తాటిచెట్టు దాదాపు 20-30 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక చెట్టు. ఆకులు మాను చివర గుంపుగా, పొడవైన మట్టలతో వర్తులాకారంలో ఏర్పడతాయి. మట్టల అంచులు నల్లని రంపం వలే ఉంటాయి. ఆడ, మగ పూలు గెలల వలె వేర్వేరు చెట్లపై ఏర్పడతాయి. కాయలు గుండ్రంగా, తియ్యని ముంజెలు కలిగి ఉంటాయి. పండిన కాయలు ఎరుపు రంగు గుజ్ౙుతో నిండిన పీచుగల టెంకలు కలిగి ఉంటాయి. ఈ టెంకల నుండి తేగలు వస్తాయి. ఈ చెట్టుని టెంకల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.
సాధారణ నామం : టాడీ పామ్, పామైరా పామ్ శాస్త్రీయ నామం : బొరాసెస్‌ఫ్లాబెల్లిఫర్ కుటుంబం: ఆరికేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
తాటి ఆకులు, వేర్లు, పండ్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. పండ్లలో ఇనుము, ప్రోటీన్లు, సుక్రోస్, గ్లూకోస్, బూడిద, థయమిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ సి, పీచు పదార్థం ఉంటాయి.
తాటి చెట్టు శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధుల నివారణకు, సులువుగా మూత్ర విసర్జనకు ఉపయోగపడుతుంది. తాటి ఆకులపై ముక్కు పొడుం రంగులో వచ్చే దూది వంటి నూగును దెబ్బల వల్ల కలిగే గాయాలకు కడితే రక్తస్రావాన్ని ఆపుతుంది.
మధుమేహ వ్యాధికి, నొప్పి లేని పుండ్లకి, చర్మవ్యాధులకు, విషానికి విరుగుడుగా ఉపయోగపడుతుంది. కొద్దిగా పులిసిన ద్రవం (నీరా) మూత్రాన్ని సులువుగా జారీ చేయుటకు, విరేచన కారిగా పనిచేస్తుంది.
వ్యవసాయరంగంలో …
తాటి చెట్టు తాజారసాన్ని కంబోడియాలో ఆహారధాన్యాలకు బదులుగా ఆహారంగా పందులకు, కోళ్ళకు ఇస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో తాటి చెట్టు ఆకులను ఇళ్ళు, దడుల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
తాటి చెట్ల కాండాన్ని కలపగా ఉపయోగిస్తారు. కొయ్యని ఇళ్ళ నిర్మాణంలో ఉపయోగిస్తారు (కియుబోరిన్, 1998)*
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
దీనిని ఈక్విసెటమ్ ఎవెన్స్ అనే హెర్బ్ కషాయం నుండి తయారు చేస్తారు. అతి బలమైన లేదా అతి బలహీనమైన చంద్రుని శక్తులనుండి నీటి అందుబాటుని క్రమబద్ధీకరించడానికి దీనినుపయోగిస్తారు. అంటే ఈక్విసెటమ్ చంద్రుని శక్తులు అతి బలంగా ఉన్నప్పుడు వాటిని తగ్గించి, అతి బలహీనంగా వున్నప్పుడు వాటిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది పులిసిన రూపంలో భూమిలోని ఉపయోగకర శిలీంద్రాల పెరుగుదలను ప్రోత్సహించి, మొక్కలపై తాజా కషాయంగా పిచికారి చేసినప్పుడు హానికర శిలీంద్రాలను తగ్గిస్తుంది.
ANGRAU – DAATTC MOBILE APP – రైతులు, వ్యవసాయ అధికారులు, విద్యార్థులు మరియు శాస్త్రవేత్తలు పంటల సాగు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, తెగుళ్లు – పురుగుల నివారణ, పోషక యాజమాన్యం, వాతావరణ ఆధారిత సూచనలు మరియు విశ్వవిద్యాలయం అందించే తాజా సాంకేతిక వేదిక.
పరిచయం: వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని సకాలంలో అందించడం అత్యంత అవసరం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొనిఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Acharya N.G. Ranga Agricultural University – ANGRAU) పరిధిలోని District Agricultural Advisory and Transfer of Technology Centre (DAATTC) ఆధ్వర్యంలో ANGRAU DAATTC App అభివృద్ధి చేయబడింది. ఈ యాప్ ను డా.పి.బి. ప్రదీప్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త (Transfer of Technology) & కోఆర్డినేటర్, DAATTC, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా రూపొందించారు. ఈ మొబైల్ యాప్ రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు, విస్తరణ సిబ్బంది మరియు వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక సమగ్ర డిజిటల్ సమాచార వేదికగా పనిచేస్తుంది. వ్యవసాయానికి సంబంధించిన తాజా సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సిఫార్సులు మరియు విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యవసాయ సాంకేతికతలను రైతులకు సులభంగా చేరవేయడం ఈ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ యాప్ లో పంటల వారీగా శాస్త్రీయ సాగు విధానాలు, అధిక దిగుబడి ఇచ్చే రకాలు, విత్తనాల ఎంపిక, భూమి తయారీ, విత్తే సమయం, విత్తన మోతాదు, నాటే దూరం, ఎరువుల యాజమాన్యం, సూక్ష్మ పోషకాల వినియోగం, నీటి యాజమాన్యం, కలుపు నియంత్రణ, సమగ్ర పురుగుల మరియు తెగుళ్ల నివారణ పద్ధతులు వంటి అనేక అంశాలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. రైతులు తమ పంటలకు సంబంధించిన సమస్యలకు తక్షణమే శాస్త్రీయ పరిష్కారాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
వ్యవసాయంలో వాతావరణ మార్పులు ప్రధాన ప్రభావం చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఎంతో అవసరం. ఈ యాప్ ద్వారా పంటల వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్షాభావం లేదా అధిక వర్షాల సమయంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటలను రక్షించుకునే మార్గాలు వంటి విలువైన సూచనలు అందించబడతాయి. దీని ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
ANGRAU DAATTC_App ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పూర్తిగా ANGRAU శాస్త్రవేత్తల పరిశోధనలు మరియు అధికారిక సమాచారం సిఫార్సుల ఆధారంగా రూపొందించబడింది. అందువల్ల రైతులకు విశ్వసనీయమైన, శాస్త్రీయమైన మరియు ప్రామాణికమైన సమాచారం అందుతుంది. అదనంగా రైతుల శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ ప్రదర్శనలు, సాంకేతిక వీడియోలు, ప్రచురణలు మరియు ఇతర అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
ఈ యాప్ కేవలం రైతులకు మాత్రమే కాకుండా వ్యవసాయ విస్తరణ అధికారులకు, రైతు సేవా కేంద్రాల (RSKs)సిబ్బందికి, కృషి విజ్ఞాన కేంద్రాల (KVKs)శాస్త్రవేత్తలకు, వ్యవసాయ పాలిటెక్నిక్ మరియు వ్యవసాయ కళాశాల విద్యార్థులకు కూడా ఒక ఉపయోగకరమైన డిజిటల్ రిఫరెన్స్ వేదికగా ఉపయోగపడుతుంది. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో, రైతు సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు మరియు సాంకేతిక సలహాలు అందించే సందర్భాల్లో ఈ యాప్ సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది.
