సాధారణం కంటే తక్కువ వర్షపాతమే ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో (జూన్-సెప్టెంబరు) నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్‌లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. రానున్న ఏడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కీలక అంచనాలను ఐఎండీ శుక్రవారం వెలువరించింది. 1971 నుంచి 2020 వరకు సేకరించిన వర్షపాత గణాంకాల ఆధారంగా దీర్ఘకాలిక సగటు (ఎల్‌పిఏ)ను లెక్కిస్తారు. ఇది ప్రస్తుతం 87 సెంటీమీటర్లుగా ఉంది.
తాజా ఐఎండీ అంచనాల ప్రకారం.. జూన్-సెప్టెంబరు మధ్య ఈశాన్య భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతంతోనే సరి పెట్టుకోవాల్సి వస్తుంది. జూన్‌లో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం ఎల్పీఏలో 92 % కంటే తక్కువే నమోదవుతుంది. ఎల్పీఏలో 90% కంటే తక్కువ వర్షం కురవడాన్ని లోటు వర్షపాతంగా పరిగణిస్తారు. జూన్ ఎల్ నినో పరిస్థితులు బలహీనంగా ఉంటాయి. సెప్టెంబరులో మాత్రం మధ్యస్థాయి నుంచి బలంగా ఉండొచ్చు. జూన్‌లో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
కీలకమైన హెచ్ఎంజీబీ1 జన్యువును చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం 16 వరి రకాల (సగం మెట్ట, సగం నీటిపారుదలపై అధ్యయనం చేసి వాటి వేర్లు, జన్యు కార్యకలాపాలను విశ్లేషించారు. వేర్ల అభివృద్ధికి దోహదపడే 376 జన్యువులను గుర్తించారు. ఇందులో హెచ్ఎంజీబీ1 వీరి పరిశోధనలో ప్రధాన పాత్ర పోషించింది. వేర్ల పెరుగుదలను ఈ జన్యువు నెమ్మదింపజేస్తుంది. నీటి కోసం భూమి లోతుల్లోకి వెళ్లే వేర్లకు అడ్డుకట్ట వేస్తుంది. పొడి ప్రాంతాల్లో మనుగడ సాగించే మందపాటి వేర్లు పెరగడానికి ఉపకరిస్తుందని శా¢స్తవేత్తలు తెలిపారు. వేర్లు నిటారుగా భూమిలోకి చొచ్చుకుపోవడానికి హెచఎంజీబీ1 జన్యువు బ్రేకులా అడ్డుకట్ట వేస్తుంది కాబట్టి ఉన్నచోటే ఆ పేర్లు మందంగా, బలంగా తయారవుతాయి. ఇది మొక్కకు కరవును తట్టుకునే శక్తిని బాగా పెంచుతుందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట’ ప్రచురించింది. యాదృచ్ఛికంగా మొక్కలను సంకరం చేయడానికి బదులుగా, నిర్దిష్ట జన్యువులను లక్ష్యంగా చేసుకుని ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ పరిశోధన దోహదపడుతుంది. హువాజోంగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీజీఐ-రీసెర్చ్, యునాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు.ప్రపంచంలో దాదాపు 75% వరి ఉత్పత్తికి నీటిపారుదలే ఆధారం. చైనాలో వ్యవసాయానికి అవసరమైన నీటిలో 70 శాతాన్ని వరి పంటకే వినియోగిస్తున్నారు. వరిని అత్యధికంగా పండించే ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్‌లలో నీటిపారుదల కోసం భారీగా డబ్బు వెచ్చిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజా పరిశోధనలు పరి రైతుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. ప్రపంచ ఆహార భద్రతకు సరికొత్త భరోసా ఇస్తున్నాయి.బ్రిటన్‌లో కూడా… బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నట్టన్ బోనింగ్టన్ క్యాంపస్ గ్రోత్ రూమ్స్‌లో వాతావరణ మార్పులను తట్టుకునే జన్యు వైవిధ్య వరి మొక్కల అభివృద్ధిపై పెద్దఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. వేడి ఒత్తిడికి, కరుపుకు వివిధ మొక్కలు ఎలా స్పందిస్తాయన్న దానిని ఇక్కడ ఆధ్యయనం చేస్తున్నారు. వాతావరణ మార్పులకు వేర్లు దెబ్బతినకుండా ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి మొక్కలను మైక్రో-సీటీ స్కానర్‌లో విశ్లేషిస్తున్నారు. లోతుగా, నిటారుగా పెరిగే నేర్లు భూమి లోతుల్లోకి వెళ్లి ఎక్కువ నీటిని సంగ్రహిస్తాయి. దాన్ని నియంత్రించే జన్యువును గుర్తించి కొత్త రకాల ఆనివృద్ధిలో వినియోగించుకుంటానుని హాన్స్‌ఫీల్డ్ డైరెక్టర్ ప్రొఫెసర్ స్టర్రాక్ చెప్పారు.
