కావలసిన పదార్థాలు : పిచ్చి తులసి లేదా తులసి, పాలకొడిస, తుత్తురు బెండ, పొగాకు, బోగన్ విల్లియా (కాగితం పూలు), వేప, టేకు ఆకులు, కలబంద, బొప్పాయి, ఆవు మూత్రం, పశువుల పేడ, బెల్లం
తయారు చేసే విధానం :
పైన తెలిపిన ఆకులను 5 కిలోలు తీసుకొని ముద్దగా చేయాలి.
ఈ మిశ్రమానికి 5 కిలోల పశువుల పేడను, 100 గ్రాముల బెల్లం పొడిని కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఒక కుండలో తీసుకొని ప్రతిరోజూ ఒక కర్రతో 7 రోజుల వరకూ కలుపుతూ ఉండాలి.
7 రోజుల తర్వాత “హెర్బల్ టీ” తయారవుతుంది. ఈ మిశ్రమానికి 5 లీటర్ల నీరు కలిపి పలుచని గుడ్డతో వడపోయాలి.
ఈ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటితో కలిపి ఒక ఎకరా పొలంలో పంటపై పిచికారి చేయాలి.
ఎలా పనిచేస్తుంది? : పైన తెలిపిన వివిధ రకాల ఆకులలో ఎన్నో రకాల “ఆల్కలాయిడ్లు” ఉండుట వలన పురుగుల నియంత్రణలోనే కాకుండా కొన్ని రకాల తెగుళ్ళను అరికట్టడంలోనూ ఉపయోగపడుతుంది.
ఉపయోగాలు : ఇది చాలా శక్తివంతమైన ద్రావణం. ఈ ద్రావణం పంటలలో వచ్చే కీటక నియంత్రణలోనే కాకుండా వరిలో వచ్చే ఆకుమచ్చ తెగులు నివారణలో కూడా బాగా పని చేసినట్లు రైతుల అనుభవం. ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోనూ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా కూరగాయల పంటలలో ఉపయోగించి సత్ఫలితాలు పొందవచ్చు.
నేల ప్రకృతిలోని ప్రముఖ సహజమైన పునరుత్పాదక లేని వనరు (Non-renewable resources). రాళ్ళు, ఖనిజాలు విచ్ఛిత్తి చెందటంద్వారా ఒక అంగుళం నేల తయారవడానికి 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. ఆహారోత్పత్తికి, గ్రామీణ ప్రజల ఉపాధికి, పర్యావరణ సమతుల్యానికి ఆరోగ్యమైన నేల అత్యావశ్యకం. మనదేశంలో, రాష్ట్రంలో వివిధ రకాల నేలలున్నాయి, ఆయానేలల గుణాలు, లక్షణాలు నిర్ధిష్టమైనవి మరియు వాటిలో ఉత్పాదకత భిన్నగా ఉంటుంది.
వ్యవసాయ రంగం స్థిరంగా, లాభసాటిగా సాగాలంటే భూమి ఆరోగ్యం చాలా ముఖ్యం. రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడటం, నేల కోతను ప్రేరేపించే సాగుపద్దతుల వల్ల నేల క్షీణత జరుగుతుంది. ఇటీవలి కాలంలోని కొన్ని అధ్యయనాల నివేదికల ప్రకారం మనదేశంలోని సాగుకు యోగ్యమైన భూమిలో 50 శాతం వరకు క్షీణత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో, నేల గుణాన్ని బట్టి నిర్ధిష్టమైన పోషక యాజమాన్యం (Site-Specific Nutrient Management – SSNM) చేపట్టడం అత్యంత ఆవశ్యకమైన పద్ధతిగా శాస్త్రవేత్తలు పరిగణించారు. పంటకు ఏ సమయంలో, ఎంత మొత్తంలో, ఏ రకమైన పోషకాలు కావాలో నేల స్వభావాన్ని బట్టి అందించడమే ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం.
నేల గుణాన్ని బట్టి నిర్ధిష్టమైన పోషక యాజమాన్యం చేపడితే నేల ఆరోగ్యం మరియు సారం సంరక్షింపబడి సుస్థిరమైన వ్యవసాయ దిగుబడులు సాధించవచ్చు.
