రఘోత్తమరెడ్డి గారి స్ఫూర్తితో ఇంటిపంట

వివిధ రకాల కారణాల వలన ఇటీవల కాలంలో ఇంటిపంటను నిర్వహించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇంటి పంటపై శ్రద్ధ ఉన్నవారు ఎవరికి అవకాశం ఉన్న ప్రాంతంలో అంటే పెరటిలో, బాల్కనీలో, మిద్దెమీద, గోడల మీద… ఎక్కడ అవకాశం ఉంటే ఆ స్థలంలో అవకాశం ఉన్న మొక్కలు పెంచుతూ ఉంటున్నారు. కొంతమందికి ఇంటిపంట మీద ఆసక్తి ఉన్నా కూడా వివిధ రకాల కారణాల వలన ఇంటి పంటను మొదలు పెట్టడం వాయిదా వేసుకుంటూ పోతుంటారు. ఇలా వాయిదా వేసుకుంటూ పోయేవారికి వేరేవారి నుంచి స్ఫూర్తి లభించిందంటే వాయిదాలను ప్రక్కకు నెట్టి కార్యాచరణలోకి దిగుతారు. కొత్తగా ఇంటి పంటను మొదలు పెట్టే అనేకమందికి అప్పటికే ఇంటిపంటను నిర్వహిస్తున్న ఇంటి పంటదారులు స్ఫూర్తిని కలిగించి ఉండవచ్చు. కాని ఇంటిపంట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొంది ఇంటి పంటను మొదలు పెట్టిన వారు ఎక్కువ మంది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. హైదరాబాదు నగరం అమీరుపేటలో గత ఆరు సంవత్సరాల నుంచి మిద్దెతోటను పెంచుతున్న తనకు రఘోత్తమరెడ్డి గారే స్ఫూర్తి అని అప్పారావు అంటున్నాడు.

అప్పారావు గారికి గత 15-20 సంవత్సరాల నుంచి ఇంటిపంట మీద మక్కువ ఉన్నా కూడా ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కాబట్టి ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలు తిరగవలసి వస్తుంది కాబట్టి ఉద్యోగంలో కొనసాగిన కాలంలో పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం చేపట్టకుండా కేవలం కొన్ని మొక్కలను మాత్రం పెంచుకుంటూ వస్తూ 6 సంవత్సరాల క్రితం తన ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తరువాత పెద్ద మొత్తంలో మొక్కల పెంపకం మొదలు పెట్టాడు. హైదరాబాదు నగరం అమీరుపేటలో మిద్దెమీద ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. తనకు ఇంటిపంటమీద మక్కువ పెరగటానికి ఇంటి పంట నిపుణుడు రఘోత్తమరెడ్డిగారే స్ఫూర్తి అని అప్పారావు వివరిస్తున్నాడు.

తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచాలనే లక్ష్యంతో అప్పారావు ఇంటిపంటను నిర్వహిస్తున్నాడు. ఇందుకుగాను చిన్న చిన్న కంటెయినర్లను ఎక్కువగా మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నాడు. చిన్న కంటెయినర్లు అయితే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. మట్టి మిశ్రమం తక్కువగా పడుతుంది. అంతేకాకుండా కంటెయినర్‌ బరువు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక చోట నుండి ఇంకో చోటకి మార్చాలంటే సులభంగా ఉంటుంది. ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తమ మిద్దెతోటలో చిన్న కంటెయినర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. 

మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టిమిశ్రమంలో 30 శాతం మట్టి, 30 శాతం వర్మికంపోస్టు, 30 శాతం కోకోపిట్‌ లేదా ఇసుక మిగిలిన 10 శాతం వేపపిండిని ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా మట్టి మిశ్రమం తయారు చేసుకుని మొక్కల పెంపకం చేపట్టి తరువాత అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంటాడు. వారి ఇంటి పంటలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, పూల మొక్కల పెంపకం చేస్తుంటారు. అరుదైన రకాలను దూర ప్రాంతాల నుంచి తెప్పించి పెంపకం చేయడం అప్పారావు గారికి ఇష్టం కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా విత్తనాలను తెప్పించి మొక్కల పెంపకం చేస్తున్నారు. వారి ఇంటి పంటలో 15 నుంచి 20 రకాల వంగ, 50 నుంచి 60 రకాల టమాటతో పాటు పొట్టి అరటి, చిన్న కంటెయినర్‌లో పెరిగే మునగ, సంపంగి, డ్రాగన్‌ ఫ్రూట్‌, బత్తాయి, నిమ్మ మొక్కలతో పాటు అరుదైన పూల మొక్కలు, ఆకుకూరలు అనేకం ఉన్నాయి. 

ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీ విరమణ పొందిన తరువాత తన పూర్తి సమయాన్ని ఇంటి పంటపై పెట్టి ఇంటి పంట దారుల సంఖ్య పెంచడంలో తనవంతు పాత్రను పోషిస్తున్నాడు. రఘోత్తమరెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొందిన అప్పారావు ఇంటి పంటను మొదలు పెట్టి విజయవంతంగా కొనసాగిస్తూ అనేకమందికి స్ఫూర్తిని కలిగిస్తున్నాడు.

పెంచుకుందాం… పంచుకుందాం…

అప్పారావు ఇంటి పంటను నిర్వహించడంతోపాటు ఇంటిపంటదారుల సంఖ్య పెరగటానికి విపరీతంగా కృషి చేస్తున్నాడు. ఇందుకుగాను వివిధ ప్రాంతాల నుంచి అరుదైన రకాల విత్తనాలను, మొక్కలను తెప్పించి తన ఇంటి పంటలో పెంపకం చేసి విత్తనాలను అభివృద్ధి చేసి భారతదేశం మొత్తం అడిగిన వారికి ఉచితంగా అంటే రవాణా ఖర్చులు కూడా తానే భరిస్తూ విత్తనాలను పంపిణీ చేస్తున్నాడు. తన దగ్గర విత్తనాలను తీసుకున్న వారు అవకాశం ఉంటే వారి దగ్గర ఉన్న విత్తనాలను అప్పారావు గారికి పంపిస్తుంటారు. వాటిని అప్పారావు గారు అవసరమయిన వారికి ఉచితంగా పంపిస్తుంటారు. ఈ విధంగా పెంచుకుందాం… పంచుకుందాం… అనే భావనతో ముందుకు సాగుతున్నారు.

Read More

ఇంటితోపాటు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వాలి

తల్లిదండ్రులు తమ ఆస్తులను తమ పిల్లలకు వారసత్వంగా అదించడం మన సాంప్రదాయం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎంత ఆస్తి ఉన్నా ఆరోగ్యం సక్రమంగా లేకుంటే ఉన్న ఆస్తిని ఆనందంగా అనుభవించలేరు. కాబట్టి ఆస్తి కన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడే ఆస్తి వలన ఉపయోగం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్లయితే మనం తినే ఆహారంలో ప్రత్యేకించి ఆకుకూరలు మరియు కూరగాయలలో విష రసాయన అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ సమస్యకు పరిష్కారంగా అవకాశం ఉన్నవారు ఇటిపంటను మొదలుపెట్టి తామే సొంతంగా కూరగాయలు, ఆకుకూరలతో పాటు కొన్ని రకాల పండ్లను పండించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలుగుతున్నారు. ఇలాంటి వారు తమ వారసులకు తమ ఇంటితోపాటు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని మిద్దెతోట నిపుణులు రఘోత్తమరెడ్డి అంటున్నారు. రఘోత్తమరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటి పంటలు చేసే వారందరికి సుపరిచితమైన పేరు రఘోత్తమరెడ్డి. 

వారసులకు మిద్దెతోటను వారసత్వంగా ఇవ్వాలనుకునేవారు మిద్దెమీద ఇటుకలతో మడులు నిర్మించుకోవాలి. అవి రెండు మూడు తరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. సాధారణంగా నలుగురు కుటుంబ సభ్యులు ఉండే ఒక కుటుంబానికి ఒకరోజుకు అవసరమయిన కూరగాయలు పొందాలంటే 16 చదరపు అడుగుల మడి సరిపోతుంది. అంటే 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఇటుకలతో మడి నిర్మించుకుంటే అందులో బెండ, టమాట లాంటి మొక్కలు 16 వరకు పెంచవచ్చు. ఈ 16 మొక్కలనుంచి ఒక కుటుంబానికి ఒక రోజుకి అవసరమైన కూరగాయలు పొందవచ్చు. లోతు విషయానికొస్తే కూరగాయల పెంపకానికి ఒక అడుగు లోతు మరియు పండ్ల మొక్కల పెంపకానికి రెండు లేదా మూడు అడుగుల లోతు మడులను నిర్మించుకుంటే అనుకూలంగా ఉంటుంది. ప్రతి రెండు మడుల తరువాత మూడవ మడి పండ్ల మొక్కల పెంపకంకుగాను ఎక్కువ లోతు గల మడి నిర్మించుకుని అందులో పండ్ల మొక్కలు పెంచుకుంటే వేసవికాలంలో నీడ ఏర్పడి కూరగాయలు, ఆకుకూరలు బాగా ఎదగడానికి అవకాశం ఉండటంతో పాటు, మిద్దెతోటలో చల్లదనం కూడా ఉంటుంది కాబట్టి వేసవికాలంలో వేడి నుంచి ఉపశమనం కోసం ప్రతి మూడవ మడి పండ్లమొక్కలకు కేటాయించాలి. 