– జాతీయ సదస్సు-2026లో మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) కార్యక్రమం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు-2026లో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి రాష్ట్రాల వారీగా ఆయిల్ పామ్ సాగు పురోగతిని వెల్లడించగా, తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు స్పష్టమైందన్నారు.NMEO-OP మిషన్ కింద 2021 నుండి 2026 వరకు దేశవ్యాప్తంగా 2,73,084 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేపట్టగా, అందులో 98,112 హెక్టార్లతో తెలంగాణ ఒక్కటే 36 శాతం వాటాను కలిగి ఉండటం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతుండగా, 79,448 మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ విజయం కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కాదన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను స్వీకరిస్తూ ఆయిల్‌పామ్ సాగు వైపు అడుగులు వేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు తెలంగాణ రైతులు విశేషంగా తోడ్పడుతున్నారని చెప్పారు.దేశంలో ఎడిబుల్ ఆయిల్స్ అవసరం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్‌పామ్ సాగు వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుందని మంత్రి తెలిపారు. ఇతర నూనెగింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇచ్చే ఈ పంట రైతులకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారిందన్నారు. ఒకసారి తోటను ఏర్పాటు చేస్తే సుమారు 30 సంవత్సరాలపాటు దిగుబడి అందే ఈ పంట ద్వారా రైతులు ఎకరాకు సంవత్సరానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు.ఆయిల్ పామ్ రైతులకు మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. రైతులు పండించిన ఫ్రెష్ ఫ్రూట్ బంచ్‌లు ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా నేరుగా కొనుగోలు చేయబడుతున్నాయని, దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.23,501గా ఉండటం రైతులకు మరింత ప్రయోజనకరంగా మారిందన్నారు. అయితే, గతంలో అమలులో ఉన్న విధంగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై 44 శాతం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తే, దేశీయ ఆయిల్ పామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దిగుమతి సుంకం పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, ఆయిల్ పామ్ గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.25,000 వరకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రైతులకు మరింత అధిక ఆదాయం లభించడంతో పాటు, కొత్తగా ఎక్కువ మంది రైతులు కూడా ఆయిల్ పామ్ సాగు వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందన్నారు. దేశీయ వంటనూనెల ఉత్పత్తి పెరగడం, రైతుల ఆదాయం మెరుగుపడడం, దిగుమతులపై ఆధారపడటం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయని మంత్రి వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివరించారు. రైతులకు నాణ్యమైన మొక్కల సరఫరా, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటుకు సబ్సిడీ, మొదటి నాలుగు సంవత్సరాలపాటు తోటల నిర్వహణకు ఆర్థిక సహాయం, అంతర పంటల సాగుకు ప్రోత్సాహకాలు, కోత పరికరాల కొనుగోలుకు ఎకరానికి రూ.51 వేల వరకు రాయితీ అందిస్తున్నామని తెలిపారు. అదనంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా పలు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలన్నీ రైతుల పెట్టుబడి భారం తగ్గించి, ఆయిల్ పామ్ సాగుపై విశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు.ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన ప్రాసెసింగ్ మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు, సిద్ధిపేట జిల్లాలో ఒకటి కలిపి మొత్తం మూడు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని చెప్పారు. వీటి గంటకు ప్రాసెసింగ్ సామర్థ్యం 150 మెట్రిక్ టన్నుల వరకు ఉందన్నారు. అదనంగా మరో ఏడు ప్రాసెసింగ్ మిల్లులు నిర్మాణ దశలో ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాత రైతులకు మరింత సమీపంలోనే ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ఆయిల్ పామ్ రంగం కేవలం రైతుల ఆదాయాన్నే పెంచడం కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రాసెసింగ్ మిల్లులు, రవాణా, కోత, నిల్వ, అనుబంధ కార్యకలాపాల ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు పరిశ్రమల అభివృద్ధికి కూడా ఈ రంగం దోహదపడుతోందన్నారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించాలని నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, దేశంలో వంటనూనెల స్వయం సమృద్ధి సాధించడం, గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.మంత్రి మాట్లాడుతూ, “తెలంగాణ రైతన్న కృషి, పట్టుదల, ప్రభుత్వ ప్రోత్సాహం కలిసి వచ్చిన ఫలితమే ఈ అగ్రస్థానం. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ నంబర్-1గా నిలవడం ప్రతి రైతుకు గర్వకారణం. రైతుల సంక్షేమం, ఆదాయ వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది” అని స్పష్టం చేశారు.
వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నైరుతి రుతుపవనాలు ముందుగా అంచనా వేసినట్లుగా ఈ నెల 26న కేరళను తాకకపోయినా అరేబియా సముద్ర ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల్లో మరింత విస్తరించాయి. అరేబియాతోపాటు లక్షద్వీప్ ప్రాంతం, బంగాళాఖాతంలోనూ మరికొంత ముందుకు కదిలాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. సాధారణంగా జూన్ ఒకటి నాటికి రుతుపవనాలు కేరళ అంతటా విస్తరించాలి. తద్వారా దేశంలో వర్షాకాలం మొదలవ్వాలి. గత ఏడాది ఇవి మే 24నే కేరళకు వచ్చాయి. “అరేబియా సముద్రంలో ఇప్పటికే విస్తరించిన ప్రాంతాలతోపాటు తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవి విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం నెలకొంది. ఆగ్నేయ, ఈశాన్య బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలకూ ఇవి 2-3 రోజుల్లో విస్తరిస్తాయి” అని ఐఎండీ తెలిపింది.
పంట వ్యర్థాలు… నేలకు జీవం. పొలంలో కలిపితే ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. పంట దిగుబడులూ పెరుగుతాయి. తగలబెడితే నేలకు నష్టం, భూమి వేడెక్కుతుంది. అందులోని సూక్ష్మజీవులూ చనిపోతాయి. పైగా కాలుష్యం మరో అతి పెద్ద సమస్య. టన్ను వరి గడ్డిని నేలలో కలిపేస్తే… 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియం, 1.2 కిలోల గంధకంతోపాటు సేంద్రియ కర్బనం లభిస్తుంది. టన్ను మొక్కజొన్న గడ్డిలో 9.16 కిలోల నత్రజని, 2.08 కిలోల ఫాస్పరస్, 15.78 కిలోల పొటాషియంతోపాటు 5.17 కిలోల కాల్షియం, 3.62 కిలోల మెగ్నీషియం, 1.54 కిలోల సల్ఫర్ ఉంటుంది.