నేల రకాలు – వాటి సహజ గుణాలు మన రాష్ట్రంలో వివిధ రకాల నేలలు ఉన్నాయి. ఒక్కో నేలకు ఒక్కో రకమైన భౌతిక, రసాయన లక్షణాలు కల్గి పోషక సామర్థ్యంలో వ్యత్యాసం ఉంటుంది:
నల్ల రేగడి నేలలు: ఇవి నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కొంచెం క్షార లక్షణాన్ని కలిగివుంటాయి. వీటిలో పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉన్నప్పటికీ, నత్రజని (నెట్రోజన్), భాస్వరం (ఫాస్ఫరస్, జంకు, ఇనుము ధాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఎర్ర నేలలు: ఇవి త్వరగా నీటిని పీల్చుకుంటాయి కానీ నిల్వ ఉంచలేవు. వీటిలో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సేంద్రియకర్బనం శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇసుక / చల్కా నేలలు: పోషకాలను పట్టి ఉంచే గుణం వీటికి చాలా తక్కువ. సూక్ష్మపోషకాల లోపం (జింక్, ఇనుము) వీటిలో అధికం.
చౌడు నేలలు: తెల్ల చౌడు నేలల్లో లవణాల శాతం ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు పోషకాలను గ్రహించలేవు. వీటికి ప్రత్యేక యాజమాన్యం అవసరం. నల్లచౌడు నేలల్లో ఉదజని సూచి 8.5 కంటే అధికంగా ఉండి మార్పిడిచెందే సోడియం అధికంగా 15 శాతం కంటే ఎక్కువ ఉంటుంది. ఈ నేలల భౌతిక లక్షణాలు మొక్కల పెరుగుదలకు అవరోధం కల్గిస్తాయి. నత్రజని, భాస్వరం, జం కు, ఇనుము, బోరాన్ వంటి పోషకాల లోపాలు అధికంగా ఉంటాయి.
ఒండ్రు నేలలు : ఈ నేలలు నదీ తీరాలలోనూ, నది సముద్రంలో కలిసే ప్రాంతంలోనూ విస్తరించి ఉంటాయి. ఇవి స్వభావ రీత్యా సారవంతమైన నేలలు. నేల భౌతిక లక్షణాలు కూడా సాగుకు అనుకూలం. ఈ నేలల్లో అధిక సాంద్ర పంటల సాగువల్ల సూక్ష్మ ధాతువులతో పాటు నత్రజని, భాస్వరం లోపాలు కనిపిస్తున్నాయి.
నిర్ధిష్ట పోషక యాజమాన్యం అంటే ఏమిటి? సాధారణంగా రైతులు అందరికీ వర్తించే ఒకే రకమైన ఎరువుల సిఫార్సులను (Blanket Recommendations) పాటిస్తారు. కానీ, ఒకే పొలంలో ఒక వైపు ఉన్న నేల గుణానికి, మరోవైపు ఉన్న నేల గుణానికి తేడా ఉండవచ్చు. భూసార పరీక్షల ఆధారంగా, ఆయా నేలలో ఉన్న పోషకాల లభ్యతను బట్టి, పండించే పంట దిగుబడి లక్ష్యాన్ని బట్టి ఖచ్చితమైన మోతాదులో పోషకాలను అందించడాన్నే “నిర్దిష్టమైన పోషక యాజమాన్యం” అంటారు. ఇది ‘సరైన ఎరువు మోతాదు, సరైన సమయంలో ఎరువు వెయ్యడం, మరియు ఎరువును సరైన పద్ధతిలో వెయ్యడం’ (4Rs) అనే సూత్రంపై పనిచేస్తుంది.
పోషక యాజమాన్యం భూసార పరీక్షలు (Soil Testing): ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి పొలంలో మట్టి నమూనాలను సేకరించి పరీక్షించాలి. దీనివల్ల నేల పి.హెచ్ (pH), విద్యుత్ వాహకత (EC), సేంద్రీయ కర్బనం మరియు ప్రధాన, సూక్ష్మ పోషకాల లభ్యత తెలుస్తుంది.