ఈ యాప్ యొక్క మరో ముఖ్యమైన విశేషం తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో సులభమైన వినియోగాన్ని అందించడం. గ్రామీణ ప్రాంత రైతులు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా సరళమైన రూపకల్పన (User-Friendly Interface) కలిగి ఉండటం వల్ల ప్రతి రైతు తన మొబైల్లోనే వ్యవసాయ సమాచారాన్ని పొందగలుగుతున్నాడు. దీంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం నేరుగా రైతుల చేతికి చేరుతుంది.
డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు శాస్త్రీయ సమాచారం, సకాలంలో వ్యవసాయ సూచనలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకే వేదికలో అందించే ANGRAU DAATTC Appనేటి వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగకరమైన మొబైల్ అప్లికేషన్ గా నిలుస్తుంది. రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత వృద్ధి, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి మరియు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల విస్తరణలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రధాన ప్రయోజనాలు: • రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని వేగంగా అందిస్తుంది. పంటల వారీగా సమగ్ర సాగు యాజమాన్య సమాచారాన్ని అందిస్తుంది. • పురుగులు, తెగుళ్లు మరియు పోషక లోపాల నివారణకు నిపుణుల సూచనలు అందిస్తుంది. • వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు విద్యార్థులకు ఉపయోగకరమైన డిజిటల్ రిఫరెన్ గా పనిచేస్తుంది. • శిక్షణ కార్యక్రమాలు మరియు వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు తోడ్పడుతుంది. డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతులను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తుంది.
ముగింపు: ANGRAU DAATTC App అనేది కేవలం ఒక మొబైల్ యాప్ మాత్రమే కాదు, రైతులకు శాస్త్రీయ వ్యవసాయ జ్ఞానాన్ని అందించే డిజిటల్ విజ్ఞాన వేదిక. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను రైతులకు చేరవేసి, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, లాభదాయకత మరియు సుస్థిర అభివృద్ధికి తోడ్పడే ఒక వినూత్న ప్రయత్నంగా ఈ యాప్ నిలుస్తోంది. ప్రతి రైతు, వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్త మరియు వ్యవసాయ విద్యార్థి తమ మొబైల్లో ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా నాణ్యమైన వ్యవసాయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చును.
డా. పి. బి. ప్రదీప్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త &కోఆర్డినేటర్ ఏరువాక కేంద్రం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా – 531024 డా.డి.ఆదిలక్ష్మీ, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ph: 9550506498 ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా– 531111
పాడిపశువులలో అధిక పాల ఉత్పత్తితో పాటు పునరుత్పత్తి సామర్ధ్యం కూడా రైతులకి ఆదాయాన్ని చేకూరుస్తుంది. లాభదాయకమైన పాల ఉత్పత్తికి మరియు మంచి సంతానోత్పత్తికి సమతుల్య పోషకాహారం అత్యంత అవసరం. పశువుల ఆహారంలో ఖనిజ లవణాల లోపం ఏర్పడితే అవి సకాలంలో ఎదకు రాకపోవడం, పదే పదే పొర్లడం, గర్భధారణ శాతం తగ్గడం, గర్భస్రావాలు మరియు మాయ పడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పచ్చిమేత, పొడిమేత మాత్రమే సరిపోవు, సమతుల్య మోతాదులలో ఖనిజలవణాలు అందించినప్పుడే పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పునరుత్పత్తి లో ఖనిజాలవణాల ప్రాముఖ్యత : ఖనిజలవణాలు శరీరం పెరుగుదల, ఎముకల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి మరియు పునరుత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఖనిజలవణాలు రెండు రకాలుగా ఉంటాయి.
స్థూల ఖనిజాలు: కాల్షియమ్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సల్ఫర్.
సూక్ష్మ ఖనిజాలు: జింక్, కాపర్, సెలీనియం, మాంగనీస్, కోబాల్ట్, అయోడిన్, ఇనుము.
పశువుల దాణాలో కాల్షియమ్ మరియు ఫాస్ఫరస్ నిష్పత్తి 2:1 ఉండేలా చూసుకోవాలి. వీటి లోపం వలన అండాల ఉత్పత్తి తగ్గుతుంది. కాల్షియమ్ మరియు ఫాస్ఫరస్ పశువులు సకాలంలో ఎదకు రావడానికి సహాయపడుతాయి.
కాల్షియమ్: పశువుల గర్భాశయ కండరాల పనితీరుని మెరుగు పర్చడంలో, ప్రసవ ప్రక్రియను సులభతరం చేయడంలో మరియు ప్రసవానంతరం గర్భాశయం సాధారణస్థితికి రావడంలో కాల్షియమ్ ముఖ్యపాత్ర వహిస్తుంది. కాల్షియమ్ లోపించడం వలన పశువులకు పాల జ్వరం, మాయపడకపోవడం, గర్భాశయ బలహీనత వంటి సమస్యలు వస్తాయి.
ఫాస్ఫరస్: పశువు ఎదకు సకాలంలో రావడంలో మరియు అండాశయాల పనితీరుని మెరుగుపరచడంలోముఖ్యపాత్ర పోషిస్తుంది. గర్భధారణ శాతాన్ని పెంచుతుంది. ఫాస్ఫరస్ లోపించడం వలన మూగ ఎద, ఎదకు రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
జింక్: అండాశయంలో ఆరోగ్యకరమైన అండాలు ఏర్పడేందుకు తోడ్పడుతుంది. ప్రసవం తరువాత గర్భాశయం త్వరగా సాధారణస్థితికి రావడానికి సహాయపడుతుంది. ప్రసవం అనంతరం గర్భాశయ సమస్యలు నివారించి, త్వరగా గర్భం దాల్చేందుకు సహాయపడుతుంది.
