక్కల వేర్లకు సహజంగా అందిస్తుంది. ఎకరాకు 0.5 లీటర్ల ద్రావణాన్ని పశువుల ఎరువుతో కలిపి నేలలో వేయాలి.
  • వేపపిండి (Neem Cake Powder): ఇందులో నత్రజని ఉండటమే కాకుండా భూమిలోని పురుగులను (Nematodes) నివారిస్తుంది. అంతేకాకుండా పంట మధ్యలో తేనెపెట్టెలు ఏర్పాటు చేసినట్లయితే పరపరాగా సంపర్కానికి దోహదపడి దిగుబడి మరియు తేనె ద్వారా ఆదాయం పొందవచ్చు.

అంతరకృషి: విత్తిన 5 రోజుల తర్వాత 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కలుపు తీయాలి. బంగారు తీగ అనే సంపూర్ణ కాండ పరాన్నజీవి నాటిన నెల రోజుల్లో ఈ పంటను ఆశించి ఎక్కువగా నష్ట పరుస్తుంది. వలిశెల విత్తనాల్లో బంగారు తీగ విత్తనాలు కలియడం ద్వారా లేదా భూమిలో ఉన్న బంగారు తీగ విత్తనాలు ద్వారా ఇది బాగా వ్యాప్తి చెందుతుంది. దీనిని ఈ క్రింది పద్ధతులలో నివారించవచ్చు.

జల్లెడ పద్ధతి: ఈ పద్ధతిలో వలిశెల విత్తనాలను 0.85 – 1.00 మి. మీ., రంధ్రాలు గల జల్లెడతో జల్లించి బంగారు తీగ (ఆకాశ పందిరి) విత్తనాలను వేరు చేయాలి.

ఉప్పునీటి ద్రావణం పద్ధతి: ఒక ఎకరాకు కావలసిన 3 కిలోల విత్తనాన్ని 20 లీటర్ల నీటికి 3 కిలోల ఉప్పు కలిపిన ఆ ద్రావణంలో వేసి బాగా కలియబెట్టినట్లైతే ఆకాశ పందిరి విత్తనాలు అడుగుకు, వలిశెల విత్తనాలు నీటి పైభాగానికి చేరుతాయి. ఈ విధంగా పై భాగానికి చేరిన వలిశెల విత్తనాలను పైకి తీసి మంచి నీటితో మరోసారి శుభ్రం చేసి పొడిగుడ్డపై ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి.

కలుపును సమర్ధవంతంగా నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు:

  • చేతితో కలుపు తీయడం (Hand Weeding): వలిశెల పంట కలుపు పోటీకి చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి విత్తిన 20 మరియు 35 రోజులలో రెండు సార్లు చేతితో కలుపు తీయడం అత్యంత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. దీనివల్ల రసాయనాల అవసరం లేకుండా పంట దిగుబడి పెరుగుతుంది.
  • వేసవి లోతు దుక్కులు (Summer Deep Ploughing)
  • ఆకాశ పందిరి (Cuscuta) నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు:
  • వలిశెల పంటలో అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క ఆకాశ పందిరి (Cuscuta). దీనిని రసాయనాలు లేకుండా అరికట్టడానికి క్రింది జాగ్రత్తలు తప్పనిసరి.
  • జల్లెడ పట్టడం (Seed Sieving): విత్తే ముందే వలిశెల విత్తనాలను 1 mm పరిమాణమున్న జల్లెడతో బాగా జల్లెడ పట్టాలి. దీనివల్ల వలిశెల విత్తనాలతో కలిసిపోయిన ఆకాశ పందిరి విత్తనాలు వేరు చేయబడతాయి.
  • కలుపు రహిత విత్తనాలు: ఆకాశ పందిరి లేదా ఇతర కలుపు సమస్య లేని పొలాల నుండి సేకరించిన నాణ్యమైన శుభ్రమైన విత్తనాలను మాత్రమే సాగుకు ఎంపిక చేసుకోవాలి.
  • వరుసలలో విత్తటం: విత్తనాన్ని వారుసలలో విత్తుకోవటం వలన ఆకాశ పందిరి పక్క వరుసలలో పాకకుండా అరికట్టవచ్చు. అంతేకాకుండా పొలంలో ఆకాశపందిరి పూతదశకు రాక ముందే పీకి వేసి గుంతలో పూడ్చటం లేదా తగలబెట్టడం వలన కూడా దీని ఉధృతిని తగ్గించవచ్చు.

సస్యరక్షణః ఈ పంటకు పురుగులు, తెగుళ్లు బెడద చాలా తక్కువ. అయితే, ఏజెన్సీ ప్రాంతంలో పొగాకు లద్దె పురుగు వాతావరణ పరిస్థితులను బట్టి అడపా దడపా ఆశించే అవకాశం ఉంది.

పురుగులు:
పొగాకు లద్దె పురుగు: గుడ్లు నుండి వెలువడిన లద్దె పురుగులు ఆకులను విపరీతంగా తిని, ఆకులు లేకుండా చేస్తాయి. పూత తగ్గిపోయి, గింజ కట్టదు. దిగుబడి తగ్గుతుంది. నివారణకు గ్రుడ్ల సముదాయాలు, లార్వాల ఏరివేత; లింగాకర్షక బుట్టలు (Pheromone Traps): ఎకరాకు 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను (Spodolure) అమర్చాలి; రాత్రి వేళల్లో రెక్కల పురుగులను ఆకర్షించడానికి పొలంలో అక్కడక్కడా కాంతి ఉచ్చులను (లైట్ ట్రాప్స్) ఏర్పాటు చేసి, వాటి కింద కిరోసిన్ లేదా సబ్బు నీటితో కూడిన పాత్రలను ఉంచాలి.

