లేగ దూడలు తెల్లగా, జిగురుగా పారుట (CALF Scours)

సమస్య:
తెల్లగా, పచ్చగా విరేచనాలు
జిగురుగా పారటం
పేడ భరించరాని దుర్వాసన
జ్వరం వుండవచ్చు.

కారణాలు:
పాలు జీర్ణం కాక పోవటం,
అపరిశుభ్ర పొదుగు, పరిసరాలు,
E.COLI; SALMONELLA సూక్ష్మక్రిముల వల్ల,
పాలు ఎక్కువ తక్కువగా వదలటం, త్రాగటం

పశువైద్యుని సంప్రదించాలి. వ్యాధి భేదాత్మక పరిశీలన అవసరం.
ఈ వ్యాధిని అంతర పరాన్న జీవుల భారం, పాలు మిక్కుటంగా త్రాగటం, E.COLI; Salmonellosis; Coccidiosis; Cryptospordium; streptococcusలుగా భ్రమించే అవకాశం వుంది.

పరిష్కారాలు:

ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం
గృహవైద్యం:

  1. చింతపండు పులుసు 15 గ్రా॥, ఉప్పు 15 గ్రా॥ కలిపి ఒకే పర్యాయం త్రాగించాలి.
  2. కొర్ర పిండి 50 గ్రా॥, పసుపు 5 గ్రా॥, వెన్న 5 గ్రా॥ కలిపి 2 రోజులు తినిపించాలి.
  3. మజ్జిగ అరలీటరులో 10 గ్రా॥ పసుపు కలిపి రోజుకు 2 సార్లు త్రాగించాలి.
  4. పాలు పలుచగా చేసి గోరు వెచ్చగా త్రాగించాలి.
  5. ఉప్పు 5 గ్రా॥, సోడా ఉప్పు 5 గ్రా॥, గ్లూకోజు 25 గ్రా॥, ఒక లీటరు గోరు వెచ్చని నీటిలో కరిగించి ఈ విధంగా తయారు చేసిన ద్రవాన్ని రోజుకు 2,3 పర్యాయాలు త్రాగించాలి. లేదా ఒక లీటరు నీళ్ళలో 50 గ్రా॥ ఉప్పు, 10 గ్రా॥ల బెల్లం లేదా పంచదార కలిపి రోజుకు 2,3 పర్యాయాలు త్రాగించాలి.
  6. వాము 10 గ్రా॥, ఉప్పు 10 గ్రా॥ కలిపి తినిపించాలి.

పెరటివైద్యం:

  1. గుప్పెడు దానిమ్మ, తంగేడు చిగుళ్లు 100 గ్రా॥ పెరుగులో కలిపి తినిపించాలి
  2. 10 ఆకులు గోంగూర, గాడిదగడపాకు, 50 మి.లీ. ఆముదం కలిపి తినిపించాలి.

ఓషధులు:

  1. ఇప్ప చెక్క లేదా పాల చెక్క 10 గ్రా॥ పసుపు 10 గ్రా॥ ముద్ద చేసి, పెరుగులో కలిపి తినిపించాలి.
  2. బలుసు, నేరేడు, తంగేడు ఆకులు ఒక్కొక్కటి 20 గ్రా॥ దంచి, ముద్ద చేసి 2,3 రోజులు తినిపించాలి.
  3. వెదురాకు పసరు 10 మి.లీ., పసుపు 5 గ్రా॥ కలిపి త్రాగించాలి.
  4. మామిడి జీడి, నేరేడు గింజలు సమపాళ్ళలో నూరి, ఆ పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  5. కొడిసెపాల చెట్టు చిగుళ్ళు 5-10 గ్రా॥ నూరి, మజ్జిగతో కలపి రెండు పర్యాయాలు త్రాగించాలి.

మూలికావైద్యం:

  1. గంధ కఛూరాలు, గుగ్గిలం, పటిక బెల్లం సమపాళ్ళలో నూరిన పొడి 10 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  2. శొంఠి, బూరుగు బంక, దానిమ్మ గింజలు, సోంఫు, జీలకర్ర, ధనియాలు సమపాళ్ళలో నూరి, ఆ పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి ఉదయం, సాయంత్రం త్రాగించాలి.
  3. మారేడు కాయ గుజ్జు 50 గ్రా॥, గంధ కఛూరాలు 50గ్రా॥, తుంగ ముస్తలు 50 గ్రా॥, యాలకులు 10 గ్రా॥, పటిక బెల్లం 100 గ్రా॥ నూరిన పొడి 20 గ్రా॥ నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  4. యాలకులు, పటిక బెల్లం, ఉసిరికాయ సమపాళ్ళలో నూరిన పొడి 20 గ్రాములు నీళ్ళలో కలిపి త్రాగించాలి.

హోమియో: క్రింది మందులలో ఏదైనా ఒక మందు

  1. మెర్క్ కార్ 200 లేదా మెర్క్ సాల్ 200 లేదా పోడోఫైలం 200 లేదా ఆర్సెనికం ఆల్బం 200 పూటకు 5 మాత్రలు చొ॥న ఉదయం, సాయంత్రం 3 రోజులు తినిపించాలి.
    పై మందులకు తగ్గకపోతే,
  2. చైన 30 + నేట్రం ఫాస్ 30 + ఆంటిమోనియం క్రూడం 30 పూటకు 5 మాత్రలు చొ॥న ఉదయం, సాయంత్రం 3 రోజులు ద్రవ సమతుల్యత పునరుద్ధరించబడే వరకు తినిపించాలి.
  3. వ్యాధి నిరోధక టీకా: సైకోటిక్ కో 30 / స్ట్రెప్టోకోకినం 30 / ఈ. కొలై నోసోడ్ 30 ఏదైనా ఒక మందు దూడ పుట్టిన వెంటనే మొదటి మోతాదు, అప్పటి నుండి 24 గంటలకు 2వ మోతాదు, 48 గంటలకు 3వ మోతాదు, 72 గంటలకు 4 వ మోతాదు చొప్పున తినిపించాలి. 4. వెరాట్రం ఆల్బం / కార్బో వెజ్ / పైరోజెన్ / డల్కమార / కాంఫొరా / కాల్కేరియా ఫాస్ / రూస్ టాక్స్ 30 లలో ఏదైనా ఒక మందు 5 మాత్రలు చొప్పున ఉదయం, సాయంత్రంగా 5 రోజులు తినిపించాలి.
  4. బయో కెమికల్ సముదాయం: నేట్రం ఫాస్ 3X + కాల్కేరియా ఫాస్ 3X + ఫెర్రం ఫాస్ 3X + కాలి ఫాస్ 3X + కాలి సల్ఫ్ 3X + నేట్రం సల్ఫ్ 3X ఈ ఔషధాల మిశ్రమం 10 మాత్రలు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంగా 10 రోజులు తినిపించాలి.