రాగి (కాపర్): పునరుత్పత్తి హార్మోన్ల పనితీరుని మెరుగుపరిచి పశువులు త్వరగా గర్భం దాల్చేందుకు తోడ్పడుతుంది. రోగనిరోధకశక్తిని పెంచి ప్రసవానంతరం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రాగి లోపం వలన గర్భస్రావం, మూగ ఎద వంటి సమస్యలు ఏర్పడుతాయి. మాంగనీస్: అండం విడుదల సక్రమంగా జరిగేలా చేసి, గర్భం నిలదొక్కుకోవడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది. పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది. మాంగనీస్ లోపం వలన గర్భధారణ శాతం తగ్గుతుంది.
అయోడిన్: శరీర జీవక్రియలను నియంత్రించే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. పిండం మెదడు ఎదుగుదలకు మరియు శరీర అభివృద్ధికి సహాయపడడంలో అయోడిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయోడిన్ లోపం వలన బలహీనమైన దూడలు లేదా చనిపోయిన దూడలు పుట్టే ప్రమాదం ఉంటుంది.
సెలీనియం: విటమిన్ -ఈ తో కలిసి పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈనిన తరువాత మాయ ఆలస్యంగా పడడం వంటి సమస్యలు నివారించి, పశువుల పునరుత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. గర్భాశయ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో, దూడలు ఆరోగ్యంగా పుట్టడంలో తోడ్పడుతుంది. కోబాల్ట్ : కోబాల్ట్ చాల తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ రుమేన్ సూక్ష్మజీవుల ద్వారా విటమిన్ బి12 తయారీ, శరీర జీవక్రియ, మంచి శారీరకస్థితి మరియు పునరుత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో అత్యంత ముఖ్యమైన ఖనిజలవణం.
ఐరన్: ఇనుము (ఐరన్) లోపం వలన ఆకలి తగ్గడం సంభవించవచ్చు. రక్తహీనత మరియు శరీర పోషక స్థితి క్షీణించడం వల్ల ప్రజనన ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఇనుము లోపం కారణంగా పశువులు పదే పదే పొర్లడం, ఒక్క గర్భధారణ కోసం ఎక్కువసార్లు సంయోగం అవసరమవడం, గర్భస్రావాలు సంభవించడం జరుగుతుంది.
ఖనిజాలవణాల లోపాల నివారణ చర్యలు :
సమతుల్యమైన దాణా అందించాలి: పశువుల వయస్సు, పాల ఉత్పత్తి మరియు గర్భధారణ దశను బట్టి సమతుల్యమైన ధాణాని ఇవ్వాలి.
ప్రతి రోజు తగిన మోతాదులో ఖనిజాలవణాల మిశ్రమం తప్పనిసరిగా ఇవ్వాలి.
పశువుల కొట్టంలో ఎల్లప్పుడూ మినరల్ మిక్స్ బ్రిక్స్ ను అందుబాటులో ఉంచాలి.
పోషకవిలువలు అధికంగా ఉన్న నాణ్యమైన మేతను అందించాలి. బూజు పట్టిన లేదా నాసిరకం మేతను ఇవ్వకూడదు.
తగినంత శుభ్రమైన త్రాగు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. 6.గర్భం ధరించిన మరియు అధిక పాలిచ్చే పశువులకు ప్రత్యేక పోషణను అందించాలి.
పునరుత్పత్తి సమస్యలు పశువులలో గమనించినప్పుడు వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు పశువులకు ఇవ్వడం వలన ఖనిజాలవణాల శోషణ పెరుగుతుంది.
ముగింపు : పాడిపశువుల సంతానోత్పతి విజయవంతంగా ఉండాలంటే సమతుల్య పోషకాహారంతో పాటు ఖనిజలవణాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వలన పశువులలో పునరుత్పతి సమస్యలను అధిగమించవచ్చు. సమతుల్య పోషకాహారం, నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమం, మినరల్ మిక్స్ బ్రిక్స్ మరియు పశువైద్యుడి సూచనలు పాటించడం ద్వారా పశువులను ఆరోగ్యంగా ఉంచి రైతులు అధిక లాభాలు పొందవచ్చు.
రచయిత: డా సిహెచ్. ప్రజ్ఞ అసిస్టెంట్ ప్రొఫెసర్, పశు జన్యు శాస్ర మరియు ప్రజనన విభాగం పశువైద్యకళాశాల, కోరుట్ల. 9014639814
సాధారణ నామం : ఎర్రగలిజేరు శాస్త్రీయ నామం : బోయెర్‌హేలియా డిఫ్యూసా కుటుంబం: నిక్టాజినేసి
ప్రాకే కొమ్మలు ఎరుపు రంగులో ఉంటాయి. ఆకులు అసమానంగా ఉంటాయి. అండాకారంలో ఉండి అంచులు ఎగుడుదిగుడుగా ఉంటాయి. ఆకుకాడ 1 సెం.మీ. పొడవుంటుంది. పూలు 4 సెం.మీ. పొడవుండి, 4-10 పూవులు కలసి ఉంటాయి. కాప్సూల్ 3þ1 మి.మీ. పరిమాణంలో గద ఆకారంలో ఉంటుంది.
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
పురాతన కాలం నుండి పునర్నవను ఎపిలెప్పి, హిస్టీరియా, గాస్ట్రెåటిస్, జాండిస్, జ్వరం, ఆస్త్మా, డిసెంట్రి, డయేరియా వంటి సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తున్నారు. మూత్రనాళం ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది. కాలేయం బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.
శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం నుండి ద్రవాలను బయటకు పంపడానికి, శరీర సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. శరీర బరువు తగ్గించడానికి, సహజ యాజమాన్య పద్ధతిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్రవర్ధకం. జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం, ఆకుకూరగా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
అనేక అతిధి మొక్కలలో పునర్నవ ద్రావణం గ్లెåకోప్రోటీన్‌ని పిచికారి చేసినపుడు యాంటివైరల్ కారకాలు ఉత్పత్తి అయ్యాయి (అవస్థి, అతని అనుచరులు, 2013).
పరిపక్వత చెందిన మొక్కల ఎండబెట్టిన వేర్ల ద్రావణం లేదా దాని నుండి వేరు చేసిన గ్లెåకోప్రోటీన్‌ని పిచికారి చేసినపుడు పొగాకులో టొబాకో మొజాయిక్ వైరస్, టమాటలో కుకుంబర్ మొజాయిక్ వైరస్, టాబాకోమొజాయిక్ వైరస్‌లు, మెలన్‌లో కుకుంబర్ గ్రీన్‌మాటిల్ వైరస్, జనుములో సన్‌హెంప్ రొసెట్టెవైరస్, గాంఫ్రెనాగాబోసాలో గ్రాంఫెనా మొజాయిక్ వైరస్ ఆశించడాన్ని నివారించింది (అవస్థి, అతని అనుచరులు, 1984).