సేంద్రీయ ఎరువుల వాడకం: పశువుల ఎరువు, కంపోస్ట్ లేదా పచ్చిరొట్ట ఎరువులు (జీలుగ, జనుము) భూమిలో వేసి కలయదున్నాలి. ఇది నేల భౌతిక స్థితిని మెరుగుపరుస్తుంది. సిఫారసు చేసిన పోషకాలను అందించాలి.
ఆధునిక పరికరాల వాడకం: లీఫ్ కలర్ చార్ట్ (Leaf Color Chart – LCC), క్లోరోఫిల్ మీటర్ల ద్వారా పంట ఆకుల రంగును బట్టి లోపాన్ని గుర్తించి, అవసరమైన మేరకే పోషకాలను వాడవచ్చు.
నేల గుణాన్ని బట్టి తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు
ఆమ్ల నేలలు (Acid Soils): పి.హెచ్ 6.5 కంటే తక్కువ ఉన్న నేలల్లో సున్నం ఎరువు వాడి నేల స్వభావాన్ని మార్చాలి. భూసార పరీక్ష చేయిస్తే ఎకరాకు ఎంత సున్నం కావాలో పరీక్షించి చెప్తారు. కట్టెజనుము వంటి పచ్చిరొట్ట పైరు సాగుచేసి పైరుపూతదశలో నేలలో కలియదున్నాలి.
క్షార/చౌడు నేలలు (Saline/Alkaline Soils): పి.హెచ్ 8.5 కంటే ఎక్కువ ఉన్న చౌడు నేలల్లో జిప్సం వేసి నెలలో కలియదున్ని బాగు చేయాలి. భూసార పరీక్ష చేయిస్తే ఎకరాకు ఎంత జిప్సం ఎరువు కావాలో పరీక్షించి చెప్తారు. మురుగునీటి నిల్వలను బయటకు పంపే డ్రైనేజీ వసతి కల్పించాలి. ధయించా వంటి పచ్చిరొట్ట పైరు సాగుచేసి పైరుపూతదశలో నేలలో కలియదున్నాలి.
తేలికపాటి నేలలు: ఇసుక శాతం ఎక్కువ ఉన్న నేలల్లో ఎరువులు కడిగిపోతాయి (Leaching). కాబట్టి ఎరువులను ఎక్కువ విడతలుగా, తక్కువ మోతాదులో ఇవ్వాలి. వేసవిలో ఎకరాకు 20 టన్నుల చొప్పున చెరువు లోపలి మట్టిని తోలాలి. సేంద్రీయ ఎరువులని అధికంగా వాడాలి.
ఈ నిర్ధిష్ట పోషక యాజమాన్యం పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు నేల గుణగణాలు ముందే తెలుస్తాయి: భూసార పరీక్ష వల్ల నేల గుణగణాలు ముందే తెలుస్తాయి కాబట్టి అవసరమైన యాజమాన్య చర్యలు తీసుకొనే వీలుంటుంది.
పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది: అనవసరమైన ఎరువుల వాడకం తగ్గి, రైతుకు డబ్బు ఆదా అవుతుంది.
నాణ్యమైన, అధిక దిగుబడి: మొక్కకు కావాల్సిన పోషకాలు సరైన సమయంలో అందడం వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి ఆశించిన దిగుబడి వస్తుంది.
*నేల ఆరోగ్యం రక్షణ: రసాయనాల అవశేషాలు పేరుకుపోకుండా నేల జీవశక్తి, మిత్ర పురుగులు (వానపాములు వంటివి) సంరక్షించబడతాయి.
పర్యావరణ సమతుల్యత: భూగర్భ జలాలు కలుషితం కాకుండా, పర్యావరణానికి మేలు జరుగుతుంది. నేల గుణాన్ని బట్టి నిర్ధిష్టమైన పోషక యాజమాన్యాన్ని చేపట్టడం అనేది ఆధునిక వ్యవసాయంలో ఒక విప్లవాత్మక అడుగు. “ఆరోగ్యకరమైన నేల – ఆరోగ్యకరమైన పంట – సంపన్నమైన రైతు” అనే నినాదంతో ప్రతి రైతు తమ పొలంలో భూసార పరీక్షలు చేయించి, లభించిన నివేదికల ఆధారంగానే పోషకాలను అందించాలి. ఇది వసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా, రాబోయే తరాలకు సారవంతమైన భూములను అందించడానికి దోహదపడుతుంది.
