ఎల్ నినో-మారుతున్న వాతావరణం:పరాన్నజీవి వ్యాధులపై ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు మానవులు, పశువులు మరియు పర్యావరణ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవల నేపాల్లో సంభవించిన తీవ్ర వరదలు మరియు హిమాలయ ప్రాంతంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని మరోసారి వాతావరణ మార్పుల ప్రభావాలపై ఆలోచించేలా చేశాయి. ఈ మార్పుల్లో ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (El Niño–Southern Oscillation – ENSO) ఒక ముఖ్యమైన వాతావరణ ప్రక్రియ. ఎల్ నినో సమయంలో ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమలో మార్పులు సంభవిస్తాయి.

2027 వరకు ఎల్ నినో (అధిక ఉష్ణోగ్రతల) ప్రభావం తగ్గే అవకాశం లేదని భారత వాతావరణ శాస్త్ర విభాగం (India Meteorological Department – IMD) హెచ్చరిస్తోంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్షపాతం, కరువులు, వరదలు వంటి వాతావరణ మార్పులు మానవ–పశు ఆరోగ్యం, పశుపోషణ, వ్యవసాయం, ఆహార–నీటి భద్రత మరియు పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా, పరాన్నజీవులు, వాటి మధ్యస్థ అతిథులు, వాహకాలు మరియు అతిథి జంతువుల పరస్పర సంబంధాలను ప్రభావితం చేసి, పరాన్నజీవుల అభివృద్ధి, జీవన సామర్థ్యం మరియు వ్యాప్తిని మార్చగలవు. అనేక పరాన్నజీవుల గుడ్లు, లార్వాలు మరియు ఇతర అభివృద్ధి దశలు పర్యావరణ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి. అనుకూలమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గుడ్ల నుంచి లార్వాల అభివృద్ధి వేగవంతమవుతుంది. కొన్ని పరాన్నజీవుల జీవచక్రం త్వరగా పూర్తవుతుంది మరియు కొన్ని వాహకాల సంఖ్య కూడా పెరగవచ్చు. అయితే, అత్యధిక ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన ఎండలు కొన్ని పరాన్నజీవుల గుడ్లు మరియు స్వేచ్ఛా జీవన దశల జీవన సామర్థ్యాన్ని తగ్గించవచ్చు.

గొర్రెలు మరియు మేకల్లో కనిపించే ముఖ్యమైన జీర్ణాశయ నెమటోడ్ పరాన్నజీవి Haemonchus contortus. దీనిని సాధారణంగా Barber’s pole worm అని పిలుస్తారు. ఇది రక్తాన్ని పీల్చడం ద్వారా తీవ్రమైన రక్తహీనత, బలహీనత మరియు కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతుంది.

ఈ పరాన్నజీవి గుడ్డు నుంచి సంక్రమణకు కారణమయ్యే మూడవ దశ లార్వా (L3) వరకు అభివృద్ధి చెందడానికి ఉష్ణోగ్రత మరియు తేమ వంటి పర్యావరణ పరిస్థితులు అవసరం. తగిన వర్షపాతం, నేల తేమ మరియు మితమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గుడ్లు వేగంగా అభివృద్ధి చెంది L3 లార్వాలుగా మారి పచ్చికపైకి చేరతాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఎల్ నినో సమయంలో తక్కువ వర్షపాతం, పొడి పరిస్థితుల కారణంగా లార్వాల అభివృద్ధి తగ్గవచ్చు. అయితే ఎల్ నినో తర్వాత తేమ మరియు వర్షపాతం పెరిగే పరిస్థితులు ఏర్పడితే సంక్రమణ పరిస్థితులు మళ్లీ మారవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పచ్చికపై కొత్తగా లార్వాల అభివృద్ధి తగ్గినప్పటికీ, ఇప్పటికే జంతువుల్లో ఉన్న పరాన్నజీవి భారం కొనసాగవచ్చు. అంతేకాకుండా కరువు వల్ల మేత కొరత ఏర్పడి జంతువుల పోషక స్థితి మరియు రోగనిరోధక శక్తి తగ్గితే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

ఎల్ నినో (అధిక ఉష్ణోగ్రతల) ప్రభావం తగ్గగానే వచ్చే అధిక వర్షపాతం మరియు వరదల సమయంలో పశువుల మలం నీటి వనరుల్లోకి చేరడం వల్ల Cryptosporidium, Giardia, Entamoeba వంటి నీటి ద్వారా వ్యాపించే పరాన్నజీవుల సంక్రమణ ప్రమాదం పెరగవచ్చు. కరువు సమయంలో సురక్షితమైన నీటి వనరులు తగ్గిపోవడం వల్ల మానవులు మరియు పశువులు పరిమితమైన లేదా కలుషితమైన నీటి వనరులను ఉపయోగించే పరిస్థితి ఏర్పడవచ్చు.

మరో వైపు ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమలో మార్పులు దోమలు, ఈగలు, గోమార్లు మరియు పేలు వంటి వాహకాల సంఖ్య, అభివృద్ధి మరియు కాలానుగుణ కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చు. ఫలితంగా మలేరియా, ట్రీపానాసోమా, థిలేరియా, బెబేసియా, లీష్మానియాసిస్ మరియు ఫైలేరియాసిస్ వంటి పరాన్నజీవి వ్యాధుల వ్యాప్తి విధానాల్లో మార్పులు సంభవించవచ్చు.

పరాన్నజీవి వ్యాధులను ఎలా ఎదుర్కోవాలి?

మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పరాన్నజీవి నియంత్రణలో ముందస్తు ప్రణాళిక చాలా అవసరం.

1.వాతావరణ ఆధారిత పర్యవేక్షణ: ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమ సమాచారాన్ని పరాన్నజీవి వ్యాధుల పర్యవేక్షణతో అనుసంధానం చేయాలి.
2. లక్ష్యిత నులిపురుగు నివారణ: అవసరం లేని blanket deworming కు బదులుగా, మల పరీక్ష, వ్యాధి లక్షణాలు మరియు స్థానిక వ్యాధి పరిస్థితుల ఆధారంగా చికిత్స చేయాలి.
3. FAMACHA విధానం: Haemonchus contortus ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కంటి పొర ఆధారంగా రక్తహీనత ఉన్న జంతువులను గుర్తించి, అవసరమైన వాటికి మాత్రమే చికిత్స చేయడం ప్రయోజనకరం.
4. పోషకాహార నిర్వహణ: కరువు మరియు మేత కొరత సమయంలో తగిన ప్రోటీన్ మరియు శక్తి (ఎనర్జీ) పోషక పదార్థాలు అందించడం ద్వారా జంతువుల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచాలి.
5. సురక్షితమైన నీరు: మానవులు మరియు పశువులకు శుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలి.
6. వాహకాల పర్యవేక్షణ: వాటి ఋతువుల ఆధారిత కార్యకలాపాలు క్రమం తప్పకుండా పర్యవేక్షించి అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలి. పర్యావరణ పరిశుభ్రత, నిల్వ నీటి తొలగింపు, పురుగుమందుల వినియోగం మరియు వాహక నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేయాలి.
7. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: El Niño వాతావరణ హెచ్చరికలను పశువుల వ్యాధుల నిఘా మరియు పర్యవేక్షణతో అనుసంధానం చేయాలి.

ఎల్ నినో (El Niño) అనేది ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఒక శక్తివంతమైన క్లైమేట్ డ్రైవర్. ఇది కేవలం పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల మార్పులకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పరాన్నజీవి వ్యాధుల (parasitic diseases) వ్యాప్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కేవలం రోగ నిర్ధారణ, చికిత్స మాత్రమే సరిపోవు. కాబట్టి భవిష్యత్తులో పరాన్నజీవి వ్యాధుల నియంత్రణ రోగ నిర్ధారణ మరియు చికిత్సకే పరిమితం కాకుండా, వాతావరణ అంచనా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, లక్ష్యిత నులిపురుగు నివారణ, FAMACHA విధానం, పరమాణు స్థాయి పర్యవేక్షణ మరియు వన్ హెల్త్ (మానవ–పశు–పర్యావరణ ఆరోగ్య సమగ్ర విధానం) విధానాలను సమన్వయం చేయాలి.

“వాతావరణాన్ని అర్థం చేసుకుంటే పరాన్నజీవి వ్యాధుల ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు; ముందస్తు అంచనా ఉంటే సమర్థవంతమైన నియంత్రణ సాధ్యమవుతుంది.”

Dr. వి. జ్ఞానీ చరిత, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి, Dr. పి వి రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పరాన్న జీవశాస్త్ర విభాగం. పశు వైద్య కళాశాల, ప్రొద్దటూరు-516360, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆంధ్ర ప్రదేశ్. Ph: 9100771767

Read More

వ్యాధుల నుంచి మీ పాడి ఫారం సురక్షితమేనా? – ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి

“పశువుకు వ్యాధి ఎలా వచ్చింది?” అనే ప్రశ్నతో పాటు… “అది మన ఫారంలోకి ఎలా వచ్చింది?” అని కూడా ఆలోచించాలి.

పాడి ఫారంలో ఒక పశువుకు వ్యాధి వస్తే, అది ఆ ఒక్క పశువుతోనే ఆగిపోతుందని చెప్పలేం. కొత్తగా తెచ్చిన పశువులు, బయట నుంచి వచ్చే వ్యక్తులు, వాహనాలు, అపరిశుభ్రమైన పాక, మేత, నీరు, పరికరాలు ఇలా అనేక మార్గాల్లో వ్యాధులు ఫారంలోకి రావచ్చు. ఒక పశువు నుంచి మరో పశువుకు కూడా వ్యాపించవచ్చు.
అందుకే పశువులకు చికిత్స చేయించడమే కాకుండా, వ్యాధులు ఫారంలోకి రాకుండా, వచ్చినా ఇతర పశువులకు వ్యాపించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనికి పెద్ద పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు. రోజూ మనం చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు.
మరి మీ పాడి ఫారంలో అలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారా? ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి.