రెండు ఔషధ మొక్కలు పునర్నవ, సెంటెల్లా ఏసియాటిక కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ లార్వా దశలను, పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించాయి. ఈ రెండు మొక్కల గ్రాన్యూల్ పార్ములేషన్లు తయారు చేసి పరీక్షించినపుడు పురుగు లార్వాలను, పెద్ద పురుగులను గణనీయంగా చంపాయి. ఈ పురుగులని ఈ రెండు మొక్కలు సమర్ధవంతంగా నివారించగలవని రుజువైంది (బిందు, ఆమె అనుచరులు, 2016).
మొక్కల ఆకు పొడిని తయారు చేసే విధానం : పునర్నవ, సెంటెల్లా ఏసియాటిక ఆకులను డిస్టిల్డ్ వాటర్‌లో బాగా కడిగి ఆకులను నీడలో ఆరబెట్టి గ్రైండర్‌లో వేసి విడివిడిగా పొడిచేయాలి. దీనిని జల్లించి మెత్తని పొడిని గాజు పాత్రలలో నిల్వ చేయాలి.
గ్రాన్యులార్ ఫార్ములేషన్ తయారీ : మొక్కల ఆకుల పొడి, నూనె చెక్క, పొడి బరువు తూయాలి. డిస్టిల్డ్ వాటర్ కలిపి నూనె చెక్కపొడిని రెండు మొక్కల ఆకుల పొడులతో విడివిడిగా కలిపి గ్యాన్యూల్స్ రూపంలో ఫార్ములేషన్ తయారు చేయాలి. 15%, 20%, 25%, 30%, 35%, గ్రాన్యూల్ ఫార్ములేషన్లను (1.5 గ్రా, 2.0 గ్రా., 2.5 గ్రా., 3.0 గ్రా., 3.5 గ్రా. ఆకు పొడిని 8.5 గ్రా., 8.0 గ్రా., 7.5 గ్రా., 7.0. గ్రా., 6.5 గ్రా., నూనె చెక్కపొడితో కలిపి రెండు మొక్కల ఫార్ములేషన్లు) తయారు చేయాలి.
పునర్నవ మొక్కను ఇంటిలో వ్రేలాడదీస్తే పేలు వికర్షించపబడతాయి (డెల్ౙీల్, 1861).
పునర్నవ మొత్తం మొక్క ద్రావణం టమాట బాక్టీరియల్‌విల్ట్ కారకం రాల్‌స్టోనియా సొలనేసియారంపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (తువు, అతని అనుచరులు, 2017).
5 శాతం పునర్నవ వేరు కషాయం క్షేత్రస్థాయిలో బెండ ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్‌ని మొక్క దశ నుండి వారం రోజుల వ్యవధిలో పిచికారి చేయడం ద్వారా నివారించింది.
పంటలను అన్ని రకాల వైరస్, బాక్టీరియా తెగుళ్ళ నుండి పునర్నవ కషాయం కాపాడుతుంది.
5% పునర్నవ కషాయం తయారు చేసే పద్ధతి :
5 కి. పునర్నవ వేర్లు, కాడలు, ఆకులను 10 లీ. నీటిలో వేసి అరగంట నుండి గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన కషాయం 5 లీ. వరకు ఉంటుంది. దీనిని బాగా చల్లార్చి, వడపోసి 100 గ్రా. సబ్బు పొడి లేదా కుంకుడు కాయల రసం కలిపి తర్వాత 100 లీ. నీటిలో కలిపి ఎకరా పొలంలోని పంటపై పిచికారి చేయాలి.
ఎర్రగలిజేరు వేరు నీటి ద్రావణం పిచికారి పెసర, మినుము పంటలనాశించే మూంగ్‌బీన్ ఎల్లోమొజాయిక్ వైరస్, బీన్‌కామన్ మొజాయిక్ వైరస్ ఆశించచడాన్ని క్షేత్ర పరిస్థితులలో తగ్గించి గింజ దిగుబడులను పెంచింది (సింగ్, 2002, సింగ్ అండ్ అవస్థి, 2002).
దోస జాతి పంటలలో వారానికొకసారి ఎర్రగలిజేరు వేరు ద్రావణం పిచికారి చేసి, కుకుంబర్ మొజాయిక్ వైరస్, బాటిల్‌గార్డ్ మొజాయిక్ వైరస్, కుకుంబర్ గ్రీన్ మాటిల్‌మొజాయిక్ వైరస్, పంప్‌కిన్ మొజాయిక్ వైరస్‌లు ఆశించడం, వృద్ధి చెందడం, వ్యాప్తి చెందడాన్ని గణనీయంగా అరికట్టారు (అవస్థి అండ్ కుమార్ 2003 ఎ, 2003 బి, కుమార్ అండ్ అవస్థి, 2003ఎ, 2003బి).
కుకుంబర్ మొజాయిక్ తెగులు ఆశించడం, వ్యాపించడం ఎర్రగలిజేరు వేరు ద్రావణం పిచికారి ద్వారా అరికట్టబడింది (కుమార్ అండ్ అవస్థి, 2008).
టమాట పంటలో ఎర్రగలిజేరు వేరు ద్రావణంతో విత్తనశుద్ధి, పంటపై పిచికారి చేయడం ద్వారా వైరస్ తెగుళ్ళను నివారించారు (అవస్థి అండ్ యాదవ్, యాదవ్, అతని అనుచరులు)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
దీనిని భూమిలో నుండి తీసిన స్వచ్ఛమైన ఒక దినుసు శిల పటకాన్ని ఆవు కొమ్ములో నింపి సారవంతమైన నేలలో ఆకులు రాలు కాలం లేదా వసంత ఋతువులో పాతి పెట్టి తయారు చేస్తారు. ఒక గ్రాము కొమ్ము సిలికాను సరిపడా నీటిలో కలిపి ఒక గంట సేపు సవ్యదిశలో కలియత్రిప్పి పొలంలోని అన్నిపంటలు, పశుగ్రాసాలపై ఉదయం వేళ పిచికారి చేయాలి. కొమ్ము సిలికా భూమిలో సిలికాతో కలిపి పనిచేసి సూర్యకాంతి శక్తిని నేలకందిస్తుంది. ఇది కిరణజన్య సంయోగక్రియకు, భూమిలోనుండి ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు మొక్కల కందడానికి కూడా సహాయపడుతుంది. ఇది పంట ఉత్పత్తుల నాణ్యతను (పక్వదశ, తీపిదనం, రుచి, వాసన, నిల్వశక్తి, పీచు పరిమాణం) పెంచుతుంది. పశుగ్రాసాల రుచిని, హెర్బల్ మొక్కలలో నూనెలను, గింజలలో ప్రొటీన్ పరిమాణాన్ని పెంచుతుంది. కొమ్ము ఎరువు భూమిపై పిచికారి చేసిన తర్వాత కొమ్ము సిలికాని సంవత్సరానికి కనీసం రెండు సార్లు, వసంత ఋతువులో ఒకసారి, ఆకులు రాల్చే కాలంలో ఒకసారి పంటలపై పిచికారి చేయాలి. ఇది అసలైన బయోడైనమిక్ పంటపై చల్లే పిచికారి ద్రావణం.