అల్లోపతి:

  1. హాల్‌క్వినాల్ (HALQUINOL) 1-2 బిళ్ళలు తినిపించాలి.
  2. 50 గ్రా॥ల పంచదారను 9 గ్రా॥ ఉప్పుతో కలిపి 1 లీటరు నీటిలో కరిగించి త్రాగించాలి.
  3. రాగి లేదా నూకల జావకు గ్లూకోజు, ఉప్పు కలిపి లేదా ఎలక్ట్రాల్ (ELECTRAL) పొడి కలిపి త్రాగించాలి.
  4. హిస్టానిల్ (HISTANIL) ఇంజక్షను చేయించాలి.
  5. అవసరాన్ని బట్టి రింగర్స్ లాక్టేట్ (RINGER’S LACTATE) మరియు డెక్స్‌ట్రోజ్ నార్మల్ సెలైన్ (DEXTROSE NORMAL SALINE) ఇంజక్షను రక్తంలోకి (।/V గా) ఎక్కించాలి.

జాగ్రత్తలు:
జున్నుపాలు పుష్కలంగా త్రాగనివ్వాలి.
క్రమపద్ధతిలో అంతరపరాన్న జీవులను నిర్మూలించాలి.
మట్టి తినకుండా మతికి బుట్ట కట్టాలి.
పరిసరాలు శుభ్రంగా వుంచాలి, తల్లి పొదుగు పొటాషియం పర్మాంగనేట్ లోషన్‌తో శుభ్రపరచాలి.

…………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… పులిదుంప

ఇది 5 మీ. ఎత్తు వరకు పెరిగే తీగ జాతి మొక్క. తీగకు బాగా ముళ్ళుంటాయి. ఎడమవైపుకు మెలి తిరుగుతుంది. కణుపుకు ఒకటి చొప్పున పత్రములు వస్తాయి. బల్బిల్స్ ఉండవు. దుంపలు కొద్దిగా నొక్కబడి, గుండ్రంగా ఉంటాయి. అప్పుడప్పుడు గుండ్రటి తమ్మెలుగా కనపడుతుంది. భూమికి దగ్గరగా లోపల తయారవుతుంది. దుంప చర్మం ఎండుగడ్డి లేదా బూడిద రంగులోను, లోపలి కండ నిమ్మ పసుపు రంగులో ఉండి విషపూరితంగా ఉంటుంది. దుంపలలో అల్బుమినాయిడ్లు (7.2 -9.12%), బూడిద (4.054-.61%), కొవ్వు (0.97-1.1%), కార్బోహైడ్రేట్లు (81.45-81.89%), పీచు (3.28-6.28%), భాస్వరము (0.52-0.77%) కలిగి ఉంటాయి. దీని దుంప కంద దుంపను పోలియుంటుంది. ఈ దుంప పులి అడుగువలె ఉంటుంది కనుక దీనిని పులి దుంప అంటారు.

సాధారణ నామం : టైగరఫుట్ డయాస్కోరియా, తెల్లగినిగెడ్డలు శాస్త్రీయ నామం : డయోస్కోరియా హిస్పిడ కుటుంబం: డయోస్కోరియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దుంపలలో డయాస్కోరిన్ అనబడు విషపదార్థం (0.19%) ఉంటుంది.
  • ఇది విషపూరితమైన దుంప. దీని రసం పాము కాటుకు విరుగుడుగా వాడుతారు. కరువు పరిస్థితులలో దీనిని ఏడు దినాలపాటు పారే నీళ్ళలో నానబెట్టి వండుకుని తింటారు.

వ్యవసాయరంగంలో …

  • పులిదుంప నీటి ఆధారిత క్రూడ్ ద్రావణం (5%) కర్రపెండలాన్నాశించు పొలుసు పురుగు, సూడౌలాకాస్పిస్ పెంటగోనాని అత్యంత సమర్ధవంతంగా నివారించింది (వాస్క్వెజ్, 1991).
  • పులిదుంప దుంపలో ఉండే టోటాకోరిన్ అనే రసాయనం (5%) ద్రావణం పేను బంకను అత్యంత సమర్ధవంతంగా నివారించింది. కాని 25% వరి నల్లులను మాత్రమే చంపింది (సులిట్, 1967).
  • స్పోడోపైరాలిట్టొరాలిస్ లార్వాలు డయోస్కోరియా బటాటాస్ ఆకులను ఆహారంగా తీసుకోలేవు (వాడ, అతని అనుచరులు, 1970).
  • పులిదుంప దుంప నుండి వేరు చేసిన డయాస్కోరిన్, డయాస్కోరిన్ ఎనఆక్సైడ్ క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్, ఫ్లూటెల్లాక్ౙెåలోస్టెల్లా, రైస్ ఆర్మివర్మ్, సూడలెటియాసపరేట లార్వాలను ఆకులను తినకుండా నివారించాయి (బనాగ్, అతని అనుచరులు, 2005).
  • పులిదుంపని ఎలుకల నివారణలో ఉపయోగిస్తారు (కటెగొరి, 2017).
  • పులిదుంప మిథనాల్ ద్రావణంలోని ఆల్కలాయిడ్ 8ఎ’ క్యాబేజి పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాక్ౙెåలోస్టెల్లాపై ఆల్కలాయిడ్ ‘బి’ కన్నా బలమైన ఫీడింగ్ డిటరెంట్ చర్యను ప్రదర్శించింది. (అలెక్సి, అతని అనుచరులు).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వర్మీవాష్‌: రైతుల పాలిట జీవామృతం

ప్రస్తుత వ్యవసాయంలో పెరుగుతున్న సాగు ఖర్చులు, రసాయనిక ఎరువులు పురుగు మందులపై అధికంగా ఆధారపడటం, నేలలో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం, నేల జీవ వైవిధ్యం దెబ్బతినడం వంటి సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, పంటల పెరుగుదలకు తోడ్పడే పర్యావరణహిత ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్న రైతులకు ‘వర్మీవాష్’ (Vermiwash) ఒక అద్భుతమైన ద్రవ సేంద్రీయ ఎరువుగా, సంజీవనిలా ఉపయోగపడుతోంది. తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే లేదా పొలం గట్టునే సులభంగా తయారుచేసుకోగలిగే ఈ సిసలైన ‘జీవామృతం’ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వానపాములు రైతుల మిత్రులుగా ప్రసిద్ధి చెందాయి. సేంద్రీయ వ్యవసాయంలో వానపాముల ద్వారా సేంద్రియ వ్యర్థాలను విలువైన ఎరువుగా మార్చే వర్మీకంపోస్టు తయారీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకంగా నిర్వహించిన వానపాముల బెడ్ల నుంచి సేకరించే ద్రవాన్ని వర్మీవాష్ అంటారు. వర్మీవాష్‌ అనేది వానపాముల ద్వారా తయారయ్యే అత్యంత ముఖ్యమైన ఉత్పత్తి.