మట్టి మిశ్రమంగా నల్లమట్టి, ఎర్రమట్టిలలో ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించుకోవచ్చు. ఎరువుగా బాగా మాగిన గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకల ఎరువులలో ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించవచ్చు. రెండు వంతుల మట్టి ఒక వంతు బాగా మాగిన ఎరువును ఉపయోగించి విత్తనాలను నాటుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి మట్టి మొత్తాన్ని బాగా ఎండబెట్టినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇందుకుగాను మిద్దెతోటలో 30 శాతం దిగుబడితోను, 30 శాతం ఖాళీగా, 30 శాతం విత్తనాలను నాటినవిగా ప్రణాళిక వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది. విత్తనాల గురించి కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా నాటు విత్తనాల కొరకు ప్రయత్నించి అవి దొరకనట్లయితే సంకర జాతి విత్తనాలను కూడా వేసుకుని ఆ దిగుబడి నుండి మరలా మనము విత్తనాలను సేకరించినట్లయితే కొన్ని రోజులకు అవి నాటు విత్తనాలుగా రూపాంతరం చెందుతాయని రఘోత్తమరెడ్డి వివరిస్తున్నాడు.

చీడపీడల గురించి కూడా పెద్దగా ఇబ్బందులు పడనవసరం లేదు. మొక్కలో రోగనిరోధక శక్తి తగినంత ఉన్నట్లయితే ఆ మొక్కలను  చీడపీడలు అశించవు. పోషకాలు సక్రమంగా గల బాగా మాగిన పశువుల ఎరువు అందించి మంచి విత్తనాన్ని నాటినట్లయితే పెరిగే మొక్క తప్పనిసరిగా రోగనిరోధక శక్తితో పెరుగుతుంది. కాబట్టి అలాంటి మొక్కలకు చీడపీడలు ఆశించవు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పేను లాంటి చీడలు ఆశించిననట్లయితే పేను ఆశించిన ఆకులను తీసివేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

మొక్కలకు అందించే నీటి విషయంలో ఇంటి పంటదారులు తప్పనిసరిగా కామన్‌సెన్స్‌తో ఆలోచించాలి. మొక్కలకు నీరు అవసరం లేదు. కేవలం తేమ మాత్రమే అవసరం ఉంటుంది కాబట్టి మట్టిలోని తేమను గమనిస్తూ నీటిని అందించాలి. ఎక్కువ నీటిని అందించకుండా తగినంత నీటిని మాత్రమే అందించాలి. కాలాన్ని బట్టి నీటిని అందించవలసి ఉంటుంది. అన్ని కాలాలలో ఒకే రకమైన నీటి అవసరం ఉండదు. వివిధ కాలాలకు వివిధ రకాల నీటి అవసరాలు ఉంటాయి కాబట్టి కామన్‌సెన్స్‌ ఉపయోగించి నీటిని అందించవలసి ఉంటుంది.

దోసెడు మట్టి, పిడికెడు ఎరువు, ఒక విత్తనం ఉంటే మిద్దెతోటను ప్రారంభించవచ్చు. ఇటుకలతో మడులు కట్టుకోవడానికి ఇబ్బందులు పడేవారు ఫైబరు టబ్బులను కూడా కొనుగోలు చేసుకుని మిద్దెతోటను ప్రారంభించవచ్చు.