దీనిని తాజా ఆవు పేడను చనిపోయిన ఆవు కొమ్ములలో నింపి సారవంతమైన భూమిలో ఆకురాలుకాలం నుండి వసంత రుతువు వరకు పాతిపెట్టి తయారుచేస్తారు. తయారయిన కొమ్ము ఎరువు శక్తివంతమైన భూమి చైతన్య కారకం. దీనిని భూమిలో కాల్షియం చురుకుదనాన్ని, సూర్యుని / జీవ శక్తులను భూమికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఈ శక్తులు విత్తనం మొలకెత్తడం, వేర్లు వృద్ధి చేయడం, మొక్క పెరగడంతోపాటు భూమిలో హ్యూమస్ ఏర్పడటానికి దోహదపడతాయి. కొమ్ము ఎరువును భూమి నిర్మాణానికి, భూమిలో ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు, వానపాములను పెంచుతాయి. ఎకరానికి 85 గ్రాముల కొమ్ము ఎరువుని సరిపడే నీటిలో కలిపి సవ్యదిశలో ఒక గంటసేపు కలిపి మధ్యాహ్నం తర్వాత భూమిపై సంవత్సరానికి కనీసం రెండుసార్లు వసంత ఋతువు, ఆకులు రాల్చే కాలంలో నీటి బిందువుల రూపంలో పిచికారి చేయాలి. కొమ్ము ఎరువు అసలైన బయోడైనమిక్ ఎరువు.
గ్రామీణ తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కూలీలు, మహిళా స్వయం సహాయక బృందాలు (Self Help Groups – SHGs) తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చే పశు సంపద కోసం అన్వేషిస్తున్న తరుణంలో ‘సీమ పందుల పెంపకం’ ఒక ఆశాజనకమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తోంది. దేశీయ (నాటు) పందులతో పోలిస్తే సీమ జాతులు వేగంగా బరువు పెరగడం, ఎక్కువ పిల్లలు ఈనడం (అధిక లిట్టర్ సైజు), తక్కువ మేతతో ఎక్కువ మాంసం ఉత్పత్తి చేయడం (మెరుగైన ఫీడ్ కన్వర్షన్ ఎఫిషియెన్సీ – FCE) వంటి లక్షణాలతో ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మాంసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భారత పశు గణాంకాల (Basic Animal Husbandry Statistics – BAHS 2025) ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే మాంస ఉత్పత్తి సుమారు 2.46 శాతం వృద్ధి చెందింది. అయితే, పంది జనాభా వృద్ధి రేటు గత రెండు దశాబ్దాలుగా మందగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను, ఆధునిక వ్యాధి నివారణ చర్యలను, ప్రభుత్వ తోడ్పాటును సమన్వయం చేసుకుంటే పందుల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే శక్తివంతమైన సాధనంగా మారగలదు.
సీమ మరియు సంకరీకరణ జాతుల పందులు మన దేశంలో సంప్రదాయకంగా పెంచే నాటు (దేశీయ) పందుల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా విదేశాల నుంచి తీసుకువచ్చి మన వాతావరణ పరిస్థితులకు అలవాటు చేసిన సీమ జాతులు (Exotic Breeds) అధిక ఉత్పాదకతను కలిగి ఉంటాయి. వీటిని దేశీయ పందులతో సంకరీకరణ చేసి, స్థానిక వాతావరణానికి అలవాటుపడే మేలుజాతి సంకర రకాలను (Crossbred Varieties) కూడా వివిధ రాష్ట్రాల పశువైద్య విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేశాయి.
ప్రధాన సీమ జాతులు
లార్జ్ వైట్ యార్క్‌షైర్ (Large White Yorkshire) — పూర్తి తెలుపు రంగు, మేని మీద ‘ఫ్రెకిల్స్’ అనే నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. ఒక్కో ఈతకు 11–12 పిల్లలు పుట్టే అధిక లిట్టర్ సైజు, మంచి మాతృత్వ లక్షణాలు దీని ప్రత్యేకత. మగ పంది 300–400 కిలోలు, ఆడ పంది 230–320 కిలోల వరకు బరువు పెరుగుతుంది.
ల్యాండ్‌రేస్ (Landrace) — పొడవైన శరీరం, తక్కువ కొవ్వు, అధిక మాంస దిగుబడినిచ్చే జాతి.
డ్యూరాక్ (Duroc) — ఎర్రటి రంగు, గట్టి శరీర నిర్మాణం, శీఘ్ర పెరుగుదల కలిగిన జాతి; సంకరీకరణకు మేలు జాతిగా వాడతారు.
హ్యాంప్‌షైర్ (Hampshire) — నాణ్యమైన మాంసం, చురుకైన స్వభావం కలిగిన జాతి.
తెలంగాణకు అనువైన సంకర జాతులు: పి.వి.నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం (PVNRTVU) ‘శిక్షణ’ పోర్టల్ ప్రకారం, తెలంగాణలో పెంపకానికి అనువైనవిగా ఈ కింది సంకర జాతులను గుర్తించారు
SVVU–T17 — శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం (SVVU), తిరుపతి అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్‌షైర్‌ను స్థానిక దేశీయ పందితో సంకరీకరణ చేసి 75% సీమ వారసత్వంతో రూపొందించారు. 8 నెలల వయసుకు సగటున 70–75 కిలోల బరువు, ఒక్కో ఈతకు 8–12 పిల్లలు లభిస్తాయి; ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, పేద రైతు కుటుంబాలకు జీవనోపాధి వనరుగా విస్తృతంగా వాడుతున్నారు (SVVU, 2021).