వానపాముల శరీరం నుండి తయారయ్యే వర్మీవాష్‌లో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, హార్మోన్లు, ఎంజైములు, సూక్ష్మజీవుల నిరోధక అంశాలు, పెరుగుదల నియంత్రణ అంశాలు (ఆక్సిన్ మరియు సైటోకైనిన్) అలాగే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది నేలసారాన్ని పెంచడానికి మరియు పంటలలో రోగాలు, పురుగుల బెడదను అణచివేయడానికి సహాయపడుతుంది. వానపాముల శరీర పైభాగంలోని రంధ్రాల నుండి వచ్చే కోలోమిక్ ద్రవం శిలీంద్ర నాశక, సూక్ష్మజీవ నాశక మరియు పురుగుమందుల లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది రైతుల పంటలను రోగాలు మరియు కీటకాల నుండి దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

వానపాములు సేంద్రియ పదార్థాలను ఆహారంగా తీసుకొని జీర్ణక్రియ ద్వారా వాటిని సూక్ష్మ కణాలుగా మారుస్తాయి. ఈ ప్రక్రియలో వాటి విసర్జన పదార్థాలు, సూక్ష్మజీవుల కార్యకలాపాలు సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నానికి తోడ్పడతాయి. వానపాముల బెడ్‌లో తగిన తేమను నిర్వహిస్తూ నీరు నెమ్మదిగా ప్రవహించేలా చేసినప్పుడు, ఆ బెడ్‌లోని కొన్ని కరిగే పదార్థాలు నీటితో కలిసి బయటకు వస్తాయి. ఈ ద్రవాన్ని తగిన విధంగా సేకరించి వడపోసినప్పుడు వర్మీవాష్ లభిస్తుంది.

వర్మీవాష్‌ తయారీ విధానం

  • సుమారు 100 లీటర్ల డ్రమ్ము/ బ్యారెల్ ను తీసుకొని, దాని క్రింది భాగంలో ఒక కుళాయిని (నల్లా) బిగించాలి.
  • పెద్ద డ్రమ్ము లోపల 10 లీటర్ల బకెట్‌ను తలక్రిందులుగా చేసి ఉంచాలి.
  • బిగించిన కుళాయి డ్రమ్ము మరియు బకెట్ రెండింటికీ సరిపోయేలా ఉండాలి.
  • డ్రమ్ము క్రింది భాగంలో సుమారు 25 నుండి 30 సెంటీమీటర్ల వరకు రాతి గులకరాళ్లతో నింపాలి.
  • ఈ పొరపై 25 సెంటీమీటర్ల మేర ఇసుకను పోయాలి.
  • ఇసుక పొరపై మిగిలిన భాగంలో 60 శాతం వరకు పంట వ్యర్థాలను (పంట అవశేషాలు) నింపాలి.
  • ఆ తర్వాత నీటిని పిచికారీ చేయాలి.
  • ఈ పొరపై, 25 శాతం భాగంలో పశువుల పేడను నింపాలి.
  • పేడ పైభాగంలో సుమారు 1 నుండి 5 కిలోల వరకు వానపాములను వదలాలి.
  • ఈ పొరపై పంట వ్యర్థాలను నింపి ప్రతిరోజూ 1 నుండి 5 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి.
  • డ్రమ్ము లోపల వానపాములు ఒత్తిడికి గురై కోలోమిక్ ద్రవాన్ని బయటకు విడుదల చేస్తాయి.
  • పిచికారీ చేసిన నీరు ఈ ద్రవంతో పాటు వానపాము విసర్జక పదార్థం ద్వారా అన్ని పొరల గుండా ప్రవహించి క్రింది భాగంలో అమర్చిన బకెట్‌లో సేకరించబడి వర్మీవాష్‌గా కుళాయి ద్వారా బయటకు వస్తుంది.
  • వర్మీవాష్‌ యూనిట్ ఏర్పాటు చేసిన 15 నుండి 20 రోజుల తర్వాత ప్రతిరోజూ 5 నుండి 10 లీటర్ల వర్మీవాష్‌ను పొందవచ్చు.

వర్మీవాష్‌లో ఉండే పోషకాలు, ఉపయోగకర పదార్థాలు : వర్మీవాష్‌లోని పోషకాల పరిమాణం తయారీ విధానం, సేంద్రియ పదార్థాల రకం, నీటి పరిమాణం, సేకరణ సమయంపై ఆధారపడి ఉంటుంది.

  1. ప్రధాన పోషకాలు: నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు కొంతమేర కరిగిన రూపంలో ఉండవచ్చు. అయితే వాటి సాంద్రత స్థిరంగా ఉండదు.
  2. ద్వితీయ పోషకాలు, సూక్ష్మపోషకాలు: కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ వంటి మూలకాలు ముడి పదార్థాలపై ఆధారపడి ఉండవచ్చు.
  3. సేంద్రియ సమ్మేళనాలు: సేంద్రియ ఆమ్లాలు, కరిగే సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవుల జీవక్రియకు సంబంధించిన కొన్ని సమ్మేళనాలు ఉండవచ్చు.
  4. సూక్ష్మజీవులు: తయారీ, నిల్వ పరిస్థితులను బట్టి వివిధ సూక్ష్మజీవులు ఉండవచ్చు. అయితే అన్ని వర్మీవాష్ నమూనాల్లో ప్రయోజనకర సూక్ష్మజీవులు సమానంగా ఉంటాయని చెప్పలేం.
  5. మొక్కల పెరుగుదలకు సంబంధించిన సమ్మేళనాలు: కొన్ని వర్మీవాష్ నమూనాల్లో మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపగల జీవక్రియ సంబంధిత పదార్థాలు ఉంటాయి. వీటి ఉనికి, సాంద్రత, పంటపై ప్రభావం తయారీ విధానాన్ని బట్టి మారుతుంది.

వర్మీవాష్‌ను ఉపయోగించే విధానం
వర్మీవాష్‌కు అన్ని పంటలకు వర్తించే ఒకే ప్రామాణిక మోతాదు లేదు. తయారీ విధానం, ద్రవంలో పోషకాల సాంద్రత, పంట దశ, ఉపయోగించే విధానం ఆధారంగా మోతాదును నిర్ణయించాలి. సాధారణంగా 1:10 నిష్పత్తిలో నీటిని కలిపి పంట ఆకులపై పిచికారీ చేయాలి.

  • పిచికారీకి: 1 లీటరు వర్మీవాష్‌ను 10 లీటర్ల నీటిలో కలిపి (1:10 నిష్పత్తిలో) పంట ఆకులపై పిచికారీ చేయాలి. ఇది అద్భుతమైన ఫోలియర్ స్ప్రే (Foliar spray) లా పనిచేస్తుంది.
  • డ్రిప్‌ ద్వారా వర్మీవాష్‌ వాడాలనుకుంటే ఎకరానికి 10-15 లీటర్లు వాడాలి.
  • వర్మీవాష్‌ను నీటితో కలిపి మొక్కల మొదళ్ళ చుట్టూ గల నేల బాగా తడిచేలా పోసుకోవాలి. దీనివలన నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టవచ్చు.
  • ఒక ఎకరం పండ్ల తోటలో మొక్కల ఎదుగుదలకు 2-4 లీటర్ల వర్మీవాష్‌ను ఉపయోగించవచ్చు.
  • ఆకు కూరల పంటల్లో, తొలి దశలో రెండు లీటర్ల నుంచి ప్రారంభించి తర్వాత కాలంలో మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు వర్మీవాష్‌ను పిచికారీ చేసుకోవచ్చు.
  • పాదుల్లో ఇవ్వడానికి: నేరుగా నీటితో కలిపి మొక్కల పాదుల్లోకి కూడా వదలవచ్చు.
  • ఉత్తమ ఫలితాల కోసం ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయడం మంచిది.