  1. కొత్తగా తెచ్చిన పశువులను వెంటనే మందలో కలుపుతున్నారా?
    కొత్తగా తెచ్చిన పశువు చూడటానికి ఆరోగ్యంగా కనిపించినా, దానితో పాటు వ్యాధులు కూడా ఫారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంటనే మందలో కలపకుండా కనీసం 3 వారాల పాటు వేరుగా ఉంచి ఆరోగ్యాన్ని గమనించడం మంచిది. ఈ సమయంలో పశువులో ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యుని సంప్రదించాలి. అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మందలో కలపడం మంచిది.
  2. అనారోగ్య పశువులను వేరుగా ఉంచే ఏర్పాటు ఉందా?
    మందలో ఏదైనా పశువు అనారోగ్యానికి గురైతే, వీలైనంత వరకు మందకు కొంత దూరంగా, ఇతర పశువులతో కలవకుండా ఉంచడం మంచిది. అనారోగ్య పశువుకు మేత, నీరు పెట్టేందుకు వాడే తొట్లు, బకెట్లు కూడా ఇతర పశువులకు వాడకుండా చూడాలి. ముందుగా ఆరోగ్యంగా ఉన్న పశువుల పనులు చూసుకొని, చివరగా అనారోగ్య పశువు దగ్గరకు వెళ్లాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ, పశువైద్యుని సలహాతో చికిత్స చేయిస్తే మిగతా పశువులకు వ్యాధి వ్యాపించే అవకాశాన్ని తగ్గించవచ్చు.
  3. మీ పాడి ఫారంలోకి వచ్చే వ్యక్తులు, వాహనాల రాకపోకలను గమనిస్తున్నారా?
    పాడి ఫారానికి వివిధ పనుల కోసం బయట వ్యక్తులు, ఇతర రైతులు, వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. వీటి ద్వారా ఒక ఫారం నుంచి మరో ఫారానికి మట్టి, పేడతో పాటు వ్యాధులు కూడా చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చే వ్యక్తులు పశువుల దగ్గరకు నేరుగా వెళ్లకుండా చూసుకోవాలి. వాహనాలను కూడా వీలైనంత వరకు పశువుల పాకకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ఇతర పశువుల ఫారాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులు, వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
  4. పశువుల పాకలోకి వెళ్లే ముందు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుంటున్నారా?
    మన చేతులు, కాళ్లు, చెప్పులకు అంటుకున్న మట్టి, పేడ ద్వారా కూడా వ్యాధులు ఒక చోటు నుంచి మరో చోటుకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చిన వెంటనే పశువుల దగ్గరకు వెళ్లకుండా చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం మంచిది. ముఖ్యంగా పశువుల సంతకు, మరో పాడి ఫారానికి వెళ్లి వచ్చినప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం. వీలైతే పశువుల పాకలో వేసుకునేందుకు వేరే చెప్పులు ఉంచుకోవాలి. వాటిని బయట ఇతర పనులకు ఉపయోగించకూడదు. అనారోగ్య పశువును చూసిన తర్వాత చేతులు, చెప్పులు శుభ్రం చేసుకొని, ఆ తర్వాతే ఇతర పశువుల దగ్గరకు వెళ్లాలి. ఈ చిన్న అలవాట్లు బయట నుంచి లేదా ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాధులు చేరే అవకాశాన్ని తగ్గిస్తాయి.
  5. పాకను శుభ్రంగా, పొడిగా ఉంచుతున్నారా?
    పశువుల పాకలో పేడ, వ్యర్థాలు పేరుకుపోయి, నేల ఎక్కువసేపు తడిగా ఉంటే పశువులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే పేడ, ఇతర వ్యర్థాలను రోజూ తొలగించాలి. మూత్రం, మురికి నీరు పాకలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేలా కాలువలు ఉండాలి. తొలగించిన పేడను పాక దగ్గరే పోగు చేయకుండా, నిర్ణీత ప్రదేశంలో సేకరించి సేంద్రియ ఎరువు తయారీకి లేదా వీలైతే బయోగ్యాస్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. పశువులు పడుకునే ప్రదేశంలో తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే పాకలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాకలో అపరిశుభ్రతను తగ్గించి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
  6. మేత, తాగునీరు కలుషితం కాకుండా కాపాడుతున్నారా?
    పశువులకు ఇచ్చే మేత, తాగునీరు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. మేతలో పేడ, మట్టి లేదా ఇతర మలినాలు కలవకుండా చూసుకోవాలి. మేతను తేమ తగలకుండా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. బూజు పట్టిన లేదా చెడిపోయిన మేతను పశువులకు ఇవ్వకూడదు. మేత తొట్లు, నీటి తొట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. తొట్టెలో మిగిలిపోయి చెడిపోయిన మేతను తొలగించి, తాజా మేత వేయాలి. పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇలా మేత, నీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తే వాటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు. అలాగే పశువులకు సమతుల్య మేతతో పాటు తగిన ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా అందించాలి.
  7. పాలు పితికే పాత్రలు, ఇతర పరికరాలను శుభ్రంగా ఉంచుతున్నారా?
    పాలు పితికే సమయంలో పరిశుభ్రత పాటించడం పశువుల ఆరోగ్యంతో పాటు పాల నాణ్యతకు కూడా చాలా ముఖ్యం. పాలు పితికే ముందు చేతులు, పొదుగును శుభ్రంగా కడిగి, పొదుగును పొడి గుడ్డతో తుడవాలి. పాలు పితికే పాత్రలను ప్రతి సారి ఉపయోగించిన తర్వాత బాగా కడిగి ఆరబెట్టాలి. పాలు పితికే యంత్రాలు, ఇతర పరికరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పాలు పితికిన తర్వాత చనుమొనలను పశువైద్యుడు సూచించిన టీట్ డిప్పింగ్ ద్రావణంలో ముంచడం మంచిది. ఇలా సరైన పద్ధతిలో పాలు పితకడం వల్ల మాస్టిటిస్ (పొదుగు వాపు) వచ్చే అవకాశాన్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన పాలను పొందవచ్చు.
  8. ఈగలు, దోమలు, ఎలుకల బెడదను తగ్గిస్తున్నారా?
    పశువుల పాకలో ఈగలు, దోమలు, ఎలుకలు ఎక్కువగా ఉంటే పశువులకు ఇబ్బంది కలిగించడంతో పాటు వివిధ రకాల వ్యాధులు వ్యాపించడానికి కూడా కారణమవుతాయి. అందుకే పాకలో పేడ, మిగిలిపోయిన మేత పేరుకుపోకుండా, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దాణా నిల్వ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి, దాణా చెల్లాచెదురుగా పడకుండా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుల సూచనలతో ఈగలు, దోమలను దూరంగా ఉంచే రిపెల్లెంట్లను, ఎలుకల నియంత్రణకు తగిన పద్ధతులను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల లంపీ స్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి), సర్రా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
  9. టీకాలు, నట్టల మందులు సమయానికి వేయిస్తున్నారా?
    వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించడం కంటే, ముందుగానే నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకే పశువులకు అవసరమైన టీకాలను సమయానికి వేయించడంతో పాటు, నట్టల నివారణకు కూడా సకాలంలో మందులు ఇవ్వాలి. పశువుల వయస్సు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతంలో వచ్చే వ్యాధులను బట్టి పశువైద్యుని సూచనతో వీటిని పాటించాలి. టీకాలు, నట్టల మందులు ఇచ్చిన తేదీలను చిన్న పుస్తకంలో లేదా మొబైల్లో నమోదు చేసుకుంటే, తదుపరి ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోవడం సులభమవుతుంది.
  10. పశువు ఆరోగ్యంలో మార్పు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారా?
    రోజూ కొద్దిసేపు పశువులను దగ్గరగా గమనించడం అలవాటు చేసుకోవాలి. పశువు సాధారణంగా ఎలా ఉంటుందో తెలిసినప్పుడే దాని ఆరోగ్యంలో వచ్చే మార్పులను త్వరగా గుర్తించవచ్చు. మేత తినకపోవడం, నీరసంగా ఉండటం, జ్వరం, దగ్గు, విరేచనాలు, పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. అనారోగ్యంగా ఉన్న పశువును వీలైనంత వరకు ఇతర పశువులతో కలవకుండా ఉంచి, వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. మందలోని ఇతర పశువుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించాలి. ఒకటి కంటే ఎక్కువ పశువుల్లో ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండి, వెంటనే పశువైద్యునికి తెలియజేయాలి. వ్యాధిని తొలిదశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల చికిత్స త్వరగా ప్రారంభించడంతో పాటు, ఇతర పశువులకు వ్యాధి వ్యాపించే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

మరి… మీ పాడి ఫారం ఎంతవరకు సురక్షితం?
ఈ 10 అంశాల్లో మీరు ఇప్పటికే పాటిస్తున్నవి ఏవి? ఇంకా మెరుగుపరచుకోవాల్సినవి ఏవి? ఒకసారి మీరే పరిశీలించుకోండి.

పశువుల కొనుగోలు నుంచి రోజువారీ సంరక్షణ, మేత, నీరు, పాలు పితకడం, టీకాలు, ఆరోగ్య పరిశీలన వరకు ప్రతి దశలో సరైన పద్ధతులు పాటించడం ముఖ్యం. వీటిని రోజువారీ ఫారం నిర్వహణలో భాగంగా చేసుకుంటే పశువుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పాడి ఫారాన్ని మరింత సురక్షితంగా నిర్వహించవచ్చు.

Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
Dr. బద్దం అఖిల , టీచింగ్ ఫాకల్టీ,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య కళాశాల, కోరుట్ల, PVNRTVU. 7093198419

Read More

తొలకరిలో జీవాల సంరక్షణగొర్రెలు, మేకల పెంపకందారులు తీసుకోవలసిన జాగ్రత్తలు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గొర్రెలు మేకల పాత్ర:
పాడిపరిశ్రమ తరువాత రైతులు, గ్రామీణ యువత అత్యధికంగా ఆసక్తి చూపుతున్న అనుబంధ రంగం గొర్రెలు, మేకల పెంపకం. తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు అందించే ఈ రంగం చిన్న, సన్నకారు, భూమిలేని రైతులకు జీవనోపాధిగా మారింది. దేశంలో 20వ పశుగణన ప్రకారం గొర్రెల సంఖ్య సుమారు 7.43 కోట్లు (మొత్తం పశుసంపదలో 13.83%) కాగా, మేకల సంఖ్య 14.89 కోట్లు (27.74%)గా నమోదైంది. ప్రపంచంలో మేకల పెంపకంలో భారతదేశం మొదటి స్థానంలో, గొర్రెల పెంపకంలో మూడో స్థానంలో నిలుస్తోంది. కేంద్ర పశుసంవర్థక శాఖ ప్రాథమిక గణాంకాల (BAHS 2024–25) ప్రకారం, దేశ మొత్తం మాంసోత్పత్తిలో గొర్రెల వాటా 11.29%, మేకల వాటా 15.06%గా ఉంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక గొర్రెల జనాభా కలిగిన రాష్ట్రంగా, గొర్రెల మాంసోత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఈ గణాంకాలే ఈ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంత కీలకమో స్పష్టం చేస్తున్నాయి.

దేశంలో జనాభా (20వ పశుగణన)
గొర్రెలు: 7.43 కోట్లు (13.83%)
మేకలు: 14.89 కోట్లు (27.74%)

ప్రపంచంలో స్థానం
గొర్రెలు: 3వ స్థానం
మేకలు: 1వ స్థానం

మొత్తం మాంసోత్పత్తిలో వాటా (2024–25)
గొర్రెలు: 11.29%
మేకలు: 15.06%

తొలకరి వర్షాలు తెచ్చే సవాళ్లు:
మన రైతులు ఎక్కువగా గొర్రెలు, మేకలను ఆరుబయట మేపే సంప్రదాయ పద్ధతిని లేదా ఉదయం పచ్చికభూముల్లో మేపి రాత్రి కొట్టాల్లో బంధించే పాక్షిక సాంద్ర పద్ధతిని పాటిస్తారు. తొలకరి జల్లులకు కొత్తగా మొలకెత్తిన లేత పచ్చిగడ్డిని మేయడం, గుంతల్లో నిల్వ ఉన్న మురికినీటిని తాగడం, వర్షాలకు ఎక్కువసేపు తడవడం వంటివి జీవాలలో అనేక వ్యాధులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఈ కాలంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు ఈగలు, దోమలు వంటి బాహ్యపరాన్న జీవులు కూడా విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా చిటుక వ్యాధి, గాలికుంటు వ్యాధి, నీలినాలుక, పారుడు రోగం (పిపిఆర్‌), కాలిపుండు, గొంతువాపు లాంటి వ్యాధుల ముప్పు గణనీయంగా పెరుగుతుంది.

తరచుగా కనిపించే ప్రధాన వ్యాధులు

బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు
చిటుక వ్యాధి (ఎంటిరోటాక్సీమియా): క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్‌ టైప్‌-డి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. తొలకరి జల్లులకు మొలచిన లేత గడ్డిని అధికంగా తినడం ఇందుకు ప్రధాన కారణం. అన్ని వయసుల గొర్రెలు, మేకలు దీని బారిన పడతాయి. హఠాత్తుగా మరణించే ప్రమాదం ఉన్నందున తొలకరికి ఒక నెల ముందే టీకా వేయించడం ఏకైక రక్షణ మార్గం.

కాలిపుండు వ్యాధి: బురద, చిత్తడి నేలల్లో ఎక్కువసేపు తిరగడం వల్ల గిట్టల మధ్యభాగం కందిపోయి, జీవాలు కుంటుతూ నడుస్తాయి. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరు చేసి, పశువైద్యుని సలహాతో యాంటీబయోటిక్స్‌ వాడాలి.

వైరస్‌ల వల్ల కలిగే వ్యాధులు
పారుడు రోగం (పిపిఆర్‌): గొర్రెలు, మేకల్లో అత్యధిక నష్టాన్ని కలిగించే వ్యాధి ఇది. అధిక జ్వరం, ముక్కు నుంచి స్రావాలు, నోటిపూత, రక్తపు విరేచనాలు దీని లక్షణాలు. చికిత్స లేని ఈ వ్యాధికి నివారణే ఏకైక మార్గం. మూడు నెలలు దాటిన పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి పిపిఆర్‌ వ్యాధిని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో జాతీయ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

నీలినాలుకవ్యాధి(Bluetongue):
క్యులికోయిడ్స్‌ (Culicoides) అనే చిన్న దోమల కాటు ద్వారా వ్యాపించే ఆర్బోవైరస్‌ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రధానంగా గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది. అధిక జ్వరం, నాలుక నీలిరంగులోకి మారడం, పెదవులు మరియు ముఖం వాచిపోవడం, నోటిలో పుండ్లు, గిట్టల వద్ద వాపు, కుంటుతూ నడవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి నివారణకు మూడు నెలల వయస్సు దాటిన పిల్లలకు నీలినాలుక టీకా వేయించి, ఒక నెల తర్వాత బూస్టర్‌ డోసు ఇవ్వాలి. అదనంగా దోమల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.

గాలికుంటువ్యాధి(FMD):
ఇది అత్యంత వేగంగా వ్యాపించే వైరస్‌ వ్యాధి. గొర్రెలు, మేకల నోరు, నాలుక, పెదవులు మరియు గిట్టల మధ్య బొబ్బలు, పుండ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఫలితంగా జీవాలు మేత మేయలేకపోవడం, కుంటుతూ నడవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స లేదు. క్రమం తప్పకుండా ఎఫ్‌ఎమ్‌డి టీకాలు వేయించడం, వ్యాధి సోకిన జీవాలను వెంటనే వేరు చేయడం, పరిశుభ్రత మరియు బయోసెక్యూరిటీ చర్యలు పాటించడం ద్వారా వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు.

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
● టీకాలు సకాలంలో వేయించడం: తొలకరి ప్రారంభానికి ఒక నెల ముందే చిటుక వ్యాధి, గాలికుంటు, పారుడు రోగం, నీలినాలుక వ్యాధుల నివారణ టీకాలను పశువైద్యుని సలహాతో వేయించుకోవాలి.