గతంలో వరి కోతల తర్వాత నూర్పిడి చేసి గడ్డిని పశువుల మేతగా ఉపయోగించేవారు.. మిరప, పత్తి, కంది తదితర పంటలు వ్యర్థాల్ని మండెలుగా పేర్చి వంట చెరకుగా వినియోగించేవారు. ఇప్పుడు అధికశాతం రైతులు యంత్రాలతోనే వరి కోయిస్తున్నారు. ఎల్పీజీ అందుబాటులోకి రావడంతో వంట చెరకు అవసరమూ తగ్గిపోయింది. దీంతో పంట వ్యర్థాలను పొలాల్లోనే కాల్చివేస్తుండటంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. మొక్కజొన్న గడ్డి తగలబెట్టే సమయంలో మంటలు అంటుకుని నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తెలంగాణలోని హన్మ కొండ, ఏపీలోని పల్నాడు జిల్లాల్లో ఇటీవల చోటు చేసుకున్నాయి. వ్యర్థాల్ని కాల్ౘ్డం కంటే నేలలో కలిపి దున్నేయడం వల్ల పంట దిగుబడులు పెరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది.
మొక్కజొన్న సాగు బాగా పెరిగింది దేశంలో ఏటా 500 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 70% వాటా.. వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్యాలకు సంబంధించినవే. ఒక్క వరి పంట వ్యర్థాలే 34% ఉన్నాయి.. ఈ ఏడాది రబీలో ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 12.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరాకు 4.2 టన్నుల నుంచి 6.2 టన్నుల పంట వ్యర్థాలు వస్తాయి. సగటున ఎకరాకు 5 టన్నుల చొప్పున చూసినా.. ఒక్క మొక్కజొన్న నుంచే 62.75 లక్షల టన్నుల వ్యర్థాలు వస్తాయి. తెలంగాణలోనూ 2024 సంవత్సరంతో పోలిస్తే 5 లక్షల ఎకరాలు పెరిగింది. రబీలో 17.72 లక్షల ఎకరాల్లో సాగైంది. పంట వ్యర్థాల్ని బయోమాస్ ప్లాంట్లకు తరలించవచ్చు. బయోచార్, ఇతర ఉత్పత్తులకు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి.
చాలా నష్టం
నేల పైభాగం నుంచి 15 సెం.మీ. లోతు వరకు వేర్లు అభివృద్ధి చెందుతాయి. అక్కడుండే నత్రజని, కర్బనాన్ని ఉపయోగించుకుంటాయి. పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల ఈ పోషకాలు తగ్గిపోతాయి. మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.
పంట వ్యర్థాల్ని తగలబెడితే.. అందులో నుంచి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, నైట్రసఆక్సైడ్, ఇతర హైడ్రోకార్బన్లు అందులో ఉంటాయి.
వరిగడ్డిని కాల్ౘ్ివేస్తే అందులో 70% కార్బన్‌డైఆక్సైడ్, 7% కార్బన్ మోనాక్సైడ్, 0.66% మీథేన్ విడుదలవుతాయి. గడ్డిలోని నత్రజని నైట్రస్ ఆక్సైడ్‌గా వెలువడుతుంది.
పొగ నుంచి వెలువడే కాలుష్యం ద్వారా క్యాన్సర్ కారకాలు వెలువడుతున్నాయని అనుమానిస్తున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ప్రోత్సాహం తప్పనిసరి
2021 సంవత్సరంలో ఏర్పాటైన ‘వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ కాలుష్య నివారణకు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలతో సమగ్ర విధానాన్ని పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో చిన్న, సన్నకారు రైతులకు పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను ఉచితంగా అందుబాటులో ఉంచాలని గతేడాది ఈ కమిషన్ ఆదేశించింది.
విద్యుత్ కేంద్రాలు పంట వ్యర్థాలతో చేసిన గుళికలను కనీసం 5% వాడాలని స్పష్టం చేసింది. అలా చేయ కుంటే.. అవి ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ విద్యుత్తుపై పర్యావరణ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
మరోవైపు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చివేసే ఘటనలను కేంద్రం ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్ ద్వారా పర్యవేక్షిస్తోంది. పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను రాయితీ ద్వారా అన్నదాతలకు అందజేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పంట వ్యర్థాల నిర్వహణపై రైతులను చైత న్యపరచాలి. పలు ప్రోత్సాహకాలు అందిస్తే వారు మొగ్గుచూపుతారు.
యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాలను రైతులు అనుసరించాలని ఆచార్య జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ అల్దాస్ జానయ్య సూచించారు నానోయూరియా, పచ్చిరొట్ట ఎరువులు, జీవన, సేంద్రియ ఎరువులను ఉపయోగించాలన్నారు. సోమవారం వర్సిటీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. “గల్ఫ్ యుద్ధ ప్రభావం వలన ఒకవేళ యూరియా సరఫరా తగ్గినా దాని ప్రభావం పెద్దగా ఉండదు. నానోయూరియా మార్కెట్‌లో కావలసినంత పరిమాణంలో అందుబాటులో ఉంది. నానోయూరియా మొక్కలకు కావాల్సిన నత్రజని అందించటంతో పాటు దిగుబడులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరణ పొందిన జీవన ఎరువులు కూడా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. పచ్చిరొట్ట విత్తనాలను రైతాంగం సేకరించి తొలకరి వర్షాలు రాగానే పొలాల్లో చల్లి, విత్తిన 40 రోజుల్లో ఆయా పంటలను పొలంలో కలియదున్నితే సేంద్రియ కర్బనం పెరిగి నేల ఆరోగ్యం బాగుంటుంది” అని జానయ్య తెలిపారు.
మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం తాజాగా ఎంసీఎం-125 అనే వరి రకాన్ని అందుబాటులోకి తెచ్ౘ్ింది. ఇటీవల దీనికి అనుమతులు లభించడంతో శాస్త్రవేత్తలు రైతులకు విత్తనాలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఎంటీయూ 1042, ఎంటీయూ 1061 విత్తనాలను సంకరం చేసి ఎంసీఎం-125 విత్తనాన్ని రూపొందించారు. ఇది ఖరీఫ్‌కు అనువైన రకమని, పంట కాలం 145 రోజులు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకం కొంతవరకు దోమపోటు, అగ్గి తెగులు, మెడవిరుపు తెగులును కూడా తట్టుకుంటుంది. మొక్క 110 నుంచి 115 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఎకరానికి.. చౌడు నేలల్లో 30 బస్తాలు, సాధారణ భూముల్లో 40 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది. ఎంటీయూ-1061, బీపీటీ 5204 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంసీఎం-125 రకాన్ని చౌడు, సాధారణ భూముల్లో సాగు చేసుకోవచ్ౘ్ని పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె. నాగేంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంతాల్లోని చౌడు భూములకు అనువైన వంగడమని చెప్పారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నందున వినియోగించుకోవాలని కోరారు.
యూరియా లభ్యత, మొక్క జొన్న ధరలు, రొయ్యల మార్కెట్ పరిస్థితులు, కొబ్బరి రైతుల సమస్యలు, అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి తదితర అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల సంచాలకులతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వడగాడ్పుల ప్రభావంతో రాష్ట్రంలో సుమారు 5.5 కోట్ల కమర్షియల్ లేయర్ కోళ్లలో 2.5% నుంచి 3.5% వరకు మరణాలు నమోదైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని ఆయన తెలిపారు. నష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పౌల్ట్రీ రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు.
తెలంగాణా రాష్ట్రంలోరూ.1,100 కోట్లతో జిల్లాలవారీగా జొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తామని మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు మరో రూ.1,800 కోట్లతో అదనంగా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ.. “యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు 16.13 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం ఉత్పత్తి 42.87 లక్షల టన్నులకు చేరింది. మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే రూ.4,172.94 కోట్లతో 12.85 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. మరో 6.53 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో 4.03 లక్షల ఎకరాల్లో 4.03 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తి అయింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లతో కొనుగోళ్లు చేపడతాం. ఆదిలాబాద్ జిల్లాలో 26, సంగారెడ్డి జిల్లాలో 10, కామారెడ్డి జిల్లాలో 43, మెదక్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. దీంతోపాటు 10,175 టన్నుల పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తాం” అని వెల్లడించారు.