వర్మీవాష్‌ యొక్క ఉపయోగాలు
• వర్మీవాష్‌లో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, హార్మోన్లు, ఆక్సిన్ మరియు సైటోకైనిన్‌లు ఉండి మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి.
• ఇది కేవలం ఎరువు మాత్రమే కాదు, అద్భుతమైన వృద్ధి ఉత్ప్రేరకం (Growth Promoter).
• పంటలలో రోగ మరియు కీటక నిరోధక శక్తిని పెంచుతుంది.
• నేల యొక్క భౌతిక మరియు రసాయన గుణాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది.

ముగింపు
వర్మీవాష్ సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించదగిన ఒక ద్రవరూప ఉప ఉత్పత్తి. సేంద్రియ వ్యర్థాలను సమర్థంగా వినియోగించడం, వర్మీకంపోస్టు తయారీ ప్రక్రియకు అదనపు విలువ కల్పించడం, పంటల పోషక యాజమాన్యంలో అనుబంధ వనరుగా ఉపయోగించడం వంటి అంశాల్లో దీనికి ప్రాధాన్యం ఉంది.

అయితే వర్మీవాష్‌ను అన్ని పోషక లోపాలకు పరిష్కారంగా లేదా రసాయనిక ఎరువులకు సంపూర్ణ ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు. దాని నాణ్యతను గుర్తించి, తగిన మోతాదులో, సరైన పద్ధతిలో వినియోగించాలి. నేల పరీక్ష, సేంద్రియ ఎరువుల సమతుల్య వినియోగం, పంట మార్పిడి, పంట అవశేషాల నిర్వహణ, సమర్థవంతమైన నీటి యాజమాన్యంతో కలిపి వర్మీవాష్‌ను ఉపయోగించినప్పుడే స్థిరమైన వ్యవసాయానికి మెరుగైన తోడ్పాటు అందించవచ్చు. వర్మీవాష్‌ను నేల ఆరోగ్య పరిరక్షణకు, సమగ్ర సేంద్రీయ పోషక యాజమాన్యానికి తోడ్పడే అనుబంధ వనరుగా గుర్తించి శాస్త్రీయంగా వినియోగించాలి.

బి. చంద్ర శేఖర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (మృత్తికా శాస్త్రం) పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258

Read More

*దూడలు పాలు కక్కటం *(MILK REGURGITATION / EMESIS / VOMITING IN CALVES)

సమస్య:
డయాఫ్రం అనే అవయవం ఎక్కువగా సంకోచ వ్యాకోచాలు చెందటం
దూడలలో పేగు కదలికలు ఎక్కువవటం

కారణాలు:
గొంతులో ఏదైనా వస్తువు అడ్డుకొనటం (CHOKE)

పరిష్కారాలు:
గృహవైద్యం:

  1. పాలు సరిపడినన్ని మాత్రమే త్రాగించాలి.
  2. వాము 15 గ్రా॥, ఉప్పు 5 గ్రా॥ నూరి తినిపించాలి.

హోమియో:
క్రింది వాటిలో ఏదైనా ఒక మందు వాడవచ్చు.
ఆంటిమోనియం టార్టారికం 200 గానీ, ఈధూసా 200 గానీ ఆంటిమోనియం క్రూడం 200 గానీ ఇపికాక్ 200 మందు గానీ, మాగ్ కార్బ్ 200 గానీ, నక్స్ వామిక 200 గానీ 10 మాత్రలు రోజుకు 2 సార్లు 3 రోజులు తినిపించాలి.

అల్లోపతి:

  1. సోడా ఉప్పు (SODIUM BICARBONATE) 20 గ్రా॥ తినిపించాలి.
  2. ఆంటాసిడ్స్ – రానిటిడిన్, ఇసోమెప్రజోల్, లాన్‌సొప్రజోల్, ఒమిప్రజోల్, పాంటోప్రజోల్ మందులలో ఏదైనా ఒక మందును నియమిత మోతాదులో తినిపించాలి.
  3. సిక్విల్ లేదా ఎవొమిన్ ఇంజక్షన్ 2 మి.లీ. కండకు చేయించాలి.
  4. జీట్ (ZEET) ఇంజక్షన్ చేయించాలి.
  5. ఆక్సీ 50 (OXY 50) ఇంజక్షన్ చేయించాలి.
  6. ట్రైబివెట్ (TRIBIVET) ఇంజక్షన్ చేయించాలి.

జాగ్రత్తలు:

  1. తక్కువ పరిమాణంలో పాలు త్రాగనివ్వాలి.
  2. పాలు త్రాగిన వెంటనే స్వేచ్ఛగా పరిగెత్తనివ్వాలి.
    …………………………………………………………………………………..

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ABC వీర్య సేకరణ కేంద్రంలో HF ఎద్దులలో థైలీరియాసిస్ వ్యాధి – ఒక కేసు నివేదిక

పరిచయం :-
థైలీరియాసిస్ (Theileriosis) అనేది Theileria జాతికి చెందిన ప్రోటోజోవా పరాన్నజీవుల వల్ల పశువులలో కలిగే రక్త సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి సాధారణంగా పేల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా అధిక జాతి సామర్థ్యం కలిగిన హోల్స్టీన్ ఫ్రీసియన్ (Holstein Friesian – HF) పశువులలో ఈ వ్యాధి తీవ్రంగా కనిపించే అవకాశం ఉంది.

రైతులకు కలిగే ప్రధాన ఆర్థిక నష్టాలు:-
థైలీరియోసిస్ రైతులకు ప్రత్యక్షంగా చికిత్స ఖర్చులు, పాల ఉత్పత్తి తగ్గుదల, పశువుల మరణాలు మరియు ఉత్పాదకత నష్టాల రూపంలో ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది. పరోక్షంగా సంతానోత్పత్తి పనితీరు, పశువుల మార్కెట్ విలువ మరియు వ్యవసాయ ఆదాయంపై ప్రభావం చూపవచ్చు.వీర్య సేకరణ కేంద్రాల్లో ఉన్న సంతానోత్పత్తి ఎద్దుల ఆరోగ్య పరిరక్షణలో ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం.

కేసు వివరాలు :-
ABC వీర్య సేకరణ కేంద్రానికి పంజాబ్లోని లూధియానా నుండి మొత్తం నాలుగు HF ఎద్దులను ABC సీమెన్ స్టేషన్, వెరవల్లి, బాపులపాడు, కృష్ణా జిల్లాకి తీసుకువచ్చారు.

