ఎల్‌నినో నేపథ్యం లో ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ సాగు పరిస్థితి రబీ పంటల ప్రణాళిక మరియు ఉద్యాన పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే ఒక వాతావరణ పరిణామం. ఈ సముద్ర ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు ప్రపంచంలోని అనేక ప్రాంతాల వాతావరణంపై ప్రభావం చూపుతాయి. మన భారతదేశంలో ఎల్‌నినో పరిస్థితుల వల్ల నైరుతి రుతుపవనాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ఎల్నినో ప్రభావం వల్ల విఫలమై సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యి ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.

ఉత్తరకోస్తా జిల్లాలలో నైరుతి రుతుపవనాలు పై ఎల్‌నినో ప్రభావం
2026 జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నమోదైన వర్షపాతం పరిస్థితిని గమనించినట్లయితే అనకాపల్లి జిల్లాలో, ఖరీఫ్ సాధారణ వర్షపాతం 479.6 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 229.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యి సాధారణంతో పోలిస్తే 52.2 శాతం లోటు నమోదు అయ్యింది. విశాఖపట్నం జిల్లాలో, సాధారణ వర్షపాతం 427 మిల్లీమీటర్లు కాగా, వాస్తవ వర్షపాతం 175.7 మిల్లీమీటర్లు నమోదు అయ్యి 58.9 శాతం లోటు లో ఉంది. విజయనగరం జిల్లాలో, సాధారణ వర్షపాతం 484.4 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 288.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 40.4 శాతం లోటు ఉంది. శ్రీ కాకుళం జిల్లాలో, సాధారణ వర్షపాతం 503 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 293.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 41.7 శాతం లోటు ఉంది. ఈ లోటు వర్షపాతం వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గి పోవడమే కాక సాగులో ఉన్న పంటల దిగుబడులపై ప్రభావం చూపనుంది. ఎల్నినో ప్రభావం వల్ల అనకాపల్లి జిల్లాలో 26,434 హెక్టార్లు, విశాఖపట్నం జిల్లాలో 2,586 హెక్టార్లు. విజయనగరం జిల్లాలో 24,289 హె . విస్తీర్ణం ఖాళీగా సాగు కాకుండా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇతర నీటి వనరులు ఉండడం వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం అంతగా తగ్గలేదు.

  సెప్టెంబర్ మాసము లో బంగాళాఖాతం లో తీవ్ర అల్పపీడనం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలలో మంచి వర్షపాతం నమోదు అయ్యి రబీ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అల్పపీడనం వల్ల అనకాపల్లి జిల్లాలో 310.4 మి.మీ, విశాఖపట్నం జిల్లాలో 363.8 మి.మీ, విజయనగరం జిల్లాలో 288.4 మి.మీ అలాగే శ్రీకాకుళం జిల్లాలో 330.5 వర్షపాతం నమోదు అయ్యింది. భూగర్భజలమట్టం కూడా పెరగడం రబీ సాగుకు చాలా అనుకూలంగా ఉంది. నీటిలభ్యతను బట్టి రబీ పంటల ప్రణాళికను రూపొందించుకోవాలి.

ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లోని మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం ఆర్ధిక శాస్త్రవేత్తలు రాబోయే కాలం లో ఏ ఏ పంటలకు మార్కెట్ డిమాండ్ ఉంటుందో ముందుగానే తెలియజేస్తారు. మొక్కజొన్న: ప్రస్తుత ధర క్వింటాల్ రూ. 2,580. అదే జనవరి 2027: రూ. 3,080-3,388. ఫిబ్రవరి 2027 రూ. 3,190-3,445 వరకు ఉండవచ్చును. ఈ విధంగా అన్ని పంటలకు ప్రస్తుత మార్కెట్ ధర రాబోయే కాలంలో మార్కెట్ ధర ముందుగానే రైతులు తెలుసుకోవచ్చు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకొని రబీ పంటల ప్రణాలళికను రూపొందించుకోవాలి.