గొర్రెలు మరియు మేకలకు సిఫార్సు చేయబడిన టీకాల పట్టిక:

వ్యాధి: చిటుక వ్యాధి (ఎంటిరోటాక్సీమియా – ET)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–4 నెలల వయస్సులో
బూస్టర్ డోసు: 21–30 రోజుల తర్వాత
తదుపరి టీకా: ప్రతి సంవత్సరం, ముఖ్యంగా వర్షాకాలానికి ఒక నెల ముందు

వ్యాధి: పారుడు రోగం (PPR)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3 నెలల వయస్సు తర్వాత
బూస్టర్ డోసు: అవసరం లేదు
తదుపరి టీకా: ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి

వ్యాధి: గాలికుంటు వ్యాధి (Foot and Mouth Disease – FMD)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–4 నెలల వయస్సులో
బూస్టర్ డోసు: 21–30 రోజుల తర్వాత
తదుపరి టీకా: ప్రతి 6 నెలలకు ఒకసారి

వ్యాధి: నీలినాలుక వ్యాధి (Bluetongue) (వ్యాధి ప్రబల ప్రాంతాల్లో)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3 నెలల వయస్సు తర్వాత
బూస్టర్ డోసు: 1 నెల తర్వాత
తదుపరి టీకా: ప్రతి సంవత్సరం

వ్యాధి: గొర్రె మశూచి (Sheep Pox) (గొర్రెలకు మాత్రమే)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–5 నెలల వయస్సులో
బూస్టర్ డోసు: అవసరమైతే పశువైద్యుని సలహా మేరకు
తదుపరి టీకా: ప్రతి సంవత్సరం

వ్యాధి: మేక మశూచి (Goat Pox) (మేకలకు మాత్రమే)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–5 నెలల వయస్సులో
బూస్టర్ డోసు: అవసరమైతే పశువైద్యుని సలహా మేరకు
తదుపరి టీకా: ప్రతి సంవత్సరం

● నట్టల నివారణ: తొలకరి ప్రారంభానికి ముందే పశువైద్యుని సూచన మేరకు నట్టల నివారణ మందులను వాడాలి. లేత గడ్డి మేయడం వల్ల అంతరపరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది.
● కొట్టాల నిర్వహణ: కొట్టాలు పొడిగా, తేమ లేకుండా ఉండేలా చూసుకోవాలి. మలమూత్రాలను ఎప్పటికప్పుడు తొలగించి, ప్రతి 15 రోజులకు ఒకసారి సున్నం లేదా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలి. కొట్టాల్లోకి గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా నిర్మాణం ఉండాలి; లేకుంటే అమ్మోనియా శాతం పెరిగి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
● బాహ్యపరాన్న జీవుల నివారణ: ఈగలు, దోమల నివారణకు ప్రతి 15 రోజులకు ఒకసారి మలాథియాన్‌, బ్యూటాక్స్‌, అమిత్రాజ్‌ వంటి కీటకనాశనులను కొట్టాల్లో పిచికారీ చేయాలి.
● గిట్టల సంరక్షణ: బురద, చిత్తడి నేలల్లో మేపే రైతులు ఫుట్‌ బాత్‌లలో పొటాషియం పర్మాంగనేట్‌ లేదా జింక్‌ సల్ఫేట్‌ ద్రావణాన్ని వాడి, గిట్టల వ్యాధులను నివారించుకోవాలి.
● మేత జాగ్రత్తలు: బూజు పట్టిన, తడిసిన మేతను గొర్రెలకు, మేకలకు వేయకూడదు — ఇది అఫ్లాటాక్సికోసిస్‌ అనే ఫంగల్‌ వ్యాధికి దారితీస్తుంది. వీలైనంత వరకు ఎండిన, నాణ్యమైన మేతనే అందించాలి.
● కొత్త జీవాల నిర్బంధం (క్వారంటైన్‌): సంతలో కొత్తగా కొనుగోలు చేసిన జీవాలను వెంటనే మందలో కలపకూడదు. వాటిని కొన్ని రోజులు వేరుగా ఉంచి, అవసరమైన టీకాలు వేయించి, ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే మందలో చేర్చాలి.
● వ్యాధిగ్రస్త జీవాల నిర్వహణ: వైరస్‌ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఆ జీవిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. నోటిపూత వల్ల మేత తినలేని జీవాలకు జావ, ఓఆర్‌ఎస్‌ ద్రావణం అందించాలి.
● గొర్రె పిల్లల సంరక్షణ: తొలకరి జల్లుల వల్ల గొర్రె పిల్లల్లో ఊపిరితిత్తుల వ్యాధులు అధికంగా వచ్చి 30% వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. పిల్లలను తడవకుండా, చలి తాకకుండా ప్రత్యేక శ్రద్ధతో పెంచాలి.
● వెంటనే వైద్య సహాయం: ఏ చిన్న అనుమానం వచ్చినా ఆలస్యం చేయకుండా సమీప పశువైద్యాధికారిని సంప్రదించి తగిన చికిత్స అందించాలి.

ప్రభుత్వ తోడ్పాటు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం (NADCP) ద్వారా గాలికుంటు, బ్రూసెల్లోసిస్‌ వంటి వ్యాధుల నివారణకు ఉచిత టీకాలు అందిస్తోంది. అలాగే పారుడు రోగం (పిపిఆర్‌) నిర్మూలన కార్యక్రమం, గొర్రెలు మేకల మశూచి, నీలినాలుక వ్యాధుల నివారణకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ ద్వారా క్రమం తప్పకుండా టీకా శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని తమ మందలను రక్షించుకోవాలి.

ముగింపు
“చికిత్స కన్నా నివారణ మేలు” అనే సూత్రాన్ని గొర్రెలు, మేకల పెంపకందారులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. తొలకరి ప్రారంభంలోనే తగిన టీకాలు, నట్టల నివారణ మందులు, పరిశుభ్రమైన కొట్టాల నిర్వహణ వంటి యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించడం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో తమ మందలను వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చు. తద్వారా ఆశించిన దిగుబడిని, మెరుగైన ఆదాయాన్ని పొంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించవచ్చు.

Dr. ఎ. సురేష్ నాయక్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌. Ph; 9491394455

Read More

చూడి పశువుల శాస్త్రీయ సంరక్షణ – పాడి రైతు విజయానికి మూలాధారం

పరిచయం
పాడి పరిశ్రమలో రైతు విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశాల్లో పునరుత్పత్తి నిర్వహణ (Reproductive Management) ఒకటి. పాడి ఆవు లేదా గేదె ప్రతి సంవత్సరం ఒక ఆరోగ్యవంతమైన దూడను ఈని, సకాలంలో మళ్లీ చూడి కడితేనే పాల ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగి రైతుకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అందువల్ల చూడి కాలం (Gestation Period) పాడి పశువుల జీవితంలో అత్యంత కీలకమైన దశగా భావిస్తారు. ఆవులలో చూడి కాలం సుమారు 280–285 రోజులు, గేదెలలో 300–310 రోజులు ఉంటుంది. ఈ కాలంలో గర్భస్థ దూడ ఎదుగుదలతో పాటు తల్లి పశువు శరీరంలో కూడా అనేక శారీరక, హార్మోన్ల మార్పులు జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో సమతుల్య పోషకాహారం, సరైన యాజమాన్యం, పరిశుభ్రమైన వాతావరణం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మరియు సకాలంలో పశువైద్య సేవలు అందించడం అత్యంత అవసరం.

రాష్ట్రంలో ఇప్పటికీ చాలామంది రైతులు చూడి పశువులను సాధారణ పాల పశువుల మాదిరిగానే నిర్వహిస్తూ, ఈనడానికి కొద్ది రోజుల ముందు మాత్రమే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీనివల్ల పాలజ్వరం (Milk Fever), మాయ నిలిచిపోవడం (Retained Placenta), ప్రసవ సమస్యలు, బలహీన దూడలు పుట్టడం, పాల దిగుబడి తగ్గడం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతున్నాయి.అందువల్ల చూడి నిర్ధారణ అయిన రోజు నుంచే శాస్త్రీయ సంరక్షణను ప్రారంభించడం ఎంతో అవసరం. ఈ వ్యాసంలో చూడి కాలంలోని వివిధ దశలు, పోషకాహార యాజమాన్యం, డ్రై పీరియడ్ నిర్వహణ, పొదుగు సంరక్షణ, ప్రసవానికి సన్నాహాలు, ఈనిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ముఖ్యమైన అంశాలను శాస్త్రీయంగా, రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం.

చూడి కాలం – దశలు మరియు వాటి ప్రాముఖ్యత
ఆవులలో చూడి కాలం సగటున 280–285 రోజులు, గేదెలలో 300–310 రోజులు ఉంటుంది. ఈ మొత్తం చూడి కాలాన్ని పిండం ఎదుగుదల, పోషక అవసరాలు మరియు నిర్వహణను దృష్టిలో ఉంచుకొని మూడు ప్రధాన దశలుగా విభజిస్తారు. ప్రతి దశలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన దూడతో పాటు ఈనిన తర్వాత అధిక పాల ఉత్పత్తిని కూడా పొందవచ్చు.

మొదటి దశ (0–3 నెలలు) – పిండం స్థిరపడే దశ
ఈ దశలో ఫలదీకరణం చెందిన అండం గర్భాశయంలో స్థిరపడి, మావి (Placenta) ఏర్పడటం ప్రారంభమవుతుంది. పిండం పరిమాణం చిన్నదిగా ఉన్నప్పటికీ, గర్భధారణ కొనసాగడానికి ఇది అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో పశువుకు మానసిక ఒత్తిడి, ఎక్కువ దూరం నడిపించడం, జారుడు నేలపై తిరగనివ్వడం, ఆకస్మికంగా మేత లేదా దాణా మార్పులు చేయడం, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల ప్రారంభ గర్భస్రావం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం కల్పించి, సమతుల్య పోషకాహారం, పరిశుభ్రమైన తాగునీరు అందించడం అవసరం. గర్భధారణను 60–90 రోజుల మధ్య పశువైద్యుని ద్వారా నిర్ధారించుకోవడం ఉత్తమ యాజమాన్య పద్ధతి.

రెండవ దశ (4–6 నెలలు) – పిండం అవయవాల అభివృద్ధి దశ
ఈ దశలో పిండం శరీర అవయవాలు పూర్తిగా రూపుదిద్దుకుని, కండరాలు మరియు ఎముకల నిర్మాణం వేగంగా అభివృద్ధి చెందుతుంది. గర్భస్థ దూడ జీవన సామర్థ్యానికి ఈ దశ చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో పశువు పాల ఉత్పత్తి కొనసాగుతుంటే, నిర్వహణ పోషక అవసరాలతో పాటు పిండం ఎదుగుదలకు అవసరమైన అదనపు శక్తి, మాంసకృత్తులు, కాల్షియం, ఫాస్పరస్ మరియు సూక్ష్మ ఖనిజాలు అందేలా ఆహారం ఇవ్వాలి. ఖనిజ మిశ్రమం (Mineral Mixture) మరియు పరిశుభ్రమైన నీటిని క్రమం తప్పకుండా అందించడం వల్ల గర్భస్థ దూడ ఎదుగుదల మెరుగుపడటంతో పాటు, భవిష్యత్తులో పాల ఉత్పత్తికి కూడా అనుకూలంగా ఉంటుంది.

చూడి కాలం – రెండవ దశ (4–6 నెలలు) – పిండం అవయవాల అభివృద్ధి దశ

మూడవ దశ (7–9 నెలలు) – వేగవంతమైన పిండం పెరుగుదల దశ
చూడి కాలంలో దూడ బరువులో సుమారు 70 శాతం చివరి మూడు నెలల్లోనే పెరుగుతుంది. అందువల్ల ఈ దశలో పశువుకు పోషకాహార అవసరాలు అత్యధికంగా ఉంటాయి. సరిపడా శక్తి, మాంసకృత్తులు, విటమిన్లు మరియు ఖనిజాలు అందకపోతే బలహీనమైన దూడలు పుట్టడం, తక్కువ జనన బరువు, ఈనిన తర్వాత పాలజ్వరం (Milk Fever), గర్భకోశం ఆలస్యంగా బయటకు రావడం (Retained Placenta), కీటోసిస్ వంటి జీవక్రియ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఈ దశలోనే ఈనడానికి సుమారు 60 రోజుల ముందు పాలు పితకడం నిలిపివేసే కాలాన్ని “డ్రై పీరియడ్” అంటారు. ఈ కాలంలో పాల గ్రంథి కణజాలం పునరుద్ధరణ చెందుతుంది మరియు తరువాతి ఈతలో అధిక పాల ఉత్పత్తికి సిద్ధమవుతుంది. కాబట్టి డ్రై పీరియడ్‌ను నిర్లక్ష్యం చేయకుండా, సమతుల్య పోషకాహారం, ఖనిజ మిశ్రమం, పరిశుభ్రమైన నీరు, తగిన వ్యాయామం మరియు పశువైద్యుని సూచించిన టీకాలు, నులిపురుగుల నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి.