వివరాలు సమాచారం
మొత్తం ఎద్దుల సంఖ్య 4
ఒక సంవత్సరం లోపు వయస్సు కలిగినవి 3
మూడు సంవత్సరాల లోపు వయస్సు కలిగినది 1
చిన్న వయస్సు ఎద్దుల సగటు శరీర బరువు 350 కిలోలు
పెద్ద ఎద్దు శరీర బరువు 650 కిలోలు

రవాణా సమయంలో నాలుగు ఎద్దులలోనూ ఎటువంటి స్పష్టమైన వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అయితే, కేంద్రానికి చేరుకున్న మూడు రోజుల తరువాత ఎద్దులలో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.

క్లినికల్ లక్షణాలు:-
ఎద్దులలో గమనించిన ప్రధాన లక్షణాలు:
• శరీర ఉష్ణోగ్రత 104°F నుంచి 105°F వరకు పెరగడం.
• శోషరస గ్రంథులు (Lymph nodes) గణనీయంగా వాపు చెందడం.
• రక్తహీనత.
• ఆకలి తగ్గడం
పై లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, పశువైద్యులు థైలీరియాసిస్ వ్యాధిని అనుమానించారు.

చికిత్స మరియు రోగ నిర్ధారణ:-
దశ 1: ప్రారంభ చికిత్స
బుపార్వాక్వోన్ (Buparvaquone – 50 mg/ml) మోతాదు: ప్రతి కిలో శరీర బరువుకు 2.5 మి.గ్రా.

ఇచ్చే విధానం: మెడ కండరంలోకి లోతుగా (Deep Intramuscular Injection). వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే, ఎద్దులకు బుపార్వాక్వోన్ (Buparvaquone) ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే, చికిత్స తరువాత కూడా జ్వరం మరియు ఇతర లక్షణాలు తగ్గకపోవడంతో తదుపరి రోగ నిర్ధారణ చర్యలు చేపట్టారు.

దశ 2: రక్త నమూనాల సేకరణ
ప్రారంభ చికిత్స చేసిన రెండు రోజుల తరువాత ఎద్దుల నుంచి రక్త నమూనాలను సేకరించి, వ్యాధి నిర్ధారణ కోసం ADDL, విజయవాడకు పంపించారు. అనంతరం, నమూనాలను మరింత నిర్ధారణ కోసం VBRI, విజయవాడకు పంపించారు.

రక్త స్మియర్ పరీక్ష
ఈ కేసులో బుపార్వాక్వోన్ చికిత్స అందించిన తర్వాత రక్త నమూనాను సేకరించి స్మియర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో Theileria పరాన్నజీవులు కనిపించలేదు.దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు.చికిత్స అనంతరం రక్తంలో కనిపించే పరాన్నజీవుల సంఖ్య తగ్గి ఉండవచ్చు. ఈ కేసులో ప్రత్యేకంగా గమనించదగిన అంశం ఏమిటంటే, చికిత్స అనంతరం సేకరించిన రక్త స్మియర్లో పరాన్నజీవులు కనిపించకపోయినా PCR పరీక్షలో Theileria spp. పాజిటివ్గా నమోదైంది.

హెమటాలజికల్ పరీక్షల ఫలితాలు
పరీక్ష నమోదైన ఫలితం
హీమోగ్లోబిన్ (Hb) 9.2 g/dL
ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ (PCV) 27.4%
ఎర్ర రక్తకణాలు (RBC) 8.81 × 10⁶/µL
తెల్ల రక్తకణాలు (WBC) 6 × 10³/µL
ప్లేట్లెట్లు (Platelets) 397 × 10³/µL

దశ 3: తదుపరి చికిత్స
రక్త నమూనాలను పంపిన మరుసటి రోజు, ఒక ఎద్దుకు ఇమిడోకార్బ్ (Imidocarb) ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే, ఆశించిన స్థాయిలో మెరుగుదల కనిపించలేదు. ఇమిడోకార్బ్ (Imidocarb – 120 mg/ml) మోతాదు: ప్రతి కిలో శరీర బరువుకు 1.2 మి.గ్రా. ఇచ్చే విధానం: కండరంలోకి (Intramuscular) లేదా చర్మం కిందకు (Subcutaneous).

దశ 4: సహాయక చికిత్స
1.ఆక్సీటెట్రాసైక్లిన్ (Oxytetracycline) నివేదించిన మోతాదు: 1 మి.లీ./3 కిలోల శరీర బరువు
2. న్యూరెనిక్ ఇంజెక్షన్ (Nuorenic Injection) మోతాదు: 5–10 మి.లీ. ఇచ్చే విధానం: కండరంలోకి లోతుగా (Deep Intramuscular Injection).
3. మెగ్లుడైన్ ఇంజెక్షన్ (Megludyne Injection) మోతాదు: ప్రతి కిలో శరీర బరువుకు 1.1–2.2 మి.గ్రా. ఇచ్చే విధానం: సిరలోకి నెమ్మదిగా (Slow Intravenous Injection).

ఈ చికిత్సను నాలుగు రోజుల పాటు అందించిన తరువాత ఎద్దులలో వ్యాధి లక్షణాలు తగ్గినట్లు నివేదించబడింది. ఇది చికిత్సకు అనుకూలమైన క్లినికల్ ప్రతిస్పందనను సూచిస్తుంది.

ఫలితాలు:-
ప్రారంభ బుపార్వాక్వోన్ చికిత్స తరువాత లక్షణాలు తగ్గలేదు. అనంతరం ఒక ఎద్దుకు ఇమిడోకార్బ్ ఇచ్చినప్పటికీ స్పష్టమైన మెరుగుదల కనిపించలేదు. తరువాత ఆక్సీటెట్రాసైక్లిన్ మరియు ఇతర సహాయక చికిత్సలను నాలుగు రోజుల పాటు అందించిన తరువాత క్లినికల్ లక్షణాలు తగ్గినట్లు నివేదించబడింది.
ఈ కేసులో రక్త స్మియర్ నెగటివ్గా ఉండగా, PCR పాజిటివ్గా రావడానికి చికిత్స అనంతరం పరాన్నజీవుల సంఖ్య తగ్గడం ఒక సాధ్యమైన వివరణ.
రక్త స్మియర్ పరీక్షలో పరాన్నజీవులు కనిపించకపోవడంతో మాలిక్యులర్ నిర్ధారణ కోసం PCR పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో Theileria spp. కు పాజిటివ్ ఫలితం వచ్చింది.మైక్రోస్కోపీతో పోలిస్తే తక్కువ పరాన్నజీవి సాంద్రత ఉన్న నమూనాల్లో కూడా సంక్రమణను గుర్తించే అవకాశం ఉంటుంది.

రైతులకు కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించే చర్యలు:-
• పశువులను క్రమం తప్పకుండా పేల కోసం పరీక్షించడం.
• పశువుల షెడ్లు, గోడలు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచడం.
• పశువైద్యుని సూచనల ప్రకారం పేల నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించడం.
• అధిక జ్వరం, లింఫ్ నోడ్స్ వాపు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్య సహాయం పొందడం.
• అవసరమైనప్పుడు బ్లడ్ స్మియర్తో పాటు PCR వంటి పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించడం. అంతిమంగా, PCR పరీక్ష ఈ కేసు నిర్ధారణకు ముఖ్యమైన సహాయక సాధనంగా నిలిచింది;

ముగింపు :-
సంతానోత్పత్తి ఎద్దుల నిర్వహణ: కొత్తగా తీసుకువచ్చే ఎద్దులకు ప్రత్యేక నిర్బంధ నిర్వహణ (Quarantine), పేల నివారణ, శరీర ఉష్ణోగ్రత పర్యవేక్షణ మరియు అవసరమైన రక్త పరీక్షలు చేపట్టడం మంచిది.

