సహజ వ్యవసాయం – భవిష్యత్ తరాలకు స్థిరమైన వ్యవసాయ మార్గం
సహజ వ్యవసాయం (Natural Farming) అనేది రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి లేదా పూర్తిగా నివారించి, ప్రకృతిలో లభించే వనరులతో పంటలను సాగు చేసే పద్ధతి.
సహజ వ్యవసాయం ప్రాముఖ్యత
- నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది – నేలలో సూక్ష్మజీవుల సంఖ్య, సేంద్రియ పదార్థం పెరుగుతాయి.
- నీటి వినియోగం తగ్గుతుంది – నేల తేమ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
- పర్యావరణ పరిరక్షణ – నేల, నీరు, గాలి కాలుష్యం తగ్గుతుంది. సాగు ఖర్చులు తగ్గుతాయి – బయటి నుంచి కొనుగోలు చేసే రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటం తగ్గుతుంది.
- సురక్షితమైన ఆహారం – రసాయన అవశేషాలు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది.
- జీవ వైవిధ్యం పెరుగుతుంది – మిత్ర కీటకాలు, సూక్ష్మజీవులు మరియు ఇతర జీవుల సంరక్షణ జరుగుతుంది.
- దీర్ఘకాలిక నేల సారవంతత – నేల భౌతిక, రసాయన, జీవ లక్షణాలు మెరుగుపడతాయి.
- రైతుల ఆదాయం మెరుగుపడే అవకాశం – సాగు ఖర్చులు తగ్గడంతో నికర ఆదాయం పెరగవచ్చు.
- స్థానిక వనరుల వినియోగం – పశువుల ఆధారిత వనరులు, పంట అవశేషాలు, స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించవచ్చు.
- స్థిరమైన వ్యవసాయానికి దోహదం – భవిష్యత్ తరాలకు నేల, నీరు, పర్యావరణ వనరులను కాపాడుతుంది.

ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే ముఖ్యమైన తయారీలు మరియు వాటి ఉపయోగాలు
బీజామృతం
పదార్థాలు: 20 లీటర్ల నీరు, 5 కిలోల దేశీ ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 50 గ్రాముల సున్నం, ఒక గుప్పెడు రైజోస్పియర్ మట్టి.
తయారీ: ఆవు పేడను గుడ్డలో కట్టి 20 లీటర్ల నీటిలో 12–16 గంటలు నానబెట్టి, సున్నం నీరు, ఆవు మూత్రం మరియు రైజోస్పియర్ మట్టిని కలిపి 8–12 గంటలు ఉంచాలి.
ఉపయోగం: విత్తన శుద్ధికి ఉపయోగించాలి; విత్తనాల ద్వారా వచ్చే వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
జీవామృతం
పదార్థాలు: 200 లీటర్ల నీరు, 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పుల పిండి, ఒక గుప్పెడు రైజోస్పియర్ మట్టి.
తయారీ: అన్ని పదార్థాలను డ్రమ్లో కలిపి, కర్రతో బాగా కలపాలి; నీడలో గోనె సంచితో కప్పి 4 రోజులు కిణ్వ ప్రక్రియకు ఉంచాలి.
ఉపయోగం: నీటిలో సుమారు 5–10% కలిపి పిచికారీ చేయాలి లేదా సాగునీటితో పాటు పారించాలి.
ఘన జీవామృతం
పదార్థాలు: 100 కిలోల ఆవు పేడ, అవసరమైనంత ఆవు మూత్రం, 1 కిలో బెల్లం, 2 కిలోల పప్పుల పిండి, ఒక గుప్పెడు రైజోస్పియర్ మట్టి.
తయారీ: పేడను పలుచగా పరచి ఆవు మూత్రం, పప్పుల పిండి, బెల్లం, రైజోస్పియర్ మట్టిని కలిపి బంతులుగా చేసి నీడలో ఆరబెట్టి, ఎండిన తరువాత చూర్ణం చేసి గోనె సంచుల్లో నిల్వ చేయాలి.
ఉపయోగం: విత్తే సమయంలో ఎకరానికి 100 కిలోల ఎండిన ఘన జీవామృతాన్ని వేయాలి.