రాణి (Rani) — ఐ.సి.ఏ.ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం, గౌహతి 2016లో విడుదల చేసిన సంకర జాతి. సీమ జాతి హ్యాంప్‌షైర్‌ను ఈశాన్య భారత దేశీయ జాతి ఘుంగ్రూతో సమాన (50:50) వారసత్వంతో సంకరీకరణ చేశారు; ఆరు తరాలుగా జాతి లక్షణాలను స్థిరీకరించారు. 8 నెలల వధ వయసుకు సుమారు 75 కిలోల బరువు, 1.98 సెం.మీ. వెన్ను కొవ్వు మందం లభిస్తుంది; డ్యూరాక్‌తో సంకరీకరించి ‘ఆశ’ అనే మరో రకాన్ని కూడా అభివృద్ధి చేశారు (ICAR-NRCP, 2016).
TANUVAS KPM Gold — తమిళనాడు పశు వైద్య, జంతు శాస్త్రాల విశ్వవిద్యాలయం (TANUVAS) కింద పి.జి.ఆర్.ఐ.ఏ.ఎస్., కట్టుపాక్కంలో అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్‌షైర్ (75%)ను తమిళనాడు దేశీయ పందితో (25%) సంకరీకరణ చేసి 2017లో విడుదల చేశారు. అధిక వ్యాధి నిరోధకత, 3% లోపు పాలు మాన్పే వయసు మరణాల రేటు, ఒక్కో ఈతకు సగటున 8.1 పిల్లలు దీని ప్రత్యేకతలు; స్థానిక వాతావరణ పరిస్థితులకు బాగా అలవాటుపడింది (TANUVAS, 2017).
ఐ.సి.ఏ. ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం (ICAR-National Research Centre on Pig – ICAR-NRCP), గౌహతి ఈ సీమ, సంకర జాతులను దేశీయ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడంలో, రైతులకు మేలుజాతి కూనలను (piglets) సరఫరా చేయడంలో, శిక్షణలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
శాస్త్రీయ పెంపక యాజమాన్య పద్ధతులు గృహ నిర్మాణం (షెడ్ నిర్మాణం): పందుల షెడ్డు ఎత్తైన ప్రదేశంలో, మంచి గాలి, వెలుతురు ఉండేలా నిర్మించాలి. ఈనే పందులకు వేరుగా ఫారోయింగ్ పెన్‌లు, పిల్లల కోసం క్రీప్ ఏరియా, వ్యాధి సోకిన పందులను వేరుచేసేందుకు ఐసొలేషన్ పెన్ ఏర్పాటు చేసుకోవాలి. నేల సులభంగా కడగగలిగేలా సిమెంట్‌తో వాలుగా ఉండాలి, తద్వారా మురుగునీరు సులభంగా బయటకు పోతుంది.
సంతానోత్పత్తి యాజమాన్యం: ఆడ పందులకు 8 నెలల వయసు, సుమారు 90–100 కిలోల బరువు వచ్చాక మొదటిసారి సంతానోత్పత్తికి ఉపయోగించాలి. గర్భధారణ కాలం సగటున 114 రోజులు (3 నెలలు, 3 వారాలు, 3 రోజులు) ఉంటుంది. పిల్లలను 6–8 వారాల వయసులో పాలు మాన్పించడం (weaning) శాస్త్రీయ పద్ధతి. సంతానోత్పత్తికి రెండు వారాల ముందు ఆడ పందికి కొంచెం ఎక్కువ దాణా ఇవ్వడాన్ని ‘ఫ్లషింగ్’ (Flushing) అంటారు; ఇది రోజుకు 0.7–0.9 కిలోల బరువు పెరుగుదలను, మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
మేత యాజమాన్యం పందుల పెంపకంలో మొత్తం ఖర్చులో 70–75 శాతం మేత ఖర్చే ఉంటుంది. కాబట్టి వయసు, శరీర బరువును బట్టి శాస్త్రీయంగా మేత మార్చడం లాభదాయకతను నిర్ణయిస్తుంది.
దశలవారీ మాంసకృత్తుల (ప్రొటీన్) అవసరం దశ/ వయసు ప్రోటీన్ % శక్తి (ME, కిలో క్యాలరీలు/కిలో మేత) 2–5 కిలోల బరువు పిల్లలు 24% 3,500 5–15 కిలోల బరువు 22% 3,500 15–35 కిలోల బరువు (గ్రోయర్) 18% 3,300 35–90 కిలోల బరువు (ఫినిషర్) 14% 3,300 గర్భిణి ఆడ పందులు 14% 3250 పాలిచ్చే ఆడ పందులు 15% 3300 కోడె పందులు (boars) 14% 3250
క్రీప్ ఫీడ్ మరియు తొలిదశ మేత పుట్టిన 45 నిమిషాల్లోపే పిల్లలకు మొదటి పాలు (కొలొస్ట్రమ్) తాగించడం చాలా ముఖ్యం; ఇందులో వ్యాధి నిరోధక శక్తినిచ్చే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు), విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. 10వ రోజు నుంచి పాలు మాన్పించిన 2 వారాల వరకూ 18–20% ప్రొటీన్‌తో కూడిన క్రీప్ ఫీడ్ ఇవ్వాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమం కలిపి తయారుచేసే ఈ దాణా వల్ల మాన్పించే సమయంలో ఒత్తిడి తగ్గి, త్వరగా బరువు పెరుగుతాయి.
గ్రోయర్ మరియు ఫినిషర్ దాణా గ్రోయర్ దశలో మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమంతో కూడిన సమతుల్య దాణా ఇవ్వాలి. ఫినిషర్ దశలో మార్కెట్ బరువుకు తీసుకురావడానికి శక్తినిచ్చే దాణాతో పాటు నువ్వుల చెక్క వంటివి చేర్చవచ్చు.
పదార్థం పరిమాణం (100 కిలోల దాణాలో) మొక్కజొన్న 55 భాగాలు వేరుశనగ చెక్క 20 భాగాలు గోధుమ తవుడు 15 భాగాలు చేపల పొడి 8.5 భాగాలు ఖనిజ మిశ్రమం 1.5 భాగాలు ఉప్పు 0.5 భాగాలు ఈ మిశ్రమం ద్వారా మొత్తం 22% ప్రొటీన్ లభిస్తుంది.