డా. ఎ . ఉషారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ (AH), పరాన్నజీవి శాస్త్ర విభాగం, వీబీఆర్ఐ, విజయవాడ.
డా. ఎస్. వసుంధర, అసిస్టెంట్ డైరెక్టర్ (AH), పాథాలజీ విభాగం, వీబీఆర్ఐ, విజయవాడ.
డా. సుజని, అసిస్టెంట్ డైరెక్టర్ (AH), ఎ.డి.డి.ఎల్. విజయవాడ.
డా. ప్రవీణ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఎ.డి.డి.ఎల్ , విజయవాడ.
డా. బీ. చంద్ర మౌళి నాయక్, జాయింట్ డైరెక్టర్ (AH), వీబీఆర్ఐ, విజయవాడ.
Ph: 8790998060

Read More

*ఔషధ మొక్క… పెద్ద పెండలం*

ఇది 5 మీ. వరకు ఎగప్రాకే బహువార్షికపు తీగ. వేర్లు లావుగా కండ కలిగి దుంపలాగా ఊరతాయి. దీనిని దుంపల ద్వారా మరియు బల్బిల్స్ ద్వారా వ్యాప్తిచేయవచ్చు. దీని దుంపలు వాణిజ్యపరంగా మరియు ఔషధంగా ఉపయోగిస్తారు.*సాధారణ నామం :* ఏసియాటిక్ యామ్, గ్రేటర్ యామ్

*శాస్త్రీయ నామం :* డయోస్కోరియా అలాట

*కుటుంబం :* డయోస్కోరియేసి

*ఉపయోగాలు : ఔషధరంగంలో …** దీని దుంపలలో అల్బుమినాయిడ్లు (7.96-15.68%), కొవ్వు (0.59-1.26%), బూడిద (4.23-7.28%), పీచు (2.19-6.12%), కార్బోహైడ్రేట్లు (71.67-85.027%), భాస్వరము (0.44-0.98%), పిండిపదార్థములు (21%) లభిస్తాయి. ఆకులలో డిఫ్రక్టోజ్, డిగ్లూకోజ్ మరియు పాలియోల్స్ ఉంటాయి.

* దీనిని దుంప కూరగా ఉపయోగిస్తారు. క్రిమిసంహారి, కుష్ఠు, మూలశంక వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ దుంపలలో శరీరం పెరుగుదలకు దోహదపడే హార్మోనులుంటాయి.

*వ్యవసాయరంగంలో* * పెద్ద పెండలం ఇథనాల్ ద్రావణం స్ల్కీరోషియం రాల్ఫ్సి, బోట్రియోడిప్లోడియా థియోబ్రోమె, ఫ్యుజేరియం ఆక్సిస్పోరంపై అధిక యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది. ఇది అన్ని శిలీంద్రాల పెరుగుదలను అరికట్టింది (ఒకిగ్బొ, అతని అనుచరులు, 2015).

* పెద్దపెండలం, పులిదుంప ద్రావణాలను మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్‌లో పులియబెట్టిన ద్రావణాలు గోల్డెన్ నత్తలను సమర్థవంతంగా నివారించాయి (పొన్సియానో, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

దూడ, పాలు ఎక్కువగా త్రాగటం / పాలదొమ్మ (DYSPNEA Due to Excess Intake of Milk)

సమస్య:

  1. కడుపు ఉబ్బటం, 2. గురక రావటం, 3. దగ్గటం, 4. ఊపిరి ఆడక బాధపడటం
  2. ముక్కుల వెంట నీరు కారటం, 6. కళ్ళ వెంట నీరు కారటం

కారణాలు:
ఒకే పర్యాయం మిక్కుటంగా ప్రాలు త్రాగటం

పరిష్కారాలు:
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.

గృహవైద్యం:

  1. వేడి నీళ్ళు త్రాగించాలి.
  2. వాము వాటర్ 30 మి.లీ. త్రాగించాలి.
  3. అవిశనూనె 15 మి.లీ. త్రాగించాలి.
  4. కొర్రపిండి 50 గ్రా॥, పసుపు 5 గ్రా॥, వెన్న 5 గ్రా॥ కలిపి లేదా వాము 10 గ్రా॥, ఉప్పు 2 గ్రా॥ మెత్తగా నూరి గాని లేదా ఆవ పిండి 5 గ్రా॥, ఉప్పు 10 గ్రా॥, చేదు జీలకర్ర పొడి 2 గ్రా॥ కలిపి గాని తినిపించాలి.
  5. అల్లం 5 గ్రా॥ నలగగొట్టి, 1/4 లీటరు నీళ్ళలో రసం పిండి, పొంగించి త్రాగించాలి.

ఓషధులు :

  1. గానుగ చెక్క 15 గ్రా॥, ఉప్పు 10 గ్రా॥ కలిపి దంచి తినిపించాలి.
  2. గాడిద గడప ఆకులు 5-6, ఉప్పు 10గ్రా॥ నూరి తినిపించాలి.
  3. ఎండు మోదుగ పూలు 5 గ్రా॥ నూరి, నీళ్ళలో కలిపి త్రాగించాలి.

మూలికావైద్యం:
అశ్వగంధ 50 గ్రా॥, గల్ౙేరు వేళ్ళు 50 గ్రా॥ నూరి, ఒక లీటరు పెరుగులో కలిపి తినిపించాలి.

హోమియో :

  1. ఈథూసా లేదా నక్స్ వామిక లేదా బ్రయోనియ లేదా పల్సటిల్ల 200 గానీ 10 మాత్రలు తినిపించాలి.
  2. ఆకలి పుట్టటానికి ఆల్ఫాల్ఫా 3ఒ లేదా ఫైవ్ ఫాస్ 6 మాత్రలు చొప్పున 5 రోజులు తినిపించాలి.

అల్లోపతి:

  1. లివ్ (LIV) 52 వంటి లివర్ టానిక్ (LIVER TONIC) మందును వాడాలి.
  2. ఎవిల్ (AVIL) వంటి మందును వాడాలి.

జాగ్రత్తలు:

  1. తల్లి పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి దూడకు కావలసినన్ని పాలు మాత్రమే త్రాగనివ్వాలి.
  2. రోజు మొత్తం మీద దూడ బరువులో 10% మించి పాలు త్రాగించరాదు.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… నల్ల తీగ

నల్లతీగ కనీసం 15 మీ. పొడవు పెరుగుతుంది లేదా నిటారుగా పొదలాగా పెరుగుతుంది. కొమ్మలు ముదరు ఎరుపు రంగు కలిగి ఉంటాయి. ఆకులు సామాన్యంగా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి 3-5 చిన్న ఆకులు కలిగి ఉంటాయి. పూలు చిన్న గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు నిడువు వాటుగా లేదా అండాకారం నుండి ఒకవైపు వెడల్పాటి గుడ్డు ఆకారంలో ఉంటాయి.