మూడవ దశ (7–9 నెలలు) – వేగవంతమైన పిండం పెరుగుదల దశ

పోషకాహార యాజమాన్యం
చూడి పశువులలో ఆరోగ్యవంతమైన దూడ జననం, సులభ ప్రసవం మరియు ఈనిన తర్వాత అధిక పాల ఉత్పత్తికి సమతుల్య పోషకాహారం అత్యంత అవసరం. చూడి కాలంలో పిండం ఎదుగుదల దశను బట్టి శక్తి (Energy), మాంసకృత్తులు (Protein), ఖనిజాలు (Minerals), విటమిన్లు (Vitamins) మరియు పరిశుభ్రమైన తాగునీరు తగిన మోతాదులో అందించాలి. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పిండం వేగంగా పెరుగుతుంది కాబట్టి పోషకాహార అవసరాలు కూడా పెరుగుతాయి.

తొలి మరియు మధ్య దశల్లోపోషణ (0–6 నెలలు)

  • పశువు శరీర స్థితి స్కోరు (BCS) 3.0–3.5 మధ్య ఉండేలా చూసుకోవాలి.
  • పచ్చిమేత, ఎండుమేత, సమతుల్య దాణాను శరీర బరువు, పాల దిగుబడి మరియు చూడి దశకు అనుగుణంగా అందించాలి.
  • పప్పుజాతి, గడ్డి జాతి పచ్చిమేతలను సమతుల్యంగా ఇవ్వడం మంచిది.
  • అధిక దాణా ఇచ్చి పశువును లావుగా చేయకూడదు. ఇది ప్రసవ సమయంలో ఇబ్బందులు మరియు జీవక్రియ సమస్యలకు దారితీయవచ్చు.
  • ఎల్లప్పుడూ పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి.

డ్రై పీరియడ్ (ఈనడానికి 60 రోజుల ముందు)
ఈనడానికి సుమారు 60 రోజుల ముందు పాలు పితకడం నిలిపివేయాలి. ఈ కాలంలో పాల గ్రంథి పునరుద్ధరణ చెంది, తదుపరి ఈతలో అధిక పాల ఉత్పత్తికి సిద్ధమవుతుంది. డ్రై పీరియడ్‌ను రెండు దశలుగా విభజిస్తారు.

  • డ్రై పీరియడ్ (60–21 రోజులు): నాణ్యమైన పచ్చిమేత, ఎండుమేతతో కూడిన సాధారణ నిర్వహణ ఆహారం సరిపోతుంది.
  • ట్రాన్సిషన్ పీరియడ్ (చివరి 21 రోజులు): శక్తి, మాంసకృత్తుల మోతాదును క్రమంగా పెంచుతూ, ప్రసవం మరియు తదుపరి పాల ఉత్పత్తికి పశువును సిద్ధం చేయాలి. ఆకస్మికంగా ఆహారం మార్చకూడదు.

ఖనిజ మిశ్రమం (Mineral Mixture) సప్లిమెంటేషన్
చూడి పశువులకు కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, జింక్, కాపర్, సెలీనియం వంటి ఖనిజాలు తగిన మోతాదులో అందకపోతే పాలజ్వరం, మాయ నిలిచిపోవడం, బలహీనమైన దూడలు పుట్టడం వంటి సమస్యలు సంభవిస్తాయి. అందువల్ల రోజువారీ దాణాతో పాటు నాణ్యమైన ఖనిజ మిశ్రమాన్ని అందించడం అవసరం.

తెలంగాణ రాష్ట్రంలోని పి.వి. నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన “తెలమిన్” వంటి సమతుల్య ఖనిజ మిశ్రమాల వినియోగం వల్ల చూడి పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి పనితీరు మెరుగుపడినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, పశువైద్యుని సలహా మేరకు సిఫారసు చేసిన మోతాదులో ఖనిజ మిశ్రమాన్ని వాడటం ఉత్తమం.

ఖనిజ మిశ్రమం (Mineral Mixture) సప్లిమెంటేషన్

పొదుగు సంరక్షణ
డ్రై పీరియడ్ ప్రారంభంలో పొదుగును పూర్తిగా పరిశీలించి, పొదుగువాపు (Mastitis) లక్షణాలు లేవని నిర్ధారించుకోవాలి. ప్రతి చనుమొనలో గాయాలు, వాపు, గడ్డలు లేదా అసాధారణ స్రావం ఉన్నాయో లేదో గమనించాలి. పశువైద్యుని సలహా మేరకు డ్రై కౌ థెరపీ (Dry Cow Therapy) చేయించడం వల్ల డ్రై పీరియడ్‌లో పొదుగు ఇన్ఫెక్షన్లను నివారించడమే కాకుండా, తదుపరి ఈతలో పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఈనడానికి కొద్ది రోజుల ముందు పొదుగు క్రమంగా నిండడం, గట్టిపడటం సహజం. అయితే అధిక వాపు, వేడి, ఎర్రబడటం లేదా నొప్పి కనిపిస్తే వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

ఈనడానికి ముందు కనిపించే లక్షణాలు
ఈనడానికి కొన్ని రోజులు లేదా గంటల ముందు పశువులో ఈ మార్పులు కనిపిస్తాయి.

  • పొదుగు పూర్తిగా నిండి, చనుమొనల వద్ద మైనం వంటి పదార్థం (Waxing) కనిపించడం.
  • పెల్విక్ కండరాలు వదులై, తోక రెండువైపులా గుంతలు పడటం.
  • యోని నుండి పారదర్శక జిగురు (మ్యూకస్) స్రావం రావడం.
  • పశువు అశాంతిగా ఉండటం, పదేపదే పడుకోవడం, లేవడం, ఆహారం తగ్గించడం లేదా ఒంటరిగా ఉండాలని ప్రయత్నించడం.

ప్రసవానికి సన్నాహాలు

  • శుభ్రమైన, పొడి, గాలి ప్రసరణ బాగా ఉండే ప్రత్యేక ప్రసవ స్థలాన్ని సిద్ధం చేయాలి.
  • నేలపై పొడి ఎండుగడ్డి లేదా పరిశుభ్రమైన పరుపు వేయాలి.
  • పరిశుభ్రమైన నీరు, తువాళ్లు, అయోడిన్ ద్రావణం, గ్లౌజులు వంటి అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచాలి.
  • స్థానిక పశువైద్యుని ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచుకోవాలి.
  • నీరు పగిలిన తర్వాత 2–3 గంటల్లో ప్రసవం పూర్తికాకపోయినా లేదా దూడ తప్పు భంగిమలో కనిపించినా వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

ఈనిన తర్వాత తలెత్తే సాధారణ సమస్యలు
పోషకాహార లోపం, అపరిశుభ్రత లేదా సరైన యాజమాన్యం లేకపోవడం వల్ల ఈనిన తర్వాత కొన్ని సమస్యలు కనిపించవచ్చు.

సమస్య
పాలజ్వరం (Milk Fever):

వివరణ / జాగ్రత్తలు: రక్తంలో కాల్షియం తగ్గడం వల్ల వస్తుంది. పశువు నిలబడలేకపోవడం, తలను పక్కకు వంచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే చికిత్స అవసరం.

సమస్య: మాయ నిలిచిపోవడం (Retained Placenta)

వివరణ / జాగ్రత్తలు: ఈనిన 12–24 గంటల్లో మాయ పడకపోతే బలవంతంగా లాగకూడదు. వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

సమస్య గర్భాశయ ఇన్ఫెక్షన్ (Metritis)*

వివరణ / జాగ్రత్తలు: అపరిశుభ్ర ప్రసవం వల్ల వస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే తదుపరి చూడిపై ప్రభావం పడుతుంది.

సమస్య కీటోసిస్ (Ketosis):

వివరణ / జాగ్రత్తలు: ఈనిన తర్వాత శక్తి కొరత వల్ల వస్తుంది. ఆకలి తగ్గడం, పాల దిగుబడి తగ్గడం ప్రధాన లక్షణాలు.

జున్ను (Colostrum) నిర్వహణ
ఈనిన వెంటనే వచ్చే మొదటి పాలను జున్ను (Colostrum) అంటారు. ఇందులో రోగనిరోధక ప్రతిరక్షకాలు (Antibodies), విటమిన్-ఎ మరియు అధిక పోషక విలువలు ఉంటాయి. దూడకు జీవితంలో మొదటి రోగనిరోధక శక్తి జున్ను ద్వారానే లభిస్తుంది. అందువల్ల ఈనిన 1–2 గంటల్లోపు దూడకు తగిన మోతాదులో జున్ను తాగించాలి. ఆలస్యమైతే దూడ పేగులు ప్రతిరక్షకాలను గ్రహించే సామర్థ్యం వేగంగా తగ్గిపోతుంది. కాబట్టి మొదటి 24 గంటల్లో శరీర బరువులో సుమారు 10% మేర జున్ను అందించడం ఉత్తమ నిర్వహణ పద్ధతిగా భావిస్తారు.

రైతులు తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు

చేయవలసినవి
✔️ డ్రై పీరియడ్‌ను కనీసం 45–60 రోజులు తప్పనిసరిగా పాటించాలి.
✔️ సమతుల్య పోషకాహారం, ఖనిజ మిశ్రమం మరియు పరిశుభ్రమైన నీటిని ప్రతిరోజూ అందించాలి.
✔️ టీకాలు, నట్టల నివారణ, ఆరోగ్య పరీక్షలను షెడ్యూల్ ప్రకారం చేయించాలి.
✔️ ఈనడానికి ముందు లక్షణాలను గమనిస్తూ పశువును ప్రత్యేకంగా పరిశీలించాలి.
✔️ ప్రసవం అనంతరం పశువు మరియు దూడ ఆరోగ్యాన్ని మొదటి 24 గంటలు ప్రత్యేకంగా గమనించాలి.

చేయకూడనివి
✘ చివరి మూడు నెలల్లో అధిక దూరం నడిపించడం లేదా అధిక శ్రమ చేయించడం.
✘ ఆకస్మికంగా దాణా లేదా మేతలో పెద్ద మార్పులు చేయడం.
✘ మాయ నిలిచిపోయినప్పుడు స్వయంగా లాగే ప్రయత్నం చేయడం.
✘ అనుభవం లేని వ్యక్తులతో కష్టమైన ప్రసవాలు చేయించడం.

ముగింపు
చూడి పశువుల సంరక్షణ అనేది ఆరోగ్యవంతమైన దూడ, సులభ ప్రసవం, అధిక పాల ఉత్పత్తి మరియు పశువు దీర్ఘకాలిక పునరుత్పత్తి సామర్థ్యానికి పునాది. సమతుల్య పోషకాహారం, సరైన డ్రై పీరియడ్ నిర్వహణ, ఖనిజ మిశ్రమం వినియోగం, సకాలంలో టీకాలు, పరిశుభ్రమైన ప్రసవ నిర్వహణ మరియు పశువైద్యుని సలహాలను పాటించడం ద్వారా ఈనిన తర్వాత వచ్చే సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు. శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రతి పాడి రైతు ఆరోగ్యవంతమైన పశువులు, అధిక పాల దిగుబడి మరియు మెరుగైన ఆర్థిక లాభాలను సాధించగలడు.

డా. ఎ. సురేష్ నాయక్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌. Ph: 9491394455

Read More

ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులలో మన పశువులను మరియు కోళ్లను కాపాడుకుందాం ఇలా..!- డా. జి. మిథున్

ఎండలు ముదురుతున్న కొద్దీ మనుషులకే కాదు, పశువులు-కోళ్లకు కూడా వేడి ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు మేత, తాగునీటి లభ్యత తగ్గితే పశువుల ఆరోగ్యం, పాలు, మాంస ఉత్పత్తి, కోళ్లలో గుడ్లు, మాంస ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం రండి.

మన పశువులు ఎంత వేడిని తట్టుకోగలవు?
• సంకర జాతి (క్రాస్‌బ్రీడ్) ఆవులు: 27°C వరకు మాత్రమే హాయిగా ఉంటాయి
• మన దేశీ ఆవులు (ఒంగోలు లాంటివి): 33°C వరకు తట్టుకుంటాయి
• గేదెలు: 36°C వరకు తట్టుకుంటాయి
అంటే ఒంగోలు, పుంగనూరు లాంటి మన స్థానిక జాతులు ఎండను ఎక్కువగా తట్టుకుంటాయి. అందుకే వీటిని పూర్తిగా వదిలేయకుండా పెంచుకోవడం మంచిది.