ఉత్తర కోస్తా జిల్లాల రబీ పంటల ప్రణాళిక
ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా అన్ని అంశాలను పరిగణ లోనికి తీసుకొని రబీ పంటల ప్రణాలళికను రూపొందించడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 73,376 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. వరి – 6,929 హెక్టార్లలో సాగు చేయనున్నారు. అలాగే మిగిలిన విస్తీర్ణంలోఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి , పప్పుదినుసు పంటలైన పెసర , మినుము వేరుశనగ, చెరకు, ఉలవలు, నువ్వులు, పొద్దుతిరుగుడు మరియు జీలుగ పంటలను సిఫారసు చేయడం జరిగింది.

అలాగే విజయనగరం జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 69030 హెక్టార్లు కాగా, రబీ 2026–27లో సుమారు 1,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, రాగి, ఉలవలు పప్పుదినుసు పంటలైన పెసర, మినుము శనగ, వేరుశనగ, చెరకు, నువ్వులు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

విశాఖపట్నం జిల్లాలో రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 3125 హెక్టార్లు. 596 హెక్టార్లలో వరి మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి, ఉలవలు పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, వేరుశనగ, చెరకు, నువ్వులు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

అనకాపల్లి జిల్లాలో రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 22,689 హెక్టార్లు. 3200 హెక్టార్లలో వరిమిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి, ఉలవలు, అలసందలు, పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, వేరుశనగ, చెరకు, నువ్వులు, పొద్దుతిరుగుడు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

రకాల ఎంపిక మరియు విత్తన లభ్యత
వరి లో స్వల్పకాలిక రకాలైన NLR-3449, MTU-1064, MTU-1061, MTU-1121 మరియు RNR-15048
మొక్కజొన్న లోమార్కెట్ లో దొరికే ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను ఉపయోగించవచ్చు.
రాగి: వేగావతి, ఇంద్రావతి మరియు శ్రీ చైతన్య.
పెసర: ఎల్.జి.జి-630, ఎల్.జి.జి -607, ఎల్.జి.జి -574, టి.ఎం.-96-2 మరియు ఐ.పి.ఎం.-2-14
మినుము: ఎల్.బి.జి-904, టి.బి.జి-129, ఎల్.బి.జి-884, జి.బి.జి-1, టి.బి.జి-104, ఎల్.బి.జి-752 మరియు పి.యు-31.
ఉలవలు: ఎ.టి.పి-11 మరియు వి.జెడ్.ఎమ్-1.
అలసంద: రకాలు ఆర్కా సమృద్ధి, ఆర్కా మంగళ మరియు ఆర్కా అర్జున్
వేరుశెనగ: రకాలు టి.జి.సి.ఎస్. 1694 మరియు కె.-6.
నువ్వులు: రకాలు వై.ఎల్.ఎమ్ -66 మరియు వై.ఎల్.ఎమ్ -146.
పొద్దుతిరుగుడు: ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను ఉపయోగించవచ్చు.
జనుము: ఎస్.హెచ్-4, సువిన్

రబీ పంటల సాగుకు అవసరమైన విత్తనాల్లో కొంతమేర రైతుల వద్దనే అందుబాటులో ఉన్న సొంత విత్తనాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నువ్వులు, రాగి, చెరకు పంటల్లో రైతుల వద్ద సుమారు 30 శాతం వరకు సొంత విత్తనం అందుబాటులో ఉంటుంది

మిగిలిన నాణ్యమైన విత్తనాలను ఏపీ సీడ్స్, విజయనగరం, కృషి విజ్ఞాన కేంద్రం, ఆముదాలవలస, వ్యవసాయ పరిశోధనా కేంద్రం రాగోలు, వ్యవసాయ కళాశాల నైరా, వ్యవసాయ పరిశోధనా కేంద్రం యలమంచిలి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అనకాపల్లి మరియు ఇతర ANGRAU విత్తన విక్రయ కేంద్రాల ద్వారా పొందవచ్చు.