సాధారణ నామం : సీడెర్రిస్ శాస్త్రీయ నామం : డెర్రిస్ ఎల్లిప్టికా / డెర్రిస్ ట్రైఫోలియేట కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో ..

  • భారతదేశంలో స్థానిక వైద్యంలో నల్లతీగ వేరుని ఉత్తేజితకారిగా, కీళ్ళనొప్పులకు, క్రానిక్ పక్షవాతానికి, డిస్మెనోరియాగా ఉపయోగిస్తారు.
  • వేరు కషాయాన్ని జ్వరం తగ్గించడానికి, లోపలికి సేవించి వ్రణాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
  • సంప్రదాయ వైద్యులు వేర్లను లేదా కాండాలను విరేచనకారి, వాయుహరంగా, కీళ్ళనొప్పులు తగ్గించడానికి ఉపయోగిస్తారు.
  • బెరడుని నీటిలో లేదా కొబ్బరి నీటిలో నానబెట్టి, పిండి, రసాన్ని ప్రసవం తరువాత తల్లులకు తాగిస్తారు.
  • ఆకుల కషాయాన్ని మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • రైతులు నల్లతీగ (డెర్రిస్) మొక్కలను ఖర్చు లేకుండా పెంచుకుని దీని ద్రావణాన్ని రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా పురుగుల నివారణలో ఉపయోగించవచ్చు. డెర్రిస్ ద్రావణం టీ పంటనాశించే టీ దోమ, ఎర్రనల్లి, పేనుబంక, తామర పురుగులు, జాసిడ్స్, చెదలు, నులిపురుగులను నివారించడానికి ఉపయోగపడుతుంది (మామన్ అండ్ అహ్మద్, 2011).
  • నల్లతీగ పొడి, రెండు రసాయన పురుగు మందులతో పాటు మొక్కజొన్న కాండంతొలుచు పురుగు నివారణలో పరీక్షించారు. అన్నీ పురుగులని సంతృప్తికరంగా చంపాయి కాని, నల్లతీగ పొడి మాత్రమే పంటకెటువంటి హాని కల్గించకుండా పురుగుని నివారించింది (జాక్, 2011).
  • నల్లతీగ పొడి సాఫ్లెå లార్వాలను 100% నియంత్రించింది.
  • నల్లతీగ వేర్లలో అధిక కీటకనాశక శక్తి గల రసాయనాలు, రోటెనాయిడ్స్ ఉంటాయి. దీనిని ఇంటిలో, పెంపుడు జంతువులపై, పొలంలో పంటలపై ఆశించే అనేక రకాల పురుగుల నివారణకు ఉపయోగిస్తారు. క్షేత్రంలోని పంటలపై దీని విషప్రభావం కొద్దికాలం (35 రోజులు) మాత్రమే ఉంటుంది. అవశేషాలు మానవులకు హాని కల్గించవు.
  • నల్లతీగ వేర్లను ఎండబెట్టి, పొడి చేసి, బంకమట్టి (కెయొలినైట్)తో 1:4 నిష్పత్తితో కలిపి నేరుగా మొక్కలపై చల్లవచ్చు. ఈ పొడిని భవిష్యత్ ఉపయోగార్థం నలుపురంగు ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయవచ్చు.
  • పంటలపై పిచికారి చేయడానికి, తాజాగా సేకరించిన వేర్లను మెత్తగా నూరి 40 గ్రా. తాజావేర్లను 20 లీ. నీటిలో కలిపి ఈ ద్రావణాన్ని సాయంత్రం 5 గంటల తర్వాత పంటలపై పిచికారి చేయాలి.
  • పశువులు, పెంపుడు జంతువులలో పేలు, గోమార్ల నివారణకు ఈ ద్రావణాన్ని షాంపూలాగా ఉపయోగించవచ్చు.
  • చేపల చెరువులో క్యాట్‌ఫిష్ వంటి వ్యర్థ చేపలను చంపడానికి, 1 కి. నల్లగ్గొట్టిన వేర్లను గోనె సంచిలో వేసి నీటిలో ముంచాలి (ఐఐఆరఆర్, 1992).
  • రోటెనోన్‌ని 1848లో ఆకులు తినే పురుగుల నివారణకు ఉపయోగించారు.
  • నల్లతీగ నిదానంగా పని చేసే కీటకనాశిని. దీనిని పేనుబంక, రంపపు ఈగలు (సాఫ్లై), బీటిల్స్, లీఫ్ హాపర్స్, చిత్త పురుగులు, కంపునల్లి, తెల్లదోమ, నల్లులు, లార్వాల నియంత్రణలో ఉపయోగిస్తారు. దీనిని పశువులలో పేను, గోమార్ల నివారణకు ఉపయోగిస్తారు.
  • రోటెనోస్ (30 గ్రా. యాక్టివ్ ఇన్‌గ్రీడియెంట్/హెక్టారు) క్యాబేజి పంటనాశించే క్లోర్‌ఫ్లెన్‌పైర్‌ని తట్టుకునే శక్తిని పెంపొందించుకున్న డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాక్ౙెåలోస్టెల్లాని సమర్ధవంతంగా నివారించింది.
  • క్షేత్ర ప్రయోగంలో రోటెనోన్ ఫార్ములేషన్ (30 గ్రా. యాక్టివ్ ఇన్‌గ్రీడియెంట్ / హె.) స్పోడోప్టెరా లిటూర లార్వాలను స్పైనోసాడ్ (రసాయన పురుగు మందు) తో సమానంగా చంపింది (జుబైర్, అతని అనుచరులు, 2016).
  • నల్లతీగ (డెర్రిసఎల్లిప్టికా) ద్రావణం కమ్మర్షియల్ లార్విసైడ్ కన్నా అధిక సమర్థవంతంగా దోమల లార్వాలను చంపింది (అమిస్టాడ్, అతని అనుచరులు, 2013).
  • నల్లతీగ వేరు ద్రావణాన్ని పంటలపై పిచికారి చేసి పేనుబంక, బీటిల్స్, తామర పురుగులు, నల్లులు, లార్వాలను అతి సమర్ధవంతంగా చంపవచ్చు (నేషనల్ అగ్రికల్ౘ్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నరిటోక్‌టక్, 2003).
  • రోటెనోన్ ఆకులను తినే బీటిల్స్, లార్వాలు, పేలు, దోమలు, గోమారులు, ఎర్రచీమల వంటి అనేక పురుగులను చంపుతుంది (రాజశేఖర్, అతని అనుచరలు, 2012).
  • నల్లతీగ జాతి మొక్కలను సౌత్ ఈస్ట్ ఆసియా, సౌత్ అమెరికా ప్రజలు అనేక శతాబ్దాలుగా పెస్టిసైడ్, ఇన్‌సెక్టిసైడ్‌గా ఉపయోగిస్తున్నారు (దేవ్ అండ్ కౌల్, 1997).
  • నల్లతీగ (డెర్రిస్ ఫిలిప్పైనెన్సిస్) వేరు ఇథనాల్ ద్రావణం డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (మఘనోయ్, అతని అనుచరులు, 1975); మొరాల్లోరోజెసస్, 1985).
  • డెర్రిస్ వేర్ల నుండి కమ్మర్షియల్ పురుగు మందులను 1930లో వృద్ధి చేశారు (డ్యూక్, 1990).
  • నల్లతీగ (డెర్రిస్ స్కాండెన్స్) వేరు నుండి వేరు చేసిన ప్రినైలేటెడ్ ఐసోఫ్లేవోన్ మిశ్రమాలు 2, 4, 5, 8, 9 రెడ్‌ఫ్లోర్ బీటిల్, ట్రైబోలియం కాస్టానియం, మరియు రైస్‌మాత్, కార్సిరా సెఫొలోనికా లార్వాలను చంపాయి. ఈ మిశ్రమాలను నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు కీటకనాశినులుగా, తినడాన్ని అడ్డగించే కారకాలుగా ఉపయోగించవచ్చు (ఉషారాణి, ఆమె అనుచరులు).
  • రోటెనోన్‌ని పంటపై పిచికారి చేసిన వెంటనే పురుగులు ఆకులు తినడాన్ని ఆపివేస్తాయి. కొన్ని గంటలలో గాని, అనేక రోజుల తర్వాత గాని చనిపోతాయి. ఇది లార్వాలు, పేనుబంక, రసంపీల్చే పురుగులు, తామర పురుగులు మరియు ఇతర పండ్లు, కూరగాయల పంటల్లో ఆశించే పురుగులను స్పర్శ, ఉదర విషచర్యల ద్వారా సమర్ధవంతంగా నివారిస్తుంది. (టోమ్లిన్, 2000). కొలరాడో పొటాటోబీటిల్ (లెప్టినోటార్సాడెసెమ్లఇనియేట), ప్లమ్‌కుర్క్యిలో (కొనాట్రాకెలెస్ నెనుఫర్), డయాబ్రాటికా, అకలిమ్మా స్పీసీస్ కూడా (వైన్‌జిమెర్ల్, 1998) సమర్థవంతంగా నివారించబడతాయి.
  • రోటెనోన్‌పొడి (1.5% యాక్టివ్ ఇన్‌గ్రీడియెంట్)ని కాలిఫోర్నియాలో లెట్యూస్, టమాట పంటనాశించే పురుగుల నివారణకు ఉపయోగిస్తారు (కటర్, 2012).
  • డెర్రిస్ స్కాండెన్స్ వేరు ద్రావణం నుండి ఇప్పటికే గుర్తించిన 10 మిశ్రమాలతో పాటు ఒక కొత్త బెండిల్‌డెరివేటివ్‌ని కనుగొన్నారు. యాంటిఫీడెంట్ చర్య, పెరుగుదలనరికట్టే చర్యలు గల ఈ మిశ్రమాల ప్రభావాన్ని ఆముదం సెమిలూపర్ పురుగుపై పరిశోధనలు జరిపారు. కొత్త మిశ్రమం డెర్రిస్‌డియోన్ సెమిలూపర్, అక్కయాజనతాపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (శ్రీలత, ఆమె అనుచరులు, 2009).
  • భవిష్యత్తులో సుస్థిర వ్యవసాయంలో డెర్రిస్ ఎల్లిప్టిక, డెర్రిస్ ట్రైఫోలియే\ వేర్ల నుండి తయారు చేసిన రోటెనోన్ మందులను కూరగాయల పంటలు, చేపల పెంపకంలో రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు (హీన్, అతని అనుచరులు, 2003).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… చియా ఫుడ్డింగ్