అనీల్ కుమార్ కీర్తి, పి. గురుమూర్తి, టి. మౌనిక వ్యవసాయ కళాశాల బాపట్ల మరియు నైరా Ph: 9491567949
జీలకర్ర క్యుమినం సైమినం మొక్క యొక్క ఎండబెట్టిన గింజలు. ఈ మొక్క 30-35 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. జీలకర్ర ఒక పుష్పించే మొక్క. ఇది ఒక వార్షిక హెర్బల్ మొక్క. కాండం నుండి సన్నని కొమ్మలు వస్తాయి. కాండం 20-30 సెం.మీ. పొడవు, 3-5 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది. ప్రతి కొమ్మ 2-3 ఉపకొమ్మలు కలిగి ఉంటుంది. అన్ని కొమ్మలు ఒకే ఎత్తుకు పెరుగుతాయి కనుక మొక్క ఒకే విధమైన క్యానపి కలిగి ఉంటుంది. కాండం బూడిద వర్ణం లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకులు 5-10 సెం.మీ. పొడవుండి దారం వంటి చిన్న ఆకులు కలిగి ఉంటుంది. పూలు చిన్నవిగా, తెలుపు లేదా పింకు రంగులో ఉంటాయి. కాయ 4-5 మి.మీ. పొడవుండి రెండు మీసోకార్ప్‌లను కలిగి ఉంటుంది. ప్రతి మీసోకార్ప్‌లో ఒక గింజ ఉంటుంది. జీలకర్ర గింజలకు 8 నిలువాటి బోదెలుంటాయి. ఇవి పసుపుగోధుమ రంగులో ఉంటాయి.
సాధారణ నామం : క్యూమిన్ శాస్త్రీయ నామం : క్యూమినం సైమినం కుటుంబం: ఎపియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
జీలకన్రు పురాతన కాలం నుండి ఆహారం రుచి పెంచడానికి, ఔషధ ప్రయోజనాలకు, అనేక సంప్రదాయ వంటిళ్లలో ఉపయోగిస్తున్నారు. దీనికి జీర్ణశక్తిని పెంచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, మొలలు, ఆస్త్మా, బ్రోంకైటిస్ చికిత్స వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కల్గించే గుణం ఉంది.
దీనిని భోజనానికి ముందు ఆకలి పెరగడానికి (అపెటైజర్‌గా) ఉపయోగిస్తారు.
మజ్జిగ, కొన్ని నూనె చుక్కల మిశ్రమాన్ని జీలకర్రతో కలిపి వేయిస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. దీనిని సాధారణంగా సుగంధ ద్రవ్యాలు, నూనె అధికంగా ఉపయోగించిన ఆహారం తిన్న తర్వాత తీసుకుంటారు.
భోజనానికి ముందు వేడి నీటిలో 2 చెంచాల జీలకర్రను కలిపి త్రాగితే తీవ్ర అజీర్తి నయమవుతుంది.
2 గ్రా. జీలకర్రను కొతిమీర రసం, యాలకులు, ఉప్పుతో కలిపి తీసుకుంటే ఎసిడిటి, హైపర్ ఎసిడిటి, కడుపులో మంటలు, గ్యాస్ సమస్యలకు మంచి ఫలితాలు లభిస్తాయి. భోజనానికి ముందు కొంచెం జీలకర్ర నమిలితే నోటి దుర్వాసనకి అద్భుత ఫలితాలనిస్తుంది.
మలబద్ధకం, కడుపులో నులిపురుగులు, జ్వరంతో బాధపడేవారు వేడి నీటిలో ఒక చెంచా జీలకర్ర కలిపి రోజుకి 3-4 సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
పురుగులు కాటు వేసిన చోట జీలకర్ర, నెయ్యి పేస్టు పూస్తే బాధ తగ్గుతుంది. దీనిని అన్ని వంటకాలలో ఉపయోగిస్తారు. నోటి దుర్వాసన పోవడానికి జీలకర్ర రసం నోటిలో పోసుకొని పుక్కిలించాలి. బాలింతరాళ్ళకు జీలకర్ర ఇస్తే గర్భాశయం శుభ్రపరచబడి, పాల ఉత్పత్తి పెరుగుతుంది.