ఇవేమి లేకున్నా కాని సంకల్పం ఉండాలే కాని గ్రోబ్యాగ్స్‌ లేదా ఖాళీ సిమెంటు సంచులతో కూడా మిద్దెతోటను ప్రారంభించవచ్చు. తక్కువ ఖర్చుతో మిద్దెతోటను ప్రారంభించి అనుభవం గడించిన తరువాత శాశ్వత టబ్బులు లేదా శాశ్వత మడులకు మారినట్లయితే ఫలితాలు బాగా ఉంటాయి. ఏది ఏమయినా కాని మన తరువాత తరం వారు ఆరోగ్యంగా, ఆనందంగా మన ఆస్తిని అనుభవించాలంటే ఆస్తితోపాటు మిద్దెతోటను వారసత్వంగా అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని రఘోత్తమరెడ్డి గట్టిగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు 90001 84107 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

ఆహ్లాదకర వాతావరణానికి మిద్దెతోట సరైనదారి

మన ఆరోగ్యాన్ని కాపాడుటలో మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, శారీరక శ్రమ, మన మానసిక పరిస్థితి, ప్రకృతితో మమేకమవడం లాంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కాని ప్రస్తుత కాంక్రీట్‌ జంగిల్స్‌ మరియు ఉరుకుల పరుగుల జీవితాలలో ఇవన్నీ అందుబాటులో దొరకడము చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ అందుబాటులో లేకపోవడముతో చాలామంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి తమతమ ఆరోగ్యాలను సంరక్షించుకోవాలనుకునే వారందరూ తమకు అవకాశం ఉన్నంతలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు అందుబాటులోకి వచ్చిన మార్గమే ఇంటిపంట. ఇంటి పంట వలన రసాయనాలు లేని కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లను పొందడముతో పాటు పచ్చదనం వలన వాతావరణ కాలుష్యం తగ్గటంతో పాటు ఇంటి పంట వలన శారీరక శ్రమకు అవకాశం కుదురుతుంది కాబట్టి ఆహ్లాదకర వాతావరణానికి ఇంటి పంట సరైనదారి అని నమ్మి ఇంటిపంటను ఇప్పటి వరకు చేపట్టిన వారు, ఇంకా చేపట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.  ఆరోగ్యకర ఆహారాన్ని పొందడముతో పాటు యోగా చేసుకోవటానికి, తనకిష్టమైన సంగీతాన్ని పచ్చని మొక్కల మధ్య ఆస్వాదించటానికి సరైన దారి ఇంటిపంట అని గ్రహించి విజయవాడ, పటమట ప్రాంతానికి చెందిన భారతిదేవి మిద్దెతోటను మొదలు పెట్టారు.

భారతీదేవి కాస్మొటాలజిస్ట్‌. వీరికి చిన్నతనం నుంచి పచ్చదనం, సంగీతం, యోగాల మీద మక్కువ చాలా ఎక్కువ. తన వృత్తిలో తీరిక లేకుండా ఉండే భారతీదేవి తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకుంటూ కాస్మొటాలజిస్ట్‌గా తన వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ సంగీతానికి, యోగాకి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. వాటితోపాటు ఇంటి పంటపై కూడా మక్కువ ఉంది కాబట్టి కొంత సమయాన్ని కేటాయించి తమ మిద్దె మీద కొన్ని రకాల మొక్కల పెంపకం చేపట్టి కొనసాగిస్తున్న పరిస్థితులలో కరోనా రావడం జరిగింది. కరోనా సమయంలో ఎక్కువ సమయం ఇంటి వద్దనే గడపవలసి రావడముతో ఆ సమయాన్ని తమ మిద్దె తోటలోని మొక్కల సంఖ్యను పెంచటానికి కేటాయించి మిద్దెతోటను అభివృద్ధి చేశారు.