ఉష్ణ ఒత్తిడి (ఎండదెబ్బ/ వేసవితాపం) – గుర్తించడం, వెంటనే చేయాల్సినవి
లక్షణాలు: మేత మానేయడం, నోరు తెరిచి రొప్పుతూ ఊపిరి తీయడం, నాలుక వేలాడేసి చొంగ కార్చడం, పాలు దిగుబడి తగ్గడం, పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోవడాన్ని మనం చూడవచ్చును. చిన్న దూడలు, చూడి పశువులు, గేదెలపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

వెంటనే చేయాల్సినవి:
• జ్వరం తగ్గించే మందులు ఈ సమయమునందు ఉపయోగపడవు – చల్లటి నీళ్లతోనే చికిత్స.
• తడి గోనె సంచి లేదా గుడ్డను పశువు శరీరంపై కప్పి, తరచూ చల్లటి నీటితో తడపాలి.
• ఫ్యాన్/స్ప్రింక్లర్లను ప్రతి అరగంటకోసారి 5 నుండి 10 నిమిషాలు వేయడం మంచిది.
• ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని పశువులకి తాగించాలి. ఇంటి వద్దనే ఎలక్ట్రోలైట్ ద్రావణం తయారి: పెద్ద పశువులకు, 20 లీటర్ల నీళ్లలో 160 గ్రా ఉప్పు + పొటాషియం క్లోరైడ్ 20 గ్రా (4 స్పూన్లు) + కాల్షియం క్లోరైడ్ 10 గ్రా + ప్రొపైలిన్ గ్లైకాల్ 300 మి.లీ కలిపి తాగించాలి.
• పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తే పశువైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

షెడ్డు మరియు నీళ్ల ఏర్పాట్లు
• పైకప్పుకు తెల్ల సున్నం వేస్తే లోపలి వేడి 2°C వరకు తగ్గుతుంది – చాలా చౌక ఉపాయం.
• షెడ్డు గోడలకు తడి గోనె సంచులు కట్టి రోజుకు 3-5 సార్లు తడపాలి.
• వరిగడ్డి లేదా కొబ్బరాకులతో పైకప్పు కప్పితే వేడి తగ్గుతుంది.
• ప్రతి పశువుకు రోజుకు 40 నుండి 60 లీటర్ల నీళ్లు కావాలి – నీళ్ల తొట్టెలు నీడలో పెట్టాలి.
• మేతకు ఉదయం 6 – 11, సాయంత్రం 4 – 6 గంటల మధ్యే పంపాలి. మధ్యాహ్నం షెడ్డులోనే ఉంచాలి.

గ్రాసం మరియు దాణా ఏర్పాట్లు
కరువును తట్టుకునే మేత రకాలు (APBN-1, CO-4, CO-5, తెలంగాణ జొన్న CSV-41 వంటివి) ఇప్పుడే వేసుకోవాలి.

మిగిలిన మేతను నిల్వ చేసుకునే 2 పద్ధతులు:

  1. సైలేజి (మాగుడు గడ్డి): పచ్చిమేతను చిన్న ముక్కలుగా కోసి, గాలి చొరబడకుండా గుంతలో లేదా సైలేజ్‌ బంకర్‌లో బాగా నొక్కి కుదించి, పైభాగాన్ని ప్లాస్టిక్‌ లేదా టార్పాలిన్‌తో గట్టిగా మూసివేయాలి. సుమారు 3 నుండి 4 వారాలు పులియబెట్టిన తర్వాత సైలేజ్‌గా ఉపయోగించుకోవచ్చు. గాలి, నీరు లోపలికి చొరబడకుండా చూడటం మంచి నాణ్యమైన సైలేజ్‌కు అత్యంత ముఖ్యం.
  2. యూరియా గడ్డి: 100 కిలోల వరిగడ్డికి 4 కిలోల యూరియా 50 నుండి 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి, గాలి తగలకుండా 3 వారాలు మూసి ఉంచాలి.
    మేత దొరకనప్పుడు: వేరుశనగ పొట్టు, పత్తి లేదా మొక్కజొన్న కాడలు, రావి-మర్రి-మామిడి-వేప ఆకులు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు వాడుకోవచ్చు.

దాణాలో కలపాల్సినవి: రోజుకు మినరల్ మిక్చర్ 50-100 గ్రా, టన్ను దాణాకు విటమిన్-సి 100 గ్రా + విటమిన్-ఇ 50 గ్రా.

రైతులు మర్చిపోకూడని విషయం – పునరుత్పత్తి
ఎండ వేడికి ఆవులు/గేదెల్లో ఎద లక్షణాలు సరిగ్గా కనిపించవు (సైలెంట్ హీట్), గర్భం ఆలస్యమవుతుంది, పదే పదే కట్టు సూది వేయించినా కట్టు నిలవదు (రిపీట్ బ్రీడింగ్). దీనికి పరిష్కారాలు:
• రోజుకు 2 సార్లు (తెల్లవారుజామున, సాయంత్రం) ఎద లక్షణాల కోసం పశువును జాగ్రత్తగా గమనించాలి.
• పదేపదే ఎదకు వచ్చినా గర్భం దాల్చని పశువులను పశువైద్యుడితో పరీక్షించించి, ఆయన సూచన మేరకు PGF2 వంటి హార్మోన్ చికిత్సను చేయించాలి.
• పశువు ఈనిన తేదీ, మరలా కట్టిన తేదీ వంటి ముఖ్యమైన వివరాలను రాసి పెట్టుకోవాలి.

వ్యాధులు మరియు పురుగుల నియంత్రణ
వేసవికాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉన్నందున, పశువులకు అవసరమైన టీకాలను పశువైద్యుల సూచన మేరకు సకాలంలో వేయించాలి.

కాలేయ పురుగులు, గోమార్లు, పేలు వంటి పరాన్నజీవుల నియంత్రణకై:
• దవడ కింద వాపు, కళ్లు లేదా చిగుళ్లు తెల్లగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
• పశువైద్యుల సూచన లేకుండా ఒకే రకం డీవార్మింగ్‌ మందును పదేపదే ఉపయోగించకూడదు.
• పశువుల పేడ, మురుగునీరు షెడ్‌ పరిసరాల్లో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.

కోళ్ల పెంపకందారులకు జాగ్రత్తలు
కోళ్లకు చెమట గ్రంథులు ఉండవు కాబట్టి వేసవి వేడిని తట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల వేసవిలో నీటి అవసరం 3 నుండి 4 రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున, ఎప్పుడూ చల్లటి, పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. ట్యాంకులో వేడెక్కిన నీటిని ముందుగా తొలగించి కొత్త నీరు పెట్టాలి. ఈ వేసవి సమయంలో కోళ్లు తగినంత నీరు తాగేలా 0.2% ఉప్పు కలిపిన నీటిని అందించవచ్చు.
• షెడ్ పైకప్పుకు సున్నం పూత వేయడం, తడి గోనె సంచులు ఏర్పాటు చేయడం ద్వారా లోపలి వేడిని తగ్గించాలి.
• వేడి తక్కువగా ఉండే సమయాల్లోనే మేతను అందించడం మంచిది; ముఖ్యంగా తెల్లవారుజామున 4-5 గంటల మధ్య, రాత్రి 12-1 గంటల మధ్య మేత ఇవ్వవచ్చు.
• ఇంటి వద్ద దాణా తయారు చేసేటప్పుడు 5 భాగాల మొక్కజొన్న + 2 భాగాల జొన్న/సజ్జలు + 2 భాగాల వేరుశనగ/సోయా పిండి + గుడ్డు పెంకుల పొడి మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
• వేసవి కాలంలో షెడ్‌లోని కోళ్ల సంఖ్యను సుమారు 10% తగ్గించి, వాటికి తగినంత స్థలం కల్పించాలి.
• న్యూకాజిల్ (రాణిఖేత్), గంబోరో వంటి వ్యాధులకు సంబంధించిన టీకాలను నిర్ణీత సమయంలో వేయించాలి.

ప్రభుత్వ పథకాల సాయం
• జాతీయ పశుసంపద మిషన్ (NLM): పశుగ్రాస యూనిట్లు, సైలేజ్/హే యూనిట్లకు 50% సబ్సిడీ (గరిష్టం రూ.50 లక్షలు) కోసం ఈ nlm.udyamimitra.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
• అన్నదాత సుఖీభవ పథకం: అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా ఈ పధకం ద్వారా ఆర్థిక సాయం. దీన్ని మేత కొనుగోలు, షెడ్డు మరమ్మతులకు వాడుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

  1. పశువులకు తగినంత నీరు తరచుగా అందించాలి.
  2. నీడ, గాలి ప్రసరణ ఉండేలా చూడటం మరియు తడి గోనె సంచులతో వేడి తగ్గించడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలి.
  3. ముందుగానే మేత పండించి, అవసరమైనంత నిల్వ చేసుకోవాలి. తీవ్ర ఎండలో పశువులను కట్టివేయడం మానివేయ్యాలి. ఎద లక్షణాలను జాగ్రతగా గమనించుకోవాలి.
  4. కోళ్లకు చల్లటి నీరు, అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందించి వేడి ఒత్తిడిని తగ్గించాలి.
  5. నష్టభయంతో పశువులను తొందరపడి అమ్మకుండా, ప్రభుత్వ సహాయ పథకాలను వినియోగించుకోవాలి.
    స్థానిక పశువైద్యులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటిస్తే మన పశు సంపదపై ఎల్‌నినో ప్రభావాన్ని బాగా తగ్గించుకోవచ్చు.

డా. జి. మిథున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (CTF),
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్యా విభాగము,
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,
పశువైద్య కళాశాల, గరివిడి. మొబైల్: 7799804000.

Read More

పశువుల్లో గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్)

దేశవాళి పశువుల్లో కన్నా సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దేశవాళి పశువుల్లో ప్రాణనష్టం అంతగా ఉండదు. ఎద్దులు వ్యవసాయ పనులు సరిగా చేయవు. మార్చి, ఏప్రిల్ మరియు ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.

వ్యాధి ఎలా వస్తుంది?
వ్యాధి సోకిన ఆవులు, గేదెల పాలద్వారా దూడలకు వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు:

  • జ్వర తీవ్రత 104-106 డిగ్రీల ఫారెన్‌హీట్ పెరిగి పశువులు నీరసించి పోతాయి.
  • పశువుల నోటిలో, చిగుళ్ళపై పొక్కులు ఏర్పడటం చేత పశువుల మేత, నీరు తీసుకోక నీరసించి పోతాయి. నోటి నుండి చొంగకారుతూ ఉంటుంది.
  • నోరు మరియు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి, 3, 4 వారాల్లో బొబ్బలు చితికి పుండ్లుగా మారి చర్మము గరుకుగా తయారవుతుంది.
  • పాలఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది.
  • గిట్టలలో పుండ్లు ఏర్పడటం వలన ఎద్దులు వ్యవసాయ పనులు చేయలేవు.

వ్యాధిని ఎలా నివారించాలి?

  • వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి.
  • పశువుల పాకలను క్రిమిసంహారక మందులతో, వాషింగ్ సోడాతో కడగాలి.
  • వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలను, గడ్డితో కాల్చివేయాలి.
  • చనిపోయిన పశువును, సున్నపు గోతిలో పూడ్చాలి
  • వ్యాధి సోకిన పశువుల పాలను దూడలకు త్రాగించకూడదు.
  • మార్చి – ఏప్రిల్ మరియు ఆగస్టు – సెప్టెంబరు మాసాలకు ముందుగా వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలి.

చికిత్స:

  • కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, ఈగలు వాలకుండా నీమ్‌లెంట్, వేపనూనె పూయాలి.
  • నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి.
  • డాక్టరును సంప్రదించి అవసరమైన యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడాలి.

కస్తూరి దిలీప్, పిహెచ్.డి. స్కాలర్, వి.వి.వి. అమృత్‌కుమార్, ప్రొఫెసర్, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్: 9391097150

Read More

పశువులకు బీమా ఎందుకు అవసరం?రైతు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

“పశువు రైతుకు కేవలం ఒక జీవి కాదు… అది కుటుంబానికి ఆదాయం ఇచ్చే ఆస్తి.”
ఒక రైతు తన ఇంట్లో రెండు లేదా మూడు పాలిచ్చే పశువులను పెంచుకుంటున్నాడని అనుకుందాం. ప్రతిరోజూ వచ్చే పాల ఆదాయం ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు, పశువుల మేతకు కొంత అండగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ పశువు అనారోగ్యంతో మరణిస్తే లేదా ప్రమాదానికి గురైతే? పశువును కోల్పోవడంతో పాటు, రైతు కుటుంబానికి వచ్చే రోజువారీ ఆదాయం కూడా ఆగిపోతుంది.

ఇలాంటి అనుకోని ఆర్థిక నష్టాన్ని కొంతవరకు భర్తీ చేయడానికి పశువుల బీమా (Livestock Insurance) ఎంతో ఉపయోగపడుతుంది.

పశువుల బీమా అంటే ఏమిటి?
సులభంగా చెప్పాలంటే, పశువులకు బీమా అనేది అనుకోని ప్రమాదాల వల్ల పశువును కోల్పోయినప్పుడు రైతుకు ఆర్థిక రక్షణ కల్పించే వ్యవస్థ.

రైతు నిర్ణీత ప్రీమియం చెల్లించి బీమా పాలసీ తీసుకుంటాడు. పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా చేసిన పశువు మరణించినప్పుడు, అవసరమైన ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీమా సంస్థ రైతుకు పాలసీలో నిర్ణయించిన పరిహారాన్ని అందిస్తుంది.

అంటే, బీమా పశువును తిరిగి తీసుకురాదు. కానీ పశువును కోల్పోయిన తర్వాత రైతు కుటుంబంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.

పశువులకు బీమా ఎందుకు అవసరం?