ఎండిన జీలకర్ర గింజల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ నీటి ద్రావణం (6.25-1000 పిపియం) ఈడెస్ ఈజిప్టి దోమ 2వ దశ లార్వాలను అతి సమర్ధవంతంగా నివారించింది (పురోహిత్, అతని అనుచరులు, 1983).
జీలకర్రను జీవ పురుగు మందు తయారీలో ఉపయోగిస్తారు. ఈ జీవ పురుగు మందుని పాటింగ్ మట్టితో కలిపి, పంటపై చల్లి పురుగులను 72 గంటలలో చంపవచ్చు.
జీవ పురుగు మందు తయారీకి కావలసిన పదార్థాలు : పాటింగ్ మట్టిలో కలిపే ఫార్ములేషన్ సుగంధ ద్రవ్యం శాతం సుగంధ ద్రవ్యం శాతం నల్ల మిరియాలు 25.75 జీలకర్ర 15.45 దాల్చిన చెక్క 11.05 వెల్లుల్లి 12.03 ధనియాలు 12.80 పసుపు 7.44 సోపు 2.37 మెంతి 3.65 లవంగం 2.58 మిరప 1.38 అల్లం 3.36 కరివేపాకు 1.60 ఆవాలు 0.37 సోడియం క్లోరైడ్ 0.17
ఈ జీవ పురుగుమందుని పాటింగ్ మట్టిలో కలపాలి. ఇది 72 గంటలలో పురుగులను చంపుతుంది. పంటపై చల్లే పురుగు మందు ఫార్ములేషన్
సుగంధ ద్రవ్యం శాతం సుగంధ ద్రవ్యం శాతం
నల్లమిరియాలు 20-30 జీలకర్ర 10-20
దాల్ౘ్ిన చెక్క 5-15 వెల్లుల్లి 5-20
ధనియాలు 5-20 పసుపు 3-15
సోపు 0.01-10 లవంగం 0.01-10
మిరప 0.01-10 అల్లం 0.01-10
కరివేపాకు 0.01-5 ఆవాలు 0.01-5
పైన పేర్కొన్న పదార్థాలన్నీ పొడి రూపంలో ఉంటాయి. ఈ జీవ పురుగు మందుని పొడి రూపంలో చదరపు మీటరుకి 100-500 గ్రా. పొడిని చల్లాలి (డోటి, 2012).
జీలకర్ర ఎసెన్షియల్ ఆయిల్ ప్రత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, ఆలుగడ్డ, టమాట పంటలకు తీవ్ర నష్టం కలిగించే నల్ల లద్దె పురుగు అగ్రోటిస్ ఇప్సిలాన్‌పై ఉదర, స్పర్శ చర్యలను ప్రదర్శించింది
అనేక యాంటి బయాటిక్స్‌ని తట్టుకునే క్ౙాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ పలు కూరగాయల పంటల్లో తీవ్ర నష్టం కలిగిస్తుంది. యాలకలు, పసుపు, అల్లం, జీలకర్ర, లవంగం, పాప్పిగింజలు, ఫెనెల్, ఆవాలు, వెల్లుల్లి, మిరియాలు, మెంతులు, దాల్చిన చెక్క, ఇంగువ, ధనియాల నీటి ద్రావణాలు విడివిడిగా, 26 కలిపిన ద్రావణాలు ఈ బాక్టీరియం పెరుగుదల నరికట్టాయి (డిబ్రిట్టో, అతని అనుచరులు, 2011). అన్ని సుగంధ ద్రవ్యాలను కలిపిన ద్రావణం అత్యంత సమర్ధవంతంగా ఈ బాక్టీరియం పెరుగుదల నరికట్టింది.
జీలకర్ర, ఇతర సుగంధ ద్రవ్యాలు అపరాల గింజలను పల్స్ బీటిల్, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ వల్ల నష్టపోకుండా కాపాడాయి (మహ్ది, అతని అనుచరులు, 2008; ఇస్లాని, అతని అనుచరులు, 2013).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.