పెనుబంక, దీపపు పురుగులు: తల్లి, పిల్ల పురుగులు ఆకుల్లోని రసాన్ని పీల్చివేస్తాయి. మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. పూత మరియు గింజ కట్టడం బాగా దెబ్బతింటుంది. వీటి నివారణకు సోలార్ కాంతి ఉచ్చులు (Solar Light Traps): ఇవి పగటిపూట చార్జ్ అయి, రాత్రి వేళల్లో ఆటోమేటిక్గా వెలుగుతాయి. పురుగులు ఈ కాంతికి ఆకర్షించబడి కింద ఉన్న నూనె/సబ్బు నీటి పాత్రలో పడి చనిపోతాయి.

  • మార్కెట్లో లభించే Hedo Mini Solar Insect Light Trap లేదా Chipku Mini Solar Insect Trap వంటి వాటిని ఎకరాకు 1-2 చొప్పున అమర్చుకోవచ్చు.
  • పేనుబంక మరియు పచ్చదోమలు పసుపు రంగుకు ఎక్కువగా ఆకర్షించబడతాయి. ఎకరాకు 15 నుండి 20 పసుపు రంగు జిగురు అట్టలను పంట ఎత్తులో అమర్చడం ద్వారా రెక్కలున్న పేనుబంక పురుగులు వీటికి అంటుకుని నశిస్తాయి.
  • మిత్ర పురుగుల సంరక్షణ
  • తీవ్రమైన నీటి పిచికారీ (Water Spray): తోటల్లో లేదా చిన్న పొలాల్లో పేనుబంక ఎక్కువగా ఉన్నప్పుడు, పవర్ స్ప్రేయర్ ద్వారా కేవలం స్వచ్ఛమైన నీటిని వేగంగా (ఫోర్స్) ఆకులపై పిచికారీ చేయడం ద్వారా పేనుబంక కొట్టుకుపోతుంది.

తెగుళ్లు:
ఆకుమచ్చ తెగుళ్లు : ఆకులపైన చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. గాలిలో తేమ శాతం ఎక్కువైనప్పుడు ఈ మచ్చలు పెద్దవై ఒక దానితో ఒకటి కలసి ఆకులు ఎండిపోతాయి. తెగులు కలుగజేసే శిలీంధ్రాలు గింజ మీద మరియు కోత తర్వాత మిగిలిన ఆకులు, మోళ్లు పైన ఉండటం వలన, వాతావరణ అనుకూలతను బట్టి పంట ఏ దశలోనైనా తెగులు ఆశించవచ్చు. వీటి నివారణకు ట్రైకోడెర్మా విరిడి (Trichoderma Viride): భూమి ద్వారా, విత్తనాల ద్వారా వ్యాపించే శిలీంధ్రాలను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. లీటరు నీటికి 3 నుండి 5 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని కలిపి ఆకులపై పిచికారీ చేయాలి (or) సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ (Pseudomonas fluorescens) ఇది బ్యాక్టీరియా మరియు ఫంగస్ వల్ల వచ్చే ఆకుమచ్చల తీవ్రతను తగ్గిస్తుంది. లీటరు నీటికి 5 నుండి 10 మి.లీ. చొప్పున కలిపి ఆకులపై పిచికారీ చేయడం వల్ల మొక్కకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బూడిద తెగులు: విత్తిన 35-40 రోజుల తరువాత గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రంగులో చిన్న చిన్న మచ్చలు కనబడతాయి. ఈ మచ్చలు ఆకు అంతటా వ్యాపించటం వలన ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు పుల్లటి మజ్జిగ ద్రావణం బాగా పులిసిన మజ్జిగను (5–6 రోజులు పులియబెట్టినది) ఎకరాకు 5 లీటర్ల చొప్పున సరిపడా నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

పంటకోతః పంట 95–110 రోజుల్లో కోతకొస్తుంది. మొక్కల ఆకులు ఎండిపోయి మరియు పుష్పగుచ్ఛము నల్లగా మారినప్పుడు మాత్రమే పంటకోత ప్రారంభించాలి. మొక్కలను నేల మట్టం వరకు కోసి ఎండలో ఆరబెట్టి, కట్టెలతో కొట్టి గింజలను వేరు చేయాలి. తర్వాత గింజలను 3-5 రోజుల వరకు ఎండలో ఆరబెట్టి బస్తాల్లో నిల్వ చేయాలి.
వలిశెల పంటలో తేనెటీగల పెట్టెలు 10×3 మీటర్ల దూరంలో పెట్టుకొని రైతు యొక్క నికర ఆదాయం పెంచుకోవచ్చు. ఐరోపా తేనెతీగలు ఉన్నా, పుట్ట తేనెటీగలు విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి.

సంకలనం:
శ్రీ పి. జోగారావు, శాస్త్రవేత్త (మృత్తికా శాస్త్ర విభాగం) డా.కె. బయపురెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త (మొక్కల జన్యు శాస్త్ర విభాగం) డా.డి. వెంకటేష్ బాబు, శాస్త్రవేత్త (పంట శరీరధర్మ శాస్త్ర విభాగం) శ్రీ బి.ఎన్.సందీప్ నాయక్, శాస్త్రవేత్త (సేద్య విభాగం) డా.డి.ఆదిలక్ష్మి, ఏడీఆర్, ఆర్.ఎ.ఆర్.ఎస్, చింతపల్లి

Read More