గర్భిణి, పాలిచ్చే ఆడ పందుల మేత: గర్భిణి ఆడ పందికి రోజుకు 1.8–1.9 కిలోల దాణా ఇస్తే గరిష్ఠ జనన బరువు (Birth Weight), మాన్పే బరువు (Weaning weight) లభిస్తాయి. ఈనడానికి 4–5 రోజుల ముందు దాణాను సగానికి తగ్గించి, మలబద్ధకం రాకుండా గోధుమ తవుడు వంటి లఘువిరేచన పదార్థాలు చేర్చాలి. పాలిచ్చే ఆడ పందికి రోజుకు 3.5 కిలోల దాణాతో పాటు ప్రతి పిల్లకు అదనంగా 0.2 కిలోల చొప్పున, 14–23 లీటర్ల నీరు అవసరం.
నీటి అవసరం (రోజుకు): వర్గం నీరు (లీటర్లలో) కోడె పంది (boar) 45–50 ఈనే ఆడ పంది 18–22 పాలు మాన్పిన పిల్లలు 3.5–4 పాలిచ్చే ఆడ పంది 14–23
చౌక, స్థానిక మేత వనరులు దాణా ఖర్చు తగ్గించుకోవడానికి అజొల్ల, వరి తవుడు (75% వరకు), బ్రూవరీ వ్యర్థాలు (15% వరకు), అరటి వ్యర్థాలు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు, హోటల్ వంటగది వ్యర్థాలు వంటి స్థానిక వనరులను సమతుల్యంగా వాడుకోవచ్చు. అయితే, గార్బేజ్ ఫీడింగ్‌లో మాంసం ముక్కలను ఇవ్వకూడదు — ఇవి వ్యాధులను వ్యాప్తి చేయడంతో పాటు గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. పులిసిన లేదా నిల్వ ఉంచిన ఆహారాన్ని ఇస్తే సాల్మొనెల్లోసిస్ వంటి వ్యాధులు వచ్చి మరణాలకు దారితీయవచ్చు కాబట్టి ఉడికించిన వ్యర్థాలనే ఇవ్వాలి.
వ్యాధి వర్గం: బాక్టీరియా వ్యాధులు
ప్రధాన వ్యాధులు : బ్రూసెల్లోసిస్
ముఖ్య లక్షణాలు: గర్భస్రావం, వంధ్యత్వం
నివారణ / నియంత్రణ : సోకిన పందులను వేరుచేయాలి, పరీక్షలు నిర్వహించాలి. జూనోటిక్ వ్యాధి.
వ్యాధి : *లెప్టోస్పైరోసిస్
ముఖ్య లక్షణాలు: జ్వరం, విరేచనాలు, గర్భస్రావం
నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, ఎలుకల నియంత్రణ, అవసరమైన టీకాలు
వ్యాధి : స్వైన్ ఎరిసిపెలాస్
ముఖ్య లక్షణాలు: అధిక జ్వరం, చర్మంపై వజ్రాకార మచ్చలు
నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు, యాంటీబయోటిక్ చికిత్స
వ్యాధి : అట్రోఫిక్ రైనైటిస్, సాల్మొనెల్లోసిస్, పాశ్చురెల్లోసిస్
ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ సమస్యలు, విరేచనాలు
నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, బయోసెక్యూరిటీ, వెటర్నరీ చికిత్స
వైరస్ వ్యాధులు: *
వ్యాధి : క్లాసికల్ స్వైన్ ఫీవర్ (CSF)
ముఖ్య లక్షణాలు: జ్వరం, ఆకలి తగ్గడం, అధిక మరణాలు
నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు వేయాలి
వ్యాధి : ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF)
ముఖ్య లక్షణాలు: అకస్మిక మరణాలు, అధిక మరణాల రేటు
నివారణ / నియంత్రణ : ప్రస్తుతం సమర్థవంతమైన టీకా లేదు. కఠినమైన బయోసెక్యూరిటీ పాటించాలి.
వ్యాధి: ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD)
ముఖ్య లక్షణాలు: నోరు, కాళ్లపై బొబ్బలు
నివారణ / నియంత్రణ : టీకాలు, వ్యాధిగ్రస్త పందులను వేరుచేయాలి
వ్యాధి : స్వైన్ ఇన్‌ఫ్లుఎంజా
ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ, జీర్ణకోశ సమస్యలు
నివారణ / నియంత్రణ : మంచి నిర్వహణ, అవసరమైన టీకాలు
*పరాన్నజీవి వ్యాధులు *
వ్యాధి : సార్కాప్టిక్ మేంజ్
ముఖ్య లక్షణాలు: తీవ్రమైన దురద, చర్మ సమస్యలు
నివారణ / నియంత్రణ : ఐవర్‌మెక్టిన్ చికిత్స, పరిశుభ్రత
వ్యాధి : రౌండ్‌వార్మ్, విప్‌వార్మ్, కిడ్నీ వార్మ్, లంగ్ వార్మ్
ముఖ్య లక్షణాలు: ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం
నివారణ / నియంత్రణ : ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి
వ్యాధి : ట్రైకినోసిస్
ముఖ్య లక్షణాలు: జూనోటిక్ వ్యాధి
నివారణ / నియంత్రణ : పంది మాంసాన్ని పూర్తిగా ఉడికించి తీసుకోవాలి
జూనోటిక్ వ్యాధులపై జాగ్రత్తలు బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మొనెల్లోసిస్, ట్రైకినోసిస్ వంటి వ్యాధులు పందుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందువల్ల చేతి తొడుగులు ఉపయోగించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.
బయోసెక్యూరిటీ చర్యలు • కొత్తగా కొనుగోలు చేసిన పందులను 2–3 వారాలు క్వారంటైన్‌లో ఉంచాలి. • షెడ్డును, పరికరాలను, తాగునీటి పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రపరచి క్రిమిసంహారక మందులు ఉపయోగించాలి. • ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి. • టీకాల షెడ్యూల్‌ను తప్పకుండా పాటించాలి. • అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యుడిని సంప్రదించి, అనుమానాస్పద మరణాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
రైతులకు సూచన: “చికిత్స కంటే నివారణే ఉత్తమం.” పరిశుభ్రమైన నిర్వహణ, సమతుల్య పోషకాహారం, సమయానికి టీకాలు, క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయడం ద్వారా పందుల ఆరోగ్యాన్ని కాపాడి అధిక లాభాలు పొందవచ్చు.
ప్రభుత్వ పథకాలు — విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పందుల పెంపకాన్ని ఒక వ్యవస్థాపక అవకాశంగా ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నాయి.