నీమాస్త్రం
పదార్థాలు: 5 కిలోల వేప ఆకులు లేదా వేప పిండి, 5 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో ఆవు పేడ, 100 లీటర్ల నీరు.
తయారీ: వేప ఆకులను ముద్దగా చేసి నీటిలో కలిపి, ఆవు మూత్రం మరియు ఆవు పేడను వేసి 3 రోజులు ఉంచాలి; రోజుకు 3 సార్లు కలిపి తరువాత వడకట్టాలి.
ఉపయోగం: నీరు కలపకుండా పంటపై పిచికారీ చేసి రసం పీల్చే పురుగులు మరియు చిన్న గొంగళి పురుగుల నియంత్రణకు ఉపయోగించాలి.
బ్రహ్మాస్త్రం
పదార్థాలు: వేప ఆకులు 3 కిలోలు, కానుగ ఆకులు 2 కిలోలు, సీతాఫలం ఆకులు 2 కిలోలు, బొప్పాయి ఆకులు 2 కిలోలు, జామ ఆకులు 2 కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు.
తయారీ: అన్ని ఆకులను ముద్దగా చేసి ఆవు మూత్రంలో కలిపి మరిగించాలి; 2–3 గంటల తరువాత దించి 2 రోజులు చల్లారనిచ్చి వడకట్టాలి.
ఉపయోగం: 2–3% ద్రావణాన్ని నీటితో కలిపి పిచికారీ చేసి రసం పీల్చే పురుగులు మరియు కాయ, పండు తొలిచే పురుగుల నియంత్రణకు ఉపయోగించాలి.
అగ్నాస్త్రం
పదార్థాలు: 5 కిలోల వేప ఆకులు, 0.5 కిలోల పచ్చిమిర్చి, 0.5 కిలోల వెల్లుల్లి, 20 లీటర్ల ఆవు మూత్రం.
తయారీ: వేప ఆకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లిని ముద్దగా చేసి ఆవు మూత్రంలో కలిపి మరిగించాలి; 3–4 గంటల తరువాత దించి 2 రోజులు చల్లారనిచ్చి వడకట్టాలి.
ఉపయోగం: 2–3% ద్రావణాన్ని నీటితో కలిపి పిచికారీ చేసి కాండం/బెరడులో ఉండే పురుగులు, కాయతొలిచే పురుగులు మరియు గొంగళి పురుగుల నియంత్రణకు ఉపయోగించాలి.
దశపర్ణి కషాయం
పదార్థాలు: వేప ఆకులు 5 కిలోలు, వావిలాకు 2 కిలోలు, ఈశ్వరి 2 కిలోలు, బొప్పాయి 2 కిలోలు, తిప్పతీగ 2 కిలోలు, సీతాఫలం 2 కిలోలు, కానుగ 2 కిలోలు, ఆముదం 2 కిలోలు, గన్నేరు 2 కిలోలు, ఉమ్మెత్త 2 కిలోలు, పచ్చిమిర్చి పేస్ట్ 2 కిలోలు, వెల్లుల్లి పేస్ట్ 250 గ్రాములు, ఆవు పేడ 3 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు.
తయారీ: వేప ఆకులతో పాటు పైన పేర్కొన్న ఆకులలో అవసరమైన మిశ్రమాన్ని, పేడ, మూత్రం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని 200 లీటర్ల నీటిలో 15 రోజులు మరగబెట్టాలి; రోజుకు 3–4 సార్లు కలిపి చివరలో వడకట్టాలి.
ఉపయోగం: 2–3% ద్రావణాన్ని నీటితో కలిపి పిచికారీ చేసి రసం పీల్చే పురుగులు మరియు గొంగళి పురుగుల నియంత్రణకు ఉపయోగించాలి.
“సహజ వ్యవసాయం = తక్కువ ఖర్చు + ఆరోగ్యకరమైన నేల + సురక్షిత ఆహారం + పర్యావరణ పరిరక్షణ + స్థిరమైన రైతు జీవనం.”
K. కురవ రామకృష్ణ, పిహెచ్.డీ .పరిశోధనా విద్యార్థి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), రాజేంద్రనగర్, హైదరాబాద్, తెలంగాణ. Ph: 8688097548