రబీ పంటలు విత్తే కాలం
రబీ పంటల సాగులో సరైన సమయంలో విత్తనాలు విత్తడం చాలా ముఖ్యమైన విషయం. పంటను బట్టి అనుకూలమైన విత్తే సమయం మారుతుంది. కాబట్టి రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో విత్తడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు.

మొక్కజొన్న అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. జొన్న పంటను అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. రాగి పంటకు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తే సమయం అనుకూలంగా ఉంటుంది. పెసర మరియు మినుము పంటలను అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. శనగ పంటను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఉలవ పంటకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తే సమయం అనుకూలంగా ఉంటుంది. వేరుశనగ పంటను నవంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. అలాగే జనుము పంటను అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు.

పప్పుదినుసు పంటలైన మినుము పెసర సాగు చేసినప్పుడు పూత మరియు కాయ దశలో ఒక తేలికపాటి తడిని ఇవ్వవలిసి ఉంటుంది. బరువు నేలలలో అయితే మినుము తేలికపాటి నేలలలో అయితే పెసర పంటను వేసుకోవడంమంచిది.

జనుము పంటను రబీ కాలంలో విత్తనోత్పత్తి కోసం రైతులు సాగు చేస్తారు. అయితే జనుము పంటను లోతట్టు ప్రాంతాలలో వెయ్యకూడదు. తేమ ఎక్కువ అయితే జనుము పంట తట్టుకోలేదు. అలాగే కాయ దశలో పురుగు ఆశించే అవకాశం ఉన్నందున పంటను పరిశీలిస్తూ తగిన సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి.

ఎల్‌నినో నేపథ్యంలో ఉధ్యాన వన తోట పంటలలో సూచనలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ, సెప్టెంబరు నెలలో కురిసిన వర్షాలతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భూగర్భజల లభ్యత కొంత మెరుగుపడింది. ఈ పరిస్థితులను బట్టి రైతులు తమ వద్ద ఉన్న నీటి వనరులను అంచనా వేసుకొని టమాటా, మిరప, వంకాయ, బెండ, ఉల్లి వంటి కూరగాయలను సాగు చేసుకోవచ్చు. పంటను ఎంచుకునేటప్పుడు నీటి అవసరంతో పాటు స్థానికంగా ఉన్న మార్కెట్‌ డిమాండ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కూరగాయల సాగుకు మంచి నాణ్యత కలిగిన నారును ఉపయోగించడం వల్ల పంట ప్రారంభ దశలోనే మంచి మొక్కల పెరుగుదల సాధ్యమవుతుంది. నర్సరీలను నీరు నిల్వ ఉండని ప్రదేశాల్లో ఏర్పాటు చేసి, అవసరమైనంత తేమను మాత్రమే అందిస్తూ, తెగుళ్లు మరియు వ్యాధుల లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించాలి.

మామిడి, జీడి, కొబ్బరి, అరటి వంటి పండ్ల తోటల్లో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. బిందు సేద్యం, చెట్ల చుట్టూ మల్చింగ్‌ చేయడం వంటి పద్ధతులతో నేలలో తేమను నిలుపుకోవడంతో పాటు నీటి వృథాను తగ్గించవచ్చు. ముఖ్యంగా పూత, పిందె దశల్లో నీటి కొరత రాకుండా చూసుకోవాలి. తోటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ తెగుళ్లు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే మంచి దిగుబడితో పాటు రైతులకు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

*డా .వి .గౌరి, డా.ఎన్.రాజ్ కుమార్, *డా.ఎ.అలివేణి, *డా.ఎన్.భారతి, డా.ఎం.బి.జి.ఎస్.కుమారి, డా.కె.లక్ష్మణ, డా. కె.భాగ్యలక్ష్మి మరియు *డా. సి.హెచ్.ముకుందరావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లి, ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, Ph: 6304852859, 8074670166

Read More

మిరపలో బొబ్బర తెగులు నివారణకు ఎన్.కె. కషాయం

కావలసిన పదార్థాలు : నల్లజీలకర్ర – 200 గ్రా.; మిరియాలు – 500 గ్రా.; పిప్పళ్ళు – 200 గ్రా.; వాము – 200 గ్రా.; దుంపరాష్ట్రం – 500 గ్రా.; వాయు విలంగనం – 200 గ్రా.; తోక మిరియాలు – 200 గ్రా.