  1. పశువు రైతుకు ఒక పెట్టుబడి
    ఒక మంచి పాలిచ్చే ఆవు లేదా గేదెను కొనుగోలు చేయడానికి రైతు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తాడు. పశువు ద్వారా పాలు, దూడలు, పేడ వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
    అందువల్ల పశువు ఒక ఉత్పాదక ఆస్తి. ఈ ఆస్తిని అనుకోని నష్టం నుంచి రక్షించుకోవడానికి బీమా ఒక ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది.
  2. అనుకోని ప్రమాదాలకు ఆర్థిక రక్షణ
    పశువులకు వ్యాధులు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అనేక ప్రమాదాలు ఎదురవుతాయి. రైతు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ప్రతి ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదు.
    ఉదాహరణకు: పశువు మరణం → ఆస్తి నష్టం → పాల ఆదాయం నిలిచిపోవడం → కుటుంబంపై ఆర్థిక ఒత్తిడి
    ఇలాంటి పరిస్థితుల్లో బీమా పరిహారం రైతుకు కొంత ఆర్థిక ఊరటనిస్తుంది.
  3. చిన్న రైతులకు మరింత ఉపయోగకరం
    పెద్ద రైతు ఒక పశువును కోల్పోయినా ఇతర పశువుల ద్వారా కొంత ఆదాయం పొందగలడు. కానీ ఒకటి లేదా రెండు పశువులపై ఆధారపడే చిన్న రైతు కుటుంబానికి ఒక పశువు నష్టం కూడా పెద్ద ఆర్థిక సమస్యగా మారవచ్చు. అందుకే చిన్న, సన్నకారు రైతులకు పశువుల బీమా ప్రత్యేకంగా ఉపయోగకరం.

ఏ పశువులకు బీమా చేయవచ్చు?
ప్రభుత్వ పథకాల మార్గదర్శకాల ప్రకారం బీమా పరిధిలో పాలు ఇచ్చే దేశీ/క్రాస్బ్రీడ్ పశువులతో పాటు కొన్ని ఇతర పశువులు కూడా ఉండవచ్చు. గొర్రెలు, మేకలు, పందులు, కుందేళ్లు, యాక్, మిథున్ వంటి పశువులు కూడా సంబంధిత నిబంధనల ప్రకారం పరిధిలోకి రావచ్చు. ప్యాక్ యానిమల్స్గా గుర్రాలు, గాడిదలు, మ్యూల్స్, ఒంటెలు, పోనీలు వంటి జంతువులు కూడా పథక పరిధిలో ఉండవచ్చు. అయితే ఏ జంతువుకు, ఏ పరిస్థితుల్లో, ఎంతవరకు బీమా అందుబాటులో ఉందో రాష్ట్రంలో అమలులో ఉన్న తాజా మార్గదర్శకాలు మరియు పాలసీ నిబంధనల ఆధారంగా తెలుసుకోవాలి.

బీమా ఎలా పనిచేస్తుంది?
రైతు ముందుగా బీమా చేయించాలనుకునే పశువును ఎంపిక చేసుకోవాలి. అనంతరం పశువుకు సంబంధించిన గుర్తింపు వివరాలను నమోదు చేసి, దాని విలువను నిర్ణయిస్తారు. ఈ వివరాల ఆధారంగా బీమా పాలసీ తీసుకుని, నిర్ణయించిన ప్రీమియాన్ని చెల్లించాలి. పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత, పాలసీ నిబంధనలకు లోబడి పశువుకు అనుకోని నష్టం సంభవించినట్లయితే, రైతు వెంటనే సంబంధిత బీమా సంస్థ లేదా అధికారికి సమాచారం ఇవ్వాలి. అనంతరం పశువైద్య లేదా బీమా సంస్థ ప్రతినిధులు అవసరమైన పరిశీలన, ధృవీకరణ చేపడతారు. రైతు క్లెయిమ్కు అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత, బీమా సంస్థ క్లెయిమ్ను పరిశీలిస్తుంది. పాలసీ నిబంధనలకు అనుగుణంగా క్లెయిమ్ అర్హత పొందితే, రైతుకు నిర్ణయించిన పరిహారం చెల్లించబడుతుంది. అందువల్ల బీమా తీసుకోవడం మాత్రమే కాదు, పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

రైతు బీమా తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

  1. పశువు విలువను సరిగ్గా నమోదు చేయాలి
    బీమా తీసుకునే సమయంలో పశువు విలువను ఎలా నిర్ణయిస్తున్నారు? ఎవరు విలువను ధృవీకరిస్తారు? పాలసీలో ఎంత మొత్తానికి బీమా చేస్తున్నారు? వంటి విషయాలను రైతు వివరంగా తెలుసుకోవాలి.
  2. పశువు గుర్తింపు చాలా ముఖ్యం
    పశువును ఇతర పశువులతో గందరగోళం కాకుండా గుర్తించడానికి చెవి ట్యాగ్, ప్రత్యేక గుర్తింపు లేదా సంబంధిత అధికారిక గుర్తింపు విధానం ఉపయోగించవచ్చు. గుర్తింపు వివరాలు సరిగ్గా నమోదు చేయడం క్లెయిమ్ సమయంలో ఎంతో ముఖ్యమైనది.
  3. పాలసీ కాలాన్ని తెలుసుకోవాలి
    పాలసీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలులో ఉంటుంది? ఎప్పుడు పునరుద్ధరించాలి? అనే విషయాలను రైతు గుర్తుంచుకోవాలి. ప్రస్తుత జాతీయ మార్గదర్శకాలు సాధ్యమైన చోట ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి బీమా చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
  4. ఏ నష్టాలకు పరిహారం వస్తుందో తెలుసుకోవాలి
    “బీమా ఉంది కాబట్టి ఏ కారణంతో పశువు చనిపోయినా డబ్బు వస్తుంది” అనుకోవడం సరికాదు. ప్రతి పాలసీకి కొన్ని నిబంధనలు, మినహాయింపులు (exclusions), క్లెయిమ్ విధానాలు ఉంటాయి.
    అందువల్ల పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు:
    • ఏ ప్రమాదాలు కవర్ అవుతాయి?
    • ఏ పరిస్థితుల్లో క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు?
    • ఏ పత్రాలు అవసరం?
    • నష్టం జరిగినప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వాలి?
    • ఎంత సమయంలోపు సమాచారం ఇవ్వాలి?

పశువు మరణించినప్పుడు రైతు ఏం చేయాలి?
ఇది చాలా ముఖ్యమైన విషయం.
పశువు బీమా చేసిన తర్వాత అనుకోని కారణంతో మరణిస్తే, రైతు వెంటనే సంబంధిత బీమా సంస్థ/అధికారిక ప్రతినిధి/సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
అవసరమైన గుర్తింపు, పశువైద్య ధృవీకరణ, మరణానికి సంబంధించిన పత్రాలు, పాలసీ వివరాలు వంటి వాటిని నిబంధనల ప్రకారం సమర్పించాలి.
పశువు మరణించిన వెంటనే తొందరపడి మృతదేహాన్ని తొలగించడం లేదా అవసరమైన పరిశీలనకు అవకాశం లేకుండా చేయడం క్లెయిమ్ ప్రక్రియలో సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ముందుగానే సంబంధిత అధికారుల సూచనలు తెలుసుకోవడం మంచిది.

“బీమా అంటే అదనపు ఖర్చు” అనే ఆలోచన సరైనదేనా?
• చాలామంది రైతులు, “పశువుకు బీమా చేయడానికి డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి?” అని అనుకుంటారు. కానీ దీన్ని మరో విధంగా ఆలోచించాలి.
• ప్రీమియం – రక్షణ కోసం చేసే చిన్న ముందస్తు ఖర్చు.
• పశువును పూర్తిగా కోల్పోయినప్పుడు కలిగే ఆర్థిక నష్టంతో పోలిస్తే, బీమా కోసం చెల్లించే రైతు వాటా తక్కువగా ఉండవచ్చు.
• అంతేకాదు, ప్రభుత్వ పథకాల కింద అర్హత ఉన్న రైతులకు ప్రీమియంపై సబ్సిడీ కూడా లభించవచ్చు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో పశుసంపద బీమా National Livestock Mission (NLM) లోని “Research & Development, Livestock Insurance, Extension and Innovation” ఉప-మిషన్లో భాగంగా కొనసాగుతోంది.

ప్రభుత్వ సహాయం గురించి రైతు తెలుసుకోవాల్సింది
ప్రస్తుత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పశుసంపద బీమాలో రైతు ప్రీమియం వాటాను తగ్గించే విధంగా ప్రభుత్వ సహాయం అందించే విధానం ఉంది. 2025–26 వార్షిక నివేదిక ప్రకారం, రైతు వాటా 15 శాతానికి తగ్గించబడింది, మిగిలిన 85 శాతం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్దిష్ట నిష్పత్తిలో భరించే విధానం అమలులో ఉంది. అయితే పథకం అమలు, అర్హత, రాష్ట్ర స్థాయి ప్రక్రియలు మారవచ్చు కాబట్టి రైతులు తమ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వద్ద తాజా వివరాలు తెలుసుకోవాలి.
ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం సబ్సిడీ ప్రయోజనం నిర్దిష్ట పరిమితిలోని పశువులకు వర్తిస్తుంది; ఆ పరిమితికి మించి పశువులకు బీమా చేయాలనుకుంటే కొన్ని సందర్భాల్లో పూర్తి ప్రీమియం చెల్లించి బీమా చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల “ప్రభుత్వం మొత్తం బీమా డబ్బు చెల్లిస్తుంది” అని భావించకూడదు.

బీమా తీసుకునే ముందు రైతు చెక్లిస్ట్
బీమా పాలసీ తీసుకునే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి:
• నా పశువుకు బీమా అర్హత ఉందా?
• పశువు విలువ ఎలా నిర్ణయించారు?
• బీమా మొత్తం ఎంత?
• నేను చెల్లించాల్సిన ప్రీమియం ఎంత?
• ప్రభుత్వ సబ్సిడీ వర్తిస్తుందా?
• పాలసీ కాలం ఎంత?
• ఏ ప్రమాదాలు కవర్ అవుతాయి?
• ఏ పరిస్థితుల్లో క్లెయిమ్ రాదు?
• పశువు మరణిస్తే ఎవరికి సమాచారం ఇవ్వాలి?
• ఏ పత్రాలు అవసరం?
• క్లెయిమ్ ఎన్ని రోజుల్లో నమోదు చేయాలి?
• బీమా సంస్థ/అధికారిక ప్రతినిధి సంప్రదింపు నంబర్ ఏమిటి?

బీమా ఒక్కటే రక్షణ కాదు
పశువులకు బీమా చేయడం మంచిదే. కానీ బీమా అనేది మంచి పశుపోషణకు ప్రత్యామ్నాయం కాదు.
పశువులను వ్యాధుల నుంచి రక్షించడానికి సమయానికి టీకాలు, సరైన పోషణ, పరిశుభ్రమైన నీరు, మంచి గాలి ప్రసరణ, సరైన మేత, శాస్త్రీయ ప్రజనన నిర్వహణ, సమయానుకూల పశువైద్యం అన్నీ అవసరం.
అదే విధంగా పశువుల ఆరోగ్య రికార్డులు, టీకాల వివరాలు, చికిత్స వివరాలు, కొనుగోలు వివరాలు వంటి వాటిని సురక్షితంగా భద్రపరచడం కూడా మంచిది.
ముగింపు
రైతు పశువును కేవలం “పశువు”గా చూడకూడదు. అది కుటుంబానికి ఆదాయం ఇచ్చే ఆస్తి. అది రైతు శ్రమకు ప్రతిఫలం. అది గ్రామీణ కుటుంబ ఆర్థిక భద్రతలో ఒక భాగం. అందుకే పశువుల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆర్థిక రక్షణ కూడా అవసరం. అనుకోని ప్రమాదాన్ని మనం ఎప్పుడూ ఆపలేకపోవచ్చు. కానీ దాని వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
“పశువును కాపాడటం బాధ్యత…పశువు విలువను కాపాడటం తెలివైన ఆర్థిక నిర్ణయం.”
కాబట్టి రైతు సోదరులు తమ ప్రాంతంలో అమలులో ఉన్న పశుసంపద బీమా పథకాల గురించి సమీప పశువైద్య కేంద్రం, పశుసంవర్ధక శాఖ కార్యాలయం లేదా అధికారిక బీమా ప్రతినిధి వద్ద వివరాలు తెలుసుకుని, అర్హత ఉన్న పశువులకు బీమా రక్షణను పరిశీలించడం మంచిది.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 9703121088

Read More

ఎల్నినో పరిస్థితుల్లో పాడి పశువులకు పశుగ్రాసాల ఎంపిక

    ఎల్నినో పరిస్థితుల్లో సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం అస్థిరంగా ఉండటం, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు మరియు నీటి లభ్యతలో మార్పులు వ్యవసాయంతో పాటు పశుపోషణపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 2026లో ఎల్నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు పంటలతో పాటు పశుసంపద, పశుగ్రాసం మరియు నీటి వనరుల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ICAR సంస్థలు కూడా సూచిస్తున్నాయి.ఎల్నినో పరిస్థితుల్లో పచ్చిమేత లభ్యత తగ్గితే పశువులకు పోషక పదార్థాల కొరత ఏర్పడి, పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల “పశుగ్రాస భద్రత – పాడి పశువుల ఆరోగ్యం – పాల ఉత్పత్తి – రైతు ఆదాయం” అనే నాలుగు అంశాలను సమగ్రంగా చూడాలి

పశుగ్రాసం అనగానే మన రైతులకు వరిగడ్డి, జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప, సజ్జ వంటి పంట అవశేషాలు గుర్తుకు వస్తాయి. అయితే వీటిలో పశువులకు అవసరమైన అన్ని పోషక పదార్థాలు తగిన స్థాయిలో ఉండవు. ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల్లో పచ్చిమేత కొరత ఏర్పడితే కేవలం ఎండుమేతపై ఆధారపడటం వల్ల పశువుల పోషక అవసరాలు పూర్తిగా తీరకపోవచ్చు.