తయారుచేయు విధానం: తాజా కొబ్బరి ముక్కల నుంచి పాలు తీసి ఈ ఫుడ్డింగ్ తయారు చేయవచ్చు. లేకపోతే టెట్రా ప్యాక్‌లో దొరికే కొబ్బరిపాలు వాడుకోవచ్చు. ఒక కప్పు పాలలో రెండు స్పూన్లు చియా సీడ్స్ వేసి బాగా కలపాలి. లేకపోతే అవి గడ్డ కడతాయి. దానిలో రెండు స్పూన్లు తేనె వేసి బాగా కలపాలి. ఐదారు ఖర్ౙూర పండ్లను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చు. కానీ ఇది స్వీట్ తక్కువ ఉంటేనే బాగుంటుంది. దీనిని నాలుగైదు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత తీసి దానిలో పండ్ల ముక్కలు, డ్రైఫ్రూట్స్ ఏవి కావాలంటే అవి కలిపి తినవచ్చు. బ్రేక్ ఫాస్ట్‌లో తినాలంటే రాత్రి నానబెట్టి పొద్దున్నే తినాలి. ఫ్రిజ్‌లో పెట్టటం ఇష్టం లేని వారు చియా సీడ్స్‌ను విడిగా నానబెట్టి తినేముందు పాలలో కలుపుకోవచ్చు.

కావలసిన పదార్థాలు

  • చియా సీడ్స్ – రెండు స్పూన్లు
  • కొబ్బరిపాలు – ఒక కప్పు
  • తేనె – రెండు టీ స్పూన్లు
  • ఖర్జూరం – ఐదారు
  • కొన్ని రకాల పండ్ల ముక్కలు (ఎన్ని వీలైతే అన్ని)

రచనః లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ.

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

తమలపాకులు కొబ్బరి పచ్చడి

తయారుచేయు విధానం: ముందుగా తమలపాకులు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొబ్బరికాయ చిన్న ముక్కలు చేసుకోవాలి. తరువాత మిక్సి గిన్నెలో ఈ పదార్ధాలు అన్ని వేసి తగినంత నీరు పోసి మిక్సి పట్టాలి. అంతే… కొబ్బరి తమలపాకుల పచ్చడి రెడీ!

ఈ రుచికరమైన పచ్చడి 3 రోజులు నిల్వ ఉంటుంది. (ఫ్రిజ్‌లో పెడితే)

ముఖ్య గమనికః తమలపాకులలో చాలా రకాలు ఉన్నాయి. నాకు తెలిసిన రకాలు కారళి తమలపాకు, మనం రోజు వాడే తమలపాకు, కలకత్తా తమలపాకు, బనారసి తమలపాకు… ఆకును బట్టి పచ్చడి రుచి మారుతుంది. అన్నిటికంటే కారళి తమలపాకు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు

  • పచ్చడి కొబ్బరికాయ – 1
  • తమలపాకులు – 20
  • పచ్చిమిర్చి – 15
    (లోపలి విత్తనాలు తీసివేయాలి)
  • జీలకర్ర-1 టేబుల్ స్పూన్
  • ఉప్పు – సరిపడినంత
  • నిమ్మ రసం – 4 టేబుల్ స్ఫూన్స్ లేదా చింతపండు – చిన్న నిమ్మకాయ సైజు అంత

రచన: దిల్షాద్ ఖాన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్

రైతునేస్తం ప్రచురణ ‘ వండని వంటలు ‘ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More