జాతీయ పశు సంపద మిషన్ (National Livestock Mission – NLM)
పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ పథకంలోని వ్యవస్థాపకత అభివృద్ధి ఉప-పథకం (Entrepreneurship Development Sub-Mission) కింద, పందుల పెంపక క్షేత్రాల ఏర్పాటుకు షెడ్ నిర్మాణం (ఈనే పందుల షెడ్, కోడె పందుల యూనిట్, ఫారోయింగ్ పెన్), మేలుజాతి పిల్ల పందుల కొనుగోలు, పరికరాలు, బీమా, పశు వైద్య సహాయం వంటి అంశాలపై 50% వరకు మూలధన రాయితీ లభిస్తుంది. వ్యక్తులు, రైతు ఉత్పత్తి సంఘాలు (FPO), స్వయం సహాయక బృందాలు (SHG), రైతు సహకార సంస్థలు (FCO), ఉమ్మడి బాధ్యతా బృందాలు (JLG) ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముగింపు సీమ, సంకర జాతుల పందుల పెంపకం తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలం, తక్కువ కాలంలో ఎక్కువ రాబడినిచ్చే గ్రామీణ ఉపాధి మార్గంగా విస్తరిస్తోంది. అయితే, శాస్త్రీయ యాజమాన్యం, దశలవారీ సమతుల్య మేత, కచ్చితమైన టీకా కార్యక్రమం, కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలు పాటించకుండా చేపడితే — ముఖ్యంగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వంటి టీకా లేని వ్యాధుల నేపథ్యంలో — నష్టాలు తప్పవు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణ సదుపాయాలు, విశ్వవిద్యాలయాల విస్తరణ సేవలను సద్వినియోగం చేసుకుంటూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే, తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలు సీమ పందుల పెంపకం ద్వారా నిలకడైన ఆదాయాన్ని, నిజమైన ఆర్థిక సాధికారతను సాధించగలరు. ఇందుకు పశు విస్తరణ విద్య, క్షేత్రస్థాయి శిక్షణలు, పశు వైద్యుల మార్గదర్శకత్వం అనునిత్యం అందుబాటులో ఉండటం అత్యవసరం. . డా. ఎం. అరవింద్ (పీజీ స్కాలర్), పశువైద్య & పశుసంవర్థక శాఖ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, సెల్: 8499884669.
జాఫ్రా 4-5 మీ. ఎత్తు పెరిగే చిన్న చెట్టు. గులాబి రంగు పూలు కొమ్మల చివర్లో గుత్తులుగా ఏర్పడతాయి. ముదురు ఎరుపు రంగులో పండ్లు ముళ్ళతో నిండి, అండాకారంలో కొంచెం నొక్కినట్లు ఉంటాయి. గింజలు ముక్కోణాకారంతో ముదురు నారింజ రంగులో 3-4 మి.మీ. పరిమాణం కలిగి ఉంటాయి. ఇవి సామాన్యంగా ఫిబ్రవరి – మే మాసాల్లో లభిస్తాయి. దాదాపు 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు ఫలసాయం పొందవచ్చు.
సాధారణ నామం : అనాటో / సింధూర శాస్త్రీయ నామం : బిక్సా ఒరెల్లానా కుటుంబం: బిక్సేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
బెరడు, విత్తనాలు, గుజ్జు, ఆకులు, వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి.
గింజలలో “బిక్సిన్” అనే రసాయనముంటుంది.
గింజల గుజ్జులో రంగును కలుగచేసే కెరోటినాయిడ్ ఉంటుంది.
దీని బెరడును గనేరియా వ్యాధి, తరచూ వచ్చే జ్వరాల నివారణకు పయోగిస్తారు.
గింజల గుజ్జును బంక విరేచనాల నివారణకు ఉపయోగిస్తారు.
ఆకులను కామెర్ల వ్యాధి నివారణకు, పాముకాటుకు ఉపయోగిస్తారు.
వైద్యపరంగానే గాక గింజల నుండి తీసిన సహజ రంగును ఆహార పదార్థాలలో విరివిగా వాడతారు.
వ్యవసాయరంగంలో …
జాఫ్రా గింజల ద్రావణం శాండ్ ఫ్లై, లుట్జోమియా లాంగిపాల్పిస్ చావు శాతాన్ని పెంచింది. బలమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. (డిఆరియాస్, అతని అనుచరులు, 1992).
జాఫ్రా ఆకులు జీవపురుగు మందు సామర్థ్యం కలిగి ఉన్నాయి (కేల్, అతని అనుచరులు, 2012).
జాఫ్రా ఇథనాల్ ఆకు ద్రావణం గ్రామ్ పాజిటివ్ బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్య ప్రదర్శించింది.
జాఫ్రా గింజల ద్రావణం టిక్స్‌పై పురుగు వికర్షక, పారసైట్ నాశక, దోమవికర్షక చర్యలను ప్రదర్శించింది (డి బోయిర్, అతని అనుచరులు, 2010)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
పంట పెట్టడం ఒకెత్తయితే… అది ఆరోగ్యంగా ఎదిగేలా చూసుకోవడం ఒకెత్తు. మార్కెట్‌లో నూటారు పేర్లతో గ్రోత్ ప్రమోటర్లను అమ్ముతున్నారు. అయితే, వీటిని కొనకుండా కొద్దిపాటి శ్రమతో ఇంటి వద్దే పెద్ద ఖర్చేమీ లేకుండా తయారుచేసుకోవచ్చు. మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఆక్సిన్స్, జిబ్బరిల్లిన్ తదితరాలు ‘నర్రెంగ’ మొక్కలో దండిగా ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ‘అల్బీజీయా అమరా’. నర్రెంగ ఆకులను ఒక కిలో తీసుకొని, ఐదు లీటర్ల పుల్ల మజ్జిగలో వేసి, వారం రోజుల పాటు పులియబెట్టాలి. ఆ తరువాత వడకట్టి లీటర్ ద్రావణాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నర్రెంగ మొక్కలు దొరకకపోతే మరో మార్గం ఉంది. పచ్చి కొబ్బరిని రుబ్బి, పాలు తీయాలి. ఐదు లీటర్ల కొబ్బరి పాలకు ఐదు లీటర్ల మజ్జిగను చేర్చి… ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పోసుకొని పులియబెట్టుకోవాలి. వారం తరువాత ద్రావకాన్ని వడకట్టుకొని లీటరు ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ రెండు ద్రావణాలు పంటల ఎదుగుదలకే కాకుండా పూత, పిందె బాగా రావడానికి ఉపయోగపడతాయి.