అదే సమయంలో జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి ధాన్యాలను అధికంగా పశుదాణాలో ఉపయోగించడం ఆర్థికంగా కూడా భారమవుతుంది. కాబట్టి రైతులు తమ భూమి, నీటి లభ్యత మరియు పశువుల సంఖ్యకు అనుగుణంగా పచ్చిమేత + ఎండుమేత + కాయజాతి పశుగ్రాసాలు + అవసరమైన మిశ్రమ దాణా కలిపి సమతుల్య పశుగ్రాస ప్రణాళికను రూపొందించుకోవాలి.

I.ఎల్నినో పరిస్థితుల్లో పశుగ్రాసాల ఎంపిక ఎలా ఉండాలి

  1. ఒకటి లేదా రెండు పాడి పశువులు ఉన్న రైతులు
    సన్నకారు మరియు చిన్నకారు రైతులు తమ ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
    • సుబాబుల్, అవిస వంటి పశుగ్రాస చెట్లను పెంచుకోవాలి.
    • ఇంటి పరిసరాలు, పొలాల గట్లను పశుగ్రాస వనరులుగా ఉపయోగించుకోవాలి.
    • నీటి లభ్యత ఉన్నట్లయితే కొంత భూమిలో శాశ్వత పచ్చిమేతను సాగు చేయాలి.
    • పంట అవశేషాలను వృథా చేయకుండా ఎండుమేతగా నిల్వ చేసుకోవాలి.
    • ఎల్నినో సమయంలో అత్యవసర పరిస్థితులకు ముందుగానే పశుగ్రాస నిల్వ చేసుకోవాలి.
  2. మధ్యస్థ స్థాయిలో పాడి పశువులు ఉన్న రైతులు
    పాడి పశువుల సంఖ్య పెరిగిన కొద్దీ రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని తప్పనిసరిగా పశుగ్రాస సాగుకు కేటాయించాలి.

నీటి వసతి ఉన్న భూముల్లో హైబ్రిడ్ నేపియర్ రకాలు (CO-1, CO-2, CO-3) వంటి బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు లూసర్న్, అలసంద, అనుములు, హెడ్జ్ లూసర్న్, స్టైలో వంటి కాయజాతి పశుగ్రాసాలను కూడా పెంచుకోవాలి.
గడ్డిజాతి మరియు కాయజాతి పశుగ్రాసాలను కలిపి మేపడం ద్వారా పశువులకు మెరుగైన పోషక సమతుల్యతను అందించవచ్చు.

  1. పెద్దస్థాయి పాడి పరిశ్రమలు
    వాణిజ్య స్థాయిలో పాడి పరిశ్రమ నిర్వహించే రైతులు “సంవత్సరం పొడవునా పశుగ్రాస లభ్యత” అనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించుకోవాలి.
    • నీటి వసతి ఉన్న చోట బహువార్షిక పశుగ్రాసాలు.
    • వర్షాధార ప్రాంతాల్లో సీజనల్ పశుగ్రాసాలు.
    • అదనపు పచ్చిమేతను సైలేజీగా నిల్వ చేయడం.
    • పంట అవశేషాలను శాస్త్రీయ పద్ధతిలో ఎండుమేతగా నిల్వ చేయడం.
    • కాయజాతి పశుగ్రాసాల సాగు.
    • అత్యవసర పరిస్థితులకు ముందుగానే పశుగ్రాస బ్యాంకును ఏర్పాటు చేయడం.

II.నీటి లభ్యత ఆధారంగా పశుగ్రాసాల ఎంపిక
ఎల్నినో పరిస్థితుల్లో నీరు అత్యంత విలువైన వనరు. అందువల్ల నీటి లభ్యతను బట్టి పశుగ్రాసాలను ఎంపిక చేయాలి.

A.నీటి వసతి ఉన్న భూముల్లో:
హైబ్రిడ్ నేపియర్, గినీ గడ్డి, లూసర్న్, పేరాగడ్డి వంటి బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేయవచ్చు.

B.నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో:
జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి సీజనల్ పశుగ్రాసాలను వర్షాధారంగా సాగు చేయవచ్చు.

C.నీరు నిలిచే ప్రాంతాల్లో:
పేరాగడ్డి వంటి రకాలను అనువైన పరిస్థితుల్లో సాగు చేయవచ్చు

III.ఎల్నినో సమయంలో పశుగ్రాస భద్రత కోసం రైతులు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు

  1. తోటలలో / చెట్ల నీడల్లో – అనువైన పశుగ్రాసాలు : గినిగడ్డి, (మకుని), స్టైలో
  2. మిశ్రమ పంటగా పనికివచ్చే అనువైన పశుగ్రాసాలు : అలసంద, స్టైలో
  3. చవుడు భూములలో- అనువైన పశుగ్రాసాలు : రోడ్స్ గడ్డి
  4. తక్కువ వర్షపాతము గల ప్రాంతాలకు – అనువైన పశుగ్రాసాలు : సజ్జ
  5. నల్లరేగడి భూములకు – అనువైన పశుగ్రాసాలు : ఆఫ్రికన్ టాల్ రకపు మొక్కజొన్న ఎస్.ఎస్.జి
  6. ఎఱ్ఱభూములు, తేలిక పాటి భూములకు – అనువైన పశుగ్రాసాలు : ఏకవార్షికాలు- ఎస్.ఎస్.జి, ఎమ్.పి.చారి, సజ్జరకాలు బహువార్షికాలు- స్టైలో
  7. బంజరు, పడావు భూములలో – అనువైన పశుగ్రాసాలు : స్టైలో, అంజాన గడ్డి
  8. నీరునిలువ ఉండు భూములలో – అనువైన పశుగ్రాసాలు : పేరాగడ్డి
  9. ఎండుమేతగా నిలువ చేయుటకు – అనువైన పశుగ్రాసాలు : వరిగడ్డి, జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప, జనుము, అంజాన గడ్డి, గినిగడ్డి
  10. సైలేజి (పాతరగడ్డి) గా వాడుటకు – అనువైన పశుగ్రాసాలు : జొన్న, మొక్కజొన్న, నేపియర్ రకాలు
  11. యూరయాతో సుపోషకం చేసుకోవడానికి – అనువైన పశుగ్రాసాలు : వరిగడ్డి, ముక్కలుగా నరికిన జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప
  12. ముక్కలుగా (చాఫింగ్) నరికి మేపుటకు – అనువైన పశుగ్రాసాలు : జొన్న, సజ్జ, మొక్కజొన్న రకాలు
    ఇలాంటి ముందస్తు ప్రణాళిక ఎల్నినో వంటి వాతావరణ ఒత్తిడి సమయంలో పశుగ్రాస కొరతను తగ్గించడంలో పశుగ్రాస భద్రత, సైలేజీ తయారీ మరియు contingency preparedness సహాయపడుతుంది.

డా. ఎం. గంగా దేవి, సీనియర్ సైంటిస్ట్ (అగ్రానమీ),
డా. ఎం. యుగంధర్ కుమార్ , ప్రిన్సిపల్ సైంటిస్ట్, డా. కె. రవిచంద్ర, సైంటిస్ట్,
డా. సౌజన్య లక్ష్మి, సైంటిస్ట్
కృషి విజ్ఞాన కేంద్రం, లాం, గుంటూరు. Ph: 9490035258

Read More

పశువైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) వినియోగం: భవిష్యత్ పశుసంవర్ధకానికి నూతన దిశ

పరిచయం
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మరియు పశుసంవర్ధక రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) నేటి కాలంలో పశువైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. పశువుల ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల ముందస్తు గుర్తింపు, పాల ఉత్పత్తి పెంపు, సంతానోత్పత్తి నిర్వహణ, మేత నిర్వహణ మరియు వ్యవసాయ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో AI కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో కూడా పశుపాలక రైతులు ఆధునిక సాంకేతికతలను స్వీకరిస్తూ అధిక ఉత్పాదకత మరియు లాభదాయకత సాధిస్తున్నారు. AI ఆధారిత పరికరాలు, సెన్సర్లు, మొబైల్ యాప్‌లు మరియు డేటా విశ్లేషణ వ్యవస్థలు పశుసంవర్ధక రంగాన్ని స్మార్ట్ వ్యవస్థగా మార్చుతున్నాయి.

పశువుల ఆరోగ్య పర్యవేక్షణలో AI
పశువుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం సాధ్యమవుతోంది. ప్రస్తుతం పశువుల మెడకు లేదా కాళ్లకు ధరించే స్మార్ట్ కాలర్లు మరియు సెన్సర్లు శరీర ఉష్ణోగ్రత, కదలికలు, మేత తీసుకునే సమయం మరియు విశ్రాంతి వ్యవధిని నమోదు చేస్తాయి. ఈ సమాచారాన్ని AI సాఫ్ట్ వేర్ విశ్లేషించి జ్వరం, మాస్టిటిస్, జీర్ణ సమస్యలు లేదా ఇతర వ్యాధుల సంకేతాలను ముందుగానే గుర్తిస్తుంది. తద్వారా రైతులు మరియు పశువైద్యులు వెంటనే చికిత్స చర్యలు చేపట్టగలుగుతారు.

వ్యాధుల నిర్ధారణలో కృత్రిమ మేధస్సు
ఇటీవలి కాలంలో AI ఆధారిత మొబైల్ అప్లికేషన్లు పశువుల ఫోటోలు, వీడియోలు మరియు లక్షణాలను విశ్లేషించి సంభావ్య వ్యాధులను సూచిస్తున్నాయి. చర్మ వ్యాధులు, కుంటితనం (Lameness), మాస్టిటిస్, శ్వాసకోశ వ్యాధులు మరియు ఇతర అంటువ్యాధులను గుర్తించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడుతోంది. కొన్ని దేశాల్లో ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ మరియు ప్రయోగశాల పరీక్షల ఫలితాలను AI ద్వారా విశ్లేషించి వేగవంతమైన మరియు ఖచ్చితమైన నిర్ధారణ చేస్తున్నారు.

సంతానోత్పత్తి నిర్వహణలో AI
పాడి పశువులలో ఈస్ట్రస్ (Heat) గుర్తించడం రైతులకు ప్రధాన సవాలు. ప్రస్తుతం AI ఆధారిత సెన్సర్లు మరియు యాక్టివిటీ మానిటరింగ్ పరికరాలు పశువుల ప్రవర్తనలో మార్పులను గుర్తించి సరైన కృత్రిమ గర్భధారణ (AI) సమయాన్ని సూచిస్తున్నాయి.
దీని వల్ల:
• గర్భధారణ శాతం పెరుగుతుంది.
• ఖాళీ రోజులు తగ్గుతాయి.
• పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది.
• రైతుల ఆదాయం పెరుగుతుంది.

పాల ఉత్పత్తి పెంపులో AI
ఆధునిక డెయిరీ ఫార్ములలో AI ఆధారిత మిల్కింగ్ సిస్టమ్స్ వినియోగంలోకి వస్తున్నాయి. ఈ వ్యవస్థలు ప్రతి పశువు పాల ఉత్పత్తి, పాల నాణ్యత, కొవ్వు శాతం మరియు ఆరోగ్య స్థితిని నమోదు చేస్తాయి.

AI విశ్లేషణ ద్వారా:
• అధిక ఉత్పత్తి చేసే పశువులను గుర్తించవచ్చు.
• పోషకాహార లోపాలను అంచనా వేయవచ్చు.
• పాల ఉత్పత్తిని మెరుగుపరచే సూచనలు పొందవచ్చు.

మేత నిర్వహణలో AI
పశువుల ఉత్పాదకతలో మేత కీలక పాత్ర పోషిస్తుంది. AI ఆధారిత ఫీడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు పశువు వయస్సు, బరువు, పాల ఉత్పత్తి మరియు శారీరక స్థితిని బట్టి సరైన మేత మిశ్రమాన్ని సూచిస్తాయి.

దీని వల్ల:
• మేత ఖర్చులు తగ్గుతాయి.
• పోషకాహార సమతుల్యత మెరుగుపడుతుంది.
• పాలు మరియు మాంస ఉత్పత్తి పెరుగుతుంది.

పౌల్ట్రీ రంగంలో AI
కోళ్ల పరిశ్రమలో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. సెన్సర్లు మరియు కెమెరాల ద్వారా కోళ్ల కదలికలు, ఆహార వినియోగం, నీటి వినియోగం మరియు ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షిస్తారు.

AI వ్యవస్థలు:
• వ్యాధుల ప్రారంభ సంకేతాలను గుర్తిస్తాయి.
• మరణాల రేటును తగ్గిస్తాయి.
• ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.
• నిర్వహణ ఖర్చులను తగ్గిస్తాయి.