తయారీ విధానం : ఈ పదార్థాలన్నింటినీ దోరగా వేయించి మెత్తగా పొడిచేసి 1 కిలో ఆవు నెయ్యి, ఒక కిలో తేనెతో కలిపి పేస్టు తయారు చేసి, ఈ పేస్టుని 100 కిలోల ఆవుపేడ, 1000 లీ. నీటిలో కలిపి ఒక ఎకరాలోని మిరప మొక్కలకు వేరుకు అందేలా పోసినట్లయితే బొబ్బర తెగులు నివారణకు అవకాశాలు ఉన్నాయని కోయంబత్తూర్‌కి చెందిన సేంద్రియ వ్యవసాయ రైతు నవనీత్ కృష్ణన్ తెలిపారు. దీనిని మొక్కలు నాటిన నెల రోజులలో అందిస్తే ఫలితాలు బాగుంటాయన్నారు.

Read More

వర్షాకాలంలో కూరగాయ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాకాలం… కూరగాయ రైతులకు అప్రమత్తత అవసరం!
వర్షాకాలం కూరగాయ పంటలకు ఒకవైపు అనుకూలమైన కాలమే అయినప్పటికీ, మరోవైపు అధిక తేమ, నీటి నిల్వ, కలుపు మొక్కల పెరుగుదల, తెగుళ్లు మరియు పురుగుల ఉధృతి వంటి సమస్యలు రైతులను ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా టమాటా, మిరప, వంకాయ, బెండ, దొండ, కాకర, సొరకాయ, బీరకాయ వంటి కూరగాయ పంటల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే మొక్కల పెరుగుదల మందగించి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.

అందువల్ల వర్షాకాలంలో పంటను ప్రారంభించే ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటే పంట ఆరోగ్యంగా పెరగడంతో పాటు నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు.

నేల ఎంపికలోనే జాగ్రత్త
వర్షాకాలంలో కూరగాయలు సాగు చేసే భూమిలో నీరు నిలిచిపోకుండా మంచి మురుగు సౌకర్యం ఉండటం అత్యంత ముఖ్యం. నీరు ఎక్కువసేపు నిలిచే నేలల్లో వేర్లు గాలి అందక కుళ్లిపోవడం, మొక్కలు వాడిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

అందువల్ల పొలాన్ని బాగా దున్ని, అవసరమైన చోట కాలువలు ఏర్పాటు చేసి, అదనపు నీరు పొలం నుంచి బయటకు వెళ్లేలా చూడాలి. ఎత్తైన మడులు లేదా బోదెలపై పంటను సాగు చేయడం ద్వారా వేర్ల వద్ద నీటి నిల్వను తగ్గించవచ్చు.

నాణ్యమైన విత్తనాలే మంచి పంటకు పునాది
వర్షాకాలంలో విత్తనాల నాణ్యతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి మొలకశాతం, అధిక నాణ్యత కలిగిన ధృవీకరించిన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధి చేయడం ద్వారా ప్రారంభ దశలో వచ్చే అనేక విత్తనం, నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను తగ్గించవచ్చు.

నర్సరీలో మొక్కలను పెంచే రైతులు నీరు నిలవకుండా ఎత్తైన మడులు ఏర్పాటు చేయాలి. నర్సరీలో అధిక సాంద్రతతో మొక్కలను పెంచకుండా తగినంత గాలి, వెలుతురు ప్రసరించేలా చూడాలి.

నీరు మంచిదే… కానీ నిలిచిన నీరు ప్రమాదకరం!
వర్షాకాలంలో సాధారణంగా సాగునీటి అవసరం తక్కువగా ఉంటుంది. అయితే వర్షం తర్వాత పొలంలో నీరు నిలిచిందా లేదా అనేది రైతు తరచూ గమనించాలి. అధిక నీరు నిలిస్తే వీలైనంత త్వరగా బయటకు పంపాలి.
“పంటకు నీరు అవసరం… కానీ వేర్ల వద్ద నీటి నిల్వ అవసరం లేదు” అనే విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలి.