మిద్దెమీద మొక్కల పెంపకం చేస్తున్నారు కాబట్టి స్లాబుమీద నీరుపడి స్లాబు పాడవకుండా ఉండటానికి వీలుగా స్లాబుకు వాటర్‌ ఫ్రూప్‌ కోటింగ్‌ను వేయించడంతో పాటు స్టాండులు ఏర్పాటు చేసుకుని స్లాండులపై కుండీలు, టబ్బులు, డ్రమ్ములు లాంటివి ఏర్పాటు చేసుకుని వాటిలో మొక్కల పెంపకం చేస్తున్నారు. అన్ని రకాల మొక్కలకు ఒకే రకమైన కంటెయినర్లు ఉపయోగించకుండా మొక్కల రకాలను బట్టి కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. ఆకుకూరలకు వెడల్పు మూతి ఉండే టబ్బులను, పండ్ల మొక్కల పెంపకానికి డ్రమ్ములను, కూరగాయలకు బక్కెట్లను…. ఈ విధంగా మొక్కల రకాన్ని బట్టి అందుకు అనుకూలంగా ఉండే కంటెయినర్లను ఎంపిక చేసుకున్నారు. మట్టి మిశ్రమంలో మట్టి, ఎరువు, వేపపిండి, ఇసుక లాంటి వాటిని కలుపుకున్నారు. మట్టి మిశ్రమములో కోకోపిట్‌ను ఉపయోగించలేదు. ఈ మట్టి మిశ్రమము మూడు నెలల వరకు మొక్కలకు పోషకాలను అందిస్తుంది. కాబట్టి మూడునెలల తరువాత మరలా అవసరమైన మట్టి మిశ్రమాన్ని అందిస్తుంటారు. కంటెయినర్లలోని మట్టి గట్టిపడినట్లయితే మొక్క పెరగదు కాబట్టి మట్టి గట్టిపడకుండా ఉండేందుకు గాను క్రమం తప్పకుండా మట్టిని కలుపుతూ మట్టి గుల్లగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇంట్లో వృథాగా పడి ఉండే ప్లాస్టిక్‌ బక్కెట్లు మరియు ఇతర సామాగ్రిని కూడా కంటెయినర్లగా ఉపయోగిస్తూ&వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.

వీరి మిద్దెతోటలో చింతచిగురు కోసం చింత, సపోట, జామ, అంజీర, డ్రాగన్‌ఫ్రూట్‌, దానిమ్మ, అరటి, ఉసిరి, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి మొదలగు మొక్కలతో పాటు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఆల్‌స్సైసెస్‌ మొక్క, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, బీర సొర, కాకర లాంటి తీగజాతి కూరగాయల మొక్కలను కూడా ఆయా మొక్కలకు అనుకూలమైన కంటెయినర్లలో పెంచుతున్నారు. వీటితో పాటు కొన్ని రకాలను పాలినేషను కొరకు, మిద్దెతోట అందంగా కనిపించేందుకుగాను పెంచుతున్నారు. వేసవి కాలంలో మొక్కల పాదులలో కొబ్బరి పీచు లేదా ఎండు ఆకులను ఏర్పాటు చేయడం వలన ప్రయోజనం బాగా ఉంటుందని ఆవిధంగా చేస్తున్నారు. వేసవి కాబట్టి పిచ్చుకలకు, పకక్షులకు తాగేందుకు నీటిని కూడా మొక్కల నీడలో ఏర్పాటు చేయడం వలన వివిధ రకాల పకక్షులు వీరి మిద్దెతోటలో కనిపిస్తుంటాయి.

వీరికి సంగీతంపై మక్కువ ఎక్కువ కాబట్టి ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో వీణవాయించటానికి కేటాయిస్తారు. మిద్దెతోటలో వీణ వాయించటముంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వీణవాయించటం వలన పొందే తృప్తితో పాటు మిద్దెతోటలోని మొక్కలకు కూడా ప్రతిరోజు సంగీతాన్ని వినిపిస్తున్నారు. అంతేకాకుండా తాను చిన్నతనం నుంచి యోగా చేస్తుంటారు. ఇప్పుడు మిద్దెతోటలో యోగా చేయడం వలన ఫలితాలు ఇంకా ఆశాజనకంగా ఉంటున్నాయని భారతీదేవి అంటున్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని మిద్దెతోటలో గడపడం వలన శారీరక శ్రమకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు.

తమ ఇంట్లో తమ చేతులతో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా మంచి రుచిగా ఉంటాయని, కూరగాయలు, ఆకుకూరలు త్వరగా ఉడుకుతాయని, తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మిద్దెతోటలో ఉసిరి, చింత లాంటి విటమిన్లు అందుబాటులో ఉండే మొక్కలను పెంచి వాటిని ఆహారంగా తీసుకున్నట్లయితే మన శరీరానికి కావలసిన విటమిన్లు సహజ సిద్ధంగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి మిద్దెతోట వలన అందరికీ ప్రత్యేకించి స్త్రీలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు  ఉంటాయి కాబట్టి అందరు ఇంటి పంటను తప్పని సరిగా చేపట్టాలని భారతీదేవి కోరుతున్నారు. కొత్తగా ఇంటి పంటను చేపట్టే వారు మొదటలో ఆకుకూరలతో మొదలుపెడితే ఫలితాలు బాగుంటాయనే సూచనను ఇంటిపంటను మొదలు పెట్టేవారికి ఇస్తున్నారు.   

  – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More