డ్రోన్లు మరియు రోబోటిక్స్ వినియోగం
అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రోన్లు మరియు రోబోటిక్స్ పశుసంవర్ధక రంగంలో వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పెద్ద పశువుల మందలను పర్యవేక్షించడం, మేత భూముల పరిస్థితిని అంచనా వేయడం జరుగుతోంది. రోబోటిక్ మిల్కింగ్ యంత్రాలు మానవ శ్రమను తగ్గించి పాల సేకరణను వేగవంతం చేస్తున్నాయి.

తాజా AI సాంకేతికతలు
ప్రస్తుతం పశువైద్య రంగంలో అందుబాటులో ఉన్న ముఖ్యమైన AI సాంకేతికతలు:

  1. స్మార్ట్ కాలర్లు మరియు వేర్‌బుల్ సెన్సర్లు
  2. AI ఆధారిత హీట్ డిటెక్షన్ సిస్టమ్స్
  3. రోబోటిక్ మిల్కింగ్ యంత్రాలు
  4. AI వ్యాధి నిర్ధారణ మొబైల్ యాప్‌లు
  5. డ్రోన్ ఆధారిత పశు పర్యవేక్షణ
  6. ఆటోమేటిక్ ఫీడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్
  7. కంప్యూటర్ విజన్ ఆధారిత లేమ్‌నెస్ గుర్తింపు
  8. AI ఆధారిత పౌల్ట్రీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్స్

రైతులకు కలిగే ప్రయోజనాలు
• వ్యాధుల ముందస్తు గుర్తింపు
• చికిత్స ఖర్చుల తగ్గింపు
• పాలు, మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి పెంపు
• సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుదల
• మేత వినియోగ సామర్థ్యం పెంపు
• శ్రమ మరియు నిర్వహణ ఖర్చుల తగ్గింపు
• అధిక ఆదాయం మరియు లాభదాయకత

ముగింపు
కృత్రిమ మేధస్సు పశువైద్య మరియు పశుసంవర్ధక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. వ్యాధుల ముందస్తు గుర్తింపు నుండి పాల ఉత్పత్తి పెంపు వరకు ప్రతి దశలో AI రైతులకు తోడ్పడుతోంది. భవిష్యత్తులో AI ఆధారిత సాంకేతికతల వినియోగం మరింత విస్తరించి, స్మార్ట్ పశుసంవర్ధక వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. రైతులు, పశువైద్యులు మరియు విస్తరణ సంస్థలు ఈ సాంకేతికతలను స్వీకరించడం ద్వారా పశుసంవర్ధక రంగాన్ని మరింత లాభదాయకంగా మరియు స్థిరంగా తీర్చిదిద్దవచ్చు.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), ఫోన్ : 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

గేదె పదేపదే ఎదకు వస్తోందా? గర్భం నిలవకపోవడానికి కారణాలు – రైతులు ఏం చేయాలి?

గేదె ఎదకు వచ్చింది… కృత్రిమ గర్భధారణ (AI) చేయించారు… కానీ గర్భం నిలవకుండా మళ్లీ ఎదకు వచ్చింది. మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించినా అదే పరిస్థితి. ఇలా పదేపదే జరిగితే రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా, రెండు ఈతల మధ్య కాలం పెరిగి పాల ఉత్పత్తి మరియు ఆదాయంపై కూడా ప్రభావం పడుతుంది.

గేదె సాధారణంగా ఎదకు వస్తున్నప్పటికీ, సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే దీనిని రిపీట్ బ్రీడింగ్ (Repeat Breeding) అంటారు.

దీనికి ఒకే కారణం ఉండదు. ఎదను సరిగ్గా గుర్తించకపోవడం, కృత్రిమ గర్భధారణ సమయం తప్పడం, ప్రసవం తర్వాత గర్భాశయ సమస్యలు, సమతుల్య ఆహారం అందకపోవడం, ఖనిజలవణాల లోపం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అందువల్ల గర్భం నిలవడం లేదని పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించడం కాకుండా, అసలు కారణాన్ని గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం.

ఎదను సరిగ్గా గుర్తించండి
గేదెల్లో ఎద లక్షణాలు ఆవులతో పోలిస్తే కొన్నిసార్లు స్పష్టంగా కనిపించవు. ముఖ్యంగా రాత్రి లేదా తెల్లవారుజామున ఎదకు వస్తే రైతు గమనించకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎదను సరిగ్గా గుర్తించకపోతే కృత్రిమ గర్భధారణ చేయించే సమయం కూడా తప్పిపోవచ్చు.

అందుకే ఉదయం, సాయంత్రం గేదెలను కొద్దిసేపు ప్రత్యేకంగా గమనించండి. ఇతర గేదె ఎక్కినప్పుడు కదలకుండా నిలబడటం ఎదకు ముఖ్యమైన లక్షణం. ఇతర పశువులపై ఎక్కడానికి ప్రయత్నించడం, యోని నుంచి పారదర్శకమైన జిగట స్రావం రావడం, తరచుగా మూత్రం పోయడం, సాధారణం కంటే ఎక్కువగా తిరుగుతూ ఉండటం, తోకను ఎత్తడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

అయితే ఒక్క లక్షణాన్ని చూసి ఎదకు వచ్చిందని నిర్ణయించకుండా, రెండు మూడు లక్షణాలను కలిపి గమనించడం మంచిది.

రైతులకు సూచన: ఎద లక్షణాలు మొదట కనిపించిన తేదీతో పాటు సమయాన్ని కూడా రాసిపెట్టండి. సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించండి

ఎదను గుర్తించడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం కూడా అంతే ముఖ్యం. చాలా ముందుగా లేదా ఆలస్యంగా కృత్రిమ గర్భధారణ చేయిస్తే గర్భం దాల్చే అవకాశం తగ్గవచ్చు.
రైతులు సులభంగా గుర్తుంచుకోవడానికి సాధారణంగా ఉదయం ఎద స్పష్టంగా కనిపిస్తే అదే రోజు సాయంత్రం, సాయంత్రం ఎద కనిపిస్తే మరుసటి రోజు ఉదయం కృత్రిమ గర్భధారణ చేయించడం అనుసరించే పద్ధతి.
ఎద ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియకపోతే ఊహించి సమయం నిర్ణయించకుండా, శిక్షణ పొందిన కృత్రిమ గర్భధారణ సిబ్బంది లేదా పశువైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్య సూచన: గర్భం నిలవలేదని వెంటనే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు. ముందుగా ఎదను సరిగ్గా గుర్తించామా, కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో జరిగిందా అనే విషయాలను పరిశీలించాలి.

ప్రసవం తర్వాత ఆరోగ్యాన్ని గమనించండి
కొన్ని గేదెల్లో రిపీట్ బ్రీడింగ్ సమస్యకు కారణం గత ప్రసవం తర్వాతే మొదలవుతుంది. ప్రసవం తర్వాత గర్భాశయం మళ్లీ ఆరోగ్యకరమైన స్థితికి రావాలి. మాయ పడటం ఆలస్యం కావడం, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం పడవచ్చు.

ప్రసవం తర్వాత గేదెను జాగ్రత్తగా గమనించండి. మాయ పడటం ఆలస్యమైనా, దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. జ్వరం, ఆకలి తగ్గడం లేదా బాగా నీరసంగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయిస్తే తరువాత వచ్చే పునరుత్పత్తి సమస్యలను తగ్గించుకోవచ్చు.

సమతుల్య ఆహారం అందించండి
గేదెకు కడుపు నిండా మేత ఇవ్వడం మాత్రమే సరిపోదు. పాల ఉత్పత్తితో పాటు గర్భం దాల్చడానికి కూడా అవసరమైన పోషకాలు తగినంతగా అందాలి. పచ్చిమేత, ఎండుమేత, దాణా సరైన పరిమాణంలో అందకపోవడం లేదా పాలిచ్చే గేదెకు అవసరమైన పోషకాలు తగినంతగా అందకపోవడం వల్ల పశువు క్రమంగా బలహీనపడవచ్చు. ఇది ఎదకు రావడం మరియు గర్భం దాల్చడంపై కూడా ప్రభావం చూపవచ్చు.

అందువల్ల మంచి నాణ్యత గల పచ్చిమేత, ఎండుమేతతో పాటు పాల ఉత్పత్తికి అనుగుణంగా దాణా ఇవ్వాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. గేదె క్రమంగా బలహీనపడుతున్నట్లు లేదా బక్కగా అవుతున్నట్లు కనిపిస్తే కేవలం దాణా పరిమాణం పెంచడం కాకుండా, రోజువారీ ఆహారంలో అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందుతున్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి.

ముఖ్య సూచన: పాలిచ్చే గేదెకు తగినంత మేతతో పాటు, అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందేలా చూడటం ముఖ్యం.

ఖనిజలవణాలపై శ్రద్ధ పెట్టండి
మేత బాగానే ఇస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పశువుకు అవసరమైన ఖనిజలవణాలు తగినంత అందకపోవచ్చు. ఖనిజలవణాల లోపం పశువుల సాధారణ ఆరోగ్యంతో పాటు పునరుత్పత్తి పనితీరును కూడా ప్రభావితం చేయవచ్చు.

అందువల్ల రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుడు లేదా పశుపోషణ నిపుణుడి సలహా మేరకు మంచి నాణ్యత గల ఖనిజలవణ మిశ్రమం (Mineral Mixture) ఇవ్వాలి. పదేపదే గర్భం దాల్చని గేదెల్లో పోషకాహారం లేదా ఖనిజలవణాల లోపం ఉందేమో కూడా పరిశీలించడం మంచిది.

గర్భాశయ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి
బయటకు గేదె ఆరోగ్యంగానే కనిపించినా కొన్ని సందర్భాల్లో గర్భాశయంలో సమస్య ఉండవచ్చు. ముఖ్యంగా ప్రసవం తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోతే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం చూపవచ్చు.
దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడకుండా పశువైద్యుని సంప్రదించాలి. పలుమార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే గర్భాశయం మరియు ఇతర పునరుత్పత్తి అవయవాల్లో ఏదైనా సమస్య ఉందా, ఎద సక్రమంగా వస్తోందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాలను పశువైద్యునితో పరీక్ష చేయించాలి.

జాగ్రత్త: గర్భం దాల్చడం లేదని సొంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడకండి. కారణాన్ని గుర్తించిన తర్వాత పశువైద్యుని సూచన మేరకే చికిత్స చేయించాలి.
పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించకుండా కారణాన్ని తెలుసుకోండి

ఒకసారి కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత గర్భం దాల్చకపోవచ్చు. కానీ సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు.

అలాంటి గేదెను పశువైద్యునికి చూపించి గర్భం నిలవకపోవడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఎదకు సంబంధించిన సమస్యలు, పోషకాహార లోపాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో పరీక్ష చేయించాలి.

కారణాన్ని బట్టి చికిత్స చేయించడం లేదా ఆహారం, నిర్వహణలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది. ఇలా అసలు కారణాన్ని గుర్తిస్తే అనవసరంగా పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించే ఖర్చు మరియు సమయాన్ని తగ్గించుకోవచ్చు.

పునరుత్పత్తి వివరాలను రాసిపెట్టండి
ఒక చిన్న నోట్‌బుక్ కూడా రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి గేదెకు సంబంధించిన ప్రసవ తేదీ, ఎద వచ్చిన తేదీ మరియు సమయం, కృత్రిమ గర్భధారణ చేసిన తేదీ మరియు సమయం, ఎన్నవసారి కృత్రిమ గర్భధారణ చేశారు, గర్భ నిర్ధారణ వివరాలు రాసిపెట్టాలి.

ఇలా రికార్డు ఉంచితే గేదె ఎప్పుడు ఎదకు వచ్చింది, ఎప్పుడు కృత్రిమ గర్భధారణ చేశారు, ఎన్నిసార్లు కృత్రిమ గర్భధారణ చేశారు అనే విషయం ఇంట్లో ఎవరికైనా సులభంగా తెలుస్తుంది. రైతు ఇంట్లో లేకపోయినా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ వివరాలు చూసి అవసరమైనప్పుడు గేదెను పశువైద్యశాలకు తీసుకెళ్లవచ్చు. పశువైద్యునికి ఈ రికార్డు చూపిస్తే గత వివరాలు వెంటనే తెలుసుకొని, సమస్యను గుర్తించి సరైన సలహా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.

గేదె పదేపదే ఎదకు వస్తున్నా గర్భం దాల్చకపోతే అనవసరంగా మళ్లీ మళ్లీ కృత్రిమ గర్భధారణ చేయించకండి. ఎదను సరిగ్గా గమనించడం, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం, సమతుల్య ఆహారం అందించడం, ప్రసవం తర్వాత వచ్చే సమస్యలకు సమయానికి చికిత్స చేయించడం ద్వారా గర్భధారణ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. అయినప్పటికీ సమస్య కొనసాగితే ఆలస్యం చేయకుండా పశువైద్యునికి చూపించి కారణాన్ని తెలుసుకోవడం మంచిది.

Dr.గడ్డం రాధిక, పశువైద్య అధికారి
P.V.C. ఉప్పరపల్లి, వరంగల్
Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం
పశువైద్య కళాశాల, కోరుట్ల. Ph: 7093198419

Read More