తెగుళ్లపై ముందస్తు నిఘా
అధిక తేమ, మేఘావృత వాతావరణం అనేక రకాల శిలీంధ్ర, బ్యాక్టీరియా తెగుళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఆకుమచ్చ తెగుళ్లు, కుళ్లు తెగుళ్లు, వాడిపోయే తెగుళ్లు వంటి సమస్యలు వర్షాకాలంలో ఎక్కువగా కనిపించవచ్చు.
అందువల్ల వారానికి కనీసం రెండు సార్లు పొలాన్ని పరిశీలించి, ఆకులపై మచ్చలు, కాండం వద్ద కుళ్లు, ఆకులు వాడిపోవడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే గుర్తించాలి. వ్యాధిగ్రస్త మొక్కలు లేదా ఆకులను తొలగించి పొలం బయట పూడ్చిపెట్టడం లేదా తగిన విధంగా నాశనం చేయడం మంచిది.

వ్యాధి వచ్చిన తర్వాత మందు కోసం పరుగెత్తడం కంటే, వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మేలు.

పురుగుల నియంత్రణలో సమగ్ర విధానం
వర్షాకాలంలో తేమతో పాటు కొత్త చిగుళ్లు, లేత ఆకులు ఎక్కువగా రావడం వల్ల కొన్ని రకాల పురుగులు పంటను ఆశ్రయిస్తాయి. తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక, ఆకుముడత పురుగులు తదితర పురుగులను ప్రారంభ దశలోనే గుర్తించాలి.

పొలంలో పురుగుల ఉనికిని పర్యవేక్షించేందుకు పసుపు, నీలం రంగు జిగురు అట్టలు వంటి పర్యవేక్షణ పద్ధతులను ఉపయోగించవచ్చు. అవసరాన్ని బట్టి జీవ నియంత్రణ పద్ధతులను కూడా అనుసరించాలి.
పురుగుమందులను అవసరం లేకుండా విచక్షణారహితంగా పిచికారీ చేయకుండా, పురుగు స్థాయి, పంట దశ, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిపుణుల సూచనల మేరకు మాత్రమే ఉపయోగించాలి.
కలుపు మొక్కలను నిర్లక్ష్యం చేయవద్దు

వర్షాలు కురిసిన వెంటనే కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇవి పంటతో నీరు, పోషకాలు, వెలుతురు కోసం పోటీ పడటమే కాకుండా కొన్ని పురుగులు, తెగుళ్లకు ఆశ్రయంగా కూడా పనిచేస్తాయి.

కాబట్టి పంట ప్రారంభ దశలోనే కలుపును నియంత్రించాలి. వరుసల మధ్య అవసరమైన మేరకు అంతరకృషి చేయడం, చేతితో కలుపు తీయడం లేదా పంటకు అనుకూలమైన మల్చింగ్ పద్ధతులను ఉపయోగించడం ద్వారా కలుపు సమస్యను తగ్గించవచ్చు.

ఎరువుల విషయంలో అప్రమత్తత
వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు నేలలోని కొన్ని పోషకాలు నీటితో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు ఒకేసారి అధిక మోతాదులో నత్రజని ఎరువులు వేయడం వల్ల మొక్కలు లేతగా, బలహీనంగా పెరిగి కొన్ని పురుగుల దాడికి గురయ్యే అవకాశం ఉంది.

అందువల్ల నేల పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించడం మంచిది. ఎరువులను ఒకేసారి కాకుండా పంట అవసరానికి అనుగుణంగా విడతలవారీగా అందించడం ద్వారా పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు.

మల్చింగ్తో ఎన్నో ప్రయోజనాలు
వర్షాకాలంలో తగిన పరిస్థితుల్లో మల్చింగ్ చేయడం వల్ల నేలపై కలుపు పెరుగుదలను తగ్గించడంతో పాటు నేల నిర్మాణాన్ని కాపాడుకోవచ్చు. వర్షపు చినుకులు నేరుగా నేలపై పడటం వల్ల కలిగే నేల కోతను కూడా కొంతవరకు తగ్గించవచ్చు.

అయితే మల్చింగ్ పదార్థం కారణంగా మొక్క కాండం చుట్టూ అధిక తేమ నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పంటకు గాలి, వెలుతురు అవసరం

వర్షాకాలంలో మేఘావృత వాతావరణం ఎక్కువగా ఉండటం వల్ల పొలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. మొక్కలను అధిక సాంద్రతతో నాటితే గాలి ప్రసరణ తగ్గి తెగుళ్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
అందువల్ల పంటకు అనుగుణమైన సరైన మొక్కల మధ్య దూరం పాటించాలి. తీగజాతి కూరగాయల్లో పందిరి ఏర్పాటు చేయడం ద్వారా మొక్కలకు మంచి గాలి, వెలుతురు అందడంతో పాటు కాయలు నేలను తాకకుండా నాణ్యతను మెరుగుపరచవచ్చు.

పంట పరిశీలన… రైతు విజయానికి కీలకం
వర్షాకాలంలో “పంట వేసేశాం… ఇక పంట కోతకు వచ్చే వరకు చూడనక్కర్లేదు” అనే ఆలోచన సరైనది కాదు. ప్రతి వర్షం తర్వాత పొలాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం.

మొక్కల ఆకులు, కాండం, వేర్ల ప్రాంతం, పూత, కాయలను పరిశీలిస్తూ పురుగులు లేదా తెగుళ్ల ప్రారంభ లక్షణాలను గుర్తించాలి. సమస్యను తొలిదశలోనే గుర్తిస్తే నియంత్రణ సులభంగా ఉంటుంది; ఖర్చు కూడా తగ్గుతుంది.

సురక్షితమైన కూరగాయలే రైతుకు, వినియోగదారుడికి మేలు
కూరగాయలలో పురుగుమందుల వినియోగం విషయంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. నిపుణుల సూచనల మేరకు తగిన సమగ్ర యాజమాన్య పద్ధతులను అనుసరించాలి.

వర్షాకాలంలో రైతు గుర్తుంచుకోవాల్సిన ఐదు సూత్రాలు
నీరు నిలవకుండా చూడాలి – పంటను తరచూ పరిశీలించాలి – కలుపును అదుపులో ఉంచాలి – పురుగులు, తెగుళ్లను తొలిదశలో గుర్తించాలి – అవసరమైనప్పుడు మాత్రమే సిఫార్సు చేసిన మందులను ఉపయోగించాలి.
వర్షాకాలం కూరగాయ రైతులకు సవాళ్లతో పాటు మంచి అవకాశాలను కూడా అందిస్తుంది. సరైన భూమి ఎంపిక, నాణ్యమైన విత్తనాలు, మంచి మురుగు సౌకర్యం, సమతుల్య ఎరువుల వినియోగం, కలుపు నివారణ, సమగ్ర చీడపీడల యాజమాన్యం, పంటను నిరంతరం పరిశీలించడం వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తే వర్షాకాలంలో కూడా ఆరోగ్యకరమైన పంటను పొందవచ్చు.

వర్షాన్ని ఆపలేం… కానీ వర్షం వల్ల వచ్చే నష్టాన్ని మాత్రం ముందస్తు యాజమాన్యంతో తగ్గించవచ్చు. రైతు అప్రమత్తత, శాస్త్రీయ సాగు పద్ధతులు కలిసినప్పుడే మంచి దిగుబడి, నాణ్యమైన కూరగాయలు, మెరుగైన ఆదాయం సాధ్యమవుతాయి.

డా. టి. థామ్సన్, డా. టి. తేజస్విని, డా. వి. సుధావాణి
డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం
Ph: 9494963291

Read More